పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 18-2 బౌళి సం: 10-103

పల్లవి:

అటువంటివారికి నీ వప్పుడే వలతువు
అటు నిటు నిన్నుఁ బా లార్చీనా యేమి

చ. 1:

గుట్టున మొగలిరేకు కొమ్మపయ్యదపై వేయఁ
బుట్టెచెండు వుచ్చుకొని పొలిఁతి వేసె
అట్టె నీ చేఁతకుఁ జేఁత ఆపె సేసె నావలెనె
దట్టించక నీపై దయ దలఁచీనా యేమి

చ. 2:

మెత్తని తామెరపువ్వు మెలుతపై నీవు వేయ
బొత్తుగా బాదపుటందెఁ బొలిఁతి వేసె
మత్తిలి యాపె మారుకు మారు సేసె నావలెనె
బత్తి సేసి ని న్నూరకె పాటించీనా యేమి

చ. 3:

యించుక దగ్గరి నీ వేకతము చెప్పఁబోతే
లంచముగా నీకుఁ దమ్ములము వెట్టెను
నించి శ్రీవెంకటనాథ నిన్నుఁగూడె నావలెనె
మంచితనమునఁ గూడి మన్నించీనా యేమి