పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగరం వసంత్‌ 094883 30209

“ఏంరా కాకా! అబుదే కానుగకాయలు ఉదరిస్తా(రాలుస్తా) వుండావు” తాత మాట్లాడిచ్చె.

“ఈపొద్దుకి సరిగ్గా నెలపొద్దుకి ఓసూరు పరస(తిరునాళ్లు), కానుగ విత్తులు అమ్మి నాలుగు కాసులు వెనకేనుకొంటే వరన సెలవు(ఖర్చు)లకి తొందర వుండేలేదు కదనా” కాకన్న అనె.

“ఊర్లా వుండే అర్ధము చింతకాయలని కొట్టి చింతగింజలు కూడేసింది చాలదారా” తిరగా అనె తాత.

“నీకు వనగూడినట్ల (కలసివచ్చినట్ల) అందరికీ వనగూడాల కదన్నా నాకు ఏడాదిలా ఈ నెలలా మాత్రమే నాలుగుకాసులు మిగిలేది. ఇంగ ఏడాదంతా కూలికి పోతే కూడు లేకుంటే వీడు అన్నెట్ల వుంటుంది” అంటా వుండాడు.

కాకన్న మాత్రమే కాదు మావూర్లా చానా జనాలు ఈ పట్టెంతా (ప్రదేశమంతా) పారాడి కానుగకాయలు ఉదరిచ్చి విత్తనాల్ని వ్యాపారగాళ్లకి అమ్మి సొమ్ము చేసుకొంటారు. అట్లే చింతగింజలు అమ్మి చీరలు, రవికలు తీసుకొనిన వాళ్ల చిత్రవిచిత్రాలు మీరు చూడొచ్చు.

మాపక్క ఈ పరసని ఒక పండగలా చేస్తారు. కొత్తబట్టలు పిండివంటలే కాదు నేలతల్లి కళాచారం తానుగా లేచి నాట్యము ఆడుతుంది. పెద్దోళ్లు, చిన్నోళ్లకి, సొంతమోళ్లకి కాసులిచ్చి పరసకి పంపి పరవశిస్తారు.

ఓసూరు పరసకి ముందే బాగలూరు తేరు జరుగుతుంది. మా చుట్టాలు రమ్మంటే నేనూ తాతా పోతిమి.

తేరు చానా ఎత్తరముగా వుంది. కొత్తబట్టలు పుసుపుకుంకుమ, రంగులజెండాలు, పువ్వులగమ్ములా మెరసిపోతా వుంది. తేరు కొనలా శికరము, మద్దిలా దేవుని విగ్రహము, అయివార్లూ వయసుసిన్నోళ్తూ ఎక్కి నిలిచిండారు. పూజ అయినంక తేరు కదిలె. “గోవిందా... గోవిందా” అంటా జనాలు తేరుని ఈడ్చిరి. తేరు కదిలె. జనం కదలతా తేరుని కదిలిస్తా పోతావుండారు.

“దోవలా బండి, బండి వెనక బండి కదలి పోతావుండాయి. పట్టాలపైన రైలు కదలి పోతా వుంది. గాలిలా ప్లేను బెరోని (జోరుగా) కదలి కడలిని దాటి పోతా వుంది. ఇవన్నీ కదలతా ఫోతా వుండాయి. వీటిని మనిషి కదలిస్తా, కదలి పోతా వుండాడు. ఇది మనిషి కత. బూమమ్మ కదలి పోతావుంది. సెంద్రుడు కదలతా వుండాడు. పొద్దప్పడు(సూర్యుడు) కూడా కదిలే పనిలా పడి కాలాన్ని మరిసినట్లుండాడు. ఎపుడు చూసినా కదలాడతా, కదలి పోతా కనిపిస్తాడు. గ్రహాలు, నక్షత్రాలు కదలిఫోతా వుండాయి ఇది విశ్వం కత. ఎవరు కదలిస్తా వుండారో. ఏది కదిలిస్తా వుందో” అంటా ఆర్మోనియం వాయిస్తా గుడి మెట్ల పైన కూకోనుండాడు జడల గుర్రన్న.

జనం తేరుచుట్టూ చేరిండారు. గుడి ముందర బిచ్చగాళ్లూ కూకోనుండారు. “అమ్మా ఆకలి” అంటావున్నా వినబడనోళ్ల మాదిరిగా గుడిలోపలికి పోయి ఉండిగలా (హుండి) దుడ్డు వేసి వస్తావుండారు జనం.

“కాయమే కైలాసము.. సాయమే సొర్గము..” గుడి శికరముపైనింకా తెల్లపావురం అంటా వుంది. దాని మాటలు ఎవరూ వింటా లేదు.

“రేయ్‌! మీకేరా చెప్పేది, చచ్చినపుడు పరమాన్నము చేసి మాకు పెట్టేది కాదురా, బతికినవాని కడుపుకు అంత కూడు పెట్టండ్రా, ఏమి జాతిరా మీ మనిషిజాతి” కాకమ్మ కసరుకొంటా వుంది.

తేరు దోవంతా తిరిగి ఇంక రవంత పొద్దుకి గుడితావుకి చేరుతుంది అని అంతా అనుకొంటా వున్నట్లే ఒగ పక్క చక్రం విరిగింది. చానా జనము చానా గాసిపడి తేరుచక్రము తిరిగి తిరిగే మాదిరిగా చేసిరి. మెల్లగా ఈడ్చి గుడితావ నిలిపిరి. మునిమాపు పొద్దు ఆవూరి పెద్దలంతా గుడిముందర చేరిరి.

“మా తాతల కాలములా చేసిన చక్రాలు అవి. ఎండకి ఎండి వానకి నాని పాడైపోయె. రవంత ఏమారింటే తేరు పడిపోయివుణ్ణు. వచ్చే ఏడాదికి కొత్త చక్రాలు, అచ్చులు తయారు చేసుకోవాల” పెద్దాయన అంటా వుండాడు.

“ఛానా పాతమాన్లు కావాల, ఏడ చిక్కుతాయి. ఏఏ మాను కావాలనేది అట్లే చెప్పండ” ఎవరో అనిరి.

“చశ్రాలకి జాలిమాను, అచ్చులకి నల్ల అత్తిమాను, గుజ్జులకి టెంకాయమాను కావాల, ఇవ్వన్నీ ఏటిగడ్డలానే చిక్కుతాయి” అదెవరో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

38