Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 02-1 పాడి సం: 10-6

పల్లవి:

ఒద్దన్న జలము సేసీ నోయమ్మ వీఁడు తన
వుద్దండా లెంతైనా మానఁ డోయమ్మ వీఁడు

చ. 1:

యేపుమీరి నాతోడ నెగసక్కే లాడీని
వో పో పొమ్మన్న మానఁ డోయమ్మ వీఁడు
పై పై నన్నుఁ జెనకి బలిమి సేయవచ్చీనే
నోపనన్నాఁ గొంగువట్టీ నోయమ్మ వీఁడు

చ. 2:

సారెకుఁ బేరఁ బిలిచి సన్నలు సేయవచ్చీని
వూరకపోయెటి నన్ను నోయమ్మ వీఁడు
నేరుపరి నంటానె నిండువావి సేసుకొనీ
నోరిచిన నెరఁగఁడు వోయమ్మ వీఁడు

చ. 3:

యేలుకొన్నవానివలె నెవ్వరుంటా నెరఁగఁడు
వోలవేయవచ్చీ నాపై నొయమ్మ వీఁడు
నాలికాఁడు శ్రీవెంకటనాథుఁడు నన్ను విట్టె
వోలివెట్టెకె కూడె నోయమ్మ వీఁడు.