ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 03-3 కేదారగౌళ సం: 10-014
పల్లవి:
చాలు నాతో నింతేసి జంపు లేలా
ఆలరి నీచేఁత లెవ్వరితోనైనఁ జేయరా
చ. 1:
రాకాఁ బోకాఁ నాతో నింతేసి రంతు లేలా
నీకు నీకె చుట్టరికములు నెరపేవు
నాకు నీకు నేమి వోదు నన్ను నవ్వుతానె
యేకమైన మాఁటలనె నన్ను యెలయించేవు
చ. 2:
సారె సారె నాతో నింతేసి సట లేలా
వూరకె నీవావులు దెలిసి వొరసేవు
తారుకాణమాఁటల నిక్కువ దాఁక నాడి
మేరమీరి యానలు వెట్టుతా మేకొనేవూ
చ. 3:
మెచ్చి మెచ్చి నాతో నింతేసి మేకు లేలా
యిచ్చకము సేసి సేసి నన్ను యేలఁ జూచేవు
విచ్చలవిడిఁ గూడితి నన్ను శ్రీవెంకటనాథ
పచ్చిదేర నన్ను నింకా నొడఁబరచేవూ.