పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0232-3 రామక్రియ సంపుటం: 08-189

పల్లవి:

ఏమనునో దగ్గరఁబో యీవేళ నేఁ జెనకితే
కామించి కామాంధకారాననున్నాఁడు

చ. 1:

నవ్వు నవ్వునోప నానాలికాఁడు రమణుఁడు
అవ్వల నేమనునో యనీకాక
దివ్వెత్తుఁ బొద్దుదాఁకా తిరిగివచ్చి యింటిలో
వువ్విళ్ళూరుచు నసురుసురై వున్నాఁడు

చ. 2:

పంతమాడనేర నాపల్లటీఁడు నాయకుఁడు
అంతరంగము దెలిసె ననీకాక
బంతుల చుట్టాలకెల్లా పనులెల్లా జేసివచ్చి
అంతటఁ బానుపుమీఁద నలసివున్నాఁడు

చ. 3:

కమ్మి చూడనోప నాగబ్బిశ్రీవెంకటేశుఁడు
అమ్మలాల నన్నుఁ గూడె ననీకాక
సమ్మతించి సతులతో సాములుసేసివచ్చి
కుమ్మరింపు సిగ్గులతో గుట్టుననున్నాఁడు