పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0232-2 ముఖారి సంపుటం: 08-188

పల్లవి:

ఇందుకుఁగాఁ బ్రతివాదాలేలే విభుఁనితోడ
పందెమువలె గెలుపు పైపైనేవుండును

చ. 1:

మచ్చికసేసీ నతఁడు మారుమాటాడకువే
కుచ్చిపట్టి కాఁగిలించికూడె నిన్నును
వచ్చిరాని పందెమువంటిదే యీవలపెల్లా
కొచ్చి లోలోఁ దలఁపంచుకొంటాఁ దానుండును

చ. 2:

చెక్కులునొక్కీ నతఁడు చెమరించీ తిట్టకువే
పక్కున నిట్టేకాఁగిటఁబట్టీ నిన్నును
చక్కెరబొమ్మవంటిది చవిగొంటే నీవలపు
యెక్కడఁ జిక్కించుకొన్నా నింతాఁ దీపైవుండును

చ. 3:

యేలెను శ్రీవెంకటేశుఁ డెగ్గులేమీ నెంచకువే
లాలించె రతులఁ బెక్కులాగుల నిన్ను
పాలజలధివంటిది పచరించిన వలపు
వేళ నెంతవాడినాను వెలితిగాకుండును