పుట:Neti-Kalapu-Kavitvam.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

ఊగుడుమాటల అధికరణం.

ఊగుడుమాటలు

"కవి నొక విధమగు నుద్రేక మూగింపవలెను. ఒకయావేశ మావహింపవలెను వలవలనేడ్చును. పకపకనవ్వును పిచ్చి కేకలిడును పాడును నృత్యము చేయును." (యేకాంతసేవపీఠిక-దే.కృష్ణశాస్త్రి)

ఇట్లా వూగవలె నని యిది యిమోవ నని (Emotion) ఆవేశపడవలె నని పిచ్చి కేకలు వేస్తాడని ఊహలు ఈకాలపు కృతికర్తల్లో వ్యాపించివున్నది.

"ఆకులో నాకునై పూవులోఁ బూవునై
 కొమ్మలో గొమ్మనై నునులేత రెమ్మనై
 ఈయడవి దాగిపోనా యెట్లైన నిచటనే యాగిపోనా
 పగడాల చిగురాకు తెరచాటు తేటనై
 పరువంపువిరిచేడె చిన్నారి సిగ్గునై
 ఈయడవిదాగిపోనా యెట్లైన నిచటనేయాగిపోనా". (కృష్ణపక్షం)

అని వెర్రిపాటలోవున్న మాటలు యీ వూగుడుపిచ్చిమాటలే అయివున్నవి దయ్యంబట్టితే అంకాళమ్మ పోలేరమ్మ ఆవేశిస్తే వూగుతారు. దూపదీపనైవేద్యాలతో వేపాకుమండలదెబ్బలతో ఊగుడు ఉపశమిస్తుంది. కాని కవులువూగరు. పిచ్చికేకలు వేయరు. భావం ఆవరించినపుడు దానికి మొదట కవి వశుడయ్యేమాట సత్యం.

"క్రౌంచద్వంద్వవియోగోత్ధః శోకః శ్లోకత్వమాగతః" (ధ్వన్యా)

(క్రౌంచమిధునవియోగంవల్ల పుట్టినశోకం శ్లోకమైనది) అనేమాటలు వాల్మీకి ఆశోకానికి యెంత వశుడైనదీ తెలుపుతున్నవి. అయితే కావ్యరచనయందు ఆభావాన్ని తానే వశంచేసుకొని సృష్టి ఆరంభిస్తున్నాడు.