హరివంశము/పూర్వభాగము-షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు

హరివంశము

పూర్వభాగము - షష్ఠాశ్వాసము

హరివంశము.pdf

శ్రీకరకవిప్రబంధా
నేకముఖవినిర్గతాత్మహితకీర్తిసుధా
నేకధవళాయమానమ
హాకమలభవాండధామ యన్నమవేమా.

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పినట్టివర్తనంబులఁ గొంతకాలంబు
నడపి యమ్మహాప్రభావుం డగువాసుదేవుండు విదితనిజసద్భావుం డగుబలదేవున
కి ట్లనియె.

2


క.

అనఘ విను మొకటి చెప్పెద, నెనయఁగ మన పుట్టిబుద్ధియెఱుఁగుట మొద లి
వ్వనము నివాసం బై నది, మనవారికి నింక [1]నిచొటు మంచిది యగునే.

3


వ.

పెద్ద కాలం బొక్కచోట నునికి వారలకుం బ్రశస్తంబు కాదు దీనన చేసి యిప్పుడు.

4


సీ.

[2]ఎరువుతిప్పలుగొని యెల్లమందలు [3]గొనుజెక్కి మేపుడుచోటు ద్రొక్కువడియెఁ
దరు లోలి నఱుక మొదళులు సిక్కంగ జొంపము లేది జాడలువడియెఁ బొదలు
మడువులు పసులకాల్మడిఁ బ్రుచ్చె [4]దొరుగండివ్రంకలు పెనురొంపివ్రంతలయ్యెఁ
బూరిపంటలు చెడిపోయె [5]రాయిడిఁ గ్రంపలోనుగా దవ్వులఁ గాని [6]లేదు


తే.

పులుఁగు పూరెడు [7]పోపడి పొలములందు, మెలఁగి వెదకినఁ బుట్టదు మెకము లడఁగెఁ
[8]గూరగాయకట్టియ విల్చికొనఁగ వలసి, యునికి వ్రేపల్లె వీటిపట్టునకు [9]దొరఁగె.

5


వ.

కావున మన మింక నిచ్చోట వసియించుట దుఃఖావహంబు బృందావనంబు
బృందారకవనసుందరం బైనకాననం బందు గోవర్దననామధేయంబునం బరఁగి
యథార్థనామధేయం బగు భూమీధరంబున భాండీరాఖ్యం బ్రఖ్యాతినొంది
నిఖిలవనమండనం బయి యనంతశాఖామండలంబున నుత్కటం బగు [10]వటంబును
విందు మయ్యరణ్యంబునడుమ నమరభువనంబున నమరు నమరనదియునుంబోలె
గాళింది యొప్పారు నవధూతసారం బైనయిక్కాంతారంబు విడిచిపోయి యన్నెల
వున సుఖియింతము మనపల్లెలోని ముదుసళ్లు మచ్చిగ పేర్మి నిచ్చోటు విడువంజాలి

కున్నవా రొక్కకారణంబు గలిగించెద నట్లు సూడు మని పలికి యొక్కింతసే
పూరకున్న యెడ.

6


మ.

జలజాతేక్షణు సర్వగాత్రముల సంజాతంబులై పెల్లుగాఁ
బులులో సింగములో పిశాచములొ నాఁ బొంగారి యొక్కుమ్మడిన్
బలవత్తీవ్రవృకంబు లెల్లపొలమున్ వ్యాపించె గోపాలకా
కులగోవత్సభయంకరంబు లగుచుం గోపప్రదీప్తాకృతిన్.

7


వ.

ఇట్లు పుట్టిన యాక్రూరసత్వంబు లది మొదలుగాఁ దొడంగి.

8


క.

పదియును బదియేనును నిరు, వదియును ముప్పదియు దాఁటువడి నిత్యంబున్
గొదగొని తిరిగి వధింపఁగఁ, గదలఁగరాదయ్యె గొల్లగమి [11]కెచ్చోటన్.

9


సీ.

నీళ్లకు నేటిలోనికి డిగ్గఁగాఁ బెద్దతఱపిపెయ్యలఁ బట్టి [12]నుఱిపె నేఁడు
వడిఁగూడి పాలకావళ్లు దేరఁగ మందవాండ్రను బొరిగొని వ్రచ్చె నేఁడు
వేకువకడఁ బోయి పోఁకు మేయఁగఁ బాడియావులఁ బొదివి చెండాడె నేఁడు
పులికైనఁ జెలఁగి మార్మలయఁజాలెడు మేటియాఁబోతుఁగిట్టి యుక్కడఁచె నేఁడు


తే.

గొల్ల లేముఱినప్పుడు గొఱియకొదమ, [13]నెత్తుకొనిపోవు తోఁడేళ్ల కిట్టిసేఁత
లెందు వింటిమె యని జను లెల్లఁ దల్ల, డిల్ల వ్రేపల్లె తద్దయు డిల్లపడియె.

10


వ.

మఱియును రాత్రిసమయంబున బెబ్బులుల హుంకారంబులును సింహగర్జితంబులు
నుగ్రం బై వీతెంచె మహాదేహంబు లగువరాహంబులు సొచ్చి ఘోణంబున నెల్ల
చోట్లుం గ్రోడాడఁ దొడంగె నంత గోపప్రవరు లంకఱుం గూడఁబడి నందగోప
సమేతంబు దమలోన మంతనంబుండి.

11


క.

ముందటియుత్పాతములకు, డెందంబుల నొచ్చి యిప్పటికి బాయఁగలే
కిం దుండఁగ మన కిమ్మా, డ్కిం [14]దనుకఁగ రానికడిది డెప్పరమయ్యెన్.

12


వ.

బృందావనంబు కడు లెస్సచో టని వ్రేపల్లెలోనివా రెల్ల నెల్లప్పుడుం జెప్పికొను
చుండుదు రందును దుర్గమంబు లగు నెలవుల రక్కసులు గల రనియును విందు
మేమి సేయుద మెక్కడికిం బోద మీ ప్రొద్ద కదలవలయు నింక నిక్కడ నొక్క
దివసం బొక ముహూర్తం బొక్క గడియ యున్నను నంతకంతకు నెంతంత నేగు
లగు నని విచారించుసమయంబున నారదుం డేతెంచి నందగోపు నేకాంతంబునకుం
దోడ్కొనిపోయి.

13

నారదుఁడు నందగోపుని బృందావనంబునకుఁ బోఁబనుచుట

క.

అతనియొనరించువినయం, బతులకరుణ నాదరించి యానందరస
[15]ప్లుతికారిణి యగువాక్య, శ్రుతి నాతని కింపొనర్చుచును నిట్లనియెన్.

14


ఉ.

ఈవనభూమి యీవసతి నెంతయుఁ దప్పి వసింపఁ బట్టు బృం
దావన మొక్కఁ డక్కడయు దైత్యమయం బట యేమి సేయుదున్

భూవలయైకగణ్యు నతిపుణ్యుఁ దనూభవు నెట్లు గాతు నం
చీవు దలంచి యున్కి మది నేఁ గని వచ్చితి నిన్నుఁ [16]దేర్పఁగన్.

15


మ.

విను నారాయణుఁ డాదిదేవుఁడు జగద్విఖ్యాతసత్వుండి మే
దినికిన్ భారము డింప దైత్యుల [17]విఘాతంపంగఁ గ్రీడార్థమై
జనియించెన్ భవదీయసూనుఁ డనఁగా సంఛన్నుఁడై కాన మ
ర్త్యునిఁగాఁ జూడకు కృష్ణు రాముఁడును దత్తుల్యుండ యత్యున్నతిన్.

16


వ.

వీ రిద్దఱు నుద్దామం బగు ధామంబున నపరిభావ్యు లగుభవ్యులు పూతన యను
యాతుధాని యామినీసమయంబున విషదిగ్ధనిజస్తనదుగ్ధంబులు గ్రోల్చి కూల్చెద
నని వచ్చి యచ్చిఱుతవానిచేత నిపాతిత యయ్యె శకటరూపధారి యగు
దారుణదైత్యుం డత్యుగ్రకర్మంబు సేయం దలంచి తలంపులోనన వికలుం డై
కెడసె నిద్ద ఱసురలు మద్దు లై యిమ్ముద్దులపాపనిఁ బాపం డని కొలంది యెఱుం
గక పయింబడి నలుపుద మని పూని యున్మూలనంబు నొంది రింక నిమ్మహా
తేజుం డనేకదనుజధ్వంసంబు సేయంగలవా డిది దేవరహస్యంబు నీమీఁడిపక్షం
బునఁ బ్రత్యక్షంబుగాఁ దెలిపితిఁ గలంక నొందక బృందావనంబునకుం జనుము
శోభనం బయ్యెడు నని చెప్పి బ్రహ్మసూనుండు దామోదరునొద్ద కరిగి సవినయ
సందర్శనం బొనరించి.

17


శా.

త్రైలోక్యంబు సృజింపఁ బెంప నడఁపన్ దక్షుండ వై యింతకున్
మూలం బై యిట నందసూసుఁ డనఁగా ముగ్ధాకృతిన్ లీలమై
బాలత్వంబు నటించునిన్ను మదిలో భావింతు రుద్యన్మతుల్
హేలానిర్దళితారి సర్వమును నీయిచ్ఛావశం బచ్యుతా.

18


క.

బృందావనకేళికి నై, బృందారకవరద చాలఁ బ్రియపడియెడు నీ
డెందము తడ వింకేటికి, మంద గదల్చికొని చను మమందప్రీతిన్.

19


క.

అని మునివరుఁ డాతని వీ, డ్కొని చనియెఁ దగంగ నందగోపుఁడు గోగో
పనికాయమునకు బృందా, వనగమననిశ్చితైకవాక్యతఁ జెప్పెన్.

20


వ.

ఇట్లు నారదోపదేశంబున నిర్విశంకమానసుం డగువల్లవముఖ్యుపనుపున సర్వజనం
బులుం బయనంబు సమకట్టుటయును వ్రేపల్లె నెల్లకడల.

21


సీ.

[18]బండ్లమెట్టింపుపై బరువు లెక్కింపుమీ దళ్లనుబూన్పు కావళ్లనునుపు
పదిలంబుగా నేతిపనఁటులు క్రొత్తగోనియలబియ్యము వడ్లు నెమిలివడ్లు
నొదివిరి ప్రాలును నొనరంగఁ బోసి చాపలు మంచములు మీఁద బలియఁ గట్టు
దామెనలును వల్లెత్రాళ్లును దలుగులు [19]గవ్వము ల్గొడవలి కత్తిసూఁడుఁ


తే.

గొడుపు[20]వాదోళ్లు మొదలుగాఁ జెడకయుండ వలయుముట్లెట్ల దెమ్ముకంటలపుటెడ్ల
నాయితముసేయుముదుసళ్ల నాఁడువారి, గంపమోపులు ముందరఁ గదలుమనుము.

22

వ.

అని మఱియుఁ బెక్కుభంగులయెలుంగుల నొక్కకోలాహలం బెసంగ మంద
యంతయు నొక్కపెట్ట కదలి లావుమానుసులు కదుపులం గొని ముందరం
బోవఁ బిఱుంద బండ్లును బండ్లజాడం దక్కిన ప్రజయును నడువం దరుణతరుణీ
జనంబు లొండొరుల తోడిమేలంపుటాలాపంబులం బ్రమోదకరంబు లగువినో
దంబుల నదటుమీఱి కడచి చనం బంగ్వంధజఠరప్రముఖులు గ్రుస్సి యోలాకు
పడ నెడనెడం గావలియై తగువారు నడపింప నవ్విధంబునం జని బృందావనంబు
ప్రవేశించి యుచితప్రదేశంబులు నివేశంబులుగా నిరూపించి గోపాలముఖ్యులు
నిలువ నాక్షణంబ.

23


క.

ఒకయామఱ పట పిది యని, సకలజనము చూడ నర్ధచంద్రాకృతియై
శకటావళి విడియఁగఁ గడు, వికటస్థితి నెల్లవారు విడిసిరి గలయన్.

24


వ.

అంత.

25


చ.

[21]గుడిసెలు వన్నియున్ ఘననికుంజము లిండులుగాఁగఁ జొచ్చియున్
బెడఁగగుజొంపము ల్గలిగి పేర్చినమ్రఁకులక్రింద నుండియుం
గడఁక యెలర్ప [22]బొడ్లకును గ్రంపలు వైచియు నొక్కనాఁటిలో
నడరఁగఁ బ్రాతకాపు లయి రక్కడ గోపకుటుంబు లందఱున్.

26


శా.

శృంగారంబులు సేసి గోపికలు భాసిల్లంగ గోపాలు రు
త్తుంగాంగంబులతోడ నెల్లకడలం ద్రుళ్లంగ గోబృందముల్
మాంగల్యాకృతిఁ గ్రాల నెంతయును సామగ్ర్యంబునం బంధు లు
ప్పొంగం బల్లె సముజ్జ్వలోత్సవములం బొంగారె నానాఁటికిన్.

27


క.

క్షేమంకరుఁడై హరి దము, నేమఱక ప్రయోజనంబు లెల్ల నడపఁగా
శ్రీమంతు లైరి మిగులఁగ, నామందం గలుగుగోపు లందఱు దోడ్తోన్.

28


క.

వేసవియందును సులభము, ఘాసము గోవులకు నీరు కడుఁ బెల్లొదవన్
వాసవుఁడు గురియుఁ దఱితో, వాసవుతోఁబుట్టు వున్న వాసక్షోణిన్.

29


క.

క్రేపులు వర్ధిల్లఁగఁ గడు, నేపెసఁగఁగ మొదవు లీను నేఁటేట వృష
వ్యాపారం బవ్యాహత, మై పరఁగుం గృష్ణదేవు నాదరమహిమన్.

30


వ.

ఇట్లు బలదేవసహితుం డై మహితప్రీతిం బ్రవర్తిల్లు నయ్యదుకుమారుండు క్రమం
బునం ద్రయోదశవర్షవయస్కుం డయ్యె నంత నొక్కతఱి వసంతసమయావసానం బగుటయు.

31

గ్రీష్మకాలాభివర్ణనము

శా.

వాసంతీకుసుమావతంసకము లుద్వాసించి గోపాంగనల్
శ్రీసంపన్నములైన పాటలములన్ సీమంతసీమ ల్లలిం

గైసేయం దగి ఫుల్లమల్లికలికాగర్వాంధమై పర్వె స
ర్వాసహ్యోర్ధతి యయ్యె ధర్మసమయం బారంభసంసేవ్యమై.

32


క.

మడువులనీ రింకించుచు, నెడపడఁజేయుచుఁ బ్రవాహ మెట్టిది యైనన్
వడ యొయ్యనఁ బేర్చుచు ను, గ్గడువయ్యె నిదాఘబలము క్రమయోగమునన్.

33


మ.

హరి యంభోనిధి సొచ్చె శంభుఁడు తుషారాద్రీంద్రముం బ్రాఁకె వా
గ్వరుఁ డుద్యన్మకరందదుర్దినసమగ్రం బైనయుత్ఫుల్లపం
కరుహంబున్ భజియించె దీని మును గల్గం గాంచియే కాక యె
వ్వరి నిం కేల సహించు గ్రీష్మ మనఁగా వర్ధిల్లెఁ దాపోద్ధతుల్.

34


సీ.

వనధు లెల్లను గ్రోలి తనియక పెనుపొంది బడబాగ్ని యంతటఁ బ్రబ్బె నొకొ
యాగంగఁ గొలఁదిగా కభవుండు [23]గ్రక్కినఁ గ్రమజుఁ గరళాన్ని కడఁగా నొక్కొ
నీరజాసనునోరు నిండకమున్న కల్పాంతాగ్ని దమకించి యడరె కొక్కొ
సకలతత్వంబు[24]ల సమయించి ఘోరాగ్ని తత్త్వ మొక్కటియ కాఁ దలఁచె నొక్కొ


తే.

యగ్నియును మారుతంబు ననాదియైన, మైత్రి నేఁడ కాఁజూపంగ మసఁగె నొక్కొ
కాక యిట్టి వేసవి యెందుఁ గలదె యనుచు, జనులు బెగడొంచ గాడ్పుతో జఱచె నెండ.

35


మ.

తమలో రాయిడిగొన్నయున్నతుల సద్వంశంబులున్ రూపఱున్
సమయించుం దమయాశ్రితావళిని నెన్నంగా నిజం బిట్టిభా
వము సూడుం డనునట్లు వేసవి మహావంశాటవుల్ రాసి ద
గ్ధము లయ్యె న్నికటద్రుమానలులతోఁ గ్రందంగఁ దావాగ్నులన్.

36


క.

తరు లెల్ల గ్రల్లవడఁగా, విరళములై వీథులున్న విధ మొప్పె నహ
స్కరరుచులతోడఁ దలపడి, యరుదుగఁ బోరాడి. తుమురులై పడినక్రియన్.

37


మ.

జ్వలితారణ్యకధూమముల్ శిఖిశిఖాసక్తిం దటిల్లీలతోఁ
గలయం గ్రమ్ముఘనాళిభంగి నెసఁగంగా నెండమావుల్ దిశా
వలయాపూరజలంబులన్ దొరయఁగా వర్షాగమస్ఫూర్తియై
వెలసెన్ గ్రీష్మము తీవ్రతాపము కడున్ భిన్నప్రకారంబుగాన్.

38


తే.

పక్వఫలములఁ గ్రాలుకింపాకలతల, బెరసి వేసవి చే పడి తరువులెల్ల
దావదహనసంయుక్తికిఁ దప్పె నవియు, నలఁగి దావాగ్ని నొదివినయట్ల యుండె.

39


శా.

గోపూర్ణ[25]స్తనదుగ్ధపానవిధులున్ గోవర్ధనాంతర్ఝరీ
వ్యాపారంబులు గోపతిప్రియసుతావాఃకేళిలీలాస్ఫుర
ద్గోపీ[26]ముగ్ధకుచోపగూహనములున్ గోవిందసాంగత్యమున్
గోపశ్రేణికిఁ బాపెఁ దాపభయమున్ ఘోరంపుఘర్మంబునన్.

40


వ.

ఇట్టి నిదాఘకాలం బతిక్రాంతం బగుకొలంది నొక్క కారణంబున.

41

క.

హరి పరిపాలన సేయఁగఁ, బరమోత్సుకవృత్తి నున్న పశుకోటికి ని
ర్భరవిస్మయావహములై, యురుతరముగ నుద్భవించె నుపసర్గంబుల్.

42


వ.

అమ్మహాదోషంబువలన.

43


చ.

వడఁకుచు రోమకోటి నిలువంబడి మేనులు దూలఁ గన్నులం
దుడుగక బాష్పముల్ వడియుచుండఁ దలల్ దిగవైచి నోరఁద్రే
గుడు దొరుఁగంగ నెంతయును గ్రుస్సి ఖురంబులు వ్రస్సి పుర్వు లు
గ్గడుపుగ గాఱఁ దద్దయును గాఱియఁబొందె వ్రజంబునం బసుల్.

44


క.

[27]కడలను నెత్తురుఁ బాఱం, దొడఁగెం గొన్ని యతిసారదుస్తరబాధన్
బడి ప్రేవులు సిక్కఁ దునిసి, పడకుండునె యనఁగ నెత్తువదె నెల్లెడలన్.

45


ఆ.

[28]నరిడిపుప్పు కప్పనావురు గడుపూఁద, యదురుఁద్రిక్క యనఁగ నడరి మఱియుఁ
దెవుళు లెన్నియేనిఁ దవిలి యెంతయు మహో, గ్రంబులయ్యెఁ బశుగణంబునందు.

46


వ.

అంతయు నుపలక్షించి వయోవృద్ధు లగుగోపాలురు మంత్రంబుల నౌషధంబుల
నగ్నికర్మాదులం దత్ప్రతికారం బుపక్ర మించి యవియన్నియు నిష్ఫలంబులయినం
జేష్టలు దక్కి నిలిచిరి యమునాతీరకాననంబులం జరియించు ప్రాణులు మృగ
పక్షిసర్పాదులు సూక్ష్మజంతువులులోనుగా వివిధవ్యాధిపీడితంబు లై మృతకల్పం
బులు నగుచువచ్చె నట్లు దొడఁగిన యుపద్రవంబు లంత నిలువక గోపప్రకరం
బులయందునుం బ్రవేశించిన.

47


సీ.

జ్వరవేగమునఁ దూలి పొరలిరి కొందఱు సందుసందులు సొచ్చి చదిసి పడిరి
కొందఱు వెస రోమకూపంబు లన్నియు నవిసి నెత్తురు గాఱ నవయవములు
చీములు గట్టంగ శీర్ణంబులై దంతములు గదలంగ నెములు వొగులఁగఁ
గంఠజిహ్వాధరఘ్రాణకర్ణంబులు పొక్కులై యేర్పఁగ నొక్కఁడైన


ఆ.

ద్రావఁ [29]దడవ లేక తలచీర లెఱుఁగర, యార్తులైరి కొంద ఱంతవట్టు
గోపమందిరములు కుష్ఠదుర్గంధమ, యంబు లయ్యె వికృతి యగ్గలింప.

48


క.

నరగోమృగనివహంబులఁ, గరుణము లగురోగవేగకలితాక్రోశ
స్వరములు పెక్కయ్యె దిగం, తరముల నెచ్చోట యమునదరివిపినములన్.

49


వ.

యశోదానందగోపులుం గ్రమంబున రోగార్తి నొందిరి రోహిణియును దదవస్థన
పొందె నట్లు జననీజనకులు లోనుగా సకలబంధువు లధికక్లేశంబులం దూలుట
యాలోకించి బాలుండయ్యును మహాబుద్ధిశీలుండు గావున దామోదరుండు
రామునితో విచారించి యయ్యుపసర్గంబునకుఁ బ్రతికారం బన్నెలవు విడిచి
పోవుట దక్క నొం డుపాయంబు లే దని క్రోశమాత్రం బంతరంబుగాఁ గతిపయ

గోగణంబులం గొనుచుం జని యిమ్ముల నిలిచె నతనిమతం బెఱింగి మఱియునుం
గొందఱు గోపాలకు లచ్చోటిక యరిగి యరోగు లై రట్టియెడరునందు.

50


తే.

ఏను జుట్టంపుజనులను నెందువోదు, మిచ్చటన యుండఁగా నేమి వచ్చెనేని
ననుభవింతుము గాకని చనక నిలిచె, నందగోపుఁడు దానును సుందరియును.

51


క.

తల్లియుఁ దండ్రియు నిమ్మెయి, నిల్లు వెడల కధికరోగహృతచేతసులై
తల్లడిలుట విని కృష్ణుఁడు, పుల్లవడి [30]తలంకుచుండె బుద్ధిని నచటన్.

52


వ.

ఇట్లు బలదేవకేశవులు బలిష్ఠు లయ్యు నయ్యుపద్రవప్రతికారంబునం దసమర్ధు లై
యుండ నా వ్రేపల్లె యందు విదేహదేశాగతుం డై యున్న గోపవృద్ధుం డొక్క
రుండు గోపముఖ్యుల నెల్లం గూడం బిలిచి వారితోడ.

53


సీ.

పశుసమాశ్రయమున బ్రతుకుచున్నారము మనము దత్పశుసంఘమునకుఁ బ్రభుఁడు
వృషకేతనుం డగువిషకంఠుఁ డద్వయుఁ డటుగాన సద్భ క్తి నమ్మహాత్ము
నర్చింపఁగా శాంతి యగు నెల్లవిధముల వేదపారగు లైనవిప్రవరులు
బిలిపించి శాస్త్రసంభృతయుక్తికల్పితమార్గంబుతో దేవమందిరమునఁ


తే.

దొడగుఁ డీయనుష్ఠానంబు జడత యుడిగి, యనినఁ గులవృద్ధుమాటకు నాత్మలందుఁ
దద్ద విశ్వాస మొలయంగఁ దత్క్షణంబ, గోపు లెల్ల ను దగువస్తుకోటి గూర్చి.

54

గోపాలకులు రోగశాంతికై శివపూజావ్రతంబు సలుపుట

వ.

శివభక్తియుఁ దదీయతంత్రజ్ఞానంబును దదాచారధుర్యతయుం గల యార్య
ద్విజోత్తములఁ బ్రార్థించి తెచ్చి తత్క్రియా[31]నిర్వాహత్వంబునకు నియోగించిన
నమ్మహాత్ములు విహితోపవాసనియమసమాహితు లై తత్సమీపస్థితం బగుసిద్ధ
స్థానంబునందు.

55


తే.

[32]ఎలమి ఋత్విక్కులను వరియించి కుండ, మండలోదారపూర్వకమహితతంత్ర
మతిశయిల్లఁగ ద్రవ్యంబులందు శుద్ది, వెలయ నధివాసనాదులు దొలుతఁ జేసి.

56


సీ.

పంచామృతంబులఁ బంచగవ్యంబుల విమలోదకంబులఁ గ్రమముతోడ
నభిషేక మొనరించి యఖిలేశ్వరుని సమంచితగంధసమితి నర్చితునిఁ జేసి
భూరిసౌరభచారుఫుష్పదామంబులఁ బూజించి బహువిధస్ఫురితధూప
తతి యిచ్చి కపిలాఘృతప్లుతవర్తికారమ్యదీపముల నారతు లమర్చి


ఆ.

భక్ష్యభోజ్యలేహ్యపానీయబహుళనై, వేద్యములు ఘటించి హృద్యలీలఁ
బగలు రేలు నట్లు పరిచర్య నడపుచుఁ, గొలిచి రేడుదివసములు గ్రమమున.

57


క.

తగ నిప్పగిదిని దప్పక, నగజాస్కందులను వృష,భనందీశుల స
ర్వగణాధ్యక్షు వినాయకుఁ, బ్రగుణార్చనముల భజించి భావించి రెదన్.

58


తే.

ఉత్తమం బగుశివమూర్తియుత్తమాంగ, మున నతిస్థూలఘృతధార లనవరతము
దొరుఁగుచుండెను మూఁడునధ్వరదినంబు, లన్నిటను విప్రవిహితప్రయత్ననిష్ఠ.

59

వ.

అగ్నిప్రతిష్ఠ గావించి ఋత్విజులు వాగీశ్వరసంభూతం బగు [33]శివాలయంబునందు శివ
సంహితామంత్రంబుల నాజ్యపాయసాపూపప్రముఖంబుల హోమించి రయ్య
యివిధంబున నెల్లవారును మృత్యుపరిహారకంబు లగుమంత్రజపంబులు నుపద్రవ
శమనకారు లగుమహా దేవమంత్రస్తోత్రపఠనంబులు శాంతిప్రదంబు లగు కల్యాణ
ధ్యానంబులు ననుష్ఠించుచుండిరి పరమేశ్వరుముందరఁ గొందఱు భ్రూవిక్షేపం
బుల నక్షివివర్తనంబులం జరణతాళంబుల హస్తవిన్యాసంబుల నతిమనోహరం
బును గుతూహలావహంబును నగుభక్త్యావేశనర్తనంబు ప్రవర్తించి ప్రదక్షిణ
ప్రణామాదు లొనరించి రిట్లుండ నేడవునాఁటి మధ్యాహ్నసమయంబునందు.

60


శా.

ఆవిప్రావళిలోన వేదముల వేదాంగంబులం గోవిదుం
డై వర్తిల్లుమహాద్విజుం డొకఁడు భూతావేశముం బొంది తీ
వ్రావష్టంభముతోడ నొత్తిలి మహాహాసంబు గావించుచున్
దేవోద్గీతి యెలర్పఁ బాడుచును నర్తించెం గఠోరంబుగన్.

61


తే.

అతనిఁ జూచి యచ్చటి విప్రు లంతవట్టు, వారు నిది యేమియో యని భూరివిస్మ
యంబుఁ బొందంగ నృత్తగీతావసాన, మున నతం డిట్టు లను సభ్యజనముతోడ.

62

శంఖకర్ణుం డనుభూతంబు గోపాలకులకుఁ గలిగిన రోగంబునకుఁ గారణం బెఱింగించుట

వ.

ఏను సర్వజగద్గురుం డగుచంద్రశేఖరుం డానతిచ్చి [34]పుత్తేరం దదీయశాసనంబు
శిరంబున ధరియించి కైలాసశైలంబుననుండి మీపాలి కిప్పు డిట్లు సనుదెంచితి
గోకులంబునందు గోవులకు గోపాలురకుం దక్కినప్రాణులకు వర్తిల్లుచున్నయార్తి
తెఱం గనుసంధించి వారు పరమభక్తియుక్తిం బ్రయోగించు నీయనుష్టానంబు
నందలి సౌష్ఠవంబునకుం బ్రసన్నుం డై యమ్మహాదేవుండు నన్ను నాలోకించి.

63


ఆ.

శంఖకర్ణ నీవు సయ్యనఁ గాళింది, తటమునందు రోగతాపభరముఁ
జెంది పొరలుచున్న జీవుల కెల్లను, హిత మొనర్చు [35]పొంటె నేఁగు మేఁగి.

64


వ.

అస్మత్పూజాతత్పరు లయిన బ్రాహ్మణోత్తములలోన నొక్కనియం దావేశించి
యిట్లని చెప్పుము.

65


సీ.

ఘనుఁడు విరోచనతనయుఁడు బలికంటెఁ బూర్వజుం డాహవగర్వయుతుఁడు
గలఁడు దైత్యుఁడు కాలకలియన ద్వాపరాంతమున దానవు లెల్ల ధరణిబాధ
కుద్భవింపఁగ దొను నొకక పిత్థద్రుమమై విషోత్కటవిటపాళ యెసఁగ
యమున దక్షిణపుఁదీరమున జనించినాఁ డద్దురాత్మునిబంటు లైనయసురు


తే.

లందఱును విషకంటకవ్యాప్తవృక్ష, కోటియై దానిచుట్టునుఁ గొలఁదిమిగులఁ
బెరిఁగినారు తద్భార్య లేడ్వురు సహస్ర, పుత్రవతులైన గోవులై పొదలినారు.

66


వ.

ఆగోవులఁ గాచువారు లేక తమయిచ్చం గారువసు లై తిరుగుచుఁ బ్రాణుల వధి
యించు నవ్వెలఁగమ్రాను పుట్టిన పండ్రెండేఁడ్లకుఁ బూచి పువ్వులు వొడమినప్పుడ

ఫలియించుఁ దత్ఫలంబు లయ్యాసురంబగుపశుగణంబు భక్షించుచుండు నని
కల దిప్పు డవ్విధం బంతయు సంపన్నం బైనయది.

67


ఉ.

ఆవిషవృక్షగంధము రయం బెసకం బయిఁ బాఱుతేర నా
నావిధరోగబాధలు జనంబులకున్ జనియించె నిత్తఱిన్
గోవులు గోపులుం దెవులుగొంటకుఁ గారణ మవ్విధంబు త
ద్భావితమై సరిజ్జలముఁ బ్రస్ఫుటదోషముఁ బొందె నెంతయున్.

68


వ.

దీనిం బరిహరించి దూరం బరిగిన వారి కారోగ్యం బగు వ్రేపల్లె తత్సమీపం
బున నున్నకతంబున నింత పుట్టె నందగోపసూనుం డగుకృష్ణుండును బలదేవుం
డునుం దాను నవ్విషభూజంబు భంజింప నోపు నతం డప్పని కియ్యకొనిన
నందఱు బ్రతుకుదు రని పరమేశ్వరుం డనుగ్రహించె నేను బోయెద నని పలికి
భూతంబు విడిచి పోయిన.

69


క.

ధరణీదేవుఁడు తెలివిం, బొరసె నఖిలభూమిసురులు బొంగుచు భూతే
శ్వరు వినుతించి సమాప్తిం, చిరి తత్క్రియ గోపవరులు చె న్నెసలారన్.

70


వ.

రామకృష్ణుల రావించి యవ్విధం బెఱింగించిన నగ్గుణగరిష్ఠులు బలిష్ఠులు గావున
నిశ్చితంబు లగునంతఃకరణంబులతో నందఱం గలయం గనుంగొని.

71


తే.

దేవదేవుని శాసనం బీవిధంబు, తల్లిదండ్రులు గులమును నెల్లవారు
బ్రతుకు తెరువది సద్యశఃప్రదమునట్టె, యింతకంటెను మేలు మా కెన్నఁడొదవు.

72


వ.

అని రపుడు కృష్ణుండు వారితోడ.

73


శా.

అంభోధిం బ్రభవించి విశ్వమును సంహారంబు నొందింప సం
రంభోజ్జృంభిత మైనయాద్యవిషమున్ రౌద్రప్రభావంబుతో
శంభుం డె ట్లుపసంహరించె విషవృక్షస్ఫూర్తియుం గీర్తితా
రంభప్రౌఢత నట్ల యే నుడిపెదన్ రాగిల్లుఁ డీరందఱున్.

74


వ.

అని పలికి యమ్మహాబ్రాహ్మణవర్గంబునకు నమస్కరించి శంకరునకు సాష్టాంగ
దండ ప్రణామం బాచరించి శివాలయంబునకు బ్రదక్షిణించి దేవకీసూనుండు
రౌహిణేయుదిక్కు చూచిన నతండును నట్ల చేసి యతనితో నేకకార్యుం డై
కడంగె నయ్యిరువురుఁ గట్టాయితం బై చేతులం గత్తులు గుదియలు గొడ్డండ్లునుం
గొని యాయతం బగునవ్విషవనంబున దెసకు నడచిన.

75


మ.

హరపూజాసుకృతంబుపేర్మి వెసఁ బ్రాప్తారోగ్యు లై గోపకుల్
పరమోత్సాహముతోడ బాహుబల మొప్పన్ సింహనాదంబు లం
బరభూమ్యుంతరపూరకంబులుగఁ దత్పార్శ్వంబులన్ ముందటం
ద్వరితాక్రాంతి యెలర్పఁగా నడచి రుద్యత్సాధనోపేతు లై.

76


వ.

బ్రాహ్మణపుంగవులునుం గోపాలసహితులై కుతూహలంబున వారిపిఱందన యరిగి
రిట్లు [36]సని కృష్ణుం డక్కాఱడవి మునుకొని కొంతదవ్వు గడచి.

77

క.

జనులకు నతిదుస్సహ మగు, పెనుగంపుఁ గఠోరకటుకభీషణరూపం
బున నెదురుగాలి పైకొని, చనుదేరఁగ దానిబడిన చని య యయ్యవులన్.

78


సీ.

పాతాళమున నున్నఫణిరాజుకోఱలపసయెల్ల రూపమై యెసఁగె ననఁగఁ
గాలకూటానలగర్వంబు సర్వంబు ప్రచ్ఛన్నతనులీలఁ బ్రబలె ననఁగ
[37]నరకాగ్నిశతముల పరుసదనం బంతయును నొక్కచోఁ గూడి తనరె ననఁగ
నాభిచారకవిధియాభిజాత్యము సకలము మూర్తిమంతమై యమరె ననఁగ


తే.

నధికవికృతమై యౌన్నత్య ముబరంబు, దాఁకి మ్రాకుల నంతటఁ దానకాన
రాఁ బ్రభూతవిస్తారమై క్రాలుకపట, కటుకపిత్థభూజాతంబు గాంచె నతఁడు.

79

శ్రీకృష్ణుఁడు విషమయం బగుకపిత్థవృక్షము నున్మూలించుట

వ.

ఇట్లు దూరంబునం గని దాని చేరువకుం బోవ నతిసంకటం బై యున్న మాయా
మయం బగువనంబు గనపగొడ్డండ్ల నెఱగత్తుల నఱకి పడవైచుచుం దెరువు
గావించుకొని కదియునంత.

80


మ.

తరుమూర్తిం గలభర్తఁ జేరి తమవత్సశ్రేణియుం దారుఁ ద
త్పరిపక్వార్ద్రఫలోపజీవనమునన్ దర్పించి యున్నట్టియు
ద్ధురగోరూపనిశాచరీసమితి తద్గోపావలిం గాంచి చె
చ్చెర నొక్కుమ్మడి రోసి పాసి ఖరదృష్టిం జూచుచుండెం బొరిన్.

81


వ.

యదుకుమారుండును ముప్పదిబారలపఱపైన బంధురస్కంధంబునఁ దదర్ధపరిణా
హంబగు దేహంబున నపరిమేయం బగుసముచ్ఛ్రాయంబున నతిభయంకరం
బై యున్న యన్నగంబు దప్పక చూచి మహాకుంభప్రమాణంబు లగుతత్ఫలంబులు
గనుంగొని యివియ కావే నిజదుర్గంధి యగుగంధవహువలన నస్మద్బంధుబాధ
గావించినయవి. వీనిం దొలుత రూపడంచి మఱి నాచేయంగఁబూనిన పనియం
తయుం జేసెద నని బలదేవుండునుం దానునుం గూడి కడంగి.

82


చ.

క్రమమునఁ బిందెలుం బసరుఁగాయలును న్మఱిదోరబండులుం
గమిసినపండులుం గెలలు గట్టి తదున్నతశాఖ లన్నియుం
దమమయమై తలిర్పఁగ నతండును బాహులు సాంచి హస్తగ
మ్యము లగువాని నెల్ల నలియన్ భువివైచుచు వచ్చెఁ దోడుతోన్.

83


సీ.

ఆర్చుచు గోపాలు[38]రందియీ సందంద బడియలరాలను బడఁగవైచి
కొన్ని దవ్వులవానిఁ గోమరార వానిన కొని ధాత్రిఁ దొరఁగించి కొన్ని లీల
[39]నిక్కి [40]పెళ్లని కొమ్మ లుక్కున విఱుగంగఁ దిగిచి ధారుణిఁ ద్రోచి పగులఁ ద్రొక్కి
కొన్ని యివ్విధమున నన్నింటి రాల్పంగ నిష్ఫలం బయ్యె నన్నీచతురువు


తే.

ఫలనిపాతహతం బగుబహుళరవము, చటులశాఖావిభంజనజనితరవము
సమదగోపాలనివహగర్జారవంబుఁ, గలసి గగనంబు శబ్దాత్మకంబుఁ జేసి.

84

వ.

అయ్యపూర్వనినదంబునకుం గనలి యయ్యసురకొడుకులు గోరూపు లగుతల్లులకడ
నున్న పొగరుకోడెలు వేలసంఖ్యలు చెలంగి నలిరేఁగి ఖురశృంగవాలదంతప్రహ
రణంబు లై పొదివినం జెదరి నిలువ నోర్వక గోపాలురు పలాయనంబు నొందిరి
నందగోపనందనుండు నగుచు వాని నొండొండ యొడిసి కడకాళ్లు వట్టి విసిరి
యమ్మానికొమ్మలనె తగిలిచి నొగిల్చియు వాని నిట్టునట్టు దిగిచిపడునట్లుగా
వైచియు నొండొంటితో నడిచియు నేలతో వ్రేసియు బహుప్రకారంబు లగు
వధంబుల నిరవశేషంబు గావించె నమ్మాయారూపంబు లాత్మరూపంబులతోడ
పడియు దానవాకారంబులం గూలంబడియు నన్నేలయంతయు శవసంకీర్ణంబును
రుధిరపూర్ణంబును గావించె నివ్విధంబున.

85


క.

 పిశితాశను లని మును గడు, విశదంబుగ నాప్తఫణితి విని యున్కిఁ గ్రియా
కుశలుఁడు హరి తత్పశుగణ, విశసన మవిశంక వీరవృత్తి నొనర్చెన్.

86


వ.

అంత.

87


చ.

కొడుకులపాటు సూచి కడుఁగోప మెలర్పఁగఁ దల్లు లొక్కయు
మ్మడి వనజాయతేక్షణుని మట్టఁ దలంచి మహోగ్రహుంకృతుల్
వడిగొనఁ గొమ్ము లొడ్డుకొని వాతులు విచ్చి ఖురాగ్రపాతనం
బుడమిఁ బగుల్చుచు న్నిగుడి బోరన ఘోరపువీఁకఁ దాఁకినన్.

88


చ.

ఉఱికి తొలంగ దాఁటియును నూరక తోఁకలు వట్టి దవ్వుగా
బఱిపియుఁ గొమ్ము లూడ్చి పెడఁబాయఁగఁ ద్రోచియుఁ గేల లీలమైఁ
జఱిచి కలంగఁజేసియును జంపఁగ నొల్లక గోస్వరూపతన్
దొఱసిన రాక్షసాంగనలఁ దోలె నతండు నిమేషమాత్రలోన్.

89


వ.

అవియును గ్రీడానర్తనప్రవర్తియుంబోలెఁ జెలంగియాడు కృష్ణుని పరాక్రమం
బునకు భయంపడి మేనులు గలంగి వాపోవుచుఁ దోఁక లెత్తి మెడలు మలంచి
మలంచి చూచుచు నంభారవంబుల నొఱలుచుఁ బఱచి దూరం బగు కాంతా
రంబు దూఱి కాడువడి పోయె నంత.

90


శా.

పాదంబుల్ నుఱుమాడి యుద్ధతవిరూపస్కంధముల్ వ్రచ్చి రూ
పేదం బండులు డుల్చి బాహువులయ ట్లేపారు [41]శాఖాలి సం
ఛేదక్రీడ నడంచి మస్తకతతుల్ శీఘ్రంబ ఖండించి యి
ట్లాదేవేశుఁడు రూపుమాపెఁ దరురూపాభీలదైత్యాధమున్.

91


వ.

తదనంతరంబ నిర్భయు లై కూడినగోపబాలుకుం దానును రామసహాయం బతి
భీమంబుగా నమ్మహాద్రుమంబు నుపాంతంబున నున్న విషకంటకవృక్షంబులు తద్వ
ల్లీగుల్మజాలంబులుం బిలుకుమారం దునుమాడి యవియును గోవత్సశవంబులుం
గూడఁ బ్రోవులు సేయించి కపిత్థతరుశకలంబులు దత్తలంబునం గూడ వైపించి
యంతటం గలయం గనలునగ్నులు దగిల్చిన.

92

చ.

గొనకొని పేర్చి నాలుకలు గ్రోయుచు ఘర్మవిశేషతీవ్రతం
బొనరుసమీరసఖ్యమును భూరితరంబుగ సంభవించుటన్
గనలుచుఁ బావకుం డడరి కాల్చె ముహూర్తములోన నమ్మహా
దసుజకళేబరద్రుమవితానములన్ వెస నుగ్గునూచగన్.

93


వ.

అంత.

94


క.

కురిసె సురపుష్పవర్షము, హరిపై నప్సరస లాడి రాతోద్యంబుల్
మొరసే సుఖస్పర్శంబై, బెరసెం బవనంబు దెసలు [42]వెలసెం గలయన్.

95


వ.

ఇట్లు విజయోల్లాసభాసి యైనవాసుదేవు నవ్వసుమతీదేవులును వల్లవప్రముఖు
లునుం బ్రభూతభాషలం గీర్తించిరి. రోగార్తిముక్తం బై తత్క్షణంబ బృందావనం
బును భువనపావనం బగుభావనంబునం బరఁగుటకు నర్హం బయ్యె నాసమయంబున.

96

శ్రీకృష్ణుడు గోపాలురతో యమునయందు జలక్రీడ సలుపుట

మ.

చెమటం దొప్పఁగఁదోఁగి భస్తకణికాస్ఫీతోత్తమాంగంబులన్
సుమహానిశ్వసితాకులాననములన్ శోభిల్లు మేలు ల్మహా
శ్రమవేగంబునఁ దూఁగ నందఱు విహారాపేక్షు లై డిగ్గి ర
య్యమునాభూమికి [43]వెండివెల్లిసుకపెల్లై యున్నమార్గంబునన్.

97


తే.

పౌరుషము మెచ్చి ముదము నిండార నగుచుఁ, గౌఁగిలింపంగ నేతెంచుకరణి నొప్పెఁ
బ్రకటఫేనయై కడలచే బారసాఁచి, హరికి నభిముఖంబుగఁ బొంగుతరణికన్య.

98


మ.

గురుగోత్రాధరవప్రభూములు వడిం గోడాడి [44]యందంద చం
డరసోర్దర్ప మెలర్ప యూధముల వెంటం గొంచుఁ గ్రీడార్థి యై
యరుదార న్మదభేదభారమున నొయ్యం జొచ్చువన్యద్విపేం
ద్రురుచిం బొల్చె జలౌఘమున్ దఱియు నాదోశ్శాలి గోపాళితోన్.

99


వ.

ఇట్లు సొచ్చి యమ్మహావాహినియందు.

100


సీ.

ఒండొండ యిద్దరినుండి యద్దరిదాఁక నేపారుపురుడున నీఁది యీఁది
మునిఁగి లోలోనన చని దవ్వుదవ్వుల ననువున నెగసి పెల్లార్చి యార్చి
కడగానరానిపెన్మడువుల[45]ఁ బఱతెంచి యుఱికి వే కడుఁ దేలి మెఱసి మెఱసి
యొండొరుఁ బేర్కొని యోలయోలని రేఁచి యదటున జల్లుపోరాడియాడి


ఆ.

వాద్యభంగి జలము వాయించి వాయించి, పాడిపాడి కెరలి యాడియాడి
తనిసి మూఁడుజాలతఱి ప్రొద్దొకించుక, చల్లపడిన నల్లనల్ల వెడలి.

101


వ.

గోపాలురు కృష్ణపాలనంబు గనినవారు గావున భావంబు లలరఁ బరిధానాదుల
నలంకృతు లై మనోజ్ఞవేషంబులతో నిలిచి రయ్యదుకుమారు లిద్దఱు నటమున్న
తల్లులు పుత్తేరఁ బరిచారకులచేత నుపనీతంబు లైనధౌతాంబరప్రముఖపరిష్కా

రంబులు గైకొని రప్పుడు పుత్రుని విచిత్రవిక్రమోత్సవంబునకు నానందించి
నందుం డాయత్తంబు సేయించిన చతుర్విధాన్నంబులు గొని గోపకుటుంబినులును
దారకదారికాసహితంబుగాఁ జనుదెంచినం దత్ప్రయత్నంబున.

102


తే.

సముచితప్రదేశంబున జలజనాభుఁ, డగ్రజుం డగ్రపాత్రంబునందు నిలువ
దాను బెద్దలుఁ జెలికాండ్రుఁ దగఁగ నార, గించి తాంబూలములు గొని మించియెలమి.

103


వ.

కొండొకసేపు విశ్రమంబు నొంది తదనంతరంబ సముత్థితుం డై కదలి లోకక్షే
మకరంబు లగుశకునంబులు గనుంగొనుచుఁ దద్జ్ఞు లవ్విధం బభినందింపఁ జను
దెంచె నప్పు డొండొరులం గౌఁగిలించుచుఁ బరువులు వెట్టుచుఁ దారుచు నెలుం
గెత్తి నవ్వుచుం బాడుచు వేణువీణాధ్వనిమిశ్రంబుగాఁ బటుపటహధ్వనివాద్య
వాదనంబు లొనర్చుచు గోపాలు రాలోకసీమంబు లగుసమ్మోదసంభ్రమంబుల
నొప్పి యప్పురుషోత్తముముందరం బిఱుందనుం బార్శ్వంబులను దత్పౌరు
షంబు ప్రశంసించుచు [46]బెరసి రిట్లు వచ్చి యందలు సాయాహ్నసమయంబున
వ్రేపల్లె సొచ్చి తమయిచ్చ నుండిరి విప్రవరులు గోపవృద్ధులవలన సమర్చనంబు
నొంది నిజస్థానంబులకుం జనిరి వాసుదేవుండు జననీజనకవాత్సల్యంబునఁ బర
మోత్సవంబు గని వత్ససంచరణతత్పరం బగుతనపూర్వక్రీడనంబున విలసిల్లు
చుండె నంత.

104


మ.

విషవృక్షంబు జయించి తాపభరమున్ వే పాపి వ్రేపల్లెక
ల్మషము ల్మాన్చినకృష్ణుతోఁ దనకు సామ్యం బాసపడ్డట్లు దు
ద్విషహగ్రీష్మ మడంచి విశ్వము నిరుద్వేగంబు గావించుచున్
సుషమం బయ్యె నభస్యమాసము పరిస్ఫూర్జద్ఘనశ్యామ మై.

105


ఉ.

చాతకవందిబృందములు సంస్తుతి సేయ విశాలబర్హి బ
ర్హాతపహరణంబు లెలరారఁగఁ బర్వతభద్రపీఠముల్
ప్రీతి నుపాశ్రయించి జలభృద్ధరణీవిభు లాక్రమించి రు
ద్యోతిసురేంద్రచాపనవతోరణశోభతభూమిభాగమున్.

106


క.

రాయంచలగుండె[47]బెదరు, మాయామంత్రము వియుక్తమానచ్యుతి క
త్యాయతమయూరకర్ణర, సాయన మనఁ బ్రథమజలధరారవ మెసఁగెన్.

107


క.

దినపతియు నిశావిభుఁడును, దనతననామము నిరర్థతం బొందిన సి
గ్గునఁ బొడసూపరొ [48]యనఁగా, దిననిశ లోక్కటిగ మేఘతిమిరమ యయ్యెన్.

108


క.

లలితగగనరంగంబున, నలయక కొమ్మఱుఁగు [49]గొండ్లియై యాడెడుచో
నలవడియె మొగులుదెరలును, బొలుపగు వడగండ్లగములపుష్పాంజలులున్.

109


క.

జలధారలు మదధారలు, జలధరములు [50]మొగవడములు [51]చండానిలవి
హ్వలగహ్వరరవములు గ, ర్జలుగా గిరు లమరె సమదసామజసమతన్.

110

తే.

ఘనరసోపయోగంబునఁ గ్రమ్మఱంగఁ
బడసె బ్రాయంబుఁ దగదె యిబ్భంగి యనఁగ
హరితతృణలతారుణకోమలాంగి యగుచుఁ
[52]బృథ్వి యెంతయుఁ గ్రొత్తయొప్పిదము నొందె.

111


శా.

ధారాపూరకఠోరవృష్టిఁ గమలధ్వంసంబు పాటిల్లినం
జేరం జోటొక టెందుఁ గానక భ్రమం [53]జెయ్వేదుభృంగావళిన్
గారా మారఁగ నుద్ధరించెఁ బొగడంగా నొప్పదే నాఁగ నొ
ప్పారెం బ్రస్ఫుటకందళీకుటజనీపామోదికాంతారముల్.

112


క.

ధరణీరజ మడచియు జల, ధరకాలము దెసలు [54]గనతలము దలముగా
[55]సరజంబులు గావించెను, బరిణత [56]కేతకవనోత్థపవనోద్ధతులన్.

113


క.

రేయును బవలును మెఱయుచు, మ్రోయుఘనావళులకలిమి ముద్దియలు దముం
బాయక యుండఁగఁ బరిరం, భాయతభోగరుచు లమరె నాత్మేశులకున్.

114


క.

కుటజకుసుమవాసిత లై, యటవులు నవమాలతీలతాంతపరిమలో
త్కట లై నగరీవనికలు, పటుతాప మొనర్చెఁ బాంథపఙ్క్తుల కెదలన్ .

115


శా.

చండాపాతములం దటద్రుమము [57]లుత్సారించి శుండాలికా
గండూషారవరమ్యతోయ లగుచున్ గాండాంతరావర్తముల్
[58]డిండీరోత్కరవీచులం బెనుప నుద్రేకించెఁ గూలంకషల్
మండూకీపరిగీయమానవిలసన్మాహాత్మ్యలై యెల్లెడన్.

116


వ.

ఇట్టి వర్షాగమంబునఁ గృష్ణుండు బలభద్రసహితుం డై గోపాలనకేళీవినోదంబులం
దగిలి.

117


ఉ.

క్రాలెడుపచ్చఁబట్టు నునుఁగచ్చులు క్రొమ్మెఱుఁగై చలింప ను
న్మీలితబర్హదామము సమిద్ధమహేంద్రశరాసనంబుగా
మేలగు వేణువాద్యవరమిశ్రితగీతము గర్జచందమై
నేలకు డిగ్గెనొక్కొ దివినీలఘనం బననొప్పెఁ గానలన్.

118


క.

వనకుసుమవిభూషిత మగు, వనజాక్షునితనువు మెఱసె వనవిటపివిమ
ర్దనలగ్నలతాంతం బగు, వనవారణవిభునుదగ్రవపువును బోలెన్.

119


సీ.

ఆసమయంబున నట విదేహక్షితిమండలంబునయందు మహిళచరితుఁ
డమితగోధనము ధనాభివృద్ధియుఁ గలవాడు గుంభకుఁ డనువల్లవుండు
ఘనుఁడు యశోదకు ననుజుండు ధార్మికుఁ డర్థుల కనిశంబు నాజ్యదుగ్ధ
దధితక్రదానంబు తాత్పర్యమునఁ జేయు నతనిభామిని ధర్మదాహ్వయమునఁ


తే.

బరఁగు నన్వర్థనామయై భవ్యశీలు, రట్టిదంపతులకుఁ బుత్రుఁ డధికుఁ డొకఁడు
గలిగె శ్రీధాముఁడన నొకకన్య నీళ, యనఁగ జనియించి గారాము దనరఁ బెరిఁగె.

120

వ.

ఇట్లు పెరిఁగి త్రైలోక్యరత్నం బిది యనువర్ణనలకుం గగిన వరవర్ణినీతిలకం బై
యున్నయన్నాతి ననేకగోపాలకుమారు లడిగి యడిగి నిలిచి రట్టియెడ.

121


తే.

తారకామయరణమున వారిజాక్షు, కడిమి నిహతులై యేడ్వురు కాలనేమి
కొడుకు లాపగ మనసున [59]నిడి పొడమిరి, కడిఁదియాఁబోతులై కుంభకవ్రజమున.

122

కాలనేమిపుత్రు లేడ్వురు గుంభకునింట వృషభంబులై పుట్టుట

వ.

ఇట్లు జనియించి.

123


క.

పోరానిచుట్ట మితనికి, శౌరి యిచటి కెల్లభంగిఁ జనుదెంచుఁ జలం
బార నతని వధియింపఁగ, నేరూపున నైన మాకు నిచ్చట నొదవున్.

124


వ.

అని తదాగమనకారణంబు లగునుపాయంబులు చింతించి యఖిలజనబాధకుం
దొడంగి.

125


సీ.

ఎదిరినపోతుల నెవ్వానినైన నవారణ నోడించి వలియఁ దోలు
నిలిచినఁ జంపు మందల నెందుఁ దిరిగి క్రేపుల మొదవులను జాఁబొడుచుఁ బట్ట
నడువంగ వచ్చిన నదటునఁ జిందఱగొని యెట్టిబలియురఁ గొనక కవియు
నీటిలోఁ [60]దఱిసినపాటీనములగతి వెలుఁగులు సొచ్చి యావలికిఁ బోవు


తే.

గోడ [61]లలవలు వెసదాఁటు గ్రీడవోలె, రేలుఁ బగళులుఁ దిరుగుచుఁ జేలపంట
లొకఁడు లేకుండ మేయుఁ గాపున్నవారి, నుఱికి పొరిగొనుఁగడిఁది మృత్యువులువోలె.

126


వ.

అంత నవ్విదేహదేశంబునఁ గల కృషీవలు లెల్లం గూడి రాజుపాలికిం బోయి
చక్కఁ జాగిలి మ్రొక్కి లేచి నిలుచుండి చేతులు మొగిడ్చి.

127


తే.

కుంభకునిమందఁ బుట్టినగోవృషంబు, లేడు నీభూమిసస్యంబు లెల్లఁ జెఱిచె
గావ నలవిగా దెవరికి దేవ [62]యెరకుఁ, జెడితి మరయఁగ వలయు మాచేటు నీవు.

128


క.

జముఁ డైన వచ్చి వానిని, దమియింపఁగ లేఁడు నిశ్చితం బేమియుపా
యము గలదొ చూడు నీభా, వమునం దిటఁ బ్రజలు మీకు వలసిర యేనిన్.

129


వ.

అనిన విని మిథిలేశ్వరుండు కుంభకు రావించి నీసప్తవృషభంబులు భూమియం
తయుం బాడుగా మేసెఁ బ్రజలు నిలువలే మని మొఱపెట్టెదరు నీవు దొరవు
గాని తుచ్ఛుండవు గా వట్లగుట దీనికి ని న్నొం డననేరము వానిం బట్టి కట్టింపు
మొండె నెద్దుపట్టింపు కాకున్న నరణ్యంబులు సొర వెలిపింపుము లావరు లగు
చుట్టలు గలవాఁడవు నీకు సాధ్యంబు గానిది లే దివ్విధం బనాలస్యంబునఁ గైకొన
కున్నఁ దప్పక యొప్పమి వచ్చుం జుమ్ము పొమ్మనిన నట్ల కాక యని యతండు బల
వంతులఁ బెక్కండ్ర నక్కార్యంబునకు నియోగించుటయు.

130


తే.

[63]పల్లియలు వైచి యోదముల్ పెల్లు ద్రవ్వి, తార్చి వేసఱియురులొగ్గి తఱిసిడయ్యఁ
దోలి యోటరి పోనీక దొడ్డి నాఁగి, పొడువ నొడువను నలుదెసఁ బొంచి యోడి.

131

వ.

మఱియును బహువిధోపాయంబులం దదీయదమనంబునందు శక్తులు గాక యప్పటి
కప్పటికోడెలచేతం బోటువడియును వ్రేటువడియును ద్రొక్కువడియును జిక్కు
వడియును నలిగులి యై లావు సెడి చేవ దఱిగి కడంకలు మడిసి దెసలం దిరిగి
కడిమి పెంపు వోనాడి చేతులాడక దలంకి నిలిచిన.

132


ఉ.

కుంభకుఁ డింక నెయ్యది యొకో వెర వంచుఁ దలంకి యెవ్వఁ డు
జ్జృంభితవిక్రమోద్ధురతఁ జేరి వృషంబులఁ బట్టి కట్టు సం
రంభ మడంచి నొంచు ననురాగ మెలర్ప నతండు మత్తనూ
సంభవకు న్విభుం డగు నిజం బిది యంచుఁ బ్రతిజ్ఞ చేసినన్.

133


క.

ఆతఁడు సాటింపఁగ విని, యేతెంచిరి భూమి గొల్ల లెల్లను వెస నాఁ
బోతులఁ బఱుచుట యొకపని, యే తరుణిం గొంద మనుచు నేపు దలిలిర్పన్.

134


వ.

ఇట్లు మిథిలాపురం బంతయు గోపాలమయం బై యుండె నట్లు గూడిన యందఱుం
దమలోన.

135


సీ.

కొమ్ములు వడి నూఁది కుదియింతుఁ [64]బ్రోపఱ ననువాఁడు పడవైచి యనువుదప్పఁ
బట్టి పెల్కుఱ ముక్కు గుట్టుదు ననువాఁడు గుదియల గుండులఁ జదియ గుప్పి
యదరంట గడియలో నాఁగి పట్టుదు ననువాఁడును బొదివి యెవ్వలను దిరిగె
మొగతప్ప నందంద మోరలు నులు(జు)పుదు ననువాఁడునై గొల్ల లచట నచట


తే.

మల్ల సఱచుచు నార్చుచు మలసి బ్రమరి, వాఱుచును బెక్కుబిరుదులు పలికిపలికి
మెలఁగి యాఁబోతు లుండెడిపొలము లరసి, [65]ఱంకె పట్టుగనుంగొని బింక మెసఁగ.

136

శ్రీకృష్ణుడు నందాదులతోడ మిథిలాపురంబున నున్న కుంభకునింటికిఁ బోవుట

వ.

సమగ్రసన్నాహం బగునుత్సాహం బెసంగ నున్నంత గుంభకుండు మున్ను పని
చిన మానుసులు సని నందగోపునకు సప్తవృషభవృత్తాంతంబు నెఱింగింప నతండు
బాహుసత్వోదారు లగుకుమారులం బెక్కండ్రం దోడ్కొని యశోద మున్ను
గాఁ జనుదేరఁ దండ్రి తోడన కృష్ణుండును బలదేవసహితుం డై వచ్చె నప్పుడు
తద్వ్రజనివాసు లగుజనంబులు.

137


తే.

రామలక్ష్మణతుల్యు లీరామకృష్ణు, లలఘుభాగ్యలక్షణమూర్తు లరసిచూడ
నాఁటివారల యిప్పు డీమేటివీరు, లైరి గా కని వెఱఁగంది రాత్మ లందు.

138


వ.

కుంభకుండు నందగోపునకు నెదురువచ్చి తోడ్కొని పోయి సముచితాసన
విన్యాసప్రభృతు లగుసంభావనలం బ్రీతులం జేసె నయ్యశోదయు ధర్మదచేత
సత్కృత యయ్యె శ్రీధాముండు కృష్ణుం గౌఁగిలించుకొని యతనికిం దదగ్రజు
నకుఁ దాన తెచ్చి కాసనంబు లమర్చె నయ్యందఱుం దన్మందిరంబున సరస
పాయసఘృతబహుళం బగునాహారంబునం దృప్తి నొంది యిష్టగోష్ఠి నుండి
రాత్రియందు.

139

మ.

హరి యేతెంచు టెఱింగి కట్టలుకతో నామాయపోతు ల్వడిన్
ఖురశృంగంబులఁ గుంభకవ్రజములో గోగర్భిణీవత్సశా
క్కరసంఘంబులఁ బెక్కిటిం బొడిచి రక్తంబుల్ భువి న్నింపఁగాఁ
దెరలంబాఱెఁ గలంగి గోవులు గడున్ దీనంబు లై రోలుచున్.

140


సీ.

అంతఁ బోవక యవి యాగోపముఖ్యులోగిటిలోని కుఱికి యక్లేశలీల
ఱంకెలు వైచుచుఁ గింకఁ [66]గాల్ ద్రవ్వుచుఁ జిమ్ముచు నొండెడఁ జెలఁగి చెలఁగి
భాండసంభారంబు పగులించి గోడలు గోడాడి గరిసెలు కూలఁ దాఁకి
బండులు విఱుగంగఁ బైదాఁటి పందిళ్లు పడఁద్రోచి తలుపులు వగుల నొత్తి


తే.

యాఁడువారును శిశువులు నార్తినొంద, నెక్కడెక్కడ యని వాడలెల్లఁ గలుఁగఁ
గూడి త్రుళ్లెడుపరదేశిగొల్లకొమరు, లిందు నందును నొదుఁగంగ నేపు సూపె.

141


వ.

అంతఁ బ్రభాతం బగుటయుఁ గుంభకుండు సకలగోపాలురం గూడఁ బిలుపించి
కూఁతునకు శృంగారంబు సేయించి తెచ్చి తత్సమీపంబున నునిచి నందగోప
సహితుం డయియుండి కృష్ణపురస్సరు లగుతదీయులు నన్యులు విన ని ట్లనియె.

142


ఉ.

గోపకుమారులార కనుఁగొంటిరె గోవృషముల్ దిశాగజేం
ద్రౌపమము ల్మహాగిరిగుహోత్థితసింహసమానము ల్కన
త్కోపకృతాంతతుల్యములు దుర్గమముల్ దమియింప [67]వీని మే
మోపక యిట్లు చిక్కితిమి యోగ్యపుయత్నము లెన్ని సేసియున్.

143


క.

కేవలగోవృషభంబులు, గా వివి రాక్షసులొ యొండె గంధర్వులొ య
క్షావలిలోనివొ హింసయ, కావింపఁగ బుట్టినవి జగంబున నెందున్.

144


తే.

వీని దండింపకున్నను మానవేంద్రుఁ, డలుకతో మమ్ము దండింతు ననియెఁ గాన
దలఁకి కూర్చితి నిట్టు లందఱును మీరు, సత్త్వవంతులు విక్రాంతితత్త్వవిదులు.

145


వ.

కావున వీని మర్దింప నోపినవాఁ డొక్కరుండ యిక్కన్నియకరపంకజం బాక్ష
ణంబ కైకొనువాఁ డని జనకుండు జానకీశుల్కం బగుశంకరశరాసనదమనం
బుదాహరించినవిధంబున నిరూపించిన కుంభకవాక్యంబు నాఁటిభూపాలురపగిది
గోపాలు రందఱు నాకర్ణించి.

146


శా.

నీలం జూచుచు మన్మథాస్త్రముల కున్మేషంబు లై డెందముల్
సాలం గౌతుక మొంద గోవృషములం జర్చించి యాభీలకా
లాలంఘ్యోద్ధతచండదండహతి కత్యాతంకముల్ పైకొనన్
డోలాందోళితచిత్తు లైరి మదిఁ దోడ్తో[68]ఁ దెంపు సొంపారఁగన్.

147


వ.

ఇట్లు చిత్రవిన్యస్తదేహులపోలె నిరుత్సాహులై నిశ్చేష్టభావంబునఁ జూచు
చున్నవారలం జూచి నందగోపజ్ఞాతి యగుఘోషవంతుం డను గోపకుండు.

148

శా.

ఈయాఁబోతుల నిట్లు బెట్టుగొన నిం కేనాటి కీవిక్రమ
వ్యాయామంబులకల్మి చూడుఁ డిదె కన్నారంగ నన్నొక్కనిన్
వేయుం బల్కఁగ నేల నుక్షముల నుర్విం గూల్తు నన్నింటి వీం
[69]డ్రా యస్మద్ భుజవజ్రపాతనకు గోత్రాభంబు లై చేకుఱన్.

149


మ.

అని యాస్ఫోటితబాహుఁడున్ బహులసింహధ్వానదీప్తాననుం
డును దర్పోద్ధతవిగ్రహుండు నయి యాటోపంబుతోడం గడం
గిన నయ్యుక్షము లీక్షణచ్ఛటల నగ్నిజ్వాల లొక్కుమ్మడిం
గనలం గన్గొని వానిపైఁ గదిసెఁ దీక్ష్ణవ్యూఢశృంగంబు లై.

150


తే.

పొదలుఁ బుట్టలు గట్టులు భూరుహములు, నెక్కి కనుఁగొను జనకోటియెల్లఁ బొగడు
నట్లు గడఁగి యావ్రేఁడు లాపమరఁ బొడిచెఁ, జిక్కఁబిడికిట నొకపోతుశిరమునడుమ.

151


శా.

ఈతం డేఁటికి నిమ్మెయిం గడఁగె ని ట్లేలొక్కొ యీదుష్టుటాఁ
బోతు ల్వోవఁగనిచ్చునే యనుచు నంభోజాక్షుచిత్తంబు చిం
తాతిక్రాంతము నొందఁగాఁ బొదివి తా నాభంగి దోర్విక్రమ
ఖ్యాతిం జూపినఘోషవంతుఁ బొదివెన్ గ్రందంగ నయ్యన్నియున్.

152


తే.

పొదివి నిడువాలుగొమ్ములఁ బొడిచి యెత్తి, ధరణిపై వైచి వెసమెట్టి ఖురపుటములఁ
జిమ్ముటయు దవ్వుగాఁ దూలి సొమ్మవోయి, పడియె నాతండు సూపఱు భయము నొంద.

153


వ.

ఇట్లు ఘోషవంతు బెట్టిదంపుటురవడి ధరణిం బెట్టి యయ్యుగ్రపశువులు దక్కునుఁ
గల పశుపాలకప్రకరంబు పైకి నడరి.

154


క.

కొందఱఁ గొమ్ముల గ్రుచ్చెం, గొందఱ నిలమీఁదఁ బెట్టి గొరిజల మెట్టెన్
గొందఱ [70]దౌడల నమలెం, గ్రందుగఁ బెఱజనము లెల్లఁ గనుకనిఁ బఱవన్.

155


వ.

అంతయుం జూచి మందహాసవిభాసితాస్యుం డగుచు వాసుదేవుండు బలదేవుతో
నల్లన యిట్లనియె.

156


మ.

ఇవి యాఁబోతులు గావు గోవృషములం దీరోష మీదోష వి
ప్లవ మీసర్వజిఘాంస యారయ నసంభావ్యంబు వమ్మయ్యె నీ
భువిలో నేచినగోపవిక్రమకళాస్ఫూర్తు ల్లసత్కీర్తి నా
కవుఁగా కిప్పుడ కాచెదన్ [71]వృషభయవ్యాదిద్ధు నిక్కుంభకున్.

157


వ.

తొల్లి తారకామయసంగ్రామంబున నాచేత నిహతు లైనకాలనేమిపుత్రు లేడ్వురు
నీరూపంబులం బుట్టి నాకుఁ గీడు సేయం గోరి తిరిగెదరు రిపువధం బవశ్యకర్త
వ్యంబు బంధురక్షణసుకృతం బొక్కటియుఁ గన్యాకరగ్రహణలాభంబును శోభ
నంబులు గావె శ్రీధాముతోడిసఖ్యంబును నాకు నపేక్షణీయం బిది నాతలంపు
నీవు నిశ్చింతుఁడ వై యుండుమని యతం డనుమతింప నాక్షణంబ సన్నద్ధుం డై.

158

శ్రీకృష్ణుఁడు రాక్షసాంశసంభూతంబు లగు సప్తవృషభంబులఁ జంపుట

తే.

 అన్న యి ట్లేల సాహసం బనుచు నంద, గోపుఁడును యశోదయును సంక్షోభ మొందఁ
గుంభకుఁడు మెచ్చఁ దక్కిన గోపకోటి, సంశయింప ససంభ్రమోత్సాహలీల.

159


వ.

ఆయుగ్రపశువుల కభిముుం డయ్యె నప్పుడు దేవతలు మునులు నంబరతలం
బుననుండి యతని విజయంబు గోరుచుఁ గనుఁగొనుచుండి ర ట్లడరి యవ్వీరుండు
ఘోరంబుగా నదల్చి.

160


క.

ఖలులార యింత కాలము, గలఁచితిరి ధరిత్రి బ్రాణిఘస్మరులు పశు
చ్ఛలనాఛన్నవికారులు, పొలిసితి [72]రిఁక మీకు నెందుఁ బోవఁగవచ్చున్.

161


క.

నాపిడికిటికడిఁదిపిడుగు, నాపగిదియ దీనఁ దగిలి యంతకుఁడైనన్
రూపు సెడకుండఁ జాలునె, యీపాపాత్మకుల మిమ్ము నేల సహింతున్.

162


మ.

అని యావిష్కృతతీవ్రముష్టి యగుచున్ హాసోజ్జ్వలాస్యంబునం
గన లుప్పొంగఁ గడంగునవ్విభుఁ ద్రిలోకక్షేమనిర్వాహకుం
గని పూర్వం బగువైరబంధమున నుగ్రక్రోధులై ధూర్తగో
దనుజుల్ మార్కొని రొక్కయుమ్మడిన యుద్యద్గర్జతో నేడ్వురున్.

163


వ.

అట్టికోల్తలయందు.

164


సీ.

పొదివిన నందంద మొదుకనియఱచేత వీఁకతో మోరలు వ్రేసివ్రేసి
పిఱువోవ నందంద తఱిమి కొమ్ములు వట్టి తొడరి నొండొంటిపైఁ ద్రోచిత్రోచి
చెదరిన నవలీలఁ జెనసి యొక్కొక్కటి తెరలఁ దోఁకలు వట్టి త్రిప్పిత్రిప్పి
తిరిగినఁ బోనీక పరిగొని యన్నింటి నదరంట పొరిగొని యాఁగియాఁగి


తే.

[73]ముట్టి గండముల్ వడిఁ గత్తిపెట్టు వెట్టి
వీఁపు లడిచియు దోఁకలు వీఁకఁ దాఁచి
[74]రావెన్నుఁ డక్కడివారికి వెఱుఁగు గాఁగఁ
గడిమి నాఁబోతుగమి బెట్టు గలఁచి యాడె.

165


వ.

ఇట్లు చూపఱచూడ్కికి వేడ్కగా గొంతదడవు వినోదించి.

166


శా.

నీళాలోకనరోచు లాదరసమున్నిద్రంబులై సిగ్గునం
జాలన్ స్రుక్కుచు నొయ్యనొయ్యఁ దను నాసం జెంది యానందక
ల్లోలవ్యాహతిఁ దూలఁ దత్కుతుకము ల్పూరింప నుద్యుక్తుఁ డై
యాలోకప్రియుఁ డవ్విరోధులఁ బ్రచండాలోకుఁడై చూచుచున్.

167


ఉ.

దిక్కరిహస్తదండసముదీర్ఘభుజుండు ప్రగాఢముష్టి నొ
క్కొక్కనిమ స్తకం బవియ నొక్కొకపోటు గొనంగఁ గన్నులన్
ముక్కున వాత నెత్తురు సముద్ధురమై చెదరంగ నోలి తో
నొక్కొకరుండ కూలి రుసు ఱొక్కట పోవఁగఁ గాలనేమిజుల్.

168

వ.

ఇట్లు మాయావృషభంబు లక్కుమారశార్దూలంబుచేత నాలంబునం గూలిన నఖిల
గోపాలురు విస్మయంబు నొందిరి నందగోపయశోద లానందంబునం బఱతెంచి
నందనుం గౌఁగిలించి దీవించి రప్పుడు కుంభకుండు.

169


ఉ.

కన్నియచేయి చేతఁ గొని కౌతుకవేషమనోజ్ఞుఁ డైనయా
వెన్నునిఁ జేరఁ దెచ్చి యిది వీర భవద్భుజవీర్య[75]శుల్కయై
మిన్నక కాదు నీదయినమేనమఱందలు నీక చేరె నీ
కన్నెఁ బరిగ్రహింపు మని కాంతకరంబుఁ గరంబుఁ జేర్చినన్.

170


వ.

అమ్మహాతుం డమ్మహిళారత్నంబు గైకొనియె నప్పు డవ్వైదేహుండు వైదేహీ
వరణవిభాసి యగుచాశరథింబోలె నీళాస్వీకరణమహితుం డయిన మాధవు ననే
కాభరణాంబరాదుల నర్చించి యశోదానందగోపులకుఁ గట్ట నిచ్చి తక్కిన గోప
కుమారుల సంభావించె ననంతరంబ నెయ్యం బెసంగ వియ్యంబున కి ట్లనియె.

171


ఉ.

నీకొడు కప్రతర్క్య[76]మహనీయభుజావిభవుండు వీనిశౌ
ర్యాకలనంబుపేర్మి మము నస్మదశేషకులాన్వితంబుగా
శోకమువాపి మాన్చె నతిసుస్థిరజీవన మేను గంటి న
స్తోకవిభూతి నెంతయు యశోగరిమంబును బేర్చు నెల్లెడన్.

172


క.

వేలు పదివేలు లక్షలు, నీలకు నరణంబు గాఁగ నీయింటికి నే
మేలుగ నిచ్చెద గోవుల, నేలా యివి యనకు మిది యభీష్టము నాకున్.

173


వ.

అనిన నతం డతనిం జూచి నాకుం గొలందియిడరాని పసియను నపరిమితమహి
ష్యజావికంబులుం గలవు కృష్ణుండు జన్మించినదియాదిగా గోవులు ప్రతిసంవత్స
రంబును బ్రసూత లై కేపులు పురణించి వచ్చుఁ బా లెన్ని పితికితి మంతయు
ఘృతంబయి పేర్చు నరణ్యంబున గుల్మద్రుమాదులయం దెల్లను బహులం బగు
మధువులు సులభంబు లై యొదవు నెల్లవారికి నాయురారోగ్యంబును భోగ్య
వస్తుసిద్ధియును నవ్యాహతంబులు గొఱంత యెందును లేదు నీయిచ్చిన ధనం
బులు మాకు వచ్చినయవి యని పలికి యాదివసంబు పరమకల్యాణంబుగా
నక్కడ నుండి మఱునాఁ డతని వీడ్కొని కదలెఁ గృష్ణుండును నీళాసమన్వి
తుం డై శ్రీథాముం దనకుఁ బ్రియసఖుంగా నడిగి తోడ్కొని యశోదానంద
గోపు లభినందింప మగుడి యాత్మీయదేశంబున కరుగురించి తొల్లింటియట్ల
సుఖంబుండె నని చెప్పిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.

174


శా.

గోపాలత్వముఁ బొంది యవ్విదమునన్ గోవిందుఁ డున్నట్టి స
ద్వ్యాపారంబులు సెప్పఁగా శ్రుతికి నింపై యింత యొప్పారునే
యాపుణ్యాకృతి నాఁటివారలకు నెట్లై యొప్పేనో చూడ్కికిన్
రూపింప న్మదిలోన నిప్పుడును దా రోచిష్ణువై చెందెడున్.

175

మ.

భుజయూపంబున గోవృషాఖ్యపశులం బ్రోక్షించి విక్రాంతియన్
యజనంబున్ విబుధప్రమోదకముగా నమ్మైఁ బ్రవర్తించి స
ర్వజగత్పూజ్యత నుల్లసిల్లుచు మనోరాగంబునం గ్రమ్మఱన్
నిజదేశంబున కేగె యెట్లు నడచెన్ విష్ణుండు విప్రోత్తమా.

176


వ.

అని యడిగిన నమ్మహాముని యమ్మహీపతి కి ట్లనియె న ట్లరిగి కృష్ణుండు వత్సపరి
పాలనంబునం గ్రీడాలోలం బై న బాలచరితంబు పరిణతిం బొందిన యనంతరంబ.

177


తే.

కొదమతనమున నొప్పారి పిదపగండు, మెఱసిపొదలెడు మృగనాథు తేఱఁగు దోఁప
నభినవస్ఫురదుద్ధామయావనంబు, నొందె గోపికాదృక్చకోరేంద్రుఁ డగుచు.

178


వ.

అట్టి యౌవనవికాసంబునందు.

179


సీ.

నెఱుల నున్ననికప్పు దుఱఁగలిగొనఁగూడి పొదలివెండ్రుకలు కొప్పునకు నెయిద
నూఁగారుమీసలతోఁ గాంతి దళుకొత్తు మొగము గన్నులుఁ గ్రొత్తజిగి దలిర్ప
నడుము వట్రువ గాఁగ వెడఁదయై కఱకెక్కి యొప్పార వెలసి పేరురము దనర
మూఁపులు పొడవులై చాఁపుఁ జక్కదనంబు గలిగి చేదోయి యగ్గలిక సూప


తే.

వెన్ను పఱపయి కంఠంబువిప్పు చఱచి, పిఱుఁదు బెడఁగొంది నడుపునొప్పిదమువింత
తెఱఁగు గైకొన గోపాలదేవమూర్తి, యఖిలశోభాకలాపకల్యాణి యయ్యె.

180


వ.

రోహిణీనందనుండును దాదృశసౌందర్యంబునం దిలకించె నయ్యసమానతేజు
లిద్దఱు సవయస్కు లగువల్లవకుమారులతోడం గూడి గోరక్షణక్రీడాతత్పరులై
విహరించి రవ్విహారంబులయందు.

181


చ.

నునుపగుపచ్చఁబట్టునఁ గనుంగొన నొప్పుగ దిండుగట్టి నూ
తన మగుబర్హి బర్హదృఢదామము నెట్టెము సుట్టి కమ్రకా
సనతరుపుష్పమాలిక దనర్చునురస్స్థలి నుద్ధరించి యిం
పొనరఁగ వేణునాదసరసోత్సుకుఁడై హరి యొప్పె నెల్లెడన్.

182

శ్రీకృష్ణుండు వామదేవ భరద్వాజు లనుమునులఁ గని సంభాషించుట

వ.

ఒక్కనాఁడు యమునాపర్యంతకాంతారంబునం జరియించువాఁ డెదుర నతి
మాత్రవిస్తారోదారంబును నతిశయోన్నతవిస్ఫారంబును నసంక్లిష్టబర్హిదామాభి
రామంబు నపరిభావ్యస్థేమంబునునై వేదంబునుంబోలె ననేకశాఖావలంబిద్విజగణ
సేవ్యంబును జలధరంబునుంబోలె గగనచ్ఛాదనాభోగంబును శైలంబునుం
బోలె బహుపాదపపరివేష్టితంబును గృహస్థధర్మంబునుంబోలె నిరంతరశ్రాంతజన
సమాశ్రయణీయంబును యోగనియమంబునుంబోలెఁ బవనపరచయజనితకుండ
ల్యుల్లాసంబును మహాయుగ్యంబునుంబోలే సుస్థితస్కంధానుభూతవివిధయుగా
వర్తనంబును గ్రహలోకంబునుంబోలె శీతకరచ్ఛాయాప్రభవభౌమజీవాభినందం
బును రసాతలంబునుంబోలె ననర్కాంధకారభరితాభ్యంతరంబును సేనావ్యూ
హంబునుంబోలె బహుళపత్రఫలమండలాగ్రశోభితంబును విష్ణువక్షస్స్థలంబునుం
బోలె వనమాలాపరివృతంబును బరబ్రహ్మంబునుబోలె నారణ్యకోద్గీతమాహా

త్మ్యంబును నగుచు వన్యదంతిదంతాఘాతవ్రణితంబును దావదహనజ్వాలావలే
హతిలకితంబును మునిదత్తార్ఘ్యతోయపులకితంబును సిద్ధతరుణీవిలాసచిత్రి
తంబును శబరకపరశుక్రీడాకుట్టితంబును మృగపతికంఠకేసరకండూమసృణితంబును
నగురూపంబుతో సర్వాశ్చర్యనిధానం బైనభాండీరాభిధానవటనాయకంబుఁ గని
తదీయతలంబున నగ్రజుండునుం దానును నాసీను లై తక్కిన గోపాలురు నయ్యై
విధంబున విహరింప నపరిమితగోనివహంబు నిజేచ్ఛామరూపసంచరణంబున నామో
దింప నాలోకించుచున్నయెడ.

183


సీ.

వామదేవుఁడు భరద్వాజుండు ననుమహామునులు తీర్థార్థులై ముదముతోడఁ
జరియించువారు శశ్వన్మహాయక్షనివాసమై యొప్పు నవ్వటము సేరి
తగుప్రణామంబుఁ బ్రదక్షిణంబును జేసి యచ్చట నున్నగోపాళిఁ జూచి
యోపాపలార యీయుత్తమతీర్థంబునకు డిగ్గు తేరు వెద్ది నాగనక్ర


తే.

వర్జితం బగు రేవు గావలయు మాకుఁ, దీర్థమాడుట కింతయుఁ దెలుపుఁ డనిన
నే నెఱుఁగ వీని నడుగుఁడం చెల్లవారు, నొండొరులఁజూపి చూపి యొండొండ నరిగి.

184


వ.

ఇట్లు గోపాలురు నైజం బగుచాపలంబున నవ్విప్రుల నుల్లసం బాడి వార లడి
గినమాటకు సదుత్తరం బీకున్న సమయంబునఁ గమలనాభుఁ డొయ్యన నయ్యు
త్తమాచారులం జేరం జనుదెంచి సవినయంబుగా ని ట్లనియె.

185


క.

వీరేమి యెఱుఁగుదురు మీ, కోరిన తేరు నేను [77]జూపి కుశలం బగురే
వీరుచిరాపగలోపల, వే రూపించెదఁ దపస్వివిభులార తగన్.

186


వ.

కర్మానుష్ఠానంబు సెల్లినపిదప నిట విజయం చేయుం డిదె మేలిమిగలమీఁగడతోడిపెరుఁగునం గలపిన చల్దివంటకంబు చిక్కంబున నున్నది మఱియును శర్కరామిశ్రం బగుపాయసంబు వలసినయంతయుం దెచ్చినారము మీకుఁ బ్రియం
బయినవిధంబున నారగింప నర్హుల రట్లుగాక ధారోష్ణంబు లగుగోక్షీరంబులు వల
సితిరయేని నుపయోగించునది యేను నందనందనుండఁ గృష్ణుఁడనువాఁడ నితండు
మాయన్న బలదేవుం డనంబరఁగిన బలియుం డిప్పసులకదుపు లన్నియు మా
సొమ్ము మత్ప్రార్థనంబు సేయుం డనిన నమహామునులు తదాకారతేజోవిభవం
జుల కద్భుతంబు నొంది యిగ్గోపకులంబునం దిట్టిమూర్తులు గలుగు టెట్లొకొ
యని సమాధినిమీలితేక్షణు లై క్షణం బుండి.

187


క.

తమతపముపేర్మి వారల, సముద్భవముఁ క్రియయుఁ గని యసంశయభావ
ప్రముదితమతులై యిట్లని, రమలార్థవచోనిరూఢి నవ్విభుతోడన్.

188

వామదేవభరద్వాజులు శ్రీకృష్ణు నెఱింగి స్తుతించుట

మ.

జలజాతోద్భవుఁ డాదిగాఁ బటుమతు ల్సర్వప్రయత్నంబులన్
బలవంతం బగుచూపుఁ జూచియును గానం జాలకున్నట్టిని

ష్కలు సూక్ష్మోదయు నాద్యు నచ్యుతు నినుం గన్గొంటి మిచ్చోట ను
జ్జ్వలగోపాకృతి నుండ నెట్టివియొ యస్మద్భాగ్యసంతానముల్.

189


తే.

ఏము చదివినచదువులు నేము విన్న
వినుకులును నేము నడిపెడు వివిధవిధులు
నేఁడు ఫలియించెఁ బరమేశ నీవు కరుణ
యలర నిచ్చటఁ బ్రత్యక్ష మైతి గాన.

190


క.

తొలుతఁ గలిగింతు జగముల, నిలుపుదుఁ దదనంతరంబ నిర్భరలీలా
కలనమెయి నడతు పిమ్మట, నెలకొని నీమాయ యేమి నేరదు వరదా.

191


సీ.

కన్నులు చంద్రభాస్కరులు సరస్వతి రసన పర్వతములు రదనపఙ్క్తి
సత్యలోకంబు మస్తకము వక్షంబు లక్ష్మీదేవి వామదక్షిణభుజములు
గణపతి స్కందులు గరశాఖ లబ్ధులు కుక్షి యంబరము దిక్కులు వివరము
లఖిలదేవతలు గేశావళి పాతాళలోక మంఘ్రితలము లోకవంద్య


తే.

విశ్వమూర్తివై యిబ్భంగి వెలుఁగుచుండు, దాగమంబులురచియించి యధ్వరములు
చేసి చూపి చేయించితి శిష్టజనముఁ, దత్క్రియలకు విధాతవు దాత వీవ.

192


క.

పుట్టువుఁ బేళ్లుం గ్రియలును, నెట్టన యేవెరవులందు నిన్నుఁ గదియ వె
ప్పట్టున లోకహితార్థం, బిట్టిఁడవయ్యుఁ గృపఁ బూను దీయఖిలంబున్.

193


శా.

క్రూరుం డైనహిరణ్యనేత్రుఁ డనురక్షోవీరుఁ డక్షోభ్యుఁడై
వే రూ పేదఁగఁ గ్రుంగఁ ద్రొక్కినమహావిశ్వంభరాచక్రమున్
వారాహాకృతి నుద్ధరించి సుచిరావాప్తిం బ్రతిష్ఠింపఁగాఁ
గారుణ్యం బొనరించి తెవ్వనికి శక్యం బిట్లు గ్రీడింపఁగన్.

194


క.

మెచ్చి ప్రియభక్తునకునై, వ్రచ్చితి కరనఖరము హిరణ్యకశిపు న
య్యచ్చెరువగుసింహాకృతి, యిచ్చఁ దలఁచి తలఁచి కొలుతు మేము నిను హరీ.

195


క.

వామనరూపంబున నీ, వామెయి బలి వేఁడఁ జనుట యటమీఁద మహో
ద్దామమహిమ యటుచూపుట, దామోదర మాదృశులకుఁ దరమె నుతింపన్.

196


తే.

వేయి చేతులఁ క్రొవ్వినవీరుఁ ద్రుంప, నుర్వివ్రేఁగువో నిర్వదియొక్కమాటు
రాచప్రోవుల నుఱుపను రామమూర్తి, వైననినుఁ జెప్పుదురు మును లాదిదేవ.

197


చ.

నిలిపితి సేతు వబ్ధి నవినీతు దశాస్యు సబాంధవంబుగా
కలఁకులనుం బ్రదీప్తపటుకాండములం గడతేర్చి తెల్లవా
రలకు వినంగఁ జెప్ప నభిరామము నీరఘురామజన్మ
గళగుణవైభవం బలఘుకల్మష పంకవిరోధి మాధవా.

198


క.

ఇప్పుడును రెండురూపము లిప్పగిదిం దాల్చి లోకహితకృత్యములం
దెప్పటిక్రియ నవధానము, తప్పక నీయున్నయొప్పు ధన్యము కృష్ణా.

199

శా.

నీపార్శ్వంబుల నెప్పుడుం దగిలి సన్నేహాత్ములై యాడునీ
గోపాలు ర్గడుపుణ్యకృత్తులు భవద్గోపాలనైకాస్పదం
బై పాటింపఁగ నొప్పునివ్వనము భవ్యం బవ్యయానంద యీ
గోపఙ్క్తుల్ భవదీయఖేలనకళాగుప్తుల్ [78]కృతాధ్యాత్మికల్.

200


సీ.

నినుఁ దనూభవునిఁగాఁ గనినయాదవుఁడును భోజకన్యయుఁ గులభూషణములు
మాతాపితృత్వాభిమానులై నీదెసఁ [79]గరఁగు గోపుఁడు గోపికయు [80]సుకృతులు
నీకు నుత్తంసమై నెఱసినయాబర్హి బర్హదామము లోకపావనంబు
నీకేలఁ దగిలి శ్రీనిత్యమై తనరు నివ్వేణువు త్రైలోక్యవినుతిపదము


తే.

నీయురంబునఁ గ్రాలునిన్ని బిడవిపిన
పుష్పమాలిక కృతకృత్య భువనవంద్య
వేయు నేఁటికి మము నీవు విశ్వరూప
నేఁటినుండి నీవారిఁగా నెమ్మిఁ జూడు.

201


క.

అని పలికి తాపసోత్తము, లనుకంపాస్తిమితచిత్తుఁ డై నవ్వుచు న
వ్వనజాతుఁడు తమునర్థిం, గనుఁగొన [81]వీడుకొని చనిరి కామితసరణిన్.

202


వ.

అని వైశంపాయనసంకీర్తనంబు లైనకృష్ణపంక్రీడనంబు లసంక్లిష్టవిస్పష్టంబు
లగు వాక్యంబులం గ్రమంబున.

203


ఉ.

త్యాజితశత్రుగర్వ వసుయాజితభూమిసుపర్వ నిత్యసం
యోజితసత్యధర్మ వినయోర్జితశర్మ సమిద్ధవైభవ
భ్రాజితభవ్యగేహ యపరాజితబాహ యశశ్శశాంకనీ
రాజితలోకమండల విరాజితధీస్థితనాకమండలా.

204


క.

[82]అమరభరణనారాయణ, యమలచరిత్రైక[83]రుచిపరాయణ[84]శ్రవణ
శ్రమశీలిత నారాయణ, సమదమహోద్దామసైన్య సంతతధన్యా.

205


మాలిని.

దమితవిమతగర్వా దారితారాతిదుర్గా
శ్రమితవినుతకీర్తీ ప్రాజ్ఞచేతోనువర్తీ
రమితయువతిచిత్తా రక్షితానాదివృత్తా
శమితసకలదోషా సౌమ్యసంపాదివేషా.

206


గద్యము.

ఇది శ్రీ శంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయ
నామధేయప్రణీతం బయిన హరివంశంబునం బూర్వభాగంబునందు షష్ఠా
శ్వాసము.

 1. నిచటు; నిచట.
 2. ఎరువు దిబ్బలుగొని
 3. జూడఁ జిక్కి చిక్కనిచోటఁ
 4. పెదదొడ్డిగ్రంతలు
 5. గాయలు
 6. లేవు
 7. ప్రియపడి
 8. కూరగాయలు గట్టెలుఁ గొనఁగవలసె
 9. వలసె
 10. వటంబన
 11. కచ్చోటన్
 12. నుఱికె
 13. నెత్తెఁ గాక తోడేలవుడిట్టిచేత
 14. దలుకఁగ
 15. సృతి, స్రుత.
 16. దీర్పఁగన్
 17. బాధింపంగ
 18. బండులు గట్టిపై
 19. గస్పాలుగొడ్డలి
 20. వొడ. త్రోదోళ్లు
 21. గుడుమలు
 22. దొడ్డులకు
 23. మ్రింగిన గరళాగ్ని గ్రమ్మటఁ గ్రక్కె నొక్కొ
 24. లు జాలించి
 25. స్రవ
 26. పీన
 27. కడలును నెత్తురు వాఱఁగఁ
 28. నరిడెతిప్పు కప్పనావురు గడుపులు, హదరుదిక్క (పూ. ము.)
 29. దడియు
 30. వడంకు
 31. నిర్వాహకంబునను
 32. ఋత్విగాచార్యతతి. (పూ. ము.)
 33. శివానలంబునందు
 34. నవృత్తాంతంబు
 35. కొఱకు
 36. వెదకుచుం గొంత
 37. నురగాగ్ని
 38. రందఱు
 39. భ్రళ్లనఁ గొమ్మలు గ్రక్కున
 40. పెల్లున
 41. శాఖాతతిన్
 42. వెలుఁగెన్
 43. వేడిపెన్నిసుక (పూ. ము.)
 44. యుద్దండ
 45. నడుగుకు నుఱికి వేకడ వచ్చి
 46. మెరసి
 47. చెదరు
 48. నాఁగా
 49. వెలఁదియై
 50. పావడములు. (పూ. ము.)
 51. సరగునరాయం, చలవిహ్వల
 52. బృథివి
 53. జెయ్వేటు
 54. గగనతలవలయముగా (పూ. ము.)
 55. నిరతంబును
 56. కేతకిరజోత్థ
 57. లుచ్చాటించి (పూ. ము.)
 58. డిండీరాంతర . . . నుడ్డీనించె (పూ. ము.)
 59. నిడుకొకడిమి
 60. జొచ్చిన పాటనములు గంప
 61. అగళులు (పూ. ము.)
 62. యిడుమఁ
 63. తల్లియలు వైచి విసివి యోదములు ద్రవ్వి, త్రవ్వి వేపఱి యురులొగ్గి తగిలి వలియఁదోలి...నలసతఁబొంది యోడి (పూ. ము.)
 64. బోపడ
 65. టెంకి
 66. గారింపుచు
 67. నేరికే
 68. భీతు లొప్పం దగన్
 69. జుం డాయత్తాద్భుతవజ్రపాత
 70. రాపుల నలిపెన్
 71. గృపభయవ్యావిఘ్ను
 72. రెటయింక
 73. ముట్టికందములనుగత్తి (పూ. ము.)
 74. వెన్నెముక లన్ని చెఱుకులవ్రేఁగు గాఁగ. (ఫూ. ము.)
 75. శుల్కయే
 76. భజనీయ్య మహా
 77. సూడ గుఱుతుగఁ దగురే
 78. కృతార్థాత్మకుల్ (పూ. ము.)
 79. గల్గు
 80. నుసురులు
 81. వీడ్కొలుపఁజనిరి
 82. మిత
 83. నుతి
 84. పటువిక్రమ