హంసవింశతి/మొదటిరాత్రి

వికీసోర్స్ నుండి

వ. అయ్యవసరంబున. 115

తే. తరణి తురగ ఖురోద్ధూత చరమశైల
గైరికస్థలపాంసువు ల్గప్పె ననఁగఁ
బశ్చిమంబునఁ గుంకుమపంక మటుల
సాంధ్యరాగంబు మించె నిస్తంద్ర మగుచు. 116

ఉ. కాలకలాదమౌళి దినకాంతి హసంతికలోన యామినీ
బాలకు సొమ్ము సేయుటకు భాస్కరుఁడన్ కనకంబుఁ గ్రాఁచి క
ల్లోలవతీవరాంతరములో నిడఁ దోఁచిన ధూమమున్ తమో
జాలము పర్వె, నా రవలచాడ్పునఁ దారలు వొల్చె నెంతయున్. 117

మొదటిరాత్రి

సాతాని భామిని ఱేనికడకుఁ బయన మగుట.

హంస వారించి బుద్ధిసెప్పుట.

క. అప్పుడు హేమవతి తమి
ముప్పిరిఁ గొనఁ జిత్రభోగ భూపాలునితో
నప్పుష్పబాణుకదనము
చొప్పడ నొనరించు వాంఛ చొరఁ దమకమునన్. 118

చ. పరఁగెడు రస్తు కొట్టుడులు భద్రముగా నొగి బీగముద్రలున్
గరిమ నొనర్చి తొత్తులకు గ్రాస మొసంగి నికాయకృత్యముల్
దరలిచి యత్తమామల పదంబుల నొత్తుచు నిద్రపుచ్చి మై
మెఱపుగ శీతలాంబువుల మిన్నగ మజ్జనమాడి వేడుకన్. 119

సీ. మెఱుఁగుఁగుచ్చెలమీఁద జరతారుపని మీఱు
చెంగావిరంగారు చీరఁ గట్టి గుజరాతి జిగిసిస్తు గోట్లదాఁపిన డాలు
రహి మించు పైఠిణీరవికఁ దొడిగి
ఘుమ్ముఘుమ్మని తావి గ్రమ్ము చొకాటంపుఁ
గలపంబు సొగసుగాఁ గలయ నలఁది
తళుకుతళ్కునఁ గాంతి చిలుకఁ గుల్కెడు జాతి
మణిభూషణంబులు మమతఁ దాల్చి
తే. తిలక మొగిఁదీర్చి మితభుక్తి సలిపి వెంట
బూమె లెఱుఁగని యొకపాటి బుడుత, యాకు
మడుపు లందీయ మోహంబు మరులు గొల్ప
వెడలె నల భామ నిజకేళివేశ్మసీమ. 120

వ. అటుల వెలువడి. 121

తే. తనదు ప్రాణంబు దైవంబు తల్లి తండ్రి
యనుచుఁ జెలియైన యల రాజహంసమున్న
దివ్యనవరత్నఖచితదేదీప్యమాన
కనకపంజర మొక్కింత గదిసి నిలిచె. 122

చ. నిలిచి దరస్మితంబయిన నెమ్మొగ మించుక వంచి యాత్మఁ దాఁ
దలఁచినకార్యమెల్లఁ బ్రమదంబునఁ దిన్నని కల్కిపల్కులం
దెలిపిన రాజహంస సుదతీమణిఁ గన్గొని పక్షయుగ్మముం
దలఁ గదలించి యందుకు మనంబునఁ జింతిలి యప్పు డిట్లనున్‌. 123

ఉ. అక్కట! భర్తకాఁపురము నాఱడిపుచ్చి నృపాలమౌళితోఁ
జొక్కి రమించునందులకుఁ జొచ్చినఁ, దావక బంధువర్గముల్
తక్కువ సేతురమ్మ! చరితవ్రతముల్ చెడునమ్మ! జాతికిన్
బక్కున నిందఁ జెంది తలవంపులు దెత్తురఁటమ్మ! మానినీ! 124 సీ. అత్తమామలు గన్న నాఱడిపుత్తురు
బావ పరీక్షింప నేవగించు
మఱఁదులు గాంచినఁ గఱకఱి నెంతురు
వదినె లెఱింగిన వాసి చెడును
బంధువుల్ గనినచోఁ బరఁగ నిందింతురు
తోడికోడలు చూడ నాడికొనును
బతి కనుఁగొన్నచోఁ బ్రాణహాని యొనర్చు
వాడవా రెఱిఁగిన వన్నె దఱుఁగు
తే. నరయ నిదిగాక యన్నిఁట నాఁడుపుట్టు
పుట్టఁ బాపంబు, పుట్టినఁ బుట్టినింటి
కేని మఱి చొచ్చినింటికేన్ గీర్తిఘనతఁ
దేక, యపకీర్తిఁ దెత్తురే? తెఱవ లెచట.

క. అగుఁ బ్రాణహాని యపసిరి
యగణిత మగు మానభంగ మహహా! తెలిసెన్
దెగువయె యింద్రపదవి యనఁ
దగు బుద్ధి జనియింపఁబోలుఁ దరుణీ! నీకున్.

సీ. పంక్తికంఠుని మోహ పరితాప మెంచెనే
భువనమాత జగత్ప్రపూత సీత
యల పుళిందునిఁ బొంద నాసక్తిఁ జెందెనే
ప్రియ హితామితనయ భీమతనయ
నహుషుని విరహంపుఁ దహదహల్ సూచెనే
సాంద్రసద్గుణచర్య యింద్రుభార్య
మఱి సింహబలుని పెన్మాయలఁ జిక్కెనే
యాఱడి పనిఁబూని యాజ్ఞసేని
తే. మునుపటి పతివ్రతలు మహామూర్ఖచిత్తు
లైన దుర్జను లతిఘోరసూనసాయ కాస్త్ర జర్జరితాత్ములై యాసపడిన
మాన ముడిపుచ్చుకొనిరఁటే మచ్చెకంటి! 127

చ. పతిహితభక్తిచే వెలయు పద్మదళప్రతిమాననేత్రకున్
వ్రతముల సోదు లేటికి? ధ్రువంబుగఁ బుణ్యము లబ్బు నెప్పుడున్
బతినిఁ దిరస్కరించి పరభర్తలఁ జెందిన భామ పుణ్యముల్
గతజలసేతుబంధములు గావె? వచింపఁగ నెంత నోచినన్. 128

క. పతిసేవయె భూషణములు
పతిసేవయె జీవనంబు భామామణికిన్
బతిసేవయె సువ్రతములు
పతిసేవయె యిహముఁ బరము భాగ్యము లనుచున్. 129

క. లలి జాగ్రత్స్వప్నసుషు
ప్తులను మనోవాక్శరీరములచే నేవే
ళలనైన సతులు పరపురు
షులఁ గోరిన వన్నెలేదు చూవె! ధరిత్రిన్. 130

క. ఈరీతి హంస పలికిన
నారీమణి చెవుల నవియు నారాచములై
దూఱి చుఱుక్కున నాటినఁ
గ్రూరకటాక్షములఁ గ్రేటుకొని తనుఁ జూడన్. 131

వ. అత్తెఱవ చిత్తం బెఱింగి మరాళం బక్కటా! యిత్తరుణి దుష్కర్మాయత్తతం బరాయత్తచిత్తవృత్తి యయ్యె, నిట్లగుట మదీయసునీతివాక్యంబులు దీనికిం బరుషంబులై తోఁచుచున్నవి. సమదమదనప్రదరవేదనాదోదూయమానంబైన దీని మానసంబు సామంబునం గాని చక్కంబడదని కొంత తడ వంతరంగంబునఁ జింతించి వెండియు నా రాజహంసంబు హంసగమన కిట్లనియె. 132

తే. మానవతి! నీవు పరసంగమమున కాస
పడఁ దలంచితి వేనిఁ జేపట్టు కొంచె
మైన చక్కని యొక యందగాని తోడఁ
గూడి యాడక, రాజులఁ గోరఁదగునె? 133

మ. అధిపుల్ క్రూరఫణిస్వరూపు లధరం భాసించు టేరీతి? భూ
మిధవుల్ కాలకరాళకీలిసదృశుల్ మేన్మేనఁ బొందించు టె
ట్ల? ధరాధీశులు మత్తదంతిసము, లేలా నీకుఁ జెల్లాట మా
డ? ధరాభృత్కుచ! యిత్తెఱం గెఱిఁగి, వేడ్కన్ గోర్కు లీడేర్చుకో! 134

క. ఇలపతుల చిత్తవృత్తులు
గలయికలం దెలిసి మెలఁగు కాంతల కెలమిన్
జెలు వొనరు జయము చేకుఱు
నలఘు శ్రీసౌఖ్య మబ్బు నంబుజగంధీ! 135

వ. ఇట్లు గావున నిత్తెఱంగునఁ దత్తరంబు లేక నృపవరోత్తముల చిత్తవృత్తి దెలిసి హత్తుకొన వర్తిల్లు మని హంసంబు ప్రత్యుత్తరం బిచ్చు నవసరంబున. 136

సీ. పిసవెఱ్ఱి కసరెత్తి యెసరేఁగు నసగూఁటి
పూఁబోండ్లు తమ యిండ్ల పొంతకరుగఁ
బరుసొమ్ములకు నిమ్మువడఁ గ్రమ్ము నెఱహమ్ము
తస్కరుల్ దిగులొంది తావుఁ జేరఁ
దనరారు సిరిసౌరు తనివారఁ గలవారు
కనుగూర్క మదిఁ గోరి కన్నుమూయ
రతిరూపు పసమాపుగతి చూపుగల కాఁపు
గుబ్బెత లెసటికై కుండ లరయ
తే. దూరదేశసమాగతధూర్తపాంథ
జనసమూహంబు పయనంబు సాఁగ లేవ
ఱెక్క లలరించి కుత్తుకల్ నిక్క మించి
కొక్కొరోకో యటంచును గోళ్ళు గూసె. 137

క. తెలతెల నయ్యెను దిక్కులు
పలపల నుడుగణము మాయఁ బాఱెను బక్షుల్
కలకలనఁ గూయఁ జొచ్చెను
దులదులఁ దుమ్మెదలు తమ్మితుటుముల వెడలెన్. 138

తే. అపుడు హేమవతీకన్య హంసనుడుపు
నీతిచాతురి వినురీతి నేర్పు మాని
పడుకటిలు సేరి కళవళపడుచు నిమిష
మొక్క యేడుగఁ బవలెల్ల నొనరఁ గడపె. 139

క. ఉదయోపరి రవి సింహము
మది మీఱఁగ నస్తశైల మత్త ద్విపమున్
బొదువ గమకించి దుమికిన
యదొ యన దినకరుఁడు పశ్చిమాశకుఁ జేరెన్. 140

తే. రసికుఁ డైనట్టి కాలంపు వ్రాతకాఁడు
తనరు బ్రహ్మాండ మను పెద్ద దవతిలోన
శాయి నిండారఁ బోసిన చందమునను
గారు తిమిరంపు గుంపు సొంపారఁ బర్వె. 141

చ. పనుపడ మిన్ననుం గడితపాళెఁ దమంబునఁ గట్టిపెట్టి శో
భనతరచంద్రదీధితులపంక్తి జమాఖరుచుల్ లిఖించి యిం
తనుకొని కాలమన్ గణకుఁ డప్పుడు తీర్చి లిఖించినట్టి యా
దినవహి లెక్కవ్రా లనఁగఁ దెల్విగఁ జుక్కుల పర్వె నత్తఱిన్. 142

చ. జలకము లాడి జీని బురుసాపని వస్త్రముఁ గట్టి మోమునన్
దిలకముఁ దీర్చి క్రొవ్విరులు నించి కచాళిని గబ్బిగుబ్బలున్
గలపనులంది గందవొడి గమ్మనఁ బూసి, నృపాలునింటికిన్
జెలియ చనం దలంచె రతిశిక్షకు రెండవనాఁటి మాపునన్. 143

తే. పోవుచో నమ్మరాళంబు పొంత నిల్వఁ
జెలియ పూనిన జిగినీటు కులుకుఁ జూచి
రాజహంసంబు వలికె, నో రాజవదన!
పోయెదవు గాని యుపమతోఁ బొసఁగి చనుము. 144

క. ఉపమ యెఱుంగని వారల
కపరిమితావస్థ లొందు నది యెట్లన న
య్యుపమ యెఱుంగక కాదే
చపలత మున్నొక్క నక్క సమసెన్ బెలుచన్. 145

వ. అనిన విని హేమావతి యిట్లనియె. 146

రెండవ రాత్రి కథ.

కక్కుఱితిబడి చచ్చిన నక్క

క. ఆకథ వినియెద నుడువు, సు
ధాకరకలు రాలఁ దేనె ధారలు చిలుకన్
లోకేశ తురంగమ! యన
నా కలికికి రాజహంస మపు డిట్లనియెన్. 147

క. వినవమ్మా! హేమావతి!
కనవమ్మా! స్థూలసూక్ష్మకార్యములు దగన్
మనవమ్మా! నన్నో చ
క్కని కొమ్మా! మెచ్చుకొమ్మ! కథ విని పొమ్మా! 148