పుట:హరవిలాసము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 49

జనుదెంచి చుట్టునుం దిరిగియున్న సురపొన్నమోకల నీడనిల్చి యచ్చోట శార్దూలచర్మంబునం బర్యంకబంధురితపూర్వకాయుండును నుత్తానపాణియుఁ బ్రాణాయామపరుండును నగు నమ్మహాదేవునిపార్శ్వంబునం పుష్పాంజలి వట్టి ధ్యానావసానావసరముం బ్రతీక్షించుచుఁ గించిద్విలంబమానకేసరఛదాభిరామకాంచీకలాపయుఁ గర్ణికారకుసుమతాటంకయుఁ బల్లవావతంసయు నగు పార్వతిం గనుంగొని యిదియ నా కవసరం బని యధిజ్యశరాసనుం డై.64

సీ. వలుద కెంజడ కొప్పు వదలి వీడక యుండఁ
బెనుపాఁప తలపాగ బిగియఁ జుట్టి
మెడకప్పుతోఁ గూడి మిక్కిలి నలుపైన
కమనీయకృష్ణాజినము ధరించి
భ్రూవికారములేని పొడవుఱెప్పలలోని
ఘనదృష్టి నాసికాగ్రమున నిల్పి
యోగపట్టికఁ జెంది యొఱపైన నిలుకడ
నాసనస్థితబంధ మనువుపఱచి
తే. నిస్తరంగకమైన మున్నీరువోలె
గర్జితము లేని ఘనఘనాఘనమువోలె
ధ్యాననిశ్చలుఁడగు నిందుధరుని జూచి
ప్రసవనారాచుఁ డతిభయభ్రాంతుఁ డగుచు. 65

ఉ. ఒయ్యన డాయఁగాఁ జనియె నుగ్రవిలోచనుపార్శ్వభూమికిం
దయ్యముఱేఁడు నెచ్చెలి యెదన్ భయకంపము నుప్పతిల్లఁగా
దియ్యనివిల్లుఁ బుష్పములఁ దీర్చినయమ్ములు శౌర్యసంపదల్
వయ్యము గాఁగ భూమిఁ బడ వైచె నిలింపులు చూచి బెగ్గిలన్. 66

క. స్థావరరాజతనూభవ, యా వేళన డాయ వచ్చె నభవునిసేవా
హేవాకప్రౌఢిని వన, దేవత లెంతయు గభీరగతిఁ దనుఁ గొలువన్. 67

తే. పద్మరాగవిభూషణప్రతతి మాఱు, లలి నశోకలతాప్రవాళములు దాల్చి
సింధువారప్రసూనరాజీవరాజిఁ, గమ్రమౌక్తికరత్నశృంగార యగుచు. 68

చ. చనుఁగవ వ్రేగునన్ మిగులసన్నపుఁగౌ నసియాడఁ గెంపు మీ
ఱిన నునుఁబట్టుఁజేలఁ గటి ఱింగులు వాఱఁగఁ గట్టి భూమిభృ
త్తనయ ప్రసూనగుచ్ఛములు దాలిచి లేఁజిగురుల్ ధరించి వ
చ్చిన నడదీవవోలె నిలిచెం దరుణేందుకిరీటుసన్నిధిన్. 69

తే. తరుణి యందందఁ గేసరదామ కాంచి, జఘనపులినంబు నందుండి జాఱిపడఁగ
మాటిమాటికి హస్తపదముల నెత్తు, చపలభావంబుతో నుండె నభవుమ్రోల. 70

ఉ. కమ్మనియూర్పుగాడుపులగందముఁ గ్రోలఁగ వచ్చి యోష్ణబిం
బమ్ము సమీపదేశమునఁ బాయక యాడెడు తేఁటిఁ గేళిప
ద్మమ్మున మాటిమాటికి సమంచితవిభ్రమలోలదృష్టి యై
యమ్మదిరాక్షి చిమ్ము దరహాసవికస్వరగండపాళి యై. 71