Jump to content

హరివంశము/పూర్వభాగము-పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

హరివంశము

పూర్వభాగము - పంచమాశ్వాసము

శ్రీధరణీసంభృతగృహ
మేధివ్రత విభ్రమోపమితవిష్ణుకథా
మాధుర్యబహువిధశ్రుతి
సాధితచాతుర్య వేమజనపతివర్యా.

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పెనట్లు విశ్వంబునకుం బరాయణుం
డగునారాయణుండు దుగ్ధసాగరంబున విముగ్ధయోగనిద్రావశుం డై నివసింపం
గ్రమంబునఁ గృతత్రేతాహ్వయంబు లగుయుగంబులు రెండును [1]గడచనఁ దృతీయ
యుగావసానం బగుకొలది బ్రజాభారపీడిత యై పృథివి యాక్రోశింప
ననుక్రోశవశంబునం బొంది బృందారకులు శతానందన కెఱుంగించి యతని
మున్నిడికొని.

2


తే.

నాగశయనీయశయు మహానందు నాది, దేవు భువనపావను సుధీభావనీయుఁ
బ్రకటమధురవాక్యంబులఁ బ్రస్తుతింప, నల్ల నాలించి మేల్కని యచ్యుతుండు.

3


ఉ.

తెల్లనితమ్మిఱేకులకుఁ దియ్యపునెచ్చెలు లైన కన్నులం
జల్లనిచూపు చూచి యిటు సంగతులై చనుదెంచినారు మీ
రెల్లను లోకముల్ శుభసమేతము లే యసురాధముల్ ప్రవ
ర్తిల్లరుగా సమస్తజగతీపరిపీడ యొనర్పఁ గ్రమ్మఱన్.

4


వ.

అని యానతిచ్చినఁ గమలసంభవుం డవ్విభుని యగ్రభాగంబున ఫాలభాగవిరచి
తాంజలి యై యి ట్లనియె.

5


సీ.

అవధరింపుము ధాత్రియం దెప్పు డెందును రాజు లన్యోన్యవైరములు దక్కి
పాటియు సత్యంబు పాటించి యాఱవుపా లప్పనము గొని ప్రజల మనిచి
యర్థంబు తగగ నుపార్జించి బంధుమిత్రామాత్యభృత్యజనాభివృద్ధి
గావించి సతతయాగంబుల దేవభూదేవపితృప్రీతి యావహించి


తే.

యధికధార్మికు లగుట వర్ణాశ్రమంబు, లాత్మధర్మముల్ దప్పక యాచరింప
నెల్ల వారునుఁ గడు నాయువెక్కి పగయుఁ, దెవులుఁ జావు లేకున్నారు దేవదేవ.

6


ఉ.

ఏనగరంబు చూచిన నరేంద్రులకున్ బహులక్షకోటిసం
ఖ్యానము లయ్యెఁ గుంజరహయాదులు మర్త్యులకెల్లఁ బేర్చు సం

తానపరంపరల్ జనపదంబు లొకంట నొకంట వేనవే
లైనవి యూళ్లు లిట్లమరె నాదయుగంబును బోలె సర్వమున్.

7


వ.

దానం జేసి భూదేవి మహాభారంబున సైరణ దొఱంగి యచల యయ్యును జల
నంబు నొంది యార్తయై యాక్రందించె నివ్విధం బరసి ధర్మలోపంబు గాకుండ
బార్థివకులం బుపసంహృతంబు సేయవలయు [2]నీవు విజయంబు సేసి మేరుశిఖరంబునం
గొలువుండి మమ్ము నందఱుం దగిన తెఱంగులకు నియోగించుట లెస్స యనిన నబ్జా
సనువిజ్ఞాపనంబు విని దివ్యశయనంబువలన నుత్థితుం డై.

8


సీ.

ఇందిరతొడలపై నింపారఁ జాఁచిన యడుగులు మణిపీఠియం దమర్చి
యొక్కింత సడలినయుత్తంసదామకం బభినవంబుగ మౌళి నలవరించి
కౌస్తుభోజ్జ్వలపదకంబునఁ బెనఁగొన్న చారహారమునులి చక్కఁ జేసి
కటిమీఁద జాఱినకనకసూత్రంబుతోఁ బీతాంబరముదిండు బిగియఁ దిగిచి


తే.

శంఖచక్రగదాభయస్ఫారచిహ్న, ములు గ్రమంబున శ్రీహస్తముల వహించి
యోగనిద్రాంతలీల యిట్లొప్ప నిలిచె, దేవదేవుఁడు దివిజులదృష్టి యలర.

9


వ.

నిలిచి తత్వమయసేవానురూపంబుగాఁ బొడసూపి యాయితం బై యున్నవినతా
తనయు వినమితస్కంధంబు బంధురోత్సాహంబున నారోహణంబు సేసి విష్వక్సేనాది
గణముఖ్యుల కోలాహలశబ్దంబులు మునుల జయజయాశీర్వాదరావంబులును
దిగ్వివరపూరకం బై చెలంగ ననేకశతసహస్రసంఖ్యంబు లగుసురనిమానంబులచేత
సేవ్యమానుం డగుచు గ్రహతారకాసంచార[3]పూరితం బగుసనాతనమార్గంబు
నిజగమనానుగ్రహంబున నతిమాత్రపవిత్రంబు ముహూర్తమాత్రంబున నరిగి
యన్విభుండు.

10


ఉ.

మేరువు గాంచె సంతతసమీహితఖేలనమోదితాప్సరో
భీరువు కందరాంతర[4]నిపీతమధూత్కటసిద్[5]ధగీతికా
చారువు నిత్యసేవనలసవ్యసనభ్రమదబ్జబంధుమం
దారువు దివ్య[6]ధామయుతదారువు సౌరభవన్న మేరువున్.

11


వ.

కని యందఱు నాత్మీయంబు లగుయానంబులు డిగ్గం దానును వైనతేయుని వలన
నవతరణం బొనర్చి.

12


సీ.

అమ్మహాశైలంబునందు మీఁదటినెత్తమున విశ్వకర్మచే మును విచిత్ర
రచనానిరూఢనిర్మాణమై కామగామిని యనఁ గామదోహిని యనంగఁ
గామరూపిణి యనఁగాఁ బెక్కువినుతుల వెలసినసభయందు వేఱువేఱ
యుచితంబుగాఁ బెట్టియున్నపీఠములలో నున్నతాసనము దా నొంది విష్ణుఁ


తే.

డబ్జజాదుల నందఱ నానుపూర్వి, నుండ నియమింప నొప్పెఁ బేరోలగంబు
యక్షగంధర్వసిద్ధవిద్యాధరోర, గాదులును వచ్చి కొలిచి రయ్యాదిదేవు.

13

తే.

[7]ఆ యెడను భూమిదేవి యాత్మీయమైన, మూర్తి ధరియించి యెంతయునార్తి దోఁప
నచటి కేతెంచె నిఖిలసురాళిచూడ్కి, గములు నంతంతఁ దనమీఁదఁ గడలుకొనఁగ.

13


క.

అక్కాంత డప్పి గని కడు, వెక్కసపడి పలుకుసభ్యవితతులపలుకుల్
దిక్కూలంకషనిననం, బక్కజమై యెసఁగె వెన్నుఁ డాకర్ణింపన్.

14


వ.

అంత వాయుదేవుం డక్కలకలం బంతయుఁ గేలెత్తి వారించి వసుంధరం జూచి
నీయాగమనకార్యం బంతయు విన్నపంబు సేయు మనినం గృతాంజలి యై యా
జగద్ధారణి యుదారధీరస్వరంబున ని ట్లనియె.

15

ప్రజాభారపీడిత యైన భూదేవి తనమనఃక్లేశంబు విష్ణున కెఱింగించుట

క.

ఈపురుషోత్తమదేవుఁడు, నీపరమేష్ఠియును వేల్పు లిందఱు వినఁగా
నాపాటెల్లం దగ వి, జ్ఞాపన మొనరింతు వినుఁడు సభ్యులు గరుణన్.

16


వ.

ఏను జగత్కర్తచేతం జరాచరభూతధారణం బధికారంబుగాఁ బ్రతిష్ఠిత నై
యుండుదు ని ట్లుండ నేకార్ణవకాలంబున విష్ణుకర్ణస్రోతస్సులవలన నుద్భవించి
యిద్దఱుదైత్యులు తపంబునకుం దొడంగి కాష్ఠకుడ్యసదృశు లై నిశ్చలం బగు
నిలుకడం బెద్దగాలం బున్నయంత.

17


క.

వారల దేహముల నవ, ద్వారంబులఁ జొచ్చి భూరివాయువు నాడీ
పూరణము సేయ నాశ్చ, ర్యారంభతఁ [8]బొదలి పెరిఁగె నఖిలాంగములున్.

18


వ.

ఇట్లు పెరిఁగి దిశలు నాకసంబుం దారయై యున్న యయ్యసురులకడకు బిసరుహాస
నుండు వచ్చి కరంబున నిరువుర నంటి చూచి యొక్క నియొడలు మృదువును
వేఱొక్కని [9]మేను కఠినంబును నైనం దదనురూపంబుగా వారికి మధుండునుం
గైటభుండు ననునామంబు లొనరించె ననంతరంబ వారు.

19


క.

తనువులవ్రేఁగున [10]మదముం, గొని నీళులనడుమ నిద్రగూరి యొరగి యె
న్న నగోచర మగుకాలము, సనుటయుఁ దెలివొంది పటుభుజాదర్పమునన్.

20


మ.

తమతోడం బెనగంగ నోపెడు సముద్యత్సత్త్వవంతుండు వి
క్రమదుర్దాంతుఁడు గల్గునొక్కొ యని యాకాంక్షన్ సమస్తార్ణవౌ
ఘములన్ రోయుచు నేఁగుదేరఁ గని [11]యాకంపించి యాశౌరి నా
భిమహాపద్మము సొచ్చి బ్రహ్మ యడఁగెన్ భీతిప్రకర్షంబునన్.

21


క.

ఆయవసరమున నెంతయు, నాయితమై యెదురు నడచె నసురరిపుఁడు దై
తేయులుఁ బ్రమోదవితత, వ్యాయతబాహులయి తాఁకి రవ్వీరవరున్.

22


వ.

వారలతోడ నద్దేవునకు ననేకదివ్యాబ్జసహస్రం బగుకాలం బద్భుతం బైన సమ
రంబు ప్రవర్తిల్లె నమ్మధుకైటభు [12]లొక్కించుకయు డప్పిం బొందక ఖేదరహితుం
డై యున్న వెన్నునివిధంబు చూచి యచ్చెరువు నొంది తద్భుజావిస్ఫురణంబు
నకుం దప్పిపోవం దమకు శక్యంబు గామియు నెఱింగి యతనితోడ.

23

తే.

మెచ్చితిమి నేము నీచేతఁ జచ్చుటయును, మాకు లెస్సయై తోఁచె నెమ్మనములందు
గమలనాభ చంపుము సలిలములు లేని, చోట నావుఁడు నాదైత్యసూదనుండు.

24


చ.

ఇరువురఁ జంకలం దిఱికి యేపెపలారఁగ బాహుపీడన
స్ఫురణ నొగిల్చి పెల్చఁ దెగఁజూచి జలంబులలోన వైచినం
దరళతరంగజాలములతాకునఁ దత్తనుయుగ్మకంబునం
[13]దొరఁగుచుఁ బేర్చి క్రొమ్మెండు తోరపుఁదెట్టువ గట్టె నయ్యెడన్.

25


క.

మేదస్సు పయిఁ [14]బొదువుటయు, మేదిని యన నాఁటఁగోలె మెచ్చగుపే రు
త్పాదించె నాకు నచ్యుతుఁ డాదరమున నర్థవేదు లభినందింపన్.

26


చ.

పిదప వరాహదేహమునఁ బేర్చిన [15]పంట నొకంట నన్ను ని
య్యుదధిజలంలో మునిఁగియుండఁగ నెత్తెఁ ద్రివిక్రమాత్ముఁ డై
పదమున నా కలంతయును బ్రాభవ మొప్పఁగ విక్రమించె న
భ్యుదయవిధాయి నాయెడఁ బ్రభుండు ముకుందుఁడు సర్వకాలమున్.

27


తే.

శంఖకౌమోదకీచక్రచారుహస్తు, నతవిధేయు [16]మన్నాథు ననాథనాథు
విష్ణుఁ బ్రభవిష్ణు జగదేకవిభునిఁ జెంది, యున్నదాన దిక్కరయ నాకొరుఁడు గలఁడె.

28


క.

గురుఁ డగ్ని సువర్ణమునకు, గురుఁ డర్కుఁడు తేకేజములకు గురుఁ డెల్ల నిశా
కరుఁ డఖిలతారకములకు, గురుఁ డెల్లవిధంబులను ముకుందుఁడు నాకున్.

29


క.

సకలచరాచర భేద, ప్రకటిత యగుసృష్టి యేను [17]భరియించు ప్రతి
ష్ఠకుఁ గతము వాసుదేవుం, డొకరుఁడె యాధారశక్తి నొసఁగుటఁ గాదే.

30


వ.

జామదగ్న్యుఁడు సర్వక్షత్రంబును నిశ్శేషంబుగా వధియించి రుధిరమాంసదుర్గంధ
దూషితయుఁ బరమవికీర్ణక్లేశయు నై రజస్వలయుంబోలె నున్న నన్నుం గశ్య
పునకు నధ్వరదక్షిణగా నొసంగిన నమ్మహాత్ము నాశ్రయించి.

31


తే.

పతులు వొలియుట విధవనై పాడువాఱి, యున్నదాన నే నేమిటి నోర్వ నింక
నోపు దీవు నన్నరయంగ నోపు భక్త, నిమ్ము కరుణింపవే సన్మునీంద్ర యనిన.

32


క.

మునినాథుఁ డట్ల కాకని, మనువున కిచ్చె నను నధికమహిమాన్వితుఁ డా
జనపతియు నాత్మవంశ్యులం, బనిచెం బరిపాటితోడఁ బరిపాలింపన్.

33


వ.

మహాకులీనులు [18]ధీరులు మునిజనసమ్మతాచారులు శూరులు నైన యాజగదేక
పతుల చేత ననుభూత నైతి వారు [19]నాకుఁగా బ్రతికి నాయంద కాల[20]వశత నొందిరి
మీ రెఱుంగనిపని లే దిప్పుడు రాజకుటంబు కొలఁదికి మిగిలి నాకు భరియింపం
గొలఁది గాకున్నది భారవహనక్లేశంబునం గృశియించి యున్నదాన నొక్కింత నా
మోపు వెలితిచేసిన బ్రతుకుదు నివ్విధం బివ్విష్ణుదేవుండు దలకొనియె నేని
నిర్వహించు నితం డూరకయున్న నది మదీయభాగ్యం బేమి సేయవచ్చు నిచ్చటి
పెద్ద లీదుష్కరంపుఁగార్యం బనివారఁంబుగా సంఘటింపం బ్రయత్నంబు సేయ

వలయు ననిన భూదేవివాక్యంబులకుఁ దత్సభాసదు లందఱుఁ దమలో విచా
రించి నిశ్చయించి విరించి కిట్లనిరి.

34


క.

ఈ దేవి యిట్లు దుఃఖిత, యై దూఱుఁగ నూరకుండ నగునే [21]మన కీ
వాదిభవుండవు భువన, ప్రాదుర్భావంబు నీకుఁ బని యట్లగుటన్.

35


సీ.

వాసుదేవుఁడు మహేశ్వరుఁడు విశాఖుఁడు వాసవుం డంబుధీశ్వరుఁడు యముఁడు
ధనదుండు చంద్రుండు తపసుండు పవమానుఁ డనలుండు సురమంత్రి యసురగురుఁడు
విశ్వులు రుద్రు లశ్వినులు సాధ్యులు యక్షగంధర్వరాక్షసగరుడభుజగ
కిన్నరప్రముఖులు గిరిసరిజ్జలధులు ననఁ బేరుకొన్న వీరంతపట్టు


తే.

వారుఁ దమతమయంశముల్ వసుధమీఁద, [22]నతులభూసురక్షత్రియాన్వయములందు
యోనిజులు నయోనిజులు గా నుద్భవింపఁ, జేసి భారావతరణంబు సేయవలయు.

36


క.

నావుడు మేలగు నిట్టులు, గావించుట లెస్స యని తగం బలికి జగ
ద్భావనుఁడు పద్మభవుఁడు సు, రావళితో మఱియు నిట్టు లనియెం బ్రీతిన్.

37

బ్రహ్మనిదేశంబున సముద్రుండు శంతనుం డై పుట్టినప్రకారము

క.

విను మేను తొల్లి సాయం, తనసమయమునందు వనధితటమునఁ బ్రజ్ఞా
ఘనుఁ డగుకశ్యపమునితో, ననుపమతత్త్వార్థగోష్ఠి నాసక్తుఁడ నై.

38


సీ.

ఉన్నంతఁ జంద్రోదయోద్దామదర్పుఁడై యాసరిద్విభుఁడు గంగాసమాగ
మంబునఁ బొంగారి యంబరచుంబిచంచద్వీచితతితోడ సరభసముగ
నేతెంచి మాయున్నయెడ నిండఁ దొట్టి యంతటఁ బోక మమ్మును దడుపుటయును
నేను నవ్వుచుఁ దగునే యిట్లు శాంతుఁడ వగు మని పలికిన నాక్షణంబ


తే.

శాంతుఁడై తనుత్వము నొంది చాఱుఫేన, వస్త్రుఁడును నూత్నకంకణోజ్జ్వలతరంగ
భుజుఁడు ముక్తామణిస్తోమభూషితుఁడు,నగుచు రాజన్యు[23]వలెను సొంపార నిలిచె.

39


వ.

అవ్విధం బాలోకించి యేను భావియగు దేవకార్యంబు వీక్షించుటం జేసి యతనితోడ.

40


క.

రాజోచితజృంభణమున, రాజాకృతితోడ సింధురాజ కడఁగి యీ
రాజసము నీవు చేసితి, రాజై యటుగాన యుర్విఁ బ్రభవింపఁ దగున్.

41


వ.

శాంతుండ వగు మని యేను పలికినం దనుత్వంబు నొందితివి గావున శంతనుం డనం
బరగెద వీగంగయు నిప్పు డెట్లట్ల నీకు భార్య యయ్యెడు ననినం దలంకి సము
డ్రుంగు గంగాసమేతంబుగా సాకారుం డై నాకుం బ్రణామంబు సేసి.

42


ఉ.

పర్వపుఁగాలముల్ జలదపఙ్క్తులతోఁ బవనంబు రేఁగి యం
తర్వలనంబు సేఁతయు సుధాకరదర్శనము న్మదూర్ములం
బర్వఁగఁ జేసె నాకు నిది పన్నుగ నైజము గాని యేమియున్
గర్వము గాదు శాప మొసఁగం దగునే జగదీశ దీనికిన్.

43

వ.

ప్రసన్నుండ వగు మనిన నే నతనిం జూచి లోకహితార్థంబుగా నూహించి చేసిన
కార్యం బపోహంబు నొంద నేర దీవు పరమపవిత్రం బగుభరతవంశంబున జని
యించి యీజాహ్నవియంద వసిష్ఠశాషదగ్ధు లై వచ్చిన వసువుల నుత్పాదించి
మఱియు సత్యవతి యనుపుణ్యవతియందు వంశకరు లగుకొడుకుల నిరువురం
గని క్రమ్మఱ నిజప్రకృతిం బొందఁగలవాడ వని విషాదంబు మాన్చితి నట్టిశంత
నునకుం బుత్రుం డైనవిచిత్రవీర్యునకు ధృతరాష్ట్రపాండుభూపతు లుద్భవించె
దరు వారిలోన.

44


తే.

పెద్దవానికి నూర్వురుఁ బిన్నవాని, కేవురును బుట్టుదురు సుతు లిద్ధతేజు
లట్టి యిరుదెఱఁగులకు రాజ్యాభిలాష, కలితమై పేర్చు నొకమహాకలహ మపుడు.

45


క.

ఘోరయుగాంతాకృతి యగు, నారణమున నుర్విఁ గలజనాధిపు లెల్లన్
వారికిఁ దోడై వచ్చి మ, హారోషత మ్రగ్గి పోదు రన్యోన్యహతిన్.

46


ఉ.

పీనుఁగుపెంటలై యొకటి [24]పేరును నెందును లేక యుండున
బ్లేనుఁగులున్ హయంబులు సమిద్ధజనావళియుం బడంగ ని
ర్మానుషరాష్ట్రదుర్గనగరప్రజయై తనభారమంతయున్
మాని సుఖించు నివ్వసుధ మానుఁ దృతీయయుగంబు నంతటన్.

47


వ.

కావునం గలహశీలుం డగుకలియంశంబు ధృతరాష్ట్రకళత్రంబునందును సర్వ
ప్రేరకుం డైనకృతాంతునంశంబు పాండురాజపత్నియందును జనించుఁ దక్కిన
వారియంశంబులు నుచితస్థానంబులం బ్రభవించు నని పలికినం బరమేష్ఠిపనుపు
నకు సర్వదివిజసమాజంబును నభినందించి యి ట్లున్న సమయంబున.

48

నారదుండు విష్ణునితోఁ గాలనేమి కంసుం డై పుట్టినతెఱం గెఱింగించుట

శా.

త్రైలోక్యాతిథియై విశృంఖలవిత్రప్రౌఢి నెల్లప్పుడుం
గేళిం గ్రుమ్మరు యోగసిద్ధుఁ డఖిలక్షేమంకరప్రజ్ఞుఁ డు
న్మీలన్మూర్తి వికాసనిర్జితశరన్మేఘుం డమోఘార్థవా
గ్జాలుం డబ్జజసూతి యైనముని వేడ్కన్ వచ్చె నచ్చోటికిన్.

49


క.

వచ్చి సభయెల్లఁ దనదెస, మెచ్చి కనుంగొనఁగ హరిసమీపంబునఁ బెం
పచ్చుగ నాసీనుం డై, యిచ్చ యెఱిఁగి వినయసముపహితవైదగ్ధిన్.

50


సీ.

మందారతరుపుష్పమంజరిమండితమస్తక యై యొప్పుమహితవీణ
ప్రసరించి త్రిస్థానబంధుస్థితిభేదములతోడ షడ్జంబు మొదలు గాఁగ
సప్తస్వరంబులు సారణావధి నభినవ్యక్తమూర్ఛనలతో నతిశయిల్ల
వాయించి [25]మధురదివ్యధ్వని మెఱయఁ జిత్రప్రబంధోజ్జ్వలతానరచనఁ


తే.

బూర్వభువనరక్షణము లాభోగములుగ, నద్భుతావతారంబు లింపారఁ బాడి
యఖిలలోకశరణ్యు దేవాదిదేవు, విష్ణు నలరించె సభ్యులు వేడ్క నలర.

51

వ.

తదనంతరంబ భక్తిప్రియపూర్వంంబుగా నద్దేవముని యద్దేవునకుం బ్రాంజలి యై
యిట్లనియె.

52


క.

మతిమంతుల కాద్యుఁడ వూ, ర్జితశక్తిసమన్వితులకు శ్రేష్ఠుఁడవు మహా
ధృతియుతులకుఁ బ్రవరుఁడ వ, చ్యుత నీయవి గావె సృష్టియును యోగంబున్.

53


వ.

కావున నిప్పుడు సకలక్షత్రియోపసంహరణార్థంబు దివిజు లిందఱుం గావింపం
బూనిన యంశావతారవ్యవసాయంబు భవత్పరిగ్రహంబు లేకున్న నింతయు
నిష్ఫలం బది యెట్లనిన.

54


మ.

ధరపై నీవు నిజాంశ మొక్కటి సముత్పాదించి దేవాంశజో
త్కరముం బాలన సేయఁ బేర్మి యెసఁగంగా వార లేపారి నీ
పరమోత్సాహముచే సనాథు లయి తీర్పంజాలి యుండుం గ్రియా
భర మెల్లమ బెఱనాఁడు గల్గునె తలంపం బ్రౌఢి యెవ్వారికిన్.

55


వ.

అది యట్లుండె నీ పార్థివక్షయకరణం బొక్కటియ కాదు దేవాంశజులకు నసా
ధ్యం బైన కార్యం[26]బు మఱియు నొక్కటిగ గల దదియ తలంచి కాదె యేను సత్వ
రుండ నై దేవరం దలఁపింప వచ్చితి నవ్విధంబు విన్నవించెద నవధరింపుము.

56


తే.

తారకామయం బను పేరిదారుణంపుఁ, బోర నీపరాక్రమమునఁ బొలిసినట్టి
యసుర లిప్పుడు మర్త్యంబునందుఁ బుట్టి, వాలి క్రతుహంతలైయున్నవారు దేవ.

57


సీ.

రఘురాముకడిమిచే రావణుం డనిలోన మడిసిన పిమ్మటఁ గడిఁదివీరుఁ
డమ్మహాసురుని మేనల్లుఁడు లవణుండు మధుదైత్యతనయుఁ డున్మార్గబలుఁడు
యమునాతటంబు ఘోరారణ్యముననుండి బాధ సేయంగఁ దపస్వు లెఱిఁగి
యెఱిఁగించుటయుఁ ద్రిదశేంద్రవంద్యుఁడు దనయనుజు శ్రుఘ్నునిఁ బనిచె నతఁడు


తే.

నరిగి శత్రునిఁ దెగటార్చి యడవియెల్ల, బయలుగాఁ జేసి యధికసంపన్నుఁ డగుట
[27]నొక్కనగరు నిర్మించె ననూనవిభవ, సారసంపన్నబహుజనోచ్చయము లలర.

58


వ.

అదియును మధువనంబునందు నిర్మిత యగుటం జేసి మధుర యను పేరం బ్రసిద్ధ
యై సమృద్ధజనపదసమన్వితయుఁ బ్రకటోద్యానతటాకగోపురవిలసితయుఁ బ్రశస్త
బహుభోగభూమియు నై నాఁటంగోలె నెన్నండును శూన్యంబు గాక
పరంపరాపరిపాలనంబునం బెంపుమిగిలె నిప్పు డప్పురంబున.

59


తే.

కంసుఁ [28]డనుపేరితో నాఁటికాలనేమి, భోజనంశోద్భవుం డగుభూవరుండు
నుగ్రసేనునకు జనించి యున్నవాఁడు, పూర్వదుర్వాసనాపరిస్ఫూర్తితోడ.

60


శా.

 రాజైయుండియు నెందు రాజగుణముల్ రాజిల్లు టొల్లండు స
త్పూజాయోగ్యత గల్గుబంధుతతికిం బొందీఁడు ఘోరాజులన్
రాజశ్రేణికి నెందు నోర్వభర మై భ్రాజిష్ణుతం గ్రాలు త
త్తేజం బాసుర మై తనర్చుటకు నుద్వేగించెఁ ద్రైలోక్యమున్.

61

క.

అతఁడు తనతండ్రిఁ జెఱనిడి, యతులితసామ్రాజ్యలక్ష్మి యంతయుఁ గొని యు
ధ్ధతభటవివిధాసురసే, వితుఁడై యున్నాఁడు నీచవృత్తిని నింకన్.

62


వ.

మఱియు హయగ్రీవుండు హయరూపధరుం డైనకేశి యై జనియించె బలిపుత్రుం
డగునరిష్టుండు వృషభాకృతి యగు నరిష్టుం డై ప్రభవించె ఖరుండు ఖరకాయుం
డగు ధేనుకుం డై పుట్టె లంబుండు ప్రలంబుం డై పొడమె [29]నిశుంభుండు
కువలయాపీడం బనుకుంభి యై కలిగె వరాహకిశోరులు చాణూరముష్టికు లను
మల్లు లై యుద్భవిల్లిరి వీ రెల్లనుఁ గాలనేమిసహచరులు కంసభృత్యు లై కాళిందీ
పరిసరంబున బృందావనంబున భాండీరకవటప్రాంతంబునఁ దాలగహనంబున మధు
రాపురంబునం జరింతురు. మయుండును దారుండు ననుదానవులు ప్రాగ్జ్యో
తిషంబున మురాసురునినందను లై నరకాసురునకు సహాయంబు నొనర్చెద రిట్లు
గూడిన యాదురాత్ములకు భవదీయగుణకథనంబులందు విద్వేషంబును భవత్ప్ర
భావంబులదెస నసూయయు నీవారైనవారలకుఁ బీడనం బొనర్చుటయు నైసర్గికం
బులై యుండు.

63


క.

కావున నీ వవతార, శ్రీ వెలయఁగ మర్త్యమున వసించి యఖిలదై
త్యావళిఁ ద్రుంపుము ధాత్రీ, దేవీభర ముడిపి నిలుపు దేవాంశజులన్.

64


సీ. అనుటయు దేవుఁ డిట్లను నీవు చెప్పిన యీదుష్టతతి జన్మహేతువులును
వీరలు చేయుదుర్విగ్రహంబులు లెస్సగా నెఱుంగుదు వీరు గాక మఱియు
నధికరౌద్రులు గాలయవనజరాసంధశిశుపాలకౌశికచిత్రసేను
లాదిగాఁ జెఱుతురు మేదిని నిందఱఁ బొరిగొనువాఁడ నబ్భరతకులము


తే.

పోరితంబును ఘియించి భూమిదేవిఁ, బ్రీతఁ గావించుపనియు నాచేఁతి దింక
నొకటి గలదు నా కెయ్యెడ నుద్భచింపఁ, దగినయెడ గల్గునో యది దడవవలయు.

65


వ.

అని పలికి లోకపితామహుం జూచి.

66


క.

భూతము లభవాభవముల, కీతఁ డధిష్ఠాత గాన యితఁ డెమ్మెయి సం
భూతికి ననుఁ బనిచెఁ బరము, హేతువు దా నెఱిఁగి యదియ యేఁ గైకొందున్.

67


వ.

అనినం బద్మగర్భుం డాభువనగర్భున కి ట్లనియె.

68

బ్రహ్మదేవుఁడు విష్ణునితోఁ గశ్యపుండు వసుదేవుం డై జనియించిన తెఱంగు సెప్పుట

సీ.

విను తొల్లి కశ్యపమునివరుఁ డబ్ధీంద్రుయజ్ఞధేనువులఁ బె క్కడఁచికొనిన
నతఁ డేఁగుదెంచి [30]నన్నానమ్రుఁడై కని యవ్విధం బెఱిఁగించి యార్తితోడ
జగదీశ నాసొమ్ము మగుడ నిచ్చెద నన్న ననుమతింపర యమ్మహాత్ముభార్య
లదితియు సురభియు నధ్వరంబులఁ గామదోహిను లవి నాకుఁ దోయనిధుల


తే.

నన్నిటనుఁ దమతేజంబు లాత్మరక్ష, సేయఁ జరియించు నాతపస్సిద్ధుఁ డొకఁడ
తక్క నొరుచేతఁ జిక్కవు దాన వలచి, నట్ల యామొదవులపాడి యనుభవించె.

69

వ.

ఇంకనైనను విడువం దగదె యది యట్లుండె.

70


ఉ.

ఎంతటివారినైన నొకయించుక ధర్మువు దప్పిరేని శా
సింతురు గాదె సద్విభులు చిత్తమునం దిడిచూడు మంతవా
రింతకుఁ జొచ్చిరేని తెఱఁ [31]గెయ్యది యెక్కడ లోకసేతు వ
త్యంతముపుణ్య మింతయును నారసి చేయుట నీకు నీశ్వరా.

71


క.

నా విని కశ్యపమునిదెస, నావిర్భూతమయి పేర్చె నస్మన్మతిఁ గో
పావేశము భావి యయిన, దేవహితంబును దలంచితిం దెల్లముగాన్.

72


వ.

అవి రెండునుం గారణంబులుగా నపుడు వరుణుం జూచి.

73


క.

ఏయాత్మతోడ గోవుల, నాయనహరియించె నట్టియాత్మయ కొని సు
శ్రీయుతుఁ డుర్వీస్థలి న, త్యాయతమతి గోపవర్యుఁ డై జనియించున్.

74


తే.

అతనిభార్య లిద్దఱుఁ దోన యరుగువారు, తప్ప దీతప్పునకుఁ దగుదండ మేను
నిశ్చయించితి [32]ననిన నప్పశ్చిమాధి, పతియుఁ గ్రమ్మఱఁ జనియె గోవితతిఁ బడసి.

75


వ.

ఇట్లు నాచేత శప్తుం డైన కశ్యపమునీంద్రుండు వసుదేవుం డన నుద్భవించి కంసు
గోవులకు నధికారి యయ్యె నతని పత్నులు దేవకియు రోహిణియు నై పుట్టి రయ్యి
ద్దఱు వనితలయందును నీవు నీ తేజంబు రెండంశంబులుగా విభాగించి యవతారం
బొనర్చి యదువంశంబు [33]బ్రశంస నొందింపు మవ్వరుణుగోవులుఁ దామై
పొడమిన గోవ్రజంబు లనేకంబులం బరిపాలించుచు నాత్మీయబాల్యంబు ప్రకట
కేళిలౌల్యంబు నొందింపంగలవాఁడవు.

76


శా.

నీలస్నిగ్ధవిలోలకుంతలము లున్నిద్రోరుబర్హస్ఫుర
చ్చూళంబుల్ వనమాలికాలలితవక్షోభాగముం గాంతిమ
చ్చేలాందోళనచారుకక్షమును నై శ్రీనాథ నీబాలగో
పాలాకారము చింత్య మయ్యెడు భువిన్ భవ్యాత్మకశ్రేణికిన్.

77


వ.

అని యిట్లు నీరజాసనుండు నిరూపించిన కార్యంబునం బ్రమోదంబు నొంది
గోవిందుం డందఱ వీడ్కొలిపి నిజస్థానం బగుదుగ్ధాబ్ధియుత్తరంబునకుం జనియెం
దదనంతరంబ.

78

నారదుఁడు కంసునితో విష్ణుమూర్తి కృష్ణుం డయి పుట్టఁగలవిధం బెఱిఁగించుట

క.

నారదుఁడు మథుర కరిగి యు, దారుం డగు నుగ్రసేనతనయునిసదన
ద్వారమున నిలిచి తత్ప్రతి, హారులు దోడుకొనిపోవ నటఁ బోవుటయున్.

79


ఆ.

ఎదురువచ్చి కంసుఁ డెంతయు నమ్రుఁ డై, యుజ్జ్వలాసనమున నునిచి వరుస
నర్ఘ్యపాద్యపూర్వ మగుపూజ యొనరించి, ముదితుఁ జేయుటయును మునివరుండు.

80


వ.

అతని వదనంబునం జూడ్కి నిలిపి తదీయులు విన ని ట్లనియె.

81

మ.

విను భాగీరథి లోనుగా ననఘ యుర్విం గల్గు తీర్థంబు లె
ల్లను నే నాడుచు దేవభూములకు నుల్లాసంబుతో నేఁగి సొం
పొనరన్ సూర్యసఖంబు నాఁ బరఁగు మేరూత్తుంగశృంగంబుపైఁ
గనుఁగొంటిం బరమేష్ఠిఁ దొట్టి సురసంఘం బేకతం బుండఁగన్.

82


క.

ఇట్టిపరస్పరమంత్రం, బెట్టిదొ యని యచట [34]నిలువ నే మని చెప్పం
బెట్టిదముగ నినుఁ జంపుట, కిట్టల మగువెరవు వెదకు డేర్పడ వింటిన్.

83


వ.

 మీ పెదతండ్రికూఁతు రైనదేవకీదేవి కయ్యెడు నెనిమిది యగు చూలు నీకు
మృత్యుహేతువు గాఁగలయది నిజం బిట్లు జనియించు పురుషుండు.

84


తే.

దేవతల కెల్ల శరణంబు దేవపూజ్యుఁ, డఖిలమునకు నాధార మనంతకీ ర్తి
యాత్మభవుఁడు సమస్తలోకాత్ముఁ డాతఁ, డెవ్వఁడో చెప్పనొయ్యన నెఱిఁగె దీవు.

85


క.

నీయోపినగతిఁ బ్రాణా, పాయప్రతివిధు లొనర్పు మర్థ మఖిలమున్
జేయుము పాత్రత్యాగం, బాయక భోగములు సలుపు మకళంకుఁడ వై.

86


వ.

ఇది యనంతరకర్తవ్యంబు నీమీఁది నెయ్యంబున నింతయు నెఱింగింప వచ్చితిం
బోయెద నని వీడ్కొని యమ్మహాముని నిజేచ్ఛం జనియెఁ గంసుండు నిజభృత్య
జనంబుల దెసఁ జూచి పెలుచ నవ్వి.

87


మ.

చతురుం డంచు నిలింపసంయమిదెసన్ సస్నేహ[35]మైయుండు మా
మతి మున్నెప్పుడుఁ గూళఁ డయ్యె నకటా మాబోఁటి సత్త్వాఢ్యులం
దతిహాస్యంబుగ నిట్లు వల్కఁదగునే యబ్జాసనుం దొట్టి యే
గతి నేవేల్పుల నేను గైకొనమి నిక్కం బాత్మఁ గానం డొకో.

88


తే.

మేలుకంటి నిద్రించితి మెలఁగుచుంటి, నొడ లెఱుంగకుండితి నెట్టు లున్ననైనఁ
గదిసి నాకుఁ గీడొనరింపఁగలుగువాని, నెఱుఁగ నిమ్మూఁడుజగముల నింతనిజము.

89


చ.

కినిసితి నేని [36]నిద్ధరణిఁ గీడ్పడఁ ద్రొక్కుదు [37]నంఘ్రులన్ దివం
బును దిశలుం బగుల్తు దృఢముష్టిహతిం బటుహుంకృతిన్ హుతా
శనపవనార్కశీతకరసంచరణంబులు నిల్వరింతు
పెనుపు గలంగునే గిరులు భేదిలినన్ జలరాసు లింకినన్.

90


వ.

అది యట్లుండె మఱియు నొకటి సెప్పెద.

91


చ.

కలపనగంప యీతపసి కాలును నోరును బాగుగాన కె
వ్వలనఁ బరిభ్రమించుచు నపాయపుఁబ్రేలరిమాట లాడి ధీ
రుల మదికైన నూరక విరోధ మొనర్చుచునుండు రాజులం
బెలుచన రేఁచి తెచ్చి తలపెట్టు వినోదపుఁదీఁటవోవఁగాన్.

92


వ.

అది యట్టిద యైన నే మిప్పుడు మన యరిష్టకేశిప్రలంబధేనుక పూతనాకాళియాహి
ప్రభృతులకుం జెప్పునది నారదుండు యదుకులంబువలన మన కపాయంబు

గల దని చెప్పెం గావున నెల్లయెడల నస్మత్పక్షదూషకుల వెదకి ప్రహరింపవలయు
గర్బస్టులగతియు నరసియుండుట లెస్స మీరును విగతఖేదుల రై యభి
మతభోగంబుల ననురాగంబు నొందుండు నన్నుం జెందినవారికి నేవెఱపులు
నెక్కడివి యని పలికి యభ్యంతర[38]భవనంబున కరిగి యాప్తజనంబులం బిలిచి
యేకాంతంబున.

93


సీ.

వినుఁడు నేఁడాదిగా మనదేవకీదేవి కుచితంపుఁగాపుగా నువిదపిండు
నునిచి యవ్వసుదేవుఁ డుండెడువిధమును నరయుచు నయ్యింతి యంటకుండ
[39]నాడెడువరుసలు నాథానసమయంబు మొదలుగా గర్భంబుమోచునెలలు
నెఱిఁగి ప్రసూతియయ్యెడుకాలమును నాకు నెఱిఁగించునది భర్తృహితము గోరు


తే.

వారు రేయును బగలును వంచనయును, నలసతయు లేక యిప్పని యాచరింపుఁ
డిట్టుసేఁతకు గారణం బిట్టి దగుట, దెలియకుండంగవలయు నెవ్వలన నొరుఁడు.

94


తే.

మంత్రముల నౌషధముల నమానుషంపుఁ
జందముల నోపి యుద్యోగ మెందఁ జేయు
నట్టివారికి ననుకూలమై ఫలంబు
నెఱపుఁ జూడుఁడు దైవంబు నిక్క మింత.

95


వ.

అని యిట్లు కంసుండు దేవకీగర్భధ్వంసంబునందు నిశ్చితుం డై విచారవిహ్వలం
బగుహృదయంబుతో నుండె నట బ్రహ్మసూనుండు విష్ణుకడకుం జని.

96


క.

తానుగ్రసేనుసూనుని, మానసము గలంచినట్టిమతమును నతఁడున్
బూని యొనరింపఁ జూచిన, యానీచక్రియయుఁ జెప్పె నవ్విభుతోడన్.

97


క.

చెప్పి తనయిచ్చ నరిగిన, నప్పరమేశ్వరుఁడు గర్భహననవిధంబుల్
దప్పించి తనకు జననం, బొప్పుగ సిద్ధించుచంద మూహించు నెడన్.

98

విష్ణుఁడు యోగమాయను యశోదకుఁ గూఁతు రై పుట్ట నియమించుట

వ.

స్వర్గలోకంబునందును మర్త్యభువనంబునందును గలవెరవు లన్నియు వెదకి
యద్దేవుచిత్తం బాపాతాళంబును న న్వేషించిన నచ్చటం దొల్లి కాలనేమిపుత్రులు
షడ్గర్భు లనువారు వారిజాసను నుద్దేశించి దేవాది[40]చతుర్విధభూతంబులవలనం
జావు లేకుండం బడయుటకుం దపంబు సేయం దొడంగిన నలిగి హిరణ్యకశిపుండు
కులశ్రేష్ఠుండ నైన నన్నుఁ బరిత్యజించి యొరుని యీఁగియ యాసపడితిరి గావున
మీకుం బేరువెట్టి పెనిచిన తండ్రిచేతన చావంగలవా రని యధోగతులం జేయు
టయు సలిలమగ్ను లై యుండ నవ్విధం బేజింగి విహంగమగమనుండు.

99


చ.

చని తనయోగనిద్ర సురశత్రులయాత్మలఁ జెందఁ బంచ న
త్యనుపమకాలరూప యగునాయమ కిట్లను నీవు వేగ నా

పను పొనరించితేని నవపద్మనిభానన మెచ్చి యిచ్చెదన్
మునివిబుధేంద్ర విస్మయసముద్భవకారిణి యైనయున్నతిన్.

100


వ.

అది యెయ్యది యనిన.

101


సీ.

అతివ యీషడ్గర్భు లనుదానవులఁ గ్రమంబునఁ గొనిపోయి సంపూర్ణపుణ్య
నగు దేవకీదేవియందు గర్భములుగా నావహింపఁగఁ గంసుఁ డదయహృదయుఁ
డందఱం బుట్టినప్పుడ చంప నేడవుచూలు నాయంశ మవ్వరాంగి
యుదరంబు నెలకొన్న నొయ్యన వేడవునెల రోహిణీగర్భ [41]మెలయఁ జేయు


తే.

మదియ నాకగ్రజుం డయి యవతరించు, గర్భసంకర్షణమున సంకర్షణుఁ డనఁ
గంసభయమున నింతికి గర్భపాత, మయ్యె ననుజనవాదంబు నపుడు గలుగు.

102


వ. తదనంతరంబ యష్టమగర్భం బై వసుదేవుదేవి యుదరంబున నేను నిలిచెద నంద
నా ధేయుం డగుకంసగోపతిభామిని యైన యశోదకడుపున నీదగుతేజంబు నెలవు
కొన నిద్దఱమును సమకాలంబ యష్టమ్యవసానంబున నవమీముఖంబున
నర్ధరాత్రసమయంబునందు జనియింతము మనకు బరస్పరవ్యత్యాసంబు సంభ
వించినం గంసుం డెఱుంగమిం జేసి నిన్ను శిలాతలంబున వ్రేయం బూన్చిన నీవు
వంచించి గగనంబునకు నెగసి మత్ప్రసాదంబున మహానుభావ వయ్యెద వవ్వి
శేషంబునంజేసి.

103


సీ.

నా మేనితోఁ దుల్యమై మేను నవమేఘకాంతి నొప్పార సంకర్షణునకు
నెన యైనవదనపూర్ణేందుండు శోభిల్ల నెనిమిది బాహువు లెసఁగి శార్ఙ్గ
చక్రగదాఖడ్గజలరుహమధుపాత్రముసలశూలముల నుల్లసితములుగ
నుజ్జ్వలహారకేయూరాదివివ్యభూషణగంధమాల్యవిస్తారలీల


తే.

నీలకౌశేయవసన వై నిఖిలసిద్ధ, గణము పూజింప దివి కేఁగఁగలవు నిన్ను
నెదురువచ్చి తోడ్కొనిపోయి యింద్రుఁ డెలమి, నాదిశక్తిగ నభిషేక మాచరించు.

104


వ.

నీవు నాకు నక్కౌశికునకుం జెలియల వై [42]కౌశికి యనుపేరం బ్రసిద్ధివహించి
వింధ్యాచలంబు నివాసంబుగా నుండి గుంభనిశుంభులను దైత్యుల వధియించి
లోకహితం బొనర్చెదవు శ్రీయు ధృతియు గాంతియు హ్రీయు విద్యయు సన్మ
తియు మతియు సంధ్యయు రాత్రియుఁ బ్రభయుఁ గాంతియు(?) నిద్రయుఁ గాల
రాత్రియు నను నామంబులు నీకు వాచకంబులుగా మహామునులుం గీర్తింతు
రార్తు లై కొలుచువారికి దారిద్ర్యబంధనవధప్రముఖంబు లగుగురుదుఃఖంబు
లపనయించి యాయురారోగ్యధనధాన్యపశుపుత్రభృత్యాదికంబు లగుకల్యా
ణంబులు గరుణింపు మేనును గంసధ్వంసంబు గోరి యతని గోవులం గాచుట వినో
దంబుగాఁ గొంతకాలంబు నడపెద నని యానతిచ్చిన నద్దేవి యక్కార్యంబున
కియ్యకొనియె నచ్యుతుండు నచ్చోటన యంతర్హితుం డయ్యె నంత నిక్కడ.

105

తే.

యోగనిద్రాప్రభావసంయోజననమున, నొలయుషడ్గర్భులను గర్భముగఁ దాల్చె
ధీరతమ యగువసుదేవుదేవి దనకుఁ, [43]దివురుదేహదుఃఖం బెల్ల నవధిఁ బోవ.

106


చ.

అరసి ప్రసూతికాలమున యప్పుడు దక్షు లెఱింగి చెప్పఁగాఁ
గరుణ యొకింత లేక యెఱగందుల దేవకిగన్నయార్వురం
బరుషవిశాలఘోరశిలపైఁ గడకాళులు వట్టి వ్రేసి యా
సురముగఁ జంపెఁ గంసుఁ డురుశోణితము ల్చెదరంగఁ జెచ్చెరన్.

107


వ.

సప్తమగర్భంబు సప్తమం బగుమాసంబున విష్ణుని యోగనిద్రచేత సంకర్షించు
కొని పోవంబడి గోకులస్థిత యైనరోహిణి యుదరంబు నొందె నివ్విధంబున గర్భ
శోభనంబు సంప్రాప్తం బై.

108

రోహిణీదేవిగర్భంబుననుండి బలరాముం డవతారంబు నొందుట

క.

నెలలన్నియు నిండఁగ న, న్నెలఁతకు జనియించె నిండునెల పున్నమకున్
నెలకొని యుదయించుపగిది, నెలమఁగొడుకు సకలకువలయేచ్ఛాకరుఁడై.

109


వ.

ఇట్లు పూర్వవిహితనామధేయుం డగుసంకర్షణు జన్మానంతరంబ.

110


క.

దేవకియష్టమగర్భము, దేవోత్తముఁ డై నవిష్ణుదేవునియంశం
బావిష్కృత మయ్యె నఖిల, దేవహితార్థంబు దీప్తదివ్యవిభూతిన్.

111


క.

పదునాలుగుజగములు దన, యుదరంబున నునిచికొన్నయుదితమహిము నే
ర్పొదవంగఁ దాల్చె గృశమగు, నుదరంబున నువిద భాగ్యయోగముపేర్మిన్.

112


సీ.

పొక్కిట నెత్తమ్మి పొలుచునియ్యమపట్టి కనువిధంబునఁ దనరారె నాభి
హరినీలవర్ణుఁ డీహరిణాక్షిసుతుఁ డనుచాడ్పున నలుపెక్కెఁ జన్ను మొనలు
ధవళాబ్జనిభము లీతరుణీపుత్త్రునికన్ను లనులీల గడుఁ దెలుపారెఁ జూడ్కు
లధికనిద్రాళుఁ డీయబల[44]తనూజుఁ డన్భాతి జెయ్వుల జడభావ మొందెఁ


ఆ.

దనువు వెలరువారెఁ దగిలెఁ గోర్కులు కౌను, వొదలె వళులు విరిసె నొదవెఁ జెమట
లినసమానగర్భజనితశ్రమసమీర, ణమ్ము లమరె వికచనలినముఖికి.

113


క.

ఏదివసం బాదిగ ని, ట్లాదేవకి దాల్చె గర్భ మదియ మొదలుగా
మోదమున నందపత్ని య, శోదాదేవియును లీలఁ జూలు ధరించెన్.

114


వ.

[45]అంత నిక్కడ దశమమాసంబునందు.

115

దేవకీదేవిగర్భంబున నుండి శ్రీకృష్ణు డవతరించుట

మ.

మహితశ్రావణమేచకాష్టమి నిశామధ్యంబునం బ్రస్ఫుర
ద్గ్రహముల్ స్వోచ్చగృహంబులం ద[46]యిదు విభాజిల్లఁ [47]బుత్రున్ యదూ
ద్వహుఁ బుణ్యాంగన గాంచె విశ్వజగదాధారోదయున్ ధర్మని
ర్వహణారంభధురీణు నిత్యవిభుతావర్ధిష్ణునిం గృష్ణునిన్.

116

వ.

ఆదేవు దివ్యావతారంబున సకలచరాచరంబులుం బ్రమోదభరంబు నొందె మంద
సమీరుండు సమీరితసౌరభసుఖస్పర్శుం డై చరించెఁ దాపసాగ్నిహోత్రంబులు
ప్రదక్షిణజ్వాలాజాలంబు లై వర్తిల్లె సాగరంబులు సమ్మదసంభ్రమంబులం బొదలె
దిశలు ప్రకాశంబు లయ్యె నంబరచరంబు లగుతేజంబులు తేజో[48]తిశయంబున
మెఱసె నంతర్ధానగతు లై యాదిత్యులు మోదంబునఁ గుసుమవర్షంబులు గురి
యించుచు ననేకవాక్యంబుల నమ్మహాప్రభావుం బ్రస్తుతించిరి దివ్యంబు లగువాది
త్రంబులు ప్రదీపధ్వనులం జలంగె గంధర్వగానంబులు నప్సరోనర్తనంబులుం
బ్రవర్తిల్లెఁ బాతాళవాసు లగువాసుకిప్రముఖు లుల్లాసభాసితు లై రిట్టి[49]వై జనన
సంప్రమోదసంకులంబునంద.

117


ఉ.

కావలివారిఁ దొట్టి పురిఁ గల్గుజనంబులలోన గాఢని
ద్రావివశత్వ మొందనివిధంబున వాఁ డొకరుండు లేఁడు ల
క్ష్మీవరుమాయఁ జేసి గతచేతసులై నటు లుండి రయ్యెడన్
దేవకియుం బ్రభుండు వసుదేవుఁడుఁ దక్కఁగ నెల్లవారలున్.

118


క.

ఆవృష్ణివీరుఁ డాత్మజు, నావిర్భావము నెఱింగి యంతర్గృహమున్
వేవేగఁ జొచ్చి నడురే, యావనజాప్తుండు వొడిచిన ట్లై యుండన్.

119


మ.

నెఱులై యొప్పు వినీలకేశములు నున్నిద్రాననాబ్జంబు నే
డ్తెఱ నూత్నాంబుదతుల్యకాంతియును నై దివ్యప్రభావంబునం
గఱయున్ మాఁగును లేక పుట్టినశుభాంగం బద్భుతాపాదియై
నెఱయం గన్నులు విచ్చిచూచుతనయున్ వీక్షించి మోదంబునన్.

120


తే.

పాపకరుండు కంసుఁ డీపట్టిఁ బట్టి, యెగ్గుసేయంగ నకట యే నెట్లు సూతు
నెవ్వరును గానకుండంగ నిపుడ కొనుచు, నరిగి యొండుచో డాఁచెదనని తలంచి.

121


సీ.

ఏ వేదనయు [50]నొంద కింపారఁ బుత్రునిఁ గని యింక [51]నెట్లొకో కర్జ మనుచు
నివ్వెఱపడి యున్న నిజపత్ని కవ్విధం బల్లన యెఱిఁగించి యవ్వరాంగి
తొడలపైఁ గల్పాంతతోయధివటపత్రతలమునం దున్నచందమున నున్న
శిశువు నొయ్యన నెత్తి చేతుల నల్లనఁ బొదివి చెచ్చెర నంతిపురము వెడలి


తే.

నందగోపునింటికిఁ జని నవ్యసూతి
యయ్యశోదయు విష్ణుమాయావిమూఢ
యగుట నొం డెఱుంగక యున్కి నాతఁ డచటఁ
గొడుకుఁ బెట్టి యాయమగన్నకూతుఁ గొనుచు.

122


వ.

మగుడఁ జనుదెంచి దేవకీదేవితల్పంబున [52]నిడి తాన పోయి తత్ప్రసవసూతంబు
కంసునకుం జెప్పిన.

123

మ.

తలయుం జీరయు వీడ సంభ్రమముతో దైవోపఘాతంబునం
గులఁకం గ్రుళ్లుచుఁ బాఱుతెంచి వెస నాకంసుండు తత్సూతికా
నిలయద్వారము నందు నిల్చి శిశువుం దేతెమ్ము తె మ్మంచు నా
కులుఁడై పల్కఁగఁ గృష్ణమాతయును సంక్షోభార్తయై యత్తఱిన్.

124

కంసుండు యశోదకుఁ గూఁతురై పుట్టిన యోగమాయం జంపం బూనుట

క.

[53]అన్నా యలుగకుమీ నా, కన్నది యిదె యాఁడుబిడ్డ గావుము దీనిన్
ని న్నొకటి సేయఁ గలదే, కన్నియ యతిలోకపురుషకారసమగ్రున్.

125


ఆ.

మొదలఁ బెక్కుగర్భములు నీబ్రదుకు గోరి, వరుస [54]నొప్పింపనే మగవారలైన
నుడుగవయ్య యాగ్రహము నాయెడఁ బ్రసాద, దృష్టి పరఁగింపవే జగద్వినుతవిభవ.

126


వ.

అని [55]ప్రార్థించిన నచ్చటివనిత లొక్కపెట్ట హాహాకారంబు లొనర్ప నభ్యంతరంబు
సొచ్చి యచ్చెడుగం డప్పాప నెప్పటిరాతితో నడుచుటకై [56]పూని యెత్తిన మెత్తనఁ
బ్రిదిలి చదలి కెగసి యయ్యుగ్మలి యద్భుతాకార యై యం దుండి.

127


క.

తనచేతిపానపాత్రం, బున [57]నొలికెడు దివ్యమధువు ముదమున నాస్వా
దన మొనరించి మదోద్ధత, నినదంబునఁ బెలుచ నవ్వి నిష్ఠురభంగిన్.

128


వ.

భయవిస్మయ[58]ంబులు మనంబునం బెనంగొనం గనుంగొను భోజపతి నుద్దేశించి.

129


ఉ.

ఓరిదురాత్మ నన్ను నిటు లుగ్రతఁ బట్టి శిలాతలంబుపై
[59]బోరన వ్రేసి చంప నిటఁ బూనిన తప్పున కేను నిన్ను నీ
దారుణశత్రుఁ డాహవవిదారితుఁ జేయఁగ మృత్యుమూర్తి నై
క్రూరతఁ బ్రాణముల్ రుధిరకుల్యయుఁ గ్రోలుదు నొక్కపూఁపునన్.

130


క.

ఇంకేమి త్రుళ్లఁగల విదె, యింకె నహంకారపంక మెల్ల ననుచు ని
శృంకత నద్దేవి సనియె, సంకుల మై తన్ను సిద్ధసంఘము గొలువన్.

131


వ.

ఇక్కడఁ గంసుండును దేవకీదేవికిం గృతాంజలి యై యి ట్లనియె.

132


ఉ.

ఏనిటు ప్రాణరక్షకయి యెంతయుఁ బాపము సేసి గర్భసం
తానవిఘాతి నై నిను నుదంచితశోకపయోధి ముంచితిం
బూనినమత్కృతం బఖిలమున్ వృథ యయ్యె విధాతచెయ్ది యె
వ్వానికి మాన్పఁగా నకట వచ్చునె మానుష[60]తుచ్ఛయత్నతన్.

133


క.

విను చంపఁ జెఱుప మను ను, ఘనతర మగుకాల మొకఁడ కర్త మనుష్యుం
డు నిమిత్తమాత్ర మింతియ, యనయమ్మును గాల[61]పాక మైనక్రియలకున్.

134

తే.

 కాన నింతయుఁ దలపోసి మాను మింక, నఖిలదుఃఖచింతామయం బైనకలఁక
యేను గాలుగేలును బట్టి [62]యిదె వినీతి, వేఁడికొనియెదఁ బరమపవిత్రచరిత.

135


వ.

అనిన నద్దేవి యశ్రుపూర్ణనయన యై తండ్రి యిట్టిశోకంబు [63]నా కనుభవింపను
మద్గర్భంబులకు [64]నిట్టిపోకలం బోవను మున్న కడకట్టినతెఱంగు నీ వేమి సేయు
దని యుచితంబుగాఁ బలికెఁ గంసుండును నిజగృహంబున [65]కరిగె నంత నాప్రొద్ద
వసుదేవుండు.

136


క.

ముద మెసఁగ నందగోపుని, సదనంబున కేఁగి పుత్రజననంబున స
మ్మదభరితుఁ డైనయతనిని, హృదయప్రియసుహృదుఁ గాంచి యిట్లనియెఁ దగన్.

137


మ.

సుతు [66]నత్యద్భుతలక్షణాన్వితునిఁ దేజోభాసితుం గంటి వీ
వతిధన్యుండవు భామినీసహిత మీయాత్మోద్భవుం గొంచు ధీ
యుత మీచోటగుగోకులంబునకుఁ [67]బొ మ్మున్నాఁడు వ్రేపల్లె నా
సుతుఁ డారోహిణి గన్నవాఁడును భవత్సూనుండ కాఁ జూడుమీ.

138


ఆ.

వాఁడు పెద్దవాఁడు వీఁడు రెండవపట్టి, యనుతలంపుతోడ ననఘ నీవ
పెనుపు మడవిలోనఁ బెక్కపాయంబులు, గలుగు నేమఱమియు వలయుఁజుమ్ము.

139


ఉ.

పుట్టఁగఁ బుట్టఁగాఁ దునిమెఁ బుత్రుల దేవకి గన్నయందఱం
గట్టిఁడి పాపజాతి యగుకంసుఁడు తద్విధి చిత్తమున్ వగం
బెట్టెడు రోహిణీకలితపిండ మొకండును దప్పె వీని నీ
వెట్టయినన్ మహాత్మ భరియింపుము దీవనఁ బొందు మెంతయున్.

140


వ.

ఇంక శిశుఘాతిని యగుపూతనకుఁ గంసుపసుపున శిశుహింసాన్వేషణంబ పనియై
యుండు నీ వీప్రొద్ద యిచ్చోటు వాసి చని వేగకమున్న మంద సొరవలయుం గులా
యలీనంబులగుపక్షులు వేగుటెలుంగులు సూపెడుఁ బ్రాగ్దిశాభాగంబునఁ (బ్రారబ్ధ)
ప్రభాకరధ్వజవికాసం బగుచుఁ జనుదెంచె నీకు నిప్పురంబునం గరప్రదానం బొన
రింప వచ్చినపనియును సంపన్నం బయ్యెఁ దడయవలవ దనిన నట్లకాక యని యగ్లో
పముఖ్యుండు.

141


తే.

పురిటిపాపనిఁ దొట్లెలోఁ బొందుగాగఁ, బెట్టి మోపించుకొని తాను బ్రియసతియును
మేటిగుజ్జులఁ గట్టినపాట[68]బండి, యెక్కి శీఘ్రంబ మందకు నేగె నెలమి.

142

నందుఁడు మధురాపురంబుననుండి వసుదేవు నాజ్ఞచే వ్రేపల్లెకు వచ్చుట

వ.

ఇట్లు చని పుష్పితఫలితానేకతరుషండమండితం బగుకాళిందీతటంబున నలుదెసలం
బొడవుగా నమర్చిన బలితంపుములువెలుగులం గరంబుజతనంబులై యొప్పు [69]పెను
దొడ్లం గ్రమంబునం బ్రమోదంబున వేఁకువం బోఁకు మేసి వచ్చి రోమంథవదనం

బుల విహితశయన లై సుఖియించు కదుపులలోనఁ [70]బేరుపేరం బిలువం బంచి
తిల్లుచు నుల్లసితహుంకారంబు లగువదనంబులతో నున్ముఖలగు తల్లులకు నభిముఖం
బు లై హర్షప్రతినినదంబులు వొదలం బొదులనుండి యొండొంటి [71]దాఁటుకొని
కలయు బాలవత్సంబుల [72]యుత్సవసంచారంబులవలనను వెదయావుల వెనుకం దగిలి
యొండొంటిం జేరనీక బలియు [73]ఱంకెలం బొదివి కాలు ద్రవ్వి క్రోడాడుచుఁ బొగరు
మిగిలి [74]కఱకెక్కిన మెడలును వలుదమూఁపురంబులును వెడఁదవీఁపులును దోరంపు
గంగడోళ్లునునై క్రాలువృషభంబుల దర్పవికారంబువలనను మొదవులనోరినురువు
లుం బెయ్యలరేణంబులుం బాలకుండలమసులునుం దమయొడళులకు [75]నెడపడని
తొడవులు గాఁ బిదికి యురుద్రాళ్లు[76]ం దలుగులు తల మొలలం జుట్టి యిట్టునట్టునుం
గలయం బాఱి క్రేపుల నేర్పఱించువారును వల్లియలు వైచి కోడెలం బట్టి పెనఁచి
[77]కాలురులం బట్టి జట్టికాండ్రకు వసంబు సేయు బరవసం బెసంగఁ గ్రుమ్మరువారును
జూఁడుఁ గొడుపులును వాదోళ్లు ముకుబంతులు మొదలుగాఁ గలసాధనంబులు
గొనివచ్చి తేవులుగొంటులఁ జికిత్సంచువారును గ్రేపులం గొననియావులం దొలఁగం
గట్టి పిళ్లువెట్టియు మందులుసల్లియుం జాలదుఃఖపఱచి చేఁ పెఱుంగించువారును
మఱియుఁ బెక్కువిధంబులఁ దమతమకై యెడపడని కావటిమోపులకతనం గంది
కాయలు గాచి వంగినవలుదమూఁపులును ముదుకవెన్ను [78]లంటికొనుట మెదుక
గొని మొదుకనయి పిడిచినం బొల[79]వలచుచుండుతలలును బసులకొమ్ముల [80]తాఁ
కుల నడవిక్రంప [81]యేట్లమన్నియమ్రుచ్చుల పోట్ల బెరసిన గంట్లం గఱకెక్కినయవ
యవంబులు నెఱ్ఱసెరలతోడి కపిలకన్నుల వెడంగుఁజూపులును బెడిదంబు లగు
[82]గౌరుటెలుంగులుం గలిగి యెల్లయెడలనుం ద్రుళ్లు గొల్లలపెల్లువలనను జను
కట్టులుగట్టి భుజమూలంబుల జిగిసొంపు [83]లం గలసి మెఱసి నెఱయం జిలుమూరు
నిత్తడికడియంబులుం గంచుటుంగరములు నమరం గొమరారు నాఁచుదీఁగలు
గలయం బ్రాఁకినం బొలుచు కెందామరలం దెగడుచేతులం గడవలవాతులు
పదిలంబులుగా [84]15 నూఁది చెదరిన చికిచికివెండ్రుకలు [85]పొదుపుటం జిఱు మొగులు
మొలకలు బలసినకొఱనెలలకుం బాటియగు నెన్నుదురుల నున్నచెమరులు దురం
గలింప గరువంపుడప్పి యొప్పు నిదురయూర్పులుం దమలో [86]బెరసి యాడుమాటల
తమకంబున నినుమడి యై నిగుడ వడవడవడంకుచున్న [87]చన్నుగవలును వ్రేఁగు
పడు పిఱుందులుం బొలయు చూడ్కులు నై యొక్కొక్కతోయంబునంగూడి
సరిత్తోయంబులం దెచ్చు జలవాహికలును గాంచనకంకణఝణఝణత్కారంబులం

గంఠసూత్రవలనంబుల బాహులతాందోళనంబులం బయోధరసంఘర్షణంబుల
శ్రోణిసన్నహనంబుల మృదుగీతమాధుర్యంబుల మనోహరంబు లగుదధిమథన
వ్యాపారంబులం (జాలఁ) బారీణ లగుబాలికలును ఘృతతక్రవిక్రయంబు గృహ
సమ్మార్జనంబు శిశుసమాశ్వాసనంబు బాలకభృతకభుక్తిప్రదానంబు మొదలయిన
పనులం జిడిముడి [88]పాటు వెలయ మెలంగు గరిష్ఠకుటుంబినులును నైనగోపికల
యుదాత్తచేష్టితంబులవలనను సర్వప్రకారసుభగం బయి నవతృణచ్ఛన్నకుటీ
కవాటంబును ననర్గళాలక్షితవాస్తుసీమంబును విశంకటశకటనికటార్పిత మంచ
కంబును నాజ్యపచనసుగంధియును [89]దప్యమానదగ్ధచూత్కారముఖరంబును
నర్భకకబళవిగళితమస్తుసిక్తకరీషస్థలంబును దధిబిందుసుందరవేదికంబును నైన
యమ్మహాఘోషంబు బ్రవేశించి.

143


తే.

వృద్ధు లగుగోపముఖ్యులు వేడ్కఁ దన్ను, నెదరుకొని యభినందింప నింపు మిగులఁ
దాను నందఱ నధికహృద్యముగఁ బలికి, యాదరించుచు వారుఁ దో నరుగుదేర.

144


వ.

నిజసదనంబునకుం జని వృద్ధగోపికలు పుత్రసమన్విత యగుయశోదకు నొనర్చు నవ
సూతికామంగళం బంతరంగంబు హర్షోత్తరంగంబు గావింప బాలార్కసన్నిభుం
డగుకుమారు రోహిణి యెదుర్కొనిన నద్దేవికి సభక్తికంబుగా సంభావనంబు
గావించి భావం బలరం బూర్వప్ర కారంబున నుండె నిట్లు కృష్ణుండు గోకులంబున
గోపికాపర్వం బై యత్యద్భుతం బగు ప్రభావం బపరిభావ్యంబుగా నుండునంతం
గొన్నిదినంబు లరిగిన.

145


క.

మును కంసునిపనుపున గ, ర్భనిపాతము శిశువధంబ పనిగా నెచ్చో
టను దిరుగు ననుజనివహం, బున కగ్రణి దురితచరిత పూతన యనఁగన్.

146


వ.

ఘోరాకార యగునిశాచరి నిశాసమయంబున నర్భకుల వెదకుచుం జనుదెంచి
నందగోపశకటంబుక్రిందం దగుతల్పంబున నుత్తానశాయి యై యున్నవెన్నుని
యంతికంబున నంతంత నిలిచి.

147


క.

ఆమూర్తి యట్టి తేజం, బామహిమ నిజాంతరంగ మద్భుతభీతి
వ్యామోహితంబు సేయం, గా మెత్తనఁ గొంత సేపు కనుఁగొని యలుకన్.

148


క.

వీఁ డెల్లపోటిబాలుఁడు, గా డాకంసునకుఁ గీడు గావించుటకై
పోడిమి యెసఁగ జనించిన, వాఁడ యగును వీనిఁ దునిమివైచెద నంచున్.

149


సీ.

పండ్లులు గొఱుకుచుఁ బదరి హుమ్మని [90]మిడిగ్రుడ్లుల నిప్పులు గుమ్మరిలఁగ
నదరెడుకటములు నాకుంచితము లగుబొమలును నుదుటిపైఁ బొడముచెమట
[91]మెఱుఁగుకోఱలుఁ బేర్చి యెఱమంట లందందఁ జల్లెడుబహుళనిశ్వాసములును
నాగ్రహంబునఁ [92]బొరి నాకంపితము లగుకరములునై భయంకరము గాఁగ

తే.

జనని [93]పొదిగిట నున్నబాలునిఁ గడంక, నెత్తికొని ఱొమ్ముపై నిడి యొత్తి [94]విషపుఁ
జన్ను మొనలు తదాననాబ్జమున నదిమె, నదుముటయుఁ బాపఁ డార్తుఁడై నట్లపోలె.

150

శ్రీకృష్ణుఁడు పూతనప్రాణంబులు స్తనదుగ్ధంబులతోడం గొని చంపుట

ఉ.

ఎత్తిలి కావు కావు రన నేడ్చి తదీయపయోధరాగ్రముల్
కుత్తుకదాఁకఁ బెట్టికొని క్రోలెఁ గ్రమంబునఁ జన్నుఁబాలతో
నెత్తురు మున్నుగాఁగ గణనీయము లై చనుసప్తధాతువుల్
పొత్తుగఁ బ్రాణము ల్చెనఁటిబొందియ త్రిక్కఁగ నొక్క వ్రేల్మిడిన్.

151


క.

రక్కసికిని దా నెక్కుడు, రక్కసియై కృష్ణుఁ డిట్లు క్రౌర్యావేశం
బక్కజముగఁ బచరింపఁగ, నక్కుటిలాసురియు గెడసె హాయనుచు భువిన్.

152


తే.

అధికవిస్వరం బైనయయ్యార్తనాద, మునకు మందలోపలఁ గలజనము లెల్ల
మేలుకొని రటమున్న యబ్బాలు నేడ్పు, విని యశోదయు మేల్కని విహ్వలించి.

153


వ.

తన ముందట మును ప్రసుప్తుం డైననందనుం గానక నందగోపునిం బిలిచిన
నతండు నాలోనన యుదరిపడి తెలిసి పఱతెంచి ని ట్లెల్లవారు[95]నుం జనుదెంచి శక
టాంగమాత్రంబు లగు నేత్రంబుల గ్రుడ్లు దిరుగంబడి వికృతంబు లై మెఱవ నతి
మాత్రదీర్ఘంబు లగుపాణిపాదంబులు విరియం బడి యొడలు పగిలి యెమ్ములు
నలిసి చర్మంబు ప్రోవై యున్నయన్నిశాచరిచందంబునకు నాశ్చర్యంబును భయం
బునుం బొంది తదుత్సంగంబునఁ బతంగుభంగి నెసంగు కృష్ణునిం గాంచి రప్పుడు.

154


తే.

ఆకట నేఁ జెల్ల నేఁ జెల్ల హాకుమార, హాతనూభవ హావత్స యనుచు నార్తిఁ
దల్లియును దండ్రియును వచ్చి తనుజుఁ బొదివి, రమ్మృగేక్షణ బాష్పాకులాక్షి యగుచు.

155


వ.

బాలుని గ్రుచ్చియెత్తి యురంబున నదిమికొనిన నందుండు నయ్యిందువదన నిది
యేమి యీరక్కసి యెక్కడ నుండి వచ్చె నిచ్చిఱుతవాని నీచందంబు సేయుట
యెల్ల నీ వేల యేమఱి తనిన నయ్యబల యతనితోడ.

156


తే.

కడుపునిండఁగఁ జన్నిచ్చి కొడుకు నిద్ర, వోవ దీవియ మండంగఁ బ్రొద్దువోవు
నంతదాక మేల్కనియుండి యలసి కన్నొ, కింత మూసితి నాలస్య మేది యిందు.

157


క.

ఈపాపజాతి రక్కెస, యేపగిదిఁ గడంగి యిచటి కేతెంచెనొ యీ
పాపం డెమ్మెయి నెట్ల యి, [96]ప్రో ఱియె నిదేమిమాయ పుట్టెనొ యెఱుఁగన్.

158


ఉ.

కానక కన్నపట్టి యిటు కట్టిఁడి రక్కెస[97]వాతఁ జిక్కియుం
న్దానొకకీడు నొందక ముదంబున నా కిదె చేరె నిక్కువం
బేనలినాక్షికిం గలదె యిట్టితపంబున పేర్మి చంద్రబిం
బాననుఁ డింక వీఁడు పరమాయురుపేతుఁడ యెల్లభంగులన్.

159

వ.

అనియె నంత నఖిలగోపాలకులు నయ్యపాయంబు దప్పిన యొప్పిదంబు వేనవేలు
భంగులం గొనియాడి యాడాకినీకళేబరంబు దొలంగం దిగిచిరి నందుం డానంద
వికసితాననుం డై సూనుం దా నెత్తికొని గోకరీషమిశ్రితం బగుభూరజంబు
పరఁగం గావి రక్షాతిలకంబుఁ బెట్టి.

160


సీ.

శ్రీనాయకుండు రక్షించు నీముందర వేధ రక్షించు నీ[98]వెనుకదిక్కు
వరుస నీదక్షిణవామభాగంబులు రక్షింతు రవ్విరూపాక్షుగుహులు
నీమీఁదుదిగువయు [99]నీరజాహితుఁడు వాసుకియు రక్షింతురు [100]ప్రకటకరుణ
దిక్కులు గాడ్పు నీతక్కినచోటులు రక్షింతు రెప్పుడు నక్షతముగ


తే.

స్వస్తి గావించు నీకు వృషధ్వజుం డ, నాకులైశ్వర్యశాలి పినాకపాణి
నిత్యశివ[101]లగుగోవులు నీయతపుణ్య, యైనభూమియు నిను నెల్లయందుఁ బ్రోచు.

161


వ.

అని యిట్లు బాలరక్షణార్థంబు పూర్వమునికల్పితంబు లగుమంత్రంబులు జపి
యించి ప్రయత్నంబునఁ గుమారు నరసికొనియుండ నమ్మహాసత్త్వుండును
మహత్త్వదీప్తుం డై వర్ధిల్లుచున్నంత.

162


సీ.

వసుదేవుపనుపున వసుమతీ దేవుండు గురువృత్తియుతుఁడు గర్గుండు నాఁగఁ
జనుదెంచి రోహిణీతనయునకును యశోదాతనూభవునకుఁ దగఁ గ్రమమున
జాతకర్మోత్తమసంస్కార మనురూపవిధ్యుపేతముగఁ గావించి వారి
కభిధానములు రాముఁ డనియుఁ గృష్ణుం డనియును మహనీయగుణోచితంబు


తే.

లై ప్రసిద్ధత నొందెడునట్లుగా నొ, నర్చి తనరాకపోకలు నరుల కొరుల
కెఱుఁగరాకుండునట్లుగా నేఁగె నవ్వి, ధంబునకు నందగోపుఁ డెంతయును బొంగి.

163


క.

భూసురులం బిలిపించి మ, హాసరసము లైనయంచితాన్నములు సము
ల్లాసమున నొసంగి గోవులు, వాసస్సులు నిచ్చి యుత్సవము సేసి తగన్.

164


వ.

గోకులంబునం గల చుట్టంబుల కెల్లం గట్టనిచ్చి గోవులఁ బూజించి గోవాటం
బలంకరించె నిట్టికల్యాణంబున సంతసిల్లి.

165


ఆ. గొడ్డువీఁగి కనియెఁ గొడుకు నెంతయు మూర్తి, మంతు నెలఁతలందు మహితభాగ్య
యొక్కతియ యశోద యుర్వి[102]పై ననుచు వ్రే, పల్లెఁ బొగడి రెల్లపడఁతుకలును.

166


శా.

సిద్ధంబై తనరారుమూర్తిగరిమన్ శ్రీమంతుఁడై దీప్తిచే
నిద్ధార్కప్రతిమానుఁ డైనతనయుం డిట్లబ్బె [103]వీఁడెంతయున్
వృద్ధశ్రీయభివృద్ధిఁ బొందె ననుచు వేవేలచందంబులన్
సిద్ధాత్ముం డగునందగోపు వినుతించెన్ గోపకవ్రాతముల్.

167


వ.

అక్కడం గంసుండు పూతనవోయినపోక నిజాప్తులగు దనుజుల చేత విని నంద
గోపతనయు[104]దెస శంకించి మున్ను కౌశికాదేవిచేతి పరిభూతివలన మొక్క

వోయి [105]లజ్జించి యున్నవాఁడు గావున సాహసోత్సాహంబు దక్కి (శకటాసురుం
డాదిగా) రక్కసులఁ బెక్కండ్ర నక్కుమారుదిక్కునఁ గీడు గావింపఁ బనిచె నట్లు
పనుపువడినవారిలో శకటుం డనువాడు నందగోపుని ప్రియశకటంబు నావే
శించి తనమాయ నెదిరికి భావింపరాక యుండె నంత నొక్కనాఁడు.

168


ఉ.

పాపని నిద్రవుచ్చి తగుపాన్పునఁ దచ్ఛకటంబు క్రిందఁ దాఁ
దీపెసలార నుంచి సుదతీతిలకంబు యశోద వేడుకన్
గోపసతీసమేతయయి గోఁతి సమీపగయై తనర్చున
య్యాపగ నీళులాడుటకునై చనియెం ద్వరమాణచిత్త యై.

169


క.

ఒక్కింతవడికి నర్భకుఁ, డిక్కడ మేలుకని యొద్ద నెవ్వారును లే
కెక్కు డగుశిశుత్వము మై, నెక్కొనుచాపలము లెల్ల నెఱసి తలిర్పన్.

170


శా.

నోరం జేతులు రెండు గ్రుక్కి కొనుచు న్నోమెల్ల బాష్పాంజన
స్మేరంబై తిలకింప నేడ్చుచుఁ [106]బొరిన్ మీఁజేతులం గన్ను [107]లిం
పారం దోముచు లేవఁజూచి పిఱుఁ దొయ్యన్మీఁది కల్లార్చుచున్
శ్రీరమ్యాంఘ్రియుగంబు [108]గింజుకొనుచుం జెల్వంబు రెట్టింపఁగాన్.

171


క.

తనమాయాజాలంబుల, మునిఁగి సకలలోకములును ముగ్ధంబులుగాఁ
దనరెడు ప్రౌఢుఁడు లోకము, తనమౌగ్ధ్యంబునకుఁ బ్రముదితం బగుచుండన్.

172

శ్రీకృష్ణుఁడు శకటాసురుని సంహరించుట

వ.

అట్లుండి యచ్చట.

173


సీ.

ఒకదట్టు దోరగల్లొఱగి పైఁబడుదునో తొలఁగి కమ్ములు మ్రోయ నిల చలింపఁ
దొడరి వే పఱతెంచి త్రొక్కుదునో పలుగాఁడి లోనైనయంగముల నొకట
నెడలించి మీఁదట నెసఁగెడుప పెల్లఁ బడఁద్రోచి యడఁతునో పడుచు నేమి
వెరవున వధియింప దొరకొను నా కిది యవసరం బని తనయాత్మఁ దలఁచు


ఆ.

శకటుతలం పెఱింగి చయ్యన నాలోనఁ, జరణ మొకటి లీలఁ జాఁచి తాఁచెఁ
దత్క్షణంబ బండి తలకెడవై పాసి, యవుల సంధు లెడలి యవనిఁ జెదర.

174


వ.

అంత.

175


తే.

వేగ సుస్నాతయై తగ వెలఁది యయ్య, శోద యాగోపికలను నచ్చోన డించి
సరసహార్దతఁ [109]జేఁపెడు చన్ను లదిమి, కొనుచు వత్సంబుఁ దలఁచినగోవు వోలె.

176


వ.

అతిత్వరితగతి నేతెంచి విపర్యస్తం బైనశకటంబు నంతంతం గని హా యనుచుం
బఱతెంచి పుత్రు నెత్తి యుదరంబున నదిమికొని.

177


ఉ.

ని న్నిటు పాఱవైచి తగ [110]నిద్దురవోయెడుఁ బాపఁ డంచు నే
మిన్నక [111]నీళ్లనాట యను మిత్తికి నేటికిఁ బోయితి న్నిజం

బన్న కుమార యింకిపుడ యర్థి భవజ్జనకుండు వచ్చి న
న్నెన్నిదెఱంగులం బఱుపఁ డింతయుఁ జూచి తనర్చునల్కతోన్.

178


క.

ఈ మెయి శకటం బెడలుట, కేమిగతము దీని నెవ్వ రెఱుఁగుదురు విభుం
డేమి యది యనిన నుత్తర, మే మని నే నిత్తు నింద యిడుదురు నాకున్.

179


వ.

అని తలంకుచు నంకతలంబునఁ గొడుకు నిడి చన్నిచ్చు సమయంబున.

180


సీ.

పరిమితపలితైకభాసురం బగుకేశసంచయం బారణ్యసంచరమునఁ
[112]దరువుల రాలు "కేసరముల నత్యంతధూసరం బై కడుమాసరముగ
గోఖురోద్ధతరేణుకుంఠితం బగుమోము చెమటబొట్టులఁ జాలఁ జెన్ను మిగులఁ
గట్టినచెంగావికాసె లేఁజిగురులజిగి నూని తను వతిస్నిగ్ధ కాంతి


తే.

నలరఁ గర్కశగ్రంధిలయష్టి చేతఁ, బట్టి గోపాలపరివారబహువిధోక్తు
లెలసి చెలఁగంగఁ గదుపులవలననుండి, వచ్చె నందగోపుఁడు నిజావాసమునకు.

181


వ.

వచ్చి విగ్రస్తచక్రంబును విభగ్నాక్షంబును విభిన్నభాండంబును నైనశకటంబు
గనుంగొని తదీయాంకతలంబునంద తనయు నెప్పుడు నునిచి యుండుంగావున.

182


తే.

తలఁకి యుల్లంబు ఝల్లనఁ దనువు వడఁక, నకట బాలకుఁ డిప్పు డే మయ్యెనొక్కొ
[113]బండి యఱవఱలై యిట్లు పడ్డ దేమి, మూఁడెనో యంచు నరిగి సమ్ముఖమునందు.

183


మ.

స్తనదుగ్ధామృత మారగించుచుఁ బొరిం జారుస్మితోల్లాస మా
ననబింబంబు నలంకరింప వికసన్నాళీకపత్రాభలో
చనదీప్తుల్ జననీముఖేందువుపయిన్ సంప్రీతిఁ బర్వంగ నొ
ప్పునిజాభీప్సితకల్పశాఖిఁ గనియెం బు త్రుం [114]బవిత్రోదయున్.

184


క.

కని గుండె నిమిరికొనుచును, ననురాగముతోడ నంతనంతఁ దనకుటుం
బిని నిది యేమి శకట మి, ట్లన[115]యంబును విషమవృత్త మయినది యిచటన్.

185


తే.

ఒల్లిదంపు[116]టాఁబోతులు పెల్లురేఁగి
తొడరి త్రోచి త్రొక్కెనొ మహోద్ధురసమీర
హతియు [117]నిచ్చోటఁ గలిగెనో యదియు నింత
సేయఁ [118]గాదు నిజం బేమి చెపుమ దీని.

186


వ.

అని వెండియు.

187


క.

అది యెట్లై నను గాని, మ్మిదె నాపుత్రునకు నేమ మింక నఖిల మ
భ్యుదయమ యనఁగాఁ గడుగ, ద్గదిక నెలుఁగు దగులుపడఁగఁ దద్భామినియున్.

188


వ.

అతని నాలోకించి నావలనం దప్పు సాలఁ గలదు మీరు సహింపవలయు నే
నిప్పాపని నెప్పటియట్ల యీ[119]బండిక్రింద మంచంబున [120]నిదుర వుచ్చి యేఱు కుఱం

గలిగావునం గ్రమ్మఱం జనుదెంతు నని జలావగాహనంబున కరిగి మగుడునప్పటి కిది
[121]యిట్లై యున్నయది మనభాగ్యంబునం గుమారు నీబారి గడచె ననునెడం
గొందఱు బాలు రచటికి వచ్చి యిట్లనిరి.

189


క.

ఏ మిచట నాడుచుండం, గా మీకృష్ణుండు [122]తనదుకాలు గడఁకతో
నీమీఁది కెత్తి చాఁచిన, నీమెయిఁ దలకెడవువడియె నిబ్బండి వెసన్.

190


క.

ఇది యేమిదైవికమొ మీ, మదిలోఁ దెలిసికొనుఁ డనిన మగువయుఁ బతియున్
బొదలెడు విస్మయము మనో, ముదముం [123]దళుకొత్తఁ గొడుకు ముద్దాడి తగన్.

191


వ.

అచ్చో భూరజంబు వుచ్చి పిడిచి వైచి తూపొడిచిరి విశ్లేషించి నందుండు
బృందారకుల కెల్ల వందనంబు సేసి నందనునకు నభయప్రదులు గా నభ్యర్ధించె
నాలోనన యెల్లవారును వచ్చి యచ్చెరువు నొందుచు నబ్బాలు నభినందించి
రా గోపముఖ్యుండు శకటంబు క్రమ్మఱ సంఘటితంబు గావించి సుఖంబున నుండె
నంతఁ గ్రమంబున.

192

శ్రీకృష్ణమూర్తి బాలక్రీడాభివర్ణనము

సీ.

పొలుపారఁగా బోరగిలి పాన్పు నాల్గుమూలల[124]కును వచ్చును మెలఁగి మెలఁగి
లలిఁ గపోకంబులు గిలిగిలింతలు పుచ్చి నవ్వింపఁ గల కల నవ్వినవ్వి
ముద్దులు [125]దొలఁకాడ మ్రోఁకాలఁ గేలను దడవుచు నెందును దారితారి
నిలుచుండఁ బెట్టి యంగుళు లూఁత సూపఁగాఁ బ్రీతిఁ దప్పుడుగులు పెట్టి పెట్టి


తే.

యన్నఁ గంటిఁ దండ్రినిఁ గంటి నయ్యఁ గంటి, నిందు రావయ్య విందులవింద వనుచు
నర్థిఁ దనుఁ బిలువఁగ [126]నడయాడియాడి, యుల్లసిల్లెఁ గృష్ణుఁడు శైశవోత్సవముల.

193


ఉ.

ఎవ్వరు గన్న నెత్తికొని యెంతయు వేడుక ముద్దులాడఁగా
నెవ్వలఁ బాఱిపాఱి [127]తరళేక్షణ దీధితు లొప్ప [128]నొప్పుమై
మువ్వలు గంటలు న్మొరయ ముందటికూఁకటి రావిరేకతో
నవ్వనజాక్షుఁ డాడుఁ జెలువర్మిలిఁ బెందు జనంబు చూడ్కికిన్.

194


తే.

మన్ను రొంపియుఁ బెండయు [129]మంటు వట్టి, పాంసుసంక్రీడఁ దనమేను భాసురముగ
హరి యనేకధాతుచ్ఛటావ్య క్త మైన, శైలకుంజరకలభంబు [130]వోలె నొప్పె.

195


క.

చాలఁ[131]గ నిచ్చలు వెన్నయుఁ, బాలుం గుడుకలఁగొని తల్లి పట్టికి సెలవిన్
వ్రేలిడి యింతింతియ కాఁ, గ్రోలిందును వెరవుతోడ రుచి [132]గొలుపుక్రియన్.

196


తే.

ముదముతోఁ గడ్పునకుఁ [133]బెట్టి మూతిజిడ్డు
మోమునను మేనఁ జమరి యమ్ముదిత యక్కు

[134]గలయ నిమురు నేనుఁగుదిన్న వెలఁగపండు
నాఁగ నొప్పుఁ గృష్ణుఁడు [135]చారునయనుఁ డగుచు.

197


మ.

తను నాప్యాయితుఁ జేసి [136]ఱేపు గృహకృత్యంబు ల్పొనర్పం దొడం
గినతల్లిం గినుమాడి తప్పడుగులం గ్రీడారతిం బోయి యం
గనలన్ వెన్నలు వేడుఁ బెర్వు దరువంగా నెంతయేఁ బెట్టినం
దనియం డింపుగ మ్రింగు మానఁ డొకటం దావారిఁ గారించుటల్.

198


క.

తరిద్రాడుఁ జేతికవ్వము, దిరుగకయుండంగ బట్టుఁ దెమ్మని తిగుచున్
బొరిబొరి గనయంబున ముడి, విరియ వలువచెరఁగు వట్టి వ్రేతల నీడ్చున్.

199


తే.

వెన్న వెట్టెద మాడుమాయన్న యన్న, మువ్వలును మొలగంటలు మొరయనాడు
నచ్యుతుఁడు గోపికలు దమయాత్మ బ్రమసి, పెరువు దరువను మఱచి సంప్రీతిఁ జూడ.

200


క.

ఏనిక కొదమకరంబున, మానుగ వెలిదమ్మిమొగడమాడ్కిఁ బొలుచు న
ద్దానవరిపుచేతం బొలు, పై నవనీతంపుఁగబళ మనుపమకేళిన్.

201


క.

సురలు దరువఁగ సుధాశీ, కరములు [137]మెయిఁ జిలుకునట్టికల్యాణం బా
పురుషోత్తమునకు నొదవున్, దరుణీనిర్మధనలగ్నదధిబిందువులన్.

202


ఉ.

పాపనిఁ బట్టరమ్మ యని బాధల కోర్వక తెచ్చి తెచ్చి తన్
గోపిక లయ్యశోదకును గుప్పున నొప్పనసేయఁ జేయ నా
గోపిక [138]యందునందుఁ జని గోకుల మిల్లిలు దప్పకుండ ల
క్ష్మీపతి గ్రుమ్మరుం గడియసేపున రేపున నిచ్చనిచ్చలున్.

203


వ.

ఇవ్విధంబునం గ్రమక్రమప్రవర్ధమానుం డయి తానును బలదేవుండును బెక్కండ్రు
బాలురు గేళీలాలసు లై తన్నుం బొదివికొని తిరుగ బల్లిదుఁ డై వ్రేపల్లె నెల్లెడలం
గ్రీడించునప్పుడు.

204


చ.

పనఁటులఁజట్ల మూఁతియిడి పాలును నేయియుఁ బుక్కిలించియుం[139]
దొనుకుచు దోయిలించి కళతోయరుహంబులఁ జల్లి మంటిలో
నెనయఁగఁ ద్రొక్కి త్రొక్కి ధవళేక్షణరోచు లెలర్ప నాడు నె
వ్వనికిని మాన్పరాక యదువంశకుమారుఁ డుదారచేష్టలన్.

205


క.

[140]తరువం బెట్టినచట్టుల, పెరువులు మును గిలుకరించి [141]పెట్టిన వెన్నల్
[142]నురువు లెసఁగంగ గ్రోలియు, సురలం ద్రోచియును జూపుచుండును గ్రీడల్.

206


శా.

క్షీరాంభోధి మధించి తాను గృపతో గీర్వాణకోటిన్ సుధా
పూరప్రీతగఁ జేసినట్టి చెలువంబుం జూపున ట్టింపుగా
నారం గాఁగినపాలమీఁగడలు హస్తాబ్జంబులం [143]దేవి లీ
లారమ్యంబుగఁ దోడిబాలురకు నెల్లం బెట్టి తానుం గొనున్.

207

తే.

 ఓలిఁ గట్టిన యుట్లకు నుఱికి పెద్ద, బానలం దున్నవెన్నలు బావుకొనుచు
[144]నుట్టులను వ్రచ్చి బాన[145]ల నురలఁద్రోచి, [146]సురుగుఁజెలికాండ్ర కెల్లనుఁ జూఱవిడిచి.

208


సీ.

[147]కడవలపాలు సగంబుగాఁ ద్రావుచు నీళ్లను దెచ్చి యన్నింట నినుచుఁ
బెరువంతయును [148]గ్రోలి పిదప బానలయందు సంపూర్ణముగఁ బాచిచల్ల లునుచు
నేతులు గొనిపోయి నెఱయ నిప్పులఁ బోసి పెనుమంట లొండొండఁ దనరఁజేయుఁ
బెరువులోఁ బాలును బెరువు వెన్నను వెన్న [149]జల్లను జల్ల నాజ్యమును గలపుఁ


తే.

[150]దలుగులూడ్చి పెయ్యలనెల్లఁ దల్లిచన్ను, గుడువ విడుచుఁ గొన్నిటి నలుగడలఁ దోలి
యుఱక దామెనకొయ్యలు పెఱికి పాఱ, వైచుఁ గావళ్ల యుట్లను వ్రచ్చి తెంచు.

209


ఉ.

ఆడఁగఁ దెచ్చి బాలకుల నందఱ నయ్యయియాట నొక్కమై
నోడఁగఁ జేసి వీఁపడిఁచి యొక్కని నొక్కని నెక్కుఁ బల్వురం
గూడఁగఁ గూఁకటు ల్ముడిచి కోయని యార్చుచు గాసిసేయు సం
క్రీడల నెంతలావరియు గీడ్పడి చిక్కఁగఁ గృష్ణుఁ డుద్ధతిన్.

210

గోపికలు యశోదతోడ శ్రీకృష్ణుని దుష్టచేష్టితంబుల చెప్పికొనుట

వ.

ఈ భంగి వ్రేపల్లెయెల్ల నేలకుం గోలకుం దెచ్చుచున్న యక్కుమారు వారింప
నలవి గాక గోపాలురెల్ల నుల్లంబుల వెక్కసపడి చూచుచుండ గోపికలు [151]గూడఁ
బడి యశోదపాలికిం జనుదెంచి.

211


తే.

గోతి [152]నీవ కాగారాబు[153]కొడుకుఁ గంటి, వేము పడుపాటు లరయవ యెట్టిబలియు
రైనఁ దగవు పాటింపరే యకట కృష్ణుఁ, జిన్నవాఁ డని సమయ మిన్నకునికి.

212


క.

కుటిలవు నీవు తనూభవు, నిటు సేయఁగ విడిచి తాత్మ నించుకయును న
క్కటికంబు లేదు వినుమా, యటు నీ చెవులార నిట్టు లాత్మజకృతముల్.

213


వ.

అనునెడ నొక్కవ్రేత యన్నాతిముందరికి వచ్చి.

214


క.

నాయింటం బదిగడవల, [154]నేయి పెరుఁగుఁ బాలుఁ ద్రావె నేఁ డిదె కృష్ణుం
డోయమ్మ కడవ లన్నియుఁ, గే యని బోరగిలఁ ద్రోచి కేరుచు వచ్చున్.

215


తే.

పేదవార మింతటితోన పీడవడితి, మిట్టులైనను మా కింక నేది బ్రదుకు
మున్ను వోయిన నేగికి నెన్నఁ గొలఁది, లేదు నాఁగ వేఱొక గొల్లలేమ రేఁగి.

216


చ.

అసురయొ కాక నీతనయుఁ డంగన యేఁబదిబానలందుఁ బొ
ల్పెపఁగెడు వెన్న యుట్లపయి [155]నేఁ బదిలంబుగ డించి యుండ వె
క్కసముగ మ్రింగె బానలును గ్రమ్మనఁ గూలఁగఁ ద్రోచె నుట్టులు
న్వెస నుఱుమాడె నేమిగతి వ్రేఁగుదు నెక్కడఁ జొత్తుఁ జెప్పుమా.

217


వ.

అని పలుక నలుకతోడ గోపిక యోరు నర్తించువిధంబునఁ జేతులు సాచుచుం
గృష్ణజననిం గదిసి యిట్లనియె.

218

ఉ.

ఓవరిలోన గొంది దెస నున్నవి యెన్నియొ యెన్నఁ బెద్దభాం
డావళి దాళముం దలుపు [156]నావలఁబోఁ బడమీటి చొచ్చె మా
యావి భవత్సుతుండు వెస నంతన యేనును బాఱుదెంచితిం
ద్రావెనొ యేమి సేసెనొ ఘృతం బొకబొట్టును లేదు లోపలన్.

219


క.

ఏపొలములుఁ బాడయ్యెనె, యీపల్లెకుఁ జిచ్చు వెట్టి యేఁగెద మేమున్
మాపసులును గలిగిన నట, నేపగిదిని బ్రదుకరాదె యిటు చెడుకంటెన్.

220


సీ.

అనుచుండ మఱియొక్క యతివ యాగ్రహమున నంచఱఁ ద్రోచికొం చరుగుదెంచి
యేమని వినియెద విన్నియు నాయింటి సేగి సెప్పఁగఁ జెట్ట లాగడీఁడు
నీకొడు కేతెంచి నేఁడు నెలఁత యెన్నఁ బదిపంట్లనేయును బాలుఁ బెరుగు
నొండొంటిఁ గలయంగ నుర్విపై వఱదలుగాఁ జల్లి పనఁటులు [157]కాలఁ గేలఁ


తే.

దన్నియును వ్రేసియును వెసఁ బిన్న పెంచి, కలుగఁజేసి పాయసము గూరలును గూడు
పడుచులకుఁ బెట్టి దొంతులు పగుల నడిచి, నడరి పెయ్యల నన్నింటి గుడువవిడిచె.

221


తే.

పూసద్రాడు దుయ్యను లేదు [158]పొలఁతి మెడకుఁ, బెరువు [159]పాలింట నేడ్చినబిడ్డకైన
మిడుపలే దెల్ల దాననుఁ జెపితీ మొల్లఁ, బోయితిమి [160]ప్రాయిగలపట్టి పొట్టఁబెట్టి.

222


వ.

అనియె నట్టియెడ నోరు పెలుచని యెలుంగున.

223


చ.

కలయఁగఁ బాలు[161]పిండి పులకండము వెన్నయుఁ బెట్టి యట్టులై
యలవడ వండితిం బతియు నాత్మజులుం బ్రియపడ్డ నాలుగే
నలకులదొంతి డించి యవి యన్నియు నుగ్మలి నీతనూజుఁ డొ
ప్పులువడ మ్రింగెఁ జోద్య మిది బూతము లున్నవిగాక కడ్పునన్.

224


క.

మగ[162]డింక నన్ను సైఁచునె, దిగవిడుచుం జంపుఁ గాక తెల్లము మది న
మ్మిగ పుట్టునె యిది చెప్పిన, మొగమోటన మనుపుచుండి మూసితి నబలా.

225


తే.

అనఁగ వేఱొక్కగొల్లత యమ్మ వినును, బానలోపల [163]యవపిండి పంచదార
యొదవఁగలపి మూలను డాఁచియుండ వచ్చి, తినియె నంతయుఁ గృష్ణుండు దేవరాన.

226


క.

అంతటఁ బోవఁడు గూనెడు, సంతసమున బాపికొనియెఁ జయ్యనం గలకూ
డంతయును విష్ణుమాయ [164]ప, డంతీ! యివి శిశువునం దడంగెడుపనులే.

227


ఉ.

నావుఁడు నోరు నెమ్మొగమునం గడుదైన్యము దోఁప వచ్చి నా
యావులఁ గ్రేవులం గలపి యార్చి వెలార్చినఁ బోయి ఘోరదు
ర్గావలి సొచ్చె నింట మగఁ డాత్మజు లెవ్వరు లేరు ప్రల్లదుం
డీవిధి మమ్ము మన్నిగొనియెన్ భవదీయసుతుండు గోపికా.

228


ఆ.

[165]పుట్టియంత వెన్న ప్రోవుగఁ బేర్చిడి, గడిగి కడిగి యొక్కగనప చేర
నంతవట్టు మ్రింగె నట సూచి చూడంగ, నొంటి నిట్టిమనుజు లుర్విఁ గలరె.

229

వ.

అని యివ్విధంబున నందఱుఁ గూడి యొక్కట నచ్చేడియమీఁద నధిక్షేపించి.

230


క.

ఎక్కడి కేనియుఁ బోయెద, మిక్కష్టపుఁబాటు పడఁగ నే మోర్వము నీ
చొక్క పుఁగొడుకును నీవును, [166]నొక్కతలయు నొక్కమూరి నుండుఁడు నెమ్మిన్.

231


వ.

అనిన విని యశోదాదేవి వేర్వేఱ వారి [167]ననునయించి.

232


క.

మీ సేగు లెల్ల నచ్చెద, వేసరకుఁడు మీరు లేక వేగునె మాకున్
జేసెం జేయఁడు బాలకుఁ, డాసురపుంబనులు నిజము లనియెదరు బలే.

233


క.

బొంకాడెడుగఱితలె మీ, రింకిటఁ [168]జూచుకొనుఁ డితని నె [169]ట్లడిచెదనో
[170]కింకయును గలఁకయును మది, శంకయుఁ బోవిడిచి చనుఁడు సదనంబులకున్.

234


వ.

అనిన నట్ల కాక యని గోపికలు నిజస్థానంబులకుం జనిరి తదనంతరంబ.

235


మ.

భువనక్లేశము లెల్ల మాన్ప శిశుతాస్ఫూర్తిం బ్రవర్తిల్లుచున్
వివి క్రీడలఁ బ్రౌఢ యైన ప్రభువున్ విష్ణుం బ్రవర్ధిష్ణు [171]నా
నవనీతామృతచోరుఁ జూచి యెలమిన్ రాజాస్య యాత్మీయసం
భవతాబుద్ధిఁ బ్రవృద్ధమైన మమతాబంధంబు సంధిల్లఁగన్.

236


శా.

ఏలా యిందును నందుఁ [172]బాఱెదవు నీకే బ్రాఁతియే వెన్నలుం
బాలుం బాలక [173]చాలఁ జేఁపె నిదె నాపా[174]లిండ్లు పెన్ సోనలై
పా లొక్కుమ్మడి గ్రమ్ముచున్నయవి నీభావంబునం దృప్తిగా
గ్రోలం జాలవె యింతవ ట్టకట యోగోనేల చుట్టాలలోన్.

237


తే.

తల్లి చనుఁబాలు గ్రుక్కెడు తక్కి[175]నయవి, పుట్టెడును నొక్కరూపనభూమిఁబరఁగు
నొడువు బొంకయ్యెఁ జన్నిత్తు దొడలమీఁద, గుండె వట్టి యించుకచడ వుండవన్న.

238


క.

అని యెత్తుకొని యురంబునఁ, దనియఁగ నదిమికొని చన్ను తన్ముఖమునకున్
ఘనదుగ్ధపిచ్ఛిలంబుగ, మనమలరఁగ నిచ్చుటయుఁ గుమారుఁడు ప్రీతిన్.

239


చ.

మును జననీస్తనంబులకు మోపఁగ వ్రేగయి యున్నయట్టి య
వ్వినుతపయస్సు లన్నియును వేడుకతోఁ గడుపార నారగిం
చిన బ్రియ మంది నందసతి చెక్కులు నక్కును మ స్తకంబు మూ
ర్కొనుచును ముద్దులాడి మఱి కొండొకసేపునకుం బ్రియంబునన్.

240


వ.

అయ్యర్భకు నుద్దేశించి.

241


క.

వఱువాత లేచి నీదగు, కొఱగాములు చక్కద్రోచికొనఁబోయి దినం
బిఱులుపడి యున్నయవి పను, లఱజాతివి నిన్ను నేమి యన నేర్తు సుతా.

242


క.

విడిచిన నెప్పటికి చని యా, గడములు సేసెదవు నిన్నుఁ గాచుట మాకుం
గడువ్రేఁగు దుర్జనుని నిలఁ, దడయక [176]యెఱుకమెయిఁ ద్రోపు తగుమందెందున్.

243

యశోదాదేవి శ్రీకృష్ణు నులూఖలబద్ధుని జేయుట

వ.

ఇందు రమ్మని మెత్తనిజంకెతోడిబింకంబునం గొడుకుం గేలుపట్టి యొయ్యన తివిచి
కొనుచుం బోయి పెయ్యదామెనత్రాటం గొని శకటసమీపంబున బలితంబగు
రోల నుదరంబు బంధించి నున్నని సెలగోల చేతం గొని.

244


క.

కదలిన మొత్తుదు నెక్కడఁ, గదలెద వటు గఱదులాఁడ కదలుమ యేఁ జూ
చెద ననుచుఁ బోయి యిమ్ముల, ముదిత నిజకుటుంబకార్యములఁ దత్పరయై.

243


సీ.

ఉన్నంత నచ్యుతుం డుద్దామమగుతన సత్వంబు గోపాలజాతమునకు
నెఱిఁగింపఁ దలఁచి యొక్కింతసేపునకు నిజోదరంబున దామయుతనిబద్ధ
మగునులూఖలము రయమునఁ బెనంగ నాకర్షించుకొని మందగవని కెలని
జమిలిమద్దులలోన సంరంభమునఁ దగిలించి తాఁ దగులక లీల రెంటి


తే.

నడుముగడచి నీల్గుటయును బుడమి వగులఁ, బెల్లగిలి కూలెఁ దరువులు గొల్లలెల్ల
గూడఁబడి రప్డు కొందఱు గోపసతులు, సూచి క్రమ్మనఁ బాఱి యశోదతోడ.

246


ఉ.

ఎక్కడిబిడ్డ నీకు నిటు లెంతయుఁ గట్టిఁడ్ వేయుగంబులం
బొక్కెడుఱోటితో బలియుఁ బుత్రునిఁ ద్రాళులఁ గట్టునాఁడు వా
రక్కట గల్గ రట్లనఁగ నాఱడివోయెఁ గుమారుఁ డేపునన్
మిక్కుట మైనమ్రాకు లనె మీఁదఁబడ న్వడిఁ దాఁ బెనంగెడున్.

247


క.

నేరుపుగల ననుచు నహం, కారంబున మిడిసిపడితి గ్రమ్మనఁ జని బం
గారముఁబోలెడు కొడుకున, కేరూపుననైనఁ బాపు మీసంకటమున్.

248


మ.

అనినం దల్లడ మంది మేను విరియన్ హాయంచు గోపాలభా
మిని విస్రస్తములై పటాంచలము ధమ్మిల్లంబుఁ దూలంగ లో
చనపద్మంబుల బాష్పధార లెసఁగన్ సంభ్రాంతిఁ బాదద్వయం
బును దొట్రిల్లఁగఁ బాఱె గోపికలు నుద్భూతార్తలై తోఁ జనన్.

249


వ.

నందగోపాదులు నటమున్న కదిసి రి ట్లరిగి యందఱు నున్మూలితయమళార్జున
మధ్యంబున మేఘద్వయమధ్యవిద్యోతి యగుశీతాంశుండునుంబోలె నాలోల
లోచనంబున సుధాసేచనరోచు లడర మందస్మితసుందరవదనమండలంబున నగ్రిమ
చూడామండనంబు వొలయం బొలుపారు కుమారునిం గని రంత నాగోపగ్రామణి
కొడుకుకడుపునం బెనఁచిన [177]క ట్టొయ్యన నూడ్చి యెత్తుకొని యిది యేమిచందం
బీబాలు నుదరంబు ఱోల ని ట్లేల కట్టి తింతద వ్వెట్టు లీడ్చె నిమ్మహీరుహంబు లెప్పగిది
గూలె నని తద్బంధననిమిత్తంబు నిజకళత్రంబువలన విని పుత్రుసత్త్వంబునకు
హర్షవిస్మయంబు లతిశయిల్ల నుండె గోపవృద్ధు లచ్చెరువునొంది తమలోన.

250


మ.

అతివాతంబును వజ్రపాతమును హస్త్యాఘాతమున్ వాహినీ
వితతస్రోతము హేతువుల్ తరుతతి న్విభ్రంశ మొందింప న

ట్టితెఱం గేమియు లేక [178]యర్భకునికృష్టిం గూలె నీయున్నత
క్షితిజాతంబులు దీనికంటెఁ గలవే చింతింప నుత్పాతముల్.

251


వ.

మున్నును శిశుఘాతినియైన పూతన నిపాతంబు నొందె మహాశకటం బద్భుతవిఘ
టనంబునం బొలిసె నిక్కడ నునికి మన కింక నెంతలెస్సయయ్యెడు నని యాశంకిత
చిత్తులయ్యును మక్కువవలన నచ్చోటు విడువఁ గొనకొననిమనంబులతోడ
నందగోపసహితు లై తమ తమ నివాసంబులకుం జని రివ్విధంబున.

252


క.

గోము మిగుల వ్రేపల్లెను, ధీమంతులు రామవాసుదేవులు బాల్య
శ్రీ మెఱపి యట్టిసప్తస, మామహితవయస్కులై సమంచితలీలన్.

253


వ.

తమయీడు గోపాలబాలకులం గూడి యాడ వత్ససముదాయపాలనంబుల
వినోదంబుగాఁ బ్రమోదింపం దొడంగి రమ్మహోత్సవసమయంబున.

254


తే.

చిఱుతకూకట్లు [179]దూఁగాఁడఁ జేతిచల్ది, చిక్కములు సెలగోలలు చెలువు మిగులఁ
[180]గఱ్ఱచెప్పులు దొడి నున్నగఱ్ఱితడుపు, లెలమితోఁ గట్టి చేరువ పొలములందు.

255


చ.

వృకములఁ దోలి యార్చుచును వేడుకఁ బాడుచుఁ గూఁత వైచుచుం
బ్రకటమహీరుహాగ్రములు ప్రాకుచు జున్నులు రేఁచి తేనె గో
పకులకుఁ బోయుచుఁ మధురభ క్తము సే కళులారగించుచున్
సకలమనోజ్ఞఖేలనరసంబునఁ దేలిరి బాలయాదవుల్.

256


వ.

అని వైశంపాయనుండు జనమేజయునకుఁ గృష్ణశైశవచరితంబు కర్ణరసాయనంబు
గావించిన దివ్విధం బఖిలంబును సుఖశ్రవణం బగువచోవిభవంబున.

257


మ.

కమలానిత్యనివాసవక్ష కమలాక్షా సంతతోత్ఫుల్లహృ
త్కమలామోద కళా[181]వివేక జితలోకా సర్వధౌరేయ దోః
కమలాంగీకృతదానకల్ప శుభసంకల్పా విపక్షా[182]వళీ
కమలాపాయద ఖడ్గనీరద సమీకప్రీతిమన్నారదా.

258


క.

గుజ్జరిధట్టవిభాళసు, హృజ్జీవనదాయి హార్ధ హేలాభుజసం
పజ్జితధనసంపూజిత, సజ్జనసందోహధర్మసాధకదేహా.

259


మాలిని.

యవననృపబలాబ్ధివ్యాపిఖడ్గౌర్వవేగా
జవనహయఖురాగ్ర[183]చ్ఛాదిభూమ్యంతభాగా
భవన[184]భరితలక్ష్మీబద్ధనిత్యానురాగా
భువనయుగహితైకస్ఫూర్తిమత్త్యాగభోగా.

260


గద్యము.

ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీసూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన హరివంశంబునం బూర్వభాగంబునందుఁ బంచమాశ్వాసము.

  1. గడచి తృతీయ
  2. మీరు
  3. పూరకంబగు
  4. నివేశ
  5. గైరికా
  6. కామప్రద, ధామహృత, నామ
  7. అపుడు భూదేవి యాత్మీయ మైనదివ్య
  8. బొడమి
  9. యొడలు
  10. మధువుం; మధువులు
  11. యుత్కంపించి పద్మాక్షు
  12. లొక్కింతయు
  13. దొరుగుచు
  14. బొదవు
  15. కోరనొకంట
  16. ని మన్నాథు నాదదేవు
  17. భారావృతనిష్ఠకు
  18. నధికులు యదీర్ణులు
  19. నాక లా
  20. వశంబు
  21. మనకున్ ఆది
  22. నఖిలభూమిసురక్షత్రియాన్వయముల
  23. కరణి
  24. పేరునకైనను
  25. కొలిచి
  26. బదియొ
  27. నగర మొక్కటి నిర్మించె నగరవిభవ
  28. డనఁజను పేరితోఁ గాల
  29. రిష్ణుండు
  30. నా కానతుఁ డై
  31. గెక్కడి దెయ్యది
  32. బ్రీతుఁడై పశ్చి
  33. ఁబనుపడ జన్మంబు
  34. నిలిచితే
  35. మైయుండ మా
  36. యిద్ధరణి
  37. సంధ్యలున్
  38. మందిరంబున
  39. లాడెడు, నాడెడుత పనలు, లాడెడునదనులు; హదనులు.
  40. చతుర్భూతంబుల
  41. మొలయ
  42. కౌశిక
  43. దవులు
  44. సూనుం డన భానుచెయ్వుల
  45. తదనంతరంబ
  46. కడు
  47. గానయ్యదూ
  48. విశేషంబున
  49. భువన
  50. లేక యిం
  51. నెట్లకో
  52. నునిచి
  53. అన్నన్న యలుగకుము
  54. నొప్పించ
  55. ప్రార్థింప
  56. పూంచి
  57. నలరెడు, ఁదనరెడు.
  58. విహ్వలుండై
  59. భోరన వ్రేసి చంప నని బూనితి నిన్ను వధించుశత్రు నీ, తోరము గాఁగఁ బట్టి భవదూరితు; చంపు దని పూనిన.
  60. యత్నతుచ్ఛతన్
  61. పక్వ
  62. యిదియ వినతి
  63. తనకు న
  64. నిన్నిపోకులం
  65. కుంజనియె నంతప్రొద్ద
  66. నత్యంతను; నత్యుత్తమ.
  67. బొ మ్మూ రేల పేకేల నా
  68. బండి
  69. ధేను
  70. బేర్వేరన్
  71. దాటుగొని
  72. యుపవన
  73. రనదల నందంద తోలి
  74. కరుకెక్కిన
  75. నేరని
  76. రులుం బలుపులునుం దల
  77. కాలుర్లంజుట్టికారుకు, కారూళ్లజట్టికారులకు (పూ. ము.)
  78. వన్నె
  79. వలచుజుంచుదల
  80. త్రాఁకుల
  81. లంట్ల
  82. కారెలుంగులు
  83. లంకిలి
  84. బూదె చఱచి
  85. లొదవు
  86. నిముచ్చట
  87. వెడంద
  88. పడిపొలయ
  89. మధ్యమానోద్గశధూత్కారముఖరంబునురు, దహ్యమాన
  90. చూచి మిడిగ్రుడ్లు నిప్పు లొక్కెడఁ జెదరఁగ
  91. మెఱచు
  92. జొచ్చియా
  93. పొదివిట
  94. పిదప
  95. నేతెంచి చూచి
  96. పోపడియెనొ యేమి
  97. చేత
  98. వెనక
  99. నీరజ
  100. ఁబ్రకట
  101. సిద్ధులౌ
  102. యందనుచు
  103. నీ కెంత
  104. వలన ధిక్కరించి
  105. లజ్జించుచున్న
  106. బొరిమ్మీ
  107. లేపారం
  108. గుంజ
  109. జేపుడు
  110. నిద్రను జెందెను
  111. యుండి నీళ్లకును
  112. దురువుల
  113. భండి
  114. బవిత్రోత్రోచ్ఛవున్
  115. యము విపరీత
  116. టంబోతులు
  117. లేదు కల్గెనయేని
  118. నేరదు
  119. భండి
  120. నిద్ర
  121. యిట్టులయ్యున్నది
  122. లేచి
  123. దలకొలుపఁ
  124. యందును గలయ
  125. దులు
  126. నడిబాడి
  127. ధవళేక్షణ
  128. ఁద్రోపుమై గొప్పలై
  129. మనలు
  130. బోలియొప్పె
  131. దరిచల్ల
  132. గోల్చు
  133. బోసి
  134. 'గలయ నిమిరి యేనుఁగు' అను పూర్వపాఠ మనన్వితముగాన పైరీతి దిద్దఁబడినది.
  135. సౌశ్రు
  136. దేవ
  137. పయి
  138. నాగ నాగ
  139. యెం దునిమియు
  140. తరువఁగఁ బెట్టిన బానల
  141. పేర్చిన
  142. నురువు లెసఁగఁ గ్రోలి పిదప, సురులు ద్రోచుచును బోవు నుక్కివపుగతిన్.
  143. గేలి
  144. నుట్లనులిపుచ్చి
  145. లు నొరఁగ
  146. జోడు
  147. సగము గలయం ద్రావి
  148. ద్రావి
  149. చల్లను జల్ల యాజ్యమునఁ గలపు
  150. దలువు
  151. గూడఁబాఱి
  152. నీవొక
  153. కొడుప
  154. నెయును బెరువులును
  155. నేను దిరంబుగ నుంచి
  156. నాతలఁ బోనటు
  157. గాల
  158. పొమ్ము
  159. పొరుగింటికించిన
  160. ప్రాలుగల కట్టి పుట్టఁబట్టి
  161. బిడ్డి
  162. డువిని యింక
  163. ఁబిండియుఁ బంచ
  164. ప, నింతీ యివి శిశువునం దడం గెడుపనులే
  165. ఠీవి పుట్ట వెన్న ప్రోవుగఁ బెట్టితి, కడఁగిఁడఁగి యొక్కకడవ వాడయంతపట్టు
  166. ఒక్కత లై స్రుక్కుమాని, ఒక్కతలయు నొక్కయూర
  167. నందఱ ననునయించి
  168. జూచి
  169. ట్లడఁచె
  170. కింకయుఁ గలఁకయు మదిలోన్
  171. నిన్
  172. బాఱెదవు నీకున్
  173. పాలు చేఁపెనిదె
  174. లిండులన్
  175. నవియుఁ బుట్టెడు
  176. యనాకత్రోవఁఁ దగ మర్దింతున్
  177. వన్నియు నొయ్య యూడ్చి
  178. యర్భకవిసృష్టిం
  179. దూఁగూడ
  180. గిఱ్ఱుచెప్పులు (పూ. ము.) బట్టచెప్పులు దొడ్డను న్బట్టతడువు
  181. వివేశ
  182. సరీ
  183. చ్ఛాత
  184. చరిత