పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0205-1 ఆహిరి సంపుటం; 08-025

పల్లవి:

పగవారికైనా నిట్టిపాటు వద్దయ్యా
తెగువలు నీవురాఁగాఁ దిప్పుకొంటిఁ గాని

చ. 1:

నీసుద్దులే ఆడుకొంటా నెలఁతలతోడుత
ఆసలు మతిఁ బెట్టుక అలసితిని
గాసిలినమీఁద కాఁకలు దొట్టించఁగాను
వీసమంత పొద్దైన వేగించరాదాయ

చ. 2:

చొప్పుగా నీకెదురులు చూచిచూచి వాకిటను
రెప్పల ముయ్యఁగలేక రేసువడితి
వుప్పతిల్లు వలపెల్ల నొక్కమాటె రేఁగఁగాను
నిప్పువంటి తమకము నీఁగఁగ రాదాయను

చ. 3:

కందువకు నీవురాఁగా గక్కనఁ గాఁగిట నించి
యిందుకా శ్రీవేంకటేశ యిట్టె మెచ్చితి
విందుల నీరతులలో వేడుక పక్కటిల్లఁగా
సందడించి కుచములు సదమదమాయను