పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 01-5 పాడి సం: 10-5

పల్లవి:

మేలురా యీనీగుణము మెచ్చవచ్చును
పోలించ నీచేఁత పూఁట పూఁట కొత్తేకాదా

చ. 1:

దిట్టయై యెవ్వతెయైనాఁ దిట్టినా నవ్వెటి నీవు
యెట్టు నేఁ బొగడినాను యీరసించేవు
యిట్టె వలపించేవా రేమ్ననినా జెల్లుఁగాక
నెట్టన నేనూరకున్నా నీకు నెగ్గేకాదా

చ. 2:

తొయ్యలి యెవ్వతెయైనాఁ దోకినా నవ్వెటి నీవు
యియ్యెడ నేమొక్కినాను యేవగించేవు
నెయ్యపువారిచేఁతలె నీకు నితవౌఁగాక
చయ్యన నామోహమైన చప్పనెకాదా

చ. 3:

వొదుగ కెవ్వతె గైకోకుండినా నవ్వెటి నీవు
యెదురుకొన్నా నామో మిటుచూడవు
యిదె శ్రీవెంకటనాథ యిట్టె నన్నుఁగూడి నా
మదిలోఁ బాయవైతివి మంచిదెకాదా