పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 03-5 కేదారగౌళ సం: 10-016

పల్లవి:

పడఁతి నీయాసనె బతి కున్నది
యెడయక నీవింక నెట్టయినాఁ జేయుమీ

చ. 1:

గుబ్బలమీఁద జెలి కొంగు వేయదు
నిబ్బరపుమోహమున నిన్నుఁ దలచి
గబ్బియైన మరునిచే కాఁకలు బెట్టు
అబ్బురపు విరహమూ నాఁపలేక వున్నది

చ. 2:

పొలఁతి మేనఁ గస్తూరి వూయ నొల్లదు
నెలకొన్న వలపుల నిన్నుఁ దలచి
కలువ బాణాలచేతిగాసియూ బెట్టు
బలిమైన తాపముల బారిఁ బడి యున్నది

చ. 3:

సతి నీవు గూడఁగాను సంతసించెను
గతియైన శ్రీవెంకటనాథుఁడా
యితవైన పాయము నీ కెక్కెను నేఁడు
సతతము నిన్నుఁ గూడి చల్లనై వున్నది.