హేమలత/అయిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

అయిదవ ప్రకరణము

మహమ్మదీయులు భరతఖండమును బరిపాలించినంత కాలమును ఢిల్లీ నగరము రాజధానియైయుండెను. ఈ ఢిల్లీ చక్రవర్తులె రారాజులవలనఁ గప్పములు గ్రహించి మూర్దాభిషిక్తులను బాదాక్రాంతులఁ జేసిరి. చక్రవర్తులె యాసేతుహిమాచలమగు భరతఖండము నేకచ్ఛత్రముగఁ బాలించిరి గజనీ మహమ్మదు పండ్రెండు సారులు హిందూదేశముపై దండెత్తి దేశమునెల్లఁ గొల్లగొని లక్ష్మిని దనవెంటఁ గొని దారిద్ర్యదేవత నిట నిలిపి చిన్నయనంతరము మహమ్మదు గోరి యను నతఁడు ఢిల్లీ మహారాజుగ నుండిన పృథ్వీమహారాజును ధనేశ్వర యుద్ధమున వధించి దేశము నాక్రమించెను. తన్మరణానంతరము బానిసరాజులు 1206 మొదలు 1210 వఱకు నుత్తర హిందూస్థానమును బాలించిరి. వారు బలహీనులయినవెనుక వృద్ధుఁడయ్యు జలాలుద్దీను భుజబలముచే బానిసలను గెల్చి, సింహాసన మెక్కి, కిల్జీవంశ స్థాపకుఁడయ్యెను. జలాలుద్దీన్ చక్రవర్తి 1290 మొదలు 1295 వ సంవత్సరమువఱకు మాత్రము పరిపాలించెను. రాజ్యకాల కాలము స్వల్పమైనను మహమ్మదీయ లదివఱకెన్నఁడు నెఱుఁగని దక్షిణహిందూదేశము పై ప్రథమ దండయాత్ర 1294వ సంవత్సరమున జరగెను. అది జలాలుద్దీనునకు నన్న కుమారుఁడును కపటోపాయ ధురీణుఁడును, రాజనీతివిశారదుఁడు నగు నల్లాయుద్దీను సేనానాయకుఁడై నడిపి మహారాష్ట్రదేశము నాక్రమించెను. ఆ కాలమున మహారాష్ట్రదేశమున దేవగిరినగరము రాజధానియై యుండెను. అల్లాయుద్దీను మహారాష్ట్ర దేశాధీశ్వరుఁడగు రామదేవమహారాజును గెల్చి యాతడు ఢిల్లీకి సామంతరాజుగ నుండునట్లును గప్పము గట్టునట్లును, నొడఁబఱచి బహు నగరములను గొల్లగొన్న దోఁపిడిధనముతోడను కానుకలతోడను బినతండ్రి నెదుర్కొనుట కరిగెను. అరిగిన తోడనే యఁతడు పినతండ్రిని జంపించి తాను జక్రవర్తి కాఁగోరి యపారసేనాసమేతుఁ డయియుండుటచే దన మనోరథమును సులభముగ నెఱువేర్చుకొని మహావైభవముతో 1205 వ సంవత్సరమున సింహాసన మెక్కి 1216 సంవత్సరమువఱకును రాజ్యము చేసెను. ఈతఁడు లోకవ్యవహారములం దారితేఱిన దిట్టరియేకాని కుటిలుఁడు. కార్యసాధన మొనర్పఁగల బాహుళశాలియె కాని నీతిలేనివాఁడు. ఈతఁ డుత్తర హిందూస్థానమును దాదాపుగ స్వాధీనము జేసికొనెను. రాజపుత్రస్థానమును జయింపలేదు. ఆతఁడు సింహాసనమెక్కునాఁటికి దక్షిణమున మహారాష్ట్రముదక్క దక్కినదేశము లెవ్వియు వానిపాలనమునకు లోఁబడియుండ లేదు. దేవగిరి, మహారాష్ట్ర సామంతుఁడగు రామదే వేలుచుండెను, ఓరగల్లు రాజధానిగఁ ద్రిలింగదేశము కాకతీయవంశజ్ఞులు పాలించుచుండిరి. భిలాలు వంశస్థులు ద్వారసముద్రమునుండి మైసూరు రాజ్యము నేలుచుండిరి. కర్ణాటకమును స్వదేశ రాజులు పాలింపుచుండిరి. రాజ్యస్థాపమును దక్షిణ రాజ్యములను స్వాధీనపఱచుకొనవలయునని మాలికాఫరును సేనానాయకుని గొప్ప సైన్యముతో పంపగా నతఁడును దన ప్రభువువలె నీతిసంపత్తి లేనివాఁ డగుటచే మాయచేతనో బలముచేతనో స్వదేశ ప్రభువుల నడచి రామేశ్వరము వఱకుగల దేశమును జయించి యనేక పురాతన రాజకుటుంబముల నిర్మూలన మొనర్చెను. ఈతఁడు దక్షిణ దేశమందుండ జక్రవర్తి రాజస్థానఁడయాత్రను గూర్చి యోజించుచుండెను. ఢిల్లీనగరమునందున్న సైన్యమును జాల కాలమునుండి యుద్ధమునకు సిద్ధమగునట్లు జేయుచు నితర మండలములయం దుండు సైన్యంబులఁగూడ బిలిపించి సన్నాహమొనర్చుచు సైనికుల కెల్ల గావలసిన భోజన సామగ్రులను గజములను బశువులను సిద్ధపఱచుచుఁ జక్రవర్తి ప్రయత్నము సేయుచుండెను. ఒకనాఁటి సాయంకాలము సంధ్యారాగము దర్శనీయమై ఢిల్లీ నగరముపైనఁగట్టఁబడిన యెఱ్ఱని వితానమువలె వెలయుచుండెను. సంధ్యారాగము క్రమముగ సదృశ్యమయి వెన్నెల వ్యాప్త మయ్యెను, నల్లని యమునానదీ జలమునందు ఢిల్లీ నగరము మేడలతోడను, మిద్దెలతోడను, పహాగోపురములతోడను, నీటఁ గట్టఁబడిన పట్టణమువలెఁ బ్రతిబింబితమై కనుపట్టుచుండెను. సాయంకాలము నమాజునకు భక్తులఁ బిల్చువారికేకలతో మజీదులు ప్రతిధ్వనులిచ్చుచుండెను. మసీదులు యగ్ర భాగములను, హిందూదేవాలయశిఖరములును మహోన్నత గోపురములును వెన్నెలలో ధగధగలాడుచు నగరముయొక్క యున్నతస్థితిని దము పొడవుచే దెలియఁ జేయుచుండెను. నగరమధ్యమునున్న కోటలో సరోవరమధ్యమున విలసిల్లు తెల్ల దామరవలె జక్రవర్తి వసియించు నేడంతస్థులమేడ క్రొత్తకాంతులతో నా వెన్నెలయందుఁ గన్పట్టుచుండెను.

ఆనాఁటిరాత్రి నాలుగుగడియ ఆయనతరువాత చక్రవర్తి రహస్య ములు మాటాలాడుకొను గదిలో మెత్తని పరుపులు వేయఁబడిన యొక కుర్చీ మీఁదఁ గూర్చుండి హుక్కా త్రాగుచునుండ నతివినయముతో నంతఃపుర సేవకుఁడగు నొక నల్లని దీర్ఘకాయముగల తురక గది బ్రవేశించి చక్రవర్తి పాదముల దగ్గర సాష్టాంగపడి భయవినయములతో మహా ప్రభూ! ఏలినవారి గులాపువాని దొక మనవి యున్నదని మెల్లగఁ బలికెను. ఆ మాటవిని యదివఱ కేదో యోజించుచున్న చక్రవర్తి మహాకోపముతో బానిస నొక తన్నుఁ దన్ని ఏమిరా! లుచ్ఛా! నీ వెందు కఱచెదవురా, యని భయంకర ముగఁ గేకవైచెను. బానిసయు వడఁకుచు, “స్వామి? పాలిఖిల్లాదారు రహిమాను ఖాను వచ్చియున్నాడు. సెలవుదయచేసిన పక్షమునఁ దమపాదముల సన్నిధికిఁ దోడుకొని వచ్చెద” నని పలుకుటయుఁ జక్రవర్తి తనయంగీకార సూచకముగఁదల యూఁచిన, సేవకుడు ఖానుగారిని వెంటఁబెట్టుకొని వచ్చి గదిలోనికంపి తానావల నిలుచుండెను. ఖానుసాహేబు పాలి గ్రామమున వసించునప్పటి గర్వమును వదలి చక్రవర్తి సమ్ముఖమున నేలఁబడి తత్పాదముల నంటి సలామొనర్చెను. చక్రవర్తియు వానిని జూడఁగానే వాని దురాచారములఁ గూర్చి నాజరుజంగు విన్నవించినయంశములు జ్ఞప్తికిరా మండిపడి, ఓరీ! రాజద్రోహి మాదేశమునఁ గల ద్రవ్యవంతులను సామంతులను దోపించుటకా నీకధికారమిచ్చినది? చీ! నీమొగముఁ జూడరాదు. నీవు నాయెదుట నుండి పో, యని తనపాదములపైఁ బడియున్న యాతనిఁ ద్రోసివైచి రెండు తన్నులు దన్నెను. స్త్రీవలె రోదనము జేయుచు, “ఓ మహమ్మదీయ మత సంరక్షకా! ఓ సకలలోక చక్రవర్తి! నేను మీబానిసను, నేనేపాప మెఱుఁగను, నిర్హేతక ముగ నామీదనోర్వలేక తుచ్ఛులెవరో నేరములు జెప్పినా రని” విలపించు చున్న యా నిర్భాగ్యునిఁ జూచి చక్రవర్తి యించుక కరణించి, నీ నిర్దోషత్వమును నీవెట్లు స్థాపింపగలవు? అట్లు చేసికొనిన పక్షముననే నీ ప్రాణములు దక్కగలవు. ఱేపు సాయంకాలము వఱకు నీకు గడు విచ్చినాను. ఱేపు రాత్రిదర్భారు. ఆసమయమునకు నీవుసంసిద్ధుండవై యుండవలెనని పలికి యాపూటకు క్షమియించెను. ఈ వాక్యములతో మనశ్శాంతి కలిగి రహిమానుఖానుసంతోషించి మహాప్రభూ! ఏలినవారు ధర్మమూర్తులు. ఱేపు సాయంకాలము నేను నిర్దోషినని స్థాపించుకొనగలను. అంతేగాక రాజపుత్ర స్థానదండయాత్రను గూర్చి యత్యంత రహస్య మయిన కాగితములు గూడనాకు లభించినవి. అవియన్నియు నేను మీకు నిచ్చెదను. అప్పుడు నాసత్ప్రవర్తనమును మీరెఱుఁగలరు. ఇక నేను సెలవుగైకొనిపోయివచ్చెద నని ఖాను చెప్పిన నలాయుద్దీ నాశ్చర్యమును సంతోషమునుగుదురఁజల్లని కటాక్ష వీక్షణములు వానిపైఁ బఱపుచు నీకు లభించిన కాగితముల నీరాత్రితెచ్చి మారుఁ జూపవలయును. ఆకాగితములఁ జూచినగాక మాకుఁ దోఁచదు. నీవతివేగ మేగి వానిని దీసికొనిరమ్మని చక్రవర్తి పలుక మందహాసముతో సెలవుగైకొని బసకు బోయెను.