పుట:Neti-Kalapu-Kavitvam.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావకావ్యాధికరణం

135

యీతీరుగా చిన్నకావ్యాలు విభాగరహితమైనవి, మనవాఙ్మయంలో చిరకాలంనుండి వున్నవి. కనుక ఆకారంచేత యిప్పటి చిన్నకావ్యాలు కొత్తవికావు.

పూర్వపక్షం.

అవునయ్యా, ఆకారంచేత కొత్తవికాకుంటె పోనియ్యండి. వనకుమారి, యెంకిపాటలు మొదలైనవి భావకవిత్వం. ఇది కొత్తది. యిది వరకు లేదు. ఇంగిలీషులో లిరిక్సునుచూచికొత్తగా యిప్పటివారు నిర్మించినది. భావకవిత్వం.

తటస్థాక్షేపం.

భావకవిత్వ మనడమె అసంగతం. శ్రీకాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రివారు వ్రాసినట్లు భావంలేనిది కవిత్వమే లేదు. కవిత్వ మెక్కడ వుంటుందో భావ మక్కడ వుండనే వుంటుంది."

సర్గబంధంలేని చిన్నకావ్యాలు చిరకాలంనుండి మనవాఙ్మయంలో వుంటున్నవి. ఘటకర్పరకావ్యం. సూర్యశతకం, బిల్హణకావ్యం, సౌందర్యలహరి, కాళహస్తీశ్వరశతగం ఇవన్నీ యీకోటిలోవి. వీటికే మనపూర్వులు ఉపకావ్యాలని, ఖండకావ్యాలని పేరు పెట్టినారు.

"అసర్గబంధమపి యదుపకావ్యముదీర్యతే" (ప్రతా.)

అసర్గబంధం సూర్యశతకాది అని విద్యానాధుడన్నాడు.

"ఏకార్థప్రవణైః పద్యైః' సంధిసామగ్ర్యవర్జితం,
 ఖండకావ్యం భవేత్ కావ్యస్యైకదేశానుసారీచ" (సాహి.)

(ఏకార్థప్రవణమై సంధిసామగ్ర్యరహితమైన పద్యాలసముదాయానికి కొన్ని లక్షణాలు తగ్గినకావ్యానికి ఖండకావ్యమని పేరు.)

"యథా భిక్షాటనం ఆర్యావిలాసశ్చ" (సాహి.)