హేమలత/ఆఱవ ప్రకరణము
ఆఱవ ప్రకరణము
ప్రపంచమునం దిప్పటికి నిలిచియున్న పురాతన కట్టడములలో నెల్ల మిగుల నున్నతమయి సర్వజనస్తవనీయమయి యున్నది, ఢిల్లీ నగరమునకు నైదు క్రోసుల దూరముననున్న కుతుబుమైనరను గోపురమని చెప్పవచ్చును. ఇది కుతుబుద్దీను, మహమ్మదీయ ఋషి పేరఁ గట్టబడినది. ఇది కట్టుట కారంభించిన యిరువదియైదు సంవత్సరములకు ముగింపబడినది. ఇప్పటి కది నిర్మింపబడి యాఱువందల యేఁబది సంవత్సరములు గడచినను నేఁటికిని జూపఱకుఁ గనులపండువు జేయుచు నాశన దేవతపాలఁబడక మహమ్మదీయుల శిల్పిశాస్త్ర నైపుణ్యమును బ్రకటించుచున్నది. అది యిన్నూటనలువది రెండడుగులు యెత్తుగలిగి గర్భమందు వంకరగ బాము మెలికలువలెఁ దిరిగి యున్న మున్నూట తొంబది తొమ్మిది మెట్లతో వెలయుచుండును.
పూర్వకాలమున ఢిల్లీ రాజ్యమును బరిపాలించిన మహమ్మదీయ చక్రవర్తుల గోరీలు దీనిచుట్టునన్నవి. నేఁడు దీని సమీపమున నొక చిన్న గ్రామము బయలు దేరినది. మనము వర్ణించుచున్న కాలమునాటికిఁ గూడ తత్సమీపమున గొన్ని సమాధులుండుటచే జనులు రాత్రులందుఁ దఱచుగ నా ప్రక్కకు బోవుచుండుటలేదు. ఈ గోపురము పయికిఁబోవువారు శ్రమ కలుగకుండ విశ్రాంతి గైకొనుటకు నడుమ నడుము నంతస్తులు మందిరములు గట్టఁబడియున్నవి. వీనినెల్ల గడచి చివరయంతస్తు పైకెక్కి చూచువారి నేత్రములకు గ్రిందనుండు మనష్యులు పిల్లలవలెఁ గన్పడుదురు. దీనియందు సాధారణముగా బరదేశగతులగు ఫకీరులు వసించుచుందురు. ఆనాఁడు సూర్యాస్తమయమైన వెనుక నిద్దఱు శిష్యులు వెంటరా నొక ఫకీరు మెల్లమెల్లగ గోపురపు మెట్లనుండి క్రిందికి దిగెను. మెట్లనన్నింటినిదిగి క్రిందికి వచ్చి తన శిష్యులతోఁ గొన్ని రహస్యములనుజెప్పి చెఱి యొకవైపునకుఁబంపి వారు బయలుదేఱిన నాలుగు గడియల కతఁడు తత్ప్రదేశమునుబాసి పురమువంక బోవుచుండెను. అతఁడు షష్టి వయఃపూర్ణుడగు వృద్ధుఁడని నెఱసిన గెడ్డము తెలియజేయుచుండెనుకాని శరీర దార్ఢ్యము జూచువారంత వయస్సుండునని నమ్మరు. తన శరీరమున బ్రాఁతయంగరకా ధరించి తలగడ్డను బెట్టికొని పూసల తావళమును ద్రిప్పుచు నతడు పురముఁ బ్రవేశించి వీధుల వెంబడి దిరుగుచుండెను.
రహిమాను ఖాను చక్రవర్తియొద్ద సెలవుగైకొని రాజమందిరమును బాసి వీధిలోనికి వచ్చువఱకు ఫకీరును దనచేతి కారుచప్పుడు చేయుచు వినోదమును గల్గించు పాటఁబాడుచు నా స్థలమునకు వచ్చెను. చక్రవర్తి తన విషయమున నేమిచేయునో తన కాగితమును దనవృత్తాంతములను నమ్మునో, నమ్మక ప్రాణములఁ దీయించునో యని భయపడుచు మందగమనముతో వచ్చుచున్న ఖాను ఫకీరును జూచి వారు భూతభవిష్యద్వర్తమానమున నెఱిఁగిన వారగుట దానును వినియుంటఁ దన భవిష్యదవస్థ నీ ఫకీరునడిగి తెలుసుకొన వలయునని తలంచి యాతని సమీపమునకు బోయి వినయముతో “అస్సలామా లేఖు” మ్మని సలాముచేసెను. ఫకీరును “ఆలేఖుం సలా” మని యచట నిలిచెను. అంతట వారిట్లు మాటాడిరి.
ఖాను – మీరు కులందర ఫకీరులా? ముదార్య ఫకీరులా? ఫకీరు – నేను కులందర ఫకీరునే. అయ్యా! నా సంగతి నీకెందులకు?
ఖాను – అయ్యా! తమరు మహాత్ములు, పైగంబరులవంటివారు. నాకు నేఁ డొక్క యాపద సంభవించినది. అది యెట్లగునో మీరు తెలుప వలెను.
ఫకీరు – (మాటవిని కొంచె మాలోచించి) హా! మహమ్మదు! మౌలా అల్లీ! నామీద దయగలిగియుండుడు. అయ్యా! నాడు దెలిసినంత వలకు నీ యవస్థను దెలిపెదను. అది నిజమగునేని నీవు నూఱగురు ఫకీరులకు నన్నము పెట్టగలవా?
ఖాను – సందేహమేమి? మీ సెలవు ప్రకారము జేసెదను.
ఫకీరు – అయ్యా! నీ పేరు రహిమానుఖాను కాదా?
ఖాను - (ఆశ్చర్యముతో) చిత్తము.
ఫకీరు – నీపైని దుర్మార్గులు చక్రవర్తితో నేరములఁజెప్పిరి కాని మహమ్మదు వారి దయవలన నీదగ్గఱనున్న కాగితములనుబట్టి నీ మాటయే పై నుండును. నీ శత్రువులు నశింతురు.
ఈ వాక్యముల నాలకించినతోడనే ఖానత్యాశ్చర్యము నొంది “మీరు సర్వజ్ఞులు. నేను బాపాత్ముఁడను. నా పాపములు నశించునట్లును నాకు శుభములు గల్గునట్లును నన్ను మీ రాశీర్వదింది. దేవతలఁ బ్రార్థింపవలెను” అని వేడుకొనెను. అంతట ఫకీరు సంతోషముతో నీపై నల్లాకు దయగలదు. మహమ్మదీయుడ వగుట నీ పాపములు క్షమింపఁబడినవి. కాఫరు లందఱు నీచేత హతులగుదురు. నీకు శుభమగు బొమ్ము అని తాను సాగిపోయెను.
ఖానును మహానందముతోఁ దనబస కరిగెను. ఆలోపున జక్రవర్తి ఖానురాక కెదురుచూచుచు, నిర్హేతుకమైన యాలస్యమునకు వాటిని నిందించుచు సమీపమున నున్న బానిసలపై మండిపడుచుఁ గొంతసేపటికి ముఖ్యమంత్రియైన జహందరులోడికి వర్తమానమంపెను. అతఁడును వచ్చి చక్రవర్తికి సలాము చేసి చేతులు జోడించుకొని యెదుట నిలువ జక్రవర్తి కూర్చుండుమని కనుసన్నఁజేయ నొక పీఠముపై గూరుచుండెను. అంతటఁ జక్రవర్తి వజీరును జూచి రహిమానుఖాను కొన్ని రహస్యములగు కాగితముల దెచ్చినాఁడట! వాని మనము పరిక్షింపపలెను. అని చెప్పగా వజీరు ఖాను నిమిత్త మెదురుచూచుచు నుండెను. అంతలో రహిమానుఖాను కాగితముల కట్ట చేతఁబట్టుకొని మెల్లమెల్లగా, మేడమెట్ల నెక్కి మూడవ యంతస్తు మీదకు వచ్చి చక్రవర్తియు వజీరును నున్న మందిరముఁ బ్రవేశించి వినయ పూర్వక వందనముల సల్పి యెదుట నిలిచెను. చక్రవర్తి వాని నుచితాసనమున గూర్చుండ నియమించి యతని చేతనున్న కాగితములకట్ట నందికొని విప్పిచూడ నందు నాలుగైదు కాగితములుండెను. ఆ కాగితములు మహారాష్ట్ర భాషలో నుండుటవలన, నా భాషయం దెవరికి దెలియకుండుటను వారందలు యోజించి రాజభక్తిగలిగి మాయోపాయములం దాఱితేఱిన వసంతభట్టను మహారాష్ట్ర బ్రాహ్మణునకు వర్తమానము నంపిరి.
ఆతఁడును నర్ధరాత్రి వచ్చిన వర్తమానమునకు భయపడుచు, జపల చిత్తుడైన పాదుషావలన నేమి కీడుమూడునోయని, యీ గండము గడిచిన యెడల భవానికిఁ గుంకుమపూజ జేసెదనని మ్రొక్కుకొని యచ్చటికివచ్చెను. అతని నుచితగౌరవముతోఁ గూర్చుండ నియమించి చక్రవర్తి యాకాగితములనిచ్చి చదువుమనెను. ఆతఁడును నామూలాగ్రముగ వానినెల్ల దనలో జదువుకొని యైదుకాగితములనియు నైదవది మాత్రము ముఖ్యమైనదనియు జెప్పి దాని నిట్లుజదువ నారంభించెను.
“శ్రీ సూర్యకుల ప్రదీపకులగు భీమసింగు మహారాజు వారికి దేవగిరి రామదేవు నమస్కారములఁజేసి వ్రాయుచున్న దేమనిన ఈమధ్య మీకును, గ్రూరుఁడైన యల్లావుద్దీను చక్రవర్తికిని మనస్పర్ధలు గలిగినట్లును, జిత్తూరు రాజ్యముపై నతడు దండెత్త నూహించినట్లును మేము వినుచున్నాము. అది నిజమగునేని మిగుల విచారము నొందుచున్నాము. ఈవఱకు దక్షిణ హిందూస్థానమునకు వచ్చి మమ్మాతఁడోడించుట మీరు వినియుందురు. సమానాపదలోనున్న మన మిరువురమును క్షత్రియ కులజులము నేక దేశీయులము నగుటచే నన్యమతస్థుడు దూరాచారుడునగు చక్రవర్తిపై గలిసి యుద్ధముచేసిన పక్షమున గెలవకపోము. పౌరుషధనులు నభిమాన సముద్రులు నగు మీకు మేము దోడ్పడినయెడల దైవానుగ్రహమువలన ఢిల్లీనుండి మ్లేచ్ఛులను బాఱదోలవచ్చును. మ్లేచ్ఛుడగు చక్రవర్తి దురాచారుడగుటచే స్వబలమునందనేకు లతని కనిష్టులుగ నున్నారని విని సంతోషించుచున్నాము. మీ దేశముమీఁద దండయాత్ర ముందుగ జరఁగునేని మాబలమును మీకు సాహాయ్యముగ నంపెదము. అది యింతట జరుగదేని మాకు మీరు సహాయము చేయుడు. నీతి విశారదుడగు నీ యోగి మనకుత్తర ప్రత్యుత్తరముల దెచ్చి యిచ్చుచుండును. దీనికి వెంటనే యుత్తరము నంపఁగోరుచున్నాను. త్వరపడవలయు.
రామదేవు వ్రాలు”
ఈ యుత్తరమునుబట్టిచూడ నీవఱకు రాజపుత్రులు మహారాష్ట్రులకేమియు వ్రాసినట్లు కనబడదు. మహారష్ట్రులు ముందుగా రసపుత్రులకు వ్రాసిన కాగితములు మనకుదొరకినవి కాబట్టి భీమసింగీవార్త యెఱుగడు. అని వజీరు పలుక దద్వచనములయందు జక్రవర్తి విశ్వాసముంచి యౌనని తలయూచి నీకెవరివద్ద నివి లభించినవి? అని ఖానును మరల నడిగెను. అంతట ఖాను లేచి చక్రవర్తికభిముఖుడై నిల్చి చేతులు జోడించి, “ఓ మహాప్రభూ! మదనసింగుపై మీకు గల గొప్ప యభిప్రాయమును జెఱుపుటకు నాకిష్టములేదు. అయినను మీ యాజ్ఞ శిరసావహించి రాజ్యము కొఱకును మీ కొఱకును బాటుపడునట్టివాడనగుటచే జెప్పక తప్పదు” అనెను. విని యాశ్చర్యమునొంది మదనసింగు సమాచార మెందుకు? అతని కీ వృత్తాంతము తెలియునా యేమి? వేగముగ జెప్పుమని చక్రవర్తి త్వరపెట్ట ఖాను యిట్లనియె. ఈ కాగితములు నాకు మదనసింగునొద్దనే లభించినవి. అతని దగ్గఱ నీ కాగితములున్నవని నాసేవకులనంపి బలవంతముగ వీనిని దెప్పించితిని. నేనీపని కేవలం రాజభక్తితో నొనర్చినను దారులగొట్టించి దోపిడీ చేసితినని యేలినవారితో దుర్మార్గులు చెప్ప విశ్వసించి నాపయినలుక వహించినట్లున్నది. ఆ మదనసింగునకును యోగికిని బరమమైత్రి కలదు. అయ్యోగి యెవరో నిలుకడమీద దెలియవలయును. అనవుడు జక్రవర్తి యాగ్రహము పట్టజాలక తత్క్షణమే యా దుర్మార్గుని బట్టి యేల చెఱలో వేయలేదు? నీవు సమయోచితబుద్ధి లేనివాడవు. అని తిట్టుచుండగా రహిమానిట్లు చెప్పుచుండెను.
“మదనసింగును నఱకవలెననియే నేను దోషముతో ఖడ్గమునెత్తి యాపాపాత్మునిపయి బడితిని గాని నాజరుజంగు నన్ను బట్టుకొని యాపెను.” అనవుడు మండిపడి పీఠమునుండిలేచి చక్రవర్తి నాజరుజంగడ్డు వచ్చెనుగా? అతఁడును వానితో గలిసెనా? యని యడిగెను. అంత ఖాను మెల్లన నిట్లనియె “దేవరవారు నన్ను క్షమించిన పక్షమున నా సంగతి మనవిచేసుకొందును. మదనసింగునకు నాజరుజం గాప్తమిత్రుడు. అత డీ కుట్రలో జేరకున్నయెడ, విదేశీయులు విమతస్థులగువారి కీ స్నేహమెట్లు కుదురును? దానికి నిదర్శనముగనిప్పుడు చదివిన యుత్తరములో గొందఱురాజపుత్రులతోను మహారాష్ట్రులతోను జేరుదురనియు నుండలేదా? నాజరుజంగు మొదలగు వారుండుటచేతనే యీ యుత్తరమున నట్లున్నది.” అని చక్రవర్తికి సలాముచేసి ఖాను కూర్చుండెను.
తరువాత జక్రవర్తి వజీరును వసంతభట్టునుజూచి నాజరుజంగు విషయమున మీ యభిప్రాయమేమి? అని పలుక వజీరిట్లనియె “ఆ విషయమున నాతఁడెట్లు చెప్పుకొనునో విని కర్తవ్యమూహించుట శ్రేయము” అనుచుండగా పాదుషా దీని కతనిమాట వినుట యెందుకు? లిఖిత నిదర్శనముండగా నిందబద్ధమేమున్నది అనెను. తాను ద్రవ్విన గోతిలో మదనసిం గును నాజరుజంగును దప్పక పడుదురను పూర్ణవిశ్వాసముతో రహిమాను ఖానానంద మొందుచుండెను. చక్రవర్తి రాజపుత్రులపై దండెత్తుట కర్తవ్యమగునా కాదా యని తనలోఁ దానాలోచించు కొనుచు, రాజపుత్రుల దేశముపై దాడి వెళ్ళుదమా వద్దా? మదనసింగుతో దండయాత్ర లేదని చెప్పినాము. ఈ విషయమున మీ యభిప్రాయమేమి? అని యడిగిన రహిమానుఖాను యిట్లనియె.
మహాప్రభూ! రాజస్థాన దండయాత్ర మీరు మానవలదు. రాజపుత్రులు పైగాంభీర్యము గలవారేకాని నిజముగఁ బిఱికివారు. చిత్తూరు జయింపకున్నయెడల మహమ్మదీయులు రసపుత్రులను జయింపజాలరని ప్రజలకు మనపై గౌరవము తగ్గును. అని చెప్పఁగానే చక్రవర్తియు నది సరేయని “ఱేఁపురాత్రి దర్బారగును. అప్పుడు దండయాత్ర సంగతి నెల్లరకు దెలియజేయుదము. ఈరాత్రి ప్రొద్దువోయినది. మీరు రహస్యమును బయట పఱుపకుఁడు” అని చక్రవర్తి లేవఁగా రహిమానుఖానపుడు మరల మదనసింగుతో దేవరవారు యుద్ధమునకు రామనిజెప్పుట మిగుల లాభము. మనము దండెత్తిరామని వారనుకొనుచుండ నాకస్మికముగ వారిపైఁబడి యోడించ వచ్చుననెను.
పాదుషా పకపక నవ్వి శహాబాస్ మంచి యోచన చేసినావు. నీవంటి బుద్ధిమంతుఁడు మా రాజ్యములో నింకొకడులేఁడు. అని వజీరును వీడుకొలిపి రహిమానుఖాను వసంతభట్టును దీసికొనిపోయి వేఱువేఱుగ నిద్దఱికిని జెఱియొక రహస్యమును జెప్పిపుచ్చెను. ఖాను తనబసకుఁ బోవుచుండ మార్గమున గులందరు ఫకీరు మరల నగపడి యతనిని బలుకరించి నీపని నేఁను జెప్పినట్లయినదిగదా? యని యడుగగా నైనదనిచెప్పి ఖాను ఫకీరు కోరిక మీఁద నతని కారాత్రి జరిగిన విశేషములన్నియు విన్నవించెను. మఱునాఁటి యుదయమునఁ జక్రవర్తి రహిమానుఖానును దన సన్నిధికి రావించి దండయాత్రను గూర్చి ముచ్చటించుచుండఁగా మఱింత ప్రోత్సాహము కలిగింపఁ దలచి ఖాను దేవరవారికి నేనొక ప్రియము విన్నవించెద. చిత్తూరు రాజ్య సంరక్షకుడగు భీమసింగు మహారాజుభార్య పద్మినియను నొక జగన్మోహనాకార కలదు. ఆమెను బోలు సుందరులు ప్రపంచమున లేరు. మహాచక్రవర్తులైన తమకాసుందరి తగినది. ఈ దండయాత్రవలన రాజస్థానము లోఁబడుటయేగాక పద్మినియు మీకు లభించును. అని విన్నవించినతోడనే యమితానంద భరితుఁడై చక్రవర్తి వజ్రపుటుంగరము ఖానునకు బహుమానము నొసంగి, సాయంకాలపు దర్బారునకు మరల రమ్మని యాతని పంపివైచెను.