పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0209-2 మంగళకౌశిక సంపుటం: 08-050

పల్లవి:

కరుణదెచ్చుక యింతిఁ కాతువు గాక
దొరతనము చూపితే దూరఁగనేమున్నది

చ. 1:

నిండుకొన్న విరహాన నిన్నటనుండిఁ జెలి
యెండనుండఁగా నాడించే వెడమాటలు
వండవండనట్లాయ వలచినవలపెల్ల
గుండె రాయిసేకొంటేఁ గొరనేమున్నది

చ. 2:

పట్టరాని తమకాన పానుపుపై నుండి చెలి
వెట్టనుండఁగా జల్లేవు వెడనవ్వులు
పటఁ బట్టఁ బాములాయ పంతపుఁ గోరికెలెల్ల
పట్టినదే చలమైతే పలుకనేమున్నది

చ. 3:

కన్నుదనియక నిన్నుఁ గాఁగిలించుకుండి చెలి
చన్నులనొత్తఁగ నీవు సారె లోఁగేవు
పన్నఁబన్న పందిలాయ బయలు శ్రీవేంకటేశ
నిన్నునాపెఁ జూచుకొంటే నేరములేమున్నవి