Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 06-2 శంకరాభరణం సం: 10-031

పల్లవి:

వలపులకలగంప వాని కేమె
వలరాజుఁ గన్న తండ్రి వాని కేమె

చ. 1:

వాడికగాఁ దానె యెవ్వతెనైనా వలపించు
వాడనివాసనపువ్వు వాని కేమె
వోడఁ డెందరికినైనా వుత్తరువె చెప్పీని
వాడమగువలవిందు వాని కేమె

చ. 2:

తగిలి యెక్కడ నైనాఁ దనమేలె చూచుకొను
వగలమగతుమ్మిద వాని కేమె
తగిన ట్టిందరితో దరితీపులె సేసు
వగకాఁ డల్లారుముద్దు వాని కేమె

చ. 3:

యెనసి యెక్కడనైనా యిచ్చకమె సేసుకొను
వనితల పెనుబాఁతి వాని కేమె
ఘనుఁడు దానె శ్రీవెంకటనాథుఁడు వచ్చి
వనజాక్షి ననుఁ గూడె వాని కేమె.