పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0204-5 నాదరామక్రియ సంపుటం: 08-023

పల్లవి:

వేగిరించనేల నీతో వేమారును
బాగులు నీవెఱఁగనివా బతికించేవాఁడవు

చ. 1:

వన్నెల నీమీఁద నేను వలపెంత చల్లినాను
మన్నించేవాఁడవు నీవె మాఁటిమాఁటికి
విన్నపాలప్పటి నీతో వేగినంతాఁ జేసినాను
సన్నల నీచిత్తమే సమ్మతించేది

చ. 2:

జవ్వనమదాన నీతో సరసమెంతాడినాను
నవ్వేటివాఁడవు నీవే నానాఁటికి
రవ్వగా నీచెయ్యివట్టి రతికెంత దీసినాను
నివ్వటిల్లఁ గరఁగేది నీదేహమే

చ. 3:

చెలరేగి నేనెంత సిగ్గులతో మొక్కినాను
కలసేవాఁడవు శ్రీవేంకటేశ నీవే
నిలువునఁ జెమరించె (చి?) నే నిన్ను నెనసితే
కలదెల్ల నీకరుణే కందువైనది