Jump to content

హరవిలాసము (1931)/సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

సప్తమాశ్వాసము

శ్రీకాళహస్తినాథ
ప్రాకారాంతఃప్రణీతపాతాళగుహా!
శ్రీకాళహస్తిభ క్తసు
ధీకల్పితవిభవ! యవచిదేవయతిప్పా! 1

వ. ఆకర్ణింపుము. 2

ఉ. అర్జునుఁ డింద్రనీలగిరియందు రసాలతమాలతాలనీ
పార్జునలోధ్రతిందుకనవామలకీపనసామ్రపాటలీ
సర్జకురంటకాదిగురుచందనచందననింబకేతకీ
భూర్జకపిత్థపూర్ణముఖభూరుహపుణ్యతమాశ్రమంబునన్. 3

క. ద్యూతపరాభవమున నగు, చేతోదుఃఖమునఁ దపము చేయఁగఁ దొడఁగెన్
భ్రాతలయనుమతి శత్రు, వ్రాతజయార్థంబు మది దివస్పతి గురిగాన్. 4

మ. ధనురస్త్రంబులు కేలఁ దాల్చి శరధిద్వంద్వంబు నేపార వీఁ
పున బంధించి కిరీటియై కవచియై పూనెం దపశ్చర్య య
ర్జునుఁ డత్యంతగరిష్ఠనిష్ఠ నమరేంద్రుం గూర్చి యయ్యింద్రకీ
లనగాగ్రంబునఁ బ్రత్యనీకవిజయశ్లాఘాభిలాషంబునన్. 5

క. వంచన మనంబులోన నొ, కించుకయును లేక యమ్మహేంద్రముమీఁదన్
బంచానలమధ్యంబునఁ, బాంచాలీవల్లభుఁడు తపం బొనరించెన్. 6

తే. గాండివముతోడ నొకయోగదండయష్టి, యస్త్రములతోడఁ గొన్నిదర్భాంకురములు
కలపములతోడఁ బుండరీకంబుతోలు, దాల్చి క్రీడి విరుద్దపుఁదపము చేసె. 7

శా. శాకాహారుఁడు నిర్జితేంద్రియుఁడు పాషాణాగ్రతల్పుండునై
నాకేశప్రియనందనుండు సలిపె న్నానాప్రకారంబులన్
నాకుంజిత్తము దేహము న్సరియెకా నానాతపశ్చర్యలన్
వ్యాకీర్ణోరగసింహభల్లుకలులాయాభీలశైలాటవిన్. 8

సీ. పతయాళునిర్ఝరాంభఃప్రవాహంబుల నఘమర్షణస్నాన మాచరించుఁ
గొండగోఁగుంబూల గుండవర్ధనముల నర్చించు శశిలాంఛనార్ధమాళి

స్ఫటికాక్షమాలికాపాణిప్రవాళుఁడై జంభారిమంత్రంబు జపము చేయు
నొంటికాల బుజంబు నూర్ధ్వంబుగాఁ జాఁచి తడవుగా నిలుచుండి తప మొనర్చు
తే. శరభశార్దూలసింహాదిసత్త్వచయము, కెరలి తనమీఁద బిట్టు లంఘించునపుడు
కడిమిఁ జెండాడు భుజదండగాండివోగ్ర, చండతరశాతనిర్ఘాతకాండవితతి. 9

తే. వీరరసగర్భితం బయ్యు విస్తరిల్లె, శాంతరస మెంతయును సవ్యసాచియందు
మలయశైలనితంబమండలమునందు, సర్పవేష్టితచందనక్ష్మాజమట్లు. 10

వ. ఇవ్విధంబునఁ గపికేతనుండు గాండివజ్యాఘాతరేఖాకిణకళంకాలంకారంబు లగుకరంబులు నీవారపాకంబునకును బాంచాలకన్యకాకుచకుంభకుంకుమప్రేక్షణీయం బైనవక్షంబు రుద్రాక్షధారణంబునకును నంగారపర్ణగర్భనిర్భేదనచణహుంకారకారణం బగుకంఠంబు మహేంద్రదేవతామంత్రాక్షరధారణంబునకును ఖాండవదహనవేళావిజృంభితావష్టంభసంరంభం బగుహృదయాంభోరుహంబు ప్రణవోపలంభమునకును గుంభసంభవప్రదిష్టశాఖాశిఖరపక్షిలక్ష్యావలోకనజాగరూకం బగువీక్షణంబులు నాసికాప్రదేశానుసంధానంబునకును యంత్రమత్స్యవిభేదనోపాయసందర్శనప్రభావసంసిద్ధి యగుబుద్ధి వృద్ధోపసేవనమునకును గంగాజలనిగ్రహానుగ్రహాపాదనసమగ్రం బగుమానసోత్సాహం బింద్రియభంగంబునకును నుత్తరదిగ్విజయయాత్రాధురీణంబు లగుచరణంబులు తీర్థగమనంబులకును బాల్పడఁజేసి జగజెట్టిబిరుదంబు నెట్టుకొనం జేసి తండ్రిగుఱించి తపంబుఁ జేయుచుండ దినంబులు గడచె వారంబు లరిగెఁ బక్షంబులు సనియె మాసంబులు వోయె ఋతువు లతిక్రమించె సంవత్సరంబు దాఁటె నయ్యవసరంబున. 11

సీ. తెల్లనిగడ్డంబు తెల్లనిమీసము ల్నరసినరోమపాండురశిరంబు
మేధావిబొట్టును మెఱుఁగుజన్నిదములు భూతిలలాటత్రిపుండ్రకంబుఁ
గావిదోవతియును గంఠోత్తరీయంబు నిష్టికోలయుఁ జంక నిఱ్ఱితోలుఁ
బంచాంగముష్టియుఁ బాణిఁ బవిత్రంబు నొక్కవ్రేలికి వెండియుంగరంబు
తే. జాఱుబొజ్జయు నునుదబ్బసంబెలయును, జెత్తగొడుగును జక్కఁదాల్చి కుతుకమునఁ
దనకు సజ్ఞాతిగా నొక్కతపసివృద్ధు, బ్రాహ్మణుఁడు వచ్చె నొయ్యొయ్యఁ బార్థుకడకు. 12

వ. వచ్చి యాశీర్వదించి మహాత్మా! నీసంగడంబునం దపంబు చేయవచ్చితి నిచ్చోఁ గొన్నిదినంబులు క్రూరజంతువులు నన్ను బాధింపకుండ నరసికొని యుండవలయు నని పల్కి యతనిముందటఁ బరిశ్రాంతుఁడుంబోలెఁ జతికిలంబడి కూర్చుండి. 13

తే. మోఱకునిచందమున నీఱతాఱచూపు, పాండవేయునిపైఁ దార్చి బ్రాహ్మణుండు
వలికె నిప్పచ్చరం బైనభాషణములఁ, బరమనాస్తికభావంబు పరిమళింప. 14

తే. అన్న! యెవ్వరివాఁడ వీయడవిలోనఁ, దపము సేసెదు నీమంత్రతంత్రపదులు

పాకశాసనదేవతాప్రార్థనాను, సూచకము లైనయవి యన్ని చూడ నిపుడు. 15

ఉ. చక్కనివాఁడ వెంతయును జల్లనివాఁడవు భాగ్యరేఖఁ బెం
పెక్కినవాఁడ వీవిపిన మెక్కడ నీసుకుమారతాగుణం
బెక్కడ ఘోరవీరతప మీయెలప్రాయమునందుఁ జేయునే
యక్కట యెవ్వఁ డైన నకృతాత్ముఁడ వీ వొకరుండు దక్కఁగన్. 16

క. శరచాపధారణంబున్, బరమమనశ్శాంతి దాంతి పరిపాకంబున్
బరికింపఁ “జంకదుడ్డును, శరణార్థియు” ననెడునట్టిచందము దోఁచెన్. 17

క. వైరిమదకుంభికుంభవి, దారణదారుణకృపాణధారలు పరిఘా
కారములు కందమూలో, ద్ధారములకుఁ బాలుపడెఁ గదా నీకరముల్. 18

శా. ఈభద్రాకృతి యిమహాభుజయుగం బీదీర్ఘకోదండ మీ
యాశీలత్వ మొకం డొకొండ భువనైకాధ్యక్షతాహేతు వే
లాభం బాత్మఁ దలంచి చేసే దొకొ గోలాంగూలభల్లూకమ
త్తేభాకీర్ణవనాంతరంబునఁ దపం బేకాగ్రభావంబునన్. 19

తే. ఈశ్వరునిఁ గూర్చి చేసెద వేని లెస్స, మాధవునిఁ గూర్చి చేసిన మాకు హితవు
బ్రహ్మగూర్చి చేసిన నది పరమతరము, తగునె యిల వజ్రధరుఁ గూర్చి తపము సేయ. 20

తే. ఎవ్వఁ డుపదేశ మొనరించె నింద్రుఁ గూర్చి,తపము సేయుము నీ వంచు దయ దలిర్ప
నాతఁ డెఱుఁగఁడు గాక యాయద్రిభేది, గౌతమునియింటఁ జేసిన కారుగోష్ఠి. 21

సీ. ఆసహస్రాక్షునియాత్మసంశుద్ధికిఁ బరమసంయమియింటిపంచ సాక్షి
యానిర్జితేంద్రుబాహావిక్రమమునకు భుజగాంతకునియీకపోక సాక్షి
యాసునాసీరు నహంకారగరిమకు నిషధాచలముమీఁది నెలవు సాక్షి
యాశచీవల్లభు నౌచిత్యకలనకుఁ దాపసుచేతిపూదండ సాక్షి
తే. యిట్టిదేవేంద్రువలన నీ వేమి ఫలము, వడసెదవు చాలు నీ వాంఛ పాడుగాను
వాఁడు నీకంటె నేమిట వాసి గలఁడు, తగదు చాలింపు మీవిరుద్దంపుఁదపము. 22

వ. అని యెంత చెప్పిన నత్యంతధీరోదాత్తుం డగుపాండుపుత్రుం డూరక తపంబు చేయుచుండె నట్టియేకాగ్రభావంబునకుం బ్రియంబంది వృద్ధబ్రాహ్మణవేషంబు మాని వృద్ధశ్రవుండు ప్రత్యక్షం బై వరంబు వేఁడు మనుటయు. 23

క. గురుభీష్మకర్ణసైంధవ, గురుతనయులతోడఁ గూడఁ గురుపతిబలము
న్బరిమార్చునట్టిసత్త్వముఁ, బురుహూతా యిమ్ము కరుణ పొంపిరి వోవన్. 24

వ. అనిన నింద్రుండు సవ్యసాచి కిట్లనియె. 25

తే. భీష్మగురుకర్ణకృపు లనిర్భేద్యబలులు, ద్రోణిభూరిశ్రవోభగదత్తశల్య
సైంధవులు పేరు గలవారు సమరజయము, శంభుకృప లేక యెబ్భంగి సంభవించు. 26



వ. పశుపతిఁ గుఱించి తపంబు సేయుము తత్ప్రసాదంబున నీకుం జయం బయ్యెడుఁ బునర్దర్శనంబు కాఁగలయది పోయి వచ్చెద నని యింద్రుం డంతర్ధానంబు చేసె. 27

తే. తండ్రిచెప్పినమాటలు దప్ప కప్పు, డాదరించి ధనంజయుం డభవుఁ గూర్చి
యింద్రకీలాచలంబుపై నేకనిష్ఠ, ధీరుఁ డొనరించె నతిఘోరవీరతపము. 28

మ. భసితోద్ధూళితనిర్మలావయవుఁడు న్బంచాక్షరీసంతతా
భ్యసనవ్యాప్తిపరాయణుండును శివధ్యానానుసంధాతయున్
మసృణస్నిగ్ధతరక్షురప్రమయకంధాభద్రపీఠుందు నై
యసమస్థేమఁ గిరీటి పాశుపతదీక్షారంభముం గైకొనెన్. 29

సీ. ప్రథమసంధ్యారాగపరిపాటి మిన్నేటి కనకపంకజకోరకములు దెలుపఁ
గందువాఱినమించుగచ్చుటద్దమువోలె విధుమండలము కాంతి వీడుకొనఁగ
దర మైన వేఁ బోకఁ దఱసి వెన్నెలఁ గ్రోలి దివిఁ జగోరములు మత్తిల్లి యాడ
మందరాచలకూటమధ్యభాగమ్మునఁ గృత్తికానక్షత్ర మత్తమిల్ల
తే. మృదులభస్మరచితశయ్య మేలుకాంచి, యమలరుద్రాక్షధారణం బాచరించి
యర్జునుఁడు పర్ణశాలికాభ్యంతరమున, హరున కొనరించు నరుణోదయార్చనంబు. 30

క. కపికేతుఁ డింద్రకీలా, ప్రపాతపతయాళునిర్ఝరస్నాతుం డై
యుపచారవిధుల నన్నిటఁ, దపనోదయవేళ వ్యాళధరుఁ బూజించున్. 31

మ. అవధానంబునఁ బాకశాసనసుతుం డర్ధేందుకోటీరుసం
గవకాలంబునఁ బూజ సేయు హిమవాఃకర్పూరకస్తూరికా
ద్రవకాలాగురుగంధసారసురభిద్ర వ్యంబులం బూవుల
న్లవలీసర్జరసాగురుప్రముఖనానాధూపధూమంబులన్. 32

శా. పంచబ్రహ్మషడంగబీజసహితప్రాసాదపంచాక్షరీ
చంచన్మంత్రపరంపరాపరమనిష్ణాతత్పరత్వంబున్
మంచుంగొండయనుంగుఁ బెండ్లికొడుకు న్మధ్యాహ్నకాలంబు సే
వించు న్నిర్జరరాజసూనుఁడు మనోవీథి న్సదానందుఁ డై. 33

శా. ఆయామ్రాజినఖండమధ్యమున సేవాబద్ధపద్మాసనుం
డాయింద్రాత్మజుఁ డింద్రకీలశిఖరీంద్రారూఢబిల్వద్రుమ
చ్ఛాయానిర్మలచంద్రకాంతమణిపాషాణప్రదేశంబునన్
న్సాయంకాలము పూజ సేయు నభవు న్సంధ్యానటుం ధూర్జటిన్. 34

ఉ. అంచితభక్తితో శివుని నర్ధనిశాసమయంబునందు సే
వించు గురూపదేశపదవీపరిశుద్దసమర్చనావిధిన్
గాంచనగోరకంబుల బికప్రసవంబులఁ గొండగోఁగులన్
గాంచనకందరాముఖగృహంబులఁ బార్ఖుఁడు సంస్కృతార్థుఁ డై. 35



వ. ఇట్లు పాశుపతదీక్షాధురంధరుం డై కాలకంధరుంగుఱించి తపంబు సేయుచుండఁ గొండొకకాలంబునకు. 36

మ. ఒకనాఁ డింద్రతనూభవుండు గిరికూటోత్సంగభాగంబున
న్వికచానేకలతాతరుప్రతతులన్ దేవార్చనాపుష్పకో
రకము ల్గోయుచు నుండఁగా వినఁబడెన్ శ్రవ్యంబు లై కుర్కుర
ప్రకరోదంచితకంఠకాళకుహలీబౌబౌమహారావముల్. 37

తే. చాయగోసులకంటెఁ గేసరులకంటెఁ, బులులకంటెను బిసరులై పొగరుమిగిలి
జల్లుకొని వచ్చెఁ బైపైనిసారమేయ,యూధములు వేదమయమూర్తు లుద్ధతముగ.38

తే. ప్రకటలీల నుదాత్తంపుఫణితిఁ గొన్ని, క్రమముతో ననుదాత్తస్వరములఁ గొన్ని
స్వరితములఁ బచయంబులవరుసఁ గొన్ని, ఘోషణము సేయఁదొడఁగె నాకుర్కురములు. 39

క. కనకపుశృంఖలలఁ ద్రయీ, శునకంబులఁ బట్టుకొనఁగ సూరెలఁ బ్రమథుల్
తమ నిరుచక్కియ లీలా, వనచరులై కొలువఁ గపటవైహారికుఁ డై. 40

సీ. వికటపాటలజటామకుటికాభారంబు కఱుకైనజుంజుఱునెఱులు గాఁగఁ
జారుసుధాధామశకలావతంసంబు పెడకొప్పుపై నుండుపీఁకె గాఁగ
ఘనలలాటంబునఁ గనుపట్టుకనుచిచ్చు గైరికద్రవతిలకంబు గాఁగఁ
భుజమధ్యమునఁ గ్రాలుభుజగహారంబులు గురిజపూసలగుబ్బసరులు గాఁగ
తే. శంకరుండు గిరాతవేషంబు దాల్చి, యగజ చెంచెత యై తోడ నరుగుదేఱఁ
బాణి నోంకారదివ్యచాపము ధరించి, వచ్చె వివ్వచ్చువరతపోవనముకడకు. 41

వ. అట్టిసమయంబున. 42

చ. జలధరనీలదేహమును జంద్రకళాయుగళీసమానదం
ష్ట్రలు భిదురోపమానముఖసంపుటపోత్రము ఫుల్లమేచకో
త్పలదలవర్ణకర్ణములు బాటలవర్తులలోచనంబులుం
గలిగి కఠోరకంఠఘనఘర్ఘరఘట్టనఘోషజన్మమై. 43

ఉ. ముట్టియ నింద్రనీలతటమూలమహీప్రభవంబు లైనపె
న్బుట్టలు గ్రుచ్చి వైచుచును భూరుహషండముఁ జాఁపకట్టుగా
మట్టుచు ఘర్ఘరధ్వనుల మాటికిమాటికి దిక్పుటంబులం
ఘట్టన చేయుచు న్వెడఁదకన్నుల నిప్పులు వెళ్లఁగ్రాయుచున్ 44

క. పంది వడిఁ బాఱుదెంచెఁ బు, రందరనందననిశాకరధరులనడుమన్
దందడి గొరిజలతాఁకునఁ, గందుకములువోలె శిలలు గరువాఱంగన్. 45

ఉ. ఏసెఁ బినాకచాపమున నీశుఁడు గాండివకార్ముకంబునన్
వాసవసూతి యాప్రబలవజ్రసమానము లైనబాణముల్



రాసెఁ బరస్పరంబును వరాహముప్రక్కలు గాడిపాఱ మూ
కాసురసూకరంబు దిరుగాడె వడి న్శరఘాతవేదనన్ . 46

క. అభవార్జునశరపాత, ప్రభవవ్యథఁ దిరిగె నవ్వరాహము కడు సం
క్షుభిత మయి విలయవేళా, నభస్వదుద్భ్రాంతఘనఘనాఘనముక్రియన్. 47

క. దీర్ఘతరహరవరాశుగ, నిర్ఘాతనిపాతజాతనిబిడవ్యథ నం
తర్ఘూర్ణమాన మగుచును, ఘుర్ఘురఘోషంబుతోడఁ గ్రోడము గూలెన్. 48

వ. అప్పుడు గిరాతవేషధారి యగుపురారి యోంకారచాపంబు నేల నిలువంబెట్టి తదీయశిఖరంబున నఱచెయి మోసి యొరగి యొయారంపునిలుకడ నిలిచి వలకేల వాలమ్ము ద్రిప్పుచుఁ గట్టెదుర నున్నజగజెట్టి యగునింద్రునిపట్టిం గనుంగొని ప్రావృషేణ్యపయోవాహగర్జాగంభీరం బైనస్వరంబున నింద్రకీలగిరిగహ్వరంబులు ప్రతిధ్వని యొసఁగ సాటోపంబుగా సగర్వంబుగా సావష్టంభంబుగా ని ట్లనియె. 49

తే. ఎవ్వఁడవు రోరి నీవు నాయెదురఁ బాఱు, పంది నేసితి బాహుదర్పంబు మెఱసి
యెఱుఁగవుర యోరి నన్ను నీయింద్ర కీల, పర్వతం బేలువనచరసార్వభౌము. 50

ఉ. ఏనును నాకుటుంబ మగునీతరళాక్షియు వెంట వెళ్ళి యి
క్కాననభూమిలో బహుమృగంబులఁ జంపుచు వచ్చివచ్చి యే
నీనిశితాస్త్రపాతమున నిక్కిటిఁ జంపుదు నంచు వాక్ప్రతి
జ్ఞానియమంబున న్వెనుకజాడఁగ గూడఁగ వచ్చుచుండఁగన్. 51

క. వేఁట నలసి యీచెంచెత, యోటమివెట్టం గడంగి యున్నట్టియెడన్
గాటెఱుకు గోఱవింటన్, జీటంబున వేడ్కయెల్లఁ జెఱచితి కదరా. 52

తే. తపసి వై యుండి తగు రోరి ధనువుఁ బట్ట, శాంతిపరులకు నేలరా సత్త్వహింస
కపటధారివి రత్యంతకల్మషాత్మ, యెవ్వఁడవు రోరి నాపంది నేయ నీవు. 53

క. మండెముబలునారసమున , గుండియ పగులంగ నేసి కూల్చితి దీనిన్
వెండి ప్రయోజన మేదీ, రండాసుత! దీనిపై శరము నిగుడింపన్. 54

చ. తబిసివి గానఁ జావునకుఁ దప్పితి నీ కిది వేఁటపంతమా
యబలుఁడ నీతెఱంగునఁ బరాటవికాయుతచాపవల్లరీ
నిబిడశరాహతం బగువనేచరజంతువు నేసి తీగతిన్
సబముపయి న్నిగుడ్చిన నిశాతశిలీముఖ మెట్టివెఱ్ఱిదో. 55

వ. అనినం గిరీటి యయ్యాటవికచక్రవర్తి కిట్లనియె. 56

క. పైవచ్చు క్రూరజంతువుఁ, జేవెరవున నేయు టెందు సిగ్గే చెపుమా
యీవక్రభాషణంబులు, నీ వాడెదు శబర పొమ్ము నీచనుత్రోవన్. 57



క. పంది నపేక్షించితివో, పందెము గెలువంగ వేడ్క పడియెద వేదో
కందువుగా కాఫలము పు, ళిందాధిప యేమిటికిఁ బలికె దీభంగిన్. 58

మ. తడవే లోరి పుళిందరాజ చను మధ్యాహ్నంబు డాయంగ న
య్యెడు నీవేళ శివార్చనంబునకు మా కేకాంతమై యుండఁగాఁ
బడు నీవుం గడు డస్సినాఁడ వటవీపంక్తిప్రచారంబులన్
విడు కోపం బిదె శాంతి గైకొకొనుము వాగ్వీవాద మిం తేటికిన్. 59

క. జోటియు నీవును గుర్కుర, కోటియు ననుచరులు డప్పిగొన్నారు మహా
ధాటిపరిశ్రమమున ని, చ్చోట వసించెదర యేని సుఖ ముండఁ దగున్. 60

వ. అని యర్జునుండు పల్కిన నాగజ్జులాఁడు మోఱకంబున మొగ మడ్డంబు గదల్చి యీ యెడ్డిమాటలం బని లే దీపంది యొకప్రయోజనంబె వేఁటపంతంబు దప్పి మమ్ము నధిక్షేపించితి వీతప్పునకుఁ దపసివిగాన నిన్ను శిక్షింపను పొ మ్మదియునుం గాక. 61

ఆ. తాటియంతవిల్లు ధరియించినాఁడవు, జ్యాకిణాంకితము భుజాయుగంబు
గర్వరేఖ మిగులఁ గానంగ నయ్యెడు, దాంభికంబు నీదుతబిసితనము. 62

శా. ఏమో నాహృదయంబు నిన్నుఁ గని యిట్లే చాపమం దాసమై
భామాసన్నిధి నుబ్బుచున్నయది నీ బాహాప్రతాపంబు ని
స్సీమం బే నొకకొంతసే పిచట నుజ్జృంభించరాఁ జేయుమా
నామీఁద న్నిగుడింపుమా నిశితనానాక్రూరనారాచముల్. 63

క. చెం చని నన్నుం జూడకు, వంచింపకు హీనజాతివాఁ డని సంగ్రా
మాంచలమున నిదె నను మె, చ్చించెదవే నపుడు నిన్ను సేబా సందున్. 64

మ. శివలింగార్చన మెందువోయెడుఁ దపస్విత్వమ్ము నెందే నుప
ద్రవముం బొందదులే యొకింతవడిలో ధ్యానానుసంధానముల్
వ్యవధానం బొకయింత సైఁచవొకొ బాహావిక్రమశ్రీమహో
త్సవముం జూపుదుగాక నాయెదుర నాశ్చర్యం బవార్యంబుగన్. 65

తే. ప్రదర మరివోయు మేయుము ప్రాక్ప్రకార, కౌతుకాధీన హృదయుండఁ గాను నేను
ఔర కులపత్ని యైనయీనీరజాక్షి, యాసపడుచుండు ఘోరవీరాహవములు. 66

వ. అని పల్కి యాక్రీడాకిరాతుండు గుణధ్వని చేసిన జలధరధ్వానగంభీరంబై యేతెంచునామ్రోఁతకు సిళ్ళు చూపినఁ గోపించుగంధద్విపంబుంబోలె రోషించి యర్జునుండు గాండీవగుణగర్జాడంబరంబున నంబరంబు పిక్కటిల్ల నాటక్కరివిలుకానిపై భల్లంబులు నిగుడించె. 67

శా. గాండీవప్రవిముక్తనిష్ఠురమహాకాండప్రకాండంబులన్
ఖండించె న్బ్రతిబాణఘట్టనమునం గందర్పవిద్వేషి యా
తం డాశ్చర్యము నొంది బాపురె పుళిందశ్రేష్ఠ యంచు న్భుజా
దండాహంకృతి వెండియుం బఱపె శాతక్రూరనారాచముల్. 68

శా. ప్రారంభం బొకయింత లేకను దృణప్రాయంబున ట్లొందఁగాఁ
గ్రూరాజిం దెగనేసెనో నఱికెనో కొవ్వాఁడిఱంపంబుచే
నీరీతిం దునుమాడవచ్చునె యనన్ హేలాగతిం ద్రుంచె దు
ర్వారాహంకృతి నీశ్వరుండు విజయాస్త్రవ్రాతమున్ వ్రేల్మిడిన్. 69

క. శితికంఠుఁ డేయుశరములు, ప్రతిహతములు సేయు నరుఁడు పార్టునిశరముల్
శితికంఠుఁ డేయుశరములఁ, బ్రతిహతములు సేయు బహుళబాహాప్రౌఢిన్. 70

క. క్రూరతరహరనరాశుగ, నారాచశిలీముఖాదినానాస్త్రఘటా
నీరంధ్ర మైననభమునఁ, గారుకొనియె గాఢ మంధకారము దిశలన్. 71

క. ఓంకారగాండివజ్యా, టంకారంబులు నభఃకటాహము నిండెన్
శంకరకపికేతుభుజా, హంకారనిరంకుశాహవాంగణభూమిన్. 72

వ. ఇ ట్లోహరిసాహరి నల్లాడుహరార్జునులయందు. 73

క. శరధులు యుగాంతవేళా, శరధులునుం బోలె నయ్యు శరశూన్యంబుల్
సురపతిసూతికిఁ బరమే, శ్వరమాయాశక్తి నపుడు సమరాగ్రమునన్. 74

మ. తెలివిం బొందక యుండె నెమనమునం దివ్యాస్త్రమంత్రాక్షరం
బులు శారద్వతకుంభసంభవులసంభోదంబు సర్వంబు ని
ష్ఫల మయ్యెన్ వృథ యయ్యె నాంతరకృపాభ్యాసంబు గాండీవికిన్
గలహక్షోణిఁ బినాకపాణికుహనాకౌటిల్యశిల్పంబునన్. 75

క. నిటలవిలోచనమాయా, ఘటనమునఁ గిరీటి తనప్రగల్బత చెడినన్
గుటిలముగ బోమలు ముడిచెను, గటకటఁబడఁ దొడఁగెనపుడు కరము సెమర్చెన్.76

శా. కాండక్షీణత నాయిషుచ్ఛటలకుం గల్గెంగదే నాధనుః
పాండిత్యం బెటువోయె నొక్కొ యని చెప్పం జిట్టలౌఁ గాక యీ
తం డీలాగునఁ బోవువాఁడె మయిమైఁ దా నంచు గర్వోద్ధతిన్
గాండీవంబున బూన్చి వేయఁ దొడఁగె న్గాండీవి గంగాధరున్. 77

క. మృడు నెన్నఁడు శరములఁ గ, వ్వడి బొదువం దొడఁగె గాండివంబున నపుడే
యుడుగక పొడమెడుభయమున, వడఁకులగుబ్బతికుమారి వడవడ వడఁకెన్. 78



సీ. కఱకువెండ్రుకలలోఁ బఱచుమందాకిని సుకుమారదేహంబు స్రుక్కఁబాఱె నవతంసకుసుమమాల్యం బైనశశిరేఖ బ్రహ్మకపాలరంధ్రమునఁ దూఱె
నెట్టియంబుగ బిగ్గఁ జుట్టినపెనుబాము బిగియూడి నొసలిపై డిగఁగ జాఱె
నలికనేత్రముకిత్తి యారజ్యమానమై ఱెప్పలసందుల నిప్పు లుమిసె
తే. నగజభయమందెఁ బ్రమథులు బెగడుగుడిచి, రుపనిషత్తులు ఘోషించె నొక్కపెట్టఁ
గాలకంఠునిమౌళిశృంగాటకంబు, గాండీవంబునఁ దాడింప పాండవుండు. 79

తే. పాండునందనఘనభుజాదండకలిత, చండగాండీవతాడితఖండపరశు
పృథుజటామండలంబునఁ బిండుగట్టి, తాండవం బాడె మున్నేటితరఁగదండు. 80

తే. వింటఁ గొని వ్రేయవ్రేయంగ విసుగు వుట్టెఁ, జెట్టిబిరుదింతె పొమ్మని పట్టి యణఁచె
సురతనూభవునిం బట్టి శూలపాణి, మల్లసంగ్రామకేళిసంభావనముల. 81

క. కపికేతువృషభకేతను, లుపజాతనియుద్ధకౌతుకోత్సాహమునన్
నిపుణతఁ బెనఁగంగఁ దొడఁగి, రుపతాయి న్వేషభాష లుపలాస్యముగన్. 82

తే. తోరహత్తంబునందుఁ బార్థుండు గడిమి, సలిపె నూరులు బీడించె సరభసమున
హరుఁడు సీసాన హత్తించి యర్జునునకు, బరువు గావించె నిశ్వాసపవనమునకు. 83

క. ముక్కంటి కంఠమూలము, డొక్కరమున నిఱికె బార్డుఁడు ప్రబంధుండై
చక్కని ప్రకోష్ఠపీడన, మిక్కిలికనువేఁకి నుఱికె మినుమినుకుమనన్. 84

క. తాఁచుచుఁ బొడుచుచుఁ బడుచును, నేఁచుచు నుడుకుచును బిట్టు నెగయుచు గూలం
ద్రోఁచుచుఁ దూలుచుఁ బెనఁగిరి, ప్రాచీపతిసుతుఁడు హరుఁడు బాహాబాహిన్. 85

శా. నిష్టంకించి శశాంకశేఖరుఁడు గాండీవాయుధుండు న్భుజా
వష్టంభంబులు సిద్ధచారణులు గైవారంబు గావింపఁగా
దిష్టాంతాంతకఘోరమూర్తు లయి సాదృశ్యం బదృశ్యంబుగా
ముష్టిముష్టి రణంబు చేసిరి యసన్మోహప్రకారంబులన్. 86

క. చెమరుచుట యౌడు గఱచుట, బొమ ముడుచుట నిర్వికారమును మును నపరి
శ్రమమును సరిసరిఁ బెనఁగిరి, సమవిషమనియుద్ధకేలి శంభుఁడు నరుఁడున్. 87

క. తాటించెఁ బేరణము నా, స్ఫోటించెఁ గిరీటివక్షము వృషాంకుఁ డతం
డాటోపమఱక పిడికిటి, పోటున ధూర్జటియురంబుఁ బొడిచెం గడిమిన్. 88

శా. అంతం జంద్రకళాధరుండు నిజభాహాగాఢపీడాపరి
శ్రాంతుండై యటఁ బాండుసూతియెదురం బ్రత్యక్షమయ్యెం గృపా
వంతుండై యహిరాజహారములతో స్వర్వాహినీవేణితో
దంతిత్వక్ఫరిధానపల్లవముతోఁ దామ్రజ్జటాపంక్తితోన్. 89

ఉ. చెంచెత యయ్యెఁ బార్వతియుఁ జెంచులు భూతములై నిజాకృతి
న్మించిరి వేలుపు ల్నభముమీఁద లలాటమునందు నంజలు
ల్నించి నమస్కరించిరి వినీతియు భక్తియు నుల్లసిల్లఁ గా
వించెఁ బ్రణామము ల్గరము విస్మయ మందుచుఁ బార్థుఁ డత్తఱిన్. 90

తే. వేదముల్నాల్గు నుపనిషద్విద్యఁ గూడి, ప్రణవమంత్రాక్షరములతోఁ బ్రస్ఫుటముగ
విశ్వకద్రూత్వ మొయ్యొయ్య వీడుకొనుచు, నభినుతింపంగఁ దొడఁగెఁ జంద్రార్ధమౌళి. 91

వ. అప్పుడు పార్థుఁడు కృతార్థుఁడై రోమాంచితకంచుకితాఖిలాంగుండై యానందబాష్పలోచనుండై కేలుదోయి ఫాలభాగంబునం గీలుకొల్పి యిట్లని స్తుతించె. 92

క. నీవ పరబ్రహ్మంబవు, నీ వఖిలాండాండపతివి నీవు ప్రసన్న
శ్రీవిభవారోగ్యాయు, ప్రావీణ్యప్రాభవైకఫలదుఁడవు శివా! 93

క. నిన్నుఁ ద్రిజగన్నివాసునిఁ, బన్నగకంకణుని భక్తపరతంతుని న
భ్యున్నతకరుణాగుణసం, పన్నుని గనుఁగొంటి మంటి బాలేందుధరా ! 94

క. నీచేతఁ గృపానిధిచే, వాచాగోచరవివేకవైయ్యాత్మునిచే
నోచంద్రకలాశేఖర!, యాచించి మనోరథార్థ మర్థిం గందున్. 95

శా. నీకై యేను దపంబు చేసితి మహానిష్ఠాగరిష్ఠస్థితి
న్నీకై సంస్తుతి సేయుదుం గడఁగి నా నే ర్పొప్పఁగా నెంతయు
న్నీకై పూజ యొనర్తుఁ గొంత విరుల న్నిత్యంబు సద్భక్తితో
నీకై సేవ యహర్నిశం బొనరుతు న్వేదండచర్మాంబరా! 96

తే. సాటి యెవ్వరు నీకు నిశాటభూష!, కైటభారాతిహాటకగర్భవంధ్య!
ఘనజటాజూటవాటికాఘటితవికట, గగనగంగాస్రవంతిక! కరటివైరి! 97

క. నీయందు జగము లుండుం, బాయక యాజగములందుఁ బాయక నీ వుం
దీయనువు దెలియ నజునకుఁ, దోయజనేత్రునకు నైనఁ దోఁపదు శర్వా! 98

మ. జయ సర్వేశ్వర! సర్వలోకజనకా! చంద్రార్ధచూడామణీ!
జయ కామాంతక! కామితార్థఫలదా! చక్షుశ్శ్రవఃకుండలా!
జయ సంపూర్ణకృపాగుణైకవసతీ ! శైలేంద్రజావల్లభా!
జయ దధ్వరమర్ధనా! జయ గిరీశా! యీశ! రక్షింపవే. 99

ఉ. కొండకిరాతుఁ డంచుఁ గయికోక యసంగతభాషణంబు లు
ద్దండత నాడితిన్ గర ముదగ్రత నొంచితి ముష్టిఘట్టనం
గాండివచాపదండమునఁ గ్రచ్ఛఱ మోదితి మౌళి భోగభృ
త్కుండల! పెక్కుచందముల ద్రోహము చేసితి నేమి సేయుదున్. 100

వ. అని మఱియు మఱియు సాష్టాంగప్రణామంబు లాచరించి నిలిచిన పాండవమధ్యముం జూచి ఖండపరశుండు నీతపంబునకుఁ బాశుపతవ్రతనిష్ఠాగరిష్ఠతకు భుజాశౌర్యంబునకు సంతసిల్లితి నీవరం బేదియె వేఁడు మనుటయు. 101

తే. అభవ! యీ నాకు నీప్సితం బగువరంబు, దయఁ బ్రసాదించి రక్షింపఁదలఁచితేని
రౌద్రమై ఘోరమై లోకరక్ష యైన, పాశుపతసంజ్ఞ మగుదివ్యబాణ మిమ్ము. 102

వ. అనినం బ్రీతచేతస్కుండై శంభుండు శాంభవీహృదయానురాగంబునను బ్రమథపరివారసమక్షంబునను మందసితంబు కందళింపఁ గరుణాకటాక్షవీక్షణంబున నప్పాండుకుమారుం జూచి త్రిపురదైతేయసుందరీవదనారవిందవాసరావసానసంధ్యాసమయసమారంభంబును గరటిదనుజకుంభకూటకూటపాకలజ్వరస్తోమంబును జలధరజలధరవ్యూహజంఝాసమీరంబును నంధకాసురప్రద్యోతనప్రభామండలంబును శార్దూలదానవారణ్యహవ్యవాహంబును నగునమ్మహనీయదివ్యాస్త్రంబు ససంప్రయోగంబు సోపసంహారంబు సకీలకంబు సరహస్యంబుగా నుపదేశించె నపుడు సేవాసమాపన్ను లగుకిన్నరకింపురుషగరుడగంధర్వవిద్యాధరులు తమతమదివ్యాయుధంబు లిచ్చిరి పార్వతీదేవి యక్షయబాణతూణీరంబు లొసఁగె దండధరుండు దండంబును బాకపాణి పాశంబును నింద్రుడు వజ్రంబును సమర్పించి రిట్లు వరప్రదానంబు సేసి యీశానుండు సపరివారుండు సాంబుండు నై యంతర్ధానంబు చేసె ననంతరంబ. 103

తే. పరమసంతోషమును బొంది బలవిరోధి, పుత్రుఁ గౌఁగిటఁ జేర్చి యాపోనికూర్మి
సమదాశ్రుకణంబులు సుప్రఫుల్ల, చక్షురంభోజదళసహస్రమునఁ బొడమ. 104

వ. ఇ ట్లనియె. 105

ఉ. భాగ్యము గాదె యశ్రమమ పన్నగకంకణుచేఁ దపఃక్రియా
యోగ్యతఁ జేసి విశ్వభువనోపకృతిప్రతిపాదనైకసౌ
భాగ్యధురంధరం బయినపాశుపతాస్త్రము గాంచి తింక వై
రాగ్యము పుట్టుఁ గాక కురురాజుపయి న్నిజరాజ్యలక్ష్మికిన్. 106

వ. నీవు నారాయణసఖుడ వైనయాదిమునీశ్వరుండవు. నరనారాయణులవలనఁ ద్రివిష్టపంబునకుఁ బెక్కుతోయములు రాక్షసబాధలు శాంతిం బొందె. నిప్పుడు హిరణ్యపురనివాసులు నివాతకవచకాలకేయాదు లగుదైతేయులు రాజ్యలుబ్ధులై నాకంబున కనేకప్ర కారంబుల నుపద్రవం బాపాదించుచున్నవారు. వారిం బరిమార్ప నమరావతీపురంబునఁ గొన్నిదినంబులు వ్రతోపవాసప్రయాసభేదం బపనయించి మధ్యమలోకంబునకుం గ్రమ్మఱ నేతెంచునది. మాతలిసారథికం బగురథంబు పుత్తెంచెద నిచ్చోటన యుండునది యని తత్కాలసన్నిహితుం డైనరోమహర్లుం డను మునిం జూచి నీవు ద్వైతవనంబునకుఁ బోయి పాండవుల కర్జునుకుశలవార్తయుఁ బాశుపతాస్త్రలాభంబును స్వర్గగమనంబుం జెప్పు మని పల్కి యింద్రుండు నిజస్థానంబున కరిగె. 107

ఆ. విశ్రమించె నొక్కవృక్షంబుక్రీనీడ, నర్జునుండు మణిశిలాంతరమున
ఖండపరశుబాహుదండనిష్పీడన, ముష్టిఘాతఖేదమోక్షమునకు. 108

శా. మౌళిం గోహళి సంఘటించినక్రియ న్మధ్యాహ్నవేళ న్మహా
కాళం బైననభోవిభాగమున వీఁకం గాసె బీరెండయా
ప్రాలేయాహితసంప్రదీప్తకిరణప్రక్రీడదర్కోపల
జ్వాలాజాలజటాలజాంగలతటీవాచాలకోయష్టి యై. 109

వ. అప్పుడు మధ్యాహ్నకాలపూజకు నాయితంబై. 110

సీ. పావననిర్ఝరాంభఃప్రవాహంబున నఘమర్షణస్నాన మాచరించి
కసటువోఁ దెలినీటఁ గడిగి యీటార్చిన సలిలకాషాయవల్కలము గట్టి
యాపాదమస్తకం బఖిలాంగకంబులఁ గమ్మనిభసితంబు గలయ నలఁది
వెడఁదముత్యములతో నెడవెట్టి గ్రుచ్చిన మంచిరుద్రాక్షదామములు దాల్చి
తే. పులికళాసంబుగద్దెపైఁబూన్కి మెఱయఁ, బంచశుద్దులు గావించి పాండుసుతుఁడు షోడశోపచారంబులు పొందిఁ దీర్చె, నీలగళునకు మధ్యాహ్నకాలవేళ. 111

వ. ఇట్లు శివలింగార్చనంబు దీర్చి కందమూలఫలోపహారంబులు సమర్పించి తత్ప్రసాదంబునఁ దానును దేహయాత్ర నడపి విశ్రాంతుండై యున్న సమయంబున ధవళహయసహస్రంబులఁ బూన్చినరధంబు గొని వచ్చి మాతలి తనకుం బొడసూపిన సబహుమానంబుగా నాదరించి పురందరాదేశంబున నద్దివ్యస్యందనం బెక్కి యాకాశమార్గంబునం జనునప్పుడు. 112

సీ. ఇది మేఘమండలం బివి విమానంబులు యక్షవిద్యాధరోపాశ్రయంబు
లిది యాహవస్కంధ మదె తారకావీథి యల్ల తెల్లనిరేఖ యభ్రగంగ
యల్లదె శింశుమారాకారహరిమూర్తి వీఁడె భాస్వంతుఁడు వాఁడె ధ్రువుఁడు
వీరె సప్తర్షులు వారె యశ్విన్యాదు లిరువాడ దేవేరు లిందు భార్య
తే. లల్లవాఁడె సుధాకరుం డవె గ్రహంబు, లిల్వలాఖ్యంబు లగుచుక్క లివె కెలఁకుల
ననుచు మతలి చూపంగ నర్జునుండు, కౌతుకం బంది గగనమార్గంబునందు. 113

శా. జంభారాతితనూజుమీఁదఁ బొలిచెన్ సావిత్రివర్త్మంబున
న్సంభిన్నోదరశాతకుంభనలినీనాలీకసంవాసనా



సంభారంబులు సోడు ముట్ట సవిధస్వర్లోకకల్లోలినీ
గంభీరాంబుతరంగసంభ్రమములఁ గల్యాణవాతూలముల్. 114

తే. అర్జునునిమీఁదఁ బొలిచెఁ బథ్యంతరమున, నభ్రగంగానదీతరంగానిలంబు
నందనోద్యానవీథికానవలతాంత, సారభాసురహరినీలహార మగుచు. 115

వ. ఇవ్విధంబున మాతలిసారథికం బైనయారథంబుమీఁద నక్షత్రమండలం బొఱసికొనుచుం జని యర్జునుం డమరావతిం బ్రవేశించి దివ్యాంగనాపాంగభంగీసమాలింగితసౌభాగ్యుండై రాజమార్గంబునం జని దివ్యమందిరంబుఁ బ్రవేశించి సుధర్మాభిధానం బైనయాస్థానమండపంబునఁ గొలువున్న మహేంద్రు నర్ధాసనంబున నుండె. 116

తే. వీడుపట్టుగ మందారవిపినవీథి, దివ్యసౌధంబునందుఁ బ్రతిష్ఠఁ జేసి
గారవించె జయంతకుమారుకంటెఁ, బాండురాజతనూజు నాఖండలుండు. 117

వ. ఆనిశాసమయంబున. 118

సీ. పదునాలుజాతుల త్రిదశాంగనలయందుఁ బేరుఁబెంపును గలనీరజాక్షి
నీరజనాభుని యూరుకాండంబున నుద్భవం బందినయుజ్జ్వలాంగి
యంభోనిధానంబు నాపోశనము గొన్న కలశసంభవుఁ గన్నకంబుకంఠి
వసుధయందుఁ బురూరవశ్చక్రవర్తికిఁ బ్రాణవల్లభ యైన పద్మనయన
తే. కట్టి తొడి పూసి కైసేసి కౌతుకమున, గొస దిగఁగ నీలిపుట్టంబు ముసుఁగువెట్టి
గాజు లెగఁద్రోసి చప్పుడుగాక యుండ, వచ్చె నూర్వశి యర్జునావాసమునకు. 119

చ. విమలసుధాంశుకాంతమణివేదికపై నవహంసతూలత
ల్పమునఁ సుఖప్రసుప్తిపరిపాకము నొంది విశాలనేత్రప
ద్మములు మొగిడ్చి శేషఫణిపైఁ బవళించినయంబుజాక్షు భా
వమునఁ గరంబుఁ బొల్పమరువానిఁ గనుంగొనె నింతి పార్థునిన్. 120

తే. మేల్కొలిపి యిందుబింబాస్య మెల్లమెల్లఁ, బ్రమదనిద్రాపరాధీనుఁ బాండుతనయుఁ
బగడములఁబోలు తనపాణిపల్లవముల, నతని మృదుపాదపంకేరుహంబు లొత్తె. 121

వ. మేల్కని యర్జునుండు నిర్జరలోకలలామం బైనయబ్భామినీరత్నంబుం గనుంగొని పాన్పు డిగ్గి యభివాదనంబు సేసి వినయవినమితోత్తమాంగుండై యిట్లనియె. 122

తే. ఈనడికిరేయి నొంటిమై యింతదూర, మేమికార్యంబు మదిఁ గోరి యేగుదెంచి
తేను రమన్న రానె పూర్ణేందువదన, చెప్పుమీ పాన్పుమీఁద విచ్చేసియుండు. 123

ఉ. ఆడఁగఁబోవుతీర్థ మెదురైనవిధంబున నెల్లియేను రే
పాడియ చంద్రశేఖరు నుపాస్తి యొనర్చి యుపాయనంబుతోఁ

జూడఁగవచ్చువాఁడనయి చూచుచు నుండఁగ నీవ వచ్చితో
చేడియ యెట్టిపుణ్యములు చేసినవాఁడనొ ప్రాగ్భవంబునన్. 124

శా. మత్తారాతివిదారణుఁడు జనసన్మాన్యుండు శీతాంశువం
శోత్తంసంబు పురూరవుండు ప్రచలద్యోగుండు మా తాతగా
రత్తోయాకరమేఖలాపతికి నిల్లా లైతిగా కావునన్
ముత్తో వీ విది లెస్స మన్మనిపయిన్ మోహంబు వాటింపఁగన్. 125

తే. ఆదినారాయణునియూరు వంబుజాక్షి!, భువనవిఖ్యాత మైననీపుట్టినిల్లు
పావనుఁడ నైతి నీపాదపద్మములకు, వందనముఁ జేసి వరభక్తివైభవమున. 126

వ. అని పెక్కుప్రకారంబుల నిర్వికారుఁడై పాండుకుమారుండు ప్రియంబు చెప్పిన నప్పువ్వుఁబోఁడి కప్పల్కు లొప్పులయ్యును నీరుడప్పికి నేయునుం బోలి యప్పటి కప్రియంబులై యుండె నిచ్ఛావిఘాతంబు నొందియు నమ్మచ్చెకంటి చేతోభవవికారంబు హరింపం జాలక ధనంజయున కిట్లనియె. 127

తే. ఏల యెన్నోతరంబుల నీడఁ బడ్డ, పెద్దవావులు శోధించి గుద్దలింప
వారకాంతాజనములకు వావి గలదె, మాను మర్జున మొగమోట లేనిమాట. 128

ఉ. వాసవునిండుఁగొల్వునకు వచ్చినయప్పుడు తత్సమంచితా
ర్ధాసన మెక్కియున్ననిను నంగజసన్నిభుఁ జూచి పుష్పబా
ణాసనుపుష్పబాణనివహములకుం గుఱి యైతి నిట్టినా
యాస నిరాకరింపఁ దగవా మగవాఁడవు కావ యర్జునా! 129

తే. ప్రమద మెసలారఁ బాంచాలరాజసుతకు
వలచి చేసితివో సత్యవాక్ప్రతిజ్ఞ
యన్యకాంతలదెసఁ బోవ ననుచు నీవు
భామలకుఁ జేయుసత్యంబు పాడి గాదు. 130

క. నామోహము నావేడుక, నామానము నాప్రియంబు నాతగలము నా
ప్రేమమ్మును నాతెగువయు, క్షామముఁ బొందంగ నూరకయె పోవుదునే. 131

చ. అతులితధైర్యశౌర్యమహిమాద్భుతసాహసులై మహోగ్రతా
ప్రతతనిశాతనిష్కృపకృపాణవిదారితదేహులై రణ
క్షితిఁ బడి వత్తు రైదుపదిసేయక నాకయి యిట్టినన్ను నీ
వితరులఁ బోలెఁ గైకొనక యేఁచెద వక్కట పాండునందనా! 132

క. వేసాలఁ బోకు రమ్మీ, పూసెజ్జకుఁ బొద్దువోయెఁ బులియుట చాలున్
వాసవనందన కుసుమశ, రాసనకేళీకలావిహారంబులకున్. 133

వ. అని పల్కి యంత నిలువక బహచర్యవ్రతదీక్షాపరాయణుడవె నీ వనుచు నారాయణోరుస్తంభంబున సంభవించిన యయ్యచ్చరలేమ లేమొలకనవ్వు లపాంగంబునం దొంగలింపఁ గంకణఝణఝణత్కారంబు తోరంబుగాఁ గెంగేలికేళీకమలంబునఁ బరాగరేణుత్రసరేణునిసరంబులతోడం గూడి మకరందబిందుధారాస్యందంబు చిందఁ బురందరనందనుని వ్రేసె వ్రేసిన నత్యంతధీరోదాత్తుండు గావునఁ జిత్తభవనమోహనాస్త్రవిదారణంబునకుం దార యగునవ్వేటున కంతరంబున మిసిమింతుండునుం గాక యేపాకంబునకు రాక రాకాచంద్రబింబంబువోని నెమ్మోము వాంచి నిర్వికారుండై యూరకుండె నివ్విధంబున నయ్యూర్వసియు వసిమాలఁ బెనంగి యక్కిరీటి చిక్కని మనంబుపక్కు గానక కానక కాసినవెన్నెలయుంబోలెఁ దనకన్నులవలపు మిన్నక పొలివోయినం జిన్నవోయి నిట్టూర్పులు నిగిడించుచు మనోరథవిఘాతప్రభవం బైనకోపంబు సైరింపక నరు నుద్దేశించి నపుంసకుండవుఁబోలె నాన గొన్నాఁడ వేఁడుకాలంబు నపుంసకుండవు గమ్మని శపించి దిగ్గన లేచి మొగంబు గంటువెట్టుకొని యింటికిం బోయె. యుధిష్ఠిరానుజుండును వసిష్ఠజననివలన గతకీర్తితాపన్నుండై యయ్యరిష్టంబునకు సంతాపంబు నొందక యది విధివశంబుగాఁ దలంచుచుండె నప్పుడు గగనంబుక్రేవంబడి యస్తమండలుండై హిమగభస్తి విరహవేదనాదూయమానమానసయగు మైత్రావరుణజనయిత్రి ఖిన్నవదనంబునుంబోలె వెలవెలఁ బాఱ విభావరీసమయంబునం ద్రిభాగావశేషం బగుటయు. 134

సీ. పారిజాతకలతాపల్లవంబులు మేసి కొనరె నుద్యానపుంస్కోకిలములు
గంథరాగ్రైవేయకనకఘంటిక మ్రోయ వేల్పుటేనిక యుషర్విధికి వెడలె
మందాకినీవీచిమారుతం బల్లార్చె నప్పరస్త్రీలనీలాలకముల
సప్తర్షి పావనాశ్రమవనాంతరమున నామ్నాయఘోష మభ్యధికమయ్యెఁ
తే. బాలవత్సంబుపైఁ గూర్మి బచ్చడిలుచుఁ గామధుగ్గవివచ్చుహుంకార మెచ్చె
శుక్రుగడియారమున మించె శంఖరవము, విబుధలోకంబునందలి వేగుఁబోక. 135

తే. మర్త్యలోకంబువారి ప్రమాణసంఖ్యఁ, బాండుసూనుండు గడపెను వజ్రయింట
సగము నిద్రయును సగము జాగరమును, నావిభావరి వేగుఁబో కాఱునెలలు. 136

సీ. మాటుగా వైచినమాంజిష్ఠతెర యెత్తి పంజుమంచము డిగ్గె మంజుఘోష
మొకరిమట్టెలమ్రోత ముద్దుచూపఁగ రంభ కనకంపుగొడుగు పాగారు దొడిగె
నొకట వేనలి మడ్చి యొక్కకేల ఘృతాచి గాజుఱెక్కలతల్పు గడియపుచ్చె
నలసభావముతోడ నలవోక ప్రమ్లోచ నిల్వుటద్దంబులో నీడ చూచె
తే. హరిణి గీలించె నలినపట్టాంశుకంబు
మేనక ధరించెఁ బాలిండ్లమీఁద ఱవిక
యప్సరస్త్రీనికేతనాభ్యంతరములఁ
గొక్కురోకో యటంచును గోళ్లు గూసె. 137

మ. అమరావత్యమృతాశను ల్ప్రథమసంధ్యావేళ వాల్గన్నులం
గమలాప్తుం గని యాచరించిరి నమస్కారంబు క్రిందైనమ
ధ్యమలోకంబున దీవ్యదంశువుల నీహారప్రతానంబు భం
గము నొందించుచు మిన్నుఁ బ్రాఁకె నుదయగ్రావప్రదేశంబునన్. 138

సీ. పరమర్షి పావనపాణిపల్లవములు ఫాలభారములపైఁ బవ్వళింప
బౌలోమి పెంచిన బాలకోకద్వయం బలఁతియీరెండకు నఱ్ఱు సాప
గగనకల్లోలినీకనకపదములపై దుమ్మెద లెగసి జుంజుమ్ము రనఁగ
నాకవిద్యాధరీనాట్యశాలలయందుఁ దూర్యత్రయంబులు దురఁగలింపఁ
తే. బ్రమద దిక్కాంత కెంగేలఁ బట్టియాడు
కొత్తగురివెందపూసలగుత్తివోలె
దివసకామిని ముఖలక్ష్మి తెలివి నొంద
బూర్వదిశయందుఁ గరకరఁ బొద్దువొడిచె. 139

వ. అయ్యవసరంబున. 140

శా. కాల్యాచారము లాచరించి కడఁకం గౌరవ్యశార్దూలుఁ డౌ
జ్జ్వల్యస్ఫూర్జితవస్త్రభూషణవిశేషస్ఫూర్తియై విస్ఫుర
న్మాల్యాలేపనుఁడై విచిత్రబలశుంభద్భవ్యదివ్యాస్త్రసా
ఫల్యప్రౌఢతపోనిరూఢవిభవభ్రాజిష్ణుఁడై యున్నతిన్. 141

క. బలవదరినికగనిర్భర, బలసాదనబాహుదర్పబంధురలీలా
విలసనత యెసఁగ వచ్చెను, బలసూదనసభకు భక్తిభావం బలరన్. 142

వ. వచ్చి సాష్టాంగం బెఱఁగిన ఫల్గును నఫల్గునవాత్సల్యహేలాసముత్సేకంబున గూఢగూహనసంభావితుం జేసి జంభభేది యతని నాత్మీయసింహాసనార్ధంబున నుపవిష్ణుం గావించి యిట్లనియె. 143

సీ. బాహాబలాటోపపరిపాటి మెప్పించి పడసితి వీశానుపాశుపతము
సంగ్రహించితివి శస్త్రము లిమ్మడి గాఁగఁ బురవైరికరుణ నిర్జరులవలన
నధికరించితి వస్మదాచార్యకంబునఁ జతురంబు లగుదివ్యసాధనములు
కొఱఁత లేకుండఁ గైకొంటి కుంభజుచేత నైజంబుగాఁ జాపనైపుణంబు
తే. పరశుపట్టిసముద్గరప్రాసముసల, ఖడ్గముఖచిత్రచంక్రమక్రమనిరూఢిఁ
గరము మేదిని సాటి నీ కరయఁ గలరె, శౌర్యమున నుగ్రభుజవీచి సవ్యసాచి. 144

శా. ఏరీ ని న్నెదిరింపఁగా జగమున న్వీరు ల్ప్రతాపోద్దతిం
దౌరంధర్యమునం బ్రభావమహిమం ధైర్యంబునం జాపలీ
లారంభంబున సాహసిక్యమున బాహాశక్తి దివ్యాయుధో
దారప్రౌఢిమ దేవదైత్యనరగంధర్వాదిసంఘంబులన్. 145

క. నీ వని సేయ బలాడ్యుఁడ, వీవిశ్వంబునను నీకు నెదు రెవ్వరు లే
రావంత యైన వదలకు, మేవలనను దేవవిప్రహితకార్యంబుల్. 146

క. ఏపున భుజగర్వోన్నతి, ప్రాపున దీపింప నిట సుపర్వహితార్థం
బొపార్థ! చేయవలయును, నాపనిచినపంపుపంపున న్శౌర్యనిధీ. 147

చ. అలఘుబలు ల్నివాతకవచాఖ్యులు వీరులు ఘోరదానవు
ల్జలనిధిగొంది నుండుదు రసాధ్యులు నిర్జరసిద్ధసాధ్యకుం
డలినరకిన్నరద్యుచరనాయకకోటికి మూఁడుకోట్లవా
రలవలనం గలంగెడు నిరంతరబాధల ముజ్జగంబులున్. 148

చ. మఱియును నెందఱేని నసమానబలు ల్సురలోకకంటకు
ల్తఱచుగ బాధ చేసెదరు దైత్యు లవధ్యులు నిర్జరాళి కే
డ్తెఱ నెలయంగ వీరభవదీయశరార్చులపాలు సేసి యం
దఱ నుఱుమాడి యెంతయు హితం బొనరింపుము మాకు నర్జునా. 149

వ. అని సునాసీరుండు సమారాధనంబున. 150

క. తనతొడినభూషణంబులు, తనదుకిరీటము నభేద్యతరకవచంబుం
దనసుతున కొసఁగ గాండివ, ధనువున నగజయము గుణము దాఁచి కడంకన్. 151

క. హయము లనూరుసవర్లము, లయుతంబు వహింప సూతుఁ డై మాతలియు
న్నియమింపఁ దనరునరదము, నయదము నెక్కంగఁ బనిచి హర్షం బెసఁగన్. 152

తే. అసురలోకంబు నిర్జింప ననుపఁ బొంగి
సంగరోత్సాహ మెదలోన సందడింప
నడరుపెంపున నరుగునయ్యర్జునునకు
నిర్జరులు హర్షమున నిట్లనిరి కడంగి. 153

సీ. ఈరథం బెక్కి మున్నింద్రుండు నిర్జించె శుంభన్మహాదైత్యు జంభదైత్యు
నీశతాంగమున బర్హిర్ముఖేంద్రుఁడు ద్రుంచె నాజి నిస్తంద్రు వృత్రాసురేంద్రు
నీయరదంబున నెగిచె గోత్రవిభేది పరిపంథిఘనమహాబలుని బలుని
నీ తేరఁ గాదె మాయించె సుత్రాముండు, పాకదైతేయు నిర్భయసహాయు
తే. నీమహాస్యందనంబున నేపు మాపె
నముచిముఖదానవశ్రేణి నమరవిభుఁడు
నీవు మీతండ్రియట్లన నిఖిలదనుజ
పతుల నోర్వుము దీనిచేఁ బాండవేయ. 154

వ. అని పల్కి దేవసంబంధం బైనదేవద త్తం బనుశంఖం బిచ్చినం బుచ్చుకొని యర్జునుండు మాతలియుం దానును దద్రథాధిరోహణంబు చేసి నివాతకవచవధార్థం బతిరభసంబున నరుగువాఁడు ముందటఁ గరిమకరకరకఠోరఫూత్కారవారిధారాలవాసారపూర్యమాణ రోదసీనిరంతరాకాలసంపాదితోడుభ్రమంబును నమలడిండీరపిండఖండమండితాఖండపాండుర్యధుర్యరోచిరనిశసాంద్రచంద్రికాక్రాంతదేశదిశాభాగంబును వితతవిద్రుమలతానికుంజపుంజసమభిరంజితప్రదేశనిర్దిష్టసంతతాదిష్టచరమసంధ్యావిశేషరాగంబును గమఠఝషకుళీరతిమితిమింగిలాదిసత్త్వసంపాతసంభృతాచ్ఛోదితధ్వనినిలీననిఖిలచేతనారవంబును దటవిధూతపాతవికిరదవిరళపరాగవినిభృతద్విరేఫకుసుమమంజరీవిశాలలవలీలవంగలుంగలతాలాస్యవిభవంబును బక్షభూభృదవిరతప్రచారాభిషవణంబును నమేయవాహినీవధూముఖప్రసక్తభూషణంబును నగు మహాసముద్రంబు డగ్గఱి తదీయోదరంబున. 155

చ. కనియెఁ బురంబు నమ్రమణికాంచనసౌధము నత్యుదగ్రసా
ధనము నసాధ్యశిల్పఘనదారుణసాలము నద్భుతైకస
జ్జనసముదగ్రఘట్టము విశాలతరాట్టము నుద్భటారిత
ర్జనము ననల్పగర్జనసురద్విషదుజ్జ్వలితంబు నిమ్ముగన్. 156

మ. కని యత్యుద్ధతి శంఖ మొత్తుటయు నాకంపించె ధాత్రీతలం
బనిలస్కంధము లేడు చిక్కువడియె న్యాదోనిధు ల్డిందె ఘూ
ర్ణవముం బొందె సురేంద్రలోకములు విన్నంబోయెఁ బాతాళము
ల్వినియోగంబులు దప్పె భూతచయము ల్వ్రీలె న్దిశాభాగముల్. 157

వ. ఇట్లు యుగవిగమసమయఘనఘనాఘనకఠోరదీర్ఘతరశతసహస్రభైరవం బగునమ్మహారవంబు కర్ణశూలంబై తాఁకినఁ గనలి దానవులు హల ముసల పరశు పట్టిన ప్రాస పరిఘ ముద్గర ముసుండి దండ కోదండ కుంత కులిశ భల్ల భిందినాల శంఖ శక్తి కర్తరీ కఠార కుఠార లవిత్ర తోమర త్రిశూల ఖట్వాంగ చక్ర చంద్రహాస మహాంకుశ గదాపాశ పాషాణ ప్రముఖంబు లగు మహాస్త్రశస్త్రంబులు వహించి వికటగ్రజారవభరంబున నంబరంబు పిక్కటిల్ల నొక్కపెట్ట యమ్మహానగరంబు వెడలి తదీయస్యందనంబుఁ జుట్టముట్టి. 158

మ. ఘనశస్త్రాస్త్రమహాతివర్షము నొగి న్గర్జామహాడంబర
ధ్వనిసంవీతఘనాఘనౌఘనిసతద్ధారాళధారామహా
శనివర్షంబుల ద్వంద్వ మొందఁ బయిపై సంరంభశుంభద్గతి
న్వనధుత్ ఘూర్ణిల బిట్టు వాసవిపయి న్వర్షించె నొక్కుమ్మడిన్. 159

క. వాలికెమెఱుంగుఁదూపులు, నాళీకోదరునిమఱఁది నలిదైత్యులమైఁ
గీలించెఁ బేరుపేర, న్ఫాలమునఁ బదేసికంకపత్రములు వడిన్. 160

మ. అలుకం దానవు లొక్కయుమ్మడి తదీయస్యందనోరుద్యుతి
స్ఖలనంబు న్సురసిద్ధచారణమహాశ్చర్యంబు గావించుచు

న్గలహక్షోణియు నాకసంబు దిశలుం గాండప్రకాండంబులం
గలయం గప్పి యదల్చి యార్చిరి సమాకంపింప భూతావళుల్. 161

తే. భయభరంబున వెలవెలఁ బాఱి రపుడు
త్రిదశసారథి ధృతి దప్పె తేరు గడుప
బ్రమసియుండినఁ దాన సారథియు రథియు
నగుచుఁ బరిమార్చె నరికోటి నర్జునుండు. 162

క. నిర్జరసారథి యర్జును, దుర్జయవిక్రమము సమదదోహలతయు దోః
ఖర్జాభరంబు సారథి, యార్జిత్యముఁ జూచి మిగుల హర్షముఁ బొందెన్. 163

సీ. అసురు లుద్దఃతిశూలహలభిందివాలంబు లడరించి రడఁగించె నర్జునుండు
దైత్యులు దండించి దండశంకులశక్తు లిగిడించి రుడిగించె నింద్రసుతుఁడు
దైతేయు లేచి ముద్గరగదాంకుశములు పఱపించి రదలించె ఫల్గునుండు
సురవైరు లల్కఁ దోమరకుంతగుణములు సారించి రెడలించె సవ్యసాచి
తే. కణయకంపరఖేటకక్రకచకులిశ
చక్రఖట్వాంగకుద్దాలచంద్రహాస
వివిధశస్త్రాస్త్రములు వైచి రవఘళించె
శుక్రశిష్యుల ద్రోణశిష్యుండు గెలిచె. 164

వ. అయ్యవసరంబున. 165

శా. జంభారిప్రభవప్రయుక్తనిబిడజ్యారావగంభీరసం
రంభమితగాండివప్రసరదస్త్రవ్రాతదీవ్యత్పరా
సంభిన్నాంగములై సురారితనువు ల్సంగ్రామరంగంబునం
గుంభద్రోణము లట్ల బిట్టు గురిసెం ఘోరంబుగా రక్తముల్. 166

క. చేయునది లేక దనుజులు, మాయాయుద్ధంబు సేయ మదిఁ దలఁచి ధృతం
బాయక వైచిరి విద్యా, వైయాత్యము మించఁ బరుషవర్షాస్త్రంబుల్. 167

క. వడిఁ బాము వ్రేలఁగట్టిన, వడువున నలుగడల ముసరి వార్వాహంబు
ల్జడివడి కురియఁదొడంగెను, వెడవెలుపును లేక పాండవేయునిమీఁదన్. 168

మ. బలభద్ధ్వంసివరంబునం గొనినదీవ్యన్మారుతాస్త్రంబుచే
జలవాహంబులు వట్టఁజేసె నరుఁ డక్షయ్యప్రతాపంబున
న్గలయం గప్పిరి దారుణాశ్మముల నుగ్రస్వాంతులై యేచి దై
త్యులు పార్థుం గులిశాస్త్ర మేసి యవి తోడ్తోఁ ద్రుంచె నాతం డొగిన్. 169

చ. అనలసమీరణాత్మకము లైనమహాస్త్రము లేసి రుద్ధతిం
దనుజులు గాడ్పుతోఁ బెరసి నల్గడ లొక్కట విస్ఫులింగము
ల్గనకనఁ గ్రాలఁ బావకశాఖ ల్వెస ముంచె సురేంద్రనందను
న్గనలి యతం డణంచె నవి గ్రక్కున వారిమహాశుగంబులన్. 170

చ. తిమిరమహాస్త్ర మేసి రణతీవ్రత సూపిరి దైత్యపుంగవుల్
క్రమమునఁ గప్పె నల్గడల గాఢమహోద్ధతిఁ జిమ్మచీఁకటుల్
తెమలె దిశావివేకమును ధీరతయు న్వెస నెల్లవారికిం
బ్రమసి సురేంద్రసారథియుఁ బాఱఁగ వైచెఁ బ్రతోద మవ్వలన్. 171

క. రథ్యములు పరవనేరక, మిథ్యాభిమతంబు లయ్యె మెయి మఱచి సమి
ద్రథ్యు ధనంజయుఁ గానక, తథ్యమునకు లేక యుండఁ దత్సారథియున్. 172

వ. భయం బంది యర్జున యెటపోయె దని యెలుంగెత్తి యాహ్వానంబు సేసి తొల్లి దేవాసురసమరంబు లనేకంబులు చూచితిం గాని యిట్టిభయోద్రేకజన్యంబు లగుజన్యంబులు సూడ వీరు వరజనితవీర్యదర్పితులు గావున వీరిసంప్రహారంబు ఘోరంబు అని పల్కిన మాతలి నూఱడించి యించుకసేపు మద్భుజావిహారంబు చూడుమని ఫల్గునుండు. 173

శా. జంభధ్వంసివరంబునం గనినయస్త్రంబు న్మహాసారమున్
శుంభద్విక్రమబాహుదర్పములు సంశోభిల్ల నేసెం దమ
స్సంభారం బడఁగన్ దిశ ల్విపులవైశద్యంబు నొందన్ సుర
ల్సంభావింప భయంపడంగ దితిజు ల్సంగ్రామరంగంబునన్. 174

మ. జవ మేపాఱఁగఁ గూలె దైత్యతనువు ల్సర్వంసహాపీఠిఁ బాం
డవగాండీవధనుఃప్రకాండభవకాండప్రస్ఫుటోచ్చండతాం
డవపాండిత్యవిశేషవిభ్రమకృతాడంబప్రతీకంబులై
యవనీంద్రంబులభంగి నింగి యద్రువన్ హాహానినాదంబులన్. 175

వ. ఇట్టినివాతకవచులు నిరవశేషులై మడసిన సుక్రందననందనుండు తత్పురంబులోనికిం జని యంతయుం గనుంగొని మాతలి కిట్లనియె. 176

తే. కనకమయహట్టకుట్టిమకాంత మగుచు, వివిధమణిసౌధములును వస్తువులు గల్గు
నిప్పురంబునఁ గాఁపుండ కితరమైన , పురమునం దేల నిల్చె నిర్జరవిభుండు. 177

ఉ. నావుడు నిట్లనుం ద్రిదశనాయకుసారథి నిర్జరేశ్వరుం
డీవనరాశిలోన సృజియించెను దైత్యభయంబుచేత దే
వావలి కుంద నిప్పుర ముదగ్రగతిం దనుసూను లంత రా
జీవభవుం బ్రసన్నునిగఁ జేసి మహాబలవీర్యవంతులై. 178

క. ఇందుండఁగ నింద్రాదిక, బృందారకవరులతోడఁ బెనకువ నెందున్
గ్రిందుపడకుండఁ దపమున, నందిరి వర మఖిలభువనహననోత్సుకతన్. 179

వ. కావునం దద్విజయార్థంబుగా విజయ నిన్ను వాసవుండు వనిచె, నిమ్మహాసురులు మరుద్గరుడగంధర్వసిద్ధసాధ్యుల కసాధ్యు లిట్టివారల విశ్రమంబునం జంపి పెంపు గాం చితివి భవదీయసత్త్వసాహసంబులకుం గొలది యెక్కడి యది యని యర్జునుం బ్రస్తుతించి మాతలి రథంబు గ్రమ్మరించె, ఇట్లు నివాతకవచులఁ బరాభవించి భవ్యతేజోదుర్నిరీక్షుండై పాండవేయుండు మరలి వచ్చువాఁడు ముందట. 180

ఆ. వివిధవృక్షగుల్మవిస్తీర్ణమై కడుఁ, బొలుపు మిగులు నొకతపోవనంబు .
నతివిచిత్రశిల్ప మగుపట్టణంబును, నుజ్జ్వలంబు లగుచు నున్నఁ గాంచి. 181

క. సురసారథి యిది యెవ్వరి, పుర మిమ్మహనీయఘనతపోవిపినం బె
వ్వరిది యిది నాదృష్టికి, హరహర యతినిస్మయంబు నాపాదించెన్. 182

వ. అనవుడు నమ్మహాత్మునకు నాతఁ డిట్లనుఁ దొల్లి పులోమియు గోవికయు ననునసురకాంత లిత్తపోవనంబున దివ్యసహస్రవర్షంబు లత్యుగ్రనియమంబునం బద్మగర్భు నారాధించి తత్ప్రసాదంబునం గనకమయంబై కామగమనం బైనయిప్పురంబునం దనుసుతు లాహవంబునం ద్రిదశులఁ దొడరి వధ్యులు గాకుండ వరంబు వడసి రిది హిరణ్యపుర మిందుఁ బౌలోమ కాలకేయు లనునసురు లుండుదురు. వీర లింద్రాదిదేవతల కసాధ్యు లనిన నట్లేని యిప్పురంబుమీఁదం దేరు వఱపు మని ఫల్గునుండు మాతలిం బనిచిన. 183

సీ. సంవర్తమాతరిశ్వమనోహరరయమ్ము లగునశ్వములును దీవ్యద్విభూతిం
జిత్రచంక్రమము సుస్థిరనేమిఘోషంబు నత్యద్భుతంబు లై యంద మొంద
నమరారిపురముపై నాతఁ డుప్పరవీథి నరదంబు వరపిన నసురవరులు
వెస శతాంగములు షష్టిసహస్రకంబుతోఁ బెరసి యొక్కుమ్మడిఁ బురము వెడలి
తే. యింద్రుఁ డనుబుద్ధి నల్కతో నింద్రతనయుఁ
దాఁకి రార్చుడు నతఁడును దారుణాశ్మ
వృక్షజన్యంబు లగుశస్త్రవితతి యేసి
తద్రథాళికి గతినిరోధంబు సేసె. 184

వ. వారును మాయాయుద్ధనిబద్ధబుద్దులై తమపురంబులతోడ నంతరిక్షంబునకు నెగసిన నిశితశరనికరపంజరప్రపాతంబున నూర్ధ్వగతినిరోధంబు చేసి వారి నేలంబడ నేసి ఫల్గునుండు వీరి నన్యప్రకారంబున జయింపరా దని. 185

సీ. బ్రహ్లాదులును నాత్మ భావించి నిజముగా నేదేవుమహిమంబు లెఱుఁగలేరు
భూర్భువస్వర్ముఖంబులు లోక జాలంబు లేదేవుకృపఁ బేర్మి నెలమి చెందు
భక్తి నేదేవుని పాదపంకజములు తలఁచువారల కసాధ్యంబు లేదు
గజరాక్షసాదిమూర్ఖవ్రాతముల నెల్ల నేదేవుఁ డడఁగించి యింపుఁ జెందె
తే. భక్తపరతంత్ర మేదేవు భవ్యమూర్తి, యట్టిదేవుని హృదయంబునందు నిలిపి

పాశుపతదివ్యబాణంబు పరమనిష్ఠఁ దొడిగి ప్రయోగించెఁ ద్రిదశశత్రువులమీఁద. 186

చ. శరభతరక్షుసింహకిటిసైరిభఖడ్గమహోక్షపక్షికుం
జరసురయక్షరాక్షసపిశాచమహోరగభూతరూపము
ల్సురనరకిన్నరద్యుచరలోకభయంకరముల్ విచిత్రముల్
వరుసను నుప్పతిల్లి వెసఁ బట్టి గ్రసించె సురారివీరులన్. 187

వ. ఇవ్విధంబున నర్జునుండు సురల నఱువదివేలరథంబులవారల హిరణ్యపురనివాసుల గీటడంచి వచ్చి వాసవునకుం ప్రణామంబు చేసిన నతండు నివాతకవచపౌలోమకాలకేయాదిరాక్షసవధప్రకారంబు మాతలివలన విని. 188

క. సురలకు హిత మొనరించితి, ధర కేగుము నిన్నుఁ జూడఁ దద్దయు వేడ్కన్
ద్వరితపడుచున్నవారలు, హరివిక్రమ నీసహోచరాదులు పెరిమన్. 189

క. కదనమున నిన్ను దొడరఁగఁ, ద్రిదశమరుత్సిద్ధసాధ్యదేవాదులలో
నెదు రెవ్వరు లే రనినన్, బదపడి యిఁక మానవుండు ప్రతియే నీకున్. 190

ఉ. ద్రోణుఁడు భీష్ముఁడుం గృపుఁడు ద్రోణసుతుండును గర్ణుఁడున్ రణ
క్షోణి నవశ్యమున్ భవదిషుప్రహతిన్ మహితానుభావసం
ప్రాణబలాడ్యు లయ్యు నిట రాక్షసు లట్లనె యౌదు రింక న
త్రాణుల ధార్తరాష్ట్రుల దురంబున గెల్చుట నీకుఁ బెద్దయే. 191

వ. అని పల్కి వాసవుం డనేకమణివిచిత్రపీతాంబరాభరణంబులు గట్ట నిచ్చి యనిపిన నర్జునుం డవనీభువనంబునకు వచ్చి యగ్రజులకుం బ్రణమిల్లి తమ్ములం గౌఁగిలించుకొని ధౌమ్యాదులకు నమస్కరించి ద్రౌపది నుపలాలించి తక్కిన వారలకు యథోచితంబు సేసి తనవృత్తాంతం బాద్యంతం బెఱింగించి. 192

క. క్రమమున సమస్తరిపులన్, సమరమున జయించి యగ్రజన్ముని మాన్యున్
బ్రవిమలమతి ధర్మాత్మజుఁ, బ్రమదమునన్ విశ్వ మెల్లఁ బాలింపించెన్. 193

వ. ఈయాఖ్యానంబు వ్రాసినం జదివిన వినిన నాయురారోగ్యైశ్వర్యాభివృద్ధియుం బుత్త్రపౌత్త్రాభివృద్ధియు నగును.

ఆశ్వాసాంతము

శా. వ్యాపారిప్రవరాన్వవాయగణనీయప్రౌఢిగంభీరస
ల్లాపానందితవిశ్వ! విశ్వభువనాలంకార! లంకాదిక
ద్వీపానీతసువస్తుతర్పితసమాధేయాఖిలక్ష్మాప! వి
ద్యాపాండిత్యవివేక! నిత్యకృతకృత్యా! బంధుచింతామణీ! 195



క. ఆర్థినికరార్థితప్రద!, సార్ధవహకులాభినంద్య! సంచితధర్మా!
సార్థచరితార్థ! సంగర, పార్థ! యశోవర్ధనార్ధ! పరమార్థనిధీ! 196

మాలిని. అచలవిపులధైర్యా హారివిద్వత్సపర్యా
ఖచరవినుతకీర్తీ కామినీహృద్యమూర్తీ
యుచితజనవివేకా యూరుజనప్రవేకా
సుచిరశుభవినోదీ సుస్థిరశ్రీప్రమోదీ. 197

గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్త్ర వినయవిధేయ శ్రీనాథ
నామధేయప్రణీతం బైనహరవిలాసం బనుమహాప్రబంధంబునందు
సర్వంబును సప్తమాశ్వాసము

హరవిలాసము సంపూర్ణము