పుట:Neti-Kalapu-Kavitvam.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దోషసామ్యాధికరణం

255


శరణ్యం? ఇట్లా అక్కడా యిక్కడా యేదో అపహరించి విద్యాజాడ్యంతో యెన్నాళ్ళు సంచరిస్తాము? భారతీయ విజ్ఞానోన్మేషోద్యమంలో ఇతరుల అంటే బంగాళీలు మరాటీలు మొదలైనవరి యొక్క కృషి ఫలాన్ని పిరికిగా సంగ్రహిస్తుండడం తప్ప ఆ ఉద్యమంలో మనము కార్యకర్తలుగా నిల్వవలసిన యోగ్యత మనకు అవసరం గాదా? అని మనను మనము పరిశోధించుకొనడం ఆవశ్యకమని మనవి చేస్తున్నాను. ఇతర భాషల్లో ఉపాదేయ గ్రంథాలుంటే తర్జుమా చేసి వాఙ్మయాన్ని సంపన్నం చేయవచ్చును. కాని ఆ గ్రంథ కర్తల పేరు చెప్పుకుండా, వాటిని యెత్తి వ్రాసి ప్రకటించడం, అదేవిద్య అనుకొనడం ఆత్మవంచన, విజ్ఞానవంచన, లోకశ్రేయోవంచన అవుతున్నవి.

ఇంతకూ చెప్పదలచిందేమంటే యితరుల రచనలను చూసి పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకొన్నవి అనేకం వున్నవి. నేనిప్పుడు విచారిస్తున్న వనకుమారి, యేకాంతసేవ, యెంకిపాటలు మొదలైనవి పాశ్చాత్యులనుండి బంగాళీల నుండి పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకొన్నవాట్లో అనుకరించినవాట్లో చేరినా చేరకున్నా వాటి అనౌచిత్యాలు, అనౌచిత్యాలు కాకపోవు. పులుముడు, శబ్దవాచ్యత, అయోమయత్వం, అసంబద్ధత, అనుచిత చ్చందస్సు, వికృతభాష, పాత్ర సృష్ట్య భావం చేత ఆత్మ నాయకత్వం చేత కలిగే దృష్టి సంకోచం. చిల్లర శృంగార, క్షుద్రత్వం యివి యెక్కడవున్నా పాశ్చత్యుల్లో వున్నా బంగాళీలలో వున్నా దోషాలేనంటున్నాను. దొషసామ్యమే నంటున్నాను. ఇవి పాశ్చాత్యులకృతుల్లోగాని బంగాళీ కృతుల్లోగాని మరెక్కడనైనా గాని వున్నట్లు మీకు కనబడితే అక్కడక్కడల్లా నా విచారణలు వినిపించవలెనని ప్రార్థిస్తున్నాను. దోషాలెక్కడ వున్నా అవి సిద్ధాంతాలసత్యాన్ని బాధించవు.

అని శ్రీ. ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో దోష సామ్యాధికరణం సమాప్తం.