హిందూ కోడ్ బిల్ సమీక్ష/సామాన్య వివేచనము

వికీసోర్స్ నుండి

హిందూకోడ్ బిల్ సమీక్ష

సామాన్య వివేచనము

హిందూకోడు బిల్లునందెన్ని మారులో హిందూధర్మ మను నామము వచ్చినది. కాని హిందూధర్మమన నేమి ? దానికాధారస్వరూప ప్రమాణంబు లెవ్వి ! యను విషయము విచారించబడినటు లెచ్చటను గానరాదు. కావున నిది యపూ ర్ణము. ప్రయోజనము లేనిది. హిందూకోడును సమర్థించుచు నొక మహాశయు డిటు లనెను "ఈ బిల్లు హిందూధర్మమును రక్షించునది కాని భక్షించునది కాదు. కారణమేమియనగా ఈబిల్లుమూలమున హిందూధర్మమును ద్యజించునాతని కనేక యధికారములు లేకుండ జేయబడినవి. హిందూధర్మమును బరిత్యజించినవా డల్పవయస్కులను, నజ్ఞానులను పాలింప వీలు లేనట్లే యువతి పునర్వివాహము జేసుకొన్నను, హిందూధర్మమును విడనాడినను దత్త తాధి కారము లేనిదగును. " ఈ విధముగ ననేక ప్రమాణముల మూలమున కోడుబిల్లువారు హిందూధర్మ రక్షణమే కోరు చున్నారని నిరూపింపబడినది. కాని హిందూకోడు బిల్లునందీ వాక్యము లున్నను వేదాది శాస్త్రములకు విరుద్ధముగా నసవర్ణ వివాహమును, సగోత్రవివాహము, విడాకులచట్టము - స్పష్టీకరింపబడినవనగా, ఈబిల్లును బ్రతిపాదించువారు అధర్మ మును ధర్మమని భావింతురనియు, వారు ధర్మము నుల్లంఘించ రను దాని భావ మధర్మము నుల్లంఘించరనియు మన మను కొనవలసి వచ్చును. అధర్మమును ధర్మమనుకొనువారు పూర్వము కూడ గొంద ఱుండెడివారు. కొందఱు రాక్షసులు పరదారాగమనమే తమ ధర్మమని భావించెడివారు. ఇట్టి స్థాన ములందు ధర్మశబ్దము నుపయోగించుట భ్రాంతి మూలక మని సుస్పష్టమైనది, “ చోదనాలక్షణో౽ర్థో ధర్మః" "తస్మాచ్ఛా త్రం ప్రమాణం తే" ఇత్యాది వచనములద్వారా శాస్త్ర విహితకర్మమే ధర్మమనియు, శాస్త్ర నిషిద్ధ కర్మమే యధర్మ మనియు వ్యక్తమగుచున్నది. బహిరంగముగా నంతర్జాతీయ వివాహములను, విడాకుల చట్టమును, సంకరసృష్టిని బ్రోత్స హించు హిందూకోడుబిల్లు వలన ధర్మమెట్లు రక్షింపబడును? ధర్మమును గ్రహించుటకు ముందాధర్మమును, దాని ప్రమాణమును నిర్ణయించుకొనవలసివచ్చును. అందులకై వేదము లను, ధర్మశాస్త్రములను పూర్వమీమాంసను విమర్శించవలసి యుండును. ధర్మము పేరట నేవియో కొన్ని వాక్యములను వ్రాసినంత మాత్రమున ధర్మనాశకమగు కోడుబిల్లు ధర్మ రక్షక మగునా! సారాంశ మేమియనగా హిందూకోడును నిర్మించువారిచే కల్పింపబడిన ధర్మమును ద్యజించునాతడే యిచట హిందూధర్మత్యాగి యని యూహింపబడును. కాని శాస్త్రవిరుద్ధధర్మ మెప్పటి కైనను నధర్మమే. ఈ యధర్మమునే

కోడుబిల్లును ప్రతిపాదించు వారు ధర్మమని భావించుచున్నారు.

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా |
సర్వార్ధాన్ విపరీతాంశ్చ బుద్ధి స్పాపార్థ తామసీ ॥
                                       (గీత 18-82)

అందఱను ఏకసూత్రమున బంధించునది యని చెప్ప బడుచున్న యీబిల్లునం దెచటను ధర్మశబ్దమునకు బరిభాష చెప్పబడ లేదు. 'హిందూ' శబ్దమునకు మాత్రము పరిభాష చెప్పబడినది. కాని యానిర్ణయమే ధర్మమును బొందకుండ జేయబడినది. మహమ్మదీయడు, క్రైస్తవుడు మున్నగువాని పరిభాషలకు వారి ధర్మగ్రంథములాధారములు. కాని హిందూ శబ్దమునకు పరిభాష వేఱొక నిషేధము నాధారముగ జేసు కొనియో లేక నసమంజసాధారమును గైకొనియో చేయ బడినది.

ఇందు 'హిందూధర్మముయొక్క యే స్వరూపమును, సంప్రదాయమును స్వీకరించువాడయినను హిందువుడనబడు' నని చెప్పబడినది. కాని యీశ్వరుడు, అస్తేయము, ధృతి మున్నగువానిని హిందువులు కానివారుకూడ స్వీకరింతురు గదా! అట్టియెడ నందఱు హిందువులేల గాజాలరు? ఒకయెడ 'హిందూ ధర్మముయొక్క. యేస్వరూపమును, సంప్రదాయమును గ్రహించినను మనుజుడు వీరశైవము, లింగాయతము, బ్రహ్మ సమాజము, ప్రార్థనాసమాజము, నార్యసమాజము - వీటిలో నేయొక దానికి సదన్యుడయ్యు హిందువు డనబడును.' అని చెప్పబడినది. కాని హిందూధర్మముయొక్కయు, సంప్రదాయము యొక్కయు బరిభాష, ప్రమాణము నావశ్యకము లయ్యు నవి యిందెచటను జర్చింపబడలేదు. కొంత ముందునకుబోయి బౌద్ధ, జైన, సిక్కు ధర్మముల నవలంబించువారు కూడ హిందువులే యని పరిగణించిరి. ఇది లక్షణవైరూప్య మన్నమాట, ఒకమారు హిందూ ధర్మానుయాయిని హిందు వనినారు. రెండవమారు సిక్కు, జైన, బౌద్ధ మతస్థులు కూడ హిందువులే అని యనినారు. సిక్కు మున్నగు 'మతస్థులు హిందువులని చెప్పబడినప్పుడు హిందూధర్మానుయాయిని సిక్కు మున్నగు మతస్థులుగా నేల బరిగణింపకూడదు? ఒకడు అన్యమతము నవలంబించినంత మాత్రమున నామతానుసారముగ నన్యశబ్దముచే వ్యవహరింపబడు చున్నాడు గదా! అట్టియెడ మహమ్మదీయ క్రైస్తవులు మాత్రము హిందూ పదవాచ్యు లేల కారు ? అట్టియెడ "హిందుస్తానీకోడుబిల్లు" అనుట చాలమంచిది. 'హిందూ' శబ్దమును ప్రయోగించి ప్రభుత్వము ఈ సాంప్రదాయకత్వపు పంకమున నేల జిక్కు కొనవలయును ?

ఉచితుడు, ననుచితుడు నెట్టివాడయ్యు నేబాలకుని తల్లిదండ్రులలో నొకరు హిందువులైయుందురో యాబాలకుడు కూడ హిందూశబ్దవాచ్యుడని చెప్పినారు. ఇది యొక విచిత్ర భాష తల్లి హిందువయిన మాత్రమున నాపె బాలకుడు కూడ హిందువు డనబడదగు ననినారు గదా ! తండ్రి యన్య జాతీయుడయిన నాతని బాలుడు కూడ నన్యజాతీయుడని యేల చెప్పబడ కూడదు? వాస్తవమున జాతియొక్క లెక్క యే లేదందురా? దానికి తావేల నియబడుచున్నది. ఏవస్తువున కైన ప్రమాణాధారముల యక్కఱ లేకయే ప్రభుత్వమునకు జెందినవారు, చెందనివారు నంగీకరించినంత మాత్రమున హిందుత్వము వచ్చివేయునా ?

ఇట్లే హిందూధర్మము నవలంబించువాడు హిందువు డనబడు ననినారు. కాని హిందూ ధర్మముయొక్క పరిభాషను కాని వాని ప్రమాణమునుగాని, ధర్మము నవలంబింపదగు పద్ధతినిగాని నిరూపించి యుండ లేదు. ఇందుమూలమున నీ కోడుబిల్లు అపూర్ణమైనదనియు, దీని నిర్మాతలు విశేషజ్ఞులు కారనియు దేటతెల్లమైనది. దీని ఫలిత మెటులుండుననగా నెవండైన దన తోచిన పట్టున నేను హిందూమతము ‘నవలంబించినాను' అనుటతోడనే హిందువులలో బరిగణింపబడ నారంభించును.ఈవిధముగగాని గొన్ని తరములనుండి యహిందువుడుగా వచ్చుచుండు వ్యక్తి కూడ నొక్క క్షణమందు హిందూధర్మము నవలంబించి, హిందువై యేహిందుకోటీశ్వరుని యాస్తికో యజమానియై మఱల నహిందువుడు కాగలడు.

కోడుబిల్లులో మున్ముందు 'ఎవండైన దనను హిందువు డని యనుకొనినను లేక ఘోషణ జేసినను హిందువుడనియే భావింపబడు ' నని కూడ జెప్పబడియున్నది. కాని యిపుడా యంశము తీసివేయబడినది. వాస్తవమందు శాస్త్రములను గాని ధర్మములనుగాని, జాతి వర్ణవిభేదమునుగాని యంగీక రింప నెంచుకొ ననివారల కీపటాటోప మంతయు నెందులకు ? వారు స్వయముగ నహిందువులు గదా ! హిందూధర్మము . పేరట బిల్లులను తయారు చేయుటకు వారికెట్టి యధికార మున్నది?

అంతమందు మఱల నానిషేధాత్మక పరిభాషనే యిచ్చినారు, ఏమనియనగా,"మహమ్మదీయుడుగాని, క్రైస్త వుడు కాని, పారసీకుడు కాని, యహూదుకాని కానివాడు కూడ హిందువుడనియే యనబడును." దీనిని బట్టి యందఱకు నొక పరిభాష యాధారము కలదనియు, హిందువులకే నిర్మాతల దృష్టిలో పెట్టి పరిభాషయు, నాధారము లేదనియు వ్యక్త మగుటలేదా ? వాస్తవమందీలజ్జావిహీన హిందువులు కూడ నొక హిందువులేనా ? హిందూకోడును నిర్మించుటకు వీరికధికార మేమయిన నుండవచ్చునా ? అంతమున 'నొకడు హిందూధర్మమునకు, జాతికి జెందనివాడయ్యు, హిందూ కోడు ద్వారా శాసింపబడినంత మాత్రమున నాతడు కూడ హిందువుడుగ దలపబడును' అను పరిభాష కూడ నీయబడి నది, ఇదియు నెక విచిత్రపరిభాషయే. ఇందుగల అవ్యాప్తి, అతివ్యాప్తి, అసంభవత, మున్నగు దోషములు వారికి గోచరించనేలేదు కాబోలును. బుఱ్ఱకు తట్టిన దేదియో వ్రాసి పెట్టి నటులున్నది. యథార్థమందు 'హిందూ లా ' మొదట హిందూధర్మశాస్త్రముల ననుసరించి రచింపబడినది. అందు చేతనే యా హిందూధర్మ శాస్త్రానుసారము శాసింపబడు వాడు హిందువు డనబడుచుండెడివాడు. కాని నేడో హిందూ కోడుబిలు హిందూ శాస్త్రములకు బూర్తిగా వ్యతిరిక్తముగ నడచినది కదా ! అట్టియెడ హిందూలా ప్రకారము శాసింపబడువారు నేడు హిందువులని యెట్లు చెప్పబడుదురు! అనగా నిచట నన్యోన్యాశ్రయ దోషము కూడ పట్టినదన్నమాట. హిందూశబ్ద పరిభాష నిశ్చితమయితే హిందూకోడును నిశ్చితమగును? హిందూకోడు నిశ్చితమయిన తద్వారా శాసింపబడువాడు హిందువు డనబడును. వాస్తవమున జాతివర్ణములతో నిమిత్తము లేక బెండ్లి చేసుకొనగోరువారు "స్పెషలు మేరేజి యాక్టు" ప్రకారము తా మహిందువులమని చెప్పుకొనవలసియుండును. అట్లు చెప్పుకొన నక్కఱయు లేకుండవలె. హిందువులైయుండి స్వేచ్ఛాచరణమునకు నుద్యతులు కావలె. - నిదియే యీ బిల్లు యొక్క యుద్దేశ్యము. కనుకనే పై యాక్టు ప్రకారము పెండ్లి చేసుకొన్న వారు కూడ హిందూకోడు చేతనే శాసింపబడుదురు ' అని కూడ చెప్పబడినది హిందూకోడు పేసయిన పిమ్మట దీనిద్వారానే అట్లు చేయుట కవకాశ మీయబడగలదు. అందుచేతనే బుద్ధిమంతులగు జను లీబిల్లు ద్వారా వేశ్యాస్త్రీని పరమసాధ్వీలలామ యగు గులీన స్త్రీతో సమానముగ నుంతుమని చెప్పుచున్నారు. ఈకోడులో చెప్పబడిన పరిభాష ప్రకారము ఏ విజాతీయుడైనను కన్యాలోభము చేత గాని, ధనలోభముచేత గాని నిమిషములలోపల హిందూ ధర్మము నవలంబించి తన మనోరథ మీడేర్చుకొని తన మొదటి మతములోనికి తిరిగి పోవచ్చును. ఇందు దీని కభ్యంతరమేమియు లేదు. ఇట్లు ఇతర మతస్థులకు హిందువులమీద దాడి చేయుట కవకాశము చిక్కును. హిందూకోడుబిల్లును నిర్మించువారి యొక్కయు, స్వీకరించువారి యొక్కయు, మూర్ఖత్వకారణముగా నన్యమతస్థుల సంఖ్యయు, సంపదయు బెరిగి పోవును. శాస్త్రవిరుద్ధములగు నాచార వ్యవహారము లన్నియు బరిత్యజించవలసినవే. కాని శాస్త్రవిరుద్ధమగు హిందూకోడు మాత్రము ఏనాటికి శాస్త్రపదవిని బొందనేరదు సరి కదా ! అనాదినుండి వచ్చుచుండు నాచారవ్యవహారము లకు అభ్యంతరము కలుగును.

ఈ కోడుబిల్లు అమలుజరుగ మొదలిడిననాటినుండి పూర్వపుశాసనము రద్దగుటయు, ఇది భారత దేశమందంతటను వ్యవహరింపబడుటయు జరుగును. ఈ దృష్టి చేత నీ బిల్లు భారతదేశమునకు బయట జెల్లనేరదు. ఫలరూపకముగ నచటి (విదేశములందున్న) భారతీయులందఱియెడను విదేశ శాసన క్రమమే నిర్వహించబడును. ఒక యాంగ్లేయు డెచటనైన మృతిబొందిన నాతని సంస్కార దాయభాగాదులన్నియు నాంగ్లేయ శాసనప్రకారముగ జరుగుటయు, హిందువు డొక డెచటనైన జనిపోయిన నీతని సంస్కారదాయభాగాదు లాదేశ శాసన ప్రకారముగ జరుగుటయు నెంత శోచనీయవిషయము ! నిజముగ నీబీల్లు దేశము నాధారముగ జేసుకొని చేయబడినది, కాని యొక వ్యక్తినిగాని, జాతినిగాని యాధారముగ జేసుకొని చేయబడలేదు.

“హైకోర్టులయొక్కయు, ప్రీవీకౌన్సిలుల యొక్కయు నిర్ణయములందు వ్యాప్తి జెంది యేయే హిందూ శాసనము లయితే సాధారణజనుల కాశ్చర్యమునుగొల్పుచు దావాలను, కేసులను పెంపొందించుచున్నవో వాటినన్నిటి నొక క్రమస్థితికి దెచ్చుటే హిందూకోడు యొక్క లక్ష్యము” అని చెప్పబడినది. అనగా హిందూలానంతను స్పష్టముగను, సకలసుబోధము గను, ఏకరూపముగను జేయుటయు, దావాలను కేసులను నిరోధించుటయు హిందూకోడు యొక్క ఉద్దేశ్యము. కాని యీ బిల్లుమూలమున కేసులు దావాలు నెంత యధికమయి పోవునో మందుముందు పాఠకులకే తెలియగలదు. సోదరు నకు, సోదరికి సమానభాగము నిచ్చుటమూలముగను తండ్రికి విల్లు వ్రాయు నధికారమును వ్యవస్థ చేయటచేతను కేవల యొక్క యన్నచెల్లెండ్ర కేకాక తండ్రి కూతుళ్ళకు కూడ తగ వులు వచ్చి కేసులు దావాలు వృద్ధిపొందును. ప్రతి గృహమందు కన్య యొక్క యత్తగారుగాని, అద్దెవాండ్రు కాని అందలి కొంతభాగమును కొనుక్కొన్న యన్యజాతివ్యక్తులు గాని నివసించుటచేత నెంతెంతటి సంఘర్షణములు బయలు దేరునో , ఎన్ని కేసులు జరుగునో ప్రతివ్యక్తియు సులభముగ గ్రహించవచ్చును. అట్లే విభాజనముల మూలమునను, మృత్యుకరసంబంధముగను జరుగు కేసుల కంతముండదు. సంపదా నశించును, వివాహపు గిజిస్ట్రేషనులకును, విడాకుల చట్టము నిమిత్తముగను హైకోర్టులవరకు బోవలసివచ్చును.

బిల్లునుండి 'మితాక్షరా’ 'దాయభాగము' నను భేద మును దీసివైచి శాసనమునంతను ఏకరూపమును బొందించు టకు బ్రయత్నించిరి. 'మితాక్షరా'ను బట్టి హిందువునియాస్తి వ్యక్తిగతముకాక పైతృకమైయుండును. తండ్రి, కుమారులు, మనుమలు, ముని మనుమలుకూడ దానిని పంచుకొనదగువారు ఆస్తియందు వ్యక్తులకు జన్మసిద్ధమయిన యధికారముండును. పైతృకసంపత్తును బంచుకొనదగు వాడెవడైన జనిపోయిన నాతని సంపద మిగతబ్రతికియున్న భాగస్థులకు జెందిపోవును. కాని బిల్లుయొక్క దాయభాగ సిద్ధాంతమును బట్టి వారసుని యాస్తి యాతనికి వ్యక్తిగతమైయుండును. అనగా నాతని కాయాస్తి యందు దానవిక్రయసత్తాధికారములు సంపూర్ణ ముగ నుండును.'లోకమాన్య తిలకు మహాశయుడు “న్వరా జ్యము మా జన్మహక్కు" అని ఘోషించగా, కాంగ్రెసు వాదు లందఱు దానిని మఱింత పెచ్చరిల్ల జేసిరి. కాని హిందువులు 'మా సంపదలో మాకు జన్మసిద్ధాధికార మున్నది' అనినపుడు వీరి యీ సిద్ధాంతమును బూర్తిగ నణగ ద్రొక్క ప్రయత్నించుచున్నారు. ఆస్తికి శాసనమూలమున నొక వ్యక్తి యేప్పుడయితే వారసుడగుమో, యప్పుడే మృత్యు కరపరిస్థితియు దటస్థించును. ఇందు మూలముననే సమ్మిలిత కుటుంబముల రివాజు నశించును. ఆస్తులు విభజింపబడి పోవును. అందు ప్రభుత్వమునకు గూడ భాగ మేర్పడును.

పూర్వ మాస్తిని మగపిల్లలే పంచుకొనెడివారు. ఇపు డాడపిల్లలుకూడ బంచుకొందురు. ఈ విధముగ భర్తృకుటుంబము యొక్కయు, పితృకుటుంబము యొక్కయు నాస్తులన్నియు నెన్ని భాగములైన సంతయధికముగా ప్రభుత్వము వారికి మృత్యుకరము ముట్టును. కుటుంబ మందలి యే వ్యక్తియు దగు లాభమును బొందనేరడు. కాని ప్రభుత్వము నకు మాత్ర మధిక లాభమున్నది. ఒకయెడ తండ్రి యాస్తి యందు ఆడపిల్లల కధికారము జూపుటయు, వేఱొక యెడ తండ్రికి విల్లు వ్రాయు నధికార మీయబడుటయు జూడగా నెంత యాశ్చర్యముగమో యున్నది. అనగా, తండ్రియాస్తి నాడపిల్లలకీయ దలంపనియెడల గొడుకుల పేర విల్లువ్రాసి యిచ్చి వేయవచ్చునట. ఇట్లు వీలుకాగితము వ్రాసిన తండ్రి కూతుళ్ల విరోధము, వ్రాయకున్న తండ్రి కుమారులకు విరో ధము. మఱియు నన్న చెల్లెండ్రకు కలహము.

ఇటు లెపుడయితే శాస్త్రధర్మముల విశ్వాసమడుగంటునో, అపుడర్దకామములే ప్రధానములగును. ఇక నాస్తుల యందలి కాంక్షలమూలమున నాడుబిడ్డల హత్యలు పెరిగి పోవును. ఏతత్సంబంధమగు నీర్ష్యలమూలమున నాడు బిడ్డలు తమ తండ్రులకు, సోదరులకు విషము నీయవచ్చును. తోడనే తల్లి యొక్కతే తప్ప మిగిలిన స్త్రీలందఱు వివాహార్హులే అను మహమ్మదీయాచారప్రకారముగ నాస్తులందలి కాంక్షల కొలది హిందువులలో గూడ నన్న చెల్లెండ్ర పెండ్లిడ్లు సంభవించును. శాస్త్రధర్మములందు విశ్వాస మేర్పడుట కష్టముకొని యంతరించుట కఠినము కాదు. సగోత్రవివాహము, నసవర్ణ వివాహము బ్రచలితమైనతోడనే రానురాను అన్న చెల్లెండ్ర పెండ్లిండ్లయందుకూడ నభిరుచి మెండుగును. ఎప్పటికైన శాస్త్రధర్మ విశ్వానమే ప్రజలను నీచాతినీచ ప్రవృత్తుల బడకుండ గాచునది. పై విశ్వాస మంతరించుటతోడనే ప్రజలను సవరించుట కఠినమేకాక నసంభవమయిపోవును. అన్నిటి కంటె నత్యాశ్చర్యజనకమగు విషయమేది యంటే ప్రస్తుత బిల్లు ప్రతిపాదకులు ఒకయెడ “దాయభాగమునకు, ధర్మమునకు సంబంధ మేమి? ఇది లౌకిక విషయముకదా!" అని పల్కుచు శాస్త్రముల నించుకంతయైన లెక్క చేయక నిష్టము వచ్చినరీతిని నవీనదాయభాగ విధానమును ఏర్పరచుచున్నారు. వారే వేఱొకయెడ కన్యకు పైతృకసంపదయం దధికారము కలదని నిరూపించుటకునై మను, యాజ్ఞవల్క్యులు రచించిన

 "స్వేభ్యోంశేభ్యస్తు కన్యాభ్యః ప్రదద్యుర్భ్రాతరః పృథక్ |
  స్వాత్స్వాదంశాచ్చతుర్భాగం పతితాః స్యురదిత్సవః॥"
                                   (మను - 9 - 118)

ఇత్యాది వచనములు నాధారముగ దీసుకొని 'కన్యకు భాగమీయని సోదరుడు పాపి, పతితుడు సగు'నని చెప్పు చున్నారు. 'అవివాహితయగు కన్యయే తండ్రి యాస్తియందు భాగమును బొందనర్హురాలు' అని శాస్త్రములు చెప్పుచున్నవి. కాని యీబిల్లు వివాహిత, అవివాహిత ఇద్దఱు కన్యలకు గూడ తండ్రి యాస్తి యం దధికారము కలదని చెప్పు చున్నది.

'దేవాలయప్రవేశము, వివాహము, విడాకులచట్టము, వారసత్వము మొదలగునవి రాజ నైతిక విషయములు నమాజమునకు చెందినవి. వాటికి ధర్మముతోడ సంబంధము లేదు' అని నేటిజనులు కొందఱందురు. వివాహ, మందిర ప్రవేశాదులే ధర్మమునకు జెందినవి కానిచో నిక ధార్మిక మయినదేదియో నిశ్చయించుటయే కష్టము. ఆలయములు, అందలి విగ్రహములే ధార్మికములు కానిచో బజారులో విక్రయింపనున్న విగ్రహములను జూచియే సంతసింప వల యును. వివాహము ధర్మమే కానియెడల తండ్రీ కూతుళ్లకు నన్నచెల్లెండ్రకు బెండ్లిండు జరుగవలసినదే. కాని దేవాలయ ప్రవేశమునకు బ్రోత్సాహ మిచ్చుచున్న ప్రస్తుత బిల్లు ప్రతి పాదకు లీవిషయము నేలకో యంగీకరించుట లేదు. వాస్తవ మందు మహమ్మదీయాది మతములవలె ధర్మాధర్మ నిర్ణయ మును శాస్త్రములైన జేయవలె. లేక ధర్మాచార్యులైన జేయవలె. అంతియకాని 'మాకు సంప్రదాయములతో బని లేదు' అని చెప్పుకొను నీప్రభుత్వ మింత ప్రపంచమును విస్తరింపజేసి యీ సాంప్రదాయికపు బంకమున నేల జిక్కుకొన వలయును? ప్రభుత్వమువారు వేదాది శాస్త్రములను, ధర్మ శాస్త్రములను బట్టి హిందువులను ధర్మనిర్ణయము జేసుకొన నీయవలయును. ఆ శాస్త్రముల బట్టి ప్రస్తుత హిందూకోడు మున్నగునవి, ధర్మముమీద దాడి చేయుచున్నవనుమాట నిక్కము.

ఒకప్పుడు డాక్టరు అంబేడ్కరు 'ఏకపత్ని విధానము నమస్త ప్రపంచేతిహాసమునను గలదు' అని పలుకగా నొక మహాశయుడు 'మహమ్మదీయలా ' విషయమున దమయాశయ మేమని ప్రశ్నించెను. తోడనే వారు 'మహమ్మదీయమతమందెన్ని పెండ్లిండ్లయినను చేసుకొనవచ్చును, తప్పులేదు' అని సెలవిచ్చి తప్పుకొన్నారు. సారాంశ మేమియనగా ముసల్మా నుల విషయమున నేదేని బిల్లు నిర్మించుటకు శ్రీ డాక్టరు మహాశయులకు శక్తి చాలదన్న మాట.

ఈ కోడుయొక్క పరిభాష లన్నియు శాస్త్రసీమల నుల్లంఘించునవియే. ఇందు 'సపిండ' శబ్దమునకు శాస్త్ర విరుద్ధమగు పరిభాష చెప్పబడినది. సపిండత్వమయిదు లేక నేడేండ్ల వరకు నుండునని శాస్త్రము లంగీకరించగా బిల్లువారు మూడు లేక నయిదేండ్లవరకు మాత్రమే యుండునని యంగీకరించి నారు. దత్తుని (పెంచుకొనబడినవాడు) విషయమునను, అంతర్జాతీయకన్యక యొక్క సంతానమువిషయము ననుఇంకను నిట్టి శాస్త్రవచనములు చాల గలవు. బిల్లులో శాస్త్రములను ప్రమాణముగ దీసుకొన్నప్పుడు సగోత్రవివాహము ఏల నిషేధింపబడ లేదు. అట్లు ప్రమాణముగ దీసికొన మందురా? అన్న చెల్లెండ్రయొక్కయు, పినతండ్రి సోదర పుత్రికల యొక్కయు, మేనత్తా సోదర పుత్రుల యొక్కయు, లేదా యిరువురు సోదరుల యొక్కయు, సోదరీమణుల యొక్కయు సంతతుల యొక్క వివాహములేల నిరోధింపబడవలయును! దీనికి స్థిరప్రమాణ మెయ్యది?

వర్తమానలోక దృష్టిచేతను గూడ ధర్మవిషయమున నొక బిల్లును నిర్మింప నొకరికెట్టి యధికారమును లేదు. భారతీయ ప్రభుత్వము ధార్మిక స్వాతంత్య్రమును స్వీకరింపను స్వీకరించినది. మహమ్మదీయ, క్రైస్తవులయెడ పాటింపను బాటించినది. కాని యీ యంతర్రాష్ట్రీయ నియమములకు, రాష్ట్రీయ నియమములకు విరుద్ధముగ నొక్క హిందూధర్మమందే జోక్యమును కలుగజేసుకొని మందిర ప్రవేశము, హిందూకోడు మొదలగు బిల్లులను ప్యాసు చేసి శాసనము చేయ నెంచుచున్నది. స్వతంత్రభారతము పేరటను, అఖండభారత దేశము పేరటను వర్తమాన ధారాసభ (బిల్లు లను ప్యాసుచేయు కమిటీ) ఎన్నుకొనబడినది. ఈ యెన్నుకొనబడిన ధారాసభ ధర్మవిరుద్ధములగు బిల్లులను ధార్మిక, సామాజిక రంగములందు విప్లవమును జెలరేగజేయు బిల్లు లనుదయారుచేసి ధర్మమును సమగ్రముగ నంత మొందించు నని ప్రజ లనుకొని యుండలేదు. కనుక నిట్టి బిల్లులను ఏర్పరచు నధికార మీ ధారాసభ కెంతమాత్రమును లేదు.

ఇంతియ గాక స్వతంత్రత లభించిన పిమ్మట చాల దేశీయరాజ్యములు భారతసంఘమునందు సమ్మిలితముగావింప బడిపోయినవి. వారియెడగూడ నీబిల్లులు చెల్లగలవు. కాని యీరాజ్యములలోని ప్రజలచే నెన్నుకొనబడిన ప్రతినిధి యెవ్వడును ప్రస్తుత ధారాసభలో గాన్పింపడు. కావున నీ ధారాసభచే నిర్మింపబడిన బిల్లుల నీరాజ్యములందు బలవం తముగ వ్యవహరింపజేయుట ఎంతయు నన్యాయము.

కోడుయందు గ్రహింపబడిన విడాకుల చట్టము దానికి గల కారణములు గూడ శాస్త్రవిరుద్ధములు. అసంగతములు. విమనస్కతను వ్యాపింపజేయునవి. విడాకుల చట్టము నిమిత్త ముగ రెండు సంవత్సరములవరకు విడచిపెట్టి యుండుటను గానికి బలాత్కరించుట మూలమున భీతి చెందుటనుగాని, రోగ, వ్యభిచార, ఉన్మాదాదులను నిరూపించుటకు నై యెన్నేని లేనిపోని కుట్రలు, పన్నాగములు బయలుదేర గలవు, కోర్టులో భార్యాభర్త లొండొరుల వ్యభిచార దోషములను నిరూపించుకొన మొదలిడుదురు. ఈదృశ్య మెంత యసహ్యకరమైనది ? నేటివరకు నెంతటి భయంకర పరిస్థితి యేర్పడినను, పెద్ద క్లిష్టపరిస్థితిలో కూడ నొకరు తోడ్పడినసు, తోడ్పడకున్నను భార్యాభర్త లొకరి నొకరు విడచి పెట్టుట లేదు. కాని యికముందు భయంకర జబ్బు పరిస్థితిలో నొకరి నొకరు విడచి పెట్ట బ్రయత్నింతురు. వాస్తవమున శాస్త్ర సమ్మతమగు వివాహమును జెరుపదగు నధికారము కోర్టునకు లేదు. విక్రయ, పరిత్యాగముల మూలమున గూడ భార్య భర్తనుండి వేఱు కాజాలదని శాస్త్రములు ఘోషించుచుండగా కోడుబిల్లువారు 'వివాహ మేయే యితర పద్ధతుల మీద నుచితమయ్యు వధూపక్షమువారు, వరపక్షమువారు సమాన గోత్ర ప్రవరలు కలవారయిన కారణము చేతను, వేర్వేరు జాతులకు గాని, సమానజాతినుండి విడిపోయిన యుపజాతికి చెందిన వారయిన కారణముచేతను, అనుచితము మాత్రము కాదని ఘోషించుచున్నారు. దీనిని బట్టి యీ హిందూకోడు హిందూధర్మము నెంతవరకు రక్షించగలదో దాని గుట్టు బాగుగ బట్టబయలైనది.

'కోడుబిల్లు ఒక భార్య జీవించియుండగా భర్త రెండవ పెండ్లి చేసుకొన వీలులేదని శాసించుచున్నది. నేటివరకు భార్య యనుమతిమీద సంతానాపేక్షతో బురుషుడు రెండవ పెండ్లి చేసుకొనుట కెట్టియాటంకము లేకుండయున్నది. కాని యికముందు భార్యయనుమతించినను విడాకుల రిజిస్ట్రేషను చేసుకొననిదే రెండవ వివాహము చేసుకొనిన పురుషుడు శిక్షాపాత్రుడు కాగలడు. ఈవిధముగ విడాకుల చట్టమైనా ప్రచారములోనికి రాగలదు. లేదా భార్యాభర్త లిఱువురు విడాకుల చట్టమునుగోరి సంతానాపేక్ష చేత ముస్లిముమతమును స్వీకరించి రెండవ పెండ్లి చేసుకొనియైనా సంతానసుఖ మనుభవించెదరు. రెండవ పెండ్లి కాకపోదు. విడాకుల చట్టప్రకారము రిజిస్ట్రేషను చేసుకొనినగాని ద్వితీయవివాహము జరుగదు. రెండవ పెండ్లిని నిరోధించుటకునై సంయమముగా నుండవలయునని ప్రబోధింపబడుచుండెడిది. కాని యిప్పుడు విడాకుల నిర్మాణము,పెండ్లి రెండును సంయమము నుల్లంఘించమనియే ప్రోత్సహించు చున్నవి. ఇందు శాస్త్రవిరోధము సుస్పష్టమగుచునే యున్నది.

ఈబిల్లు ఆమోదింపబడిన మీదట పితృపితామహాదులు చేసిన ఋణములను తీర్పవలసిన బాధ్యత పుత్రపౌత్రుల కెవ్వ రికి నుండదు. ఇది కూడ చాలశాస్త్ర విరుద్ధము, నేటి వరకు తండ్రి విషయమున మిగిలియున్న లౌకిక పారలౌకిక కృత్యములను బూర్తి చేసి పితృఋణమును దీర్చుకొనుట పుత్రునకు కర్తవ్యమై యున్నది. ఈ పద్ధతి బిల్లుమూలమునతప్పక సమాప్తి చెందగలదు.

వర్ణ వ్యవస్థకాని, జాతి వ్యవస్థకానీ పనికిరాదనియు, ఒకే జాతి యుండవలయుననియు, జాతి భేదములతో నిమిత్తము లేకుండ నందఱలోను వివాహ ఆహార సంబంధ మేర్పడవలయు మనియు గొందఱితలంపు. మఱియు నివ్విషయమున హిందూ కోడు బిల్లు మహెూపకారము చేయున్నదని తలచి వారు దానికెక్కువ దోహద మిచ్చుచున్నారు . కాని సిద్ధాంతమేమి యనగా ఈ ప్రపంచకమే త్రిగుణాత్మకము. గుణముల వైషమ్య మూలము: సృష్టియు, సమత్వమూలమున ప్రలయమును జరుగు చుండును. కనుక నెన్నిచోట్లనో వైలక్షణ్యమునకు ప్రమాణములు కన్పడుచున్నవి. వైలక్షణ్యము కన్పడని చోట్ల 'విశేషము' అనుపేరుగల పదార్థముద్వారా వైలక్షణ్యము గోచరించుచున్నది. గుఱ్ఱము, గోవు మున్నగు పశువులలోను, మామిడి చెట్టు మొదలగు జాతులలోను గన్పడు విచిత్రతను బట్టి చూడ ప్రపంచమున జాతులు, నుప జాతులు కలవనియే గోచరించును. ఇక నాజాతిభేదము మనుజులలో నున్న హానియేమి? వేదములందు కూడ అశ్వము, అర్వ, వాజి యను నశ్వజాతివర్ణన మున్నది. ఇట్లే వేదము లందు బ్రాహ్మణ క్షత్రియాది జాతులనేకములు వర్ణించబడి యున్నవి. వారి వారి కర్మలు కూడ వేరువేరుగ జెప్పబడి యున్నవి. వాటి నుపేక్షించిన శాస్త్రద్రోహము చేసినట్లే.

వివాహ ఆహార సంబంధమువలన జనులలో పరస్పర ప్రేమ, సంఘటనము పొసగుననుకొనుట వట్టి భ్రాంతి. ఆధునిక 'రష్యనులలోను, అమెరికనులలోను వివాహ ఆహార విచారణ ఏమియు జేయబడదు. అయినను వారిలో సద్భావము లేని కారణమున సంఘర్షము జరుగుచునే యుండును. కుక్కలలో 'నిది నాపుత్రిక, ఇది ఒరుని యాహారము లేక ఈ యాహారమును మనము తాకకూడదు' అను విచారములుండవు. అయినను వాటియందు భయంకర సంఘర్షము జరుగుచునే యుండును. కావున నాచార విచారములందు భేదమున్నను సద్భుద్ధి, సద్భావనలద్వారా సంఘీభావమును, ఐకమత్యమును స్థాపించవీలగును, పలువురు సైనికులు పలురకముల శస్త్రాస్త్రములతో పలువిధముల యుద్ధములు చేయుదురు. వారి వారి స్థానములు కూడ వేరువేరుగ నుండును. అయినను వారి లక్ష్య మొక్కటి యగుటచే వారిలో తప్పక సంఘటనముండియే తీరును. అట్లే శాస్త్రమర్యాదలను బట్టి యాచార విచారము అందు భేదమున్నను, సద్భావన ద్వారా ఐకమత్యము సమ కూడగలదు.

హిందువుల యొక్క యవాంతరజాతులు నశించిపోయి నను మహమ్మదీయాది జాతులుండనే యుండును. వాటితోడ గూడ మైత్రి పొనగవలసిందే కదా! బుద్ధిమంతులు, స్వధర్మ పరాయణులు, విశ్వసనీయులు నగు హిందూ మహమ్మదీయు లలో నైకమత్యము పొసగిన పొసగవచ్చును. కాని బిల్లును బట్టి శాస్త్రధర్మ విశ్వాసము లేక, స్వధర్మపరాయణత లేక, నొక విధమగు విశ్వాసము లేకయు నుండు హిందువులలో పారస్పరికముగ నైకమత్యము కుదురు టసంభవమై పోవును. తండ్రీకొడుకులకు, అన్న చెల్లెండ్రకు, భార్యాభర్తలకు కేసులు దావాలు మొదలగునవి బయలు దేరుటే యీ బిల్లు యొక్క ముఖ్య ఫలితము. హిందూకోడును ప్రజలు కోరుతున్నారని చెప్పబడు చున్నది. కాని యది వాస్తవము కాదు. దాని నెవ్వరును గోరుటయు లేదు. 'హిందూలా' కమిటీవారు దేశమందలి యన్ని ప్రాంతములందు బర్యటన చేసి యనేక సంస్థలను, ఆచార్యులను, విద్వాంసులను జడ్జీలను సాక్షులుగా బెట్టుకొని చాలమంది జనులీబిల్లు నామోదించనివారు ఉన్నారు' అని స్పష్టీకరించినారు. పట్నా హైకోర్టుజడ్జిగారు శ్రీద్వారకానాధ మిశ్ర గారు 'ఈ బిల్లును కోరువారును లేరు. దీని యవసరమును లేద'ని నొక్కి వక్కాణించియున్నారు.

వర్తమాన ధారాసభకు హిందూకోడువంటి బిల్లుల దయారుచేయునధికారము కలదనియు, విధానముల (రూల్స్ . నియమములు) వంటి మహత్త్వపూర్ణ వస్తువులను దయారు చేయు నధికారముండగా నాసభ హిందూకోడువంటి యుపయోగకారి యగు వస్తువు నేల నిర్మించకూడదు?' అని చెప్ప బడుచున్నది. కాని యీ చెప్పుటెంతయు నసమంజసముగ నున్నది. విధాన నిర్మాణార్థమై యీసభ యేర్పరుపబడినది.. అది విధాననిర్మాణము సేయవచ్చును. కాని హిందూకోడు ద్వారా ధార్మిక విప్లవమును జెలరేగజేసి ధర్మము విషయ ములో జోక్యము కలుగజేసికొనుట కెట్టి యధి కారమును లేదు. డాక్టరు కైలాసనాధకాటజూ,శ్రీకన్హయ్యాలాల్ మాణికలాల్ ముంశీ, శ్రీ పట్టాభిసీతారామయ్య, శ్రీ అనంతశయనం అయ్యంగారు, డాక్టరు రాజేంద్రప్రసాదు వంటి విద్వాంసులు హిందూకోడువంటి వస్తువును దయారు చేయుటకు ధారాసభ కెట్టి యధికారమును లేదు' అని స్పష్టీకరించినారు.

లోకతంత్ర దృష్టిచే కొలది జనుల యాలోచనలను బహుసంఖ్యక జనుల నెత్తిన బడవేయు టెంతయు నసమంజసము. దేశములో నూటికి తొమ్మండుగురు హిందువులు వోటు చేయగా ధారాసభ యేర్పడినది. దేశీయ రాజ్యము లందలి ప్రజలచే నెన్నుకొనబడిన ప్రతినిధి యొక్కడును ఇందులేడు. అట్టియెడ నీ ధారాసభచే నిర్మింపబడిన బిల్లు హిందూదేశమం దంతటను ఎట్లు చెల్లును లోకమత సంగ్రహణముచేయు కమిటీవారు కూడ "జనులు హిందూకోడుకు వ్యతిరిక్తముగ నున్నారు' అని స్పష్టీకరించియే యున్నారు కదా! అట్టి స్థితిలో పట్టిన పట్టును విడువనని కూర్చొనుట ఈ ధారానభ కేమి సముచితముగా నున్నది?

కొంతమంది జనులిటు లందురు "నేడు స్త్రీలయె డ జాల యన్యాయము జరుగుచున్నది. విధవా స్త్రీల దుర్గతి చెప్పనలవి కాకయున్నది. దత్తుని తల్లి యనుభవించుపాట్ల కంతము లేకున్నయది. భర్తలుకల స్త్రీలు కూడ తను భర్తల వలన నెన్నియో పాట్లకు లోనగుచున్నారు. లక్షలాదిరూపా యలను గడించి మరణించినవాని భార్యకు ధర్మనిమిత్తము గను, తీర్థయాత్రల నిమిత్తముగను కావలయు ధనముమాట యెటులున్నను, సముచితమగు భోజనము బట్టకూడ లభిం చుటలేదు. ఒక్కొక్క స్త్రీ సంవత్సరమున కొక్క పంచి తోడను 10 లేక 20 రూపాయలతోడను కాలము గడపు కొనుచున్నది. పురుషులు వారియెడ నిష్టము వచ్చినటుల బ్రవర్తించు చున్నారు,” పైవిషయము లన్నియు నాపాత రమణీయముగనే యున్నవి. కాని అన్ని సమాజములందు స్త్రీ పురుషులలో మంచివారు, చెడ్డవారు నిరుతెగలవారు నుందురు. పురుషులలో మంచివారును ఉన్నారు. స్త్రీలలో చెడ్డవారు నున్నారు. దోష మొకేషక్షమున లేదు. దోష మెవరు చేసినను క్షమింప వీలు లేదు. వాటిని పోగొట్టుటకు బ్రయత్నింపవలసినదే. కాని దానికి ఉపాయము హిందూ కోడు బిల్లు మాత్రము కాదు. సామాజిక శాసనమువలననే యాదోషములను దూరము చేయవచ్చును. హిందూకోడు సదా ఆఫీసులలోనే ఉండునది. మానవుడు కోర్టులలో ప్రవేశించనంత వరకు అది యేమియు చేయజాలదు. మామూలుగా నిటువంటి శాసనములు కొన్ని నేడును గలవు! విధవా స్త్రీకి భర్తయాస్తి వనుభవించుటకు సంపూర్ణాధికారముండనే యున్నది. పతివ్రతయగు విధవా స్త్రీకి తన భర్త సంపత్తు ననుభవించుటకు పూర్తిగ నధికారమున్నది. పతి యేదేని యన్యాయ మొనర్చిన నేడును దండితుడు కాగలడు. తద్వారా భార్యకు పూర్తిగ భరణపోషణములు ప్రాప్తించగలవు, కాని ఇటు పైన ఆమె కోర్టునకు బోవనియెడల న్యాయమును బొంద లేదు. హిందూకోడు ప్యాసయిన మీదటను ఆమెకు న్యాయమ లభించదు.. నేడో కోర్టుకు బోయిన న్యాయము లభించుచునే యున్నది. శాస్త్రానుకూలములగు నేకార్యములందు ప్రవర్తిం చిన స్త్రీపురుషుల నైనను అన్యాయులని చెప్పుటెంతయు నన్యాయము. శాస్త్రము లందఱకు హితమును గోరునవి. వాటి నియమములకు లోబడి యుండుటయందే శ్రేయ మున్నది. సమాజమందలి చాలమంది స్త్రీపురుషులు వాటిని పాటించుటయందే యధిక గౌరవమును భావింతురు. అట్టిస్థితి యందే కొలదిజనుల యాలోచలను బట్టియో శాస్త్రమర్యాదల నుల్లంఘించుట మంచిపని కాదు. జలమువలె మానవు న కు నిమ్న ప్రదేశములలో బ్రవహించుట స్వభావము.

ఒక నియంత్రణము లేనిచో నా ప్రవహించుటంతయు వ్యర్థమగును, హానికరమగును. ఆ నియంత్రణముకూడ వేద ముల యొక్కయు, దూరమును జూడగల మహర్షుల యొక్కయు విధానముల నియంత్రణమే మేలైనది. 'కర్తవ్య నిష్ఠముందు అధికారవాంఛ లెక్కింపబడదగినది కాదు' అను విషయము నందఱు సమ్మతింతురు, సతీత్వము, వైధవ్య పాలనము, తపస్సు, మాతృత్వము, ఆదర్శపత్నీత్వము వలన గలుగు గౌరవము సర్వోత్కృష్టమైనది. వీటిని బాటించుటచే శక్తిసామర్థ్యములు తగ్గవు. దినదిన ప్రవర్థమానములు కాగలవు. వీటి మహిమమూలముగ భారతనారి ప్రపంచమందలి స్త్రీలందఱియందు నాదర్శకారిగ బరిగణింపబడుచు వచ్చుచున్నది.. ధనసంపదలనే కాదు. ఆమే దేవతలను కూడ వశమొనర్చు కొన గలదు. కాలమును కూడ ధిక్కరించగలదు. పతి పుత్రా దులను మృత్యుముఖమునుండి బయటకు గొని రాగలదు. ఈవిషయములతోడ స్త్రీకి సంబంధము లేకుండ జేయగోరు వారు పూర్తిగా ధర్మమును, శాస్త్రమర్యాదలను ఉల్లంఘించు చున్నారన్నమాట. కాని వారికి తమ యధికారవాంఛలను, వ్యసనములను, తత్ప్రేరితములగు దుష్కృ త్యములను ఒరుల నెత్తిని రుద్దుట కెట్టి యధికారమును లేదు. పురుషులు ననధికార ప్రయత్నములనుండి మఱలించుటయు, శాస్త్రముల ననుసరించియే స్త్రీలకు సర్వవిధసౌకర్యములు నేర్పరచుటయు శాసనము యొక్క ముఖ్యకర్తవ్యము. ఏయే లోటులను పూర్తిసేయుటకు, నేయే సౌకర్యములను సంపాదించుటకు హిందూకోడు అవసరమని తోచుచున్నదో, ఆయా విషయములను శాస్త్రానుకూల మార్గములను బట్టియే సాధించవచ్చును. 'ఈబిల్లుమూలముగ వ్యభిచారము, అనాచారములు వర్ణసాంకర్యము, కలహములు పెచ్చు పెరిగిపోవు' నను విషయమును హిందూకోడు సమర్థకులు కూడ యంగీకరించుచునే యున్నారు, కాని హిందూకోడుకు పూర్వమందు మాత్ర మీ విషయము లన్నియు లేవా? అని వారు వాదింతురు. ఈ విషయము అసత్యదురాచరణములను విడనాడవలసినదని శాసనము జేయుచు నా యసత్య దురాచరణము లంతకు బూర్వము మాత్రము లేవా? అని చెప్పునట్లున్నది.

వాస్తవమున యోగ్యమగు సమాజ నిర్మాణము చేయు టవసరము. కాని యది శాసనమువలన బొసగదు. శిక్షణ వలన బొనగును. ప్రస్తుతము జరుగుచున్న మలినోపన్యాన ములను, నాటకములను అరికట్టవలయును, సినిమాలను నిరో ధింపవలయును. దుష్ప్రకటనలు జరుగనీయ కూడదు. గ్రామ గ్రామమందు , ప్రతియగ్రహారమందు భారత రామాయణ కథలు జరుగవలయును. సత్సంగము జరుగ వలయును. ధర్మ, విశ్వాసములు నాధారముగ జేసుకొని గ్రామ పంచాయతీలు నెలకొల్పబడ వలయును. అవి గ్రామ మందలి ప్రతి కుటుంబమును దృష్టియం దుంచుకొనవలయును. అత్యాచారముల నిరోధింపవలయును. అత్యాచారమొనర్చు వానిని దండింప వలయును. ఆ దండనకూడ సామాజికము కావలయును. అప్పుడీ కుటుంబసమస్యలు పరిష్కారము కాగలవు. హిందూకోడు ఈరోగములనునివారించుటకు బదులుగ నాటిని మఱింత పెచ్చరిల్ల జేయును.

కొందఱు హిందూకోడు సమర్థకులతోడ నొడంబడికలకు బ్రయత్నించు చున్నారు. 'కొంత మేము ముందడుగును కొంత వారు వెనుకడుగును వేసినప్పుడు ఐకమత్యము కుదురును. హిందూకోడును కొంతవఱకు సవరించి గ్రహించ వచ్చును.' అని వీరి తలంపు. వీరి స్థితియు చాలా విచిత్రముగ నున్నది. వీరు ఆస్తికులును కారు. బాగు గోరువారును కారు. కేవలము కీర్తి నార్జించుటకును, నలుగుఱిలోను దమపేరుండు నట్లు చేసుకొనుటకును వీరు యత్నించుచున్నారు. వీరి పలుకు లాస్తికులకు నచ్చవు. దేశహితంకరులకు నచ్చవు, కేవల కలహములను దీసుకొని వచ్చుటకునై యిట్టి జయచందులు కార్యరంగము లోనికి గొని తేబడుచున్నారు. వాస్తవమున సనాతనమార్గమున బడిపోవు ఆస్తిక సోదరునికంటె మించిన శ్రేయఃకాముడు వేరొకడుండునా? ఉన్నాడా? శరీరమందలి

. రక్త మపరిశుద్ధమైన లేక జెడిపోయిన దానిని దీసివేయించు కొనుటకుగూడ నాతడు వెనుకడుగు వేయడు. ఏదేని యవయవము క్రుళ్ళిన లేక చికిత్సచేయ వీలులేనియెడల నతడా (ఆస్తికుడు) యవయవమును ఖండించి వేయించుకొనుటకు శంకింపడు. అవతారస్వరూపులు, మహర్షులు కూడ మార్పు చేయ వీలులేని ధర్మమును మార్పు ఎవ్వడు చేయును' అనునదే సమస్య. శత్రువు మన దోషరహితములగు శిరోహస్తాదులను దోష భూయిష్టములని చెప్పి ఖండింప నెంచినచో, మనము సహింతుమా? మన పవిత్ర రక్తమును దీసివేయించ బూనుకొనిన వాడు శ్రేయస్సును గోరువాఁ డెటులగును? ఆతఁడహితమును గోరువాడే. శత్రువే. అట్టి వానితోడ నొడంబడిక లేమిటికి? అనాది సిద్ధములు, నపౌరుషేయములు, పరమకల్యాణ కారణములు, శాస్త్ర సమ్మతములు, వేదానురూపములునగు వ్యవస్థ లకు వ్యతిరిక్తముగ జరుగుచున్న కార్యక్రమము గుఱించి యొడంబడిక లెట్లు పొసగును? ప్రస్తుత హిందూకోడుబిల్లును ఆంగ్లేయ శాసనకాలముందు 'సర్ సుల్తాను అహమదు' అను మహమ్మదీయుడు స్థాపించియుండెను. యోగేంద్ర మండలుడను హరిజనుడు సమర్థించియుండెను. దానినే నేడు డాక్టరు అంబేడ్కరుఅను హరిజనమహాశయుడు ఎటులైన ప్యాసు చేయించ జూచుచున్నాడు. అంబేడ్కరుగారికి స్వయముగా హిందూధర్మ మనిన గిట్టదు. ఆయన మనుస్మృతిని నిండుసభలో దగుల పెట్టిన ఘనుడు. ధర్మ విరుద్ధముగ బ్రాహ్మణ స్త్రీని బెండ్లాడిన యసహాయశూరుడు. వాస్తవమున నిట్టి వారికి వేదముల మీదను, వైదిక తపోధనులు, వీతరాగులు నగు మహర్షుల యొక్క ధర్మశాస్త్రముల మీదను దాడి చేయుట కెట్టి యధికారమును లేదు.

పైగా సర్వవిధముల చేతను శాస్త్ర విరుద్ధమై ధర్మ మును సర్వవాశన మొనర్పనున్న యీ హిందూకోడుబిల్లు నకు 'హిందూధర్మశాస్త్ర సంగ్రహము అను పేరు కూడ పెట్టినారంటే అది యెంతయు ధూర్తత్వము, మూర్ఖత్వము నన్నమాట. "విభిన్న ధర్మశాస్త్ర విషయములతోడ నల రారునట్టిదియు, హిందూసమాజమందలి యన్ని వర్గముల వారుకూడ పాటించుటకు దగినదియు నగు మెక క్రమబద్ధ మైన ధర్మశాస్త్రనంగ్రహమును నిర్మింపవలయునని ప్రజల కోఱిక నానాటికి బలీయమగు చున్నదని" బిల్లుసమర్థకులు చెప్పుచున్నారు. కాని యిది చాల యసంగతవిషయము. హిందూ ప్రజ లెప్పుడు నిట్టిబిల్లులను కోరుకొనలేదు. పైగా హిందూకోడు నొకభయంకర విపత్తుగా భావించి దానియెడ చాలఘోర ద్వేషమును జూపుచున్నారు. హిందూలా కమిటీ వారి రిపోర్టుమూలమునను, డాక్టరు మిశ్రగారి రిపోర్టుమూల మునను ప్రజల ద్వేషభావము సుస్ప ష్టమగుచునే యున్నది.

"హిందూ సమాజమందలి వర్తమాన పరిస్థితులను గమనించుచున్న ప్రతి బుద్ధిమంతుడును 'హిందూధర్మమందు అవశ్యముగ పరివర్తనము జరుగవలసి యున్నది. అనువిషయమును తప్పక అంగీకరించుచున్న వాడే” అని కోడుసమర్థకు లందురు. ఇది కూడ నేమియు బాగులేదు. పాశ్చాత్యశిక్షణ. సభ్యతల కలవాటువడి, యిష్టము వచ్చినట్లుగ నడచుకొనుచు నుండు యేకొలది చపలచిత్తులతో తమలోగల విషయలోలు పత్వకారణముగను, ఇంద్రియదాస్య కారణముగను హిందూ శాస్త్రములను మార్పు చేయవలయునను బుద్ది పుట్టును, కాని జితేంద్రియులు,దూరమాలోచించగలవారునగు స్త్రీ పురుషులు మాత్రము తపోధనులగు మహర్షుల యుపదేశములను, వేదాది సమ్మతవిధానములనే పరమకల్యాణకారణములుగా భావింతురు. ఈబిల్లు హిందూధర్మశాస్త్రముల యొక్క సంగ్రహమని చెప్పుచున్నారు గదా! అట్టిస్థితిలో నిందు నవీనవిషయ ముల జేర్చుట యేమి సమంజసముగ నున్నది? విశేషముగ అంతర్జాతీయవివాహము, సగోత్రవివాహము. విడాకులచట్టము ఆడుబిడ్డకు దాయభాగము మొదలైనవన్నియు ధర్మశాస్త్రము. నకు విరుద్ధమైనవే కదా? ఇందు ఈ విరుద్ధ విషయములన్నియు నేల చేర్చబడినవి? ఏ ధర్మశాస్త్రము చేతనైనా యీవిషయములను సమర్ధించవచ్చు నందురా! దాని నేల యెదుట బెట్టుట లేదు !

వాస్తవమం దీబిల్లు వారు మితాక్షరాపద్ధతిని గాని దాయభాగవిషయమునుగాని, వీరమిత్రోదయ విషయమును గాని దేనినిగూడ స్వీకరించలేదు. ఒకచోట నొక కొంత మఱియొకచోట మఱియొకకొంత, వేఱొకచోట వేఱొక కొంతను ప్రోగుచేసి యీబిల్లును భానుమతి సంసారమును కూడ బెట్టినట్లు కూడబెట్టినారు. ఈ విధాన మన్ని వర్గముల వారియెడను సమానముగ జెల్లనేరదు. అందఱు రోగులందఱకు నొకేమందుకాక దేశకాల రోగప్రకృతులనుబట్టి వేఱువేఱు మందు లీయబడుచున్నటులే మనవేదములు, మహర్షులు నందఱకు ననువైన వేరువేరు విధానముల నేర్పరచి యున్నారు. బ్రాహ్మణుకు రాజసూయమును జేయ వీలు లేదు. క్షత్రియుడు వాజపేయము నాచరింపరాదు. క్షత్రియాదులు వైశ్యస్తోమము నాచరింపకూడదు. ఇట్టిస్థితిలో నందఱి యెడను ఒక్క విధానమెట్లు చెల్లును ? జనులెంత యధికముగ నబద్ధమాడుట కలవాటు పడినను, అబద్ధ మెంత యధిక ప్రచారములోనికి వచ్చినను 'అబద్ధమాడవచ్చును' అను విధానముమాత్ర మేర్పడజాలదు. అబద్ధమాడెడు ప్రవృత్తి యెంత యధికమైనను మహత్త్వము సదా సత్యమందే యుండును. ఇట్లే శాస్త్రవిరుద్ధమగు ఆచరణము చేయవలెననియు, ఇష్టమువచ్చిన రీతిని సంయమము లేకుండ భోజనము చేయ వలయుననియు, ఇష్టమువచ్చినరీతిని బెండ్లి చేసుకొనవలయు ననియు ప్రవృత్తి యెంత యధిక మయినను దాని కనువగు బిల్లు మాత్ర మెన్నడు ప్యాసు కాకూడదు. అట్లు దుష్ప్రవృత్తుల కలవాటుపడిన వ్యక్తులను సదాచారులతోడ సమానముగ జూచుటయు, వారి యాప్రవృత్తుల కవకాశములను గల్పించుటయు ననునది పాపాచరణమునకును, స్వేచ్ఛాచరణమునకును, దోహదమిచ్చుటయే. శాస్త్రవిరుద్ధ జీవన ములు గడపుటకు సౌకర్యములను గల్పించుటనునది, అన్న చెల్లెండ్ర పెండ్లిండ్ల కవకాశము కల్పించుటయు, సారా త్రాగుటకు దగుసౌకర్యముల గలుగజేయుటయు నెంత క్షమించవీలులేని యపరాధమో. అంతయే క్షమింపవీలులేని యపరాధము. ఈబిల్లు 'హిందూధర్మ శాస్త్ర సంగ్రహము ' అను నామమునకును, ఇందు హిందూ శాస్త్రము లందలి వేర్వేరుశాఖలు సంకలన మొనర్పబడునను ప్రతిజ్ఞకు బూర్తిగా విరుద్దము. ఇందు విభిన్న శాఖలు సంకలన మొనర్పబడుటకు బదులుగ నధార్మిక విషయములు సంకలన మొనర్ప బడినవి. కావున నీవ్యవస్థకు 'అధర్మసంగ్రహము' అని పేరు పెట్టిన జాల బాగుండును.


మఱియొక విషయము – కోడు సమర్థకులు ఒకచోట “విహాహము, దాయభాగము మొదలగు వానికి ధర్మముతోడ నేలాటి సంబంధమును లేదు. ఇది సామాజిక విషయము, అర్థమునకు జెందిన సమస్య - ఇది మంత్రులు విచారణ చేయ దగు విషయము. ఈ బిల్లు మూలమున హిందూధర్మమున కేమియు హాని కలుగదు. కనుక ధర్మవిషయమున జోక్యము కలుగజేసుకొను చున్నారను విషయమే లేదు.” అని చెప్పు చున్నారు. ఆ సమర్థకులే “ఈ బిల్లు పేరు 'హిందూధర్మ శాస్త్రసంగ్రహ' మరియు ఇందు హిందూధర్మశాస్త్రము యొక్క వేర్వేరు శాఖలు క్రోడీకరింపబడిన వనియు, ధర్మములోని పురాతన నిగూఢసమస్యలను సరళాతిసరళముగ జేయుచున్నా మనియు" బలుకుచున్నారంటే అర్ధమేమయిన ఉన్నదా? దీనిని బట్టి యేవో ధర్మశాస్త్రము లనుచు హిందువులను మోసములో బడవేయు చున్నారని” సుస్పష్ట మగుచున్నది.

'భారత దేశమందు నూటికి తొంబదిజనులలో విడాకులచట్ట మమలులో నున్నది' అని కోడుబిల్లు వారి వాదము. కాని వారివిషయమున పంచాయతీలవారే బహిష్కార ప్రయత్నములను జేయుచుండగా కచ్చేరీలకు బోవవలయు నాడంబరమంతయు నెందులకు దెచ్చి పెట్టుచున్నారు? ప్రజల సమయమును, ధనమును కోర్టుల వ్యవహారములలో ఖర్చు చేయించుట "అవ్యాపారేషు వ్యాపారః” అనబడదా? జిల్లాజడ్జి గారు వివాహ విచ్ఛేదము ఘోషణ చేసి నప్పటికి దానిని దృఢపరచుటకునై కోర్టులకు దప్పనిసరిగా బోవదగు వ్యవస్థ చేయుచున్నారు. కోడుబిల్లు 1వ భాగము 44వ ధార (రూలు) 1వ నియమమందు 'జిల్లా జడ్జిగారు ఇచ్చిన వివాహవిఛ్ఛేద సంబంధమగు ప్రతిడిక్రీ ని హైకోర్టు ద్వారా దృఢపరచుకొన వలయును' అని స్పష్టముగ వ్రాయ బడియున్నది. ఆ విషయము నెక్కువగా బరిశీలన జేయనెంచినను లేక అన్యసాక్ష్యమేదేని తీసుకొననెంచినను హైకోర్టు ఆ చేయదగు కార్యక్రమమును దెలియజేయునట. ఆశ్చర్యకరమగు విషయమేమి యనగా, భార్యవద్ద కేసును నడపు కొనుటకు దగుధనము లేకపోయినచో కోర్టు ఆమె జీవనోపాధికై నెలకింతయని యొక కొంతధనమును, కేసులకయిన ఖర్చులను గూడ నామె భర్త చేత నిప్పించునట. ఈవిధముగ నీ బిల్లు భర్త యొక్క ద్రవ్యముతోడనే భర్తతోడ కేసును పోరాడుటకు భార్యకు తగు అవకాశమును కల్పించునట. పాఠకమహాశయులారా ! హిందూకోడువారి న్యాయపద్ధతి ఇది. పైగా జిల్లా జడ్జి తరువాతను, హైకోర్టు తరువాతను కూడ అప్పీళ్లు జరుగుతునే యుండగలవు.

వివాహవిచ్ఛేద మయినతరువాత వీరిచే బిడ్డల సంరక్షణ నిమిత్తముగ జేయబడిన యేర్పాటంతయు వ్యర్థము బాలుర ధార్మిక గౌరవమును, నైతిక గౌరవమును నశింపు చేసిన తరువాత వారికి శిక్షణ యేమి జరుగును ? రక్షణ యేమి జరు గును? దత్తతయేర్పాట్లను శాస్త్రవిరుద్ధముగ జేసిపెట్టినారు కదా ! దత్తతకు హోమ మనవసరమనియే చెప్పినారు. కాని రిజిస్ట్రేషను మాత్రము ముఖ్యమని చెప్పినారు. ద్వ్యాముష్యాయణ దత్తకవిధానమున (సోదరు లిర్వురకు నొకని కుమారుడే కర్మాధికారి యగుట) నిషేధించి శాస్త్రము నావలద్రోసి పెట్టినారు. ద్వ్యాముష్యాయణాది దత్తతవిధానములు శాస్త్ర సమ్మతము లయినపుడు వాటి నంతరింపజేయుట యనధికార ప్రయత్నము కాదా! కనుకనే బిల్లు వారు “ఈపద్ధతిని బట్టి దత్తత చేసుకొనుటవలన సంపత్తు రెండు కుటుంబములను దాటి యావలకు బోకుండయుండును. ఒకే వ్యక్తిగాని, కొందఱు వ్యక్తులుగాని సంపత్తును తమ చేతులలో నణచి పెట్టుకొని కూర్చొనకుండుటకై ప్రభుత్వమేదియో యొక యేర్పాటు చేయవలసియున్నదికదా! అట్టిస్థితిలో ద్వ్యాముష్యాయణాది విధానముల నెటులుంచగలము? ఈవిధానములను బట్టి రెండు కుటుంబములవారు కేవలము సంపదను బంచుకొందుమని మాత్ర మొడంబడిక జేసుకొందురు." అని పల్కుట చాల యజ్ఞానమూలకముగ నున్నది. ఏలయన శాస్త్రసమ్మతమగు విధానములను బట్టియే సమాజముగాని రాష్ట్రముగాని, ప్రభుత్వములుగాని నడచుకొనవలసియున్నది. ఒక వ్యక్తినిబట్టికాని, సమూహమును బట్టికాని శాస్త్రవిధానములం దాటంకము కలుగరాదు. ఈ శాస్త్రవిరుద్ధ ప్రయత్నమును విడచి సామ్యవాదము నాధారముగ జేసుకొని సంపదలను పంచి పెట్టెద మందురా ! అప్పుడీచేసిన దాయభాగ వ్యవస్థయంతయు వ్యర్థమైపోవును. ఒకయెడ ధనముమీద భర్తకు సంపూర్ణాధికార మున్నదనియు, అతనికి సంపత్తు మీద సంపూర్ణముగ దానవిక్రయసత్తాధికారము లుండు ననియు జెప్పుచుండగ ద్వ్యాముష్యాయణ విధానముగ దత్తత చేసుకొనుట కధికార మెచటినుండి వచ్చును! బిల్లువారి యీపలుకుల కర్థమేమున్నది?

మితాక్షరాశాసనమున కాటంకము కలుగుటతోడనే కుటుంబము ఛిన్నభిన్నమగును. మృత్యుకరములమూలమున గూడ ప్రజలుకూడ చాల బాధపడిపోవుదురు. తల్లిదండ్రులలోను, సోదరులలోను ఐకమత్య విషయమెటులున్నను విడాకులచట్ట కారణముగ భార్యాభర్తలలో సుస్థిరసంబంధము చెడిపోవును. ఇక కుటుంబ జీవనము చాల కష్టమైపోవును. పిమ్మట నందఱు హెూటలు భోజనమునకు, హాస్పటలులో 'మృత్యువునకు అర్హులయిపోవుదురు. ధర్మము నశించుట మూలమున నీతికూడ నశించిపోవును. సత్యము, అహింస, క్షమ, దయ మొదలగు సద్గుణము లంతరించిపోవును. ప్రావంచిక వ్యవహారములు జరుగు టసంభవమయిపోవును. వ్యవహారమందు గూడ నెవ్వడు దన పుత్ర మిత్ర భాతృకళత్రాదు లబద్ధమాడుటను గోరడుగదా! తమ మంత్రులు, సేనాపతులు అబద్ధమాడవలెనని యేప్రభుత్వమైన గోరుకొనునా? అంతియ కాదు. అబద్ధమాడిన మీదట ప్రతికూలత కన్పడి యా యనృతమాడిన వ్యక్తిని దండించుటకుఁ దగు ఏర్పాటు చేయబడును. న్యాయాధికారులు సాక్షులవలన సత్యభాషణము నాశించిననాడే న్యాయము జరుగగలదు. అసత్యము వలన నన్యాయము, అన్యాయమువలన జెడుశాసనము, జెడు శాసనము వలన నవ్యవస్థయు నేర్పడుట నిశ్చయము. ధర్మబుద్ధి యంతరించగనే లంచగొండితనము, బ్లాకు మార్కెటింగు వృద్ధిపొందుననుటలో సందియములేదు.

బజారులో బహిరంగముగ గేలను 1కి రు. 2-4-0 చొప్పున అమ్మబడు పెట్రోలు బ్లాకుమార్కెటులో రూ. 18/- ల చొప్పున అమ్మబడ నారంభించును. ధర్మముతోడ సంబంధమే లేనపుడు బ్లాకుమార్కెటింగు ఎట్లు అంతరించును?కష్టపడి పనిచేసినపుడు నెలకు రూ. 1000/- లు లేక రు. 2000/- లు వచ్చిన లంచగొండి తనము వలన లక్ష రెండులక్షల రూపాయలు మిగుల నారంభించును. ధర్మభయము లేనపుడు లంచగొండితనమెట్లు నశించును? ఈ కోడుబిల్లు కారణముగా మను, యాజ్ఞవల్క్య వశిష్ఠాదులచే నిర్మింపబడిన నియమము లుల్లంఘించబడగా, ప్రస్తుత నెహ్రూగారూ, అంబేద్కరు గారు నిర్మించిన నియమములను మాత్రము త్రోసిపుచ్చుట కెంతకాలము పట్టును? ఎంత కష్టము కలుగును? ధర్మము యెడను, ఈశ్వరునియెడను అన్యాయ మొనర్చినవారికి మంత్రులయొక్కయు, ప్రభుత్వముయొక్కయు కండ్లలో కారముచల్లుట ఒక లెక్క యగునా? పోలీసులు, సైన్యములు, సి. ఐ. డి. లు (గూఢ చారులు) ఆ విషయమున నేమియు చేయజాలరు. ప్రజలలో ధర్మబుద్ధి యడుగంటినపుడు పోలీసులు, సైనికులు మా మాత్రమే యాకాశమునుండియైన నూడిపడుదురా? వారు కూడ నా ప్రజలలో నుండి వచ్చువారే. వారుగూడ పూర్తిగ లంచగొండు లయిపోవుదురనుటకు సందేహము లేదు. అటిస్థితిలో చౌర్యము, లంచగొండితనము మున్నగున వెటు లంతరించును? ఒకసారి రఫీ అహమదు కిడవాయి మహాశయు దుపన్యశించుచు 'భ్రష్టాచారములను పోగొట్ట నియమింపబడినవారు కూడ భ్రష్టాచారముల పాలైపోయినారు' అని పల్కినాడు. ఇట్టి స్థితిలో హిందూకోడుద్వారా కమ్యూనిజము బాగుగ ప్రోత్స హిం చబడు నన్నమాట. ధర్మమునకు, సంవత్తునకు కౌటుంబిక జీవనమునకు కమ్యూనిజమందెట్లు తావు లేకుండ బోయినదో అట్లే దేశమందంతటను గూడ తావు లేకుండ బోవును. హిందూకోడుద్వారా సగోత్రవివాహము, అంతర్జాతీయ వివాహము, విడాకులచట్టము నాచరణలోనికి వచ్చిన తోడనే అధర్మప్రవృత్తు లధికమయిపోవును.

కోడుబిల్లు మున్ముందు శాస్త్రములమీద దాడిని సాగించును, కోడుబిల్లు స్వీకరించబడగానే మను, యాజ్ఞ వల్క్యాదుల విధానములు వ్యర్థములు. ననవసరములు నయి పోవును. ఇక ధర్మనాశము తప్పదు గదా! అన్న చెల్లెండ్ర పంపకముల మూలమున సంపత్తు అనేక బాగములుగ విభజించ బడి ఛిన్నభిన్న మయి పోవును, అంతమునకు యావత్తు భూమిని సంపదను, రాష్ట్రీకరణము చేయగా (రాష్ట్రమునకు చెందునట్లు చేయబడగా) ఎవ్వనివద్దను ఎట్లుగ వ్యక్తిగత సంపత్తు ఉండదో అట్లే, ఈ విషయమునగూడ జరుగును. ఇట్లు సంపత్తు నశించుట నిశ్చితము. ఈ స్థితిలో తిండి, గుడ్డ, వైద్యము, న్యాయము చౌకగా లభించుట కెంతకష్టము కలుగునో వేఱుగ జెప్ప నక్కఱ లేదు. ఎప్పటికయిన ధర్మమువలననే సమాజముకాని రాష్ట్రముకాని నిలువ గలదు.

ఎపుడయితే వ్యక్తిగతభూములు, సంపత్తులు నశించి పోవునూ లేక రాష్ట్రములో కలుపుకొనబడునో , అపుడు జీవనము కేవలము జడయంత్రమువలె నుత్సాహవిహీనమై పోవును. విశేషధనముకొఱకును, విశ్రాంతి కొఱకును విశేష కార్యములు సంపాదించుకొనబడును. ఇంతియగాక యజ్ఞ తపో దానాదులు కట్టువడిపోవును. పిమ్మట నొకవేళ నీ చంచలురాలగు రాజ్యలక్ష్మి యేవిదేశ శాసనమునకైన ఏ అయోగ్య స్వతంత్ర ప్రభుత్వమునకైన లోబడిపోయినచో, దానిని మున్ముందు విడిపించుట ఆవశ్యక మగును. తన్నిమిత్తముగ నాందోళనా ప్రయత్నములు సలుపు టవసరమగును. తన్నిమిత్తముగ జాలడబ్బు ఖర్చు అగును. వ్యక్తిగత భూమియు, వ్యక్తిగత సంపదయు నున్ననాడే ప్రజలు అయోగ్య ప్రభు త్వము నణగద్రొక్క గలుగుదురు. కాంగ్రెసు కార్యక్రమము లందుగూడ కోట్లకొలది రూపాయలు ఖర్చయిపోయినవి. కనుకనే మజ్దూరు గవర్నమెంటు కంజర్వేటివు దళమును తొలగించ గలిగినది. ప్రజల వద్ద నేసంపదయు లేని పరిస్థితిలో ప్రభుత్వ మేమి చేసినను న్యాయమును, అన్యాయమునుగూడ ప్రజలు తలయొగ్గి అనుభవించవలసినదే. కాని వేఱుదిక్కు లేదు. ఇట్లు రాజనీతినిబట్టి యాలోచించినప్పటికీ రాష్ట్రము కుంటిదై పోవును. కనుక ప్రభుత్వము సాధ్యమయినంతవరకు రాష్ట్రమందలి వ్యక్తిగత జీవనములందు, సామాజిక, ధార్మిక జీవన ములందు చాల తక్కువ జోక్యము కల్గించుకొన వల యును. రాష్ట్రము యొక్క భూమినంతను ప్రభుత్వము చేత బెట్టుటనునది తమ కాలుసేతుల ఖండింపజేసుకొనుటతో సమానము.

ఇట్లే శిక్షా విధానమును (విద్యను) గూడ ప్రభుత్వము చేతులలో బెట్టకూడదు. శాసకు లొకప్పుడు, ఆస్తికులు, వేఱొకప్పుడు నాస్తికులు నగుచుందురు. వారు వేర్వేరు విధ ములతో శాసనక్రమములను నడపవచ్చును. దాని కనుకూల ముగ రాష్ట్రనిర్మాణము నపేక్షింతురు. ఆ రాష్ట్రనిర్మాణమున కనువగు శిక్షాపద్ధతి నమలు జరప జూడవచ్చును. తన్మూల ముగ రాష్ట్రమందలి సంస్కృతి, సభ్యత, గౌరవము పూర్తిగ నడుగంటిపోవును. భారతదేశములో నేటివరకు నడచుచున్న శిక్షావిధానమునకు కారకులు ఆంగ్లేయులు. ఈ యాంగ్లేయ శిక్షావిధానమందు భారతదేశముయొక్క చరిత్ర, సాహిత్యము కూడ పాడుచేయబడినవి. ఆర్యులు ఉత్తరధ్రువమునుండి కాని పశ్చిమోత్తర ఆసియానుండి గాని వచ్చియున్నారని నిరూపించుటకు వీరు ప్రయత్నించియున్నారు. వేదములు గొల్లల గీతములనియు, రామాయణ, భారతాదులకు బ్రమాణ మెద్దియా లేదనియు నిరూపింప బ్రయత్నించినారు, ఇందు మూలముననే ఆర్యులు తమయింట గూర్చొనియుండియు విదేశీయులై పోయినారు. వీరు తమను, తమ పూర్వీకులను హీనులని భావింపదొడంగిరి. తమ సంస్కృతి, సభ్యతలను గూడ హీనముగ భావించి, యత్యంతము గ్రుడ్డితనముతో నితరుల ననుకరింప మొదలిడిరి. ఈ కారణముచేతనే దేశమం తయు ఖండఖండములు కావలసి వచ్చినది. భారతదేశ మేదియో పంచాయతీస్థానమనియు, ఇది వారి వంశపారంపర్యముగ వచ్చుచున్న ధనము కాదనియు, ఇందు బయటనుండి మహమ్మదీయు లెట్లు వచ్చియున్నారో, అట్లే యార్యులును వచ్చియున్నారనియు నేవేవో భావము లిచ్చటి ప్రజల మెద డులలో గడ్డకట్టుకొనిపోయినవి. పైగా నీదేశము ఎట్లుగ మనదో, అట్లే వారిదికూడ నట, 'వీరికి, వారికి పడనప్పుడును, వీరు, వారు కలసిమెలసి యుండుటసంభవ మయినపుడును దేశమును ఖండములుగ జేసుకొని యెవరి భాగమును వారేల దీసుకొనగూడదు ?' అను నిటువంటి దురాలోచనలకు ఫల రూపముగ దేశము విభజింపబడి పాకిస్తాను ఏర్పడినది. లక్షలాది స్త్రీ పురషాదులు చంపబడినారు. లక్షలాది జనులు ఇల్లు, వాకిలి లేక శరణము! శరణమంటూ తిరుగవలసి వచ్చినది. ఈతప్పుడు ఇతిహాసము నశించనంతవఱకు, సముచితమగు నితిహాసము నాచరణలో బెట్టనంతవఱుకు నింకను నెన్ని యనర్ధములు జరుగునో చెప్పజాలము.

ఇదే విధముగ ధార్మికవిషయములలోను, సామాజిక విషయములలోను ప్రభుత్వము జోక్యము కలుగజేసుకొన నిచ్చినపుడా ప్రభుత్వ మేదేని నాస్తిక పథము ననుసరించుచు ధర్మమును ద్వేషించునది యైనచో సర్వవిధములచేతనుగూడ ధార్మిక, సామాజిక నియమముల సమూల నాశనము చేయును. ఔరంగజేబువంటి శాసకులే నియమములనుజేయ నారంభించినచో నేడెచ్చటను నామమాత్రమునకైన దేవాలయములు లేకుండ బోయెడివి. శిఖా యజ్ఞోపవీతములు కూడ నుండెడివి కావు. ఈ కారణముచేతనే మహర్షులు శిక్షావిధానమును సామాజిక, ధార్మిక నియమములను ప్రభుత్వము చేతులలో బెట్టలేదు. కనుక శాసనము మారినను శిక్షా పద్ధతి మాత్రము మార్పుచెందదు, ధార్మిక, సామాజిక నియమములు మార్పు జెందవు. తన్మూలమున రాష్ట్రము తన బుద్ధిచేత దానాలోచించుకొని తన ధర్మ, కర్మాదులను రక్షించుకొన గలుగును. ఏ రాష్ట్రమయినను భౌతిక పారతంత్య్రమును భరించగలదు. కాని యాధ్యాత్మిక, మానసిక పారతంత్య్రమును మాత్రము భరింపజాలదు. ఒక వ్యక్తికి బేడీలు వేయుటచేతను గూడ మస్తిష్కమును పాడు చేయుటవలన గలుగు కష్టము కలుగదు. క్లోరోఫారమును వాసన చూపి వ్యక్తిని స్మృతిహీనునిగా చేయుట చాల హానికరము, ప రముఖాపేక్ష గల శిష్యుడు, నుపాధ్యాయుడు గూడ స్వతంత్రులు కాగోరుట లేదు. వారి యనుసంధానమంతయు నితరుల యాజ్ఞలమీద నడచుచున్నది. వారు స్వతంత్ర సంకల్పములు కలిగి యుండ లేకున్నారు. భాగవతమందలి చండామార్కులువంటి పరాధీనోపాధ్యాయులు 'స దీనో రాజసేవకః' అనియే భావింపబడుదురు. ఈ దృష్టి చేత శిక్షణపద్ధతిని, భూములను, ధార్మిక సామాజిక నియమములను ప్రభుత్వము వారి చేతులలో బడనీయకుండుటెంతయు నవసరము. హిందూకోడు ఈ మూడింటిని తప్పక నాశమొందించును. ఫలరూపముగ కమ్యూనిజము బాగుగ ప్రబలిపోవును.

కొందఱు జనులిట్టులనుచున్నారు."తాము హిందూకోడు యెడ ద్వేషమునే చూపుచున్నారు. కాని మీ హితమును మీరేమియు జూచుకొనుటలేదు. ప్రస్తుత హిందూకోడు మీ కిష్టము కానిచో మీకు ఏ కోడుబిల్లు ఇష్టమగుమో మీరే చెప్పండి! నేడు ఏదియో యొక క్రొత్తవ్యవస్థ చేయనిదే కార్యక్రమము జరుగజాలదు గదా! కనుక మీకిష్టమైన కోడును జెప్పి మీపక్షమునే నిలువ బెట్టుకొనండి! ఉచితమని తోచిన ప్రజాప్రభుత్వము దానిని గుఱించియే విచారణ జేయగలదు." దీని నాధారముగ జేసుకొనియే కొందఱు స్త్రీలు, పురుషులు క్రొత్త కోడుబిల్లు నిర్మాణము. నకు సంసిద్ధులు కాజొచ్చినారు, కాని యీ విషయమున మేము ఇంతమాత్రమే సమాధాన మిచ్చెదము.. ఏమని యనగా, "ఇప్పటివరకు నొక సాంగో పాంగ వ్యవస్థ నడచుచు వచ్చు చున్నది. దానికి బదులుగ వేఱొక నవీన వ్యవస్థను జేయవలసిన యక్కఱలేదు. ఒకడు ఒకని ఇంటిని కూలగొట్ట నారంభించగా మనముకూడ వెళ్లి యా గృహమును వేఱక విధముగ గూలద్రోయ బూనుట ఉచితమును కాదు. అవసరమును లేదు."

ఈ కోడుబిల్లు మూలమున పారంపర్యముగ వచ్చుచున్న యనేక హిందువుల విశేష విషయములు అంతరించును. దీనిద్వారా హిందువులు మహమ్మదీయులుగను, క్రైస్తవులుగను బోతపోయబడుదురు. వివాహ ప్రకరణము లో ప్రతి హిందువును బెండ్లి చేసుకొన నవకాశమీయబడినది. ఈ కారణముచేత వర్ణవ్యవస్థ యంతయు చెడి వర్ణసాంకర్య మేర్పడును.ప్రాచీన వ్యవస్థనుబట్టి కౌటుంబిక జీవనము, సంపత్తు స్థిరముగ నుండెడివి. ఈ కోడుబిల్లునుబట్టి ఆడుబిడ్డలను భాగస్థులగను వారసులనుగను చేయుటమూలమున సంపత్తంతయు ఛిన్న భిన్నమై పోవును. 10 ఏండ్ల లోపుననే సాధారణకుటుంబీకుల యిండ్లు, పొలములు నమ్ముడైపోవును. ఆడుబిడ్డ యత్తవారింటికి బోవుచు దనభాగమునకు వచ్చిన యింటిని, పొలమును అమ్ముకొనిపోవగలదు. ఆమె యెక్కువ ధనమునకు లోభపడి అన్యమతస్థులకు కూడ అమ్మివేయగలదు. ఒకే యింటియందును, యింటింటను, భర్తయొక్కయు, సోదరుని యొక్కయు నింటిలోను హిందుస్తానము, పాకిస్తానము నేర్పడును. సోదర గృహమందును, భర్తృగృహమందును కురాను చదువ బడును, గోమాంసము వండబడును. వేదపాఠహోమా దులుగూడ నందేజరుగును. వాస్తవమున భార్యాభర్తల యొక్క జీవన మొక్కటి కదా! కనుక కోడలు తనతండ్రి యింటనుండి యెంత యాస్తిని దెచ్చుకొనివచ్చునో , అంత యాస్తిని లేక అంతకంటే నెక్కువ యాస్తిని యాడపడుచు తన యత్తవారింటికి గొనిపోవును. లాభమేమియు లేకపోగా సోదర బావమరదులలో గలహములు బయల్వెడలును. కేసులు, దావాలు నధిక మగును, తక్కువ యాస్తి లభించినను తండ్రి యప్పులోని కొంతభాగము తనమీద బడినను ఆడుబిడ్డకు పెండ్లియగుట కష్టమయి పోవును.

ఇప్పటి సాధారణస్థితిలో తండ్రి లేక సోదరుడు తమ భార్యల మెడలలోని నగలనైన అమ్మి యప్పులు తీర్చి తమ యాడుబిడ్డకు (సోదరి గాని, కుమార్తెగాని) మంచి యింటిని, మంచి వరుని జూచి పెండ్లి చేయుచునేయున్నారు. తరచుగా తమకంటె నుచ్చస్థితియందున్న గృహమును వెదకి యచట తమ సోదరికి, కుమార్తెకు బెండ్లి చేయుచున్నారు. పితృ కుటుంబముకంటె నత్త వారి కుటుంబము అధిక స్థితిగలది యని అనుకొనదగు నుదాహరణము లెన్నియో కలవు. బిల్లు ప్యానయిన తరువాతనూ ఆడుబిడ్డలు స్వయంవరము జేసుకొన వలసివచ్చును. వివాహము దూరదృష్టితో కూడినది కాక కామమే కారణముగ గలదియగును. ఆస్తులయందలి యాశ కొలది నాడువారిమీద నె న్నేని యత్యాచారములు జరుగ గలవు. నేడు సంపత్తు లేకుండగనే గూండాలు అబలలను బాడుచేయుచున్నారు. సంపత్తునందలి లోభముచేత నికముం దింకను నధికముగ నబలలమీద నత్యాచారములు జరుగును. తండ్రి జీవించియుండగనే తన భాగమును తాను దీసుకొని వేఱయిన పుత్రునకు తండ్రి మరణానంతరము యాస్తిలో భాగము లభించవలెనని భావించిన మిగిలిన కుమారులయెడ జాల ఘోరతరమగు నన్యాయము జరిగినట్లే. కన్యాదాన ముత్తమోత్తమమైన దానము. వివాహమందు దానముతో బనిలేదని భావించుటకూడ జాల బొరబాటు. స్త్రీ పురుషు లిద్దఱు నొక్కఱే. ( భార్యాభర్తలు ఇరువురు నొక్కఱే ) వారిద్దఱకు స్వార్థ మొక్కటి. జీవన మొక్కటి. వారిద్దఱిలోను వేరువేఱు స్వార్థములను గల్పించుటనునది కలహమునకు విత్తువేయుటయే.

బిల్లు సమర్థకులు చెప్పునదేమనగా, "తండ్రి యాస్తి మీద నధికారము వచ్చుటతోడనే యాడుబిడ్డల నిమిత్తముగా నడచుచున్న కట్నముల యాచార మంతరించునట. దైన్యస్థితి యుండదట. తండ్రి ధనమం దధికారముండుట చేత నత్తవారింట దాసురాలై పడియుండ నక్కఱలేదట. ఇంతకు పూర్వము స్త్రీ ధన కుబేరులవంటి సోదరులుండియు డబ్బు కొఱకై యొరులమీద నాధారపడి యుండవలసి వచ్చుచున్నదట. ఆడుబిడ్డ భాగ మాడుబిడ్డకీయకుండ అన్యాయమునకు పాల్పడు సోదరునిమీద నామె కేసు పెట్టుకొనవచ్చునట.” ఆలోచించి చూడగా పైవిషయము లన్నియు గడు సత్య దూరములని సుస్పష్టమగుచున్నది. ధనికుడగు సోదరుడు తన సోదరి కష్టపడుచుండగా జూచి యూరుకొన లేడను విషయము నిజమే. ధనము లేని వాడుకూడ భార్యనగలనమ్మి ఋణముల దీర్చివేసి సోదరికై మంచిగృహమును, మంచివరుని వెదకుచునే యున్నాడు. భారతదేశమం దందఱు జనులు కోటీశ్వరులు, లక్షాధికారులు కారను విషయము, చాలమంది బీదవాండ్రను విషయముకూడ నిజమే. తండ్రి మరణించినచో చాలమంది యాడుబిడ్డలకు పెండ్లికైన రూపాయలు మిగులుటలేదు. వారి గతి యేమి కావలసినది? అను విషయము కూడ నాలోచించదగినది. పైవిషయములతోబాటు క్రింది విషయములుకూడ నాలోచించవలసినవే. అవి యేవనగా, తండ్రి ఋణగ్రస్తుడైనచో నాడు బిడ్డకు లభించు సంపద్భాగముతో పాటు ఒకకొంత ఋణభాగముకూడ లభించునుగదా! వేయి, వేయి రూప్యముల భాగములను పొందిన కన్యకల నెంతమంది పెండ్లాడుటకు సంసిద్దులగుదురు మఱియు వేయి. వేయి రూప్యముల ఋణభారమును పొందిన కన్యకల నెంత మంది పెండ్లాడుటకు సంసిద్దులగుదురు? అను విషయము కూడ నాలోచించదగినదే. ఏకొలది రూపవతులగు స్త్రీలకో తప్ప మిగిలిన స్త్రీలందఱకు హిందూకోడు హాని కలిగించును. ఇది ధ్రువము.

స్త్రీ తన తండ్రివలనవచ్చిన ధనమును పొలమును పెట్టుకొని స్వతంత్ర వ్యాపార, వ్యవసాయములనారంభిం చినచో నామె కార్యమునకు బుత్రులుగాని,భర్తగాని తోడ్పడు టసంభవమయి పోవును. ఇట్లే పతి, పుత్రాదుల కార్యములందీమెయు తోడ్పడుట మానివేయును. ఈ స్థితిలో నిరువురి కార్యములును ధ్వంసము అగును. అహంకారము, భేదభావము, కలహము మూలమున దాంపత్య జీవితమును, కుటుంబసుఖమును విషప్రాయమై పోవును. శ్వశురకులమునకు (మామగారి కుటుంబమునకు) రాణియు, గృహలక్ష్మియునగు స్త్రీ శ్వశురుల శుశ్రూషను, భర్తృసేవను, సవినయ వ్యవహారమును చేసిన నది దాసత్వమన బడదు. సాధారణముగా బురుషులు కూడ గురుజనుల (తల్లి, తండ్రి మొ|| వారు ) యెదుట దాసులగుటను తప్పుగా భావింపరు. వాస్తవమున నీదాసత్వమే సర్వాధికమైన యైశ్వర్యము నకు స్త్రీనిగాని, పురుషునిగాని ప్రభువుగా జేయును.

" తండ్రి యాస్తి మీద నాడుబిడ్డల కధికారముండుట వలన వారి భర్తలు దురాచారులయినను, పునర్వివాహము జేసుకొన్నను లేక మృతిచెందినను వారు తమ దుష్ట బంధు పులకు దాస్యము చేయుచు, అనాచారములద్వారా ధనోపార్జన జేసుకొనుచు జీవన యాపన జేయనక్కఱలేదు. బిడ్డలను నిశ్చింతగా పెంచుకొనవచ్చును. ఆర్థికశక్తి కలుగుట తోడనే స్త్రీ భర్తవలన , బంధుకోటివలన, కాముక జనము వలన రక్షణ బొందగలదు" ఇట్లు కోడుపక్షము వారందురు. కాని ఇదియు ననంగతమే. భర్తృ కుటుంబము యొక్క సంపత్తు మీదనే స్త్రీ కధికారము విధించబడినది. వివాహా సంతరము భార్య భర్తృ గోత్రమునకు జెందిన దగును. ' పిండం దత్వాధనం హరేత్ ' అను వాక్యమును బట్టి శ్రాద్ధ, తర్పణ, పిండదానాదులు చేయువాడే ధనమున కధి కారి యగును. సోదరులుండగా సోదరీమణులకు పిండ ప్రదానాధికార ముండదు. కనుక వారికి ధనాధికారము కూడ లేదు. కాని భర్త యాస్తి యందు మాత్రమామె కధికార మున్నది. దానివలననే స్త్రీ పోషింపబడ వలయును, భర్త తోడనే ఆమె జీవనయాపన జేసుకొనవలయును. వారిలో ఆర్థిక విషయము వేరైన సంబంధమును వేరగును. తన్మూలమున ద్వేషము బయల్వెడలి జీవితము దుఃఖమయ మగును. గర్వ మనునది సేవాభావమునకు విరోధి.

పతి, మామ, అత్త, తోటికోడలు, మరది మున్నగు వారితోడ విరోధము సంభవించినపుడు స్త్రీ చేతులలో సంపద యున్న సదాచారముకంటె దురాచారబుద్ధియే మెండగును, స్వధర్మపరాయణురాలు, త్యాగశీలురాలు నగు స్త్రీకి అందఱును నమస్కరింతురు. ఆమె కేవస్తువునకు లోపము గన్పింపదు. దురాచారి యగువాఁ డీమె నీడనైన దాకజాలడు. అట్టి సతీమతల్లి కేదేని లోపము గలిగినచో ప్రభుత్వము ద్వారా భర్తృకుటుంబమునుండి దీర్చ వలయును. భర్తృకుటుంబమున ధనమేమియు లేనియెడల నామెకు తండ్రియో, సోదరుడో తప్పక దోడ్పడుదురు. వారి సాహాయ్యము సంతోషపూర్వకముగ లభించకున్నను శాసనముద్వారానైన ఆమెకు సహాయము కలిగించవలయును.

“బుద్ధిమంతుడైన మనుజు డెవ్వడును దుర్వినియోగము చేయవలసి వచ్చునేమో యను భయముచేతను, తనకే హాని కలుగునేమోయను భయము చేతను శస్త్రాస్త్రములను దనవద్ద నుంచుకొనడు. అట్లే భర్త చోరుడు, పతితుడు, నన్యాయి యైనచో లేక బునర్వివాహము జేసుకొన్నచో స్త్రీ వైధవ్యము, త్యాగము, తపస్సుతో గూడిన జీవనమును గడుప లేనియెడను, తన మనస్సును నిలువబెట్టుకొన లేనియెడను. బిడ్డలను పెంచుకొనుటకై వ్యభిచారములకు సంసిద్ధురా లగుటకంటె గౌరవపూర్వకముగ బునర్వివాహము జేసుకొను టెంతయు మేలు, విడాకుల చట్టమూలమున నామె కనుకూల వాతావరణము లభించును, పునర్వివాహము వలన కడుపు మంట చల్లారును. యౌవనమందలి యభిలాష లీడేరును. ఈస్థితిలో వివశురాలై యామె సతీత్వమును భంగపరచుకొన నక్కఱ లేదు. భ్రూణహత్యలు, (గర్భస్థ శిశువుల జంపుట) చేయనక్కఱ లేదు. తిరస్కృతురాలై రూపమును అమ్ముకొన నక్కఱయు లేదు. పైవిధముగ విడాకులచట్టమును సమర్థించువారు చెప్పుదురు. కాని పైవిషయములు పైకి మాత్ర మాపాతరమణీయముగనే యున్నవి. కాని కొంత యాలోచించి చూడగా నదికూడ చాలహానిని గలిగించునవి యని తేలగలదు. ప్రపంచమందు పాప, పుణ్యములు సదా జరుగుచునే యుండునను విషయము నిజము.

కాని యెంతవరకు ధర్మాధర్మ భేదము, పాపపుణ్య భేదము, విధినిషేధ భేదము నుండుమో యంతవరకే కొందఱు కాకున్న కొందఱయినను పాప అధర్మ, నిషేధాదులకు దూరముగానుండ బ్రయత్నింతురు. పైభేదభావము లేనపు డనాచార మార్గమునుండి మఱలు టయే దుష్కరమయి స్వతంత్రించి సంపద నుపయోగింప నారంభించిన తనకు, తన పరివారమునకుకూడ చాల యనర్థము వాటిల్లును. అనేక ప్రకారముల పురుషులతోడ సంపర్కమువలన స్త్రీలహృదయ గతులే మారిపోవును. తన్మూలమున సంపత్తు దుర్వినియోగము సేయబడును. ముందుముందు ఇటువంటి వేలాది చరిత్రలు జరుగగలవు.

ధనమును స్వతంత్రముగా ఖర్చుసేయవచ్చుననుట కుదాహరణముగా జెప్పబడుచున్న విషయమేమి యనగా, 'స్త్రీ తనధనమును స్వతంత్రించి ఖర్చు పెట్టుకొనవచ్చునను విష యమును స్మృతికారులుకూడ నంగీకరించుచునే యున్నారు కదా! అట్టి స్థితిలో విధవాస్త్రీకి వారసత్వరూపముగ లభించిన యాస్తి నామె ఏల వినియోగించుకొనకూడదు? ఆమె కందు సంపూర్ణ స్వతంత్రత యేల యుండరాదు ?' ఇదియు సముచితముకాదు. మొదటి విషయము స్త్రీధనము కొలదిగ నుండును. రెండవ విషయము స్త్రీ యెల్లవేళల బరతంత్రురాలని చెప్పబడినది. 'న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి' అందుచేతనే యామె తన ధనమునుకూడ దుర్వినియోగము సేయ వీలు లేదు. కాని భర్త చనిపోయి, ఈమె సంపత్తుకు యాజమాన్యమును అన్యరక్షకుల యక్కఱలేకయే తన ధనమును తాను ఖర్చుపెట్టుకొనగల స్థితిలో నన్యదురాచారుల సంపర్కమున బడి యీమె సంవత్తును దుర్వినియోగము జేయవచ్చును. సాధారణముగా నందఱి మనస్సుకూడ చంచలముగనే యుం డును, పైగా వేదములందు స్త్రీ యొక్క మనస్సును విశేషించి యాశాస్య మని చెప్పినారు. "స్త్రీణా మాశాస్యం రఘు" "యధేష్టం స్థావరేష్వపీ " అను వాక్యము కూడ ముందు ముందు సందర్భానుసారముగ వ్యాఖ్యానించబడినది. సౌదాయికాది సంపత్తులో గూడ ముఖ్యముగ చరాస్తి మీద స్వతంత్ర మున్నది. స్థిరాస్తి యందుగూడ భరృదత్త స్థిరాస్తి యందు స్వాతంత్య్ర మున్నది. కాని యది విపత్కాలమందు ప్రాణరక్షణకొఱకును కుటుంబ రక్షణకొఱకును క్రయవిక్రయ ములు సేయవీలగును. అయినను పరిపూర్ణస్వాతంత్య్రము నిషేధమే. లేని యుదాహరణము నాధారముగ జేసుకొని వారసత్వపు ఆస్తి యొక్క హక్కులనుగుఱించి ప్రశ్నోత్తర సమాచార మెట్లు పొసగును?

ఒకడొక చిన్నవస్తువును సంపాదించుకొన్నాడనగ, యాతడు పెద్దవస్తువునుకూడ సంపాదించునని మనమెట్లు చెప్పగలము! అతడు చిన్న వస్తువును దుర్వినియోగము చేసి నచో పెద్దవస్తువును దుర్వినియోగము చేయనీయరు. సాధా రణముగా స్త్రీకి ధనరూపమున భూషణములో వస్త్రములో, కొలది రూపాయిలో ఉండును. వారసత్వముగా నిల్లు, భూమి, అధికముగ నగలు వచ్చును. కనుక వీటిని సర్దుబాటు చేసుకొనుట కష్టము. వీటిని దుర్వినియోగము చేసిన హాని కలుగును. కనుక బిల్లును ప్రతిఘటించు వారు చెప్పవలసిన విషయమేమి యనగా "స్త్రీ తన ధనమందలి యొకభాగమును రక్షించుకొ న గలిగి, రెండవ భాగము నేల రక్షించుకొన లేదు?" అను ప్రశ్నకు తావేలేదు. వస్త్రాభూషణములను, రూపాయలను, రక్షించు కొనలేదు! " అనుప్రశ్నకు తావేలేదు. వస్త్రభూషణములను, రూపాయలను రక్షించుకొనదగు ప్రవృత్తి స్త్రీలలో స్వతస్సిద్ధముగనే యుండును, కాని బాహ్యసంపత్తును సంరక్షించుకొనుట అంత తేలికకాదు. ఎప్పుడైన స్త్రీకి ధనరూప ముగ పెద్దసంపత్తు వచ్చిన దానిని భర్తయో, పుత్రులో సంరక్షింతురు. కేవల పతిపుత్రాదుల సమ్మతిమీద స్త్రీ యా ధనమును వినియోగించును. లేదా శాస్త్రానుసారముగ ధర్మము సేయును. పతి పుత్రాదుల నమ్మతి లేనిదే స్వతంత్రించి యన్యపురుషులతో గలసి సంరక్షణ యేర్పాట్లను జేసుకొనుట, ఇచ్చవచ్చినటు లింట బయట దిరుగుట, ఇచ్చవచ్చిన పురుషులతోడ కలసి మెలసి నడచుకొనుచుండుట, సంపత్తు నిచ్చ వచ్చినటు లువయోగించుటయు నెన్నడు స్త్రీకి విధించబడలేదు.

ఇదేవిధముగ నాడుబిడ్డ హక్కుల విషయమున డాక్టరు అంబేద్కరు ప్రతిపాదించిన యాలోచనలు నిరర్థకములు, శాస్త్రవిరుద్ధములును. తండ్రికి పుత్రుడెంత ప్రియుడో పుత్రికయు నంతయే ప్రియురాలు. అయినను అందొకఱి నాతడు దానము చేయవలసి వచ్చుచున్నది. వేఱొకరి నింట నుంచుకొనవలసి వచ్చుచున్నది. ఒకరు తన వంశగోత్రాదు లను వృద్ధి బొందించి పిండ శ్రాద్ధాదులు చేయగా, వేఱొక రన్యగోత్రములలోనికి బోయి సర్వము చేయవలసి వచ్చు చున్నది. ఇందుచేత నిరువురి హక్కులలోను భేదమున్నది. ఆడుబిడ్డ హక్కుల విషయమున స్మృతులను ఉదాహరణగా గ్రహించుటవలన తాత్పర్యము తెలియలేదను విషయము సుస్పష్ట మగుచున్నది. ఈవిషయ మీగ్రంథమందే యన్యత్ర విశదముగ విమర్శించబడినది. 'శాననము ద్వారా రూఢి బలీయముకాగల' దని ప్రివీకౌన్సిలు చెప్పిన తీర్మానము బాగుగనే యున్నది. కొని యారూఢి శాస్త్రవిరుద్ధము కాకూడదనియే యందలి భావము. శాస్త్ర సమ్మతమైన రూఢియు, ప్రాచీనులు, శిష్టులు నాచరించుచు వచ్చిన యేదేని వ్యవ స్థయు భ్రాంతిరహితమగును. నేడు కన్యయొక్క చతుర్థాంశమునకు సంబంధించిన హక్కుల విషయమున జనులెట్లు పొరబడుచున్నారో, అట్లే వేర్వేఱు శాస్త్రముల భావములను దెలుసుకొనుట విషయమున గూడ బొరబడ వచ్చును. ఇది యొక యావశ్యకదాన మనియు, దాయము మాత్రము కాదనియు, మూల వచనములను బట్టియే తెలియుచున్నది. ఒక సోదరుడు స్వతంత్రుడగు తన వేఱొక సోదరులకు దన యంశమున గొంత దానము సేయడనియు, సోదరుడు తన యంశమునుండి కొంత భాగమును దన సోదరి పెండ్లి నిమిత్తమై ధర్మము సేయుననియు నీ మొదలుగాగల విషయము లన్యత్ర విశదీకరింపబడినవి. ఇంతియగాక సంపత్తు నశించుట, మనస్సు పాడగుట మొదలుగాగల యనర్థములు జరుగగల వని కూడ స్పష్టీకరింప బడినవి. పోవును. అనురాగవశమున సంపాదించుకొనిన వస్తువునందు నిషేధ భావము, దురాచార భావము, అధర్మ భావము నకు గంటుటతోడనే విధాన భావము, సదాచార భావము, ధర్మ భావము బయల్వెడలును, పిమ్మట దానిని మఱలించుట మనకు శక్యము కాదు. "యద్వాక్యతో ధర్మ ఇతీతరస్థితోన మన్యతే తస్య నివారణం జనః" "స్వభావరక్తస్య మహాన్ వ్యతిక్రమః." తన వద్ద నస్త్రము నుంచుకొనుటొక విష యము. పాపపు బని సేయుట కవకాశ మిచ్చుట వేరు విష యము. అస్త్రము నుంచుకొనుట అవైధము (తప్పు) కాదు. తన కాలు చేతులను మనుజుడు స్వాభావికముగ నరుకుకొన లేదు. కాని క్రొత్త క్రొత్త భర్తల ననుభవించ వచ్చునను దలంపుతోడ బురాతన భర్తలను విడచి పెట్టుచు నుండుటయు గష్టము కాదు. కావున భర్తను విడచిపెట్ట వచ్చు ననుటెంతయు హానికారణము, విడాకులు పుచ్చుకొనకుండగను కూడ కడుపుమంటను చల్లార్చుకొనుటకు విధిప్రయుక్తములు అగు నుపాయము లుండవచ్చును. వేశ్యలు కూడ నేదియో యొక సమయమున కడుపుమంటతో బాధపడువారే కదా ! అట్టి యెడ `కేవలమొక్క విడాకుల చట్టమూలమున మాత్రము కడుపుమంట చల్లారునని యెట్లు చెప్పగలము? సంతోషము లేనపుడు యౌవనపు టభిలాషలు మాత్రమెటు లీడేరును! ఎప్పటికైన సద్గ్రంధ పఠనమువలనను, ఇంద్రియ జయము, పవిత్ర వాతావరణము, భజన ధ్యానాదుల వలసను చిత్తము శాంతిని బొందగలదు. స్త్రీ పురుషుల ప్రకృతులు వేరు. స్త్రీ రక్షణమువల్లనే వంశ, గోత్రాదులు నిలుచును. స్త్రీక్షేత్రము పాడగుటతోడనే అన్ని విషయములు పాడగును. కనుకనే స్త్రీలు పురుషులకంటె నూరు రెట్లధికముగ బూజింపబడ దగినవారు, లజ్జా శీలములే స్త్రీలలోని విశేషములు. కావున వారికి పునర్వివాహ మెంతమాత్రము బనికిరాదు.

ఇంతియగాక విడాకుల చట్టమును స్త్రీ యెటులువయో గించుకొనుమో, యటులే పురుషుడు నుపయోగించుకొనును. స్త్రీలు లజ్జాసంకోచములు కలవారు కావున దీనివలన వారికి చాల తక్కువలాభము కలుగును. కాని చపలచిత్తులగు బురుషులే యీచట్టమును దుర్వినియోగముజేసి యధిక లాభమును బొందుదురు. పురుషులు పిల్లలుకల స్త్రీలను, రూపములేని స్త్రీలను, వయస్సు ముదిరిన స్త్రీలను విడచి క్రొత్త క్రొత్త. రంభలను వెదుకనారంభింతురు. రూపవతులగు యువతులే యొకటి రెండు మారులో పునర్వివాహమును జేసుకొనగలరు. కాని మిగిలిన రూపము లేని సాధారణ స్త్రీలు, వయస్సు ముదిరిన స్త్రీలు తమ భర్తలు విడచి పెట్టి వేయుటచే మఱల నెంత ప్రయత్నించినను రెండవ భర్తను బొందలేరు. వారు రక్తాశ్రువులు గార్చుచు జీవితము గడుపవలసివచ్చును. ఏదియో కొలది చవలచిత్తలగు రంభల నిమిత్తమై చాలమంది స్త్రీల జీవితములు ప్రమాదములకు గుఱియగును. వారి కడుపుమంట (ఆకలిబాధ) అధికమైపోవును. వారి మనోభీష్టముల గతి యేమి కావలయునో పాఠకులే యాలోచించి తెలును కొనగలరు. కోడుబిల్లు వారు చెప్పునదేమనగా, 'యుగయుగమందలి దయా, ప్రేమ, వాత్సల్యములు స్వరూపమును దాల్చినవా ? యన నొప్పు నారీలలామ తన యధికారములను దుర్వినియోగముసేయుననియు, స్వేచ్ఛాచరణకు దారితీయుననియు శంకించుట చాల యన్యాయము. సీతా, సావిత్రుల సంతాన విషయమున నిట్లు శంకించుట ఆ పరమ పతివ్రతల నవమానించుటే' కాని మన మిచట నాలోచించ వలసిన విషయమేమి యనగా, కర్తవ్యనిష్ణా, దయా, ప్రేమ, వాత్సల్యములు రూపము దాల్చినవా యన నుప్పు నారీ లలామ తండ్రి యాస్తిని, విడాకులు చట్టమును ఆపేక్షించునా? ఎంతమాత్రము నపేక్షింపదు. సీతా, సావిత్రి మున్నగు వారిని మూర్ఖులనుగా తలచి సంపత్తును, విడాకుల చట్టమును గోరుకొను స్త్రీ తనను సీతా, సావిత్రి మున్నగువారి సంతాన మని చెప్పుకొనవచ్చునా? వారికిందు ఏమైన గౌరవము కన్పించుచున్నదా ? వారు విడాకుల చట్టమువంటి యవ్యవస్థను గోరుకొనగా, దానిని దుర్వినియోగము చేయకుందు రనుటకు మాత్రము ప్రమాణమేమున్నది?

డాక్టరు అంబేద్కరు మహాశయుడు స్త్రీ సంపత్సమస్య నత్యాశ్చర్యముగ వర్ణించి చెప్పుదురు. కాని శాస్త్ర పరిచయము గల వ్యక్తుల కీవిషయము అత్యంత సుబోధ మగును. స్త్రీ యొక్క వారసత్వపు విధానముల నుల్లఘించి హిందూకోడు ప్రత్యక్షమందు మను, యాజ్ఞవల్క్యదుల వచనములను ద్రోసిపుచ్చినది. శాస్త్రములందే సంపత్తు కెవ్వ డధికారి యని పేర్కొనబడియున్నదో దానికి వ్యతిరిక్త విధానమును చేయుటెంతయు నధర్మము. స్త్రీ ధనము నాపత్కాల మందొక్క భర్త తప్ప అన్యు లెవ్వడును ఖర్చు పెట్టరాదు. ఇందుచేతనే ఆమె యధికారముల విషయముల నధికవిచారణ \ చేయబడినది. వివాహితయగు స్త్రీ కంటె, వివాహము కాని కన్యకకును, వివాహమైన వారియందు గూడ నప్రతిష్ఠితా స్త్రీ లకును ప్రథమాధికారము భావింపబడు చున్నది. ' అనేక మంది రోగుల కొకేమందు ' వంటి వ్యవస్థయే అవ్యవస్థ యనబడును. గాని మను, యాజ్ఞవల్క్యాదుల వ్యవస్థలు శాస్త్రీయములు కావున నవ్యవస్థలు కాజాలవు. రోగులందఱకు నొకే చికిత్స నేర్పరచువా డజ్ఞాని యగును.

కాని బుద్ధిమంతుడు కాదు. స్త్రీ పురుషులు ప్రకృతి, యోగ్యతలం దధిక భేద ముస్నది. స్త్రీలలోగల గర్భధారణ, సంతానసాలనాది తత్త్వములు పురుషులలో లేవు. పురుషుని యందుగల కాఠిన్య గుణము స్త్రీయందు లేదు. పురుషుడార్జన సేయును. స్త్రీ ఆయార్జనమును గృహమందు సముచితముగ సుపయోగించును. పురుషునిది బాహ్యక్షేత్రము. స్త్రీది గృహక్షేత్రము. కనుక స్త్రీ సదా పురుషుని నియంత్రణమందే యుండవలయునని విధించబడినది. తండ్రి యాజ్ఞానుసారము. గనూ, పుత్రుని యాజ్ఞానుసారముగమో, భర్తయాజ్ఞాను సారముగమో స్త్రీ తన ధనమును ఖర్చు చేయగలదు. స్త్రీ నేడు కొందఱు జనులు ధార్మిక, సామాజిక నియమ ముల విషయమున విప్లవమును జెలరేగజేయుట వీరత్వము, గర్వించదగు విషయమునని భావించి 'బహువివాహ ప్రతి షేధము, విధవావివాహ ప్రతిషేధము తమ సభ్యత నంతను మంటగలిపినద'ని పలుకుచున్నాడు. 'ఇదియంతయు వారు స్వకీయ గౌరవముకుమఱచిపోవుటయొక్క దుష్పరిణామమేకాని వేఱొండు కాదు' అని యింతమాత్రమే దానికిసమాధానము


ఏదేని వస్తువు మంచిదా? చెడ్డదా? యను సమస్య ప్రమాణము వలన బరిష్కారమగును. కాని ప్రపంచము వలన గాదు. సభ్యుడన నెవరు? “సభాయాం సాధుస్సభ్యః" ఈ వ్యుత్పత్తిని బట్టి సభయందు సాధువైనవాడు సభ్యుడనబడును.. లోకుల సభ యెటులున్న నట్లే యందలి జనులును సాధువులుగను, మంచివారుగను బరిగణింపబడుదురు. వేశ్యలసభలో వేశ్యయే మంచిదని భావించబడును. కాని యావేశ్యయే పతివ్రతామ తల్లుల సభయందు మంచిదని యెట్లు పరిగణింపబడును ? కోటు, బూటు, హేటులను ధరించి భోజము చేయువారికి, కాలు నేతులు కడుగుకొని, పట్టుబట్ట ధరించి, పవిత్రస్థానమున గూర్చొని భోజనము సేయువా రసభ్యులుగనే దోపవచ్చును. కాని వాస్తవమునకిది సభ్యత కాదు. ప్రామాణికుల సభయే వాస్తవమున ‘సభ' యనబడ దగినది. అందలి ప్రామాణికులే సభ్యులు. శాస్త్రానుసారముగ నడచుకొనువారే సభ్యులు. ఇచ్చవచ్చినట్లుగ నడచుకొనువారు సభ్యులునుకారు, నరులును

గారు. వారు కేవలము వానరులే.

"మతయో యత్ర గచ్ఛన్తి తత్ర గచ్చన్తి వా నరాః
శాస్త్రాణి యత్ర గచ్ఛన్తి తత్ర గచ్ఛన్తి తేనరాః."

ఇచ్చవచ్చినట్లుగ నడచుకొనువారే వానరులు, శాస్త్ర సమ్మతముగ నడచుకొనువారే నరులు. నేటి సభ్యులదృష్టిలో వివాహముకూడ నసభ్యమే కావచ్చును. హోమాదులు సేయుట, మంత్రముల బఠించుట, ప్రదక్షిణములు సేయుట, కన్యాదానము సేయుట లేక గ్రహించుట- ఇది యంతయు నాధునిక దృష్టియం దనభ్యతాలక్షణమే కావచ్చును. శాస్త్రముల ననుగమించువాడే యీయీ విషయములను దెలుసుకొన గలడు. అతని దృష్టికి శాస్త్ర సమ్మతమగు నవివాహము, వివాహము, బహువివాహము మున్నగునవన్నియు సభ్యత్వ చిహ్నములుగనే కన్పట్టును.

హిందూకోడువారు శాస్త్రీయ వివాహమందు ఒక్క సప్తపదియే కాక కన్యాదానము, లాజహోమము కూడ అవసరములేదని చెప్పినారు. అవి లేకున్నను గేవల సప్తపది మాత్రముననే వివాహముచితమని తలపబడునట. ఇది కూడ శాస్త్రముల పేరట శాస్త్రములమీద దాడిచేయుటయే. శాస్త్రీయ వివాహములను రిజిష్టరు చేయించుటవలన నవి యపూర్ణములని సిద్ధమగును. ఇందులకై వ్యయముకూడ నధికమగును, సివిలుమేరేజి యాక్టు ప్రకారము శాస్త్రములను పూర్తిగ ద్వేషించువాడుకూడ శాస్త్రములను విశ్వసించు వానితో సమానముగ భావించబడును. అట్లు భావించనివా డితరశాసనముల ప్రకారము దండనపాత్రుడగును. విధవా వివాహ విషయమున మాత్రము సంరక్షకుల యనుమతి కూడ తీసుకొనుటవసరమని భావించబడినది. విధవా స్త్రీ తన యిచ్చ వచ్చినవానిని బెండ్లాడవచ్చును. నేటి సాధారణస్థితిలోనే రిజ స్ట్రేషను లధికముగ నున్నవి కదా! బిల్లు అమలులోనికి . రాగానే ప్రతివ్యక్తియా లెక్కలేనన్ని వివాహములను, లెక్కలేనన్ని విడాకులచట్టపు టేర్పాట్లను రిజిస్ట్రేషను చేయించుకొనవలసి వచ్చును. గుమాస్తాల యొక్కయు, నాఫీసర్ల యొక్కయు. నావశ్యకత మెండయి ప్రజల ధన మంతయు ననవవసర కార్యక్రమములం దధికముగ ఖర్చయి పోవును. దీనికే 'అవ్యాపారేషు వ్యాపారః' అనిపేరు. ప్రతి వ్యవహారమందు కోర్టుల శరణము తప్పకపోగా, ప్రజలీ లా గ్రంథములను జదువుటకు దగుధనము, సమయము మాత్ర మేల ఖర్చుకాదు ? కాని యొక విషయమేమన, ప్రజలు చాల భాగము చదువురానివారు. రెండవ విషయమేమన వారి చాల సమయము ఉప్పు, మిరపకాయలను సమకూర్చుకొనుట లోనే ఖర్చయిపోవును. ఇక వారికి లాగ్రంథములను జూచు కొనుట కవకాశ మెక్కడ చిక్కును? ఆస్థితిలో ప్లీడర్ల, బారిష్టర్ల కడుపులు బాగుగ నిండునన్న మాట. ఈస్థితిలో గూడ "కేసులను, దావాలను తగ్గించుటకై తోడుబిల్లు అవస రము". అని పలుకుచున్నారంటే అంతకంటే నాశ్చర్య మేమున్నది ? 'కి మాశ్చర్యమతః పరమ్' పైగా నిటువంటి లంచగొండితనపు కాలములో కోర్టులద్వారా న్యాయమును మనమెటు లపేక్షించగలము ? ఎవండైన 'సివిలు మేరేజీ విషయమున కేసు పెట్ట దలచిన యెడల కోర్టులో సర్టిఫికేటు తీసుకొని వివాహ రిజిస్ట్రారు కివ్వవలసి వచ్చును. తీర్పు జరుగనంతవటకు వివా హము పూర్తికావట్లే తలపబడును. ఈవిధముగ జిన్న చిన్న విషయములందు కోర్టు వారికి బాగుగ లాభము కలుగును, వివాహము సంపన్న మగుటకు మిగిలిన విషయము లన్నియు సప్రధానము లగును. వివాహ రిజిస్ట్రారు, ముగ్గురు సాక్షులు మాత్రమే ప్రధానమగుదురు.

తరచుగ నాస్తికుల విషయమున నేవేని ధార్మిక నియమము నేర్పరచుటకే కాక శాస్త్రవ్యవస్థ నేదేని నవలం బించవలసి వచ్చినప్పుడుకూడ నాచరణశీలురగు ధర్మాత్ముల ద్వారా అవలంబించుట జరుగుచున్నది. వ్యవస్థ చేయువాడు రాగ ద్వేషములకు లోనై స్వార్థమును సిద్ధింపనించుకొనినచో నాతడు వ్యవస్థ చేయదగనివాడని భావింపబడు చున్నాడు. కొలది దినములనుండి మాత్రము పరిస్థితి యెట్లు మారిన దనగా నేదేని శాస్త్రవిరుద్ధ విషయము జరుగగనే దానినాధార ముగ జేసుకొని దానికనుకూలమగు వ్యవస్థ చేయబడనారంభిం చినది. అందుల కైకూడ శాస్త్రవచనము అన్వేషింపబడుచునే యుండెడివి. కాని క్రొత్త వ్యవస్థలను, క్రొత్త శాస్త్రములను నిర్మింప బ్రయత్నము చేయబడెడిది కాదు. కాని డాక్టరు అంబేద్కరు వంటి వ్యక్తి, అంత్యజుడయ్యు బ్రాహ్మణ స్త్రీని బెండ్లాడి మహాపాపమునకు బొల్పడిన వ్యక్తి ఇచ్చవచ్చిన రీతిని శాస్త్రమును నిర్మింప సాహసించుచున్నాడు. విశేషముగ నందఱు తనతో సమానులనుగజేయు బ్రయత్నించుచున్నాడు. సర్ సుల్తాను అహముదు ఏమి , యోగేన్ద్రమండలుడేమి, రావుసాహబేమి? డాక్టరు అంబేద్కరు ఏమి? - వీరెవరికిని వాస్తవముస హిందూధర్మమును దాకుటకైన యర్హతయు, నధికారమును లేదు. హిందువులు రామ, కృష్ణాద్యవతారములను, విశ్వామిత్ర, వశిష్ఠాది ఋషి పుంగవులనుగూడ కేవలధర్మపాలకులుగను, రక్షకులుగను మాత్రమే భావింతురు. పరబ్రహ్మయగు బరమేశ్వరుని గూడ బ్రహ్మదేవుని సృష్టి కర్తయని తలతురు కానీ, వేద నిర్మాతయని మాత్రము తలపరు. కాని యాపరమేశ్వరుడే అంతకు బూర్వమున్న వేదములను బ్రహ్మదేవుని హృదయమందు ప్రకటమొనర్చి నట్లు భావింతురు. ఇట్టి స్థితియందు వేదములను, వేదాధారము లగు నార్షధర్మగ్రంథములను ఆధారముగ జేసుకొని యేర్చరుప బడిన ధర్మములను మార్పు చేయుట కొక స్వేచ్ఛాచారియగు వ్యక్తి కధికార మెటులుండును? నేటి శాసకు లధికారగర్వమున గన్నులు గానక నేమి తలచిన దానిని జేయవచ్చును. కాని యంతమందు వారి యీశాససము లన్నియు తగులపెట్ట బడకను దప్పదు. చేసిన దుష్కృత్యములకు ప్రాయశ్చిత్తము చేయించబడకను దప్పదు.

రాష్ట్రము సర్వవిషయములందును స్థిరమైన యున్నతిని బొందవలయుననిన భౌతికవిషయములతో బాటు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక విషయములను గూడ ఉన్నతిలోనికి దెచ్చు టత్యవసరము. మన రాష్ట్రము నేటివఱకు సంగ్రామ పరిస్థితియందున్నది. ఇంతవఱకు స్వతంత్రతా సంగ్రామ విషయములనే యాలోచించుచు వచ్చినది. సైనికుని దృష్టి యం దొక్కశత్రువు నెదుర్కొనుటే ముఖ్యవిషయమై యుండును. ధార్మిక, సాంస్కృతిక విషయములు కేవలము నప్రధానములే కాక మార్గమధ్యమున నభ్యంతరము గలుగ జేసినచో, వారు వాటిని దిరస్కరించ వచ్చును కూడాను. "సైనికునకు గంభీరాలోచన సేయుట కవకాశముండదు. ఆ సమయమున సంస్కృతి యెడను, ధర్మముయెడను సైనికుడు చేసిన యవరాధములను క్షమించవచ్చును. కాని యుద్ధానంతర మట్టిపరిస్థితి యుండదు. స్వాతంత్య్ర సంగ్రామసమయమున నాయకులకు భారతీయధర్మ, సంస్కృతుల విషయమును నాలోచించుట కవకాశము చిక్కెడిదికాదు. వారు వీరావేశమునను, భావావేశమునను అనుచితములగు నాచరణములకు, నాలోచనలకు దావిచ్చినారు. వారు చూపిన త్యాగమును, తపస్సును, వీరత్వము కారణమగుట చేత ప్రజలు వారిలోని దోషములను గమనించలేదు. అదృష్టవశమున నేడు దేశము స్వతంత్రమైనది. ఇక నయ్యావేశమును విడచి, తెలివిలోనికి వచ్చి రాక్షస ప్రవృత్తులను విడనాడి వాస్తవికస్థితిని గుఱించి గంభీరముగ విచారణ జేయవలయును. ధార్మిక, సాంస్కృతిక నియమము లుల్లంఘించబడు చుండగా పెద్ద పెద్ద నాయకు లెవ్వఱును జూచియూరకుండరాదు. ఊరకున్నచో సామాన్యజను లింకను నుల్లంఘింప నారంభింతురు. ఎప్పుడైన నెవండైన న ధర్మకృత్యమును జేసినను దానిని ఉపన్యానము లందు, వ్యాసములందు జర్చించి ప్రచారము చేయవలదు. ప్రచారము ప్రజల నాకార్యమునే జేయ ప్రోత్సహించును. ప్రచారస్వాతంత్య్ర మొక పద్ధతినిబట్టి అంగీకరించనువచ్చును. కాని ధర్మవిశుద్ధములగు శాసనముల నిర్మించి బలవంతముగ బ్రజల మెడకు గట్టిపెట్టు పెంతయు నన్యాయము.

ఢిల్లీలోను, ఇతరస్థానములందు హిందూకోడును నిరోధించుట కైయేన్నేని సభలు జరిగినవి. కోడును సమ్మతింపని వారెవరైన యెదుటకు రావచ్చుననికూడ చెప్పబడినది. కాని యెవ్వఱు నెదుటకు రాలేదు. వేఱువేఱుగా మాత్ర మొకరొక విధముగ మాట్లాడిన వేఱొకఱు వేఱువిధముగ మాట్లా డిరి. కాని యాసమర్థకులు ముఖాముఖిగ మాటలాడుట గాని, లేక తమ యాశయములను వ్యాసములద్వారా ప్రచారము చేయుట గాని చాల మంచిది.

మేమందఱము మాధర్మమును, సంస్కృతిని, సభ్యతను మా లోకప్రియ ప్రభుత్వము కాపాడగలదని యాశించు చున్నాము. మా ప్రభుత్వ మీవిషయమున గంభీరవిచారణ చేయుటకు బదులుగ నధికాభినివేశముతోడ "హిందూకోడు" వంటియనావశ్యక వ్యవస్థలను చేయుచున్నదనగా మేమందఱు మెంతయు చింతింపవలసి వచ్చుచున్నది.