పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంబంధమున్న ప్రదేశమే. అందుకు సాక్ష్యంగా అక్కడున్న మహిషాసురమర్ధిని విగ్రహం, శివలింగం, భూమిలోకి సగం పూడుకుపోయిన నందిని చూశాం. తరువాత, పునుగోడు వెళ్లి అల్లాడపల్లి పెద్దిరెడ్డి రాజశేఖరరెడ్డిగారి పొలంలో పడిఉన్న 10 అడుగుల పొడవుగల ఒక అప్రకటిత నల్ల శాసనపురాతి 17వ శతాబ్ధి శాసనాన్ని చూచి, కేంద్ర పురావస్తు శాఖాధికారులకు సమాచారాన్నిచ్చాం. అదే గ్రామంలోని సిద్దేశ్వరస్వామి దేవాలయంలో నున్న 17వ శతాబ్ధినాటి మలిపూడి ఓబుళయ్య వేయిలింగాలను ప్రతిష్టించి, గుడిగట్టించి, తంగమళ్ల మాదశివులకు కొంత భూమిని కొనిపెట్టిన వివరాలున్న శాసనాన్ని చదివాను. ఇది నెల్లూరు జిల్లా శాసన సంపుటి 2లొ కనిగిరి (36) శాసనంగా ప్రకటించబడింది. తరువాత మా ప్రయాణం గంగదోనకొండ. దాన్ని దొనకొండ అనేవాళ్లని, గ్రామంలోని ప్రాచీన గంగమ్మ గుడివల్ల ఆవూరికి గంగదొనకొండ అని పేరొచ్చిందంటారు. రోడ్డుకు ఎడమవైపుగల గంగమ్మ దేవాలయంలో ఏదో ఎత్తాటి నిలువురాయి కనిపించింది. కారాపి దిగి లోనికెళ్ళి చూశాను. అది 12 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు, 9 అంగుళాల మందంతో ఉన్న ఇనుపయుగపు ఆనవాలు. దీన్నిబట్టి అక్కడొక సమాధి ఉండేదని, ఈ ఆలయం నిర్మాణంలో భాగంగా గుండ్రంగా అమర్చిన బండరాళ్లను తొలగించి ఉంటారనిపించింది. బయటికొచ్చిన తరువాత ఎదురుగా ఉన్న శివాలయంలో కెళ్లాం. ఎన్నో శిల్పాలు, ఎన్నో శాసనాలు! మహిషాసురమర్ధిని, నాగదేవతలు, గణపతి, భైరవుడు, సూర్యుడు వరుసగా పాతి ఉన్నాయి. ఇంతలో నా దృష్టి ఒక పల్నాడు రాతి స్థంభంపై పడింది. చేత్తో తడిమి చూస్తే అర్ధపద్మం కనిపించింది. రెండు వైపులా పలకలుగా చెక్కి ఉంది. ఖచ్చితంగా బౌద్దస్థంభం అని గంగదొనకొండ, శాతవాహన కాలంలో ఒక బౌద్ద స్థావరమనీ తేలింది. అక్కడే ఉన్న క్రీ.శ 1406 నాటి దేవరాయలు, క్రీ.శ. 1430 నాటి రెండో దేవరాయలు, క్రీ.శ 1477నాటి శాసనం, క్రీ.శ. 1525 నాటి శ్రీకృష్ణదేవరాయ శాసనాలను చూచి వాటిని భద్రంగా కాపాడమని ఆలయ అధికారులను బతిమిలాడాను. తరువాత బ్రిటీషువాళ్లు 1942 లో ఇక్కడ 1365 ఎకరాల్లో నిర్మించిన విశాలమైన విమానాశ్రయం ఆనాటి రన్‌వే 20 గదుల విశ్రాంతి మందిరం పక్మనే ఉన్న మిషనరీ పాఠశాల ఆనాటి వాస్తు శైలికి, కట్టడ నైపుణ్యానికి అద్ధంపడుతున్నాయి.

దాదాపు 2000సం॥ల నిరాటంక చరిత్ర గల, వేల ఎకరాల ప్రభుత్వ భూములున్న దొనకొండను రాష్ట్ర రాజధానిగా ప్రతిపాదించిన సంగతిని కూడ గుర్తుచేసుకున్నాను. ఇంకా చూడాల్సిన కల్లూరు, కురిచేడు, పొదిలి, కళ్లముందు ముసురుకున్నా సమయం సాయంత్రం 6.00 గం.లు కావటాన, ఎక్కడో అలవైకుంఠపురానికి ఆమడ దూరంలో ఉన్న విజయవాడ చేరుకోవాలి గాబట్టి దొనకొండ రైల్వే స్టేషను దగ్గర చూరునీళ్లలాంటి ఊదారంగు టీని ముచ్చటైన చిట్టిగాజుగ్గాసులో కావాలని పోయించుకొని, తాగిన తరువాత, తిరుగు ప్రయాణమైనాము. కరుణానిధి వంక జాలిగా చూచి, అంతదూరం రాలేమని ఒంగోలు-కంభం అడ్డరోడ్టులో దింపి వెళ్లేముందు వెనక్కి తిరిగి చూస్తే కరుణానిధి కళ్లలో సుళ్లు తిరుగుతున్న నీళ్లు అతని ఆప్యాయత, ఆదరణకు నికార్సయిన నిదర్శనాలనుకుంటూనే, బాధను భరిస్తూ ముందుకు సాగాం. ఈ ప్రాంత చరిత్ర శాసనాలపై చర్చోపచర్చలనడుమ మాకు తెలియకుండానే అద్దంకి రానే వచ్చింది. చంద్రమౌళి మాస్టారును దించి వెళదామంటే ఆయన మాకు 'సెంటల్లో పొట్టి శ్రీరాములుగారి విగ్రహం ఎదురుగా తన శిష్యుడు నడిపిస్తున్న ఆర్యవైశ్య భొజనశాలలో అన్నం తినిపించి మమ్మల్ని సాగనంపిన తీరు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఇలా కనిగిరి నుంచి దొనకొండ వరకూ ఇనుపయుగం నుంచి మధ్యయుగాల్లోని కాటమరాజు, విజయనగర రాజుల విక్రమ పరాక్రమాల్ని శిల్పాలు, శాసనాల్ని తలచుకుంటూ ఆ శిధిలాలను పదిలం చేయలేమా అన్న నాప్రశ్నకు సమాధానం వెతుక్కునేలోపు- ఇంటికి చేరుకొన్నాను. నిరాదరణకు గురై, నిర్లక్ష్యపు నీడలో చేరుతున్న శిల్పాలు, శాసనాల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన పడుతున్న నాకు, తెలియకుండానే నిద్ర కమ్ముకొచ్చింది. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021 |