పుట:Neti-Kalapu-Kavitvam.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యతిక్రమాధికరణం

125


మారంభమైనప్పటినుండి అడుగడుక్కూ వక్ష్యమాణాధికపదదోషంచేత దూషితమైన దీర్ఘవృత్తాలుశరణమై క్లుప్తంగా వ్యంగ్యవిభుత్వంతో రచించే ఉత్తమకవితామార్గానికి అంధులమై మనకు పద్యం వ్రాయడమే కవిత్వమయింది. ఇప్పటికి పద్యం వ్రాయడమే మనకు కవిత్వంగా వున్నది. గీతం, ద్విపద, రగడ, ఉత్కళిక మొదలైన వాటిని కొందరు వాడుతున్నా సంస్కృతవృత్తాల నింకా వదలలేదు. సంస్కృతంలో మందాక్రాంత, శార్దూలంవంటి వృత్తాల్లోనే కవితాశిల్పానికి భావం కొంత దీర్ఘంగా కనబడుతుంది.

మన సీసపద్యపు నాలుగుపాదాలమటుకే మందాక్రాంతకుగాని శార్దూలానికిగానిసరిపోతవి ఇంకా సీసానికి గీతపాదాలు నాలుగుతగిలిస్తే భావం మిక్కిలి దీర్ఘమై అప్పుడు కవిత్వచ్ఛాయపోయి ఉపన్యాసధోరణిలోకి దిగుతుంది. ఒక్కొక్కప్పుడు పద్యమెక్కువై దండగమాటలు నింపవలసి వస్తున్నది. శార్దూలాదివృత్తాలతో నిండివున్న మన తెలుగుకృతుల్లో ఛందోవ్యతిక్రమం వుదాహరించడం అనావశ్యకం గనుక ఉదాహరణాలను చూపక వదలుతున్నాను.

యతిభంగం.

యతి అంటే విచ్చేదం. సీసంవంటి దీర్ఘపద్యపుపాదాల్లో శ్రోతకు శ్రవణసుఖాన్ని పఠయితకు యత్నసుఖాన్ని యతి ఆపాదించి పద్యం యొక్క శ్రావ్యతకు సుగ్రహతకు మిక్కిలి తోడ్పడుతున్నది. ఈసంగతి సీసం, శార్దూలం, మందాక్రాంత మొదలైనవాటిని పఠించి కనుక్కోవచ్చును. కనుకనే ఉచితస్థలాల్లో యతిని ఉపదేశించిన భారతీయచ్ఛందోవేత్తలు పద్యరమ్యతను ప్రతిష్ఠించారంటున్నాను.

ఇట్లాటి నియమంనుండి తెలుగుపద్యం భారతంలోనే చ్యుతమై యిప్పటికీ నియమహీనంగానే వుంటున్నది.