Jump to content

హరివంశము/పూర్వభాగము-అష్టమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

హరివంశము

పూర్వభాగము - అష్టమాశ్వాసము

     మత్కుసుమశరోపమ
     సామగ్రీజనితహృదయసంజ్వరవిలుఠ
     ద్భామాసఖీసమర్చిత
     కోమలచరణాభిరామ కోమటివేమా.1
వ. అక్కథకుండప శౌనకాదిమహామునులకుం జెప్పెఁ దవనంతరంబ యనంతశయనుం
     డనంతసత్త్వోచితవ్యాపారంబులఁ బ్రతిదినంబును విశృంఖలుం డై మిగిలి.2
సీ. మలసి దర్పంబున మార్కొనువృషముల నార్చుచు రేఁచి పోరాట సేయు
     లావరు లయినగొల్లలవంగడములు గొందలపెట్టి బాహుయుద్ధము లొనర్చు
     నడవుల బెబ్బులు లాదిగా నుగ్రస్తత్త్వంబులఁ దొడరి యుద్ధతి వధించు
     బఱచుట దాఁటుట పట్టుట దిగుచుట మొదలుగా నాశ్చర్యములుగఁ జూపు
తే. నొడలఁ బ్రాయంబు లావును నొప్పిదంబు, నుక్కివంబున విక్రమ మొకటికొకటి
     కనుగుణంబులై యేరికి ననుగమింప, రాక మెఱయంగఁ బటువిహారముల నలరె.3
వ. ఆ సమయంబున.4
చ. తననవయౌవనంబును నుదగ్రపుదర్పము శారదాగమం
     బున దినరాత్రులం గలప్రభూతసుఖోచితరమ్యభంగులున్
     గనుఁగొని కామభోగములఁ గ్రాలుటకై మది నిచ్చగించి య
     వ్వనరుహలోచనుండు గరువం బగుచోద్యపునిశ్చయంబునన్.5
క. ఆపల్లెలోన నొప్పెడు, గోపతరుణు లెల్లఁ దనకుఁ గోర్కి సలుపులీ
     లాపాత్రములుగఁ జేయుట, కేపారఁగ నుత్సహించి యెసకపువేడ్కన్.6
సీ. అభినవబర్హి బర్హాపీడలక్ష్మి నుల్లాసించు కేశకలాప మమరఁ
     గమనీయకేయూర[1]కంకణోర్మికలకుఁ దొడవైననిడుగేలుదోయి మెఱయ
     అమ్లానకుసుమసమంచితమాలిక గైసేయువిపులవక్షంబు దనర
     హారిద్రకౌశేయహారిబంధముఁ గృతార్ధముఁ జేయుపృథుకటీతటి యెలర్పఁ
తే. జిఱుతనవ్వున నిండారుజిగి యుదార, లలితనేత్రాంచలంబుల నలువు లెడల
     వెన్నుఁ డఖిలైకమూర్తి దా వేణునాద, ఘనసుధాంభోధి యొండొండ గడలు కొలిపె.7
క. ఆదివ్యధ్వనియింపున, కాదటఁ జెవు లొగ్గి గోవులాదిగఁ గలలో

     కోదితజంతువు లుల్లము, లేది యొడలు మఱచి సొగసె నేంతయు భ్రాంతీన్.8
క. గోపాలురు తద్వేణుర, వాపూరములోన మునిఁగి యానందరస
     శ్రీపరిణతి నాత్మీయ, వ్యాపారము లెల్ల వదలి రవిచేష్టితులై.9
ఉ. అత్తఱిఁ బల్లెలోనఁ గలయంగన లెల్ల సముత్సుకంబు లై
     చిత్తము లెత్తి తేర యదుసింహునిపాలికి నేఁగు దెంచి య
     య్యుత్తమసౌకుమార్యనిధియుజ్జ్వలలీలలు మెచ్చి రాగముల్
     కుత్తుకబంటియై యెసఁగఁ గ్రోలిరి చూడ్కులఁ దన్ముఖేందువున్.10
క. తగిలినచూడ్కులు మగుడన్, దిగువ వెరవు లేక మదనుత్రిప్పులఁ బడున
     మ్మగువలతగు లాత్మీయం, బగుకోర్కికిఁ దగిన నాతఁ డామోదమునన్.11
క. అనురూపాలోకనముల, ననురూపాలాపములను ననురూపవిచే
     ష్టనములఁ దనమనసు తెఱం, గును వారికిఁ దెలియఁజేసి కుతుకముఁ బెనిచెన్.12
వ. ఇట్లు వశీకరించి యందఱం గళిందకన్యాతీరకాంతారంబుల కెలయించిన.13
తే. తల్లిదండ్రులు మాన్ప భర్తలు మగుడ్పఁ, జెలులు వల దనఁ జుట్టలు సిగ్గుపఱుప
     వ్రేత లొకటియు నెఱుఁగక వెన్నువెనుకఁ, దగిలిపోయిరి తమకంబు తవులుకొనఁగ.14
సీ. [2]ఎలదేఁటిపదువులయులివుల నొప్పారు చారుపుష్పితలతాగారములను
     హంసరథాంగావతంసంబు లగుతరంగలఁ గ్రాలుకొలఁకుల చలువయెడల
     సెలయేఱు[3]గడలెడచినుకులనునుగాలిఁ దను పెక్కుశైలనితంబములను
     నభినవమరకతశ్యామంబులై వేడ్కఁ బ్రభవించుమృదులంపుఁబచ్చికలను
తే. బరమపురుషుఁ డయ్యింతులఁ బ్రకటరాగ, కుశలపేశలలీలలఁ గొఱలికొఱలి
     నాఁడునాఁటికి [4]రతుల విన్ననువుపఱచి, తానుఁ జొక్కెఁ దద్భావవైదగ్ధివలన.15
క. హరిచేష్టితములు గ్రమమున, మరిగి నిజముగాఁ దమతమమగలఁ దొరఁగి యా
     హరియంద భర్తృబుద్ధిం, బరిణతలై రావ్రజంబుబాలిక లెల్లన్.16
తే. పరఁగి పుయిలోట లుడుగుట బగలురేయి, బల్లెయందును నడవిలోపల నిజేచ్ఛఁ
     దిరిగినట్టులు కృష్ణుతోఁ దిరుగఁదొడఁగి, రంగనలు మదభరవిమూఢాత్మ లగుచు.17
వ. ఇవ్విధంబున నత్యంతాసక్తి భజియించి.18
మ. లలితాలోకములన్ మనోజ్ఞమధురాలాపంబులన్ విస్ఫుర
     త్కలహాసంబుల బంధురస్తనభరోత్తానాంగ[5]సంగంబులన్
     విలసద్వక్త్రసరోరుహార్పణములన్ స్నిగ్ధోరుసంవేష్టనం
     బులఁ బూజించిరి గోపభామలు జగత్పూజార్హు దాశార్హునిన్.19
తే. కలవరించియుఁ గృష్ణాఖ్య తెలివి నున్న, యపుడుఁ గృష్ణాఖ్య యేమఱినట్టివేళ
     యందుఁ గృష్ణాఖ్య దక్క నయ్యంగనలకు, రాదు వేఱొకవాక్యంబు రసనతుదకు.20
క. హరిచరితంబులు రసని, ర్భరములుగా జతలుగట్టి పాడుదు రాతం
     డరుదుగఁ బాడఁగ నాడుదు, రురుతరకరతాళసంభృతోన్మదగతులన్.21

క. ఏవేషము దాలిచెఁ బ్రియుఁ, డావేషము దారుఁ దాల్తు రతఁ డేయింపుల్
     భావించి మెచ్చె వానికి, భావంబులయందు భ్రాంతి వడుదురు పడఁతుల్.22
తే. పిల్లఁ[6]గ్రోవి పట్టుచుఁ బసిపిఱుఁదఁబోవఁ, దారుఁబోదురు [7]రాగాన్యతంత్ర లగుచు
     నెరపుధూళులు మేనులఁ బొరసి యవియ, తొడవుగా గోపికలు కృష్ణుతోడఁగూడి.23
క. పిడియేనిక పదువు వొదవఁ, గడువేడుకఁ గ్రాలుగంధగజపతిమాడ్కిన్
     బడఁతులనడుమ యదూద్వహుఁ, డడవుల నొప్పారెఁ బటుమదాంధస్ఫూర్తిన్.24
వ. అమ్మహాప్రభావుండు నిజప్రభావిభవంబు ప్రసరించి.25

శ్రీకృష్ణుడు గోపకాంతల రతిక్రీడల నత్యంతానురాగవతులఁ జేయుట

క. అందఱకు నన్నిరూపులఁ గందర్పక్రీడ నేకకాలనియతి నా
     నంద[8]మయసామరస్యం, బొంద జలుపు [9]నోలి నొకత నొక్కత సూడన్.26
క. అదియు నదియు నే టిదియో, మది నెఱుఁగని కనని సొగపు మఱువనివలపున్
     బొదలఁగఁ గేవలదర్పో, న్మదలై క్రీడింతు రాసమస్తాంగనలున్.27
తే. ఒకత నొక్కత నెడపెట్టి యొకఁ డొకండు, దానునై మండలాకృతి[10]గా నమర్చి
     నడుమ నొకమూర్తితో వేణునాదలీల, నందఱను దేల్చు నందగోపాత్మజుండు.28
క. ఒక్కతె నొక్కతె దవ్వుగ, నెక్కడికేనిఁ గొనిపోయి యెలమి రమించున్
     దక్కినవనితలు దనబడి, నక్కడ నక్కడను నరపి యరసి భ్రమింపన్.29
క. ఎన్నఁడుఁ దక్కక కొందఱ, నన్నున నెక్కించుఁ జెంద కతిదీర్ఘముగా
     నన్నులఁ గొందఱను విరహ, ఖిన్నత నొందించు సమదకేళీవాంఛన్.30
సీ. ఒక్కతె దూతిగా నొకతపాలికిఁ బుచ్చి యంగజసంధికార్యంబు నడపు
     నొక్కతెయలుకకు నులికి సాంత్వనములు దగఁబల్కి యోర్తు మధ్యస్థఁ జేయు
     నొక్కర్తు బ్రియమున నొకచోటి కెలయించి వంచన మఱియోర్తు వలని కేఁగు
     నొక్కతెఁ జిక్కఁ బేరురమున నిఱికించి ముదమున నోర్తు కెమ్మోవి యాను
తే. నొకతెవలువకీ లెడలించి యోర్తుకడకుఁ, గొనుచుఁ బోయి యుల్లాస మింపొనరఁ గొఱలుఁ
     దనదుసౌభాగ్యగరిమ నందఱము నీసు, లేక చిక్కఁగఁ గృష్ణుఁ డుల్లోకలీల.31
మ. కరజక్షుణ్ణకుచద్వయీతలములన్ గాఢాగ్రదంతక్షతా
     ధరబింబంబుల నూతనాంగుళిదళధ్వస్తాలకాభోగబ
     ర్బరసీమంతములన్ ముకుంద తిధుర్యశ్రీలు గోపాలసుం
     దరులం దొప్పెఁ దదీయదుర్దమవయోదర్పానురూపోద్ధతిన్.32
తే. ఒకతెసంభోగచిహ్నంబు లోర్తు సూచి, వేడ్కపడ నప్పడంతికి వేఱభంగిఁ
     జేయు నదియు నొకతెకు వాంఛితముఁ బెనుపఁ, బెనుచుఁ గుతుకపరంపర ప్రియల కెల్ల.33

సీ. ధమ్మిల్లభరముల దందడిఁ దొరిఁగిన కుసుమంబులును జూర్ణకుంతలములు
     రాలిన కింజల్కరచనలు కర్ణచ్యుతము లైనబర్హావతంసములును
     హస్తవిస్రస్తంబు లైనమృణాళకంకణములుఁ గుచబంధగళిత లైన
     యలఘు[11]మౌక్తికవల్లరులు నితంబభ్రష్ట మైనయుజ్జ్వలమేఖలావళులును
తే. మృదులపల్లవశయ్యలుఁ బదసరోజ, [12]యావకాంకంబులును లేనియట్టియెడలు
     [13]లేవ యెల్లెడలందు బృందావనమునఁ, గృష్ణసంసక్త[14]పల్లవీక్రీడనముల.34
చ. అలరులు గోసి కోసిన వయస్యలఁ బల్మఱు గౌఁగిలించి కో
     యిలలయెలుంగు లోలిఁ గొని యింపుగఁ జిల్కలతోడ నెమ్మిమై
     నలవడ మాటలాడి యళు లాలతి సేయఁగఁ బాఱి డాఁగురిం
     తలు హరితోడ నాడుదురు తద్వనవీథులయందు గోపికల్.35
క. తరుణీపరివృతుఁ డై హరి, సొరనినికుంజములుఁ బ్రాఁకిచూడని చఱులున్
     దిరుగనినెత్తములును లే, వరయఁగ గోవర్ధనాద్రియంతటియందున్.36
క. నడకట్ట లిసుకతిప్పలు, మడలు దరులు వాఁకలును గ్రమంబున నొకటన్
     గడమవడకుండఁ గృష్ణుఁడు, పడతులకును యమున యాటపట్టుగఁ జేసెన్.37
సీ. తోరంపుటూరులఁ దొడరి యుద్ధతనితంబములపై నాదటఁ బ్రాఁకి నాభు
     లప్పళించి సమున్నతాంచితస్తనభరంబులు గౌఁగిలించి దోర్మూలములకు
     దొడఁకి భుజంబులతో బెనఁగాడుచు లీల మోవులు కబళించి చెక్కు
     లంటి కుంతలము లల్లల్లఁ దెమల్చి నేత్రములక్రేవలు విముగ్ధములు సేసి
తే. ప్రేతలకు నోలి నింపులు విస్తరింపఁ, దన్నపోలెడి కాళిందితరఁగలందుఁ
     గ్రాలె ననుదిన[15]మును జలకేళి దగిలి, సజలఘనమూ ర్తి గోపాలచక్రవర్తి.38
చ. ఎనసిననిండువెన్నెలల నింపగు రాత్రుల రత్నరమ్యకాం
     చనచషకంబులందు నరచందురునీడలు దోఁచుసీధువుల్
     గొని యదుసూనుచుట్టులను గూడి మదోద్ధతి నాడుగోపికా
     జనములు దార కైకొనిరి శారదవైభవలక్ష్మి యంతయున్.39
చ. తనుతరనిత్యపుష్పితలతాతతిలోనన యుండి నిద్ర మై
     దను బడి రేప మేల్కనునుదారమధువ్రతనాథుభంగి న
     వ్వనరుహనాభుఁడుం దగిలి వల్లవకాంతలలోన రాత్రులున్
     దినములు నట్లపోవఁగ సుదీర్ణసుఖాంబుధిఁ దేలె లోలుఁడై.40

శ్రీకృష్ణుఁడు వృషభరూపధరుం డగునరిష్టుం డనురాక్షసునిం జంపుట

వ. అంత నొక్కనాఁడు మధ్యరాత్రసమయంబున గోపికామండలమధ్యగతుం డై
     తారామధ్యంబునం బొలుచు సుధాకిరణుతోడం బురుడించుచు నభినవక్రీడా
     కౌతుకంబున నలరు కృష్ణునకు నరిష్టంబు చింతించి యరిష్టుం డనుదుష్టదానవుండు

     వృషభరూపంబున నాటోపంబు దీపింపం గోపంబునుం బాపంబునుం దనకు
     మృత్యుదూత లై యెలయించుటకు ననుకూలుం డై యాభీలోత్సాహంబున.41
సీ. కాలకూటమునకుఁ గరచరణా[16]ద్యవయవములు ప్రభవించి యలరె ననఁగఁ
     బ్రళయోద్ధతధ్వాంతపటలంబునకు శరీరిత్వవిస్ఫూర్తి వర్తిల్లె ననఁగ
     రాహుసంత్యక్తఘోంకళేబరమునకుఁ బశుభావపరిణతి పరఁగె ననఁగ
     గలికాలసమ్ముఖకలుషరాశికిఁ జతురంఘ్రితావైదగ్ధి యలరె ననఁగ
తే. నతిభయంకరం బగుకరోరాసితాంగ, మెసఁగ నీలాద్రి వృషభమై యేఁగుదెంచు
     కరణి నుత్తుంగతీవ్రశృంగములతోడఁ, జటులఖురపాతపాటితక్ష్మాకుఁ డగుచు.42
వ. గోష్ఠంబులలోని కుఱికి సుఖశయనంబును నలరుపసులం గలంచి గోగర్భిణులకడు
     పులు సినుగం గొమ్ములఁ గ్రుమ్ముచుఁ బొగరుకోడెలం దొడరి పొరిగొనుచు
     వత్సంబులం గాల్మెట్టున బారిసమరుచు మారిమసంగినమాడ్కిం గర్కశబంధుర
     స్కంధంబును నతిస్థూలవిపులకకుదంబును దీర్ఘతరలాంగూలంబును సమవిశాల
     కటిభాగంబును నిజశకృన్మూత్ర స్నిగ్ధపార్శ్వయుగ్మంబును నుల్లసిల్లం బెల్లురేఁగి.43
ఉ. ఱంకెలు గర్జలై యడర ఱాఁపుఁదనంబున నెందుఁ బర్వుని
     శ్శంకవిలోకవైద్యుతకృశానుశిఖల్ దెసలెల్లఁ గప్పఁగాఁ
     బొంకముతోడ విస్ఫురదపూర్వవలాహకభంగిఁ బొంగి యే
     వంకలఁ జీఁకటు ల్గవియ వచ్చె యదూద్వహుపై రయంబునన్.44
తే. మలసి [17]క్రోడాడి యిరుదెసమ్రాఁకు లోలిఁ, గూలఁద్రోచుచుఁ గాల్ద్రవ్వి [18]ధూళిరేఁచి
     చెలఁగి కొమ్ము లమర్చియుఁ బెలుఁచ బాఱు, తెంచునాఁబోతుటసుర దృష్టించె విభుఁడు.45
చ. వెఱచి నిమీలితాక్షు లయి వెన్క కొదింగెడుపువ్వుఁబోఁడులన్
     వెఱవకుఁ డోడకుం డనుచు వేగమ తజా నెదురై కడంగి యే
     డ్తెఱఁ దలశబ్దమిచ్చినఁ గడింది వృషాధముఁ డగ్గలంపుఁదెం
     పుఱవుగఁ దాఁకెఁ గృష్ణుఁ డతఁ డొడ్డినకొమ్ములు వట్టె బెట్టుగన్.46
క. పట్టినఁ గదలఁగ నేరక, యిట్టట్టును బలిమి చెడఁగ నెగయుచు లావై
     మెట్టి నిలిచె హరియును నా, కట్టుపకాసికిని బలముఁ గడకయుఁ జూపెన్.47
మ. వృషభస్కంధుఁడు వారిజాక్షుఁడు మహావిస్తీర్ణవక్షుండు దు
     ర్విషహుం డాతఁడు గోవృషాసురుని నుద్విగ్నాత్ముగా నమ్మెయిన్
     [19]రుషతోఁ బ్రౌఢభుజాబలం బెసఁగ సంరోధించె వేఱొక్కగో
     వృషభేంద్రుండును బోలె గర్జితకళావిస్ఫారుఁ డై యుండఁగన్.48
క. హరి చేతి కగ్గమై చె, చ్చెర నప్పుడ కూల కెంతసే పోర్చెఁ గరం
     బరు దితనిలావుతెఱఁ గని, యరిష్టుఁ గొనియాడి రంబరాంతరచారుల్.49

ఉ. తానును దైత్యులావునకుఁ దద్దయు మెచ్చుచుఁ బేర్చి దేవకీ
     సూనుఁడు కొమ్ము లూఁది మెడ స్రుక్కఁగ నెత్తి నులించి త్రిప్పి వే
     వే నెఱిదప్పఁ ద్రోచుటయు విహ్వలుఁ డై రుధిరంబు కర్ణనా
     సానయనంబులం దొరుఁగ స్రగ్గె విరోధి యపాప్తజీవుఁ డై.50
వ. ఇవ్విధంబున గోవిందబాహుయంత్రనిష్పిష్టుం డై పడియున్న యరిష్టుం జూచి
     యటమున్న విత్రస్త లై చెదరి యున్నగోపాంగన లందఱు విస్మయానందంబులు
     డెందంబులఁ దలిరుకొన నయ్యరవిందనాభుపాలికిం జనుదెంచి చుట్టును బలసి
     పలుదెఱంగులం బ్రస్తుతించి రట్టు వెన్నుండు వ్రేపల్లె బల్లిదుం డై వర్తిల్లుచున్న
     విధంబు దెల్లంబుగా వినుచు నక్కడఁ గంసుండు.51
తే. తోడుతోడుతఁ గడఁకలు దునిసిపడఁగ, వెఱఁగుపాటున వెఱపులు దుఱఁగలింపఁ
     జేష్టితంబులుఁ దలఁపులుఁ జేవసెడఁగ, నుసుఱుతోడన పీనుఁ గై యుడుకుచుండె.52
వ. ఇ ట్లుండి యొక్కనాఁడు సుప్తసర్వప్రాణిజాతంబును నిశ్శబ్దసకలదిక్తటంబు నగు
     నిశీధసమయంబున నభ్యంతరసభామండపంబున నొక్కరుండు నాసీనుం డై
     యుగ్రసేనుండు వసుదేవుండు సత్యకుం డంధకుండు గంపకుండు దారుకుండు
     విపృథుండు బభ్రుండు మొదలుగాఁగల యదుభోజముఖ్యుల నందఱ రావించి
     వారితో ని ట్లనియె.53
సీ. సర్వకార్యజ్ఞులు సర్వాగమములఁ బారగులు ద్రివర్గవర్తననిపుణులు
     లోకవిశ్రాంతివివేకనిష్టులు సమర్థోపాయు లవిరతోద్యోగధన్యు
     లభిగుప్తమంత్రు లనర్థంబులందుఁ బరాఙ్ముఖు లార్యభావానుగతులు
     దర్పితారాతిమర్దనశౌండు లార్తజనత్రాణతత్పకురుల్ నయసమగ్రు
తే. లందఱును మీరు వహ్నిసూర్యేందుపవన, రుద్రసమగుణోదయములరూఢిగనిన
     దొరలు నరులఁ జెప్పఁగ నేల సురల నైన, నోపుదురు బుద్ధిమగఁటిమి నుక్కుమడఁప.54
క. గిరులు మహీమండలమును, భరియించినభంగిఁ బరమభద్రం బగునా
     చరితంబు నఖిలయదుకుల, భరణం బొనరించి పేర్మిఁ బరఁగితి రెందున్.55
తే. ఇట్టి మీరు నా కెప్పుడు హితమ తలఁచి, యస్మదీయమనోవృత్తి ననుసరింతు
     రిప్పు డొకయనర్థము జనియించియుండ, మది నుపేక్షించినా రేమిమతమొ యెఱుఁగ.56

కంసుఁడు వసుదేవాదులతో శ్రీకృష్ణునిచరితంబు చెప్పి యాక్షేపించుట

వ. అది యెయ్యది యన నందగోపనందనుం డై యున్న కృష్ణుం డను పేరికుమా
     రుండు నాకపకారంబు సేయం బూనినవాఁ డద్దురాత్ముం డుపేక్షితం బై నరోగంబు
     పగిది ననుకూలానిలప్రేరితం బైన పయోధరంబు[20]చాడ్పున నంకురితం బైన
     విషవృక్షంబువిధంబున [21]వర్ధిల్లుచున్నవాఁడు నిపుణంబుగాఁ జింతించియు వాని
     పుట్టువుం బొడవు నున్న [22]రూపు నిశ్చయింప రాకున్నది యాశ్చర్యం బైన కారణం

     బున జాతం బైన దేవతాపత్యంబ కావలయు నతిదైవతంబును నమానుషంబును
     నై నతదీయచరితంబులు తత్ప్రకారంబులు దెలిపెదం దెలియ వినుండు.57
సీ. తనరి [23]మువ్వంటులదినములయంద పూతనచన్నుఁబాలతోఁ ద్రాగె నుసుఱు
     నెఱి బోరగిలియాడ నేరనినాఁడ పాదమునఁ దుత్తుమురు గాఁ దాఁచె బండి
     ధరణిఁ దప్పడుగిడుతఱియంద జమిలిముద్దులు పెల్లగిల రోలితోన యీడ్చె
     నించుకించుక యెడయెఱిఁగెడుకొలదిన కాళియనాగంబు గండడంచెఁ
తే. బ్రకటబలులఁ బ్రలంబధేనుకుల నుగ్ర, రేఖఁ జంపించె నధికు నరిష్టుఁ దునిమె
     బాల్యమున నేల యిట్టిట్టి పనులు ప్రౌఢు, లెవ్వ రీలోకమునఁ జేసి రితఁడుదక్క.58
క. ఏడుదివసములవృష్టిం, గీడొందెడుపసులఁ గావ గిరి గొడు(డ)గుగ సం
     క్రీడాగతిఁ బట్టుట గొని, యాడఁ దగదె చెప్ప నేల యన్యము లొకఁడున్.59
తే. ఇంకఁ గలవాఁడు కేశియ యితఁడుఁ బోయి, వానిచేఁగూలుఁదరువాతివాఁడ నేను
     జంప మరగినవాఁ డేల సైఁచు నన్ను, నుఱక యెటులైన వచ్చి పై నుఱుకుఁగాక.60
క. బొమలు ముడివడఁగఁ బిడికిలి, యమరిచి కోపంబుతోడ నవుడు గఱచుచున్
     జముచాడ్పున హరి గడును, గ్రముగాఁ బైఁబడుట నామొగంబున వ్రేలున్.61
వ. అదియునుం గాక విష్ణుండు తొల్లి హిరణ్యకశిపు వధియింప నరసింహుం డై యా
     విర్భవించె ననియుఁ గూర్మావతారంబున మందరపర్వతంబు దాల్చి వనితారూపం
     బన నమరాసురులకు నమృతనిమిత్తం బైనకలహం బుత్పాదించి యసురకులం
     బడఁగించె ననియును వారాహం బగు దేహంబు గైకొని మహీసముధ్ధరణం బొనర్చి
     యనేకదైత్యులఁ బరిమార్చె ననియును వామనుం డై వైరోచను వంచించి దివిజ
     రాజ్యంబు జంభారి కిచ్చె ననియును జామదగ్న్యుం డై యిరువదొక్కమాఱు
     నరపతులనెల్ల నుఱుమాడి కశ్యపునకు నధ్వరదక్షిణగా నఖిలక్షోణియుం బ్రతి
     పాదించె ననియును నాలుగుమూర్తులై దశరథుం డనుధరణిపతికిఁ బ్రభవించి
     పౌలస్త్యుం దునిమె ననియును విందుము.62
మ. ఇవి యెల్లం గలమాయలాఁడు హరి యాత్మేచ్ఛన్ సురప్రార్థనన్
     భువనప్రీతి యొనర్చినట్టిగతు లిప్డుం బూని యీనీచగో
     పవిధిం గ్రిడ నెపంబు పెట్టుకొని [24]దృప్యద్దానవాపాయదు
     ర్వ్యవసాయంబునఁ బుట్టెఁ గావలయు మీ రాత్మన్ విచారింపుఁడా.63
క. ఆకృష్ణునియగ్రజుఁడు సు, ధాకరధవళతనుఁ డయ్యుదారునటుల యు
     ల్లోకబలుడు బలభద్రుఁ డ, నేకుల వధియింపఁ జాలు నింద్రద్విషులన్.64
వ. వీరిద్దఱు దేవతాత్ము లగుట సిద్ధంబు సిద్ధముని యగు నారదుండు నా కెఱింగించె
     దేవకీదేవి యర్ధరాత్రంబు నప్పుడు కొడుకుం గనినం దదీయభర్త యక్కుమారుం
     గొని చని సమకాలప్రసూత యైన యశోదముందటం బెట్టి తజ్జాత యగు బాలికం
     దెచ్చిన నదియును నా చేయి యుదల్చికొని పోయి వింధ్యవాసిని యగు దేవత యై

     దేవతలచేతం బూజ గొనియె నాకృష్ణుండును వసుదేవసుతుం డగుటం జేసి
     వాసుదేవుం డనం బ్రఖ్యాతి నొందెడు నిట్లు మిత్రవ్యపదేశంబునం బరఁగు
     శత్రుండు దా నైన వసుదేవుండ యింతకు మూలభూతంబు.65
చ. వడిఁ దలఁ ద్రొక్కి ముక్కున నవారణఁ గన్నులు రెండు దొల్ప బ
     ల్విడిఁ దమకించువాయసములీల మదీయసమీపవర్తి యై
     యుడుగక నాకుఁ గీడు గడునుగ్రముగా నొనరించె దాయపుం
     జెడు గితఁ డేమి సేయనగుఁ జెన్నఁటిచుట్టపుసంజ్ఞ యుండఁగన్.66
చ. మనిచితిఁ దన్ను నీగియును మన్ననయుం బొదలంగ నేను దా
     ననయము నింతయుం దలఁప కంతకతుల్యవిచారుఁ డయ్యె ని
     య్యన యిటు నా దెస [25]న్వినక యాత్మ నకల్మషునందుఁ గల్మషం
     బెనయ నొనర్చుకంటెఁ గలదే భువిఁ బాతక మెవ్విధంబునన్.67
తే. భ్రూణహత్యాదు లగుపాపములకు నవధి, గలదు గాని కృతఘ్నునికలుషమునకు
     నిష్కృతి [26]యంతంబు లేనితీవ్ర, నరకపీడ సంప్రాప్య మన్నరున కండ్రు.68
వ. అని పలికి వసుదేవుదెసం గనుంగొని కంసుండు.69
సీ. కుల మింతయును నేను గొఱఁత యొక్కట నొందకుండంగ రక్షించుచున్నవాఁడ
     నిట్టినాయెడఁ బాప మిమ్మెయిఁ బుట్టించి తులువ నీ వెంతయు ద్రోహి వైతి
     యెట్లుగా ముదిసితి యేమిగాఁ బెద్దవైతో కాని యెఱుఁగ నీ యున్నయూర
     నైనలే దీవు మిథ్యాశీలుఁడవు మృషాశ్రయుఁడ వనర్ధధీసంయముఁడవు
తే. నీవిచార మే నెఱిఁగితిఁ గావరమునఁ, దొడరి నన్నుఁ జంపించి నీకొడుకు రాజుఁ
     జేసి మధుర యేలింపఁ జూచెదవు [27]జాల్మ, మెట్టునకు జన్నెతరములు [28]పెట్టిచూడ.70
శా. నాకేశుం డయినన్ బినాకధరుఁ డైన న్నాకు మాఱై రణో
     త్సేకంబుం బ్రసరింప నోపమి మదిం జింతింప ని ట్లేటికిన్
     నీ కీదుర్వ్యవసాయ మొక్కపడుచున్ వే తెచ్చి పోరించి యే
     శ్రీకిం బాత్రమవై తనర్చెదవు నీచే నేల యౌ నప్పనుల్.71
వ. నీవు చక్రవర్తివంశంబున జనియించి బాల్యంబునంగోలెను మాతండ్రియ పెంపం
     బెఱిగి మా తోఁబుట్టువునకుం బెనిమిటి వై యాదవులు గురుస్థానంబుగాఁ
     బాటింపం బరఁగి సజ్జనులలోన నెన్నిక గని పిదప నిన్నీచకర్మంబునకుం జొచ్చితి వీ
     వెట్టివాఁడ వైన నగుదుగాని యే నిన్ను వధియింప నోప నింతకమున్ను బంధు
     వృద్ధమిత్రద్విజవధంబులు సేయ నింకం జేయంగలవాఁడనుం గాను నీ చేయుదుర్న
     యంబులవలన మేలువచ్చినం గీడొందిన నది దైవకృతం బనీియుండెదఁ ద్వదీయం
     బగుదౌరాత్మ్యంబు కులంబువారికిం దలవంపు గావించె నింతియ కృష్ణునకు
     నాకు [29]నిట్లు పొడమినరాయిడి మాయం దొక్కరుండు శాంతిం బొందక శాంతి

     గానేరదు నిన్ను వెడలనడుపవలసినపని యిట్లయ్యు నట్లు నేసితి నేని నేన
     తుచ్ఛుండ నగుదు నీచెట్ట నీయొద్దన యుండె నుండిన నుండుము పోయినం బొమ్ము
     పలుకులపని లేదని పలికి మధురేశ్వరుండు భోజకులాలంకారుం డగునక్రూరు
     నాలోకించి.72

కంసుఁడు శ్రీకృష్ణునిఁ దోడ్తేర నక్రూరుని నియోగించుట

క. చని నీవు గోకులంబున, కనఘా యానందగోపు నాతనివారిన్
     మనయియ్యేఁటికి గలయరి, గొని రం డని తోన తోడుకొని రమ్ము వెసన్.73
వ. అదియునుంగాక యేను మదీయం బగుధనువునకు మహోత్సవంబు సేసెద
     దీనికి ననేకదేశాధీశులగు రాజులు మహనీయు నగు మహీదేవతలును నరుగు
     దెంచుచున్నారు పెక్కుదినంబు లామెత లొనర్ప వలసియుండు వ్రజనివాసు
     లగుగోపాలుర నపరిమితంబు లగుదధిక్షీరఘృతంబులు నరణ్యసంభవంబు లగు
     మధువులుఁ దెచ్చునట్టుగా నాజ్ఞాపింపు మఱియును.74
శా. నామేనల్లురు బాహుసత్త్వవికసన్మాహాత్మ్యవిఖ్యాతు లా
     రాముం గృష్ణునిఁ జూచు వేడుక మనోరంగంబునం దాడెడు
     న్వే మద్వాంఛ యెఱుంగఁ జెప్పి మదికి న్విశ్వాస మొందించి నీ
     వాముష్యాయణు లక్కుమారులను దె మ్మాలోకనప్రీతిగన్.75
తే. ఇద్ద ఱున్నారు వీరె నాయొద్ద మల్లు, లీసుపుట్టించి తలపెట్టి యెల్లజనుల
     కుత్సవంబుగ నే నయ్యదూద్వహుల యు, దగ్రదోర్దర్పపరిణతి యరయువాఁడ.76
ఉ. వారికి నాకు సమ్ముఖ మవశ్యము గావలె నట్లుగాక యీ
     వైరము మాన దింపెసఁగువాక్యము లచ్చట విస్తరింపు మ
     క్రూర కఠోర మెట్లయిన [30]రోషము దోఁపఁగ నీకు మెమ్మెయిన్
     జేరరు బాలురు న్విపినసీమ జనించినవారు గావునన్.77
వ. అక్కుమారులం దోడ్కొని వచ్చితేని నా కత్యంతం బగు నుపకారం బొనర్చిన
     వాఁడ వగుదు వసుదేవుకఱపు లెవ్వియు వినకు మీప్రొద్ద కదలు మనిన నట్ల
     కాక యని యక్రూరుండు.78
క. దనుజదమను దర్శింపఁగఁ, దనుఁ బనుచుట హృద్యమధురతరశీతజలం
     బెనయు తృషాతురు గ్రోలం, బనుచుటగాఁ దలఁచి ప్రమదభరితుం డగుచున్.79
సీ. సజలవలాహకశ్యామసుందరదేహుఁ డాజానులంబిసమగ్రబాహుఁ
     డతులితశ్రీవత్సవితతమంగళవక్షుఁ డమలసరోజపత్రాయతాక్షుఁ
     డబ్జచక్రగదాసమన్వితకరపద్ముఁ డమృతాబ్ధినిత్యవిహారసద్ముఁ
     డాలగ్నకనకదుకూలకటీచక్రుఁ డానమ్రసతతరక్షార్థి శక్రుఁ

తే. డాదిదేవుఁ డిప్పుడు గొల్లఁ డై ముదమునఁ, బీలిదండ నెట్టెముసుట్టి పిల్లఁగ్రోలు
     కేలఁ బట్టి గోవులబడిఁ గేలిసలుపఁ, జూడఁ గంటి నా కిది యేమి సుకృతఫలమొ.80
శా. ఏ నచ్చోటికి నెమ్మిఁ బోఁ దడవ సర్వేశుండు సర్వాదరా
     మానం బైన విలోకనం బొలయ న న్నొక్కింత భావించిన
     ట్లైన న్నాజననంబు ధన్యము త్రిలోకార్చ్యుండ నే నొక్కఁడన్
     గానే సంయమికాంక్ష్య మిప్పరమమాంగల్యంబు సామాన్యమే.81
క. బలభద్రసహితుఁ డగు నా, జలజాక్షుఁడు నేఁడు నాకు సన్నిధియగు వీ
     డ్కొలిపెద నింతటితోడం, గలుషజరామరణబహుళకర్మజ్వరమున్.82
క. అని తనలో నుప్పొంగుచు, ననఘుఁడు కృతకృత్యుం డగుచు నక్రూరుఁడు స
     య్యనఁ గంసుని నామంత్రణ, మొనర్చి పురి వెడలె నపుడ యుత్సవలీలన్.83
వ. ఇక్కడఁ గంసుండు నివ్విధంబున వసుదేవు నధిక్షేపించి యాడినమాటల కందఱు
     యదుప్రవృద్ధులుఁ జెవులు మూసికొనుచు నిద్దురాత్మునకుం గాలంబు నిండె
     నని తలంచి రందులోన నంధకుం డను పేరు గల యాదవస్థవిరుం డాయౌగ్రసేని
     నాలోకించి యి ట్లనియె.84
ఉ. అక్కట రాజవంశమునయందు జనింపనివానియట్లు నీ
     వెక్కడనేనిఁ గల్గి యిటు లేమిటి కేనియు వచ్చినట్లు శ్రీ
     దక్కి వనంబులో జడలు దాల్పఁగ బోయెడునట్లు బుద్ధి నొం
     డొక్కటి సూడ కిమ్మెయి దురుక్తుల నొంచితె వృద్ధబాంధవున్.85
ఆ. నీకు వగవ వలదు నీవు పుత్రుఁడవు గాఁ, దొల్లి నోఁచినట్టితల్లితండ్రు
     లధిక శోచ్యు లన్వయాంతకారివి నిన్నుఁ, గనినకుల[31]ము నిందఁ జనుట యరుదె.86
క. తనుఁ దాన పొగడికొనినను, గనునే నిజగుణము నధికగౌరవమును స
     జ్జనసేవ్యము లై యవి పే, ర్చినఁ గలుగుం గాక యెందుఁ జిరతరమహిమల్.87
శా. నీకుం జూడఁగ నీదుమాటలు కడు న్నిక్కంబు లై సత్యమ
     న్లోకౌచిత్యముఁ దప్పకున్నకరణి న్శోభిల్లె నీభంగి నెం
     దే కార్యంబు ఫలించె నీవ చెపుమా యేవంబుగా నాత్మమ
     ర్మాకారస్థితి[32]తోడ బేలుపడి తిట్లైరే నృపుల్ ప్రాక్తనుల్.88
క. తగ వెఱిఁగి మానఘనుఁ డై, నెగడి యనవలిప్తమార్గనిష్ఠుఁ డగుబుధున్
     మొగము సెదరంగఁ బలుకుట, జగతీసురవధముతోడి సరి యని రార్యుల్.89
క. విను వంశవృద్ధు లభిపూ, జనములకును భాజనములు సత్క్రతు వగు న
     య్యనలములయట్ల వారల, కనలుట భస్మీకరించు ఘనునైన వెసన్.90
తే. జలములోన మత్స్యంబులు మెలఁగుజాడ, లెఱుఁగరానిచందమ బుధు లిచ్చనడచు
     తెరువు లన్యుల కెఱుఁగుట యరిది వానిఁ, దాను శాంతుఁ డై దాంతుఁ డై తడవవలదె.91

క. పావకునకు నభిమంత్రిత, మై వేల్వఁగఁబడినహవ్య మధికసముద్వే
     గావహ మైనట్లు బుధుల, కేసము లగుజడులమాట లెద యెరియించున్.92
వ. నీవు వసుదేవుఁ బుత్రగోపనం బొనర్చె నని నిందించితి బిడ్డలఁ దన యోపిన
     ట్లాపదలం బొందకుండం గాచికొనక యూరక చావనిత్తురే మీతల్లిదండ్రులు
     ప్రయత్నంబునం బెంపక యింతటివాఁడ వెట్లైతీ పుంనామనరకంబునం బడకుండఁ
     ద్రాణంబు సేయుపుత్రుం బోషింపకుండవచ్చునే వసుదేవనిందయు వాసుదేవ
     ద్వేషంబును బాటించుట కులంబువారి కెల్లను విషంబు ద్రావనిచ్చుటగా నెఱుం
     గుము నీయాడిన కీడుమాటలకు మామనంబు లన్నియుం గలంగె నేము విడిచి
     తొలంగిన రాజ వై యుండుటకుం జాలుదు నీయట్టి నీచు ననాచారు నవిచారు
     లమై వాత్సల్యంబువలన విడువంజాలక తన్నుకొనుచున్న నరాధములము
     మమ్ము నిందించుకొందుము గాక యొం డేమి యందుము రామదామోదరులం
     దొడరి బ్రతుకువాఁడ వై తేని నీచేసిన తపం బెవ్వరికిఁ గలదు భవద్వినాశ పిశు
     నంబు లగు దుస్స్వప్నంబులు మృగపక్షిచేష్టితంబులు ననేకంబులు సూచెదము
     దేవతాప్రతిమలు సలించుటలు నుల్కానిర్ఘాతంబులు పడుటయును సూర్యచంద్ర
     మండలంబులు ప్రచండకబంధగ్రసనాదివైకృతంబులం బొందుటలును బాప
     గ్రహంబులు క్రూరరాసుల వక్రించుటలు మొదలుగా నెయ్యవి దైవజ్ఞులు రాజ
     వ్యపాయంబునకు గణియింతు రట్టినిమిత్తంబు లన్నియుం గలిగి యున్నయవి
     మీఁద లెస్స యగుట యత్యంతదుర్లభంబు.93
మ. నిను భూనాథునిఁ గాఁగఁ గొల్చి మనముల్ నిత్యంబు సంతాపమున్
     దనుకం గ్రుళ్లుచు నున్న చుట్టములలో ధన్యాత్ముఁ డొక్కండ యెం
     దును నక్రూరుఁడు వాసుదేవు జగదాద్యు న్విశ్వవంద్యు న్మహా
     మునిహృద్ధ్యేయునిఁ జేరి చూడఁ గని సమ్మోదాఢ్యుఁ డయ్యె న్మదిన్.94
మ. హరి నిం కెన్నఁడు చూతు మె ట్లతనిసౌహార్దంబు చేకూరు నే
     వెర వద్దేవుని నాశ్రయింప నతని న్వీక్షించి యాచూడ్కి యే
     నెరసుం బొందకయుండ వచ్చి మముఁ దా నెమ్మిన్ మహాభాగ్యసుం
     దరుఁ డక్రూరుఁడు చూచుఁగాత దురితధ్వాంతచ్ఛిదాశౌండతన్.95
వ. అది యట్లుండె నింక నొక్కటి గలదు వినియెదవేనిం జెప్పెద.96
శా. గోవిందుం డీట వచ్చినప్డు సకల జోక్షోభంబుగా నీకుఁ బ్రా
     ణావచ్ఛేద మొనర్చునట్టిదశ బిట్టై వచ్చుఁ దప్పింపరా
     దే వీరుల్ నినుఁ గూడిరేనియును నీ వీలోననే పోయి యా
     దేవుం బ్రీతియెలర్పఁ దేర్పుము శుభోత్సేకంబు సంధిల్లఁగన్.97

వ. ఇట్లు సేయవై తేని నీవ యెఱుంగు దనిన యంధకువచనంబులకుం గ్రోధాంధ
     లోచనుం డై యాక్షేపశిథిలోత్తంసుం డగుకంసుండు దిగ్గన లేచి పోయెఁ దక్కిన
     యందఱు [33]ధిగ్వచనంబులం దమతమమందిరంబులకుం జనిరి తదనంతరంబ.98

కేశి యనురాక్షసుఁ డశ్వరూపధరుం డై శ్రీకృష్ణునకుఁ గీడు సేయఁ బూనుట

శా. అక్రూరుం డటపోకమున్న మధురేశాజ్ఞప్తుఁ డై కేశినా
     మక్రూరాసురుఁ డశ్వరూపమున [34]నున్మాదాతిరేకంబుచే
     నాక్రాంతం బగునంతరంగమున బృందారణ్యముం జొచ్చి దు
     ర్వీకాంతిం జరియించె గోకుల ముద్వేగిల్ల వేగోద్ధతిన్.99
సీ. వెనుకకాళ్లులు రెండు వీఁకమై జోడించి తాఁచుఁ గొన్నింటి డెందములు పగుల
     ఘనకరాళోగ్రవక్త్రంబునఁ గబళించి కలచుఁ గొన్నింటిఁ బెన్గండ లురుల
     నుగ్రపాతమునఁ బై నుఱికి ఖురంబులఁ ద్రొక్కుఁ గొన్నింటిఁ దుత్తురుము గాఁగఁ
     బ్రకటవేగంబు దుర్వారంబుగా బిట్టుదాఁకుఁ కొన్నింటి గాత్రములు వ్రయ్యఁ
తే. గండమున వెండ్రుకలు భయంకరతఁ జెదరఁ, గన్నుఁగొనల నిప్పులు రాలఁ గర్ణయుగము
     బిగిసి వెఱపు పుట్టింప నిప్పగిది నసుర, గోగణముఁ జంపి పరిమార్చె గోపతతుల.100
తే. పసులనెత్తురు గ్రోలుచుఁ బసఁగ మనుజ, పలలములు దించుఁ దిరుగునాఖలునిచెయిది
     గతిపయాహంబులంద యక్కాన కాటి, కరణి బహుకపాలాస్థిసంకటము నందె.101
వ. ఇవ్విధంబున నెవ్వలనను గోవులకుఁ జరియింప రాక యెద్దెసల మెలంగుత్రోవలు
     గట్టువడియె నేవెరవున నీయాపద దరియింతు మేమి సేయుదుము కృష్ణుం డూర
     కున్నవాఁ డేది శరణం బనుచు వ్రజౌకు లెల్లం దల్లడిల్లుచుండ నొక్కనాఁడు.102
మ. అడవిం గోల్పడుప్రాణి యెయ్యదియు లే కాటోప మేపార న
     చ్చెడుగం డుగ్రతఁ దద్వ్రజంబుదెసకున్ శీఘ్రంబ యేతెంచె ను
     గ్గడువై మేను దలిర్ప హేషితము లాకాశంబుఁ బూరింప దం
     దడిఁ బాదాహతమై మహీరజము గ్రందం బర్వ సర్వాశలన్.103
వ. దాని నంతంతం గని వ్రేపల్లెం గలగోపాలురును గోపికలును సబాంధవంబుగాఁ
     గృష్ణ కృష్ణ రక్షింపు రక్షింపు మనుచు నాజగన్నాథుదిక్కునకుఁ బఱతెంచినం గని
     యోడకుం డనుచు నద్దేవుండు.104
క. నీపాలి[35]మృత్యువై యిదె, యేపున నున్నాఁడ నిచట నేనుఁ దురగరూ
     పోపహిత దుష్టదానవ, వే పఱతెమ్మనుచుఁ గేలువ్రేయుచు నార్వన్.105

శ్రీకృష్ణుఁడు కేశిని మార్కొని పోరి మృతిఁబొందించుట

వ. తదీయకరతాడనధ్వానంబు సైరింపక.106
మ. ప్రళయార్కుం గబళింపఁగోరి కడుసంరంభంబుతో రాహుమం
     డల మాత్రాకృతిసూపున ట్లధికచండం బైనవక్త్రంబు గ
     ట్టలుకం బంతులు గానరాఁ దెఱచి దేవారాతి యావీరుపై
     బలియుండై కవిసె న్నభశ్చరులు సంభ్రాంతాత్ములై చూడఁగన్.107
క. ఆగుఱ్ఱపుటసుర గడఁగు, లాగును హరి రిత్తచేతులన యున్న నిరు
     ద్యోగతయుఁ జూచి కడును, ద్వేగంబున నిట్టు లనిరి వ్రే లాతనితోన్.108
క. గోవింద యిద్దురాత్ముఁడు, గేవలతురగంబు గాఁడు కేశి యనఁగ దే
     వావళి కవధ్యుఁ డగువాఁ, డీవిధిఁ గంసహితుఁ డైనయింద్రారి సుమీ.109
క. మొన లేర్చి నిలిచి పలువురు, జననాథులు వీనితోడి సమరమునకుఁ గా
     క నివృత్తు లైరి నీవే, మిని వేగిరపడక కదియుమీ వెర వొప్పన్.110
వ. వీఁడు పాపకర్ముండు గావున వీని చేసిన పాపంబు రూపడంచు నించుక తెలివి
     వాటించి పెనంగు మని మానుషబుద్ధు లగుటం జేసి హితంబు గోరి చెప్పిన వారి
     వాక్యంబులకు నొయ్యన నవ్వుచు నటుసూడుం డింక నీరక్కసు నెట్లు నేసెదనో
     మీరు సంతసిల్లుపౌరుషంబులు పసరింప దొరకొనుట నాకుం బండువుగాక
     యేమిభరం బేమి సేయుదు సంశయింపవలవ దనుచుం గడంగి.111
మ. అవతంసం బగుపింఛదామకము [36]వేగాక్షిప్తపద్మంబులన్
     సవిశేష[37]చ్ఛవిఁ జూప హేమపటకక్ష్యాసుందరాందోళనం
     బు విభాసిల్లుపిఱిందిదిక్కునకు నొప్పు ల్వెంప వక్షస్థలీ
     నవలీలా వనమాల యుజ్జ్వలరుచిన్ నర్తిల్ల నద్దేవుఁడున్.112
వ. సవ్యదక్షిణమండలపరిభ్రమణంబుల మెఱయుచు నక్లేశంబునం గేశిదిక్కు దఱిమిన
     నుఱక యయ్యసుర యిరుదెసలకు మొగంబు మురియించుచు గొరిజలతాఁకున
     ధారుణి దళనపటుపటహతాడనానుకారి యగు దారుణారావంబు పుట్టింప
     బెట్టిదంబుగా నడరె నట్టిసమయంబున హయదైత్యుండు నెగసి ముందటి
     కాళ్ల రెంటను హరియురంబు దొక్కుటకై నిక్కిన నక్కుమారుం డాచక్కటి
     దప్పించి యొప్పుగాఁ గ్రంగుటయుఁ బాదపాతం బొక్క పార్శ్వంబు వెంటం
     జెనఁటి యై పోవం దదీయవక్త్రంబునం జెదరు ఫేనశీకరంబులు శిశిరచంద్రునిం
     బొదువు హిమకణంబులకరణిం గృష్ణునాననంబుపైఁ దొరఁగె నాలోన నాలోల
     కుంతలుం డగుచు నొక్కింత దొలంగి నిలిచిన జలజనయనుం బరుషరోష
     రూక్షేక్షణంబులం జూచి కందంబు విదిర్చి విచ్చి నిక్కి ముక్కుపుటంబులు దటతట
     నదరఁ గుటిలదానవుం డందందం గాలు ద్రవ్వి త్రుళ్లినఁ బెల్లెగయు కెంధూళి

     నీలవర్ణు నీలం బగు మేను యరవిందధూళి పైదొరఁగిన శైవాలసంచయంబుచందం
     బున నందం బగునట్లు గావించె గోవిందుమీఁద వాఁడు వెండియుఁ జండగతి
     నందికొనివచ్చి చొచ్చిన నిచ్చటచ్చటఁ జరించుట మెచ్చు గా దని నట్లచ్చతురవిక్ర
     ముండు సుస్థిరవిక్రముండై ప్రతిరాజరాజమండలరాహు వనందగుతనబాహువు
     కుపితభోగిభోగంబునుం బోలె నిగుడ్చి యారక్కసుముఖబిలంబునం జొనిపి
     [38]నాలుక మొదలంటం బట్టిన నెట్టన యతనికేలు విడిపించుకొననుం బ్రిదిలిపోవను
     గఱవను నొగుల్పను శక్తుండు గాక యశక్తుం డై నక్తంచరుండు చరణతలంబుల
     ధరణిఁ దాటించుచు గ్రుడ్లు వెలికుఱుక సెలవుల నురువులతోడిలాల లురుల
     ఱోలుచుఁ గుత్తుక యదరఁ దోఁక యెత్తి శకృన్మూత్రంబులు విడుచుచు నడిచిపడి
     యుసుఱు విడుచు కొలందికిఁ జేరి చేష్టదక్కెఁ గేశిముఖాంతర్గతం బగునయ్యదు
     నందనుకరంబు మేఘమండలంబులోనఁదూఱిన ఘర్మాంతఘర్మకరునియుద్దీప్తకరంబు
     పగిది శోభిల్లె నంతం గ్రమంబున జిహ్వ పెఱికి పండ్లు రాల్చి తాలువులు నురిపి
     కంఠనాళంబు దెజపిసేసి యురంబుసొచ్చి యుదరంబు గలంచి ప్రేవులు చిదిమి
     జీవునిం గదల్చి దామోదరదోర్దండంబు దండధరుదండంబునకుఁ బ్రతికల్పించి
     నట్లు శౌర్యశిల్పంబునం బరఁగి యా చేయు నవ్విరోధికడుపులోన నంతకంతకు బలిసి
     బలిసి పిక్కటిల్లినం గ్రకచంబునం బాపినట్లు రెండు వ్రయ్యలై దైతేయుకాయంబు
     మహీతలంబునం బడి వజ్రధారాదళితం బైనధాత్రీధరంబుభంగి యయ్యె
     నిశాచరుదశనాగ్రంబులు సోఁకి జీరలు వాఱిన వాసుదేవునిభుజంబు వన్యదంతావళ
     దంతకాండక్షతంబుల భూషితం బగువృద్ధతాళద్రునుంబు ననుకరించె నివ్విధంబున
     నరివధం బాపాదించి యపూర్వలక్ష్మీవిభాసితుం డై యున్నవెన్నునిం గనుంగొని.113
ఉ. గోకులవాసు లందఱును ఘోరవిపజ్జలరాశి యీఁది యు
     త్సేకసమగ్రు లై యెలమిఁ జెందిరి గోపిక లేఁగుదెంచి యా
     లోకనపుష్పదామముల లోలత ముంచిరి గోపవృద్ధు ల
     వ్యాకులబద్ధు లై నుతిశతార్చనభంగులఁ గొల్చి రాతనిన్.114

కేశినాశంబునం బ్రీతుండై నారదుండు శ్రీకృష్ణుని నభివర్ణించుట

వ. అయ్యవసరంబున నారదుం డంతరిక్షంబునం దంతర్హితుం డై యుండి పుండరీ
     కాక్షుం బేర్కొని తనపేరు చెప్పి.115
ఉ. ఎయ్యెడ గయ్యము ల్గలవొ యెవ్వరు చివ్వలకుత్సహింతురో
     క్రుయ్యక యంచుఁ గోరి వెసఁ గ్రుమ్మరుచుండుదు నెందు నేను నేఁ
     డియ్యెడఁ జూచితిం గలిగి యేఁకటవోవ భవత్పరాక్రమం
     బయ్య కుమార యిప్పనిక యర్థి మెయిన్ దివినుండి వచ్చితిన్.116

క. ఇంతింతపౌరుషము లొ, క్కింతయు మసిముట్టకుండ నిటు సేయఁగ దై
     త్యాంతక త్రిపురాంతకుఁ డొకఁ, డింతియ నీయంతవార లన్యులు గలరే.117
మ. హయదేహుం డగునిమ్మహాసురుని వృత్రారాతియున్ సంగర
     క్రియలం దార్కొన నోపఁ డిట్టిబలియుం గ్రీడాయితస్ఫూర్తి వి
     స్మయసంపాదిని గా జయించితి మదిన్ సంప్రీతి నే నొందితిన్
     జయ మెల్లప్పుడు నిట్ల గైకొనుము సత్సమ్మోదసంపాదనన్.118
తే. క్లేశ మొక్కింతయును లేక కేశి నిట్లు, గీటడంచి జగత్రయక్లేశ ముడిపి
     తట్లుగావున గోవింద యఖిలమునను, నీవు గేశవుం డనుపేర నెగడు దింక.119
ఉ. పూతనఁ గూల్చు టాదియగుభూరివిభూతులు సూచి యెంతయుం
     గౌతుక మొప్ప నీదెసన కన్నిడి యుండుదు నింక భారత
     క్ష్మాతలనాథులుం బెనఁగుకాలముఁ జేరువ యయ్యెఁ దత్సమా
     ఘాతనకేళికై యిటులు గాదె జనించితి నీవు మేదినిన్.120
వ. కంసవధానంతరంబ చచురంతధరణిం గలధరణీపతులు నిన్నాశ్రయించెదరు రాజా
     సనస్థితుండ వై రాజుల నొండొరులతోడం దలపెట్టి నీ పుట్టినపని తుదిముట్టం
     జేయము మరణభాజు లగుభూభుజులకు నర్హంబు లగునగర్హితస్వర్గంబులు
     వర్ణించి దివిజపతి విభజించుచున్నవాఁ డీదృశంబు లగుభవదీయకర్మంబు లఖిలం
     బులును శ్రుతిపురాణపరిణితంబు లై విప్రగణంబులవలన వెలయం[39]గలయవి.121
క. నీ వవనీదేవతలను, దేవతలుగఁ జూతు వారు తిరముగ వినుఁ జే
     తోవృత్తి నూఁది యుండుదు, రేవిధమున బ్రోవుమయ్య యెప్పుడు వారిన్.122
ఉ. ఆద్యుఁడ వాదిదేవుఁడ వనంతుఁడ వుత్తమరూపబోధతా
     హృద్యుఁడ వుద్యతాఖిలసహేతుకసృష్టివిధాయి పుద్భవ
     ఛ్ఛేద్యనవద్యవీర్యుఁడవు సిద్ధుఁడ వీపు భవన్నమస్క్రియా
     స్వాద్యసుధారసం బెపుడుఁ జాలఁగఁ గల్లెడు మాకు నచ్యుతా.123
వ. అని సంభాషించి నారదుం డరిగె నయ్యుదారఫణితులకుఁ బ్రణయప్రమోద
     మేదురమానసుం డగుచు మాధవుండు తత్కాలసమాగతు లయినసఖులుం
     దానును ననురూపాలాపంబులఁ గొంతసేపు వినోించి తదనంతరంబ నిజేచ్ఛ
     నుండె నంత నక్కడ.124
క. వరతురగంబులఁ బూనిన, యరదముతో బురము వెడలినదియాదిగఁ ద
     త్పరమతి నెందును నిలువక, తెరు వక్రూరుండు నడచె దివసం బెల్లన్.125
వ. ఇట్లు నడచి వ్రేపల్లె గదియు నవసరంబున.126
మ. తనగోవుల్ నిఖిలాశలం జెదరి మోదంబార వర్తిల్లఁగా
     దినవిచ్చేదమునందు వానిఁ జరమాద్రిప్రాంతకాంతస్థలం

     బునకుం దెచ్చె నితండు గోపతి యనంబోలు న్నిజం బింకఁ దా
     నును విశ్రామము నొందుఁ బొ మ్మనఁగ భానుం డేఁగె నస్తాద్రికిన్.127
ఉ. అప్పుడ యశ్వరూపధరుఁ డైనమహాసురు వ్రచ్చి నెత్తుటన్
     దొప్పఁగఁదోఁగి యున్ననవతోయజనాభునిమేనితోఁ గరం
     బొప్పఁగ మచ్చరించుక్రియ నుష్ణకరాస్తమయంబుపిమ్మటన్
     గప్పెడుక్రొత్తసంజ గడుఁగాంతి వహించె నభంబు గన్గొనన్.128
తే. కేశి ననిలోనఁ గూల్చినఁ గినిసి బహుని, శాచరశ్రేణి కృష్ణుపై సమదవృత్తి
     నెత్తి తోతెంచెనో యన నెల్లదెసలఁ, గ్రమముతో బర్వె ఘోరాంధకారవితతి.129
మ. ఇనుఁ డస్తాద్రికి నేఁగె నింతటన యిం కేరాత్మ తేజంబు చ
     య్యన సుద్దీప్తము చేయకున్న భువనం బత్యుద్ధతధ్వాంతసం
     జనితోగ్రాపదఁ బొందదే [40]యనఁ గృపాసంయుక్తుఁడై వచ్చుచా
     డ్పున నున్మీలితరోచి యయ్యె విదుఁ డాపూర్ణాకృతిం బ్రాగ్దిశన్.130
క. తారకములచేఁ గడునొ, ప్పారెడుదివి యొప్పిదంబ యబ్బెఁ దగదె యీ
     గారవ మనఁగా భువియును, గైరవవికసనవిలాసకలనఁ దనర్చెన్.131
వ. ఆ సమయంబునం జంద్రోదయోల్లాసంబున విభాసమానంబు లగుగోసహస్రంబు
     లజస్రతరంగంబులుగా నత్యంతసంకులంబు లైనగోవులం బేరువేరం బిలుచు గోపా
     లకులయెలుంగులను దుహ్యమాన లగుధేనువులదుగ్ధధారానివహంబుల నితాంత
     నినదంబుల నొండొంటిం బ్రేముడించి సమ్ముఖంబు లగుదోగ్ధ్రీవత్ససముదయం
     బుల విపులధ్వానంబుల నొకమ్రోఁతగా మ్రోయుచుం బయఃపయోధిం బురు
     డించునందగోపుఘోషంబునకు నవిరతరథనినాదమధురంబుగాఁ జనుదెంచి
     యక్రూరుండు తదీయమధ్యంబున ననంతసహితుం డైయున్న యాదిదేవు నాది
     మూర్తిపగిదిఁ దదభిన్నభావుం డగుబలదేవుండునుం దానును విలసిల్లు వాసుదేవు
     నంతంతం గని హర్షతరంగితం బగునంతరంగంబును బాష్పధారాపరిఫ్లుతంబు
     లగునపాంగంబును బులకపరికలితం బగునంగంబును నై యతండు.132
మ. ఇతఁడే విశ్వగురుండు సర్వవరదుం డీశుండు నారాయణుం
     డతిలోకాద్భుతభూరివిక్రముండు దేవార్థంబుగా ధాత్రి కా
     గతుఁ డైనాఁ డితనం బ్రమోద మెసఁగంగా నిట్లు గంటిం గృతా
     ర్థత నే నొందితి మత్సమాను లిట తథ్యం బెవ్వ [41]రిం దేడ్తెఱన్.133
క. త్రైలోక్యమోహనం బగు, లాలితనవయావనంబు లక్ష్మీపతి కు
     న్మీలిత మైనది వినమే, బాలక్రీడలు విచిత్రభంగులు గావే.134
చ. వెలికిలి సెజ్జమీఁదఁ గడు విప్పగుకన్నులచాయ లొప్పఁ జె
     క్కిలి గిలిగించి వ్రేతలు నగింపఁగ నుండుట యాదిగాఁగఁ జె

     న్నలరెడు నిమ్మహాత్మునిసమంచితశైశవముం గ్రమంబుతో
     విలసితదృష్టియం దనుభవించినయాజను లెట్టిధన్యులో.135
తే. అయ్య శ్రీకృష్ణ యిందు రమ్మనుచు బోయి, కౌఁగిలింతునొ యటుగాక కమలనాభ
     యాదిపూరుష యచ్యుత యని ప్రణామ, మాచరింతునొ రెండుగృత్యములు నాకు.136
వ. అనుచుఁ దదీయదివ్యరూపంబు నిరూపించి నిర్నిమేషంబు లగువీక్షణంబులతోడ.137
సీ. గోపికానయనచకోరపూర్ణేందు వివ్వదనంబు మధురవాగ్వైభవంబు
     లక్ష్మీస్తనాభోగలాలితం బిమ్మహావక్షంబు శ్రీవత్సలక్షణంబు
     దైత్యనిర్మథనదుర్దాంతదివ్యాయుధార్హంబు లీభుజము లత్యాయతములు
     త్రైలోక్యనిత్యశరణ్య మీచరణద్వయంబు నిసర్గరక్తాంగుళీక
తే. మీతనికె కాక యమరునే యిత మూర్తి, కీలసన్మేఘ సమవర్ణుఁ డీసుపర్ణ
     పర్ణవాసుఁ డీకౌస్తుభోదీర్ణహారుఁ, డచ్యుతుఁడు సర్వదేవతాభ్యర్చితండు.138
క. మునుమున్న కాదె యార్యులు, వినుతనిజజ్ఞానదృష్టి విధిఁ దిరముగఁ గ
     న్గొని కడకట్టినవా రీ, తనియీదృశభావచేష్టితము లఖిలములున్.139
వ. ఈ నారాయణదేవుం డాదేవాదిచతుర్విధభూతహితంబు గోరి దేవకీగర్భంబున
     నావిర్భవించి వసుదేవప్రయత్నంబునం బెరిఁగి వ్రేపల్లె నుల్లసితబాల్యయావన
     విజృంభితంబు లగువిహారంబులు గ్రమంబున నాదరింపం గలవాఁడు తొల్లి బలి
     యడంచి బలసూదనునకుం ద్రైలోక్యాధిపత్యం బొసంగిన[42]కరణిఁ గంసుని వధియించి
     యుగ్రసేనునకు రాజ్యం బిచ్చి తాను రాజు గానొల్లక యుండెడు నఖిలరాజ
     న్యులు ననన్యసంశ్రయు లై తనశాసనం బొనర్ప దర్పంబున నాత్మీయవంశ్యు
     లెవ్వరిం గైకొనక పృథ్వి యంతయుం దార కైకొని కులంబు వెలయింతు రిది
     యంతయు నేను మహాత్ములవలన వింటి నిమ్మహాదేవునకు నభివందనపూజాస్తో
     త్రాదులు పవిత్రనిష్ఠ ననుష్ఠించి బగుభద్రంబు నొందెద.140
ఉ. ఈతనియట్ల సత్కృతుల కెల్లను బాత్రము రాజతాద్రితు
     ల్యాతతశుభ్రదేహుఁడు మహాభుజుఁ డీబలభద్రుఁ డప్రతీ
     ఘాతము లైనవిక్రమవికాసములం దనభూతభావిలీ
     లాతతి నుజ్జ్వలంబుగ నలంకృతి సేసినవాఁడు మేదినిన్.141
క. శ్రుతవంతు లైనవిప్రులు, శ్రుతివిధులం జొచ్చి యరసి చూచియెఱిఁగి రు
     ద్ధృతమతులై యివ్విష్ణుని, యతర్కితానేకవిస్మయావహమహిమల్.142

అక్రూరుండు వ్రేపల్లెకు వచ్చి శ్రీకృష్ణుని దర్శించుట

వ. అని తలంచుచు ససంభ్రమగమనంబునం జని గోపాలదేవ శ్రీపాదపద్మంబు
     లకు నిజగోత్రనామసముచ్చారణపూర్వకంబుగా బ్రణామంబు సేసినం బ్రీతుం
     డై యెత్తి కౌఁగిలించికొని యప్పరమేశ్వరుండు కుశలం బడిగి బలదేవసహి

     తుండై యతని నభ్యంతరగృహంబునకుం దోడ్కొని చని యథోచిత ప్రతిపత్తి
     యాచరించె నయ్యక్రూరుం డతిక్రూరశిక్షకుం డగు పుండరీకాక్షు సాక్షాత్పరిరంభ
     ణంబున నపగతరోషుం డై తద్గోష్ఠంబునఁ దత్కృతపరిపూజనంబునం బ్రాప్త
     సుకృతసంగ్రహగరిష్ఠంబును దదాలోకనాదరంబున విగళితమోహంబును నగు
     నిజదేహంబు మాహాత్మ్యంబునకు భోజనంబుగాఁ గృతప్రయోజనం బగుజననం
     బునం బరగిన వానింగాఁ దన్నుం దలంచుచు నాక్షణంబ నందగోపాదిగోపాలుర
     నందఱ రావించి.143
మ. తనసంపూజ్యశరాసనంబునకు [43]నుత్సాహంబుతో నుత్సవం
     బొనరింపంగఁ గడంగెఁ గంసుఁ డురుబాహుం డోలి మీమీయరుల్
     గొని రం డామేఱకున్ ఘృతప్రముఖముల్ గూడంగఁ దెం డింతప్రొ
     ద్ద నెఱి న్వెల్వడి యేఁగుఁ డమ్మధుర కు[44]ద్యత్ప్రీతి సంధిల్లఁగన్.144
వ. ఆ రాజపుంగవుం డీరామదామోదరుల నుదారవీరవ్రతధౌరేయు లనఁగా విని
     యుండుం గావున నమ్మహోత్సవకాలంబున వీరిం గనుంగొనువేడుక నిట పుత్తెంచె
     రేపు రథారూఢులం జేసి తోడ్కొని పోయెద మీరు ముందరఁ గదలుం డని
     చెప్పె నంత నుచితక్రియానంతరంబ.145
మ. అతఁడుం దానును నొక్కబంతిన విచిత్రాహారము ల్గోరస
     ఫ్లుతిహృద్యంబుగాఁగఁ గైకొని దయాలోలాత్ము లారోహిణీ
     సుతదామోదరు లొక్కచోటన మహాశోభాఢ్యశయ్యోపరిం
     జతురప్రీతి శయించి కార్యకథనాసంసక్తిమై నున్నెడన్.146
వ. ఆ రహస్యస్థలంబున నక్రూరండు దనుజారి కి ట్లనియె.147
మ. జననింబుట్టినయప్డు పాసి యడవిన్ జాత్యంతరాభాససం
     జనితం బైనలఘుత్వ మి ట్లొలయఁగా సంవృద్ధిఁ బ్రాపించి నీ
     వనఘా క్రీడలు సల్పి తింక వల దీవ్యాసంగ మాత్మీయమై
     చనువంశంబును శీలముం గడుఁబ్రకాశం బొందఁజేయం దగున్.148
మ. యదుభోజాంధకకోటికెల్ల నొడయం డాకంసుఁ డారాజుపం
     పు దగం జేసినవాఁడవై మధురకున్ భూరిప్రమోదంబుతో
     యదువీరోత్తమ రమ్ము కార్ముకమహావ్యాజంబునం బేర్చుత
     ద్విదితశ్రీవిభవం బపూర్వగరిమన్ వీక్షింపు పెం పేర్పడన్.149

అక్రూరుఁడు శ్రీకృష్ణునితో దేవకీవసుదేవులపరితాపంబు చెప్పుట

వ. అటమీఁద నెయ్యది కర్తవ్యం బది నీవ యెఱింగెద వింక నొక్కం డాకర్ణిం
     పుము.150

సీ. మీతండ్రి వసుదేవుఁ డాతతయశుఁ డిట్టి సుతుల నిద్దఱఁ గన్నసుకృతశాలి
     యనిశంబు గంసభయంబున డెందంబు తటతట నదరంగఁ గుటిలుఁడైన
     యవ్విపక్షునిచేత నవమానవాక్యచయంబులం బడిపడి యాసమాలి
     కన్నప్డ [45]కొడుకులఁ గానపా ల్పఱిచి తా శోకంబు బ్రాణసంశోషకముగ
తే. నున్నవాఁ డమ్మహాత్ముని నుద్ధరింపఁ, దగదె యిఁక నెన్నఁటికి నీయుదారశక్తి
     చూచెదవు గాదె యావృద్ధు నీచనృపతి, సేవ నెబ్భంగిఁ గాఱియఁ జివికినాఁడొ.151
క. కొలువున నొక్కొకమఱి యా, ఖలుఁడు భవజ్జనకుఁ బలుకఁగానిపలుకులం
     బలుకఁగ విని యే మెల్లం, దలలు వనట వ్రాల్తు మశ్రుధారలు దొరుఁగన్.152
క. వసుదేవుపాటుకొలఁదియె, యసదృశచారిత్ర యైనయాదేవకి పు
     ణ్యసతీతిలకము మీత, ల్లి సతతముం బొక్కుతెఱఁగు లెక్కింప మదిన్.153
సీ. దుఃఖాతిభరమునఁ దొమ్మిదినెల లుదరంబున భరియించి క్రమముతోడఁ
     గానంగఁ గానంగ గర్భము ల్దోడ్తోన కంసుఁ డొక్కింతయుఁ గరుణ లేక
     తునిమెడుదురవస్థ కనయంబు నోర్వంగ నమ్మనస్వినియ కా కన్యసతులు
     గలరె యక్కట పుత్రు లెలమితోఁ, గుడిచినచన్నులె యాతల్లిచన్ను లనఘ
తే. యెఱుఁగునే పూర్ణచంద్రుని నెనయునట్టి, నీదు నెమ్మోము [46]ముద్దియ నిక్కమునకు
     గుఱుతుగలదె యాయమ్మకుఁ గొడుక వీవు, నెఱపవలవదె పుత్రత్వనియతఫలము.154
క. విలయార్ణవమగ్న యయిన, యిల నాదివరాహమూర్తి నెత్తవె యాప
     జ్జలనిధి మునిఁగిసజననిం, దొలఁగఁగ వెడలించువెరవు దొరకొల్పు మెదన్.155
చ. ఉడుగక కన్నునీరఁ గడు నొప్పఱి చాయలు చెడ్డకన్నులున్
     వెడఁగురుపడ్డమోముఁ బటువేదనఁ గుందినయంతరంగమున్
     బడుగయి యున్న మేను నయి భామిని వత్సవిహీనధేనువుం
     దడపఱుపంగవచ్చుఁ దనదైన్యము శూన్యతయుం గనుంగొనన్.156
క. నీయట్టికొడుకుఁ బడసియు, నాయమ్మ దురంతదుఃఖ యగునేని సుత
     శ్రీ యింతులకు నిరర్థక, మాయతవంధ్యతయ లెస్స యనఁగాఁ దగదే.157
తే. అకట సర్వలోకంబుల కభయ మిచ్చి, కావఁ జాలినవాఁడవు కన్నతల్లి
     దండ్రు లిట్లార్తిఁ దలరంగఁ దలఁప కునికి, మెచ్చుగాదు నావాక్యంబు లిచ్చగింపు.158
సీ. కాలాభుఁ గాళియుఁ గడతోఁకపట్టి యేవెరవున వ్రేసితి విషము గ్రక్క
     దుర్ధరతమము గోవర్ధనం బెత్తి యేకడిమిమైఁ దాల్చితి గొడుగు గాఁగ
     దుష్టచరిత్రు [47]నరిష్టుని ముట్టి యేయనువునఁ ద్రొక్కితి వసువు లెడల
     దారుణబలుఁ గేశిదానవుఁ గిట్టి యేయేపున వ్రచ్చితి రూపఱంగ
తే. నాదిఁ బూతనాశకటఘాతాదులందుఁ, దెలివి దలకొంటి వట్టి యగ్గలిక నేఁడు
     నాత్మఁ బాటింపు మహిత[48]శోకాభితప్తు, లైనగురులు నిశ్శోకత నందుపనికి.159

వ. అని యక్రూరుం డనేకక్రమంబులం జెప్పిన వాక్యంబుల యభిప్రాయం బంతయు
     నెఱింగి కృష్ణుండు కంసవిధ్వంసంబునకు సముత్సుకుం డయెయే నందగోపాలాదులు
     నారాజునకు నయ్యేఁటం బెట్టవలయు నప్పనంబులుఁ బాఁడియావులు నెనుములుఁ
     బొగరుకోడెలు నజాతకప్రముఖంలుఁ గొని గోరసంబులు సాలం గూర్చుకొని
     వేగుజాముగలుగం బయనంబయి కదలిరి తదనంతరంబ.160
తే. తీపు మిగులునక్రూరు నాలాపములకు, నుల్ల మపగతనిద్రమై యుల్లసిల్లె
     నట్లు ప్రియమందుచున్న దైత్యాంతకునకు, నరిగె నవ్విభావరిముహూర్తాభ యగుచు.161
క. రజని తనుఁ బాసి పోవకుఁ, బ్రజనితభయతాపభరవిభాసితవైవ
     ర్ణ్యజితాత్త్ముఁ డయ్యె నితఁ డన, రజనికరుఁడు దొరఁగె రుచిపరంపర యెల్లన్.162
క. కలయఁ గడివోయి యెందుం, జలితములై రాలె నాకసం బనుమ్రానం
     గలపువ్వు లనఁగఁ దారక, ములు గానఁగరాక యడఁలిపోయెం దోడ్తోన్.163
తే. వెరవుతోడ వేఁకువ యనువెజ్జు తూర్పు, దిక్కుకెం పనుమంగునఁ దేర్చె నొక్కొ
     తిమిరకాలాహివిషమూర్ఛనముల ననఁగఁ, దెలిసె నెత్తమ్ము లొప్పులు వలకొనంగ.164
క. గోవర్ధననిర్ఝరముల, పై వేమఱు సుడిసి గోపబర్హమయవతం
     సావలి గదల్చుచును బృం, దావనపవనము మెలంగెఁ దద్వ్రజ మలరన్.165
చ. ప్రమదము లుల్లసిల్లఁ దనుసారఁగ నిద్రలువోయి పల్మఱుం
     గమియ నెమర్చి మే నఱుగఁగాఁ బొరిఁ బెండలు పెట్టి లేచి వ
     త్సములఁ దలంచి పంచితిలి చన్నులు చేపొదవంగఁ బెంపుతో
     గొమరుగఁ జారుహుంకృతుల గోవులు చెన్ను వహించె మందలన్.166
తే. పసులలోనన యెరువుతిప్పలఁ బరుండి, మేలుకని యాలం బిదుకఁగ మెలఁగుగోష్ఠ
     పతుల మెత్తనికడఁక ప్రభాతమునకుఁ, దానతొడవయి వ్రజమహోత్సవ మొనర్చె.167
సీ. కరమూలములజిగి గదలొత్తి వల్గత్కుచోపాంతకాంతుల నొత్తరింపఁ
     దూగాడు హారపఙ్క్తుులదీప్తి వెలవెల్ల నగుదీపరుచులను నతకరింపఁ
     జెదరుకుంతలముల నుదురుల నంటించి చెమట నెమ్మోములఁ జెలువు వెంప
     మంథనధ్వనులకు మార్కొని కమనీయకంకణచలననిక్వణము లెసఁగఁ
తే. గౌను లురియంగఁ బిరుదులుఁ గదలి మేఖ, లావళులఁ గదలింప నేత్రాంశు లలరఁ
     బెరువు ద్రచ్చుచు వేకువఁ బ్రేమమిగులఁ, బాడి రబ్జాక్షు గోపాలభామ లెలమి.168
క. కాళిందీసారసఘన, కోలాహల మద్రిధరునకును శుభయాత్రా
     కాల మెఱిఁగించె సమ్మిళి, తాలోలరథాంగమిథునహర్షధ్వనులన్.169
వ. ఆంత.170
క. కంసాదిసురవిరోధి, ధ్వంసమునకుఁ బోవుకృష్ణు దర్శించుట కా
     శంసఁ జనుదెంచె ననఁగా, హంసుఁడు ప్రాక్పర్వతంబునం దుదయించెన్.171

వ. అయ్యవసరంబునఁ [49]గాల్యకరణీయంబులు నిర్వర్తించి యక్రూరుం డటమున్న
     కృతకర్తవ్యుం డై యున్నగోపాలమధ్యశోభితుం బద్మనాభునిం గాన నరుగు
     దెంచి.172
మ. శ్రుతిసీమంతపదంబులం బ్రకటమై సుస్నిగ్ధసిందూరసాం
     ద్రత రంజిల్లెడు వాసుదేవుచరణద్వంద్వంబు గోష్ఠస్థలీ
     గతుల న్నూతనగోమయంబుల ననర్ఘశ్రీఁ దలిర్చె న్మహా
     ద్భుత మీయొప్పిద మంచు భక్తివినయస్ఫూర్జత్సమస్తాంగుఁడై.173

అక్రూరుండు శ్రీకృష్ణబలరాముల మధురకుఁ దోడ్కొని పోవుట

వ. ఇదె రథం బాయితం బై యున్నయది యగ్రజపూర్వకంబుగా నారోహణం
     బొనర్పు మనిన నతం డట్ల చేయం దాను సారథ్యంబు వహించి వ్రజంబు నిర్గమించి
     మధురామార్గంబు గైకొనియె నంత.174
క. రేయిటనుండియుఁ గృష్ణునిఁ, బాయుటకుం దలరు గోపభామినులు నిజం
     బై యప్పుడు హరివిరహ, వ్యాయతదుఃఖంబు దమ్ము నట పొదువుటయున్.175
వ. కళవళించు డెందంబులతో నందఱు దరతరంబు లై కూడి గోవిందుపిఱుందం దగిలి
     తమలోన.176
శా. అక్రూరుం డను పేరు పెట్టుకొని క్రూరాత్ముం డొకం డద్భుత
     ప్రక్రాంతిం జనుదెంచి పద్మనయనుం బాపెం గటా యెంతయున్
     వక్రంబై కడుఁగీడు సేయుటకు దైవం బిచ్చమైఁ బూనినన్
     శక్రుం డైనను శక్తుఁడే యుడుపఁ దత్సంరంభ మేభంగులన్.177
మ. కులమున్ శీలము మానమున్ మొదలుగాఁ గొన్నాఁడు మున్మున్న య
     గ్గలికం బ్రాణములుం గొనంగఁ గడఁగెం గా కేమి యీకృష్ణుఁ డీ
     వల నీతం డిటువోవఁగా నిజధనుర్వ్యాపారముల్ సూప కా
     వలరాజింతట సైపఁజాలునె మమున్ వామప్రతాపోగ్రతన్.178
తే. ఏటిసంసార మని మన మితనివెనుకఁ, దెగువసేసి పోయితిమేనిఁ దిట్ల కాక
     యడవిపులి మానుసుల నేల యాదరించు, నగరకాంతలవలలందుఁ దగిలి యతఁడు.179
క. [50]కొన్నియనాళులు గోమై, వెన్నుం డి ట్లేల మనకు వేడుకచెయ్వుల్
     కొన్ని గఱపె దైవమ యిం, కెన్నం డీపెన్నిధాన మిట సిద్ధించున్.180
సీ. అదె యిదె లోలనేత్రాంశులు పర్వంగ నధికాదరస్నిగ్ధుఁ డగుచుఁ జూచె
     నదె యిదె నెమ్మొగం బలరుమించులు ముంప నాకూతకౌతుకి యగుచు నవ్వె
     నదె యిదె చారుదంతావళి జిగి యొప్ప నాపూర్ణశృంగారుఁ డగుచుఁ బలికె
     నదె యిదె భావంబు లనుభావముల నూన నభిమతార్థప్రీతుఁ డగుచు మెచ్చె

తే. రండు కూడంగఁ వేగఁబొదండు మనమ, నోరథచ్ఛేది గాకుండఁ గోరి యాఁగి
     యితనిఁ బోనీక నిలుపుద మింతదలరు, వారిఁ గొనివోవ కెట్లు పోవచ్చుఁ దనకు.181
తే. ఏల వ్రేపల్లె పెద్దవా రిట్లు వెఱ్ఱి, గొనిరి కృష్ణుఁ బోనిచ్చినఁ గ్రూరులైన
     రక్కసులులోనుగాఁ జేయు క్రందు నెల్ల, నుడుపఁ దమకు దిక్కైన వాఁ డొరుఁడు గలఁడె.182
చ. అని పలుమాట లాడుచును నప్పుడ చెందినడప్పి నంగముల్
     దనుత వహించి భూషణవితానకము ల్పడలంగఁ గ్రొమ్ముడుల్
     గనుకని వీడి యుజ్జ్వలశిఖామణు లొల్కఁగ నుత్తరీయముల్
     చనుఁగవలం దొలంగి వివశస్థితి నొందుచుఁ దూలియాడఁగన్.183
సీ. వెఱపులు పైకొని వెఱఁగుపాటులు వొంది చెమటలు పెల్లయి చేష్ట లుడిగి
     వైవర్ణ్యములు సెంది వడఁకులు దొడరి యశ్రులు మీఱి గద్గదికలు గడంగి
     రోమాంచములు వేర్చి వైమనస్యము లూని ప్రేమంబు నెలకొని కామ మలరి
     తాపంబు లెసఁగి చింతలు విజృంభించి వంతలు మాఱుకొని విముగ్ధతలు బలసి
తే. తనుకరాక గోవిందునిఁ దగిలి చిక్కు, వడినచూపులు దిగువ నుపాయ మేది
     కొఱలి మిన్నక నిలిచిరి గోపకాంత, లందఱును జిత్రరూపులయట్టికరణి.184
వ. అక్రూరుండును నిజరథం బతిత్వరితగతిం జననిచ్చిన నయ్యింతు లంతట భూర
     జంబు లోచనగోచరంబగునంతఁదాఁకఁ జూచుచుండి యనంతరంబ యాశాచ్ఛేద
     నంబున ఖేదం బొదవఁ గ్రమ్మఱి రట భోజపతి మాధ్యందినకాలంబునం గాళింది
     సేరి తత్తీరంబునం గదంబచ్ఛాయాశీతలం బగుసికతాతలంబున నిలిచి.185
శా. ఏ నొక్కించుకసేపు పుణ్యనదిలో నివ్వేళ కర్హంబుగా
     స్నానాద్యుక్తవిధానము ల్నడపెద న్నావచ్చునందాఁక మీ
     రీనిర్దోషమహీస్థలిన్ రథముపై నింపారఁగా నుండుఁ డ
     మ్లానం బైనతృణోత్కరంబు హయముల్ సంప్రీతితో మేయఁగన్.186
వ. అని పలికి సవినయంబుగా సంకర్షణదామోదరుల నునిచి చని యతండు.187
క. సరిబాహ్యాంతరశుచితా, పరుఁడై మును వార్చి తీర్థపరికల్పితవా
     గ్విరచనతోడఁ బ్రవాహాం, తరము ప్రవేశించె నాభిదఘ్నజలములన్.188
వ. చిరతరస్నానం బొనర్చుచుఁ (గృష్ణనామోచ్చారణం బొనరించుచుం) గ్రుంకి రసా
     తలలోకంబు గని యందు వాసుకికర్కోటకప్రముఖనాగకులసంకీర్ణం బై సౌవర్ణ
     రచనాసురుచిరం బగువినూత్ననవరత్నమండపాభ్యంతరంబున.189

శ్రీకృష్ణుఁ డక్రూరునకు యమునాజలంబులలోఁ దనమహానుభావంబు చూపుట

సీ. ఫణసహస్రంబునఁ బ్రజ్వరిల్లెడురత్నదీప్తు లుద్దీపితదీపములుగ
     సర్వాంగనిర్మలచ్ఛాయావిజృంభణం బాలోకచంద్రిక యై తలిర్ప
     [51]భక్తనిర్విషనేత్రభావపరంపర [52]లమృతమానస్ఫూర్తి నలమికొనఁగ
     నాలోలజిహ్వాలతావళి యుద్దామవిద్యుత్తటిల్లీల విస్తరింప

తే. బొలుచుతనమేనిమడఁతలఁ బొదివి శిరము, లెత్తి నిలిచి పార్శ్వంబుల నెసక మెసఁగ
     ముసలసీరతాళధ్వజంబులు దనర్ప, వేడ్కతోఁ బొల్చునాభోగివిభునిఁ గనియె.190
క. ఆతనియంకతలంబునఁ, బ్రీతిం గూర్చున్నదేవుఁ బృథుమేచకజీ
     మూతనిభుఁ గమలలోచనుఁ, బీతాంబరుఁ గృష్ణుఁ జక్రభృత్కరుఁ గాంచెన్.191
వ. కని భాగవతంబు లగుమంత్రంబులు జపియించుచు సహస్రనామవిఖ్యాతుం డైన
     యాసహస్రావతారు నుదారసహస్రకరసహస్రసదృశవిభావిభాసమాను వాసు
     దేవు దేవతారాధ్యు నాత్మమనస్సంకల్పితంబు లయిన వివిధార్చనాద్రవ్యంబుల
     నవ్యాహతార్చనాతోషితుం గావించి తన్నుఁ గృతార్థుంగాఁ దలంచుచు
     జలంబులు వెలువడి వచ్చి.192
ఆ. రథముమీఁద నున్న రామకేశవుల దే, హంబులందుఁ దత్సమర్పితంబు
     లైనయట్టిపూజ లట్ల యుండఁగఁ జూచి, యద్భుతంబు రెట్టియై జనింప.193
వ. క్రమ్మఱ నుదకంబులోను సొచ్చి యఘమర్షణజపం బొడంగూడ నిమగ్నుం డై.194
మ. మును భోగీంద్రునియున్నతాంగమున సమ్మోదంబుతోఁ గల్పితా
     సనుఁడై [53]శాంతిఁ దలిర్చునిత్యవిభుతాసంపన్ను నారోహిణీ
     తనయుం దన్మహితాంకపీఠగతుఁడై తా నొప్పుశ్రీమంతు న
     వ్వనజాక్షుం గనియెన్ సురాసురమునివ్రాతార్చ్యమానాత్ములన్.195
క. కని వెలుపల నరదముపైఁ, దనరెడువీ రేల యీయుదకగర్భం బిం
     తనయిట్లు చెంది రిది యె, ట్లని వెండియుఁ గ్రొత్తచోద్య మాత్మకు నొలయన్.196
వ. యమునాహ్రదంబు నుత్తరించి యనుష్ఠానశేషం బనుష్ఠించి చనుదెంచి యెప్పటి
     యట్ల మందరస్యందనోపరితలంబున నన్యోన్యవచనావలోకనలాలసు లై విలసిల్లు
     బలదేవవాసుదేవుల నాలోకించి కదియ వచ్చినం గని కృష్ణుండు.197
మ. తడవయ్యెం జని యాప్లవంబుతఱిఁ బాతాళంబులో నీకు నే
     ర్పడ నేమేనియుఁ జోద్యమైనయది దృగ్భావ్యంబుగాఁ బోలు నె
     క్కుడుసంభ్రాంతి ముఖంబున న్వెలసె నక్రూరాత్మ యక్రూర నా
     వుడు నాతండు వినమ్రుఁడై మధురతాభ్యుత్పన్నవాక్యంబులన్.198
వ. దేవా దేవరసన్నిధి సేయుటకంటె మిగులం జోద్యంబు లొండెయ్యవి యిక్కడ
     నగ్రజసహితంబుగా నీ వి ట్లుండి ప్రసన్నుండవై యక్కడ జలనిమజ్జనకాలంబున
     భవదీయసాన్నిధ్యంబు ప్రసాదించితి కృతార్ధుండ నైతిఁ గమలాసనాదులకును
     నీయున్నరూ పెఱింగి వినుతింప దుర్లభంబు నే నెంతవాఁడం గేవల వాత్సల్య
     నిమగ్నుండ వై యనుగ్రహింపుము.199

మ. జయ సర్వాత్మక సర్వభూత[54]విభుతా సంభావ్య సర్వజ్ఞ స
     ర్వయుగోత్పత్తిసమాప్తిరీకర్మకలనావర్ధిష్ణువిద్యావిని
     శ్చయధౌరేయ సమస్తవిస్మయవిధాసంధాయకప్రక్రియా
     నయనిష్ఠావనతార్తినోదనధురీణవ్యాప్తిరంజత్కృపా.200
వ. అని వినుతించి యిక్కడం దడయ వలవదు కంసుండు మీకు నెదురుసూచు
     చుండుఁ బ్రొద్దుపడకమున్న యతనిం గానవలయు విజయంబు సేయుము.201
క. నా విని యల్ల నగుచు న, ద్దేవుం డదియట్ల నీవు దెలిపినత్రోవం
     బోవఁగలవార మే మనఁ, గా వేఱొకఁ డెద్దియైనఁ గలదే యనినన్.202
వ. రథ్యంబులం దెచ్చి యుగంబునందు సంయోజించి భోజపుంగవుండు ప్రతోద
     పాణి యై రథంబు నడప నదియునుం జని యారోహితార్కం బగుకాలం
     బునఁ గంసనగరంబు ప్రవేశించె నప్పుడు గృష్ణుండు.203
క. పుట్టినకోలెఁ బురశ్రీ, లెట్టివొ యెన్నండుఁ జూచి యెఱుఁగనిమా కి
     ప్పట్టున నించుకపడి యి, ప్పట్టణమున మెలఁగి చూడఁ బడదే యనఘా.204
వ. కంససందర్శనం బైనపిమ్మటం జూచునంతటి విలంబనం బోర్వము దీని కొడం
     బడు మనిన నక్రూరుం డట్ల కాక మీ రట్ల చేయుం డిప్పటికి వసుదేవుసదనంబున
     కరుగుకోర్కి యుడుగవలయు నట్టిద యైన నొండుచందం బై వచ్చుఁ గంసుండు
     మీనిమిత్తంబున మీతండ్రిదెసం బరుసనై యున్నవాఁడు తన్ను మొగపడక
     ముందర నతనిం గనిన నెంతయుం గలుషించు నని చెప్పి వారి నరదం బుడిగించి
     తదాగమనంబు నృపతికి నివేదించుటకై ప్రమోదం బెసంగఁ జనియె నని
     యక్రూరుచరితంబు సమధికరసభరితంబుగా వైశంపాయనుండు వివరించిన తెఱంగు.205
శా. థా ధాత్రీధన్యపరిగ్రహా గురువచోదత్తస్థిరానుగ్రహా
     మైత్రీతోషితసజ్జనాపరిహృతోన్మార్గప్రమాద్యజ్జనా
     చిత్రోగ్రాజిధనంజయా నియమవచ్చేతస్స్థమృత్యుంజయా
     జైత్రోద్యోగసదుత్థితా బుధకథాసామర్థ్యసంప్రార్థితా.206
క. శక్తిత్రయధౌరేయా, యుక్తచతుర్భద్రసంప్రయుక్తోపాయా
     భుక్తనిఖిలపురుషార్థా, రక్తసమస్తప్రజాభరణచరితార్థా.207
మాలిని. శ్రుతసకలపురాణాసూక్ష్మబుద్ధిప్రవీణా, జితసకలసపత్నాస్వీకృతానేకరత్నా
     కృతసకలసుకర్మా కీర్తనీయస్వధర్మా, గతసకలకళంకా కాంతిరాకాశశాంకా.208
గద్యము. ఇది శ్రీ శంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవశంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
     ప్రణీతం బైనహరివంశంబునం బూర్వభాగంబునం దష్టమాశ్వాసము.

  1. కంకణోర్మికి దొడవై యొప్పు నిడుదకేల్దోయి
  2. ఎలయీటిబోదలయిరపున
  3. గడలడి
  4. వింత
  5. త్థానంగ
  6. గ్రోలు
  7. రాహస్య
  8. మయుఁడై రహస్యం
  9. నొకతె నొకతె బొలుపుగఁ గూడన్
  10. ఁదగనమర్చి.
  11. విమా క్తికములు
  12. యానకాండంబు
  13. లేవు దప్పిదమేన
  14. పల్లవ
  15. విభ్రమక్రమము మెఱసి
  16. ననాద్యవయవౌఘంబులు దనరె ననఁగఁ
  17. కోడాడి
  18. కొప్పరేఁచి; కొప్పరించి.
  19. రుషభప్రౌఢభుజద్వయంబునను
  20. కరణి
  21. పర్ధించుచున్న
  22. రూప
  23. ముప్పూఁటలదినమునంద (పూ. ము.)
  24. దీప్యద్దానవా
  25. న్వినరె
  26. యడ్డంబు
  27. వీవు
  28. పెట్టఁజూడ
  29. నిట్టు లొడమిన
  30. గోపసమేతముతోఁ బొసంగఁగా
  31. మ దింతగనుట
  32. యెల్లఁ బెల్పఱచి
  33. నిర్వచనంబులం
  34. మన్మత్తాతి
  35. మిత్తినై
  36. లుద్యక్షిప్తపక్షంబునన్ - (పూ. ము.)
  37. స్థితి
  38. నాలిక
  39. బాలివి
  40. యనుచుఁ దా సంరక్తుఁడై
  41. రీయింతటన్
  42. పగిది
  43. మోదం బారఁగా
  44. ందత్ప్రీతి
  45. బిడ్డలఁ
  46. ముద్దీయ
  47. డరిష్టుఁడన్ యసుర నే
  48. వంశాభి
  49. నాల
  50. కొన్నిటి నాళులు
  51. భరితదుర్విషనేత్ర
  52. లమృతాయతస్ఫూర్తి
  53. కాంతి
  54. వినుతా