పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 15-1 లలిత సం: 10-084

పల్లవి:

చాలా మేలుదిరా యీబాలామణిపుడు నీ
పాలిటఁ జిక్కెరా గోపాలక కృష్ణమ్మా

చ. 1:

పంకాజముఖి నీవంకా చూచి నప్పుడే
పొంకాముగా వలచె యింకా నే మందురా
సంకె లేక నీమీఁద నంకిత మైనపాట
లంకించి పాడీ నీతో లంకెలఁ గృష్ణమ్మా

చ. 2:

పల్లాదమున నీవు మొల్లామి నందరిలో
మొల్లాపూబంతి వేయ జల్లూనఁ గరఁగెరా
మెల్లానె వ్రాసి చూచీఁ జల్లాఁగ నీ రూపమె
కల్లా గాదురా శ్రీవల్లభ కృష్ణమ్మా

చ. 3:

తటుకానా నీ వప్పుడు నటనాలా సరసాన
యిటు నటుఁ గాగిలించ నెట్లాఁ దా జొక్కెరా
విటరాయఁడవు శ్రీవెంకటనాథ నీ కూటమి
ఘటియించ వేడుక మిక్కుట మాయఁగృష్ణమ్మా