హిందూ కోడ్ బిల్ సమీక్ష/సింహావలోకనము

వికీసోర్స్ నుండి

శ్రీ హరిః

హిందూకోడ్ బిల్ సమీక్ష

సిం హా వ లో క న ము

సనాతనవిధానము

హిందువులు తమ విధానము సనాతనమైనదని విశ్వసింతురు. వారికొఱకై నవీనవిధానముల యక్కఱయేమియును లేదు. ఈజగత్తు జడపరమాణువులవలనను, విద్యుత్కణముల వలనను సృజింపబడినది కాదు. కేవల జడ ప్రకృతివలన నిర్మింపబడ లేదు. రైలుబండి, తంతి, రేడియో, టాంకు, ఫిరంగు, యంత్రబద్ధమగు తుపాకి, వాయుయానము, యాటం బాంబు మున్నగువాని నిర్మాణమునకు చేతనమనుజుని విశేష బుద్ధిబలము కారణమని మనమంగీకరించుచున్నాము. అట్టియెడ నాకాశము, వాయువు, సూర్య చంద్ర నక్షత్ర సముదాయము పర్వత సముద్రాదులు. శుక పిక హంస మయూరాది పక్షినివహము, వన లతా పుష్పగుచ్ఛ ఫలాదికము మొదలగువాని తోడ విలసిల్లు నీనమస్త భూవలయము, మనుష్యుడు, వాని మస్తిష్క బుద్ధి శరీరేంద్రియాదికము మొదలుగా గల వివిధ విచిత్రతాభూయిష్ఠంబగు విశాల ప్రపంచమును రచించునాతడు కూడ యెవ్వడో సర్వజ్ఞచేతనుఁ డవశ్యముగ నుండితీరవలయును గదా ! చేతను డెవండైనను బుద్ధిపూర్వకముగనే కార్య నిర్మాణము జేసుకొనును. కుమ్మరిని జూడుడు! అతఁడు మున్ముందు దండచక్రాటకమును సంపాదించుకొని జ్ఞానపూర్వ కముగనే కుంభనిర్మాణము చేయుచుండును. అట్లే యీశ్వరుడు కూడ సర్వజ్ఞానమును మున్ముందు సమకూర్చుకొనియే సమస్త ప్రపంచమును సృజించుచున్నాఁడు. అతని సర్వజ్ఞానమందు సూక్ష్మశబ్దానువేధము కలదను విషయము వఱకును సమ్మతము. "న సో౽స్తి ప్రత్యయో లోకేయః శబ్దానుగమాదృతే"(వాక్పదీయే) అనగా పరిచిత భాష యొక్క సూక్ష్మశబ్దములు చేరని ప్రత్యయము. జ్ఞానము సంకల్పము, విచారము వేఱొకటి లేదు. ఈ దృష్టిచేత యీశ్వరసృష్టికి కారణభూతమగు విజ్ఞాన మందుగూడ ఒక కొంత సూక్ష్మశబ్దానుభేదము తప్పక నుండి యుండును. ఆశబ్దములే వేదములు, ఆవేదములే యాభగ వంతుని విధానములు.

ప్రపంచమందు గ్రీకు, లాటిను, జైందు, సంస్కృతము నాదిగాగల భాషలే యత్యంత ప్రాచీనభాషలు. ఈభాషలు పరస్పరమందు అప్పచెల్లెండ్ర వంటివనియు, వీటి కొక మాతృ భాష తప్పక నుండియుండు ననియు, చెప్పబడుచున్నది. కాని యాభాష లభ్యము కాదు. ఒకానొక నాడీభాషను మాటలాడు జనులందఱు నొక్కచోట నుండియుందురనియు, వారందఱు నొకే భాషను మాటలాడువా రనియు, వారి యాభాష యెట్టిదో తెలియజాల దనియు జను లాభాషలయందలి విలక్షణ సామ్యమును జూచి యూహించుచున్నారు.దేశవిషయమున గూడ మతభేదమున్నది. పశ్చిమోత్తరఆసియా, ఉత్తరధ్రువము ఈ దేశములలో నా భాష వాడబడియుండునని యూహింపబడు చున్నది. అచ్చటి జనసంఘ మొకదాని కొకటి దూరమైనకొలది వారిలో భేదము బయల్వేెవెడల నారం భించెను. కాని కొంత యోరిమి వహించి విచారణ చేయగా మనమిపు డంతరించి పోయియుండు ననుకొన్న యాభాష సంస్కృతభాషయే యని వ్యక్తమగును. ఇది యన్య భాషలకు సోదరి యని చెప్పుటకంటే మాతయని చెప్పుటయేయుచితము. ఈ భాషయొక్క విశాల ప్రకృతి, ప్రత్యయములు, నుపసర్గలు, అక్షయశబ్దకోశము, నిరుపమాన వ్యాకరణము, సాహిత్యము అన్నియు బ్రపంచమునకు నిధులు. దీనిశక్తి నిస్సీమము, దీనికి కూడ పూర్వమం దొకభాష కలదనుటకు ప్రమాణ మేమియు గన్పడుట లేదు. నేటి చరిత్రకారులు కూడ ఋగ్వేదము ప్రపంచమం దత్యంత ప్రాచీనగ్రంథమని యంగీకరించు చున్నారు. అది 5 వేల సంవత్సరములకు పూర్వమందలిదని యూహింపబడుచున్నది. మోహింజోదరో యొక్కయు, హరప్ప యొక్కయు బరిశీలన ఫలముగా లభించిన వస్తువులను బట్టి జనులావస్తువుల కాలమునాటిసభ్యత సుమారు పదిహేను వేల సంవత్సరములకు పూర్వముండెననికూడ యూహింపదొడగిరి. అచ్చటి శిల్పములను, చిత్రముల రంగులను, పాత్రలను,కుండ ములను, యజ్ఞపాత్రలను, అన్య వస్తువులను బట్టి యవి వైదిక కాలీనసభ్యతకు చెందినవని తెలియుచున్నది. కొందఱవి సుమేరియను సభ్యతకు చెందినవని భావింతురు. కొందఱా సుమేరియను సభ్యతకూడ వైదిక సభ్యతమీద నాధారిత మైనదని భావింతురు. ఏమయినను, ఆధునిక పాశ్చాత్య సభ్యతమీడ నడచు జనులందఱు ప్రపంచమంతయు 5 వేల సంవత్సరములకు పూర్వము ప్రాదుర్భవించిన దనియు, ప్రాచీన చరిత్రకాలము, నవీన చరిత్రకాలము నందలివేయనియు భావించుచున్నవుడు వైదిక సభ్యత పదిహేను వేల సంవత్సరము లకు బూర్వమందలిదని ఋజువు చేయబడినదంటే యానందించదగిన విషయము కాదు. వాస్తవమం దాధునిక వైజ్ఞానికలోకము లక్షలాది, కోట్లాది యబ్దములకు బూర్వ మందలి దీయావ ద్భూమండలమని భావింపదొడగిరి. “మొదట సూర్యమండల ముండెడిది. దానినుండి యొక ఖండము ఛిన్నమై క్రిందబడి చల్లబడుచు, బడుచుఁ జంద్రమండల మైనది. రెండవ ఖండము విరిగిపడి భూమండల మయినది. అందు యావిరి, మేఘము, వర్షము, వనస్పతి, జంతుగణము. వానరనివహము, మానవసముదాయము , క్రిమిక వికాసమును బొందుచు వచ్చెను. ఇంకను బొందుచు నుండును. వికాస వాదులు చెప్పు నీయు క్తిని బట్టికూడ సూర్యమండల మెట్లు నిర్మింపబడెను? ఎప్పుడు నిర్మింపబడెను? దాని యాయువెంత! యను ప్రశ్నలు ప్రశ్నలవలెనే యుండిపోవు చున్నవి. . నవీన వికాస వాదు లివుడు ప్రకృతిని గుఱించికూడ కల్పన జేయగలిగిరి. కాని వైదికులది వారికంటెను చాల పూర్వమునాటిదని నిర్ణయింతురు. వారి సిద్ధాంతమును బట్టి ప్రతికార్య నిర్మాణమందును బ్రకాశము, నాందోళనము, నిలుపుదల తప్పక సంభవించును. ఇందు ఏయొకటి లోపించి నను కార్యము సంపన్నము కానేరదు. కేవల మాందోళనమే సాగుచుండి యెట్టినిలుపుదల లేకున్న యేచిత్రమును, వస్తువును నిర్మితము కాజాలదు. ఒక యెడ నాందోళనము, వేఱొకయెడ నిలుపుదలయు నున్ననాడే కార్యసిద్ధి కలుగును, ఆప్రకాశమే సత్త్వము, ఆ యాందోళనమే రజోగుణము, ఆ నిలుపుదలయే తమోగుణము ననంబడును. ఈ మూడు గుణముల యొక్క సమానస్థితియే ప్రకృతియు, విషమస్థితియే వికృతియు నన బడును,' ప్రకృతియందు సామ్య వైషమ్యములు స్వయముగా నుదయించునవి కావు. అవి చేతనుని జ్ఞప్తిని, ఇచ్ఛను బట్టి సంభ వించును. “జానాతి, ఇచ్చతి, అథకరోతి" యని సిద్ధాంతము. జ్ఞానేచ్ఛల యనంతరముననే కార్యము జరుగును కనుక సర్వజ్ఞుడు, సర్వశ క్తిసమేతుడు నగు భగవంతుని జ్ఞానేచ్ఛల వలననే యాతని ప్రేరణ లేక కృతిచేతనే ప్రకృతియందు వైషమ్యసామ్యములు సంభవించును. సమస్తమును దనలో నిముడ్చుకొని, ఒకేపదార్థమందు సమాప్తి జెందకుండయుండు నదియే పరమకారణము మఱియు బరమాధిష్ఠానమును. మృత్తికావికారములగు ఘటశరావాదులందు మృత్తికయే యుపలభ్యమగును. అది యొకే పదార్థమందు సమాప్తి జెందదు. కాని యామృత్తికయందే ఘటశరావాదిక మంతర్గత మగును, సత్త్వరజస్తమములు చాంచల్యావష్టంభములు నన్నిటియందును సత్తాస్ఫూర్తులు గలవు. సత్తాస్ఫూర్తులు లేనియెడ నన్నియు నిస్సత్త్వములు, నిస్ఫూర్తికములు నయిపోవును. ఎందును సిద్ధికలుగనేరదు. కావున సత్తాన్ఫూర్తి యన్నిటి యందును గలదు. సత్తాస్ఫూర్తులయందే సర్వము నిమిడియున్నది. అదియే సర్వాధిష్ఠానము, సర్వకారణము, సర్వప్రకాశకమునుఉపాదాన నిమిత్తములు కూడనదియే. కావుననే వేదాంతమందు అభిన్నోపాదాన నిమిత్త కారణత్త్వము సిద్ధాంతీక రింపబడినది, అట్టి కారణభూత సత్తాస్ఫూర్తిరూపుడు, సచ్చిదానంద మనస్వరూపుడునగు బరమేశ్వరుని సృష్టికి మూలభూతమైన జ్ఞానమందనువిద్ధములగు శబ్దములే వైదికశబ్దములు. ఇట్టి స్థితి యందు సృష్టియంతయు నయిదారు వేల యబ్దములకు బూర్వ మందలిదని భావించుట వట్టిభ్రమ యని సిద్ధమగుచున్నది. బీజమునకు పూర్వ మంకురము, నంకురమునకు బూర్వము బీజమునని భావించబడుచున్నట్లే మఱియు బీజాంకురపరంపర యనాదియని యూహింపబడుచున్నటులే నిద్రకు బూర్వము జాగరణము, జాగరణమునకు బూర్వము నిద్ర యనియు, జన్మకు బూర్వము మరణము, మరణమునకు బూర్వము జన్మము ననియు, సృష్టికి బూర్వము ప్రలయము, ప్రలయము నకు బూర్వము సృష్టియనియు భావించవలసి వచ్చుచున్నది. కర్మకు ముందు జన్మ, జన్మకుముందు కర్మయని యూహింప వలసివచ్చుచున్నది. కర్మ రూపకారణ వైచిత్య్రము లేనిదే జన్మ రూపకారణవైచిత్య్రము సిద్ధింపజాలదు. ఈవిధముగా నిద్రాజాగరణ, జన్మమరణ, సృష్టిప్రలయ, జన్మకర్మాధిక మంతయు న నాదియని యంగీకరింపవలసి వచ్చుచున్నది. . పిమ్మట ననాది ప్రపంచమున కనాదిసృష్టికర్తయగు బరమేశ్వరుడు నాది లేనివాడే యనియు, నాతనివిజ్ఞానము. నావిజ్ఞానము తోడ ననువిద్ధములై యున్న శబ్దములగు వేదములు గూడ నాది లేనివే యనియు సిద్ధమగు చున్నది.

వేదములను 5 వేల సంవత్సరములకు బూర్వమందలి వని నిర్ణయింప బూనుకొనువారు అవలంబించు సిద్ధాంత మేమి యనగా - "ఏదేని ఘటన జరుగకముందు వ్రాయ బడదు. ఒక విషయము జరుగక ముందుగ నా విషయము, వ్రాయబడనేరదు. ఏదేని గ్రంథమందు హిట్లరు యొక్క నామమును జూచినవాడు ఆగ్రంథము హిట్లరు జన్మించిన తరువాతనే వ్రాయబడిన దనుకొనును. కాని పూర్వమందు వ్రాయబడినదని యనుకొనఁడు. ఇట్లే వేదము లందు గాననగు వేరు వేరు ఘటనలు, రాజులు, నగర, నదీ, పర్వత ధాన్యాదులు, జంతుగణము మున్నగువాని వర్ణనలను బట్టి యా విషయము లన్నియు జరిగిన పిమ్మటనే యా గ్రంథ ములు రచించబడి యుండును. ఈ దృష్టిచేత నాయా ఘట నల కాలనిర్ణయమునుబట్టి వేదముల కాలముకూడ నిర్ణయింప బడగలదు." కాని వేదముల విషయమున బూననగు ధారణ యిందుకు బూర్తిగా వ్యతిరిక్తమైనది. అనగా నిందు ఘటనలను బట్టి యాఖ్యానములు గాని, యితిహాసములుగాని వ్రాయబడవు. ఇతిహాసమును బట్టియే ఘటనలు జరుగుటయు వ్యక్తులు దయించుటయు, సంభవించును. అన్యభాషలన్నియు నాలుగయిదువేల యబ్దములకు బూర్వమందలివని నిశ్చయించబడినపు డా భాషల శబ్దములు ఈశ్వరసంబంధమగు ననాది విజ్ఞానమందెట్లు సమావిష్టములై యుండును ? కావున సంస్కృతభాషకు చెందిన వైదిక శబ్దము లే యా విజ్ఞానమందు సమకూర్చబడినవని భావించుట యుక్తి యుక్తము. ఈ విధ ముగా సమస్త విశ్వము నీశ్వరకృతమై, యీశ్వరవిజ్ఞానము తోడను, యీశ్వరేచ్ఛతోడను, యీశ్వరకృతితోడను సంపన్నమైయుండ, నా విశ్వమునకు బూర్వమందు ఈశ్వర కృతియు, నా కృతికి బూర్వమున నీశ్వరేచ్ఛయు, నాయిచ్ఛకు ముందు యీశ్వరజ్ఞానము, నాజ్ఞానమం దనువిద్ధములగు శబ్దములు నున్నటులే ఆ శబ్దములే వైదికశబ్దములైన నీ సృష్టి శబ్దపూర్వకమైన దన్న మాట. శబ్దానువిద్ధములగు జ్ఞానేచ్ఛాకృతుల తోడ నీశ్వరుడు ప్రపంచనిర్మాణము చేయును. దీనిని బట్టి శబ్దమర్థపూర్వకము కాదనియు, నర్థమే శబ్దపూర్వక మనియు స్పష్టమగు చున్నది. ఇట్లే ఘటన జరిగిన తరువాత నాఖ్యానము కాదనియు, నాఖ్యానానంతరమే ఘటనయనియు గూడ సువ్యక్తమగు చున్నది. కుంభకారుడు తన మనమున కుంభశబ్దమును భావించి, కుంభజ్ఞానమును కలుగజేసుకొని కుంభనిర్మాణము జేయుచున్నటులే, ఈశ్వరుడుకూడ వేదశబ్ద ముల మూలమున విశ్వజ్ఞానమును గలుగజేసుకొనియే సమస్త విశ్వనిర్మాణమును జేయును. మనువుకూడ నుడివియుండెను. - "వేదశబ్దేభ్య ఏవాదౌ పృథక్సంస్థాశ్చ నిర్మమే" అనగా బరమేశ్వరుడు వేదశబ్దములచేతనే విశ్వనిర్మాణము సేయును . ఈ విషయమే బ్రహ్మసూత్రములందుగూడ పేర్కొన బడినది. -“శబ్ద ఇతిచేన్నాతఃః ప్రభవాత్ ప్రత్యక్షానుమానాభ్యామ్" అనగా వేదములందు వర్ణింపబడిన వ్యక్తుల ననిత్యులగా భావించినయెడల వారిని ప్రతిపాదించు వైదికశబ్దములు కూడ సనిత్యములని భావింప బడగలవు. వేదములం దనిత్యత్వ మారోపింప బడకూడదు. కారణమేమియనగా, వేదముల మూలముననే వ్యక్తుల సృష్టి జరుగు చున్నదను విషయము ప్రత్యక్షముచేతను అనుమానము (శ్రుతిస్మృతులు ) చేతను రూఢమగుచున్నది. పరమేశ్వరుడు "ఏత' శబ్దము చేత దేవత లను ' అసృగమ్' శబ్దము చేత మానవులను, 'ఇందవః' శబ్ద ముచేత బితృదేవులను, 'తిరః పవిత్రమ్' శబ్దము చేత గ్రహము లను 'భూః' శబ్దముచేత బృథివిని నిర్మించెను. - "స భూరితి వ్యాహరత్త స్మాద్భువ మసృజత, ఏత ఇతివై ప్రజాపతిర్దేవాన సృజతాసృగమితి మనుష్యానిందవ ఇతి పితౄంస్తిరః పవిత్ర మితి గ్రహానాశవ ఇతిస్తోత్ర విశ్వానీతి శాస్త్రమభిసౌభగే త్యన్యాః ప్రజాః " ఇవ్విధముగ సృష్టి జ్ఞానపూర్వకముగను, శబ్దపూర్వకముగను జరుగును.

లోకమందు వస్తూత్పత్తి యనంతరమున నామకరణమను విషయ మనిత్య శబ్దార్థములయెడనే చరితార్థమగునని చెప్పవచ్చును. ‘గో’ ఆదిగాగల శబ్దము లెన్నియేని కలవు. వాటిని నిర్మించిన వ్యక్తి కానరాడు. వాటిని నిత్యములనియే భావించవలయును. శబ్దార్థనంకేత మొనర్చ నాతఁడుకూడ .యాసం కేతముకొఱ కేవియో కొన్ని శబ్దముల నాశ్రయింప వలసియే యుండును. ఈశ్వరుడుకూడ నేయే శబ్దముల ద్వారా శబ్దారసంబంధమును నిరూపించునో యా శబ్దములను ముందుగనే యంగీకరించవలసి యుండును. అంగ ప్రత్యంగ సంకేతముతోడ ననంతశబ్దములకు, నర్థములకు సంబంధము నూహించు టసంభవమే. ఈశ్వర విజ్ఞానము ననుసరించియు, తదనువిద్ధశబ్దముల ననుసరించియునే విశ్వసృష్టి జరుగు చున్నది. ఇదియే మూలస్థితి. కావున వ్యక్తులను, ఆఖ్యానము లను గనుగొన్నంత మాత్రమున వేదకాల నిర్ణయము కాజాలదు. యోగి యైన వాడు ఋతంభరాప్రజ్ఞ ద్వారా భూతభవిష్యద్వర్తమానములను దెలుసుకొనగలడు. వాల్మీకి మహర్షి యటవియందుండి ఋతంభరా ప్రజ్ఞద్వారా స్థూల సూక్ష్మంబులు, సన్నికృష్టవిప్రకృష్టంబులు నగు ఘటనలను ప్రత్యక్షముగ గనుగొని రామాయణమును రచించగలిగి నప్పుడు పరమేశ్వరీయ విజ్ఞానమగు వేదమందు సంపూర్ణ వస్తు బోధమున్నదనుటయందాశ్చర్య మేమియున్నది?

శ్లో॥ "చాతుర్వర్ణ్యం త్రయోలోకాశ్చత్వార శ్చాశ్రమాః పృథక్ |
    భూతం భవ్యం భవిష్యచ్ఛ సర్వం వేదాత్ప్రసిధ్యతి |
    శబ్దః స్పర్శశ్చ రూపంచ రసో గంధశ్చ పంచమః ।
    వేదాదేవ ప్రసూయన్తే ప్రసూతిర్గుణ కర్మతః॥"
                                (మను - 12 - 97, 38)

'అత ఏవచ నిత్యత్వమ్' (బ్ర. సూ.) 'అనాది నిధనానిత్యాః' ఆదివచనములచేత వేదములు నిత్యములని సిద్ధమగుచున్నది. ఏదేని చిన్న రాష్ట్రముయొక్క శాసనమునకుఁగూడ నొక విధానమపేక్షితమైయుండగా నిక ననంత బ్రహ్మాండాత్మక జగత్తుయొక్క శాసనమొక విధానము లేనిదే యెట్లు పొసగును? ఒక యంగుళపు భూమి, యొక ప్రకాశము, నొక వృక్షము, నుద్యానకూప సరోవరాదికము గూడ నొక శాసకుడు లేక ప్రభువు లేకుండ యుండవుగదా! అట్టియెడ సూర్యచంద్ర నక్షత్ర వన పర్వత సాగరాదికము బ్రహ్మాండము నొకశాసకుడు లేనిదే యెట్లు నడువగలవు? ఈదృష్టిచేత నిందుకుగూడ తప్పక నొక విధానముండి తీరవలయును. తాత్కాలికులగు నియామకునకు, నియమింపబడువానికి నొక తాత్కాలిక విధానమెటులుండుమో యటే సనాతననియామకునకు, నియ మ్యునకు మధ్యనుండు విధానము గూడ సనాతనమే అయి యుండవలయును.అందుచేతనే వేదరూపవిధానముకూడ సనాతనమని చెప్పబడినది. ఈశ్వరీయ సనాతన విజ్ఞానమం దనువిద్ధము లగుటచేతను ఈశ్వరీయనిశ్వసితము లగుట చేతను గూడ నవి సనాతనములే. నిశ్శ్వాస మెట్లుగ జీవితదశను సూచించునో యట్లే వేదములు పరమేశ్వరస్థితి (సత్తా) ని సూచించును. ప్రాణి జీవించియున్నంత వరకాతని శ్వాసలు నడచుచునే యుండును. ఇట్లే పరమేశ్వరుఁ డున్నంతవరకు వేదములు నుండును. ఈశ్వరుఁడు సనాతనుడు కావున నాతని శ్వాసలుకూడ సనాతనములే. నిశ్వాసములయిన కారణము చేతగూడ వేదము లకృత్రిమములని రూఢమగుచున్నది. నిద్రయందు, జాగరణముందు న న్ని వేళల శ్వాస నడచుచునే యుండును. అది బుద్ధిప్రత్యయసాపేక్షము కాదు. కావుననే యకృత్రిమము. నపౌరుషేయము ననబడినది. కేవల జీవుడే కాదు. ఈశ్వరుని బుద్ధిప్రయత్నములుకూడ వేదనిర్మాణమం దపేక్షింపబడవు. ఈశ్వరబుద్ధి ప్రయత్న నిరపేక్షములు. నకృ త్రిమములు, పురుషులవలన గలుగు భ్రమప్రమాద విప్రలిప్సా కరుణాపాటవాది దోషములచే స్పృశింపబడ నేరనివి నగుట చేత వేదములు స్వతంత్రరూపమునఁ బరమ ప్రమాణములు. వాస్త వమున కదియే విశ్వవిధానము. నేడు కూడ భారతీయులలో జాలభాగ మావిధానమునే మన్నింతురు. సారాంశమేమి యనగా సనాతనపరమాత్మ సనాతనజీవాత్మలను సనాతనా భ్యుదయపరమపదముల బొందింవ తన నిశ్శ్వాసభూతము లగు నిత్యజ్ఞానానువిద్ధములగు సనాతనవేదములద్వారా నిశ్చ యించిన సనాతనమార్గమే హిందువుల సనాతన వైదిక ధర్మము. "సనాతనస్త్వం పురుషో మతోమే” "జీవభూతన్సనాతనః” "ఛందాంసీ యస్యవర్ణాని" "అశ్వత్థం ప్రాహురవ్యయమ్ “త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా" యున్నగు గీతావచనము లను బట్టికూడ పరమేశ్వరుడు, జీవుడు, వేదములు, ధర్మము ఇవన్నియు ననాతనములని సిద్ధమగుచున్నది. హిందూధర్మశాస్త్రములద్వారా చేయబడిన ప్రతివ్యవస్థ యందును ధార్మికసంస్కారములకు సాన్నిధ్యము కలదు. గాయత్రీ మొదలుగాగల మంత్రములవలన నేయే కార్యములు సిద్ధించుచున్నవో ఆయామంత్రముల యర్థములతోడ సమా నార్ణమునిచ్చు నన్యమంత్రములవలనను, ఇతరభాషాపదంబుల వలనను సిద్ధింపనేరవు. వానిమూలమున నట్టిపుణ్యమును లభింపనేరదు. ఒక మంత్రమందలి వాక్యములను, పదము లను వెనుక ముందునుంచి జపించుట చేతను కూడ నట్టి ఫలము లభింపదు. అట్టియేడ “రైస్ బాల్ ” అను శబ్దమునుండి తండుల పిండమనియు, స్తంభశబ్దమునుండి యూపమనియు నర్థము లెట్లు వెలువడును? పిండము, యూపము, ఆహవనీయము మున్నగువానినుండి ఆయా సంస్కారములతో గూడిన ధార్మికార్థములే గ్రహింపబడును, కావున హిందువుల యొక్క ధార్మికజీవన నిర్వహణవ్యవస్థయు సామాజిక జీవన నిర్వహణ వ్యవస్థయు మూలంబులగు వైదిక గ్రంథముల మీదను, నార్ష గ్రంథములమీదను ఆధారపడి యున్నవి. లోకదృష్టియం దేదేని నిర్విఘ్నముగను, దోషరహితముగను సాగిపోవు వేరు మార్గ మున్నను నది యాస్తిక్య బుద్ధికల హిందువులకు గ్రహణీయము కాదు. స్మశానాగ్ని చేత పప్పు, బియ్యము నుడుకబెట్టుకొన వచ్చును. కాని యాస్తికు డెన్నడు నట్టిపని చేయడు.

స్మృతి పురాణముల యొక్కయు, మహర్షుల యొక్కయు విచిత్రములగు విభిన్న వచనములను జూచి కొందఱు జనులు శాస్త్రములు, ధర్మములు దేశకాల పరిస్థితి ననుసరించి మారు చుండుననియు, - విభిన్నస్మృతికారులు తమ దేశకాల పరిస్థితి సనుసరించి ధారణపోషణానుకూలముగా రచించిన నియమములే శాస్త్రములనియు జెప్పుదురు. కాని యట్లు చెప్పుట పూర్తిగ ససంగతము. “ విరోధే త్వనపేక్షంస్యా దసతి హ్యను మానమ్ " ఆది జైమిని సూత్రములను బట్టి పూర్తిగ స్పష్ట మగుచునే యున్నది. వేదముల ననుసరించియే స్మృతులన్నియు నేర్పడినవి. నేడు క్లిష్టాక్లిష్ట పరిస్థితుల నన్నిటిని దృష్టిలో బెట్టు కొని యెట్లుగ విధానములు చేయబడుచున్నవో అట్లే పరమేశ్వరుడును సర్వదేశకాల పరిస్థితులను దృష్టియందుంచు కొనియే యీనిత్య విధానమును రచించెను. కాని భేదమేమి యనగా లౌకిక విధానములను నిర్మించువా డల్పజ్ఞుడు. కావున నాతని విధానమందు లోపములుండును. భగవంతుడు సర్వ జ్ఞుడు కావున నాతని విధానమం దెట్టి లోపము నుండదు. ఆపత్తి సంపత్తి కాలభేదమునుబట్టి సూక్ష్మముగను విప్రకీర్ణము గను వేదములందు చెప్పబడిన ధర్మములనే సంకలన మొనర్చి స్మృతికారులు స్మృతులను నిర్మించిరి. శ్రుతేరివార్థం స్మృతి రన్వగచ్ఛత్' " శ్రుతి విరుద్ధమగు స్మృతి యేదియైనను త్యజించవలసినదే. అట్టియెడ నేటి మనుజు డెవండైన వేద విరుద్ధవిధానమును నిర్మించిన దాని నెట్లు గ్రహించనగును? నేటివరకుగల "హిందూలా”మితాక్షరా శాసనపద్ధతి దాయ భాగముకూడ మను, యాజ్ఞవల్యుల మీదను, వేదముల మీదను ఆధారపడి నిర్మితములైనవి. నేటివరకు హైకోర్టు లందును, ప్రీవీకౌన్సిలు లందునుగూడ నీవచనముల యర్థ ములే గ్రహింపబడును. స్వేచ్ఛాచరణమునకు సాహసింప బడుట లేదు. ఈ దృష్టి చేతను గూడ నేటి హిందువుల విధానము వేదమే. ఈశ్వరుడు మృతిఁబొందనంతవరకు, లేదా యవకాశ మును గ్రహించి తన యధికారమును హస్తాంతరిత మొనర్చ నంతవరకు, లేదా తాను పరాజయమును బొందనంతవరకు, లేదా తనవిధానమం దాతనికి లోపము గోచరించనంత వరకు ఆతని విధానమందు పరివర్తనమును దెచ్చుట కొకని కెట్టి యధికారము నుండదు. ఈశ్వరుడు నిత్యుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సమేతుడును కావున నాతనిలో బూర్వోక్తావస్థలు సంభవింపనేరవు, అట్టిస్థితియందాతని విధానము నొక రెట్లు మార్పు చేయగలరు? ఇంతియగాక ఫలము నిచ్చువాడే ధర్మాధర్మములను మార్పు చేయగలడు. ఆ ఫలము నీశ్వరుడు తప్ప నేవ్యక్తి యు సమూహము నీయజాలదు. కనుక నెవరికిని ధర్మాధర్మముల మార్పుచేయు నధికారము లేదు. పత్రముల యొక్కయు, వ్యక్తులయొక్కయు సమ్మతుల కచ్చట విలువయేమియు లేదు. ధర్మాధర్మములు మార్పు చేయుటకు గాని, చేయకుండుటకు గాని ఫలప్రదాత యగు పరమేశ్వరుని సమ్మతియే ముఖ్యము. అతని హస్తాక్షరము లేక సమ్మతియు లేనిదే యర్భుదముల కొలది విద్వాంసుల సమ్మతులున్నను ప్రయోజనము లేదు. అనాదులు నపౌరుషేయములు నగు వేదములే యాతని నిశ్శ్వాసభూతవచనములు. అవియే యాతని నిత్యజ్ఞానానువిద్ధ. మగు శబ్దరాశి, దానికి విరుద్ధములగు సమ్మతులన్నియు వ్యర్థ ములే. ఒక వ్యక్తి తన జన్మకర్మములనే యెరుగడు గదా! యెరింగినను ఫలప్రాప్తి యాతని చేతిలోనిది కాదుగదా ! ఇట్టి స్థితియందు నగోత్ర వివాహముల వలనను, అంతర్జాతి వివాహ ముల వలనను పుణ్యమొదవునో , లేక పాపమే యొదవునో , నరకప్రాప్తి యగునో , లేక స్వర్గము లభించునో అను విషయ మీశ్వరునికే తెలియవలయునుగాని యన్యుల కేట్లు తెలి యును? ఈశ్వరుఁడే యనంతకోటి బ్రహ్మాండముల నెరుగును. ఆతడే యొక్కొక్క బ్రహ్మాండ మందలి జీవులను, ఒక్కొక్క జీవుని యనంతానంత జన్మలను, ఒక్కొక్క జన్మ యొక్క యనంతకర్మములను , ఒక్కొక్క కర్మయొక్క లెక్క లేనన్ని విచిత్రఫలితములను ఎరుగును. ఫలమునిచ్చు శక్తియు నాతనికే కలదు. కనుక నాతని విధానమే ధర్మాధర్మములకు బ్రమాణము. ఇందు చేతనే హిందువులు వేదములను, వాటి ననుసరించి నిర్మితములైన యార్షగ్రంథములను మాత్రమే తమ విధానములగా భావింతురు.

మఱియు దానిని మార్పు జేయ నెవ్వనికి పెట్టి యధికారము లేదని యూహింతురు. ఈశ్వరుడు, నాతని రామకృష్ణాది యవతారములు. వసిష్ఠుడు, మనువు మున్నగువారు కూడ నావిధానములనే పాటింప నుపదేశింతురు. కాని మార్పు చేయుటకు వారికెట్టి యధికారమును లేదు. కావుననే నిశ్వాసములవలె బుద్ధిప్రయత్ననిరపేక్షములు అగుటచే వేదములు అకృత్రిమములు, నపౌరుషేయములు నని చెప్పబడినవి. యెడ వాటికి విరుద్ధ విధానముల దయారుచేయ నెవ్వనికి నెట్టి యధికారమును లేనేలేదు. ఇంతియగాక ప్రతి రాష్ట్రమునకు, నంతర్రాష్ట్రీయలోకమునకు శాసనమూలమున నొ కధర్మమందు జోక్యము కలుగ జేసుకొనకుండుట నియమమైకూడ యున్నవి. సంయుక్త రాష్ట్ర సంఘముకూడ నీవిషయమునే ఘోషించును. భారతీయ నవీన విధానమునకు మూలభూతమగు ఘోషణ యందు 'ఏధర్మమందు ప్రభుత్వ మెట్టిజోక్యము కలుగజేసు కొనద’ను విషయము అంగీకరింపబడినది. ఇంతియ గాక నానియమము క్రైస్తవ ముస్లిము మతములయెడ బాటింప బడుచును ఉన్నవి. కాని యొక్క హిందూధర్మముయెడనే యానీతి పాటింపబడుట లేదు. పైగా నానీతిని బాటించుచునే యున్నామని యనుకొనుటకై వివాహ దాయభాగములు ధర్మములు కావనియు, నవి సాంఘిక వస్తువులనియు ప్రభు త్వమువారు చెప్పుచున్నారు. కాని యా యా ధర్మములను బరిశీలించునపు డాయా సంప్రదాయములకు సంబంధించిన ధర్మగ్రంథములను అనుసరించవలయునను విషయముస్పష్టము. ఈదృష్టి చేత హిందూధర్మవిమర్శనము హిందూధర్మ గ్రంథము లను, హిందూధర్మాచార్యులను అనుసరించి చేసినపుడు ప్రస్తుత హిందూకోడుబిల్లు హిందూధర్మముమీద నెట్లుగా దాడిచేయుచున్నదో సుస్పష్టము కాగలదు. గోవధవంటి నీచ కృత్యములను మహమ్మదీయధర్మ మను తలంపుతోడ ప్రోత్సహించుటయు, హిందువుల వివాహ, దాయభాగ, మందిరాది శుద్ధ ధార్మికవస్తువులను, సామాజికములను తలంపుతోడ నణచివేయ బూనుకొనుటయు జూడగా నత్యాశ్చర్య మొదవుచున్నది.