హిందూ కోడ్ బిల్ సమీక్ష/వివాహము

వికీసోర్స్ నుండి

హిందూకోడ్ బిల్ సమీక్ష

వివాహము

శాస్త్రీయ వివాహమునకు, కోడుప్రకారము క్రింది షరతులను బూర్తిసేయు టావశ్యకమని చెప్పబడినది:- (1) వివాహసమయమున నిరుపక్షములందు నేయొకరో భర్త గాని, భార్యగాని యుండకూడదు. (2) వివాహ సమయమున నెవ్వరును మూర్ఖులుగాని, పిచ్చివారుకాని, అయియుండ కూడదు. (3) వరునకు 18 ఏండ్లును, వధువునకు 14 ఏండ్లును వయస్సు పూర్తియై యుండవలయును. (4) రెండు పక్షములవారు పరస్పర నిషిద్దమైన సంబంధము కలవారు కాకూడదు. (5) రెండు పక్షములు పరస్పర సపిండ పక్షములు కాకూడదు. మఱియు నిరుపక్షములందు శాస్త్రీయ వివాహము జరుగుట యుక్తమే యని తెలుపు నాచారము. (6)16 ఏండ్లు వయస్సు నిండని వధువు విషయమున నామె సంరక్షకుని యనుమతి బడయు టావశ్యకము. మాతృకులమందు 8 తరములు. పితృకులమందు 5 తరములు సపిండములని భావించబడినవి. సోదర సోదరీమణులకు, పినతండ్రి సోదర పుత్రికలకు, పినతల్లి సోదర పుత్రులకు, సోదర సోదరీమణుల సంతతులకు వివాహము నిషేధించబడినది. ఇందు అర్థరక్త సంబంధము, సహోదర రక్తసంబంధము, ధర్మజసంతతి సంబంధము, అధర్మజ సంతతి సంబంధము, దత్తక సంబంధము, రక్తజ సంబంధము, కూడ జేర్చబడినవి.

శాస్త్రీయ వివాహమున కేర్పరుపబడిన షరతులన్నియు ధర్మయుక్తములే యట. ఆలోచించి చూచిన నిది యంతయు గల్ల యని వ్యక్తము కాగలదు . ఆలోచించి చూడగ నిందలి మొదటి విషయమే పొరబాటుగ దోచుచున్నది.

సిద్ధాంత ప్రకారము స్త్రీ కొక్క వివాహమే యుక్తము. పతి యున్నను, మరణించినను స్త్రీ పునర్వివాహము చేసుకొన దగదు.

"నతు నామాపి గృహ్ణీయా త్పత్యా ప్రేతే పరస్య చ"
                                   (మను. 5-157)
"సకృదంశో నిపతతి సకృత్కన్యా ప్రదీయతే"
                                    (మను. 9-47)
                                   
"అయం ద్విజైర్హి విద్వద్భిః పశుధర్మో విగర్హితః
 మనుష్యాణామపి ప్రోక్తో వేనే రాజ్యం ప్రశాసతి"
                                   (మను. 9-66)
                                   
“న వివాహవిధావుక్తం విధవా వేదనం పునః."
                                   (మను. 9-65)

సావిత్రి మొదలగు వారే భయంకరాపత్తులో బడవలయునని యెఱింగియు మానసిక నిర్ణయమును మార్చుకొన లేదు గదా ! అట్టి స్థితిలో భర్త సజీవుడై యుండగనే యాతని విడచి స్త్రీ పునర్వివాహము చేసుకొనుటయనున దెంతయు నధర్మము కాదా ? ఇందు వేఱుగ జెప్పవలయు నదే మున్నది ? పురుషులకు గూడ ఏక పత్నీవ్రతము అత్యంత ప్రశంస నీయమే. అయినను భార్య మృతిబొందిన స్థితియందు సజీవు రాలైయున్న స్థితియందు గూడ పిచ్చిదయిన కారణము చేతను, సంతతి కలుగుకున్న కారణము చేతను, అగ్ని హూత్రాది కర్మలను, వంశమును నిలువబెట్టు కొనుటకై పురుషుడనేక వివాహములను జేసుకొన వచ్చునను విధానము శాస్త్రములందు స్పష్టీకరింపబడి యున్నది.

"పునర్దార క్రియాం కుర్యాత్పునరాధానమేవ చ"
                              (మను 5-168)

ఇట్టి యితిహాసములు గూడ బెక్కులు కలవు. పురుషులం దూహింపవీలు లేని సమత్వమును స్థాపింపనెంచు మనుజులు గర్భధారణ విషయమున గూడ బురుషులను బాధ్యులనుగ జేయవలసి యుండును. స్వరూ పముచేతను, అవయవములచేతను,యోగ్యతచేతను, శక్తిచేతను గూడ స్త్రీపురుషులలో భేదమున్న కారణముచే వారివారి కార్యములందు శాస్త్రము నిరూపించుచున్న భేదములనుగూడ స్వీకరించ వలసినదే. పురుషుడు తన ప్రకృతిచేత సంవత్సరమం దనేకమంది బిడ్డలను కనగలడు. స్త్రీతన ప్రకృతిజేత సంవత్సరమం దొక్క పర్యాయమే బిడ్డలను గనును. ఇట్టి స్థితియం దీసమత్వనాటక మంతయు నెందులకు? గర్భధారణము, శిశుపోషణమున నసాధారణశక్తి తల్లిదే. అనేక సంతానోత్పాదనశక్తి కేవల మొక్క పురుషునియందే యుండును. కనుక శాస్త్రాను సారముగ నిరువురి వివాహములందు, బాధ్యతలందు నధిక భేదమున్నది. వ్యావహారికముగ వంశరక్షణనిమిత్తమై భార్యయే భర్తను పునర్వివాహము జేసుకోన బ్రోత్సహిం చును. కాని కోడుబిల్లును బట్టి యట్లు జరుగజాలదు. పునర్వివాహనిమిత్తముగ మొదటి భార్యకు విడాకులిప్పించి తీర వలసినదే యట! ఆహా! ఏమి ధర్మము ! భార్య యిష్టపడి నప్పుడు కూడ వంశరక్షణనిమిత్తముగ బురుషుడు పునర్వి వాహము జేసుకొన గూడదట!

మహమ్మదీయులలో బహువివాహవిధానము యుక్తమే. కాని హిందువులలో నీహిందూకోడుమూలమున శాస్త్రవిశ్వాసము, ధర్మవిశ్వాసము సంతరించియే పోవును. ఇక నాదంపతు లిరువురు మహమ్మదీయులలో గలసి తమ మనోరథము నీడేర్చుకొందురు. అట్టి స్థితిలో హిందూకోడు ధర్మము నేమి రక్షించును? పైగా మహమ్మదీయులలో బహువివాహవిధానమును నిరోధించనంతవరకు పైవిధానమును నిర్మించనే కూడదు. అట్లు నిర్మించిన భారతీయసమాజ మందు తప్పక క్రొత్త పాకిస్తానుకు బునాది యేర్పడును. హిందువుడు తన జీవితమం దొక్క పెండ్లి చేసుకొని నలుగురు బిడ్డలను గనిన, మహమ్మదీయుడు నాలుగు పెండ్లిండ్లు చేసు కొని పదహారుగురు బిడ్డలను గనగలడు, ఈకారణముచేత. హిందువుల సంఖ్యతగ్గును. మహమ్మదీయుల సంఖ్య పెరుగును. మఱల వారు పాకిస్తానును గోరనారంభింతురు, హిందూకోడు కారణముగ మను, యాజ్ఞవల్క్యాది మహర్షులను, వేదాది శాస్త్రములను దిరస్కరింప సాహసించినవార లొక ప్రభుత్వ మేర్పరచిన హిందూకోడు మున్నగు శాసనములను దిరస్క రించుట కెంతమాత్రము జంకు గొనరు. క్రమక్రమముగ వారిలో విశ్వాసభావ మంతరించి పునర్వివాహము జేసుకొన వచ్చునను ఆశకొలది మహమ్మదీయ మతమును స్వీకరింప నారంభింతుడు, అప్పుడు హిందూధర్మ రక్షణ విషయము గగన కుసుమమై పోవును.

డాక్టరు అంబేద్కరు మహాశయులు మహాశయులు సెలవిచ్చిన విషయ మేమనగా - " హిందువుడు తన యింట 'వధూవరు లిరువురు నొకే వర్ణమునకు, నొకే జాతికి, నొకే యువజాతికి జెందిన వారయి యుండు టావశ్యకమను' విషయ మాచారముగా వచ్చుచున్నచో, దానిని బట్టి యాతడట్లే చేయవచ్చునట. కాని దేశహితవాది యెవండైన హిందూవర్ణములందు, జాతులందు, నుపజాతులందు విశ్వాసము లేనికారణమున నేబయటి పిల్లనైన బెండ్లాడ నెంచిన నాతడు నట్లు చేయవచ్చునట. రూఢివాదులు (ఆచారముగవచ్చు విషయముల నాదరించువారందఱు) తమతమ ధర్మానుసార మెట్లు తలచిననట్లు చేసుకొనవచ్చునట. ఒక ధర్మము ననుసరింపనెంచని దేశహితవాదు లెవ్వఱైన దమ యాలోచనమును, దమ యంతఃకరణమును అనుసరించి నడచుకొనుటకు స్వతంత్రులట."దీనిని బట్టి జాతిమతభేదానుసారము జరిగిన పెండ్లి ధార్మికవివాహమనియు, జాతిమతభేదములతోడ నిమిత్తము లేకుండ జరిగిన వివాహము సివిలుమేరేజి, లేక రిజిస్ట్రిమేరేజి యనియు స్పష్ట మయినది. ఇందుచేతనే వీరు శాస్త్రీయ వివాహమును, రిజిస్ట్రీ మేరేజిని — రెంటిని గూడ నంగీకరించినారు. పైగా గొందఱు జాతిమతవిచక్షణతో నిమిత్తము లేకుండ జరిగిన పెండ్లికూడ శాస్త్రీయమే యని నిరూపింప బ్రయత్నించుచున్నారు. కాని దానివలన బ్రయోజన మేమియు లేదు. ఏలయని హిందూ కోడును బట్టికూడ ఆ పెండ్లి యధార్మికమే యగును. యాలోచించదగు విషయమేమనగా హిందూధర్మమునుగాని, శాస్త్రములనుగాని యాదరింపక వ్యతిరిక్తాచరణము జేయు వాడుకూడ హిందువుడే యగునా? ఒకవేళ హిందువుడే యైనచో కోడుబిల్లు హిందూధర్మమును రక్షించునది యని భావించు టెట్లు ? హిందూధర్మమును, హిందూ శాస్త్రములను, హైందవాచారములను ఉపేక్ష చేసి విరుద్ధముగ నడుచుకొను వాడుకూడ హిందువుడే యైనచో కూతురును బెండ్లాడిన తండ్రియు, సోదరిని బెండ్లాడిని సోదరుడుకూడ హిందువులా? కాదా ? యనికూడ ప్రశ్న వేసుకొనవలసి వచ్చును. వారు కూడ హిందువులే యనినచో, నట్టి విషయములు కూడ హిందూకోడుయందున్న వన్న మాటయే.

ఈస్థితిలో మహావీరత్యాగి వేసిన ప్రశ్నయే బాగుగ నున్నది. ఏమని యనగా " అంతఃకరణముయొక్క ప్రేరణయే మాన్యమయిన స్థితిలో నెవడైన మతాంతర వివాహము కూడ జేసుకొనవచ్చునా ? " దీని కేచ్చటను సమాధానము గాన్పింపదు వాస్తవమున నిది యొక యనర్థము. శాస్త్ర ములను ధర్మములను దీసి యావల బెట్టుడని ప్రోత్సహించు పద్ధతి, పతనోన్ముఖ ప్రవృత్తులు స్వాభావికములని యందఱు నెరిగిన విషయమే. శాస్త్ర ధర్మ విశ్వాసమున్ననాడు మనుజుడు పతనమునకు దూరీభూతుడగును. రాజ్యమందు దురాచార, సదాచారములను, సత్య, అనృతములకు - రెంటికిని స్వతంత్రత నిచ్చిన స్థితిలో సదాచారమందు, సత్యవిషయమునను బ్రవర్తించు జనులెంద ఱుందురు ? శాస్త్రోక్తములగు వర్ణాశ్రమ ధర్మములను బాటింపను వచ్చును, ఉల్లంఘించను వచ్చునన్న స్థితిలో కఠిన నియమములను బాటించుట కెవ్వరుద్యుక్తులగుదురు. ? మద్యము త్రాగను వచ్చును. త్రాగకుండను ఉండవచ్చును. వ్యభిచారము చేయనువచ్చును. చేయకుండను ఉండవచ్చును. ఎట్లు చేసిను సమానమే ' యని రాజ్య, సమాజములందు సంపూర్ణ స్వాతంత్య్ర మిచ్చి వేసినచో, శాస్త్రీయ నియములు పాటింపబడునను నాశయే వ్యర్థము. కావుననే శాస్త్ర విరుద్ధ కార్యములను జేయ నవకాశ మిచ్చుట ఆత్మహత్య జేసికొన నవకాశమిచ్చుటతో సమానమని విద్వాంసుల మతము. రెండువిధముల కార్యము లను సమానముగ భావించుటనునది సతీమతల్లిని, వేశ్యను సమానముగభావించుటయే. ఇది చాలయనుచిత విషయము. కనుక శాస్త్ర ధర్మముల విశ్వాసము లేని వారికి 'సివిలు మేరేజి 'యే బాగున్నది. హిందూకోడును నిర్మించి శాస్త్ర విశ్వాసులను, అవిశ్వాసులను సమానముగ జూచి ధర్మ విశ్వాసమును, శాస్త్రవిశ్వానమును శిధిల పరచుట ఏమియు బాగులేదు. బిల్లు ఆచరణలోనికి వచ్చిననాటి నుండియు ప్రాచీన నియమములు, నాచార వ్యవహారములు లన్నియు రద్దు చేయబడగలవు' అని కోడులో స్పష్టముగ వ్రాసి యుంచ బడినది. హిందూకోడుద్వారా ప్రాచీన శాస్త్రము లన్నియు మంట గలుపబడు చున్నవని దీనిని బట్టియే స్ఫుటమగు చున్నది. శాస్త్ర, ధర్మ విశ్వాస మడుగంటుట తోడనే అన్న చెల్లెండ్ర వివాహ సమస్య సంభవించును. దానికి గూడ కొంత వ్యవస్థ చేయవలసియే వచ్చును. ప్రాచీన శాస్త్ర నియమములను, ఋషి గణము యొక్క యాదేశములను తిరస్కరించుట కభ్యాసపడిన వ్యక్తులు వర్తమాన శాసకుల శాసనముల నుల్లంఘించుట కెంతమాత్రము సంకోచింపరు.

ఇదియు గాక వైదిక వివాహము తర్మ సమ్మతమైన విషయము. చాల దూరపు వ్యక్తుల రక్తసంబంధము, చాల దగ్గఱ వ్యక్తుల రక్త సంబంధము నిర్వీర్యమయి పోవునను విషయము స్పష్టము. ఈ స్థితిలో ధార్మిక విధానము తర్క విరుద్ధమని భావించుటెట్లు? ఇట్లే శాస్త్రాచార్యుల యువదేశము లచే సంస్కరింపబడిన యంతఃకరణమం దుదయించు ప్రేర ణయు శాస్త్రానుకూలమే యగును. ఇక శాస్త్రీయ వివాహ మంతఃకరణ ప్రేరణకు విరుద్ధముగా నెటులుండును? ప్రేరణ యొటులున్నను బాధ లేదందురా? ఏ స్వేచ్ఛాచారి యంతఃకరణమందైన కూతురును చెల్లెలును పెండ్లాడవలెనని ప్రేరణ బయల్వెడల వచ్చును. కసాయివాడు గోహత్యకు బాల్పడుట కూడ వాని యంతఃకరణ ప్రేరణయే. శ్రీ ధర్మదేవు లిట్లు వ్రాయుచున్నారు:

"జాయాపతే మధువతీం వాచం వదతు శంతివామ్
                         (ఆధర్వ. 4-30 - 2)
                         
“ఇహేమా వింద్ర సనంద చక్రవాకేవ దంపతీ"
                         (అధర్వసం. 14.4.84)
                         
ఇత్యాది వేడమంత్రములందు ఒక్క వివాహమే యాదర్శ
మైనదని స్పష్టముగ సమర్థించ బడినది.

"సంపాతపంత్యభిత స్పపత్నీరిప సర్షవః"
                         ( ఋగ్వేద. 1-104-8)

ఇత్యాది మంత్రములందు సపత్నీత్వము అత్యంత దుఃఖదాయకమని స్పష్టీకరించబడినది. కాని యిక్కడ చక్ర వారముల యుపమాసము భార్యాభర్తల దాంపత్యమును సమర్థించుచున్నది. విడాకుల చట్టమున కిష్టపడు వారికిది యంతయు నెందులకు నచ్చును? చక్రవాక మిధునము వియోగ కారణముచే రాత్రి యంతయు నాక్రోశించుచునే యుండును. తెల్లవాఱగనే మఱల గలసికొని యానందించును. భర్త మృతిబొందినప్పటి విషయ మెటులున్నను జీవించియుండగనే విడాకులిచ్చి పునర్వివాహము చేసుకొనవచ్చు నన్నచో నిక దంపతులయెడ నాచక్రవాక దృష్టాంతమెట్లు చరితార్ధమగును? వస్తుతః పైజెప్పిన మంత్రమందు దంపతుల పరస్పర ప్రేమ, స్నేహము వర్ణించబడినది. వేఱుగ సవసరములగు సంతానాదుల నిమిత్తముగా వేదవిహితమైన వివాహాంతరములు నిషేధింపబడ లేదు, ఒక్క యూపమునకు రెండు త్రాళ్లను గట్టవచ్చును. కాని ఒక్క త్రాటికి రెండు యూపములు కట్టు వడజాలవు. ఇట్లే ఒక పురుషున కిరువురు భార్య లుండ వచ్చును. కాని ఒక స్త్రీకి ఇరువురు భర్తలు ఉండజాలరు.

"యదేకస్మిన్ యూపే ద్వే రశనే పరివ్యయతి తస్మా దేకో ద్వే
జాయే విందతే, యన్నైకా ద్వయో ర్యూపయోః పరివ్యయతి తస్మాన్న
ద్వౌ పతీ విన్దతే "
                                   (తై. సం. 6.5.1.4)

బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యునకు కాత్యాయని, మైత్రేయి యను నిరువురు భార్యలు కలరని వర్ణించబడినది. సపత్నీత్వము కడు దుఃఖదాయకమని చెప్పు మహా శయుడు కూడ వేదప్రతిపాదితమైన సపత్నీ విధానము నంగీకరింపక దప్పదు. నిషేధాత్మక వచన మేదేని దొరకనంతవరకు నావశ్యకములగు వివాహాంతరముల కభ్యంతర ముండదు.

"కల్యాణీభి ర్యుపతిథి ర్నమర్యః
                     (ఋ.10-30.5)
"జనీరివ పతిరేక స్సమానః ని మామృజే వుర ఇంద్ర స్సు సర్వాః".
                     (ఋ. 7-26-3)

అనగా ఇంద్రుడు కేవల మొంటరియై శత్రుపురముల నన్నిటిని ఒక్క భర్త యనేక భార్యలను శోధన జేసినట్లుగా శుద్ధిచేసెను. ఈ మంత్రమును బట్టి యొక పురుషునకు బలువురు భార్యలుండుట చెప్పబడినది. 'అనేక మంగళప్రదురాండ్రగు యువతులతోడ గూడిన పురుషుడు' అని ప్రథమ మంత్రమందు వర్ణించబడినది. ఒక్క భర్త అనేక భార్యలతో సమానుడని రెండవ మంత్రమువలన బ్రకటమగుచున్నది.

"రాజేవ హి జవిభిః క్షేప్యేవాబ ద్యుభిః".
                      (ఋ 7-18-2)

అనగా ఓయీ ఇంద్రా ! ఒక రాజు అనేక స్త్రీల

తోడ శోభించునట్లు నీవు అనేక దీప్తులతోడ నలరారు చుంటివి. ఈ మంత్రమందోక పురుషున కనేకభార్యలు వర్ణింపబడిరి.

"పతిర్జనీనామ్
            (ఋ. 1.66-8)

ఇందుగూడ ననేక స్త్రీల కొకభర్త బోధించబడినాడు.

"క్షీరేణ స్నాతః కుయవస్య యోషే హతే తే స్యాతామ్"
                               (ఋ. 1_104–3)
"మర్య ఇవ యువతిభి స్సమర్షతి”
                               (ఋ. 9-86-16)
"ఏవే ద్యూనే యువతయో సమస్త"
                               (ఋ. 10-30-6)
"పరిష్వజన్తే జనయో యథా పతిమ్"
                                (ఋ.10-43-1)
"ఇంద్రం జుషాణా జనయో నమన్తీ"
                                [కా.సం.36-6]
"మనోర్వైదశ శాయా ఆసన్"
                                [మై.సం.1-5-6]

ఇత్యాది అనేక మంత్రముల వలన నొక్క పురుషునకు పలువురు భార్య లుండవచ్చునని బాగుగ దేటతెల్ల మగుచున్నది. కౌటిల్యులు కూడ వ్రాయుచున్నారు---

"పుత్రార్థీ ద్వితీయాం భార్యాం విన్దేత"

అనగా పుత్ర నిమిత్తముగా రెండవ భార్యను గ్రహించవచ్చును-

వధూవరులం దెవఱును మహామూర్ఖులుగాని, పిచ్చి వారుగాని కాకూడదు. ఇది మిగిలియున్న షరతు. వాస్తవ మందు వివాహ సమయమున నా విషయములం దెక్కువ దృష్టి నుంచవలసినదే. కానీ మూర్ఖత్వాదికమును నిర్ణయించుట కఠినము. ఏదియో యొక యంశమున నందఱియందు మూర్ఖత్వ ముండవచ్చును. సతీమతల్లి వివాహమైన పిమ్మట భర్తను విడనాడుట తలపనే తలపదు.

ఇట్లే కన్యకు 14 సంవత్సరములు నిండవలయునను విషయమును ధర్మనిరుద్ధమే

"అష్టవర్షా భవేద్గౌరీ" “త్రింశద్వర్షో వహేత్కన్యాం హృద్యాం
ద్వాదశవర్షికాం త్య్రష్టవరో౽ష్టవరాం వా ధర్మే సీదతి సత్వరః.”
                                       (మను. 9-94)

ఇత్యాది వచనములు ప్రమాణభూతములు.

"ఉపోపమే పరామృశ మా మే దభ్రాణి మన్యథాః సర్వాహమస్మి
రోమశా గాంధారీణా మివావికా"
                                        (ఋ. 1-126-7)

ఈ మంత్రమువలన 'యౌవన మంకురింపని కన్యను బెండ్లాడి సంభోగార్థము ప్రతీక్ష సేయవలయును' అని వ్యక్త మగుచున్నది.

"అన్యామిచ్ఛ పితృషదం వ్యక్తాం స తే భాగో జనుషా తస్య విద్ధి ”
                                         (ఋ. 10-85-21]
                                         

ఈ మంత్ర మందలి 'వ్యక్తామ్' అను పదమునకు సాయణులు భాష్యము వ్రాయుచున్నారు.

"వ్యక్తామనూఢేనేతి పరిస్ఫుటాం విగతాంజనాం వా
  స్తనోద్గమాది రాహిత్యేన అప్రౌఢా మిత్యర్థః"

దీనినిబట్టి యప్రౌఢయగు కన్యకు బెండ్లిసేయుటే వేద సమ్మతము,

"ప్రదానం ప్రాగృతోః "
                     (గౌ. ధ. సూ. 18-22

ఇందు గూడ కన్యకు రజస్వల కాక పూర్వమే పెండ్లి సేయవలయునని చెప్పబడినది.

"న్యూనాద్ధి ప్రజా అసృజత"
                  (తై. సం. 6-1-87)

దీనిని బట్టి కూడ తక్కువ ప్రాయమున పెండ్లి చేయ వలెనని సూచింపబడు చున్నది. కౌటిల్యులు పండ్రెండవ యేట స్త్రీ వ్యవహారయోగ్యరాలని చెప్పుచున్నారు.

"షోడశవర్షే పుమాన్ ద్వాదశవర్షే స్త్రీ ప్రాప్తవ్యవహారా భవతి"
                                      (భర్మ్యప్రకరణే)

రజోధర్మము జరుగగనే వికృతి కలుగనారంభించును . భర్త నిశ్చయింపబడిన మీదట నావికారము చెందిన మనస్సు లోని ప్రేమ యా భర్తయందు గేంద్రీభూతము రాజొచ్చును. భర్త నిశ్చితుడు కానిచో స్త్రీ మానస మిటు, నటు బరువు లెత్తుటయు, క్షేత్ర మపవిత్రమగుటయు సంభవించును. మనస్సు చెదిరిన సంతానముకూడ తదనుకూలముగనే యుం కును. అమెరికాలో నొక యూరోపీయ మహాశయునకు, యూరోపీయ వనితకు నల్లని నీగ్రోజాతి బాలుడు కలిగినాడని ప్రసిద్ధి. డాక్టరులు పరిశోధన చేసి నీగ్రోజాతివాని చిత్రపట మును చింతన చేసినంత మాత్రమున నల్లజాతి సంతతి కలిగిన దని చెప్పినారు. కనుక శుద్ధనంతానార్థమై రజస్వల కాక పూర్వమే పెండ్లి సేయుట చాల మంచిది. గర్భాధానము 14 వత్సరములు గడచిన తరువాతనే చేయవచ్చును.. వాస్తవమున వివాహ మొక సంస్కారము. పురుషునకు ఉపనయన సంస్కారము జరిగినట్లు కన్యకకు వివాహ సంస్కారము జరుగును.

"వైవాహికో విధిః స్త్రీణామౌపనాయనికః స్మృతః"
                               (మను. 2-67,68)

కనుక ఉపనయనకాలమే కన్యకు వివాహకాలము. పతి సేవ, గురుసేవ, శ్వశురకులవాసము, గురుకులవాసము నాపె కార్యములు, గర్భాధానాదులు వేఱు, 14 లేక 16 ఏండ్ల కాలము గర్భాధానాదుల కనువయినది. 8 మొదలు 12 వత్స రముల వఱకు వివాహమునకు సముచిత సమయము. సంస్కారకాల మతిక్రమించినచో పురుషు డెట్లుగ ప్రాయ శ్చిత్తము జేసుకొనవలయునో , అట్లే రజస్వలయైన కన్యకు ప్రాయశ్చిత్తానంతరమే వివాహము విధించబడినది.

మాతాచైవ పితా చైవ జ్యేష్టభ్రాతా తథైవ చ
త్రయస్తే నరకం యాన్తి దృష్ట్వా కన్యాం రజస్వలామ్ |
                              (సంవర్త 1.67)

పితుర్దృహే చ యా కన్యా రజః పశ్యత్యసంస్కృతా
సా కన్యా వృషలీ జ్ఞేయా తత్పతిర్వృషలీపతిః
                              (హారీత)
                              
భ్రూణహత్యా పితుస్తస్యాః సా కన్యా వృషలీ స్మృతా
యస్తాం సముద్వహేత్కన్యాం బ్రాహ్మణో జ్ఞానదుర్బలః
అశ్రద్ధేయం హ్యపాంక్తేయం తం విద్యాద్వృషలీ పతిమ్
                                     (దేవల)

అత్రి, కశ్యపుడు, భోధాయనుడు, విష్ణువు, యముడు మున్నగు వారందఱి మతము నిదియే. 'రజోదర్శనముతోడనే తండ్రియందు స్వామిత్వ ముండదు.' అని మనువు కూడ సమ్మతించుచున్నాడు.

"సహి స్వామ్యాదతిక్రామే దృతూనాం ప్రతిరోధనాత్ " [మను]

"కన్యామృతుమతీం శుద్ధాం కృత్వా విష్కృతిమాత్మనః
 శుద్ధిం చ కారయిత్వా తాముద్వహేదానృశంస్యధీః"

ఇత్యాది వచనముల ద్వారా ఆశ్వలాయనుడు రజ స్వలా వివాహమునకు బ్రాయశ్చిత్తమును జెప్పినాడు. (నిర్ణయ సింధు) నగ్నికను అనగా రజన్సు నెఱుగని కన్యను ఏ గుణవంతుడగు బ్రహ్మచారికో యిచ్చి పెండ్లి చేయవల యుసని బోధాయనుడు చెప్పినాడు. గుణవంతుడు దొరుకని యెడల గుణహీనునికైన యిచ్చి పెండ్లి చేయవలసినదే. కాని రజస్వలను మాత్రము కానీయకూడదు.

" దద్యాద్గుణవతే కన్యాం నగ్నికాం బ్రహ్మచారిణే
  అధవా గుణహీనాయ నోపరున్ధ్యాద్రజస్వలామ్ " [4.12]
 

గౌతమ మతానుసారముగ కూడ రజస్వల కాక పూర్వము కన్యాదానము చేయనివాడు దోషి యగును. "అప్రయచ్చన్ దోషీ" - మన్వాది మహర్షులందఱి యభి మతము నిదియే.

"త్రింశద్వర్షో వహేత్కన్యాం హృద్యం ద్వాదశవర్షికామ్,
 త్య్రష్టవర్షోష్ట వర్షాం నా ధర్మే సీదతి సత్వరః॥”

ఈ మనువచనము కూడ కన్యకు 8 మొదలు 12 ఏండ్ల లోవుననే వివాహము విధించుచున్నది. కన్య రజస్వలయైన. తోడనే తండ్రియందు స్వామిత్వము తప్పిపోవును. అప్పుడా కన్యయే తన యిచ్చవచ్చిన వరుని వరించవచ్చును. ఆస్థితి యందు శుల్కముకూడ నీయనక్కఱలేదని చెప్పబడినది.

“పిత్రే న దద్యాచ్ఛుల్కంతు కన్యామృతుమతీం హరన్ |
సహి స్వామ్యాదతిక్రా మేదృతూనాం ప్రతిరోధనాత్ II "
                                  (మను. 9-93)

'తల్లి, తండ్రి, పెద్ద అన్నగారు అవివాహితయగు కన్యను రజస్వల యగువఱకు నుంచిన నరకమును బొందుదురు' అని సంవర్తులుకూడ జెప్పుచున్నారు.

“మాతా చైవ పితా చైవ జ్యేష్ఠ భ్రాతా తథైవచ
త్రయస్తే నరకం యాన్తి దృష్ట్వా కన్యాం రజస్వలామ్|"

హారీతులుకూడ ఇదియే చెప్పుచున్నారు.

“పితుర్గృహే చ యాకన్యారజః పశ్యత్యసంస్కృతాః
సా కన్యా వృషలీ జ్ఞేయా తత్పతి ర్వృషలీపతిః "

రజస్వలయైన కన్యయొక్క తల్లి, తండ్రి, ఆమెను బెండ్లాడు భర్త ముగ్గురును దోషమును బొందుదురు.

"భ్రూణహత్యాపితుస్తస్యాః సా కన్యా వృషలీస్మృతాః
యస్తాం సముద్వహేత్కన్యాం బ్రాహ్మణోజ్ఞాన దుర్భలః ॥
అశ్రాద్ధేయం హ్యపాంక్తేయం తం విద్యాద్వృషలీపతిమ్"

దేవల, అత్రి, కశ్యపుల యభిప్రాయములు కూడ నివియే (ధ. నూ. 18-23) ఇట్లే హిందూకోడుకు చెందిన వివాహమునకు వర్ణ వ్యవస్థతో నిమిత్తము లేదనినారు. ఏ జాతి పిల్లవాడైన యేజాతి పిల్లనైన బెండ్లాడవచ్చును. కొందఱు జనుల యభిప్రాయమేమనగా జన్మమూలకమగు జాతివ్యవస్థయే బాగు లేదట. డాక్టరు అంబేద్కరు ప్రభృతులు స్పష్టముగా జాతి పంక్తి భేదమే ఉంచదలచుకొన లేదు. కొందఱు జనులు కర్మ చేత వర్ణవ్యవస్థ చేయుదమని తలచుచున్నారు. ఆవిషయము ననేకమారులు ఖండించుట కూడ జరిగిపోయినది. శాస్త్రము లందు బ్రాహ్మణాది జాతుల నుద్దేశించి కర్మములు విధించ బడినవి. కర్మల నుద్దేశించి జాతులు విధించబడలేదు. తల్లి, సోదరి మొదలగువారిని ఉద్దేశించి వారి కర్తవ్యములు విధించ బడును. కాని కర్మలనుద్దేశించి మాతృత్వాదులు విధించ బడవు. అనగా’ ‘మా’తా ఏవంకుర్యాత్, పత్నీ ఏవంకుర్యాత్ ' అని విధాన మీవిధముగనే యుండును. కాని 'యా ఏవం కుర్యాత్సామాతా, యా ఏవం కుర్యాత్సా భగినీ' అని యిట్టి విధాన ముండదు. ఇట్లే యనినచో పత్నీకృత్యమును చేసిన కారణము చేత సోదరియు, పుత్రికయుగూడ పత్నులే యగు దురా. ఇది శాస్త్రసమ్మతము కాదు. ఇట్లే 'బ్రాహ్మణః కుర్యాత్ అని విధానముండును. కాని 'య ఏవం కుర్యాత్స బ్రాహ్మణః' అని విధాన ముండదు. కనుక బ్రాహ్మణకర్మ చేసినంత మాత్రమున నెవ్వడు బ్రాహ్మణుడు కాజాలడు. కర్మచేతనే వర్ణవ్యవస్థ యందురా ? అందఱు దినదినము అనేక మార్లు బ్రాహ్మణులుగను, అనేకమారులు శూద్రులుగను మారవచ్చును. ఇక వ్యవస్థ యెట్లు నిలుచును? ఒక బ్రాహ్మణుడు కర్మచేత శూద్రుడు కావచ్చును. అతని భార్య బ్రాహ్మణిగనే యుండవచ్చును. ఆస్థితిలో నాతడామెకు విడాకులైనా ఈయవలెను లేదా వారిరువుఱకు గలిగిన సంతతి చండాల సంతతి యగును. కర్మణా వర్ణవ్యవస్థ చేయ బోవువారు దీనికేమి సమాధాన మిత్తుర? ఉపనయనాది సంస్కారముల నెట్లు చేతురు? బాలకుని కర్మాదులను నిర్ణయించుటే కఠినమైపోవు సన్నమాట. పైగా బ్రాహ్మణునకు శర్మాన్త నామ సంస్కారము యెనిమిదేండ్ల ప్రాయమున వసన్తఋతువునం దుపనయనసంస్కారము నెట్లు పొసగును? సంస్కార, అధ్యయన కర్మాదులను బట్టి జాతి నిర్ణయించ బడిన జాతి నిర్ణయమునుబట్టి సంస్కారాదులు జరుగును. ఇచ్చట నన్యోనాశ్రయదోషము బాగుగ స్ఫుటమగు చున్నది.

"బ్రాహ్మణోఒస్య ముఖమాసీత్ బాహూరాజన్య కృతః,
 ఊరూత దస్యయద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో ఆజాయత"

ఇత్యాదుల వలస బ్రాహ్మణాదుల పుట్టుక స్పష్టీకరింపబడి యున్నది. "జన్మనా బ్రాహ్మణోజ్ఞేయః" ఇది కూడ స్పష్టమే.

"అజ్యేష్ఠాసో అకనిష్టాన ఏతే సంభ్రాతరో నాపృధుః సౌభగాయ
 సమానపయసశ్చాత్ర మరుతో రుక్మవక్షసః

ఈ మంత్రము మరుత్తుల నుద్దేశించి చెప్పబడినది, వారు 49 మ్మండుగురు. అందఱు సమవయస్కులు. వీరిలో జ్యేష్ఠత్వ, కనిష్ఠత్వము లూహింపబడవు. వాస్తవమందు శబ్దము జ్ఞప్తికి దెచ్చునది యగునుగాని కారకము కాజాలదు. " న హి శబ్దః శతమపి ఘటం పటయితుమీష్టే"- నూరు శబ్దము లయినను ఘటమును పటముగ మార్చజాలవు. వయస్సు చేతను గుణముచేతను వాస్తవిక జ్యేష్ఠత్వ, కనిష్ఠ త్వములున్నచో నిరాకరించు టసంభవము.

" శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతామ్ " స్పష్టముగ శూద్రునకు బ్రాహ్మణత్వము, బ్రాహ్మణునకు శూద్రత్వము వచ్చునని చెప్పబడినది ఈ వాక్యము కొందఱకు ఊతగా నున్నది. ఇదియు సమంజసము కాదు. ఏలయన " సత్మర్మ చేసిన శూద్రుడు జన్మాంతర మందు బ్రాహ్మణుడగుమ్మ మఱియు దుష్కర్మ జేసిన బ్రాహ్మణుడు జన్మాంతరమందు శూద్రుడగును" అని యిదియే యందలి భావము. కుక్క, పంది మొదలగునవి జన్మాంతరమున గాని వేఱు యోనిని బొందవు. అట్లే బ్రాహ్మణాదులును జన్మాంతరమున గాని వేఱు యోనిని బొంద జలరు. వేదములు శ్వ, శూకరాది యోనులతో సమానము గనే బ్రాహ్మణాది యోనులను వేరు వేరుగ గ్రహించినవి.

" తద్య ఇహ రమణియచరణా అభ్యాశోహయత్త
  రమణీయాం యోనిమాపద్యేరన్ బ్రాహ్మణయోని వా
  క్షత్రియ యోనిం వా వైశ్వయోనిం వా
  ఆథ య ఇహ కపూయ చరణా అధ్యాశోయత్తే

   కపూయాం యోని మాదద్యేరన్ శ్వయోనిం వా
   సూకర యోనిం వా చణ్డాలయోనిం వా "

అనగా శుభ కర్మలవలన బ్రాహ్మణాది యోనులు, నశుభ కర్మలవలన శ్యాధి యోనులు సంప్రాప్తించును. వాస్తవమున

 "శూద్రాయాం బ్రాహ్మణా జ్జాతః శ్రేయసా చేత్ప్రజాయతే
  అశ్రేయాన్ శ్రేయసీం జాతిం గచ్ఛత్యాసప్తమా ద్యుగాత్
                                       [10-64]

దీనిని బట్టి మనువు చెప్పునది మేమనగా శూద్రకన్యకు బ్రాహ్మణునివల కన్యక కలుగ నామెకు మఱల బ్రాహ్మణునితోడ వివాహబంధన మేర్పడి కన్యక యేకలిగి యాకన్యకు మఱల బ్రాహ్మణ సంపర్కమువలన కన్యయే కలుగుచు నీవిధముగ నేడవ తరముందలి కన్య బ్రాహ్మణి యగును దీనిని బట్టి బీజమునకు ప్రాధాన్యత చెప్పబడినది. కాని క్షేత్రమునకు చెప్పబడ లేదు. దీనిని బట్టి శూద్రుడు బ్రాహ్మణకర్మ చేసినంతమాత్రమున బ్రాహ్మణు డగునను విషయము ఖండించబడినది.

"న జాత్యా బ్రాహ్మణశ్చాత్ర క్షత్రియో వైశ్య ఏవన
న శూద్రో న చవైమ్లేచ్ఛో భేదితా గుణకర్మభిః" (శుక్రనీతి)

"న కులేన న జాత్యా వా క్రియాభిబ్రాహ్మణో భవేత్ " (మ.భా.)

ఇత్యాది వచనములు కర్మణా వర్ణవ్యవస్థను ప్రోత్సహించుటకు తోడ్పడుచున్నవి. కాని యిదియు సంగతము కాదు. వాస్తవమున నీవచనములందు గుణకర్మముల

హేతుత్వము మాత్రము చెప్పబడినది. కాని పూర్వోక్త శ్రుతుల ప్రకారము జన్మాంతరమందలి గుణకర్మలను బట్టియే బ్రాహ్మణాదు లేర్పడుదురు. కార్యమునకు ముందే కారణ ముపయోగింపబడును. కార్యానంతరము కారణముండదు. ఘట కారణములగు మట్టి, కఱ్ఱ, కుమ్మరి మొదలగునవి ఘటోత్పత్తికిముందే కావలసి యుండును. ఉత్పత్తి కారణములు అన్య ఘటమునకు కారణములగును. కాని ఉత్పన్న ఘటమునకు గారణములు కావు. ఇట్లే ప్రాక్తన గుణకర్మలే బ్రాహ్మణాదుల యుత్పత్తికి కారణములగును. ఈ పుట్టిన బ్రాహ్మణాదుల గుణకర్మల యుపయోగము మఱల జన్మాంతర మందు జరుగును. కాని యుత్పన్న కార్యమందు జరుగదు. ఈవిషయమే "చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మవిభాగశః" ఆదులలో చెప్పబడినది. పరమేశ్వరుడు గుణకర్మానుసారముగా సృష్టి చేయును. గుణకర్మానుసారముగ సృష్టియందు బరివర్త నముజరుగదు. ప్రాక్తనకర్మానుసారమన్ని కార్యములు జరుగును.

ఈ విషయము నాస్తికులందఱు సమ్మతించెదరు. వాస్తవమున సింహదంపతులకు బుట్టింది శౌర్య ధైర్యాది గుణకర్మములతోడ నెప్పారు సింహముయగును. గుణకర్మలు లేకున్నను సింహమునకు సింహికి బట్టినది జాతిసింహమగును. సింహ మిథునమునకు జన్మించుకున్నను శౌర్య ఆర్యాది గుణ మలు కలిగి యుండుటచే "సింహోదేవ దత్తః అని కూడ చెప్పబడుచున్నది. అట్లే బ్రాహ్మణ దంపతులకు జన్మించి శమదమాది బ్రాహ్మణోచిత కర్మలతోడ విల సిల్లువాడు ముఖ్య బ్రాహ్మణు డనబడును. స్వాభావిక గుణ విహీనుడైనచో జాతి బ్రాహ్మణుడనబడును. కాని బ్రాహ్మణ దంపతులకు జన్మింపని వారియందుగూడ బ్రాహ్ళణోచిత గుణ కర్మాదులుండటచే గౌణ బ్రాహ్మణత్వ మారో పింపబడుచున్నది.

"విద్యా తపశ్చ యోనిశ్చ త్రయం బ్రాహ్మణ్య కారణమ్
 విద్యా తపోభ్యాం యో హీనో జాతిగ్రాహ్మణ ఏవ సః "
                                    [మ. భా .]

గోవుయొక్క గుణములు కల యాడుగాడిదను గాని, యాడు కుక్కనుగాని 'గోవు' అని భావించి వైతరణిని దాటుటకై దానము సేయుదురా ? తేజస్సు మొదలుగాగల గుణము లన్నియు గలదయ్యు స్మశానాగ్ని నుపయోగింతురా? బ్రాహ్మణోచిత గుణకర్శములు కలిగియుండియు నబ్రాహ్మణునకు బ్రాహ్మణునితోడ వివాహ ఆహార సంబంధము పనికిరాదు. మహాభారతమందు కూడ స్పష్టీకరింపబడి యన్నది "మతంగు డనువాడు పెక్కేండ్లు తపము చేసియు బ్రాహ్మణత్వమును బొందలేదట నిషాద గ్రామ మందుండి కర్మభ్రష్ఠుడైన యొక జాతిమాత్ర బ్రాహ్మణుని వలన గరుడుని కంఠమందు తాపము కలిగినది. ఇవన్నియు జన్మనా వర్ణవ్యవస్థను బోషించు చరిత్రములు. భీష్ముడు. యుధిష్ఠిరుడు పరమ శమదమాది గుణ సంపన్ను లయ్యు బ్రాహ్మణు లనబడ లేదు. "ఎవండైన జాతిచేతను బ్రాహ్మణుడు కాదు గుణము చేతను, నడతచేతను బ్రాహ్మణుడగును." శాస్త్రములందిట్టి వచనము లెన్నియో గానవచ్చును. కాని యవి గుణమును, నడతను బ్రశంసించుటకే చెప్పబడినవని యెరుంగవలెను. ఎట్లనగా " యో౽ర్డే శుచిః సహి శుచిః నమృద్వారిశుచిశ్శుచిః " ధనముయొక్క పవిత్రతయే నిజమయిన పవిత్రత మృత్తికా జలముల ద్వారా సంపాదించిన పవిత్రత పవిత్రతయే కాదు. ఇది యర్థశుద్ధిని బ్రశంసించుటకు చెప్పబడింది. కాని మృత్తికా జలంబుల శుచిత్వము నిషేధింపబడినదని భావము కాదు. విద్యావిహీనుని బశువందురు “విద్యావిహీనః పశుః ” అట్లే దోష కృత్యములను సేయుటచేత శూద్రుడగునని కూడ చెప్పబడినది. "త్య్రహేణ శూద్రో భవతి" వాస్తవార్థమేమనగా మనుజుడు పశువు కానేరనట్లే బ్రాహ్మణాదులు శూద్రాది జాతులలోనికి మారజాలరు. కర్మణా వర్ణవ్యవస్థ పూర్తి నసంగతము. బుద్ధిమంతుడెవ్వడు సంగీకరించడు. కర్మణా వర్ణ వ్యవస్థయందైన కొలది నియమము లున్నవి. కాని హిందూకోడులో వర్ణవ్యవస్థనే దీసివైచి నారు. సంకరసృష్టికి ప్రయత్న మొనర్చుచున్నారు.

అనులోమవివాహమును గూడ వసువు నిషేధించి నాడు. శూద్రస్త్రీని బెండ్లాడుటచే బతితుడగును. "శూద్రా వేదీ పతతి " శయ్యమీద శూద్రస్త్రీని పరుండబెట్టుట చే బ్రాహ్మణున కధోగతి సంభవించును, పుత్రుడు కలిగినచో

బ్రాహ్మణత్వమే పోవును.

"శూద్రాం శయనమారోప్య బ్రాహ్మణో యాత్యధోగతిమ్
జనయిత్వా సుతం తస్యాం బ్రాహ్మణాదేవ హీయతే”
                                    (మను. 8-17]

బ్రాహ్మణాదులకు శూద్రాది వివాహ మెంతయు హానికరము. ప్రతిలోమనివాహ మంతకంటెను నిందనీయ విషయము. క్షత్రియునివలన బ్రాహ్మణ కన్యకు గలిగిన సంతతి సూతులనబడుదురు. వైశ్యునివలన క్షత్రియకన్యకు గలిగిన సంతతి మాగధవంసంతతి యనియు, విప్రకన్యకు గలిగిన సంతతి వైదేహసంతతి యనియు జెప్పబడినది. శూద్రుని వలన విప్రకన్యకు గలిగిన సంతతి చండాలసంతతి యగును.

"క్షత్రియాద్విప్రకన్యాయాం సూతాభవతి జాతితః
వైశ్యాన్మాగధ వైదేహో రాజవిప్రాంగనాసుతౌ
శూద్రాదాయోగవః క్షత్తా చాండాలశ్చాధమో నృణామ్
వైశ్యరాజన్య విప్రాసు జాయంతే వర్ణసంకరాః" [మను 10-11,12]

వ్యభిచారేణ వర్ణానామవేద్యా వేదనేనచ
స్వకర్మణాం చ త్యాగేన జాయంతే వర్ణసంకరాః" [మను. 10-24]

కౌటిల్యుడు కూడ నిది చాల యనర్లకారి యని చెప్పినాడు. శూద్రునకు శూద్రవర్ణ స్త్రీయే భార్య కాగలదు.

"శూద్రస్యతు సవర్ణైవనాన్యా భార్యా విధీయతే"

.....గూడ హిందూకోడు ధర్మసమ్మతమైనదని చెప్పుచున్నారంటే యెంతయో యాశ్చర్యముగ నున్నది! అసవర్ణ వివాహము, సగోత్రకవివాహము శాస్త్రము

లందు నిషేధింపబడినవి.

"అసపిణ్డా చ యా మాతు రసగోత్రా చ యా పితుః"
                                        (విష్ణుస్మృతి)
                                        
"న సగోత్రాం న సమానార్థప్రవరాం భార్యాం నిష్టేత

 మాతృతశ్చాపఞ్చమాత్. పితృ తశ్చాసప్తమాత్" (29-9-16)
 
"సగోత్రాయ దుహితం ప్రయచ్ఛేత ( ఆశ్వ- ధ సూ. 22.11)

స్మృత్యర్థసారముందు సగోత్రకన్యా వివాహమునకు బ్రాయశ్చిత్తము విధించబడినది. ఎవడైన యెరిగియుండియు సగోత్రకన్యను పరిణయమాడి గమనము చేసినచో గురుతల్ప వ్రతము నవలంబించుటచే బరిశుద్ధుడు కాగలడు. కలిగిన సంతతి చండాల సంతతి యగును. అయినను ఆస్త్రీని భోగించ కుండ తల్లితండ్రులవలె బాలించవలయును. అజ్ఞానవశమున నయినచో 8 చాంద్రాయణ వ్రతములు చేయవలయును.

'ఇత్థం సగోత్రసంబంధే వివాహే స్థితే యది | కశ్చిజ్ఞానతప్తాం
కన్యామూఢ్వోపగచ్ఛతి, గురుతల్పవ్రతాచ్ఛుధ్యేత్ | గర్భస్థజ్జో౽న్త్యజం
ప్రజేత్, భోగతస్తాం పరిత్యజ్యపాలయేజ్జననీమివ అజ్ఞానా .....
శుద్ధ్యే త్రిభిర్గర్భైస్తు కశ్యపః"

సపిండ వివాహమునకు బ్రాణత్యాగమే ప్రాయశ్చిత్తము.

"సపిండావత్యదారేషు ప్రాణత్యాగో విధీయతే" [బృహద్యమ]

నపిండస్త్రీ తోడ గాని, సగోత్ర స్త్రీతోడ గాని యజ్ఞాన వశమున
బెండ్లియైనచో నామెను తల్లివలె భావించ వలెను.

" సపిండాం సగోత్రాం చేదమత్యోషయచ్ఛేన్మాతృవదేవాం బిభ్బయాత్ "

(బౌధాయన)

అసపిండా చ యా మాతు రసగోత్రా చయా పితుః "

ఈ మనువచనమును బట్టి తల్లికి అసపిండురాలును, తండ్రికి అసగోత్రురాలునగు గన్యను బెండ్లాడవలయునని స్ఫుటమగుచున్నది. అన్యయుగములందు అసవర్ణ వివాహము చర్చింపబడినను కలికాలమందు మాత్రము నిషేధింపబడినది

"పఞ్చమాతృప్త మాదూర్ధ్వం మాతృతః పితృతస్తథా"

ఇత్యాది స్మృతులు మాతృకులముందు 5 తరములును, పితృకులమందు 7 తరములును సపిండములని దెల్పుచుండగా కోడుబిల్లు 3 తరముల వరకే సపిండత సంగీకరించుచున్నదన యేమి బాగుగ నున్నది?

"పంచమే సప్తమేచైవ యేషాం వైవాహికీ క్రియా
క్రియాపరా అపిహితే పతితా శ్శూద్రతాం గతాః "

ఇది యవరార్క మందు మరీచి చెప్పిన వచనము. దీనిని బట్టి 5, 7 తరముల మధ్య వివాహము చేయువారు పతితు లగుదురని వ్యక్తమైనది.

పంచమాతృప్త మాద్ధీనాం యః కన్యా ముద్వహేద్విజః
గురుతల్పీ స విజ్ఞేయఃస గోత్రాంచైవ ముద్వహన్ '

దీనియొక్క యభిప్రాయము కూడ నదియే.

"తృతీయాం వా చతుర్థీం నా పక్షయోరుభయోరపి
వివాహయేన్మనుః ప్రాహ పారాశర్యోంగిరా యమః ”

ఈ వచనమును బట్టి తృతీయ, చతుర్ధములందు గూడ వివాహము విధించబడినది. కాని యది సంగతము కాదు. ఏలయన పూర్వోక్త వచనములకు విరుద్ధముగ నుండుటచేత దాని భావమును దత్తుని సంబంధములను, సవతి సోదరుని సంబంధమును లేదా క్షత్రియాదుల సపిండతమ గూర్చియు గ్రహించు కొనవలయును. ఇట్లు 'మదన పారిజాతము'ను * బట్టి నిర్ణయ సింధుకారులు నిర్ణయించినారు.

శాస్త్రవిశ్వాస మడుగంటిన తోడనే తండ్రి యాస్తి లో నాడుబిడ్డకు భాగము లభించుట కారణముగా సోదరితోడ సోదరునకు వివాహము ఎటులైన జర్చలోనికి వచ్చితీరును. ఒక కోటీశ్వరుడుగు సోదరుడు తని సోదరిని 50 లక్షలను ఒరుల కీయనినెంచునా? రెండు వస్తువులను దన యింటనే యేల నుంచుకొన కూడదు। సగోత్రవివాహము, అసవర్ల వివావాము, సపిండ వివాహములు జడగుట లేదా? అట్లే చెల్లెలును మాత్రమేల బెండ్లాడకూడదు? ఇటువంటి విచార ములు వచ్చుటతోడనే యందఱు నన్న చెల్లెండ్ర వివాహమును గూడ గోరుకొందురు.

ఒక్కొక్క మహాశయుడు సివిలు వివాహమును గూడ సిద్ధాంతీకరింప నెంచుచున్నాడు. కాని డాక్టర్ అంబేద్కరుగారు రిజిష్టరు వివాహమునకు సపిండత్వము తోడ నిమిత్తము లేదని యంగీకరించుచున్నారు. అనగా 5, 7 తర ముల విషయ మెటులున్నను, 3, 5 తరములలోపల స్త్రీ పురుషులకు వివాహములు జరుగ వచ్చునన్నమాట. దాక్షిణాత్యులకు ఆచారముగ వచ్చు మాతుల కన్యోద్వాహము (మేనమామ కూతురును బెండ్లి చేసుకొనుట) దేశ విశేషమం దపవాదమే. అంత మాత్రమున సార్వజనిక నియములకు భంగము కలుగదు.

రిజిష్టర్డు నివాహముందు ఒకే గోత్ర ప్రవరలు కల వధూవరులకే వివాహము జరగగలదని డాక్టరు అంబేద్దరు స్పష్టీకరించి వ్రాసియున్నారు.







____________________________________________________________________________________________________ త్వరలో ద్వితీయ భాగము రాగలదు.