పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0232-1 సాళంగనాట సంపుటం: 08-187

పల్లవి:

ఇన్నాళ్ళు నెరఁగమైతి మిదివో తాను
పన్నుక వూరక వొడఁబరచీఁ దాను

చ. 1:

తలఁపే తెలిసితేను తాఁదానే కదవే
నలువంక నూరకే నవ్వీఁ దాను
వెలియల్లాఁ జూచితేను వెల్లవిరి గదవే
పిలిచి నాతో నానపెట్టుకొనీఁ దాను

చ. 2:

అడుగఁబోతే సుద్దులు అంతా మేలేకదవే
కొడిమె లెంచేనంటేఁ గొంకీఁ దాను
చిడుముడి మొక్కి తేను సిగ్గురేఁగీఁ గదవే
బడిబడి మీఁదటికి బాసచేసీఁ దాను

చ. 3:

కన్నుల నేఁ జూచితేనే గట్టియాయ గదవే
యిన్నిటా శ్రీవెంకటేశుఁ డెనసెఁ దాను
విన్న వినికెల్లా నేఁడు వేడుకలే కదవే
మన్ననలు నాకిచ్చి మచ్చికాయఁ దాను