Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 15-2 దేసాళం సం: 10-085

పల్లవి:

ఎన్నఁడయ్యా నీ నేరుపు లిప్పుడు గాక
మున్నిటిపొం దై నవారి ముందరనె కాక

చ. 1:

వాడలోన నీమోమె వనితలు చూడఁగాను
యీడనె సేయవద్దా నీ యెమ్మెలు
చేడె లెల్లా నీ మాఁటలె చెవి యొగ్గి వినఁగాను
ఆడవద్దా నీకు దోఁచి న ట్టెల్లాను

చ. 2:

సతు లెల్లా మూఁకగట్టి సంగడి నిలుచుండఁగా
సతమై కరఁగ వద్దా సారెకు నీవు
అతివలె చెయి ముట్టి అంటి సరస మాడఁగ
మతిలోనఁ జొక్కవద్దా మాముందర నీవు

చ. 3:

సందడిలో నింతు లెల్లా చన్నుల నిన్నొరయఁగా
కందువ లంటఁగ వద్దా గబ్బి వై నీవు
యిందె శ్రీవెంకటనాథ యేకతమై వుండఁగాను
అందముగా నన్నుఁ గూడి తవునయ్యా నీవు