Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 06-3 ముఖారి సం: 10-032

పల్లవి:

తమకపడ నేఁటికి దాని కేమి దోసమా
అమర మన సిచ్చి మాఁటాడవయ్య విభుఁడా

చ. 1:

మోవనాడి పిలిచినా మోనాన నున్నాడవు
చేవల నామాఁటలకు సిగ్గాయనో
మావంటివారితోడ మాఁటాడవల దని
మోవిమీఁద నెవ్వతైనా ముద్ర వెట్టెనో

చ. 2:

కాతరానఁ జెనకినా కడుఁగడుఁ జొక్కేవు
ఘాతల నాచేఁత లేమి కళ లంటెనో
జాతిగా మాతోడుతను సరస మాడకు మని
చేతుల నెవ్వతైనా లచ్చెన వెట్టెనో

చ. 3:

కమ్మి నేనిన్నుఁ గూడఁగా కప్పుకొనేవు నాకొంగు
యిమ్ముల నీ కిది దానె యితవాయనో
నమ్మి కిచ్చి శ్రీవెంకటనాథ వెనకదినాల
రొమ్ముపై నెవ్వతైనా గురుతు వెట్టెనో