Jump to content

పుట:హరవిలాసము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 51

లకుం జూపు వఱపునప్పుడు కట్టెదుర దక్షిణాపాంగనివిష్టముష్టియు నాతతాంగుండును నాకుంచితసవ్యపాదుండునుం జక్రీకృతకార్ముకుండును బ్రహతోద్యుక్తుండును నైన మన్మథునిం గనుంగొని తపఃపరామర్శవివృద్ధక్రోధుండయ్యె నవ్వేళ భ్రూభంగదుష్ప్రేక్షం బగు విరూపాక్షునిలలాటేక్షణంబునం జనియించిన సముజ్జ్వలజ్జ్వాలాజాలం బైన కృపీటయోని భువనంబు లెల్ల భయభ్రాంతంబులై హాహాకారంబులు నేయ నమ్మీనకేతను శరశరాసనతూణీరంబులతోడంగూడ భస్మంబు చేసిన. 82

సీ. నాకభూషణుఫాలనయనానలముచేతఁ బంచబాణుఁడు బిట్టు భస్మమయ్యె
బ్రబలాభిషంగసంప్రభవమోహంబునఁ గేళిని యవశ యై వ్రాలె ధరణి
యువతిసంసర్గంబు యోగవిఘ్నం బని యభవుఁ డంతర్ధాన మాచరించెఁ
జెలికాఁడు తన మ్రోల నొనికి బూడిద యైన నామని యేడ్చె నా వఱచినట్లు
తే. గౌరి తన చారుసౌభాగ్యగౌరవంబు, విలువ పోయిన చెలువున విన్నవోయెఁ
బర్వతేంద్రుడు నిర్విణ్ణభావ యైన, కూర్మినందన నింటికిఁ గొంచుఁబోయె. 83

వ. ఆనంతరంబ రతీదేవి మోహాంధోన్మీలితంబు లైనలోచనంబుల నత్యంతప్రియదర్శనుం డగు ప్రియుం గానక పురుషాకారంబున భూమిం బడియున్న భస్మంబుం గని యిట్లని ప్రలాపింపం దొడంగె. 84

ఉ. చక్కనివారిలోన నెఱజాణలలో విటరాజకోటిలో
జిక్కనివారిలోఁ గడుఁబ్రసిద్ధివహించిన నీవు ప్రాణముం
దక్కినచోట నీమనసు ధైర్యమున న్మిసిమింతురాలు గా
నక్కట! పుష్పసాయక మహాకఠినాత్మలువో మృగేక్షణల్. 85

మ. ప్రతికూలాచరితంబు నావలన నల్పం బైననుం గాంచితే
ప్రతికూలాచరితంబు నీవలన నల్పం బైన నేఁ గంటినే
కృత మెన్నండును లేనిచంద మిది లక్ష్మీపుత్ర! నీయందు న
న్నతిదుఃఖాన్విత డించి పోవఁ దగవా యధ్వానపుంబట్టునన్. 86

క. తలఁతే మన్మథ! గోత్ర
స్ఖలితంబుంజఘనసూత్రకరబంధంబుల్
కలఁతే మఱియు వసంతో
త్పలకలికారాధనంబుఁ దత్సమయమునన్. 87

క. మెఱయంగ ముసురఁ గురియఁగ, నుఱుమం బురవీథులం బయోధరవేళం
దెఱవల రమణులయొద్దకు, నిఱుఁజీఁకటిదిశల నింక నెవ్వం డనుఫున్. 88

సీ. మదిరారసాస్వాదమదవికారంబులు బింబాధరలకు విడంబనములు
ప్రియవియోగంబున బెదరించువాఁ డయ్యు నుడువల్లభుఁడు నిష్ఫలోదయుండు
కోయిలనోరూరు క్రొతమామిడిమోక నవపల్లవంబు బాణత్వ ముడిగె
శుకశారికలు గూడి శోకస్వరంబులఁ బలవింపఁ దొడఁగెఁ దాపంబు గదిరి