పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

ప్రబంధరాజవేంకటేశ్వర


వెలవెలు మోదుగమొగ్గచాయ నిగ్గెడి కురువంపు మొనవాడి గోరంట నొత్త లత్తుక కెంపు నెరసిన యలతి గాయమ్ములు మాయుటకుఁ దీఱిచిన తమ్మిమొగడ లందపు గంధపుపట్టెల హరువులును, చెవులుకుం జవులనించు ముత్యాలయొంటుల కమరిన మగఱాల మురువులును, కెమ్మోవుల పచ్చిగంటుమాటుటకు వహణించిన రవిక సరవిమణుచు మడుపులు సగము మునిపంట గొఱికి నెక్కుటెక్కులును చదరు వదరుల పిక్కలును నిడురలేమిం దేలగిలు కడకన్నులం గనుపట్టు కట్టెఱ్ఱ మఱుంగుపరచుటకు ఘటియించిన చలువ కలువ విరిబంతులు హత్తించు దత్తులును యెదుర వారలుబలిమి వళుకులువైచి పంతముల కొలారికలంపెడి జిత్తులును చంపల జాఱుసిగల కులీశముల ముళ్ళ నావరించిన కత్తెర వరుస పూవుటెత్తుల పైని బొమ లఱ నిక్క గట్టిన జిలుగు కురుమాలదంపు దసిలీక సీదురుమాలుముచ్చుంగుల బురుసాకుచ్చురింగులును జంట నేస్తగాండ్రచేతి తిపిరి కిన్నెరల టింగుటింగురులును, చౌశీతి బంధపు వ్రాతపని ప్రతిమల చుట్టంచు చందురుకావి దుప్పటి బంగరు చెఱంగుల వలెవాటులును బింకపు నెమ్మేనుల నీటులును బేరజపు టారజపు తందనాల పదమ్ములును వింతవింతలుగాఁ జూపట్టి మీఱ రంగారు బంగారు సింగారపు గొలుసుల దండమానపు పదమ్ములును టెక్కగు చెక్కుల జవ్వాదిమేలు మేలుపట్టీలును నెడనెడ నడుగులు తడబడ తొడలనడుమ తడిబట్ట మేలిపట్టు కీలుకీలును, హోంతకారులపై బడి ముడిగి రెండుమోచేతుల పోటుల గరిబడు రీతులును గర్వాలా పదనవదన ఛూత్కారంబుల గంధసింధురంబుల కైవడులు ననుకరించి సమదండ గజదండ భృంగిదండ యెడుమయోరభృంగి కుడియోరభృంగి భృంగపటలముపై సరపుదండ సింగపుదండ పొదలికదండ యడుగడుగు పొదలికదండ మద్దెలసంచు కుక్కుటపుదండ మొదలుగాఁగల పదిరెండుదండలును; యెడమడుగు పరువడి కుడియడుగుపరువడి కదలుపరువడి దాటడుగుపరువడి కోవుపరువడి యొంటియడుగుకత్తెర సర్పబంధకత్తెర జాగెనకత్తెర పొదలికకత్తెర చిట్టడుగుకత్తెర పావుపావు జోగినపావు మొదలుగాఁ గల పదిరెండు పరువడులును; హరిగతి గజగతి వ్యాఘ్రగతి మహిషగతి జంబుకగతి మర్కటగతి మాఖరగతి హరిణగతి చటకగతి పక్షికది తాండవగతి సరసగతి మొదలుగాఁగల గతులు పదిరెండును; విష్ణుచక్రంబు