పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 03-4 హిజ్జిజి సం: 10-015

పల్లవి:

ఎటువంటివాఁడె యీతఁడు
యిటువలె దగ్గరీ నీతఁడు

చ. 1:

తలయెత్తి చూచితే తనుఁ జూచితి నంటా
యెలయించవచ్చీ నీతఁడు
చెలులతోడ నేఁ జెసన్న సేసితే
యెలమి దగ్గరవచ్చీ నీతఁడు

చ. 2:

యింతిఁ బిలిచితే యెరపరికము లేక
యింతలోఁ బలికీ నీతఁడు
చెంత నాసకిపైఁ జెయివేయఁబోతే
యెంత కెంత చెయ్యొగ్గీ నీతఁడు

చ. 3:

యెదుటనున్నసతితో నేకతము లాడఁబోతే
యిదివో కాఁగిలించీ నీతఁడు
కదిసి యిప్పుడు శ్రీవెంకటనాథుఁడు నా
యెదలోనె పాయకున్నాఁ డీతఁడు