పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 06-1 సామంతం సం: 10-030

పల్లవి:

ఇన్నాళ్ల నీవుగావో యెప్పటి నేనె కానో
వెన్నుఁడ నీచేఁతలె వింత లింతే కాక

చ. 1:

దాఁపరాని చెక్కుగోరు తలపించె నీగుణాలు
మాపుదాఁకాఁ దెలుపఁగ మావసమా
ఆఁపరాన తమకాన ఆపె నీమోహ మెల్లా
రూపు సేయఁగా నింత రూడి కెక్కెఁ గాక

చ. 2:

అంటినమోవిపై కెంపె అంగమచ్చమాయఁగాక
నంటునఁ దారుకాణించ నావసమా
యింటికాడ నిన్ను నాపె యెనసిన భోగ మెల్లా
వెంట వెంటనె వెల్లవిరి సేసీఁ గాక

చ. 3:

విడువనివాసనలె వెలయించె నీపొందులు
వడి నీతో వాదించ వసమా నాకు
కడువేగ శ్రీవెంకటనాథ నీవె నన్ను
వొడఁబరచి కాఁగిట నొక్కటై కూడితివి.