పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిణతియునుగల ఈ కవితాప్రసూన గుచ్ఛములో[1] 826-8 సంఖ్యగల పాటలు-[అనఁగా మాయదారి తమ్ముడు, సాటేలా,పడవ-అను శీర్షికలుగల పాటలు] కేవలమును వెంకియొక్క-ప్రణయగాథలకు మాత్రమే సంబంధించినవి కావు. కాని అంతయోయింతయో వెంకి ప్రస్తావనకు అందును చోటు లేక పోలేదు. కనుకనే కాబోలు కవిగారు వానినికూడ నిందు పొందుపరచి యుందురు, కాని మనమా మూఁడు పాటలను పరిగణనమునం దుపేక్షించితి మేని [ఉపేక్షించుటకు మఱొక బలవత్తరమైన కారణముకూడ కలదు. దానిని ముందు నిరూపింతును.] ఈ పాటలకు మనము గుచ్ఛమన్నపేరును వాడుటకెట్టి యభ్యంతరమును లేదు. శ్రీ సుబ్బారావు పంతులు గారి రచన లగు నీ గేయములలో నేయొకదానిని పరీక్షించినను మూఁడు నాల్గు చరణములకన్న నా కృతియందు గ్రంథబాహుళ్యము ఎక్కువగా గోచరింపదు. కాని వానియందే దానియందలి భావసంపదను వివరింపవలసివచ్చినను సంపూర్తిగా వివరించుటకు నలువది పేజీలకుఁ దక్కువగ పట్టనేపట్టదు. ఇది భావుకులెఱింగిన యంశమే కదా?

సాధారణముగా నుపోద్ఘాత రచయిత లగువారికి-ప్రస్తుత మగుచున్న యంశమును సాకల్యముగ చర్చించి గుణదోషవిచారణ సేయవలసియుండుట మిగుల ముఖ్యమని నేనెఅుంగకపోలేదు. కాని అల్పావకాశముగల ఈ ప్రదేశమున నద్దానిని నిర్వహించుట దుశ్శక్యము. కావున మఱొకమాఱు దీర్ఘముగా విమర్శింప దలంపుగల నేనీవిషయము నింతతో ముగించుచు భావనాధనుడగు నీకవికుమారుని ప్రయత్నములు సఫలము లగునట్లును ఇట్టి వీరికి ఆయురారోగ్యైశ్వర్యాదివిభవముల నొసంగి, ఇతోధికముగ నాంధ్రవాగ్దేవికి సేవాంజలులనర్పింపజేయునట్లును అనుగ్రహించుటకై ఆ పరాత్పరుని వేలకొలది ప్రణామములచేత నిరంతరము నర్ధించుచున్నాను.

చెన్నపురి

క్రోధన భాద్రపద శుద్ధ సప్తమి: బుధవారము.


7

  1. ఆర్యసంప్రదాయము చొప్పున 82 మణులుగల హారము గుత్స మన బడును. గుత్సమనుమాటయే గుచ్ఛమన్న పేరుతో వ్యవహారమున నున్నదని నాతలంపు; కావుననే, నేను నిచ్చట హారభేదమును తెలుపు సందర్భమున గుత్సశబ్ధమునకు పర్యాయముగా గుచ్ఛమను పదమును వాడితిని.[పం.ఆ.శా]