Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 03-2 కేదారగౌళ సం: 10-013

పల్లవి:

వలపించనేరుతువు వడి నేఁచనేరుతువు
సిలుగు కోప నీవు నేసినట్టె సేయరా

చ. 1:

ప్రియముతోడుత నన్నుఁ బిలిచేవు యీ
నయమె యీడేర నడపేవా
బయకారించే నీచే బడలితిని నీ
చెయి మీఁ దింతె నీవు సేసినట్టె సేయరా

చ. 2:

దగ్గరి నాతో మంచితన మాడేవు యీ
నిగ్గుల నీమే లిట్టె నిలిపేవా
వెగ్గళించే నీచేత విసిగితిని నాకు
సెగ్గెము గాదు నీవు సేసినట్టె సేయరా

చ. 3:

కలసితి నన్ను శ్రీవెంకటనాథుడా నీ
తలఁపులో దయ నాపైఁ దప్పేనా
యెలయింపు నీచేత నింతైతిని నాపై
చెలిమిగలవు నీవు సేసినట్టె సేయరా