పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0204-6 బౌళి సంపుటం: 08-024

పల్లవి:

ఇద్దరుఁ దెలుసుకోరే యిన్నిటా జాణలు మీరు
పొద్దునఁ దెర వేసేము పొలఁతుల మిపుడు

చ. 1:

మొలచెనది గదవే మోవినే చిరునగవు
తలఁచిన పని యేదో తరుణి నీవు
చెలువుఁడంతటిలోనె సిగ్గువడీ నీయెదుట
యెలమిఁ దెలియవు మాకిటమీఁది పనులు

చ. 2:

చెమరించెనదిగదే చెలియ నీమేనెల్ల
తమకించిన పనేదొ తగిలి నీవు
జమళినాతఁడందుకు సన్నల మెచ్చెఁ గన్నుల
సమములై తోఁచీ మాకుసంతోసపుఁబనులు

చ. 3:

పొడమెనదిగదవే పులకలు నీమేన
జడిగొన్న నీలోనిసంతోసమెంతో
అడరి శ్రీవేంకటేశుఁడలమె నిన్నంతలోనే
వుడివోనివాయ మాకు వుద్యోగపుఁబనులు