హలో...డాక్టర్/గళగ్రంథి ఆధిక్యత (Hyperthyroidism)

వికీసోర్స్ నుండి

6. గళగ్రంథి ఆధిక్యత

(Hyperthyroidism)

గళగ్రంథి:

గళగ్రంథి (Thyroid) కంఠము ముందర స్వరపేటిక, శ్వాసనాళములను ఆనుకొని సీతాకోక చిలుక ఆకారములో ఉంటుంది. ఈ గ్రంథికి కర్ణికలు (lobes) రెండుప్రక్కలా ఉండి ఆ రెండు కర్ణికలను కలుపుతూ నడిమిన సంధానము. (Isthmus) ఉంటుంది. వయోజనులలో యీ గళగ్రంథికర్ణిక పరిమాణము 5 సె.మీ ఎత్తు, 3 సె.మీ వెడల్పు 2 సె.మీ మందము గలిగి ఉంటుంది. గళగ్రంథి స్రావకములు, థైరాక్సిన్ (Thyroxine, T-4), ట్రై అయిడో థైరొనిన్ (Triidothyronine, T-3), కణజాలముల జీవవ్యాపార క్రియకు (metabolism) దోహదకారిగా ఉంటాయి. శిశువుల వృద్ధికి, మనోవికాసమునకు కూడా థైరాక్సిన్ తోడ్పడుతుంది. జంతుజాలములో విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము (Basal metabolic rate) గళగ్రంథి స్రావకములపై ఆధారపడి ఉంటుంది. గళగ్రంథి స్రావకముల ఉత్పత్తి ఎక్కువయితే గళగ్రంథి ఆధిక్యత (Hyperthyroidism) కలిగి ఆ లక్షణాలు పొడచూపుతాయి.

గళగ్రంథి స్రావక ఆధిక్యత లక్షణాలు:

గళగ్రంధి స్రావకములు ఎక్కువయినప్పుడు జీవవ్యాపార ప్రక్రియ (metabolism) ఎక్కువ అగుటయే కాక, వాటి ప్రభావము వలన సహవేదన నాడీమండలము (Sympathetic nervous system) ప్రేరేపించబడి ఆ లక్షణములు కూడా అధికము అవుతాయి. నీరసము, శరీరపు బరువు తగ్గుట, ఆకలి పెరుగుట, గుండెదడ, గుండె వేగము పెరుగుట, మానసిక ఆందోళన, గాభరా, చిరాకు, హస్త కంపనములు (tremors), ఎక్కువ చెమట పట్టుట, కండరముల సత్తువ తగ్గుట, విరేచనములు, నిద్ర పట్టకపోవుట, ఉష్ణమును తట్టుకోలేకపోవుట, స్రీలలో ఋతుస్రావము మందగించుట (Oligomenorrhea) పొడచూపుతాయి. వృద్ధులలో హృదయ కర్ణికల ప్రకంపనము (Atrial fibrillation), హృదయ వైఫల్యములు కలుగవచ్చును (Congestive heart failure). చర్మపు మందము తగ్గుతుంది. పెళసరి వెండ్రుకలు, కేశనష్టము, కనుబొమలు సన్నబడుట, జ్ఞాపకశక్తి తగ్గుట, ఎముకలు బలహీనమగుట (గుల్ల ఎముకలవ్యాధి - Osteoporosis) మరికొన్ని లక్షణములు. మతిభ్రమణము అరుదుగా కొందఱిలో కలుగుతుంది. చేతుల వణుకుతో బాటు కొందఱిలో అనిచ్ఛా చలనములు (Chorea) కూడా పొడచూపవచ్చును.

నేత్రగోళ కండరములు నీరసించి రెండు నేత్రముల చలనములలో సహకారము (coordination) లోపించుట వలన ఒక వస్తువు రెండుగా (Diplopia; ద్విదృష్టి) కనిపించవచ్చును. పై కనురెప్పలు వెనుకకు ఎక్కువగా పోయి (Lid retraction) కళ్ళ మీది తెలుపు (శ్వేతపటలము Sclera) గోచరమవుతుంది. క్రింది వస్తువులపై దృష్టి సారించినపుడు కనుగుడ్లతో సమముగా కనురెప్పలు క్రిందకు కదలక (Lid lag) కళ్ళమీది తెల్ల భాగము తాత్కాలికముగా ఎక్కువగా కనిపించవచ్చును. గళగ్రంథి ఆధిక్యత పరిమితముగా ఉన్నపుడు కొందఱిలో ఏ లక్షణములు కనిపించక పోవచ్చును.

అరుదుగా శరీరము సూక్ష్మాంగజీవుల ముట్టడికి గుఱైనపుడు, శస్త్రచికిత్సల పిదప, శరీరము ప్రమాదములకు గుఱి అయినపుడు, గళగ్రంథి స్రావకములను నిరోధించు మందులు ఉపసంహరించినపుడు గళగ్రంథి సంక్షోభము (Thyroid storm) కలిగి, అధికఉష్ణోగ్రత, మానసిక సంభ్రమము, గందరగోళము, సన్నిపాతము (Delirium) కలిగి మృత్యువునకు దారి తీయవచ్చును. వీరికి అత్యవసర చికిత్స అవసరము. గ్రేవ్స్ సదృశగళగండ స్రావక ఉద్రేకత (Diffuse toxic goiter from Grave’s disease) కలిగిన వారిలో గళగండస్రావక ఆధిక్యతతో (Hyperthyroidism)బాటు వెలిగుడ్లు (Exopthalmos), నేత్ర కండరముల నీరసము (extraocular muscle weakness), జంఘికాస్ల థు ముందు ఉబ్బుదల (pretibial myxedema) కూడా కలుగుతాయి.

గళగ్రంథి ఆధిక్యత కలిగిన వారిలో Myasthenia gravis అనే

68 :: కండరముల తీవ్ర నీరసవ్యాధి అధికశాతము మందిలో కలిగే అవకాశములు

ఉన్నాయి. గళగ్రంథి స్రావక ఆధిక్యతకు కారణములు

గళగ్రంథి ప్రమాణము వివిధ కారణముల వలన పెరిగి కంఠము ముందు గళగండముగా (Goiter) పొడచూపవచ్చును. గళగ్రంథి  అంతటా సమముగా పెరుగుతే దానిని సమ గళగండము లేక సదృశ గళగండముగా (Diffuse goiter) పరిగణించవచ్చును.

అసమానముగా కణుతులు పెరిగి బహుళ కిణ గళగండములు (Multinodular goiters) కొందఱిలో పొడచూపుతాయి. నిరపాయపు పెరుగుదలలు (Adenomas) కొందఱిలో కలిగి ఒక కర్ణికలోనే గళగండము పొడచూప వచ్చును. వీరిలో పరిమాణపు పెరుగుదలతో బాటు స్రావకముల ఉత్పత్తి అధికమయినపుడు గళగ్రంథి ఆధిక్యత లక్షణములు కలుగుతాయి.

గళగ్రంథి తాపముల (Thyroiditis) వలన తాత్కాలికముగా గళగ్రంథి స్రావకముల ఉత్పత్తి పెరుగవచ్చును. అయొడిన్ వినియోగము ఎక్కువైనా, గళగ్రంథి స్రావకముల వినియోగము ఎక్కువయినా (Iatrogenic) గళగ్రంధిస్రావక ఆధిక్యత కలుగగలదు. ఎమియోడరోన్

69 :: (Amiodarone), అయొడిన్ వ్యత్యాస పదార్థాల (Iodine radiocontrast materials) వాడుక వలన గళగ్రంథి ఆధిక్యత కలుగవచ్చును.

ప్రసవము తర్వాత కొందఱి స్త్రీలలో (6 లేక 7 శాతపు స్త్రీలలో) గళగ్రంథి ఆధిక్యత కలిగి (Postpartum hyperthyroidism) కొద్ది వారములలో సామాన్యస్తి థి చేకూరుతుంది. అండకోశములలో గాని యితరత్రా గాని గళగ్రంథి కణజాలముతో పెరుగుదలలు (Struma ovarii) ఏర్పడి అవి స్రావకములను ఉత్పత్తి చేయుట వలన కూడా గళగ్రంథి ఆధిక్యత సంభవించవచ్చును. పీనసగ్రంథి పెరుగుదలలతో (Pituitary adenomas), గళగ్రంథి ప్రేరేపక (TSH) ప్రమాణము హెచ్చయి గళగ్రంథి ఆధిక్యత అరుదుగా కలుగవచ్చు. గ్రేవ్స్ సమగళగండ స్రావక ఉద్రేకత ( Grave’s disease ) :

ఇది స్వయంప్రహరణ వ్యాధి (Autoimmune disease). ఈ వ్యాధికి గుఱైన వారిలో గళగ్రంథిని ప్రేరేపించు ఇమ్యునోగ్లాబ్యులిన్ ప్రతి రక్షకములు (Thyroid Stimulating immunoglobulin antibodies) ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రతిరక్షకములు (Antibodies) గళగ్రంథిలోని గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములతో (TSH receptors)  సంధానమయి ఆ గ్రాహకములను ప్రేరేపించుట వలన గళగ్రంథి ప్రమాణము సమతులితముగా పెరుగుతుంది. గళగ్రంథి స్రావకముల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. రక్తములో గళగ్రంథి స్రావకముల ప్రమాణము ఎక్కువగుటచే పీనసగ్రంథి (Pituitary gland) నుంచి గళగ్రంథి ప్రేరేపక స్రావకపు (Thyroid Stimulating Hormone) ఉత్పత్తి, హైపోథలమస్ నుంచి గళగ్రంథి ప్రేరేపక విమోచిని (Thyrotropin Releasing Hormone) విడుదల తగ్గుతాయి. గ్రేవ్స్ వ్యాధి (Grave’s disease) కలుగుటకు కారణాలు స్పష్టముగా తెలియవు. జన్యు కారణములు, పరిసరముల ప్రభావము యీ వ్యాధికి దారితీయవచ్చును. ఈ వ్యాధి కొన్ని కుటుంబాలలో ఎక్కువగా కనిపిస్తుంది. కవలపిల్లలలో ఒకరికి యీ వ్యాధి కలుగుతే రెండవ వారిలో కలుగుటకు ముప్పది శాతము అవకాశాలు ఉంటాయి. ఇతర స్వయంప్రహరణ వ్యాధులు

70 :: (మొదటి తరగతి మధుమేహ వ్యాధి (Type 1- Diabetes), రుమటాయిడ్

కీళ్ళనొప్పులు (Rheumatoid arthritis) వంటివి ఉన్నవారిలో సమగళ గండము (Diffuse goiter), గళగండ స్రావకఆధిక్యత ఎక్కువగా పొడ చూపుతాయి.

గ్రేవ్స్ సమగళగండ స్రావకఉద్రేకత (Grave’s disease) కలిగిన వారిలో గళగండస్రావక ఆధిక్యతతో (Hyperthyroidism) బాటు వెలిగుడ్లు (Exophthalmos), నేత్ర వైకల్యము (opthalmopathy), జంఘికాస్థుల ముందు ఉబ్బుదలలు (pretibial myxedema) కూడా కలుగుతాయి. పరీక్షలు :

గళగ్రంథి ఆధిక్యత ఉన్నవారిలో గళగ్రంథి ప్రేరేపకపు (TSH) విలువలు రక్తములో తక్కువగా ఉంటాయి. గళగ్రంథి స్రావకముల విలువలు (T-4, T-3) ఎక్కువగా ఉంటాయి. Grave’s disease ఉన్నవారిలో గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములకు ప్రతిరక్షకములను (Antibodies to TSH receptors) రక్తపరీక్షలతో కనుగొనవచ్చును. రేడియోధార్మిక అయొడిన్ I-131 లేక, I -123 నియమిత మోతాదులో యిచ్చి గళగ్రంథిలో వాటి గ్రహణము (Uptake) కొలిచి గళగ్రంథి చైతన్యమును నిర్ధారించ వచ్చును. గామా ఛాయా గ్రాహకములతో గళగ్రంథి చిత్రములను తీసుకొని గళగ్రంథిలో చైతన్యకేంద్రములను పసిగట్టవచ్చును. గళగ్రంథి ఆధిక్యత కలిగిన వారిలో రక్తములో చక్కెర విలువలు అధికమవవచ్చును. వీరిలో కొలెష్టరాలు విలువలు తక్కువగా ఉండవచ్చును. చికిత్స :

గళగ్రంథి స్రావక ప్రభావము వలన వచ్చే లక్షణములను అదుపులో పెట్టుటకు, నిర్దిష్ట చికిత్స జరిగే వఱకు తాత్కాలిక ఉపశమనము కొఱకు బీటా ఎడ్రినెర్జిక్  గ్రాహక అవరోధకములను (ప్రొప్రనలాల్, మెటాప్రొలోల్, లేక, ఎటినలాల్) వాడుతారు. ఇవి సహవేదన నాడీమండల ఉధృతి వలన వచ్చే గుండెదడ, ఆందోళన, హస్తకంపనములు, రక్తపుపోటు వంటి ఫలితములను అదుపులో ఉంచుటకు తోడ్పడుతాయి.

71 :: తాత్కాలికముగా గళగ్రంథి ఉధృతి హెచ్చినపుడు కూడా బీటా ఎడ్రినెర్జిక్

గ్రాహక అవరోధములు (Beta adrenergic receptor blockers) ఉపయోగపడుతాయి.

బీటా గ్రాహక అవరోధకములు ఉపయోగించలేని పరిస్థితులలో (ఉబ్బసవ్యాధి వంటి వ్యాధులు ఉన్నవారిలో), వెరాపమిల్ (Verapamil) వంటి కాల్సియమ్ మార్గ అవరోధకములను (calcium channel blockers) ఉపయోగించవచ్చును. నిర్ది ష్ట చికిత్సకు మూడుమార్గ ములు ఉన్నాయి :1. రేడియోధార్మిక అయొడిన్ ( Radioactive Iodine) :

దేహము గ్రహించే అయొడిన్ లో హెచ్చు భాగము గళగ్రంథిలో చైతన్య కేంద్రాలకు చేరుతుంది. రేడియోధార్మిక అయొడిన్ చికిత్సకు వాడినపుడు అది గళగ్రంథిలో సాంద్రమయి గళగ్రంథి విధ్వంసమునకు దారితీస్తుంది. గ్రేవ్స్ వ్యాధి ఉన్నవారికి రేడియో ధార్మిక అయోడిన్ చికిత్స ఉత్తమము. బహుళ కిణ గళగండము (Multinodular goiter), గళగండములోని పెరుగుదలలలో (Adenomas)  గళగ్రంథి స్రావకములు అధికము అయినపుడు కూడ రేడియో ధార్మిక అయొడిన్ ని ఉపయోగిస్తారు. గర్భిణీ స్త్రీలలో రేడియోధార్మిక అయొడిన్ వాడకూడదు.

రేడియోధార్మిక అయొడిన్ చికిత్సకు ముందు థయోనమైడులు (Thionamides), అయొడిన్ ల వాడుక ఆపివేయాలి. రేడియో ధార్మిక అయొడిన్ గ్రహణ (Radioactive Iodine uptake) పరీక్షతో అవసరమైన మోతాదును నిశ్చయించి యిస్తారు. నెలకొకసారి రక్తములో గళగ్రంథిస్రావకము T-4 ( థైరాక్సిన్), TSH ల పరీక్షలు చేస్తూ గళగ్రంథి హీనత (Hypothyroidism) కలుగుతే గళగ్రంథి స్రావక (Levothyroxine) చికిత్స మొదలు పెట్టాలి. రేడియోధార్మిక అయొడిన్ చికిత్స వలన చాలా మందిలో గళగ్రంథి పూర్తిగా విధ్వంసమయి గళగ్రంథి హీనత కలుగుతుంది. రేడియోధార్మిక

72 :: అయొడిన్ చికిత్స వలన కొందఱిలో గళగ్రంథిలో నిక్షిప్తమయిన స్రావకములు

విడుదలయి తాత్కాలికముగా రెండు వారములు పాటు వాటి ఉద్రిక్తత హెచ్చుకావచ్చును. హృద్రోగములు ఉన్న వారికి ఆ ఉద్రిక్తతను తగ్గించుటకు తాత్కాలికముగా ధయోనమైడులతో చికిత్స అవసరమవవచ్చును. రేడియోధార్మిక అయొడిన్ చికిత్స వలన కర్కటవ్రణములు (Malignancy) కలుగవు. చికిత్స తదనంతరము గర్భము దాల్చిన స్త్రీల శిశువులకు చికిత్స వలన జన్మతః వ్యాధులు (Congenital diseases) సంక్రమించవు. 2. థయోనమైడులు (Thionamides ) :

థయోనమైడులు గళగ్రంథిలో థైరోగ్లాబ్యులిన్ తో అయొడిన్ సంధానమును నిరోధించి గళగ్రంథి స్రావకముల ఉత్పత్తిని ఆటంకపరుస్తాయి. ప్రొపైల్ థయోయురసిల్  థైరాక్సిన్ (Thyroxine, T4) ట్రైఅయిడో థైరొనిన్  గా (T-3) మారుటను కూడా నిరోధిస్తుంది. గర్భిణీ స్త్రీలలోను, గళగ్రంథి తాపములోను (Thyroiditis), అయొడిన్ వినియోగము ఎక్కువగుటలన, ఎమియోడరోన్ (amiodarone) వంటి మందులవలన తాత్కాలికముగా గళగ్రంథి ఆధిక్యత కలిగినప్పుడు, రేడయోధార్మిక అయొడిన్ వాడుకకు ఇష్టపడని వారిలోను, థయోనమైడులను ఉపయోగిస్తారు. కార్బిమజాల్ (Carbimazole), మిథైమజాల్ (Methimazole), ప్రొపైల్ థయోయురసిల్ (Propylthiouracil) థయోనమైడులకు ఉదహరణములు. వీటి ప్రభావము కనిపించుటకు కొద్ది వారములు పడుతుంది. ముందు హెచ్చు మోతాదులలో వాడినా తరువాత వీటి మోతాదును రక్తపరీక్షలబట్టి తగ్గించాలి.

దద్దురులు, చర్మతాపము (Dermatitis), కీళ్ళనొప్పులు, జ్వరము, కాలేయతాపము (Hepatitis), తెల్లకణముల ఉత్పత్తి తగ్గుట (agranulocytosis) వంటి అవాంఛిత ఫలితములను జాగ్రత్తగా గమనించాలి. పచ్చకామెరలు, గొంతునొప్పి, చలిజ్వరము కలుగుతే వెంటనే థయోనమైడులను ఆపివేసి రక్తపరీక్షలు చెయ్యాలి. ఈ మందుల వాడుక ఆపివేస్తే అవాంఛిత ఫలితములు సాధారణముగా ఉపశమిస్తాయి. అవాంఛిత ఫలితముల గురించి రోగులకు అవగాహన సమకూర్చాలి.

73 :: 3. గళగ్రంథి విచ్ఛేదన (Thyroidectomy ) :

గళగ్రంథి కర్ణికలలో హెచ్చు భాగములను శస్త్రచికిత్సచే తొలగించి (Subtotal thyroidectomy) గళగ్రంథి ఆధిక్యతను అరికట్టవచ్చును. ఈ దినములలో శస్త్రచికిత్స అరుదుగా చేస్తారు. రేడియోధార్మిక అయొడిన్ చికిత్సకు ఇష్టపడనివారికి, థయోనమైడులతో గళగ్రంథి స్రావకఉధృతి అదుపుకాని వారికి, థయోనమైడుల వలన అవాంఛిత ఫలితములు కలిగినవారికి శస్త్రచికిత్స అవసరమవుతుంది. శస్త్రచికిత్సకు ముందు థయోనమైడులతో గళగ్రంథి స్రావక ఆధిక్యతను తగ్గించాలి. వీరికి శస్త్రచికిత్సకు ముందు రెండు వారములు అయొడిన్ చికిత్స అవసరము. బీటా గ్రాహక అవరోధకముల చికిత్స కూడా అవసరము. శస్త్రచికిత్స తదుపరి కొద్దివారములు యీ చికిత్సలు కొనసాగించాలి.

శస్త్రచికిత్సలో సహగళగ్రంథులు (Parathyroid glands) తొలగించ బడితే సహగళగ్రంథి హీనత (Hypoparathyroidism) కలిగే అవకాశము ఉన్నది. స్వరతంత్రి నాడులకు (nerves innervating vocal chords) హాని కలుగుతే స్వరతంత్రుల వాతము (Vocal chord paralysis) కలుగవచ్చును. అపుడు బొంగురు గొంతు, రెండు ప్రక్కల నాడులకు హాని కలుగతే శ్వాసకు ఇబ్బంది కలుగుతాయి. శస్త్రచికిత్స పిమ్మట గళగ్రంథిహీనత కలుగుతే కృత్రిమ గళగ్రంథి స్రావకములతో (Levothyroxine) చికిత్స అవసరము. బహుళ కిణ గళగండములు (Multinodular goiters) ఉన్నవారిలో గళగ్రంథి స్రావకముల విలువలు సాధారణ పరిమితులలో ఉన్నపుడు, ఏ యితర యిబ్బందులు లేనప్పుడు శస్త్రచికిత్సలు గాని, విపరీతముగా పరిశోధనలు గాని అనవసరము. ఒకే ఒక కిణము (Solitary nodule) పొడచూపినప్పుడు సూది, పిచికారులతో కణములను పీల్చి కర్కటవ్రణములకై కణపరీక్షలు సలుపవచ్చును. కణపరీక్షలు సక్రమముగా ఉంటే యితర చికిత్సలు అనవసరము.

74 ::