ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 15-3 ఆహిరి సం: 10-086
పల్లవి:
అయ్యో దయ వలదా ఆఁటదానికి
చయ్యాట మాడినాను సంగతి గావలదా
చ. 1:
జీరల నీ మేను చూచి సిగ్గయ్యీ నా కైతె
ఆరడి నీ కె ట్లితవాయనో కాని
కూరిమితో నాపెకు నీ కుందణమువంటి మేను
యీరీతిఁ జేయఁగఁ జేతు లెట్టాడెనో
చ. 2:
గంటైన నీ మోవి చూచి కనికిర మయ్యీని
కంటకము నీ కెట్లా గాదో గాని
గొంటరియాపె దానె చిగురువంటి నీ మోవి
అంటి యింత సేసె నెంత అగ్గలికో కాని
చ. 3:
కురులు నలఁగిన నీ కొప్పు చూచి వెరగయ్యీ
శిరసు నీ కె ట్టోరిచెనో కాని
గరిమఁ గూడితి శ్రీవెంకటనాథ నను నిటె
నిరతిఁ గడపరాయ నిను మించఁ గలనా.