హరివంశము/పూర్వభాగము-సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

హరివంశము

పూర్వభాగము - సప్తమాశ్వాసము

కారికటాక్షధరా
లోకకృతార్థీ! కృతార్థిలోకసకలర
త్నాకరవేలావల్గద
నేకగుణారామ వాహినీవరవేమా.

1


వ.

అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నిక్కడఁ బరమపురుషుండు
భాండీరవటోప్రాంకంబునఁ గొంతదడవు నిజేచ్ఛానురూపంబు లగువినోదంబులం
బ్రమోదించి తదనంతరంబ.

2


తే.

మేఁతకై పోవుకదుపుల మెయివడినక, ళిందకన్యాతటంబుల నిందునందు
నాడుచును [1]పాడుచును వల్లవాన్వితముగ, నరిగె బలదేవుఁడును దోనయరుగుదేర.

3


వ.

ఇవ్విధంబునఁ గ్రమఖేలనకుశలుం డై.

4


సీ.

మునివరదత్తాతార్ఘ్యములఁ గుశాక్షతములఁ దెట్టువట్టినతీరములును
గుండలికన్యకాకుచకుంభకుంకుమక్షాళనఁ గెంపారుసలిలములును
సిద్ధసంయమీసమర్చితసైకతాలింగభూషితాగ్రము లగుపులినములును
శబరకుటుంబినీకబరికావనమాల్యవలితంబు లైనశైవాలములును


తే.

నచటనచట నొప్పారఁ బ్రౌడాబ్జముఖియుఁ, గమ్రమీనేక్షణయు రథాంగస్తనియును
హంసరుచిరానులాపయు నగుచుఁ గ్రాలు, యమునఁ జూచుచు దవ్వుగా నరిగి విభుఁడు.

5

శ్రీకృష్ణుఁడు యమునానదియందుఁ గాళియుఁ డుండెడు మడువు చూచుట

వ.

అమ్మహానది నొక్కయోజనదీర్ఘంబును నంతియవిస్తీర్ణంబును నతిమాత్రగంభీరం
బును నయి దేవదానవాదులకు నభిగమింప నలవిగాక నిరంతరాంతర్గతభుజంగమ
గరళజ్వాలంబుల జటాలంబు లగుకల్లోలంబులం బొదలి బడబాగ్నికీలాకులం
బగునంబురాశిం బోల్పం బట్టగుటకుఁ దగి యవిరళోద్భూతఫణిఫూత్కారంబుల
నుద్ధూతంబులగు ధూమజలధరంబులచేత నావృతం బై యుపాంతతృణలతాదహన
విజృంభితుం డగువిషానలునివలన సార్వకాలికంబు దావభయంబు సకలకాననం
బులకుం గలిగించుచు లోభాతురుం డగువానివిభవంబుభంగిఁ బ్రాణిజాతంబు
నెవ్వానికి నుపభోగయోగ్యంబు గాక యొండొండ దరులు దాఁకి మ్రోయుకరళ్ల

నఖిలభూతంబులం దర్జించు గర్జాఘోరం బగువిలయపర్జన్యాకారంబుకరణిం
గాఱుకొనుచున్న యొక్కమహాహ్రదం బాలోకించి యాత్మగతంబున.

6


శా.

కాలాకారుఁడు కాళీయుం డనుమహాగర్వుండు దర్వీకరుం
డాలోలాగ్నికరాళవక్త్రుఁడు విహంగాధీశసంత్రస్తుఁడై
కాళిందిన్ వసియించు నన్ పలుకు నిక్కం బెప్పుడు న్విందు నా
భీలం బిమ్మడు వద్దురాత్మునెల వుత్ప్రేక్షింప నేభంగులన్.

7


ఉ.

రాహుగృహీత మైనయుడురాజుశరీరమపోలెఁ దద్విష
వ్యాహతి నిమ్మహాజలము వైభవ మేదిన దిప్డు వీతసం
దేహతఁ జొచ్చి యయ్యురగుతీవ్రమదంబు మెయిన్ వెలార్చి గో
గాహనయోగ్యమై వెలయఁగా నొనరించెద నీప్రదేశమున్.

8


వ.

అమ్మహాపన్నగుపరిజనంబు లగుభుజంగంబు లెందునుం గ్రందుకొనం దిరుగుట
నీబృందావనంబునందు నెలవు లెడనెడ నతిదుస్సంచరంబు లయి యుండుం గుటి
లాచారు లగుసరీసృపాధములు కొందఱు గోరూపంబుల నస్మదీయులలోనం
గలసి నాకుం గీడొనర్ప రోయుదురు తదీశ్వరుండు నిగృహీతుం డగుట నయ్యం
దఱ విత్రస్తులం గావించుట గావున [2]నిం కేల యాలస్యం బెట్లునుం జేయుదు
నిదె కదంబవిటపి యొక్కటి యుత్కటోరగవిషంబున విషాదంబు నొంది
యియ్యుత్తమతటినీతటంబున నున్నయది.

9


తే.

ఇది మదీయపదస్పర్శపదవి గాంచి, యఖిలలోకనమస్కార్య[3]హారిమహిమ
నూర్జితం బగుఁగాత యింపొనర దీని, నెక్కి యిన్నీట నుఱికెద నక్కజముగ.

10


వ.

అనుచుం గుతూహలంబున.

11


ఉ.

ఎవ్వరితోడఁ జెప్ప కొకయింతయు మంతనమాడ కేమియో
యివ్విపుల[4]ప్రయత్న మితఁ డిప్పు డొనర్చుటకున్ నిమిత్త మం
చవ్వల నాబలప్రభృతు లాత్మఁ దలంప నకంపలీలమై
నవ్వనజూక్షుఁ డాక్షణమ యల్లన నవ్వున మో మెలర్పఁగాన్.

12


సీ.

[5]ఒడిసిక్కు గొనఁ జెక్కి మడిసంది నునిచినతలుగులుఁ ద్రాళ్లులు దొలఁగవైచి
డా కేలఁ బట్టిన ఢక్కయుఁ జంకఁ దాల్చినవేణువును నన్యుచేతి కిచ్చి
పొలుచుపింఛపుదండ వుచ్చి వెండ్రుకల నొప్పెడుజడగా నల్లి ముడి యమర్చి
మొలఁగచ్చకట్టుపై మలఁగినపచ్చ, నునుగొంగు దిండుగా నునిచి చుట్టి


తే.

చెప్పు లూడ్చి కదంబకస్భీతతరువుఁ, బ్రాఁకి పెడబొబ్బయిడి యార్చియాఁకగొనక
[6]మడువులోనికి నుఱికె నున్మత్తలీల, నెగసి తత్తోయకణములు నింగిఁ బొదువ.

13


తే.

మందరాద్రిపాతమున నమందచలన, మొందుజలరాశిమాడ్కిఁ బయోజనాభు
ఘోరలంఘనమునను సంక్షుభిత మయ్యె, నారసాతలాంతరముగ నాహ్రదంబు.

14

క.

విషదూషితులము హరిఁ గ, ల్మషరహితుని నంట వశమె మాకు ననుచు ని
ర్విషయతఁ దొలంగుగతిఁ ద, ద్విషమోర్ములు తీరములకు వెసఁ దోతెంచెన్.

15


క.

కాళియమర్దనమునకుం, గాలాకృతిఁ గృష్ణుఁ డుఱుకఁ గన్మొఱఁగి మహా
వ్యాళములు వెడలఁబాఱెడు, పోలికఁ దోడయ్యె దరులఁ బొందుతరఁగలున్.

16


వ.

ఇత్తెఱంగున నాక్రాంతసలిలుం డై యయ్యదుకుమారుండు.

17


ఉ.

ఆదివరాహ మై తనయుదంచితపోత్ర మమర్చి కల్పవి
చ్ఛేదవృద్ధతోయ మగుసింధువుఁ జొచ్చి కలంచినట్టియు
న్మాదమ పొందె నాఁగ భుజమండలమున్ సవరించి కొంతసే
పాదట నమ్మహాతటి నియంబుతతిం గలఁగుండు వెట్టఁగన్.

18


తే.

అతఁడు కరములఁ దోయ మందంద చఱచు,ఘోరనినదంబు నతనిహుంకారరవముఁ
దత్పదాగ్రపాతోత్థితధ్వనియు నొక్క, మ్రోఁత యై పేర్చి దిగ్భాగరోధి యయ్యె.

19

కాళియుండు శ్రీకృష్ణునిం గఱచి చుట్టుకొనుట

వ.

అట్లు నిజనివాసం బగునజ్జలాశయంబు సంచలితం బగుటకుం గలుషించి.

20


సీ.

తనఫణావలి గలంతయు విచ్చి యెత్తిన గగనంబు సర్వంబు గబళితముగఁ
దనమిక్కుటపుఁగోఱ దౌడలు దెఱచిన విసపుఁజి చ్చొండొండ దెసలు వ్రేల్వఁ
దనచూడ్కు లుగ్రంపుఁగినుకతోఁ బర్విన నంబరచరకోటి యార్తిఁ నొదుఁగఁ
దన మేను మలఁక లై తనరారి [7]నిగిడిన యమునయంతయుఁ దన్మయత్వ మొందఁ


తే.

బొదలు తనఫూత్కృతుల నెల్ల బొగలు గవిసి, యబ్జజాండ మూదరవెట్టినట్లుగాఁగఁ
గాళకర్కశకాయుండు కాళియుండు, గవిసె గోపాలబాలుపైఁ గసిమసంగి.

21


వ.

కవిసి పొదివి యుఱక నెఱఁకు లందంద కఱచి యతని కెయ్యదియుం జేయఁ
దెఱపి యీక యుద్రేకంబునం గిట్టి.

22


క.

ఆపాదమస్తకంబుగ, నాపురుషోత్తమునిదేహ మాభుజగేంద్రుం
డాపూర్ణభోగబంధన, తాపాయత్తముగఁ జేసెఁ దత్క్షణమాత్రన్.

23


ఉ.

పూర్వభవంబునం బ్రబలభోగిమహాస్త్రనిబద్ధుఁ డై మయా
గర్వుఁడు వైరిచే రణముఖంబునఁ గొండొకసేపు పడ్డయా
దుర్విధి నేఁడు నెమ్మెయిఁ గుతూహల మె త్తియొ తాల్చె ని ట్లనన్
సర్వవిభుండు కాళియభుజంగనిబంధన నొప్పె నయ్యెడన్.

24


తే.

సింధుపతిలోనఁ బెనుబాపసెజ్జఁ బెనఁగి, [8]సుప్తిఁ గడునొప్పుతీ పాత్మ సోఁకి యిట్టిఁ
డయ్యెఁగాక యెక్కడిపీడ హరి కనంగఁ, బన్నగాంగసంగమమూర్ఛ ప్రభున కొప్పె.

25


ఉ.

కాళియుచుట్టలుం జెలులుఁ గాంతలుఁ బుత్రులు నైనదుర్దమ
వ్యాళము లెన్ని యన్నియును నప్డు వసంబఱి యున్న శౌరి నా

భీలతఁ జుట్టుముట్టి పటుభీషణదంష్ట్రలఁ బ్రస్ఫురద్విష
జ్వాలలు [9]ప్రజ్వరిల్లఁ గఱవంగఁ దొడంగె నశంకఁ గింకతోన్.

26


వ.

అట్టి బెట్టిదంపుఁజందంబు సర్వంబునుం గనుంగొని గోపకుమారు లందఱుం దలంకి
యచ్చటికి దక్షిణంపుదెసం గ్రోశమాత్రంబున నున్న వ్రేపల్లెకు నతిరయంబునం
బఱచి.

27


సీ.

నందగోపునికూర్మినందనుం డగుకృష్ణుఁ డడవిలో మముఁ గూడి యాడియాడి
యెవ్వనితోఁ జెప్పఁ డేపున మనయేటఁ బెనుబాము లుండెడు పెద్దమడువు
లోపలి కుఱికి పెల్లుగఁ గలంపఁగ నందుఁ గలుగు నాగము లెల్లను గవిసి పొదివి
కఱచుచున్నవి చాలఁ గాలుసేయార్ప రాకుండంగఁ బాపఱేఁ డొడలు సుట్టె


తే.

నకట యెచ్చోట నున్నవాఁ డతనితండ్రి, వేగయెఱిఁగింపరే లావు వెరవుగలుగు
వ్రేలువిడిపింపఁగలయట్టివీధములెల్ల, [10]జేయఁదగురారె యని వారునగూయుటయును.

28


వ.

వజ్రపాతతుల్యం బగునవ్వాక్యంబు హృదయంబు వగులింప నార్తియు విస్మ
యంబును శోకంబును ముప్పిరిగొన నప్పుడ యప్పశుపాలపుంగవుం డెక్కడెక్కడ
యని యక్కూయివచ్చినవారు దెరువు వెట్ట నతిత్వరితంబున నరిగె లావరు లగు
గొల్ల లెల్లం గైదువులు గొని యతనిం దలకడచి నడచిరి యశోద తల్లడిల్లి
యుల్లంబు మూర్ఛలు పైకొన నాక్రందనపరవశ యగుచు వికీర్ణకేశయు విగళి
తాశ్రుధారాక్లిన్నపిహితమార్గయు నై చుట్టపువెలందులెల్లఁ దగిలి పొదివికొని
పోవం బోయె నాబాలవృద్ధంబుగా వ్రేపల్లెయెల్లం గదలి యిది యేమి పుట్టె
ననువారును నిట్టవునే యనువారును గృష్ణుం డెప్పుడుం గొఱతనుఱుకు పిన్న
వాఁడునుం బిన్నకొలందులం బోయెడువాఁడు గాఁ డనువారును దొంటిచెయ్దంబు
లూహింపఁ గాళియాహియుఁ దద్బాహువులకు లోనగువాఁడ కాని యతని
కవమానంబు గలుగనేరదు సూడుం డనువారును నై పెక్కండ్రు పెక్కువిధంబులం
బలుకుచుం జని రిట్లు సని యందఱుం గాళిందీతటంబున నంతంత నిలిచి.

29


చ.

అసితఘనావృతుం డయినయర్కునిమాడ్కి మహావిధుంతుదో
ల్లసనవిషణ్ణుఁ డైనమృగలాంఛనుపోల్కి నుదగ్రధూమసం
ప్రసరతిరోహితుం డయినపావకుధంగి భుజంగబంధన
వ్యసనము నొంది యున్నకమలాక్షునిఁ గాంచి విషణ్ణచిత్తతన్.

30


వ.

ఎయ్యదియం జేయరామిని నివ్వెఱపడి చూచుచుండిరి. యశోదయం దత్పతి
యను హా యని పుడమిం బడి సొమ్మవోయి బంధుప్రయత్నంబునం దెలిసి
యుల్లంబుల నుడుకుచుండి రప్పు డాగోపవర్యుండు తక్కినవారిం జూచి.

31


క.

ఈపసిపాపని నిచ్చట, నీపెనుఁబామునకు నిట్టు లెరసేసినయీ
యాపదకుఁ గొలువుగాఁ గల, యీపాటున కేమిపాప మేఁ జేసితినో.

32

శా.

రూపంబున్ బలవిక్రమంబులు మహారూఢంబులై యెంతయున్
దీపింపం గలయట్టిపుత్రుఁ గనుటన్ దీవ్యత్తపశ్ళీలుఁ డీ
గోపాలుం డనఁ గీర్తితుండ నగునాగో మిమ్మెయిన్ వమ్ముగాఁ
జూపాత్మన్ గణుతింప దైవము గడుం జూపోపదయ్యెం జుమీ.

33


ఉ.

పూతన కట్లు నేపడియుఁ బోఁడిమి దప్పక పేర్చు టాదిగా
నాతత మైనవీనిబల మద్భుత మాయురగంబువాత ని
ట్లాతురపడ్డ యిట్టివిధ మారసి యిట్టనరాదు గాని వీఁ
డేతెరు వూఁది యైనఁ దరియింపఁగలం డనుబుద్ధి పుట్టెడున్.

34


తే.

ఏనుఁజుట్టపుఁబెద్దలు నింత తెలివి, గలుగుకతన నెట్లైన నీయలఁతవెల్లి
గొంత యీఁదెద మక్కట కొడుకుఁ జూచి, పనవుతల్లితల్లడము మాన్పంగవశమె.

35

కాళియునిచేతఁ జుట్టఁబడిన శ్రీకృష్ణునిఁ జూచి యశోద శోకించుట

వ.

అనుచుండ నయ్యశోదాదేవి కృష్ణుం గనుంగొని.

36


ఉ.

వెన్నలు దిన్న తప్పులకు వ్రేతలమెచ్చుగ నాఁడు రోలితో
ని న్నటుగట్టిత్రోచినయనీతి దలంచియొ నేఁడు నన్ను నో
వెన్నుఁడ యిట్లు సేసెదవు విశ్రుతసత్త్వుఁడ వీవు నీకు నీ
చెన్నఁటిపాపపు ర్వొకటి సేయఁగ నోపెనె యేపుసూపవే.

37


శా.

 నామీఁదం గృప యెఫ్డుఁ జాలఁ గలవన్నా యేను శోకాగ్నియం
దీమాడ్కిం బడఁగా నుపేక్ష దగునే యీదిక్కు చిర్నవ్వుతో
నీమో మింపుగఁ జూపవే తెఱవవే నేత్రాబ్జము ల్పల్కవే
యామోదంబుగఁ బుత్ర! తల్లులకు ని ట్లత్యా ర్తి గావింతురే.

38


తే.

అరయ దెసలేక గోధనం బడవిలోనఁ, జెల్లచెద రయ్యె నీవింతసేపు గుఱ్ఱ
యిట్టు లేమఱఁ బాడియె యీక్షణంబ, వెడలి చనుదెంచి ననుఁ బ్రోవవే కుమార.

39


క.

కడిఁది విషకంటకాటవిఁ, గడికండలు చేసి నీఱు గావించితి వీ
పొడపాము నీకు నేటిది, గొడుకా నీకులము వంతగూరు టుడుపవే.

40


చ.

అని పలవింప బంధుసతు లందఱు నిట్టిసుపుత్రుఁ డింక నే
జననమునందుఁ గల్గు నిటు స్రగ్గుట కోర్వరు లాఁతు లైన నె
ట్లనయము నోర్చుఁ గన్నకడు పగ్గలమై వెలవెట్ట రానిపెం
పునఁ గలమానికం బొదవి బొగ్గయి పోయెనె యక్కటక్కటా.

41


తే.

ముప్పునకు నోమదయ్యెనె ముగ్ధ యీయ, శోద నందగోపున కుగ్రశోకజలధి
యీఁదఁ గొలఁది గాదయ్యెనె [11]యెందుఁబడయ, దయ్యెనే యిట్టిపెన్నిధియనుఁగుబిడ్డ.

42


వ.

ఇట్లందఱు నన్నివిధంబుల దుఃఖింప గోపాలురుం దమలోనన వగచి యింక శోకిం
పం బని లేదు మన మిమ్ముడుఁగులోనం గృష్ణుఁ డుఱికినయట్ల యుఱికి యిక్కఱకుఁ

బాముతోడ నెఱలావునం బెనంగి కుమారు విడిపింతము గాకున్న నతనితోడిద
లోకంబుగాఁ గాళియ కాలాహి యనుకాలునిపాలువడి చిక్కుదము చంద్రవిర
హిత యైనవిభావరివిధంబున భానుహీన యైనగగనవీథిచాడ్పున వృషభంబు
వెలి యైనగోవితతితెఱుంగునఁ గృష్ణుండు లేనివ్రేపల్లె కెత్తెఱంగున మరలిపోద
మిదియతెం పిట్లు చేయుద మని యుత్సహింప వారలయార్తియు వనజనాభుదు స్స్థి
తియుం జూచి విష్ణుతేజంపుఁ బెఱమూర్తియై యభేదజ్ఞానంబు నిజబుద్ధి నిరూఢం
బుగా నెఱుంగు బలభద్రదేవుండు వాసుదేవుం దలఁపింపఁ దలంచి యొక్కరుం
డును దొలంగి నిలిచి గంభీరమధురస్వరంబున ని ట్లనియె.

43


ఉ.

మానుషభావ మిట్లొకఁడు మాటిడి లోకహితం బొనర్పఁగాఁ
బూనిననీమహామహిమబుద్ధిఁ దలంపక యిప్పు డిచ్చటన్
దీనికి నింత స్రుక్కఁబడి దీనత నొందుట మెచ్చుగాదు నీ
దైనయనుంగులందఱును నార్తిఁ గలంగుట కృష్ణ! చూచితే.

44


వ.

వీరు నీసత్త్వం బెఱుంగరు గాన శోకించెదరు జన్మసముచితంబు లగుకర్మంబు
లప్రతిహతంబులుగాఁ జెల్లించెదవు గావున బంధుప్రమోదం బవశ్యకర్తవ్యం
బివ్విషాహి మర్దించి యీదర్దశ నపనయింపు మనినరౌహిణేయువాక్యం బాకర్ణించి.

45


శా.

ద్వైతభ్రాంతినివృత్తిఁ బొందఁగ నభేదబ్రహ్మబోధంబు సం
భూతం బైన నశేషబంధనములం బోఁద్రోచుసిద్ధాత్మున
ట్టాతం డమ్మెయి నాత్మతత్త్వవిదుఁడై యప్పాపచుట్ట ల్విని
ర్ధూతిం బొందఁగ నీల్గి బిట్టు నెగసేం దోయౌమధ్యంబునన్.

46


వ.

అట్టి యుత్సాహంబు నిర్వ్యపోహంబుగాఁ బేర్చి.

47


ఉ.

కాళియభోగిపుంగవు నఖర్వసుదుర్వహగర్వధుర్యతం
గ్రాలెడుమిక్కుటంపుఁబడగ ల్వెస నైదిటిమీఁదికి న్మహా
భీలవిచేష్టమై నుఱికి [12]పెల్చఁ దదీయవిలోలపుచ్ఛముం
గేల నమర్చి నొంపఁ దొడఁగెం బటుపాదనిపాతనంబులన్.

48


మ.

యమునావీచి మృదంగ వాద్యములు మ్రోయం దీరగోపౌఘహ
ర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగఁ జంచత్కాళియవ్యాళభో
గమహారంగతలంబునం బటుగతిం గంజాక్ష[13]నిర్మర్దనా
ట్యము హృద్యాద్భుతభీమ మై పరఁగ దివ్యశ్రేణి చూచెన్ దివిన్.

49


మ.

వెస దామోదరుపాదఘాతనగతుల్ వేవేలచందంబులం
బ్రసభాటోపముఁ జూపఁ[14] బాపఫణభృత్ఫాలచ్చటా[15]మండలం
బసహంబై [16]నొగిలెన్ మణుల్ సెదరగా నాస్యంబులన్ శోణితం
బెసఁగన్ దంష్ట్రలు నుగ్గుగా గరళవహ్ని[17]జ్వాలికల్ వెల్వడన్.

50

తే.

కఱకుటెండదాఁకిన తొగకామభంగి, బాఁపఱేనిమే నెంతయు బలము దఱఁగి
స్రుక్కె నింద్రియంబుల యేపుడక్కెనూర్పు, లొయ్యనొయ్యన డింద[18]ఁ గుట్టుసుఱుదక్క.

51


వ.

ఆసమయంబున.

52


క.

లయకాల కేళితాండవ, భయంకరుం డైనభర్గుభంగిఁ దనరుకా
ళియమౌళిరంగ నటునకు, జయ వెట్టిరి సకలలోకచారులుఁ బ్రీతిన్.

53


వ.

ఇబ్బంగి నత్యంతదురవస్థం బొందినయద్దందశూకప్రవరుండు వివశం బగుమాన
సంబు నెట్టకేలకు నూలుకొల్పి గోవిందచరణారవిందంబులక్రింద నున్నయట్ల
యుండి భీతివిహ్వలంబు లగుజిహ్వలు దొట్రిల్ల నల్లన దీనస్వరంబున నప్పురు
షోత్తము నుద్దేశించి యిట్లనియె.

54


మ.

నిను సర్వాధికుఁగా నెఱుంగక కడున్నీచుండనై నీచపుం
గినుక న్నీమహనీయదేహమునకుం గీ డిట్లు గావించితిం
జనునా క్రొవ్వునకింతవట్టు త్రిజగజ్జన్మస్థితిధ్వంసముల్
పొనరింపంగఁ బ్రభుండ వీకొలఁదితప్పుల్ సైఁచు టొప్పుం గృపన్.

55


క.

నీ విమ్మెయి దండించుట, దేవా! నిర్విషుఁడ నైతిఁ దెలివియు శమమున్
భావమున నొలసె నీపను, లేవియయినఁ జేయువాఁడ నే వశ్యుఁడ నై.

56


తే.

అజసురేంద్రాదులకుఁ జేర నలవిగాని, యుష్మదీయపదాంభోజయుగళి నాదు
తలలు సోఁకుటఁ జరితార్థతముఁడనైతిఁ, గడఁగి నీయాగ్రహము ననుగ్రహమయమయ్యె.

57


తరువోజ.

జయ సర్వభూతేశ జయ సర్వవరద జయ సర్వరక్షక జయ సరోజాక్ష
జయ జగద్వందిత జయ జగన్నాథ జయ జగద్ధారక జయ విశ్వరూప
జయ కృష్ణగోపాల జయ మహాసత్వ జయ పూతనాఘాత జయ దైత్యదమన
దయనిము జీవితదానంబు నాకు [19]తగశరణాగతత్రాతవు గావె.

58


చ.

అని శరణంబు వేఁడిన మహాహివరేణ్యుని సత్యకీర్తనం
బునకుఁ గృపార్ద్రచిత్తుఁ డయి పుష్కరలోచనుఁ డాక్షణంబ యా
తని కభయం బొనర్చిన నతండును దత్కరుణార్ద్రదృష్టిపా
తనము సుధా[20]రసం బగుచుఁ దన్ను సచేతనుగా నొనర్చినన్.

59


వ.

తనఫణపంచకంబునుం దచ్చరణాగ్రంబులు మోవం బ్రణామంబులు చేసి ముంచట
నిలుచున్న నద్దేవుం డతని కి ట్లనియె.

60

శ్రీకృష్ణుడు కాళియుని యమునాప్రవాహంబు వెడల నడుచుట

సీ.

ఇదియాదిగా నిన్ను నీ యమునానది వసియింపనీ నేను వార్థిగుఱిచి
సకుటుంబకంబుగాఁ జనుము జలస్థలచారులై యున్ననీవార లెల్ల
నీతోన చనుదెంతు రీతోయములు భవద్విషయోగమునఁ దొల్లి విషము లగుట
నిజముగా నట్లుండె నేఁడు నిర్విషము లై యమృతనామకము తథ్యముగఁ దాల్చి

తే.

యఖిలజనులకు నధికసేవ్య[21]ంబుగాత, మత్పదాంకము లయిన నీమస్తకములు
సూచి గరుడండు నీకు నెచ్చోట నున్న, ననఘ యెప్పుడుఁ గీడు సేయంగ వెఱచు.

61


వ.

ఇది వరంబుగా నిచ్చితిం బొమ్మనినఁ గాళియుండు గోపాలు రందఱుం జూడ
గళత్రపుత్రభృత్యసమేతంబుగా వెలువడి సముద్రంబున కరిగెఁ గృష్ణుండును
యమునాహ్రదంబులోన నుండి నిజేచ్ఛావిహారతృప్తం బై వెడలునుద్దీపదంతా
వళంబుపగిది వెలువడి వచ్చిన నెదురువోయి.

62


క.

 తల్లియుఁ దండ్రియుఁ బ్రమదము, వెల్లి గొనఁగఁ గౌఁగిలించి వేదీవన లీ
నుల్ల మలర నతఁడును బ్రణ, మిల్లి సమాశ్వాసవాక్సమితి పచరించెన్.

63


వ.

అంత నఖిలగోపాలురు నద్భుతప్రమోదమేదురహృదయు లగుచు నతని చుట్టును
ముసరికొని బహువిధంబులం గీర్తించుచు నభినందింప నందగోపాదివిశిష్ట
జనంబు లతని కిట్లనిరి.

64


ఉ.

ఎన్నడు నిట్టిసాహసము లిట్టిబలోద్ధతు లిట్టిధైర్యముల్
విన్నవి కన్న వెయ్యెడల వీరకులోత్తమ కల్గనే జగ
త్సన్నుత మయ్యె నీమహిమ సర్వధనంబులు గోపకోటియున్
నిన్ను శరణ్యుఁగాఁ బడసె నేఁడు మొద ల్పతి వీవ యంతకున్.

65


క.

ఎచ్చోటనైనఁ దమతమ, యిచ్చఁ జొరంగనియె గోవు లియ్యేట మునుల్
విచ్చలవిడిఁ దఱియుదు రీ, యచ్చపుఁబుణ్య మిటు నీకు నబ్బునె యనఘా.

66


తే.

అడవిఁ బుట్టిన[22]మ్లేచ్ఛుల మగుట మాకు, నిక్కమయ్యె నిమ్మెయి నిప్పునీఱువొదివి
నట్టులున్న మహాభూత మైననిన్ను, నెఱుఁగ మింతగాలము నిట్టికొఱఁత గలదె.

67


వ.

అని పలికి యతనికిం బ్రదక్షిణంబు [23]లాచరింప నతండు వారి నయ్యైవిధంబుల
నుపలాలించె నిట్లు సంభావితుం డైనయావీరుండు పురస్సరుండుగా నందఱు
వచ్చి వ్రేపల్లె సొచ్చి సుఖంబుండి రవ్విధంబునం గాళియభుజంగభంగంబు నివృత్తం
బైనయనంతరంబ యొక్కసమయంబున.

68


క.

పసులకు మే పెద్దడియై, పసచెడి పొల మెల్లఁ [24]బొసుఁగుపడి యుండఁగ గో
పసమేతంబుగ వసుదే, వసుతుఁడు చింతింపఁ బ్రౌఢవల్లవులు దగన్.

69


వ.

గోవర్ధనపర్వతంబునకు నుత్తరభాగంబునం గాళిందీపరిసరంబున సమతలంబును
గృష్ణమృద్భూమికంబును సంపన్నబహుళతృణోపజాతంబు లగుతాలవనం బతి
విశాలం బై గర్దభరూపధారి యగుధేనుకుం డనుదానవుచేత నాక్రాంతం
బగుటం బ్రాణు లెవ్వారికిం జరిం రాక [25]పాడఱి యుండు నని ప్రసంగింప రామ
కేశవు లక్లేశం బగుదర్పావేశంబున నుత్సహించి.

70


తే.

పసికి మేపు గల్గినఁజాలు నసుర లేమి, నేసెదరు పోవనిం డని చేయఁగలుగు
గొల్లలకు నెల్లఁ జెప్పఁగా గోగణముల, వెలిచి రార్చుచు నద్దెసఁ జెలఁగివారు.

71

వ.

అమ్మహాగహననిరంతరదురంతకాంతారంబునందు.

72


ఉ.

ఏదెస చూచినం బొదలి యింపెసలారెడునాతృణోత్కరం
బాదటవోవఁగాఁ గదుపు లన్ని యుఁ జెన్నుగ నిండి మేయ దా
మోదరముఖ్యగోపతతి యొక్కట యాతృణరాజషండ మా
మోద మెలర్పఁ జొచ్చి మనముల్ దనియన్ విహరించి రెల్లెడన్.

73


వ.

అప్పుడు.

74


శా.

కాలాహుల్ [26]ఋజుతావిచిత్ర మగుభోగశ్రేణి శోభిల్లఁ బా
తాళం బొక్కట నిర్గమించి [27]విలసద్దర్వీవికాసంబుతోఁ
గేళిం గ్రాలెడినో యనంగఁ దనువుల్ గృష్ణంబులై యొప్పఁగా
ఖేలన్మూర్ధము లైనతాళతరువుల్ కృష్ణుండు వీక్షించుచున్.

75


వ.

రోహిణీనందనువదనంబు గనుంగొని యి ట్లనియె.

76


మ.

క్రమపాళంబునఁ గెంపుతోడినలుపెక్క న్మిక్కుటం బైన గం
ధము దిక్కుల్ సురభీకరింప రస మంతర్గామి యయ్యు[28]న్వెలిం
గమియం గాఱుచునున్నచాడ్పున విలోకప్రీతి గావింప హృ
ద్యములై యున్నవి చూచితే ఫలము లీతాళద్రుమశ్రేణులన్.

77


తే.

వీని [29]నింపార గోవులు నేను గూడి, యెలమి యెలయ నాస్వాదింతు మెంతయేని
వేడ్క యయ్యెడు రాల్పుము వేగవేగఁ, బ్రాఁకి నీలావువెరవు సంభావితముగ.

78


వ.

అనిన నవ్వీరుం డవ్విధంబున కియ్యకొని గోపకుల నందఱు గలయ నాలోకించి.

79


క.

ఎక్కఁ దడవు త్రాళుల మొద, లక్క జముగఁ బట్టియూఁతు నవి యేఱికొనుం
డెక్కుడుగఁ బండ్లు మీరొ, క్కొక్కని గడువంగఁ జనుచు నుద్ధతలీలన్.

80


తే.

ఒక్క తరవాయి దొరకొని యొకటినొకటిఁ
బృథుభుజాదండములఁ బట్టి పెలుచనూఁచెఁ
బెఱుక విఱువను నొల్లక యుఱక వన్య
హస్తి నిజహస్తమునఁ జెరలాడునట్లు.

81


క.

పరుసని గాడ్పున రాలెడు, వరుసున ధరఁ దొఱుఁగు, త్రాటిపండుల మ్రోఁతల్
పొరిఁబొరి గోపకుమారుల, యురుహర్షధ్వనులుఁ గూడి యొక్కట నొదవెన్.

82

బలరాముండు గర్దభవేషధారి యగుధేనుకుం డనురాక్షసుం జంపుట

వ.

 అమ్మహాఘోషంబునకుం గలుషించి ఘోరభుజశక్తిఘోషణుండును ఘోషజన
నిత్యభీషణుండును సంత్రాసీతధేనుకుండు నగు ధేనుకుండు గర్దభరూపంబు దాల్చి
దుర్గము లగు దైత్యులు తాదృశాకారు లై సహస్రసంఖ్యులు తోడ నడువ రామ
కృష్ణులకుం గీడు సేయుతలంపునఁ దెంపు మిగుల నడతెంచినం గని సకలగోపా
లురు నేపు దక్కి యక్కడక్కడన స్రుక్కి. రంత.

83

సీ.

ఖురతాడనంబునఁ బెరిగినధూళి యర్యము మ్రింగి యంధంపుఁదమముఁ బెంచె
హేషితధ్వనులఁ బిట్టెసఁగుదిక్కంప మాశాగజంబులమద[30]స్రవము మాన్చెఁ
దెఱుచునోళుల పెద్దతెరువులు పాతాళములఁ గేలిగొని మృత్యుముఖము నొడిచెఁ
గనలుకన్నుల నిప్పు లెనసి పురోమార్గములు వ్రేల్చి సకలాటవులును బొదివెఁ


తే.

దోఁకలార్పఁ బృధుస్కంధూననము లొ, నర్పఁ జెదరురోమంబులు నభము నెల్లఁ
బక్ష్మలంబుగఁ జేసెఁ దద్బహుళగర్ద, భాసురాసీక మబ్భంగి నడరునపుడు.

84


వ.

అట్టిమాయాసైన్యంబున కగ్రేసరుం డై కవియుదెంచు ధేనుకుం గని సంకర్షణుం
డమర్షోత్కర్షంబునం దదీయబలప్రకర్షంబు రిత్తయకాఁ గొని రిత్తచేతుల
నెదురై నిలిచిన.

85


తే.

కదియఁ బాఱుతెంచి గర్దభదైత్యుండు, వీఁకతోడఁ దిరిగి వెనుకకాళ్లు
చండరభస మెసఁగ రెండును జోడించి, యుగ్రభంగి బలునియురము దాఁచె.

86


ఉ.

తాచినఁ దోన బిట్టొడిసి తత్పదయుగ్మముఁ బట్టి బిట్టుగా
వీచి యతండు వానిఁ గడువేగము లాగము నొప్ప మీఁదికిన్
వైచెఁ దదంగకంబులు జవం బఱి త్రాళులు దాఁకి నుగ్గును
గ్గై చెడి యుర్విఁ దత్ఫలచయంబులతోడన కూడి రాలఁగాన్.

87


వ.

ఇట్లు ఖరదైత్యుం బరిమార్చి పేర్చినరాముండునుం బోలె ధేనుకదైత్యుం బరి
మార్చి పేర్చి బలరాముండు రాసభాకారు అయినతక్కినరాక్షసులనుం గడకాళ్లు
వట్టి తాళ్లతో వ్రేసి చంపెం గృష్ణుండును దృప్తశౌర్యతృష్ణుం డయి యవ్విధం
బున నవ్విబుధారాతుల మోఁదిమోఁది పీనుంగుపెంటలుగా వైచెఁ దత్ప్రదేశం
బంతయు నసురుల కళేబరంబులం దాళఫలోత్కరంబుల నతిదంతురం బయ్యె
నయ్యిద్దఱ పౌరుషంబును గోపాలురు విస్మయప్రమోదంబులతోడం బొగడి
చెలంగి యార్చి.

88


ఉ.

ఎవ్వరికైనఁ జేరఁ జొర నెన్నఁడు రానినిశాచరాస్పదం
బివ్వనభూమి నేడు సుసమిద్ధబలాఢ్యులు వీరి[31]చెయ్ది నిం
కెవ్వరికైనఁ జేరఁ జొర నిచ్చఁ జరింపను వచ్చె మెచ్చుగా
నెవ్వరి కిట్టిలావు గల దే మని వర్ణన సేయఁగాఁ దగున్.

89


వ.

ఈ రామకృష్ణులు ప్రకృతిమానవులు గా రేమేనియు నిమిత్తంబున ని ట్లున్న
వేల్పులు గానోపుదు రటమీఁద దైవం బెఱుంగు మన మేమి నేర్తు మనుచు నాఁ
గదుపులవెన్క నిజేచ్ఛం జని రంత గొంతకాలంబునకు.

90


ఉ.

ఆమని మేసి యాముకొని యాదటఁ బేర్చి చెలంగుగోధన
స్తోమము గొంచు నగ్రజునితోడ యశోదతనూభవుండు శ్రీ

దాముని మేనమామసుతుఁ దత్పరతం దనకూర్చు నెచ్చెలిం
బ్రేమ మెలర్పఁ గూడి పెఱవ్రేలు ననేకులు గూడియాడఁగన్.

91


వ.

అనేకక్రీడాసక్తులై భాండీరవటప్రాంతంబునం దొల్లింటియట్ల కదుపుల మేయ
వెలిచి తమయిచ్చల వినోదించు సమయంబునం బ్రలంబుం డనుదానవుం డయ్యదు
కుమారుల కపకారం బొనర్ప నెడరు వేచి గోపరూపంబున గోపకుమారుల
లోనం గలసి యుండ నయ్యందఱు హరిణక్రీడనం బనునాటకుం దొడంగి రెండు
సంగడంబులై శ్రీకృష్ణుండును శ్రీదాముండును బెన్నుద్దులుగాఁ దక్కినవారునుం
దమలోన దొరయుభంగి దోయిగట్టిరి ప్రలంబుండును బలదేవుతోడి జోడయ్యె
నివ్విధంబున.

92


క.

భాండీరవటము కరిగా, నొండొరులం గడవఁ బేర్చి యొక్కట హరిణో
[32]చ్చండప్లుతగతి దాఁటుచుఁ, జండరభసమునఁ గడంగి సరి[33]నరుగంగాన్.

93


వ.

అయ్యుదారఖేలనంబునం గృష్ణపక్షంబువార లెల్లను జయంబునొందిరి శ్రీదాము
దిక్కువారు పరాజితు లై రిట్లు గెలిచినవారి నోటువడినవారు తమతమయఱక
లెక్కించుకొని కరిదాఁక మోవవలయుట నవ్విధం బొనర్చునప్పుడు.

94


క.

బలభద్రుం దనయఱకటఁ, బ్రలంబుఁ డిడికొని బలంబు భాసిల్లఁగ న
వ్వలకుఁ గొనిపోవువాఁడై, యలఘుస్ఫురణమున నరిగియరిగి మదమునన్.

95


తే.

పగతుఁ డిట్టులు లెస్స లోఁబడియె వీనిఁ
బ్రిదిలిపోనీక యింకఁ జంపెద రయమున
ననుచుఁ దన రాక్షసాకార మమరఁ జూపి
రాహు వమృతాంశుఁ గొనుప్రకారమునఁ గొనుచు.

96


వ.

అంబరపథంబునం జనం దొడంగినం గని విస్మితుండై యక్కుమారుం డెయ్య
దియుం జేయ వెరవుసాలక మరలి చూచి దామోదరుం బిలిచి.

97


ఆ.

కృష్ణ కృష్ణ వీఁడె క్రించురక్కసుఁ డొక్కఁ, డనఁగ గోపమూ ర్తి నరుగుదెంచి
వందనమున నన్ను వదలక యిటువట్టి, యుఱక చదలఁ బఱచుచున్నవాఁడు.

98


క.

ఏమియు సాయంబున నే, నీమాయపుఁబుర్వు వెస జయించి తొలఁగుదు
నీమత మొనరించెద వే, వే మతిమంతుఁడవు సెపుమ వెరవు తెలియఁగాన్.

99


వ.

అనిన నమ్మహాభాగుం డమ్మహాత్తున కి ట్లనియె.

100


సీ.

నిన్ను నీ వెఱుఁగవు మిన్నక మానుషాకృతి నిట్లు సెందినకతన నొకఁడు
దలఁపక యిబ్భంగిఁ బలికెను గగనంబు శిరము పాతాళంబు చరణతలము
వాయువు శ్వాసంబు వహ్ని యాననము విశ్వాధారుఁడవు నీకు నంత మెందు
లేకున్కిఁ బరగితి లోకంబునం దనంతాభిధానంబున నఖిలవంద్య


తే.

వేనవేలు మస్తకములు వేనవేలు, కన్నులును వేనవేల్నాలుకలును గలుగు

మూర్తి నఖిలాండకోటియు మోచియుండు, దధికసత్త్వుండ వీవు విశ్వాత్మకుఁడవు.

101


క.

ఏ ననఁగా నీ వనఁగా, భూనుత భేదంబు లేదు పుట్టితి మిటు లో
కానుగ్రహార్థమై మన, [34]మానుషభావ మిది యనుపమానం బెందున్.

102


వ.

కావున నీవిద్దురాత్ముసంరంభంబు సరకుసేయక నీభుజబలంబు మెఱయు మని
తెలిపినం దెలిసి బలదేవుండు.

103

బలరామదేవుండు ప్రలంబుం డనురాక్షసుం బరిమార్చుట

శా.

శైలోత్తుంగశరీరుఁ డైన రిపుమస్తం బుగ్రదంభోళికిన్
మేలై పేర్చుకఠోరముష్టినిహతి న్నిర్భిన్నముం జేయఁగా
నోలిం బెల్లుగ సర్వరంధ్రముల [35]వాతోద్యజ్ఝరాభంబులై
కీలాలంబులు పర్వఁ గూలె నధికక్లిష్టాత్ముఁడై వాఁ డిలన్.

104


క.

చఱినుండి తొలఁగ నుఱికెడు, [36]నెఱసింగపుఁగొదమవోలె నిబ్బరముగఁ గ్రే
ళ్ళురికెం దొలఁగం బగతుని, యఱకటనుండి భువిమీఁది కబ్బలియుండున్.

105


వ.

ఇవ్విధంబునం బ్రలంబహననధౌరేయుం డగురౌహిణేయు[37]విజయం బభినందించి
బృందారకులు బృందారకమార్గంబున నుండి.

106


క.

బలమున నీ దేవుం డిటు, ప్రలంబు వధియించెఁగాన బలదేవుఁ డనన్
వెలయుఁ ద్రిలోకంబుల నని, పలికిరి గోపకులు వినఁగఁ బ్రవ్య క్తముగాన్.

107


చ.

అరిఁ బరిమార్చి సమ్మదభరాతిశయత్వరితాంఘ్రిపాతని
ర్భరగతి నేఁగుదెంచి పృథుబాహుయుగంబునఁ గూర్మితమ్ము నా
సరసిజనేత్రు సుందరవిశాలభుజాంతరుఁ గౌఁగిలించె భా
సురయశుఁ డాప్రలంబవినిషూదనుఁ డాదరబంధురోద్ధతిన్.

108


వ.

తక్కిన గోపకుమారులు నతని ధీరత్వంబును వీరగుణంబును గారవించి కొనియాడి
రయ్యందఱు నందునందును బశుపాలనఖేలనకౌతూహలంబునం బ్రీతు లగుచు
న ట్లున్నంత.

109


చ.

వరుసనిదాఘకాలము ప్రవర్తితమై చనఁగాఁ బయోధర
స్ఫురితవిభూతిమాసయుగశోభితమై భువనప్రమోదని
ర్భరత యొనర్పఁ బిమ్మట శరన్నవసంపద యేఁగుదెంచి ను
ర్వరకు సమగ్రసస్యవిభవంబులఁ గూర్చుచు నర్చనీయయై.

110


మ.

మును వర్షోదకధారలన్ ముదముతో మూర్థాభిషేకంబు గై
కొని శుభ్రాభ్రకిరీటశోభి యయి సంక్షుభ్యన్మరాళావళుల్
ఘనవాలవ్యజనంబులై మెఱయఁగాఁ గాంతేందుబింబాతప
త్రనిరూఢిన్ శరదంబరం బమరె నుద్యద్రాజచిహ్నంబులన్.

111

మ.

తెలినవ్వు ల్వెలిదమ్మి నెమ్మొగములం దీపార నేపారుచూ
పులు దారై మదలోలభృంగరచన ల్పొల్పార వీచీభుజా
వళి యాలింగనకేళి కుత్తలపడన్ వార్దిం దగం గూడుచోఁ
గలక ల్దేఱి తనర్చె నేఱులు శరత్కల్యాణకల్యాకృతిన్.

112


ఆ.

పిదుకఁ గొలఁదిగాక పెయ్యలు దనిసె వ్రే, పల్లెపసులు సేఁపి పాలు గురియ
నడరి పాలవెల్లి యయ్యె నా నెందు వి, కాసకాశవనవిలాస మెసఁగె.

113


క.

బంధూకతిలకములు సౌ, గంధికకర్ణావతంసకంబులు నుద్య
ద్గంధినవోత్పలకుచతట, బంధురభూషలును గోపభామల కమరెన్.

114


క.

తారకితగగనచక్రము, తో రాసె ననంగ రేలు తొగపువ్వుల నొ
ప్పారే విపులనిర్మలకా, సారంబులు సారసప్రసరసేవ్యములై.

115


తే.

అలరు వావిలిపూఁదీగె లలమికొనిన
చలువచోటులఁ గ్రుమ్మరుజడనుగాడ్పు
మొగులువిరియెండ దళుకొత్తు మొగము చెమట
లార్చి పొలముగొల్లలకు మెచ్చై తలిర్చె.

116


క.

ఏడాకుపొన్నకొమ్మలు, గోడాడెడునడవి [38]గౌరుకొదమలు మోద
క్రీడఁ దనరుచాడ్పునఁ బై, నోడికలయి పువ్వుఁదేనె లురులఁగ నొప్పెన్.

117


క.

అసనంబులు మదనునియి, ష్వసనంబులపోలె విరహు లగువారి కతి
వ్యసనం బొనర్చి [39]వికస, త్ప్రసవశిలీముఖనితాంతపటుపాతములన్.

118


ఉ.

శారదచంద్రిక ల్వితతచారుమహోత్సవ లయ్యె గోపక
న్యారమణీయగీతుల నుదంచిత[40]ధేనువిదోహనధ్వని
స్ఫారతలన్ సదర్పవృషభవ్యతిగర్జితలీలల న్మహో
దారరతీశ్వరప్రియకథారుచులన్ వ్రజభూమి నెల్లెడన్.

119


వ.

ఇట్టి శరత్సమయంబునం బ్రమదతరంగితంబు లగునంగంబులు నంతరంగంబులుం
గలిగి గంగాతరంగంబుల తెఱంగున ననంగదమనహాసవికాసంబులచాడ్పున నమృత
పయోధిఫేనపటలంబులపగిదిఁ గర్పూరక్షోదపుంజంబులపొలుపునం జందన
పంకకూటంబులకైవడిం జంద్రప్రభాపూరంబులపరుసునం గుముదచ్ఛదవిసరం
బులవిధంబున ముక్తామణిసముత్కరంబులకరణి సతిధవళంబు లై శైలంబులం
బోలె నుచ్ఛ్రితశృంగంబులు మహాతరువులుంబోలె బంధురస్కంధంబులును [41]జంద్ర
కిరణంబులుంబోలె సర్వదిగ్వ్యాపకంబులుఁ గృతయుగధర్మంబులుంబోలె నఖం
డితసంచారంబులు శంకరవిహారంబులుంబోలె ననపేతవృషంబులు శ్రుతివిభవంబు
లుంబోలె లోకోద్ధారకంబులు విష్ణుకీర్తనంబులుంబోలె శ్రవణమంగళంబులు
నధ్వరోత్సవంబులుంబోలె దర్శనపావనంబులుఁ బుణ్యతీర్థంబులుంబోలె నిత్యనిర్మ

లంబులు మంత్రంబులుంబోలె రక్షణీయంబులు దైవంబులుంబోలె నర్చనార్హం
బులు [42]గురువులుంబోలె నిరంతరానువర్తనపరితోష్యంబులు శ్రీవిశేషంబులుం
బోలె నఖిలలోోకోపజీవ్యంబులు భావంబులుంబోలె రసజనకంబులు సమయంబులుం
బోలె బహుమార్గప్రవృత్తంబులు నీతిపథంబులుంబోలె నర్థావహంబులు నిధు
లుంబోలె నక్షీణసంతానంబులు నై యొప్పుగోగణంబులం గనుంగొని యానం
దంబున నందగోపాదిగోపాలురు తమలో విచారించి.

120

నందగోపాలాదు లింద్రోత్సవంబు సేయ నుపక్రమించుట

సీ.

కురిసె వానలు సస్యకోటియుఁ దృణగుల్మతరులతాతతులు వర్ధనము నొందెఁ
బసుల కారోగ్యసంపదతోడఁ గూడఁగ బుద్దియుఁ దుష్టియుఁ బొలుపు మిగిలెఁ
బ్రజలు సప్రజలయి పాడియుఁ బంటయు నొదవంగఁ గని తృప్తినొందినారు
రాజులు నియతసంరక్షణ గావింప నహితతస్కరబాధ లంద వెందుఁ


తే.

గాననిది యుజ్జ్వలోత్సవకరణమునకు, సమయ మేఁ టేఁట మనచేయుశక్రపూజ
సేయ వలవదె యిం కెడసేయ నేల, యని వినిశ్చితకార్యులై యాక్షణంబ.

121


తే.

పల్లెలో నెల్లఁ జాటఁగఁ బనిచి వలయు, వస్తువులు సమకూర్చుప్రవర్తనమున
సక్తులై యుండఁగాఁ గని సరసిజాక్షుఁ, డెల్లగోపాలకులఁ జూచి యల్ల నగుచు.

122

.

క.

కడుసంభ్రమమునఁ దిరుగం, బడియెద రిది యేమి యేమి పండువు మీ
కొల్చెడు దైవ మెద్ది యెయ్యది, పడయంగా వచ్చుఁ దత్సపర్యానియతిన్.

123


వ.

ఇంతయు నున్నరూ పెఱుంగింపవలయు ననిన వారిలో నత్యంతవృద్ధుం డగు
గోపాలుం డొక్కరుం డక్కుమారున కిట్లనియె.

124


సీ.

విను నందగోపనందన యింద్రుఁ డొడయండు లోకపాలురకును లోకములకు
నతనియేలెడు ఋతు వంబుదాగమము తత్సమయంబునందుఁ బ్రచండమేఘ
కులము లాతనియాజ్ఞ దలమోచి యతని యాయుధముచిహ్నంబగు నొడళులొప్ప
భానుకరస్పర్శపాకంబునం దొందుమెఱుఁగులతోన సమీరణుండు


తే.

చఱచి మ్రోయింప
మ్రోయుట యుఱుము గాఁగ, వచ్చి దివినుండి ధారాళవారి గురిసి
సస్యములఁ బ్రోచి పసికిఁ బోషణ మొనర్చి, యఖలజంతువులకుఁ బ్రీతి యావహించు.

125


క.

గోవులకు మేలు చేసిన, యా వేలుపు గొల్లవారి యర్చనలకు నె
చ్చో వలయువాఁడు గావున, దేవేంద్రునిఁ గొలుతు మేము దృఢభక్తిరతిన్.

126


క.

క్రేపులు వర్ధిల్లుటయును, నోపి పసులు పాలు గురియు చునికియు నన్నం
బేపార మనకుఁ గలిమియు, నాపరమేశ్వరునియీగి యని [43]యెఱుఁగుమనా.

127


తే.

అతనియిచ్చిన పుణ్యంబ యతనిపూజ, గా సమర్పించి మనము సుఖంబు గాంతు
మనఘ మనలఁ జెప్పఁగ నేల యాతఁ డఖిల, మునకు మూలంబు కూడు నీరును సృజింప.

128

వ.

ఇది యింద్రోత్సవంబు పరమకల్యాణంబు మాకుం బ్రతివత్సరంబును గర్తవ్యం
బై యుండు ననిన విని దామోదరుండు గోపాలు రెల్ల విన ని ట్లనియె.

129


క.

కరిసనమును బేహారము, నరసి పసులఁ గూర్చుటయును ననఁగా వృత్తుల్
నరులకు నిం దెవ్వనికే, వెర వుచితం బదియ వానివేల్పై యుండున్.

130


ఉ.

కానలలోఁ జరించి గిరి[44]కందరలన్ వసియించి గోవులన్
మానుగఁ బెంచి వీనివలనన్ బ్రదు కొంది మనన్ సుఖంబుమై
భూనుత యున్నవార మటు బుద్ది నెఱింగిన నెల్లభంగులం
గానలు గొండలుం బసులు గాదిలివేల్పులు గొల్లవారికిన్.

131
క.

ఎలమిఁ దమజాతి వేల్పులఁ, గొలిచి యుభయలోకసుఖము గోరుట దగుఁగా
కిలువేల్పులుండఁ గొలుతురె, పలువేల్పుల నెవ్విధంబు పాలసులైనన్.

132


ఆ.

కర్షకులకు నెలవు గ్రామసీమావళి, యవుల నడవు లిండు లాటవికుల
కడవులందు [45]గొండపడలు మనకుఁ జోటు, లింతవట్టు దెలియ నెఱుఁగవలయు.

133


వ.

అదియునుంగాక పర్వతంబులుఁ గామరూపంబు లగు వేల్పులు గావున సింహశా
ర్దూలాదులం దావేశించి యాత్మీయంబు లగునరణ్యంబులకు బాధకు లగుదుర్వి
నీతుల వధియించి నిజస్థానరక్షణం బొనర్చుచుఁ దమ్ముం గొనియాడు గహనోప
జీవులకు ననుగ్రహంబు సేసి తదీయధనంబుల కెల్ల దెసల సేమంబు గావించు నని
విందుము.

134


తే.

మంత్రయజ్ఞులు విప్రులు మహితసీర, యజ్ఞు లరయఁ గృషీవలు లద్రియజ్ఞు
లనఘ [46]గోపాలు రటుగాన నచలపూజ, యుత్సవంబుగాఁ జేయుట యొప్పు మనకు.

135


క.

వెడబుద్ధు లుడిగి నాచె, ప్పెడుమతమున మీరు గోత్రభిత్పూజతెఱం
గెడలించి గోత్రపూజకుఁ, గడఁగుఁడు పనుపుఁ డిదిపల్లె గ్రమ్మఱఁ జాటన్.

136


క.

మన మేమి యెఱుఁగుదుము శ, క్రుని నమనలు మురులు నతనిఁ గొలుతురుగా కి
వ్వనములు గిరులును మనచూ, చినమేరలు వీని మానఁ జెప్పిరె పెద్దల్.

137


ఆ.

చేయరైతిరేనిఁ జేయింతు మిము నిది, బలిమి నైన నన్ను వలతు రేనిఁ
బ్రియము దప్పకుండఁ బెద్దఱికంబుతోఁ, గొండపండు వియ్యకొండు సేయ.

138


క.

అని పెక్కుదెఱంగులఁ జె, ప్పినకృష్ణుని వాక్యములకుఁ బ్రీతి యెసఁగ నా
తనినెమ్మోము ప్రియంబునఁ, గనుఁగొని యి ట్లనియె గోపగణనికరంబుల్.

139

గోపాలకులు కృష్ణోపదేశంబున నింద్రోత్సవంబు మాని పర్వతోత్సవంబు చేయుట

మ.

కర మిష్టంబు సమస్తగోపకులయోగక్షేమనిర్వాహకం
బరయం దథ్యము పథ్య మివ్విధము నీయాజ్ఞం బ్రవర్తిల్లఁగా
దొరఁకో లల్పమె యెల్ల కార్యముల సంతోషంబ మాబుద్ధులన్
శరణం బాపదలందు నీవ యని విశ్వాసంబు భాసిల్లఁగన్.

140

తే.

నీవ గతియును మతియును నీవ పతియు, నీవ ధాతవు నేతవు నిజము మాకు
నీకతంబున వ్రేపల్లె నిర్భయత్వ, మమర నున్నది త్రిదివంబు ననుకరించి.

141


మ.

జననం బాదిగ నీవొనర్చుపను లాశ్చర్యంబు లుర్వీతలం
బున నెవ్వారికిఁ జూడఁ జేయను దలంపుల్ సొన్పఁగా రామి నే
మనిశంబు భయవిస్మయాకులత నూహాపోహముగ్ధస్థితిన్
గనుచు న్నిన్ను నెఱుంగలేము దురహంకారగ్రహాలీఢతన్.

142


మ.

బలవిక్రాంతి[47]యశంబులన్ బలరిపుం బ్రస్ఫారలక్ష్మీవిభా
కలనం బూర్ణశశాంకు శక్తిగరిమన్ గాంగేయు నేభంగి వే
ల్పులలోన న్గణుతింతు రాతరముగాఁ బోల్పం దగుం గాక ని
న్నిలలో మర్త్యునిమాత్రగాఁ దగునె యూహింపంగ మోహాంధతన్.

143


వ.

కావున నీ వుపదేశించిన మార్గంబునం బర్వతయజ్ఞంబు ప్రవర్తించువారము శక్ర
యజనంబు మానితిమి. భవదీయవాక్యంబు వారాశికి వేలయుంబోలె లోకంబులకు
ననతిక్రమణీయంబు దీని నిరాకరింప నెవ్వాడు శక్తుండు మమ్ము నింత యన నేల
యని పలికి నంత గోపప్రముఖులు భూదేవతల రావించి పుణ్యాహవాచనపురస్స
రంబుగా గిరియజ్ఞమహోత్సవంబునకు నుపక్రమించి రంత.

144


సీ.

కైసేసి గోపాలకామిను లొండొండ యాబాలవృద్ధులై యరుగుదేరఁ
దగదళత్కుసుమావతంసులై గోపకుమారు లంతటికిని దార కడఁగఁ
బాయసంబులు నపూపంబులు మోదకంబులును లోనగునన్నములును బెక్కు
మాంసంబులును హృద్యమధువులు బహువిధవ్యంజనంబులును దధ్యాజ్యదుగ్ధ


తే.

ములును గావళ్ల బండ్లను వలయుభంగి, నిడి యధోచితజనము లింపెలయనడువ
వివిధవాదిత్రములు మ్రోయ వృద్ధగోపు, లోలి నడపింప జాతర యొప్పుమిగిలె.

145


వ.

ఇవ్విధంబునం జని గోవర్ధనంబునకు నత్యంతసమీపంబున గోమయవిలిప్తంబును
రంగవల్లివిచిత్రంబును నగుమనోహరస్థలంబున నందఱుం గృష్ణుం బరివేష్టించి
నిలువ నతండు తాన యధ్యక్షుండై యయ్యజనోపకరణంబు లన్నియుం గైకొని
మహనీయస్థండిలంబున నమ్మహాశైలంబు నుద్దేశించి మహితార్చనంబు చేసి [48]బహ్వ
పూపసూపపశూపహారసహితం బగునైవేద్యంబు సమర్పించి యఖిలగోపాలుర
నక్కొండకుఁ బుష్పాంజలు లొసంగను నమస్కారంబులు గావింపనుం బనిచి.

146


ఉ.

స్థావరమూర్తి యైనతనుఁదా నచలాకృతితోడ నిట్లు సం
భావితుఁ జేసి యమ్మెయిన పర్వతశృంగమునందుఁ దోఁచి గో
పావళు లెల్ల నద్భుతమయాత్మతఁ జూడఁగఁ గేలుసాఁచి యా
దేవుఁడ యారగించెఁ గడుఁదెల్లముగా నుపహార మంతయున్.

147

తే.

ఆరగించి పానీయంబు లర్థిఁ గ్రోలి, యేను మెచ్చితి మీపూజ కెంతయేనిఁ
దృప్తిఁ బొందితి ననియె నద్దేవపూజ్యుఁ, డప్పలుకు విని యద్భుతం బతిశయిల్ల.

148


వ.

గోపాలు రెల్లరును గృతాంజలు లై దేవా యేము నీదాసులము నీయాజ్ఞయం
దున్నవార మింక నెయ్యది యానతిచ్చి పనిచెదవు పనుపుము బ్రతికెద మనినం
బర్వతాత్మకుం డయినయాసర్వేశ్వరుండు.

149


సీ.

ఇది యాదిగా మీకు నెల్లకాలంబును నారాధనీయుఁడ నద్రిమూర్తి
యగునన్ను వేల్పుగా నర్చించి కామ్యంబు లెల్లఁ గాంతురు గోవు లెచట నున్న
నభివృద్ధి బొంది నిత్యామృతస్యందినులై మిమ్ముఁ బోషించు నాదరమున
నేనును మీలోన నిచ్ఛాశరీరినై యింకను విహరింతు నింత యెఱిఁగి


తే.

యస్మదాశ్రితులై యుండుఁ డనినఁ గొండ
మీఁదికృష్ణుని మేదినిమీఁద నున్న
కృష్ణు నొక్కటఁ జూచుచుఁ గేలు మొగిచి
మ్రొక్కుచును బొంగి గోపాలముఖ్యు లపుడు.

150


వ.

వివిధవాక్యంబుల నగ్గించి రగ్గిరిశృంగస్థితం బగురూపం బనంతరంబ యంతర్ధా
నంబు నొందె నంత నమ్మహాపురుషుపనుపునం బశుపాలు రందఱుం బసులకొమ్ము
లర్చించియుఁ జిఱుగజ్జెలపేరు లఱుతం గట్టియు వనలతావలయంబులు తలలం
జుట్టియుఁ బలుదెఱుంగుల నలంకరించి మార్పుచుఁ గొండచుట్టు నొక్కవెల్లిగా
వెలిచి యచ్చటచ్చట నివాళించి బడసివైచి, మ్రొక్కి యొక్కటఁ ద్రుళ్లుచు
నుల్లాసంబు నొంది.

151


మత్తకోకిల.

పాయసంబులరొంపులున్ బహుభంగి బూరెలతిట్టలున్
నేయుఁ బాలును దేనియల్ గడు నిండిపాఱెడు నేఱులున్
వేయివేలు దలిర్ప నొప్పెడువిప్రభోజనముల్ యథా
న్యాయదక్షిణ లుల్లసిల్ల నొనర్చి రెంతయు ధన్యతన్.

152


వ.

సమస్తదీనానాథసముదయంబులం దనియం జేసి తామునుం దమతమవర్గంబుల
తోడం గూడ యజ్ఞశేషాన్నం బమృతంబుగా నుపయోగించి పండువు నిండించి
క్రమ్మఱి.

153


క.

హరిఁ బరమేశ్వరు నాశ్రిత, శరణ్యు సకలార్థకరణచతురకృపాసం
భరితాత్మకు మున్నిడికొని, యిరవుగ వ్రేపల్లె కరిగి రెంతయుఁ బ్రీతిన్.

154


వ.

అంత నక్కడఁ ద్రిదివంబునందు.

155


క.

తన పూజ ద్రోపువడుటకు, మనమునఁ గోపమును సిగ్గు మల్లడిగొనఁగా
ననిమిషపతి సంవర్తా, ద్యనుపమమేఘములఁ బిలిచి యాగ్రహ మెసఁగన్.

156

ఇంద్రుఁడు మేఘముల రావించి వ్రేపల్లెమీఁద వర్షింప నియోగించుట

సీ.

వినుఁడు బృందావనంబున నందగోపుఁడు మొదలుగాఁగలగొల్ల ముదుక లెల్లఁ
గడుఁ గ్రొవ్వి తొల్లి యెప్పుడు నాకు నేఁ టేఁటఁ జేయు[49]పూజలు నేఁడు సేయనొల్ల
కుక్కివుఁ డైన దామోదరుకఱపులు విని యొక్కచిడిపిగట్టునకుఁ జేసి
రైన నింతన యేమి యయ్యె వారికి నెల్లబ్రతుకునకై యున్నపసికిఁ బెలుచ


తే.

నెడరు పుట్టెడునట్లుగా నేఁడునాళు, లొలసి రేయును బగలును వెలుతు రీక
వాతహతితోడ బెడిదంపువాన గురిసి, గాసి చేసి రండటు లైనఁ గరము మెత్తు.

157


క.

ఇదె యేనును మీవెనుకన, మదవన్మేఘద్విపేంద్రమస్తకరచితా
స్పదుఁడ నయి వచ్చి దివిఁ జూ, చెద మీయాటోప మెల్లఁ జెన్నెసలారన్.

158


వ.

అని పనిచినం బనిపూని వలాహకంబులు సమగ్రసన్నాహంబున నవ్యాహతో
త్సాహదోహలంబు లయెయే నట గోకులంబునందు.

159


సీ.

శివుదిక్కునందు వేకువఁ గోలమెఱుఁగులు మెఱసె నచ్చోన సమీరణుండు
వుట్టి తీవ్రత నేల బెట్టుగాఁ జఱచుచు విసరె బీఱెండతో నెసఁగె నుమ్మ
యీఁగ మిక్కుట మయ్యె నెఱనింగిఁ గడుమించె నిడుదలై తిలకించె నీరు కాళ్లుఁ
బడమట నిరుదెసం బ్రతిసూర్యములు దోఁచె నంబరంబునఁ బర్వె నాగడపలు


తే.

పిన్నబిడ్డ లెయ్యెడలఁ బింపిళ్లుగూసి, రంఘ్రితలములు సిమసిమయనియె జనుల
కఖిలతృణలతాతరునిచయంబుఁ జీడ, వట్టె నిట్టలంబుగ జడిపట్టుపొంటె.

160


క.

సురపతిది క్కుఱిమెడు భూ, ధరములవెలిమొగులు గప్పెఁ దప్పదు వర్షం
బరు దిది యకాలమున నని, దొరకొని చింతిలిరి గొల్లదొరలెల్ల మదిన్.

161


వ.

తదనంతరంబ.

162


సీ.

దిక్కరిణీబృంద మొక్కట యీనినపిల్లలు దివిఁ బ్రసరిల్లె ననఁగ
గోత్రాచలంబులు చిత్రవాతాహతి వెసఁ బెల్లగిలి మీఁద వెలసె ననఁగఁ
బాతాళమున నున్న బంధురధ్వాంతముల్ వెడలి భానుని మ్రింగ నడరె ననఁగ
నిల నాల్గుచెఱఁగుల జలధులు నలిరేఁగి కడళుల నభ మెక్కఁ గడఁగె ననఁగ


తే.

నొప్పి యుద్ధురస్థూలపయోధరములు, దెసలకడపట[50] బొడమి యాకసము మూసి
మెఱుఁగు[51]జోతులు చూడ్కికి మిక్కుటముగఁ, నొదవెఁ బిడుగులు రాలును నుప్పతిల్లె.

163


మ.

వడి నమ్మేఘచయంబులం దొరఁగు దుర్వారోద్యతాసారముల్
వడగండ్లున్ బెరయంగఁ దీవ్రనిసరద్వాతూలముల్ గూడి దం
దడి దోడ్తోడఁ బ్రవృద్ధిఁ బొంద బలువై ద్యావాపృథివ్యంతరం
బెడ మొక్కింతయు లేక యుండఁగఁ గరం బేపారె నాపూర్ణతన్.

164

మ.

ఇది కల్పాంతమొ యిమ్మహోగ్రసలిలం బేకార్ణవాకారమై
పొదలం జూచెనొ యింత[52]తోన జగముల్ పోఁజేసెనో ధాత యె
య్యది ది క్కెక్కడ సొత్తు మెవ్విధమునం బ్రాణంబు రక్షించుకో
లొదవున్ దైవమ యంచు గోపనివహం బుద్వేగ మొందె న్మదిన్.

165


మ.

భువనైకప్రభుఁ డైనయింద్రునకు సంపూజ్యంబుగాఁ జేయును
త్సవ మే నర్హుడనే హరింప నన కుత్సాహంబుతోఁ బూజ గొ
న్నవిహీనాత్ముని మేము సైప మనుచున్ శక్రాజ్ఞ గోవర్ధనా
ద్రి వెసం ద్రొక్కెడు నాఁగఁ జుట్టుకొని యుద్రేకించె జీమూతముల్.

166


క.

పసులకు నొడ్డి నవలయై[53], మసఁగినయవ్వాన పశుసమాజము[54] నెల్లన్
బసగరగొని యంతటఁ బో, క సమస్తప్రాణిబాధకం బై పేర్చెన్.

167


చ.

కులిశనిపాత[55]దాహమునఁ గొన్ని నశింపఁ బ్రచండవాయువుల్
బలువిడి వ్రేయఁ బెల్లగిలి భగ్నములై చెడఁ గొన్ని వెల్లువల్
బలియుటఁ బీడితంబు లయి పాడరఁ గొన్ని యశేషభూరుహా
వళులకుఁ దీవ్రదుఃఖదశ వచ్చె నెఱిం దదరణ్యభూములన్.

168


చ.

[56]నిడుజడిదాఁకి యెందుఁ జననేరక యాఁకటఁ గ్రుస్సి చెట్టుపల్
సడలఁ గులాయమధ్యమున శాఖలసందున నిల్వలేక యు
గ్గడువుగఁ బల్మఱుం జఱుచుగాడ్పునఁ దూలి వనంబుపక్షు లె
య్యెడఁ బడి చచ్చి తేలేఁ గడు నే పెసలారుపొలంపువెల్లువన్.

169


చ.

గిరికుహరస్థితంబు లగు కేసరులున్ జడిఁ బేర్చునప్పయో
ధరములగర్జలం బెగడి దందడి నున్నవి యున్నచోన య
చ్చెరువుగ గుండియ ల్వగిలి చేష్టిత మేమియు లేక యుండెన
ప్పరుసనివాస నన్యమృగపఙ్క్తులు మ్రగ్గుట చెప్ప నేఁటికిన్.

170


వ.

అట్టిసమయంబున నిరంతరధారాపాతంబునం దడిసి నలుదెసలం [57]బఱచి వ్రేయు
వాయువునఁ గొందలపోయి యొండొంటిచాటున కొదింగి కడగానక నిలువం
బడియుఁ గొమ్ములొడ్డి కన్నులు మోడ్చి కడఱెప్పల నీళ్లుగాఱం దలలు డిగ్గవైచి
నెమరు లుడిగి మూర్ఛలువోయిన ట్లుండియు [58]వడఁకు సొచ్చి యఱచుక్రేపుల
ముందటఁ బెట్టుకొని గంగడోళ్లం బొదువుకొని యంభారవంబుల నాక్రందించియు
వెల్లువకతనఁ డెంకిలేక నిలువుగా లుండియుండి యోటఱి కాళ్లు వడంక సైరణ
దప్పి నెఱిదప్పం బెనురొంపిలోనం ద్రెళ్లియుఁ బెలుచ మెఱచు మెఱుంగులం
జెదరి యదరంట నుఱుము పేరుఱుముల [59]బమ్మెరపోయి మందపట్లు విడిచి యిట్టు
నట్టునుం దెరలఁ దిరిగియు నాహారంబు లేక యీఁదచాటువడి మేయంజాలక

యెత్తువడి తెవులుగొంట్లు ముదుసళ్లును మడియ బలవంతంబు లైనవియుఁ జేవ
దక్కియుఁ బసులు పెక్కు బాధలం దల్లడిల్లఁ బశుపాలురును [60]గుడిసెలు గూలి
బండ్లు (దడఁబడం) దూలి సొమ్ములు శిధిలపడి పాకాదిక్రియలు మాలి దోహనం
బులు నిలిచి మహాక్లేశంబునఁ గొందలంబునొంద నందఱుఁ గృష్ణ కృష్ణ కావుము
గోవులకు మాకును దిక్కు నీవ యని యాక్రోశింప గోవు లున్ముఖంబు లై యఱ
చుచు శరణంబు వేఁడువిధంబునం దనవలనిక పఱతేర నవ్విధం బంతయు నాలో
కించి వాసుదేవుం డాత్మగతంబున.

171


మ.

తనకై చేయుమహోత్సవంబు నటు లేఁ దప్పించుటం గోప మె
క్కినచిత్తంబున గోవ్రజంబున కతిక్లేశంబు పుట్టింప నె
ట్టన నయ్యింద్రుఁ డొనర్చి నట్టిదురవష్టంభంబు గా కేమి యి
వ్వినిరోధం బతఁ డింతఁ దాఁ గనునొకో విద్వేషసాఫల్యమున్.

172


క.

దీన ననుఁ జిక్కు వడియెడు, వానింగాఁ దలఁచె నిపుడు వాసవునట్ల
జ్ఞాని యొరుఁ డెవ్వఁ డింతయు, మానింపఁగ నేరనేని మఱి నగనిమ్మా.

173


శా.

ఈగోవర్ధనశైలముం బెఱికి [61]నే నింపొందఁ గేలన్ వియ
ద్భాగం బందఁగ నెత్తి మందిరముచందం బొందఁగాఁ జేసి యే
నీ గోసంతతి నెల్లఁ గాచెద మదీయైకత్వసత్వోదయ
ప్రాగల్భ్యంబులు సర్వలోకవినుతిప్రాప్తిం గనుంగావుతన్.

174

శ్రీకృష్ణుఁడు గోరక్షణార్థంబు గోవర్ధనపర్వతంబు నెత్తుట

వ.

అని తలపోసి నిశ్చయించి యాక్షణంబ.

175


మ.

వనమాతంగము విస్ఫురన్మదకళావష్టంభశుంభద్దశన్
సునిరూఢం బగుక్రీడఁ బంకజము నున్మూలించుచందంబునన్
వనజాక్షుం డవలీలమైఁ బెఱికి సన్నద్ధాగ్రహస్తంబునం
గొని యెత్తెన్ విపులాతపత్రసమతన్ గోవర్ధనాద్రీంద్రమున్.

176


సీ.

కదలి డొల్లెడు మహాగండశైలములతో నిలమ్రాకులును బెల్లగిలిపడంగ
వడిఁ దూలి చెదరెడువారివాహములతో ఘనమృగవ్రజములుఁ గలఁగిపాఱ
నుదరి క్రేళ్లుఱికెడునుగ్రకేసరులతో బిలగతాహులఁ గింక వెలికి నెగయ
వెసఁ బాసి పోయెడు విద్యాధరు తోడ నియమస్థమునిజనాళియుఁ దొలంగ


తే.

నొత్తువడి కాంచనాదిధాతూచ్చయములు, రసము జొబ్బిలఁగా రత్నరాసు లొలుక
నడరిసానుసంధులు వ్రయ్య నమ్మహాద్రిఁ, గలయ నాభీల మయ్యెఁ దచ్చలనవేళ.

177


చ.

గొడుగుగఁ జేసె గోవులకు గోపకుమారులకు న్నగంబు ని
ట్లొడఁబడవచ్చుఁ బొ మ్మనఁగ నొప్పెడు వ్రేళులు వంజ[62]మాడ్కియై

యడరినమీఁది మేఘతతి యావృతియై శిఖరంబు గుబ్బయై
కడుబెడఁగొందె హస్తమనుకామ దిరంబుగఁ దాల్చి పొల్చుటన్.

178


క.

కొండ ధరించుట నాకొక, కొండా [63]మున్ను నలవాటు కూర్మమనై పె
న్గొండ ధరింపనే యనున, ట్లుండె యదుతనూజుఁ డద్భుతోరుస్థిరతన్.

179


వ.

ఇట్లు గోవర్ధనుండు గోవర్ధనోద్ధరణంబొనర్చి సకలగోపాలసముదయంబు నాలోకించి.

180


శా.

ఈవానం బరిపీడ నొందుపసుల న్వీక్షించి రక్షార్థమై
వేవే యిద్ధరణీధ్రముం బెఱికితిన్ విస్తీర్ణ మీక్రిందు మీ
రేవా రెచ్చట నుండఁ గోరితిరి వా రెల్లం బశుశ్రేణితో
భావంబుల్ భయ ముజ్జగించి చొరుఁ డీభవ్యాద్రిచా టందఱున్.

181


తే.

బహుసహస్రసంఖ్యలు గలపసుల కెల్ల, నిడుపు దగినయి మ్మెయ్యది యిచట ననకుఁ
డెనసి త్రైలోక్యమును వచ్చెనేని [64]నిమ్ము, గలదు వెండియు వెలితియ కాఁగ నుండు.

182


వ.

అనిన నద్భుతరసప్రమోదంబులు వెల్లిగొనఁగ నాగొల్ల లెల్ల నార్చుచుం జెలంగి
దమతమకదుపుల నమ్మహాశైలమంటకంబు క్రిందికి నొండొండ పిలిచి సర్వభాం
డావళులును సకలశకటప్రముఖంబులును సమస్తవస్తువిస్తారంబులుం దెచ్చి
యునిచి బాలస్త్రీవృద్ధపూర్వకంబుగా నందఱుం దగిన యెడములు గైకొని నివా
తంబున సుఖంబుండి దామోదరమహిమాభికీర్తనంబునఁ దత్పరు లైరి [65]సప్తరా
త్రులు సమవసానంబు నొందినం బురందరుం డమందమందాక్షవిలక్షుం డై వలా
హకవ్యూహంబుల నుపసంహరించి మగిడి నిజలోకంబునకుం జనిన.

183


క.

నిర్మేఘత నాకాశము, నిర్మలమై ధౌతఖడ్గనిభమిది యనఁగా
నిర్ముక్తాసితభుజగస, ధర్మంబై యొప్పె నిజనితాంతచ్ఛాయన్.

184


క.

హరి గోవులు క్రమ్మఱ సం, చరించుటిట్ల యన నబ్దసంవృతి వాయన్
హరిగోవులు విశదములై, చరాచరమనోజ్ఞసంప్రచారత నొప్పెన్.

185


సీ.

[66]వాఁకలఁబడి నీరువలియఁ బాఱఁగ
మిఱ్ఱు లొండొండ బలసి తృణోత్కరముల
తుదలు పచ్చదనంబుతోఁ దలసూపంగఁ దీఁగ లొయ్యనఁ గొంకుదేఱి కొనలు
మొగ మెత్త మెత్తన యిగురాకు దోఁపంగఁ దరువులు దనిగాడ్పు తపనరుచులు
గాంచి సంప్రాణించి[67] క్రమ్మఱఁ గొమ్మలు గదలించి నర్తనక్రమ మొనర్ప


తే.

నెలవు లేర్పడి క్రుమ్మరునెరవు లెఱిఁగి, మృగకులంబులు భ్రమవాసి మెలఁగఁజొరఁగ
నాటవికకోటి తమజాడ లరసి తిరుగ, నడవు లొప్పారెఁ జండవర్షాత్యయమున.

186


వ.

తదనంతరంబ గోపాలదేవుండు గోపాలనోత్సరంబునం జరితార్థుం డై గోవర్ధన
ధరణీధరంబుఁ దదీయస్థానంబునంద యత్యంతసుస్థిరం బగునట్లుగాఁ బ్రతిష్ఠించి
గోవుల నభిమతమార్గంబులఁ బ్రవర్తింప గోపకుమారులం బనిచి.

187

క.

అక్కొండయందుఁ బ్రియమగు, చక్కటి నొకయున్నతంపుసానువుపైఁ దా
నొక్కఁడు నాసీనుండై , స్రుక్కక కదుపులు చరింపఁ జూచుచు నుండెన్.

188


తే.

తన్నుఁ గానంగరానీక తనువు డాఁచి, యాకసంబుననుండి విహంగరాజు
భక్తినెఱకలనీడ నప్పద్మనాభు, మీఁదఁ బచరించె బీఱెండ మెఱయకుండ.

189

ఇంద్రుఁడు శ్రీకృష్ణునిసన్నిధికి వచ్చి బహువిధంబుల స్తుతించుట

సీ.

ఆసమయంబున నతిమానుషంబును నతిదైవతంబు నత్యద్భుతంబు
నగుకృష్ణుదుష్కరవ్యాపార మాత్మకు వ్రేఁకనై వెలసిన విబుధనాథుఁ
డా త్రిదివమున నుదాసీనుఁడై యుండ వెఱచి యల్పం బగు వేల్పుమూఁక
గొలిచిరా వెల్లేనుఁగును వేయుగన్నులు గులిశంబు నని చెప్పవలయుతనదు


తే.

లక్షణము లుల్లసిల్ల నిలాతలమున, కేఁగుదెంచి గోవర్ధనాద్రీంద్రుతటము
నందుఁ గూర్చున్న దేవు మాయామనుష్యు, నాద్యుఁ బుండరీకాక్షు ననంతు గాంచి.

190


క.

లోచనము లెల్ల విచ్చి వి,
రోచను నెదురుకొనుపంకరుహములభంగిన్
రోచిష్ణువులుగ వేడ్కం, జూచె ననిమిషత్వ మపుడు సుకృతార్థముగన్.

191


క.

తన తేజ మతని ముందట, నినుముందటిపెఱవెలుంగు నెన యగుచు వెసన్
బొనుఁగుపడ నొదిఁగె శక్రుం, డనుపమవిభవాభిమాన మంతయు నడఁగన్.

192


మ.

ఇతఁ డక్షోభ్యుఁ డనాద్యనంతవిభవుం డీశానుఁ డానమ్ర దై
వతుఁ డాక్షిప్రసురారిచక్రుఁ డజితవ్యాపారవిఖ్యాతుఁ డ
చ్యుతుఁ డాద్యుం డనుబుద్ధి చిత్తమున కచ్చో నంతటం జెందఁగా
శతమన్యుండు వినీతివిభ్రమవికాసఫ్ఫీతసర్వాంగుఁడై.

193


క.

కన్నంతన తనయేనిక, దున్న దిగంద్రావి రభసదోలాయితహా
రోన్నతవక్షస్థలుఁ డై , యన్నలినాక్షునకు వంచె నాత్మశిరంబున్.

194


వ.

ఇట్లు ప్రణామం బొనర్చిన.

195


తే.

కనియుఁ గాననివిధమున ననఘతేజుఁ, డెఱిఁగియును నెఱుంగనిభంగి నింద్రుదిక్కు
క్రేకరించియుఁ జూడక కృష్ణుఁ డచలి, తాసనుండయి యుండె ననాదరమున.

196


వ.

అప్పరమేశ్వరుండు తనయందు సౌముఖ్యంబుచాలమికిం దలంకి దేవముఖ్యుండు
కృతాంజలి యై కదిసి సామవచనంబుల నమ్మహాభాగు ని ట్లని వినుతించె.

197


సీ.

సకలవేదంబులు సకలయజ్ఞంబులు నీ వని కనుఁగొని నీకు మిగుల
నొండు లేదని కాంచి యోగంబులకు నీవ భావ్యుండ వనియును బ్రణవమునకు
వాచ్యుఁడ వనియును వాస్తవం బగుబోధమున కాత్మ వని మునుముట్ట నెఱిఁగి
విశ్వజన్మస్థితివిలయంబులును నిర్గుణావభాసంబు నీయంద చూచి

తే.

భవదనుధ్యానపూజనప్రణతివిధులఁ, దగిలియుండువాఁ డొక్కండ ధన్యతముఁడు
వివిధదివ్యావతారప్రవీణభువన, భరధురీణ యాశ్రితమిత్ర పద్మనేత్ర.

198


శా.

గోపాలత్వవిరూపుఁ డైనకతనం గ్రొవ్వగ్గలంబై మదిన్
రూపింపం జొర కేను నిన్ను నిటు సంరోధించి బాధించితిన్
నీపాలం బొలుపారు గోధనముల న్నిక్కంబు దుర్మత్సర
వ్యాపత్తిం బ్రభవించి రోషమది యిట్లై నొంచె నీచిత్తమున్.

199


క.

నీ వఖిలనియామకుఁడవు, దేవా నిన్ను నియమించుదేవర యెవ్వాఁ
డీవిభవ మిచ్చినాఁడవు, గావే నా కింత యేను గాననె మొదలన్.

200


తే.

ఏలయో పుట్టె నా దెస నిట్టికొఱత, దీని సైరింపఁ దగు నీకు దివిజవంద్య
దాసులందు లెక్కింపంగఁ దప్పు లెన్ని, లేవు ప్రభులకు సైరింప లెస్సగాక.

201


మ.

విలయైకార్ణవకారు లైనఘనముల్ వేవేలు వాతూలసం
కులవృష్టిం బ్రసరింప నేను వెనుకన్ ఘోరాకృతి న్నిల్వఁగా
బలిమిన్ దైవతదానవాదులకు మాన్పన్ రానిగోసంప్లవం
బలఘుస్థైర్యుఁడ వై జయించుటకు నే నాత్మం బ్రమోదించితిన్.

202


తే.

కేలికందుక మెత్తినలీలఁ గొండ, యెత్తి గోవులయడరు నీ [68]వి ట్లుడుపుట
వలన మందరధర నీదువైష్ణవంపుఁ, దేజ మఖలలోకములకుఁ దేటపడియె.

203


మ.

త్రిదశప్రీతి యొనర్పఁ గోరి ధరణిం దేజోంశము ల్లీలమై
నుదయం బొందఁగఁజేసి నీవు క్రియ కుద్యోగించు టెల్లన్ శుభ
ప్రదమై పూర్ణతఁ బొందినట్టిదయకా భావించితిం జూవె నేఁ
డు దయావర్ధన యిట్టివిక్రమకళాటోపంబు రూపించుటన్.

204


ఉ.

నీ వొకరుండవున్ భువననిర్వహణంబునకున్ ధురంధరుం
డై వెలుఁగొందువాఁడవు సురావళిలో మఱి యోగ్యు నీదృశున్
శ్రీవర చెప్పుమా కలఁడ సృష్టికిఁ గర్త పయోజగర్భుఁ డా
దేవుఁడు నిన్ను నెన్ని గణుతింపఁగఁ బాత్రమె నీకు నుద్దిగన్.

205


తే.

అంబురాశి నదంబుల కచలములకు, నాహిమాద్రి పక్షులకుఁ గశ్యపసుతుండు
మేటియై యొప్పుక్రియ సురకోటికెల్లఁ, బ్రభుఁడ వీవొక్కరుఁడ కావె పద్మనాభ.

206


సీ.

జలములపై భూమి యిలమీఁద మనుజులు మనుజులపై మేఘమండలంబు
మేఘమండలముపై మిహిరుండు దేవలోకంబున నొప్పు నాకంబు నాక
మేలుటకై దివిజేంద్రత్వ మిచ్చి న న్నీవు ప్రతిష్ఠించి తీశ్వరుఁడవు
నాకలోకముమీఁద నలినజులోక మాలోకంబుమీఁద గోలోక మమరు


తే.

నట్టిగోలోక మేలువారైనగోవు, లనఘ గోవర్ధనాద్రీంద్ర మశ్రమమున
నెత్తి యాత్త్మీయసంతతి నీవు గాచు, డాత్మఁగని యెంతయునుమోద మతిశయిల్ల.

207

వ.

అగ్గోవులు పితామహసహిత లై యుండి భవద్గౌరవం బభినందించుటకై నన్ను
నిటఁ బుత్తెంచి రేనును నామీఁదితప్పు వాయ నిన్నుఁ దెలచుట ముఖ్యకార్యం
బుగాఁ జనుదెంచితి.

208


క.

అదితికిఁ గశ్యపునకు ము, న్నుదయించినవాఁడ నీకు సోదరుఁడ ముదం
బొదవ నను నాదరింపుము, మది నొండొక కింక యింక మానుము వరదా.

209


వ.

గోవులు నిన్ను గుఱించి తా రాడినయవిగాఁ జెప్పు మనినమాటలు గొన్ని గల
వాకర్ణింపుము.

210


సీ.

పిదుకుట దున్నుట పెరుఁగుట లోనుగాఁ గలుగునానావిధకర్మములకు
నాత్మీయు లగువారి నఖిలంబునందునఁ బనిచి లోకై కసంభరణ మేము
గావించుకతమునఁ గమలాసనాదులు మముఁ బాటింతుకు మాకు నెడరు
వుట్టినచోఁ జక్కఁబెట్టితి గ్రమ్మనఁ గోరి ప్రాణదుఁ డైనగురుఁడ వీవు


తే.

రిత్తయుపచారముల నాచరించి నిలువ, కస్మదీయకులస్వామి యగుట కర్థిఁ
జేసి యనునాజ్ఞ ని న్నభిషిక్తుఁగా నొ, నర్పఁ బుత్తెంచితిమి జగన్మాన్యచరిత.

211


వ.

నీవు మమ్ము వలసినవాఁడ వగుదేని యివ్విధంబున కియ్యకొను మని రట్లుగావున.

212


క.

ఇవె కాంచనకలశంబుల, దివిజకరంబుల నభోనదీజలములు మా
ధవ సముపానీతము లై, నవి యేఁ జేయునభిషేచనము గైకొనుమా.

213


తే.

అమరకోటికి నింద్రుఁడ వైనయట్టి, నీవు గోవుల కింద్రుఁడ విది మొదలుగ
గోకులంబుల నిటు లేలికొంటి గాన, నలఘుగోవిందనామవిఖ్యాతి గనుము.

214

ఇంద్రుఁడు శ్రీకృష్ణుని గోపతిత్వమున కభిషిక్తునిఁ జేయుట

వ.

ఆషాఢమాసంబు మొదలయిన చతుర్మాసంబులందును నర్ధంబు నీ కిచ్చితిఁ దొలుత
రెండునెలలును లోకంబు నాకుం బూజ గావించు నవుల రెంటను జనంబులు
నిన్నుఁ బూజించువారుగావుత నుపేంద్రుం డనం దొల్లియు వెలసి తివ్విశేషంబు
వలన నయ్యుపేంద్ర శబ్దంబు సమర్థించి యమర్యులు కీర్తింతురు వర్షాగమసమ
యంబున సుప్తిం బొంది కార్తికంబున వినిద్రుండ వగుటయు భద్రంబులు భువ
నంబులం వర్తిల్లు నని యి ట్లొనర్చిన వాక్యోపన్యాసంబున నుల్లాసంబు నొందు
వాసుదేవునకు నాక్షణంబ.

215


క.

తాన యిరుగేలఁ గలశము, లానందముతోడఁ దాల్చి యభిషేక సుఖ
శ్రీ నెఱయఁ జేసె సురపతి, యీనిఖిలంబునకుఁ బరమహిత మగుపొంటెన్.

216


వ.

అంతయు ననుసంధించి గోవులు గోపాలు రనుగమింప వచ్చి నిజపయోధ
రంబులం [69]దొరఁగుపయఃపూరంబుల నతని శిరం బభిషేకించె ధారాధరంబులు
దివ్యోదకధారలం దోఁచెఁ దరువులు మకరందబిందుసందోహంబులం దడిపె దివం
బుననుండి సురభికుసుమవర్షంబులు గురిసె దేవదుందుభివిద్యాధరప్రణాదంబులు

గంధర్వగానంబులు నప్సరోనర్తనంబులు నుల్లసిల్లె వసిష్ఠవామదేవజాత్రిభరద్వాజ
కౌశికకణ్వాదిమునులు శ్రుతిసిద్ధంబు లగుసిద్ధమంత్రంబులఁ గీర్తించిరి సూర్యుం
డును సుప్రసన్నతేజుం డై వెలింగె దిక్కులు వెలసెఁ బవనుండు సుగంధసుఖ
స్పర్శతాసుభగుండై చరించెఁ దాపసాగ్నిహోత్రంబులు ప్రదక్షిణజ్వాలాజాలంబు
లయి యొప్పె సాగరంబులుం గిరులుఁ దరంగిణులుం దరుగుల్మలతాదులుఁ బశు
పక్షిమృగప్రముఖంబులు లోనుగాఁ దత్తదనురూపంబు లగుసంప్రమోదచేష్టి
తంబుల శోభిల్లె నిట్లు కృష్ణాభిషేకంబు సర్వశుభావహం బయి పరఁగిన
యనంతరంబ.

217


క.

దివ్యాంబరభూషాదుల, నవ్యంబుగ నపుడు కమలనాభున కింద్రుం
డవ్యాహతముగఁ జేసెను, భవ్యపరిష్కార మధికభద్రం బమరన్.

218


వ.

ఇట్లలంకృతుం డై యున్న యతని కింద్రుండు మఱియు ని ట్లనియె.

219


క.

ఇచ్చటికి నేను బ్రియమున, వచ్చినపనులందుఁ బ్రణతవత్సల యొకఁ డిం
పచ్చుగ సిద్ధం బయ్యెను, మెచ్చొలయఁగ నింక నొకటి మిముఁ బ్రార్థింతున్.

220


వ.

అది యెయ్యది యనిన నవధరింపుము.

221


సీ.

కంసునిపంపునఁ గలరు మీ కెగ్గొనరింప నింకను దుశ్చరిత్రు, లసుర
లందఱఁ గ్రమమున నపగతాసులఁ జేసి తడయక కూల్చె దాతనిని బిదప
నటమీఁద రాజవై యావర్జితాశేషరాజన్య యగుధరారమణి మిగుల
[70]శాసిత మయ్యెడు సర్వజ్ఞ నాఁడు మీ మేనత్తకుంతి యం దేను నాదు


తే.

తేజ మావహింపంగ యుధిష్ఠిరాని, లాత్మజుల వెన్కవాఁ డైనయతులయశుఁడు
పాండురాజన్వయాంభోజభాస్కరుండు, నిర్జితారాతి యూర్జితుం డర్జునుండు.

222


మ.

నిను సర్వంబునకుం బరాయణముగా నిర్దోషుఁడై యాశ్రయిం
చు నుదారస్థితమైత్రి నెమ్మనమునన్ శోభిల్ల నీ వాతనిన్
జనతారక్షక నన్నుఁ జూచుకరణిన్ సంభావ్యుఁగాఁ జూచి కై
కొనుమీ నిర్మలకీర్తి గాంచు నతఁడు గోవింద నీప్రాపునన్.

223


వ.

ఏను మహామునిమధ్యంబునఁ బాండవమధ్యముండు ప్రచండకోదండపాండిత్యం
బున సర్వాధికుం డగు నని పలికినవాఁడ నప్పలుకులు దప్పకుండఁ దద్గౌరవంబు
ప్రకాశంబు సేయు మతనికిం దదీయజ్ఞాతు లగు ధార్తరాష్ట్రులతోడ సమరం
బయ్యెడు నందు ధాత్రిం గలసకలక్షత్రంబునుం గూడి రెండుదెసలం బన్నిన
యపుడు పదునెనిమిదియక్షోహిణు లగుచతురంగసైన్యంబులు కల్పాంతకాంతం
బుగా నన్యోన్యసంక్షయం బాపాదించు నయ్యుద్ధంబున నమ్మహావీరుండు నీకు
నవశ్యరక్షణీయుం డివ్విధంబు మత్ప్రార్ధితం బిట్టిదిగాఁ దలంపు గలిగి యుండ
వలయు నని యింద్రుండు సంభాషించినఁ బరితోషభరితహృదయుం డై యదు
పుంగవుండు.

224

శా.

మా మేనత్తతనూజు లేవురును సన్మాన్యు ల్మహావిక్రమ
శ్రీమంతు ల్డివిజాంశసంభవులు వర్ధిష్ణుల్ కురూత్తంసముల్
సామర్థ్యంబున నీ[71]సమస్తధరయు సాధింతు రం దాభుజ
స్థేమాకల్పుఁడు మధ్యముండు త్రిజగజ్జిష్ణుండు శౌర్యోన్నతిన్.

225


ఉ.

ఏ నిదియంతయున్ సురగణేశ్వర మున్న యెఱుంగుదున్ మదిన్
బూని రణాంతరంబునఁ బ్రభూతజయావహ యైనబుద్ధి న
మ్మానవసింహు శోభనసమగ్రునిఁ గాఁగఁ దలంచినాఁడ ని
చ్చో నిటు నీవుఁ జెప్పి తటసూడు మవశ్యము నట్ల చేయుదున్.

226


వ.

భవదీయసమాగమనసౌహార్దంబునకు హర్షించితి నింక నిష్కళంకచిత్తుండ వై
యుత్తమస్థితిం బ్రమోదింపు మని వీడ్కొలిపినం బాకశాసనుం డయ్యసురశాసను
చరణసరసీరుహంబులకుఁ బ్రణమిల్లి ప్రదక్షిణంబు సేసి యెప్పటియట్ల యైరా
వతంబు నెక్కి, సురలు పరివేష్టింప నాత్మీయస్థానంబునకుం జనియె నంత నిక్కడ.

227

గోపవృద్ధులు శ్రీకృష్ణుని మహాప్రభావం బభివర్ణించి యతని నరయుట

క.

ఆగోవర్ధనగిరితట, భాగంబున నుండి భువనబాంధవుఁడు మహా
భాగుఁడు వ్రేపల్లెకు నను, రాగంబున నరిగె సఖపరంపరతోడన్.

228


వ.

ఇట్టి వాసుదేవప్రభావం బఖిలంబు ననుసంధించి.

229


ఉ.

అందుల వృద్ధులున్ మతిసమగ్రులుఁ గార్యవిచారవేదులుం
గ్రందుకొనంగ నాతని నఖర్వచరిత్రునిఁ గాంచి చుట్టు నా
నందసమగ్రులై బలసి నవ్యవికాసవినీతిసంభ్రమ
స్పందనముల్ నిజంబు లగుభావములుం జెలఁగంగ నత్తఱిన్.

230


వ.

అత్యంతగంభీరప్రకారంబున నక్కుమారున కి ట్లనిరి.

231


శా.

గోత్రోద్ధారణకేళి నశ్రమమునన్ గోత్రాపరిత్రాణముం
జిత్రప్రౌఢి నొనర్చి తివ్విధములున్ జెప్పంగఁ జూపంగ నీ
గోత్రామండలి నెందుఁ గల్గునె వెఱన్ గోవింద నీ కమ్మెయిన్
గోత్రారాతియు నమ్రుండై యొదుగఁడే గోపాలురే యీదృశుల్.

232


తే.

ఇట్టినీవు సుట్టంబవై యింతవట్టు, వారిలో నున్నవాఁడవు వారిజాక్ష
యేము ధన్యాత్ములము మమ్ము నెవ్వ రెనయు, వారు మా[72]కోర్కు లెల్ల నిండారఁబండె.

233


క.

వెఱచి వెఱచి యడిగెద మే, మెఱిఁగింపఁగ వలయు నొకటి యీ వెవ్వఁడ వీ
కొఱమాలినగొల్లతనము, మఱువున విహరించె దిట్లు మహి నాత్మేచ్ఛన్.

234


క.

వసువులలో రుద్రులలో, శ్వసనులలో నొక్కఁడనొ నిజం బెయ్యది రా
క్షసయక్షఖచరగంధ, ర్వసిద్ధవిద్యాధరప్రవరజన్ముఁడవో.

235

క.

ఆలం గాచెద వక్కట, త్రైలోక్యముఁ బేర్మిఁ గావఁ దగువాఁడవు నీ
మూల మెఱుంగమి వెఱఁ గడుఁ, దూలెద మి ట్లేమితప్పు దొడరునొ యనుచున్.

236


తే.

నందగోపునియన్వయానందకరుఁడు, సుదతి యాయశోదకు ముద్దుసూపుపట్టి
క్రీడ సలిపెడు నదె చిన్నికృష్ణుఁ డనుచు,మనుజుఁగా నిన్నుఁ గనుతప్పు మాకు సైపు.

237


క.

నీ వెవ్వఁడవైన నగుము, భావంబున నీకు మ్రొక్కి బ్రతికెదము మమున్
గావుము ప్రోవుము గొల్లల, మేవిధిఁ [73]బేరుకొనువార మెఱుఁగ మొకటియున్.

238


తే.

అనిన నవ్వుచు వారితో నవ్విభుండు, మీకు నిన్ని ద్రవ్వఁగ నేల మిన్నకున్నఁ
బోదె మీబాంధవుఁడ ననుబుద్ధి చాలు
[74]నవల నేమి సేసెదరు మీ రనఘులార.

239


శా.

కీ డొక్కింతయుఁ జెందనీక ప్రియము ల్గీల్కొల్పుచున్ వచ్చెదం
గ్రీడాలోలత నాకు నేయది యపేక్షింపంగఁ బట్టై ననుం
జూడుం డూరక యొయ్యఁ గాలగతి నా చొప్పెల్లఁ దెల్లం బగున్
మీడెందంబుల కవ్విధం బతిశుభోన్మేషావహం బయ్యెడున్.

240


వ.

అనిన సంతసిల్లి వల్లవు లందఱుఁ దమతమమందిరంబులకుం జని సుఖసంచారం
బులం బ్రవరిల్లి రని జనమేజయునకు వైశంపాయనకధితం బైన కథాప్రపం
చంబు సమంచితవ్యాఖ్యానవిఖ్యాతంబుగ.

241


ఉ.

సంగడిరక్షపాలబహుసంగరజీత్కరవాల బాలికా
మంగళమూర్తిహేల యసమానసమంజసకీర్తినర్తకీ
రంగదిగంతరాళ గుణరాజిహృతాఖిలచిత్తజాల స
ప్తాంగరమావిశాల సకలార్థివిచక్షణపుణ్యలక్షణా.

242


క.

చెంజిమలచూరకార ధ, నంజయసమసత్త్వజైత్ర నమదరిచూడా
సంజనమనోజ్ఞనఖరుచి, కింజల్కసరోజసదృశఖేలనచరణా.

243


మాలిని.

అసకృదసమధాటీ వ్యాప్తిదృప్తాగ్రయాయీ
ప్రసభజనితవిద్విట్పట్టణోద్ధాహవేగో
ల్లసితవిచలదుల్కాలంఘికధ్వాంతవాసీ
వ్యసనవిశదలీలావర్ధమానప్రతాపా.

244


గద్యము.

ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వర చరణసరోరుహ ధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన హరివంశంబునం బూర్వభాగంబునందు సప్తమాశ్వాసము.

  1. నెలమిని
  2. నింక నేల
  3. యైనగరిమ
  4. యివ్వలన
  5. తోడి సిక్కగొనఁ బెక్కియడిసంది నులిచిన (పూ. ము.)
  6. మడువులోనికి నుఱికి యున్మత్తులీల నెగసెఁ దత్తోయకణములు నింగి వొదువ (పూ. ము.)
  7. నిగుడంగ
  8. సుప్తి కడునొప్పు దేవాత్ముఁ జోకి యిట్టి డయ్యెఁగాక—ఁ, బన్ను గానంగ మూర్ఛ దాఁ బ్రభున కొప్పె. (పూ. ము.)
  9. పిక్కటిల్ల
  10. చేయఁదగవు రారే యని కూయుటయును
  11. యిట్టిదైన, యడరు వెట్టెనె
  12. వ్రేలు
  13. నిర్మధ్య (పూ. ము.)
  14. జూప. (పూ. ము.)
  15. మర్దనం. (పూ. ము.)
  16. నశిరోమణుల్
  17. జ్వాలముల్ పైపడన్ (పూ. ము.)
  18. గ నుసురు చిక్కె
  19. భయశరణాగతిఁ బ్రార్థింతు నిన్ను
  20. మయం
  21. మగుఁగాక
  22. ముచ్చుల (పూ. ము)
  23. లు చేసి (పూ. ము.) రవ్విభుండును
  24. త్రొక్కువడి. (పూ. ము)
  25. సారడయై
  26. రుచితా
  27. వికసద్దర్భీ (పూ. ము.)
  28. న్నెఱిం
  29. నీవేళ
  30. శ్రమము
  31. చైది
  32. చ్ఛండగతి దాఁటుచుం గడు
  33. సేయంగన్
  34. మానుషభావంబు లిందు మమతం జెందెన్
  35. ధాతూద్యజ్ఞలాభంబులై (పూ. ము.)
  36. నెఱసింగంపుఁగొదమ నిబ్బరమునఁ గ్రే
  37. విభవం
  38. కారు
  39. ప్రసవ, త్ప్రసభశిలీముఖ . . .
  40. వైణుక సారస, (పూ. ము.)
  41. రవి
  42. గుళునుం
  43. యెఱుఁగననా
  44. కందరముల్
  45. కొండదడియలు మనబోఁట్ల, కింతమట్టు
  46. వల్లవుల
  47. మహంబులన్
  48. బహు
  49. నుత్సవమునుఁ జే
  50. కడపళ్ల
  51. బోదలు
  52. తోడ
  53. వనియై
  54. మజముల
  55. ఘాతహతి
  56. నిడి, జఱిచి.
  57. జఱిచి
  58. దుఁనుకులు
  59. బమ్మరి
  60. గుడుసలు
  61. నేనీ ప్రొద్దె కేలన్
  62. పంజు
  63. కొండయె
  64. యిమ్ము
  65. సప్తరాత్రంబు
  66. వాఁగులఁబడి
  67. సప్రాణించి
  68. విట్టుడుపులు
  69. దొరుఁగు
  70. శాశ్వతం
  71. యశేష
  72. కోర్కిగములు
  73. గాఁ దిరుగు
  74. వాపలేమి