స్మృతికాలపు స్త్రీలు/సప్తమాధ్యాయము
స్మృతికాలపు స్త్రీలు
సప్తమాధ్యాయము.
కర్మ కాండ
కర్మకాండలో స్త్రీ పురుషులకు గల భేదము ముఖ్యముగ నుపనయనముమీద నాధారపడి యున్నది. ఉపనయనము వేదపఠనాధికార మిచ్చుచున్నది. అట్టి యుపనయనము స్త్రీకి లేనేలేదు. కావున వేదమంత్రములతో చేయవలసిన యనేక కర్మలు చేయుటకు స్త్రీ కర్హతయే లేకపోవుచున్నది. కాని
'పాణిగ్రహణాద్ధి సహత్వం సర్వకర్మసు,
- (ఆ.ధ.2-14-17)
(పాణిగ్రహణమువలన స్త్రీకి కర్మలలో పురుషునితో సహత్వము కల్గుచున్నది.)
అని చెప్పుటచేత పురుషుడే కర్మ చేసినను దానిని భార్యకూడ చేయుచున్నట్లే యర్థము. ఆమెకొన్ని కర్మలలో పాల్గొనవలసికూడ నుండును. అంతేకాదు, కొన్నిటిలో నామె వేదమంత్రములనుగూడ నుచ్చరింపవలసి యుండును. ఉపనయనములేని యామెకు వేదపఠనాధికారములేదు కాన తాత్కాలిక పఠనాధికారము గల్గుటకై పత్నీసన్నహనమను క్రియ చేయబడును. శ్రౌతకర్మలలో నచ్చటచ్చట నీపత్నీ సన్నహనము జరుగుటను "వేదకాలపు స్త్రీలు" అను గ్రంథమున చూచియున్నాము. ఈమంత్రములను జదువనవసరము లేనపుడు గూడ పత్ని, పతితోపాటు కర్మ నొనర్చుచున్నట్లే యెంచవలెను. అంతేకాక పుణ్యకర్మ ఫలము నామెయు భర్తతో పాటు పొందుచున్నది.
"తథాపుణ్య ఫలేషుచ"
- (ఆ.ధ. 2-14-18)
(పాణిగ్రహణమువలన భార్యకు కర్మల యందువలెనే కర్మఫలములయందు గూడ సహత్వము గల్గుచున్నది,)
పురుషున కుపనయనమగుటతోడనే యెట్లు కర్మాధికారము గల్గుచున్నదో యట్లే స్త్రీకిని వివాహమగుటతోడనే కర్మలో భర్తృసహత్వము గల్గుచున్నది. పురుషుడుపనయనమునకు పూర్వము కర్మచేయుట కనర్హుడేకాని యాతడు పుట్టినది మొదలు జాతకర్మాది సంస్కారములకు లోనుగావలసియున్నాడు. ఈకర్మలన్నియు స్త్రీ శిశువునకుగూడ జరుగవలసినవే. కాని యవియన్నియు నమంత్రకముగ జరుగును.
"అమంత్రికా తుకార్యేయం స్త్రీణామావృదశేషత:
సంస్కారార్థం శరీరన్య యధా కాలం యథాక్రమం"
(మను 2-66)
(జాతకర్మాది కర్మకలాప మంతయు స్త్రీకి సకాలములో సక్రమముగ జరుగవలెను.) "నాస్తిస్త్రీణాం క్రియామంత్రై రితిధర్మో వ్యవస్థితః
- (మను 9-18)
(స్త్రీలకు సమంత్రకమగు క్రియకూడదని ధర్మము)
ఈకర్మలయినపిమ్మట పురుషున కుపనయనమును స్త్రీకి వివాహమునునగును. వివాహము వైదికముగనే జరుగును.
"వైవాహికోవిధిస్త్రీణాం సంస్కారోవైదికస్స్మృతః"
(స్త్రీలకువివాహ సంస్కారము వైదికము)
"తూష్ణీమేతాః క్రియాఃస్త్రీణాం
వివాహస్తు సమంత్రికః"
(యాజ్ఞ 1-18)
(ఈక్రియలుస్త్రీల కూరకనేచేయవలెను. వివాహము సమంత్రకము) పురుషుడుపనయన మగుటతోడనే గురుకులమునకుబోయి యగ్ని కార్యముచేసికొనుచుండును. అట్లే వివాహమయినస్త్రీ భర్తృసేవచేయుచు గృహకృత్యములను చేసికొనుచుండును.
"పతిసేవాగు రౌవాసోగృహార్థోగ్ని పరిక్రియా"
- (మను. 2-67)
(పతిసేవయే గురుకులవాసము. గృహకృత్యమే యగ్ని కార్యము)
స్త్రీ కుపనయనము లేదు. గావున సాధారణముగ నీమే యనుపనీతునివలె హోమాదులుచేయుట కనర్హురాలు. "నస్త్రీజుహాయాత్"
"నానుపేతః"
(ఆ.ధ.2-15-17, 18)
(స్త్రీయుననుపనీతుడును హోమము చేయరాదు)
కావుననే స్త్రీచేయవలసియున్న లాజహోమముగూడ వరుడే చేయుచు 'జుహోతీయంనారీ' (ఈస్త్రీహోమము చేయుచున్నది) అని చెప్పును.
జుహోతీయం నారీతి.
- (ఆ.గృ.సూ. 2-4-5)
భర్తవేయుబలులు గాక భార్య ప్రతిసాయంకాలమునను బలివేయవలెను. ఆమె మంత్రము లేకుండనే యట్లు వేయవలెను.
సాయంత్వన్న స్య సిద్ధస్యపత్న్యమంత్రం బలింహరేత్
వైశ్వదేవంహి నామైతత్సాయం ప్రాతర్విధీయతే.
(మను. 3-121)
(సాయంకాలము వండినయన్నమును పత్నిమంత్రరహితముగ బలివేయవలెను. ఇదియు వైశ్యదేవమే)
స్త్రీ గర్భిణియై యున్నప్పుడు ప్రత్యేకముగ కొన్నిసంస్కారములను పొందవలెను. ఇందు కొన్ని గర్భస్థశిశువు నుద్దేశించి చేయబడునవే. కొన్నిటియందు మంత్రాలను గూడ పఠింపవలసియుండును. "సీమంతోన్న యనం ప్రథమేగర్భేచతుర్థేమాసే "
(ఆ.గృ.సూ.6-14)
(సీమంతోన్నయనమను సంస్కారము స్త్రీకి ప్రథమగర్భమందు నాల్గవమాసమున చేయవలెను.)
గర్భము స్ఫుటమగుటతోడనే పుంసవనమను సంస్కారముచేయవలెను. ఇది పుష్యమీ నక్షత్రమున చేయబడును.
"పుగ్‌సువనం వ్యక్తేగర్భేతిష్యేణ"
(ఆ.గృ. 6-14-9)
గర్భిణిపురుష శిశువును గనవలెనను కోరికతో నిదిచేయబడును. సుఖప్రసవము గల్గుటకై "క్షిప్రగ్‌సువన" మను కర్మచేయబడును.
"యదిజరాయు నపతేదేవం
విహితాభిరేవాద్భిరుత్తరాభ్యామవోక్షేత్"
(ఆ.గృ.సూ. 6-14, 15)
(మావివడనిచో "అనాప్రీతేనశరావేణ" అనుదానిచే తీసికొనబడిన యుదకముచేత "ఐతుగర్భోఅక్షితః" అను రెండుఋక్కులతో నామెను మార్జనచేయవలెను.)
పైకర్మలన్నిటిలోను గృహ్యసూత్రములు మంత్రవినియోగమును చెప్పుచున్నవి. జననమయినపిమ్మట జరుగు జాతకర్మనామకరణాన్న ప్రాశన చౌలములు స్త్రీకి మంత్రరహితములుగనే జరుగునని యిదివరలో చూచియున్నాము. నామకరణములో స్త్రీకి బేసిసంఖ్యగల యక్షరముల పేరు నిడవలెను.
'అయుజాక్షరంకుమార్యాః'
- (ఆ.గృ. 6-15-11)
పుత్రుడు కల్గుచో తండ్రి ప్రవాసమునుండి వచ్చి "అంగాదంగాత్" అనునట్టియు "అశ్మాభవ" అనునట్టియు ఋక్కులచే వాని నభిమంత్రించి వాని శిరన్సుమూర్కొని, వానికుడి చెవిలో "అగ్నిరాయుష్మాన్" మున్నగు మంత్రములను చదువవలెను. స్త్రీ శిశువు గల్గుచో నివియేవియు నుండవు. "సర్వస్వాదాత్మనః" అను మంత్రముచే దాని నభిమంత్రింపవలెను. ఈ క్రింది సూత్రముల కిదేయర్థము.
"ప్రవాసాదేత్యపుత్రస్యోత్తరాభ్యా మభిమంత్రణం
మార్ధన్యవఘ్రాణం దక్షిణేకర్ణ ఉత్తరాన్ మంత్రాన్ జపేత్
కుమారీముత్తరేణయజుషాభి మంత్రయతే"
(ఆ.గృ. 6-15-12, 13)
'మాతుస్సపిండీకరణం పితామహ్యాసహోదిత:
యథోక్తేనైవకల్పేన పుత్రికాయానచేత్సుత:'
(కాత్యా 16-21)
పుత్రికాపుత్రుడెట్లు చేయవలెనో ప్రథమాధ్యాయముననే చూచియున్నాము. సవతులలో నొకతె పుత్రవంతురాలగునేని యందఱును పుత్రవంతురాండ్రే యైనట్లు పూర్వాధ్యాయమున జూచియుంటిమి. దానింబట్టి సవతితల్లులకు గూడ శ్రాద్ధాదికము చేయవలెనని తేలుచున్నది.
వివాహముకాని స్త్రీలకు నుపనయనము కాని పురుషులకువలెనే పిండదానము లేదు.
"ఆసంస్కృతప్రమీతానాం త్యాగినాం కులయోషితాం
ఉచ్ఛిష్టభాగధేయం స్యాద్దర్భేషువికిరశ్చయ:"
(మను 3-245)
(ఉపనయన సంస్కారము జరుగకుండ చనిపోయినవారికిని, తల్లిదండ్రులు మున్నగువారిని వదలివైచినవారికిని వివాహము కాకుండ పితృకులమున నుండగనే మరణించిన స్త్రీలకును దర్భలయందు చిమ్మబడిన యుచ్ఛిష్టమే భాగధేయము)
ఇచట 'కులయోషితాం త్యాగినాం', అనుదానికి 'మంచి భార్యలను విడిచిపెట్టినవారికి, అని యర్థమని కొందఱు చెప్పుచున్నారు. మఱికొందఱు 'కులయోషితాం', అనగా స్వకుల మును వీడి మఱియొక కులమునకు వెళ్ళిపోయిన (చెడిపోయిన) స్త్రీలకు' అని చెప్పుచున్నారు.
చౌలమై మృతినొందిన స్త్రీకిని పురుషునకును గూడ నపిండు లుదకదాన మీయవలెను.
'ఉదకదానం నపిండైః కృతజటస్య '
'తత్త్ప్రీణాంచ'
(గౌ. 14-34-35)
వివాహమయిన స్త్రీలకు భర్తృపక్షమువారే యుదకదానము చేయవలెనని కొందఱును పితృపక్షము వారుకూడ చేయవచ్చునని కొందఱును చెప్పుచున్నారు.
'ఏకే౽ప్రత్తానాం,
- (గౌ. 14-34-36)
పురుషుల విషయమున నపిండత్వము సాప్తపురుషమనియు స్త్రీలవిషయమున త్రిపురుషమనియు వసిష్ఠుడు చెప్పుచున్నాడు.
'ప్రత్తాణాంచ స్త్రీణాం త్రిపురుషం విజ్ఞాయతే'
- (వసిష్ఠ 4-18)
శ్రాద్ధభోక్తృత్వమున కుపనీతుడే యర్హుడైనను పితరుల నుద్దేశించి స్త్రీనిగూడ గూర్చుండబెట్టుట లేకపోలేదు.
"అమావాస్యాయాం బ్రాహ్మణం సముద్దిశ్యపితామహం
బ్రాహ్మణీం స్త్రీం సమభ్యర్చ్యముచ్యతే నర్వపాతకైః"
(ఉశన:. 105)
కుమారుడుగలుగవలెనని కోరుచున్న స్త్రీశ్రాద్ధములో మధ్యమపిండమును తినవచ్చునట.
'ప్రతివ్రతాధర్మపత్నీ పితృపూజనతత్పరా
మధ్యమంతుతతఃపిండమధ్యాత్సమ్యక్సుతార్థినీ'
(మను 3-262)
(ప్రతివ్రతయు, ధర్మపత్నియు, పితృపూజనతత్పరియు, సుతులను కోరునట్టియు స్త్రీమధ్యమ పిండమును తినవలెను) అట్లుతినుచోనామె
ఆయష్మంతం సుతంసూతే యశోమేధాసమన్వితం
ధనవంతం ప్రజావంతం సాత్వికం ధార్మికంతథా'
(మను 3-263)
(ఆయుష్మంతుడు, యశోవంతుడు, మేధావంతుడు, ధనవంతుడు, సంతానవంతుడు, సాత్వికుడు, ధార్మికుడు నగు పుత్రుని కనును.)
వితంతువు భర్తకు శ్రాద్ధాదికములను చేయించు చుండ వలెను.
'తంశుశ్రూషే తజీవంతం
సంస్థితం చనలంఘయేత్'
(మను 5-151)
షష్టాధ్యాయములో వివరింపబడిన 'ప్రేతపత్నీ షణ్మాసాన్' మున్నగు వశిష్ఠసూత్రములో గూడ నీయంశము స్పష్టముగ నున్నది.
స్త్రీ స్వయముగ శ్రాద్ధకర్మ చేయలేదు. ఏలన:
'నస్త్రీజు హుయాత్'
(స్త్రీ హోమముచేయరాదు.)
అను నియమముగలదు. అంతేకాదు. భర్తృరహితయగు స్త్రీకేకర్మ చేయుటకు నధికారములేదు. మనువు వితంతువులను గూర్చి "లుప్తధర్మ క్రియాహితాః" (వారులోపించిన ధర్మక్రియగలవారు.) అని చెప్పినట్లు పూర్వాధ్యాయములో చూచియుంటిమి. పాణిగ్రహణమువలన స్త్రీ భర్తతో కర్మచేయుట కర్హురాలగుచున్నది. అతడు చనిపోవుచో నామెకాకర్మ సహత్వము కూడ పోవుచున్నది. ఆమె స్వతంత్రముగ కర్మచెయరాదా? యన
'అస్వతంత్రా ధర్మే స్త్రీ
- (గౌ. 18-1)
(ధర్మము విషయమున స్త్రీ యస్వతంత్రురాలు) అని చెప్పబడినది.
పురుషుడయినను తానొక్కడే క్రతువును జేయరాదు. గృహస్థాశ్రమములో నున్నపుడే యనగా భార్యతో నున్నపుడే యాతడు యజ్ఞములను జేయుట కర్హుడనియు భార్యారహితు డైనచో నాతడు యజ్ఞములను చేయుట కనర్హుడనియు గృహమునువీడి యరణ్యమునకు బోవలసినవాడేయనియు పంచమాధ్యాయమున జూచియుంటిమి. ఇట్లు కర్మలలో పాల్గొనవలసినది జ్యేష్ఠ భార్యయేనా? యున్న భార్యలందరును గూడనా ? యననావిషయమై స్మృతులలో నభిప్రాయభేదము గలదు. ప్రథమ భార్య ధర్మప్రజా సంపన్నయై యుండగా రెండవ భార్యను జేసికొనుట కేవలము నింద్రియసుఖముకొఱకే యనియు నామె ధర్మకార్యముల కక్కరకురాదనియు పూర్వాధ్యాయమున చూచియుంటిమి. పరాశరస్మృతి యిట్లు చెప్పుచున్నది.
'సవర్ణాసు విధౌధర్మే జ్యేష్ఠయాన వినేతరా'
- (పరాశర. 4-89)
(ధర్మములో భర్తతో నుండదగినది సవర్ణ భార్యలలో జ్యేష్ఠయే.)
ఎంతమంది భార్యలున్న నంతమందితోను కలిసియే క్రతువులను జేయవలెనని కొన్ని స్మృతులలో గలదు.
"నైకయాపి వినాకార్య మాధానం భార్యయాద్విజైః'
- (కాత్యాయన 8-5)
(ద్విజుడొక భార్యను గూడ విడువకుండ యందఱు భార్యలతోను నాధానము చేయవలెను) కర్మలో స్త్రీ కెంత ప్రాధాన్యమున్నదన నాధానము చేసినవాని జ్యేష్ఠభార్య భ్రష్టురాలగుచో నామెభర్త మరల నాధానము చేసికొనవలెను.
జ్యేష్ఠాచేద్బహుభార్య స్యాతిచారేణగచ్ఛతి
పునరాధానమత్రైకఇచ్చన్తి నతుగోతమః
(కాత్యాయన. 20-4)
(బహుభార్యలుగలవాని ప్రథమభార్య చెడిపోవుచో నాతడు మఱల నాధానము చేయవలెనని కొందఱు చెప్పుచున్నారు. చేయనక్కరలేదని గౌతముడు చెప్పుచున్నాడు.)
జ్యేష్ఠభార్యకు మిగిలినభార్యలకంటె కర్మాధిక్యమెచట నంగీకరింపబడినదన: తనకంటె ముందుగ జ్యేష్ఠభార్య చనిపోవుచో నాహితాగ్ని యామెను వైతానికాగ్నులచే దహనము చేయవలెను. జ్యేష్ఠ భార్యయుండగా రెండవభార్య చనిపోవుచో నామెను వైతానికాగ్నులచే దహింపరాదు.
"దాహయిత్వాగ్నిభిర్భార్యాం సదృశీం పూర్వమారిణీం
పాత్రైశ్చాగ్నిమాదధ్యాత్ కృతదారో విలంబితః
ద్వితీయాంచైవయః పత్నీందహేద్వైతాని కాగ్నిభిః
జీవన్త్యాం ప్రథమాయాంతు బ్రహ్మఘ్నేననమం హితత్.
(కాత్యాయన. 20-5, 7)
(ముందు చనిపోయిన సవర్ణభార్య నగ్నులతోడను పాత్రలతోడను దహింపజేసి యాలసింపక మఱొకభార్యను చేసికొనవలెను. ప్రథమభార్యజీవించియుండగా రెండవభార్య చనిపోవుచో నామెను వైతానికాగ్నులతో దహింపచేయుచో నది బ్రహ్మహత్యాతుల్యపాపమగును.)
భార్య చనిపోయినపుడామెతో పాత్రలను నగ్నులను దహింపజేయవలెనని చెప్పుటచే శ్రౌతకర్మప్రయోజనము చాలవఱకు పూర్వమారణియైన భార్యకే ముట్టుచున్నదని తెలియుచున్నది. ఆమె పోయినపిమ్మట పురుషుడిక నాహితాగ్ని కానే కాడు. సాయంప్రాతరగ్నిహోత్రములను దర్శపూర్ణమా సేష్టులను చేయుట కాతని కధికారము లేదు. ద్వితీయభార్యను గైకొనినను నాతని కధికారములేదు. ఆమెతో మఱల నాధానము చేయవలసినదే.
దీనినిబట్టి యజ్ఞఫలము నొందుటలో స్త్రీ పురుషునికంటె తక్కువయర్హురాలు కాదని తెలియుచున్నది. ఒకభార్యను వివాహమాడిన పిమ్మట నామె మరణించినను మఱొక భార్యను జేసికొనకుండ నామె ప్రతిమతో ధర్మకార్యములను జేయవచ్చునని కొలదిస్మృతులు చెప్పుచున్నవి. రాముడు సీతాప్రతిమతో క్రతువులు చేయలేదా?
"మృతాయామపిభార్యాయాం వైదికాగ్నిం నహిత్యజేత్
ఉపాధినాపి తత్కర్మయావజ్జీవం సమావయేత్
రామోపికృత్వా సౌవర్ణాంసీతాం పత్నీంయశస్వినీం
ఈజేయజ్ఞెర్బహువిధైస్సహ భ్రాతృభిరావృతః
(కాత్యా 20-9,10)
"కార్యమగ్నిచ్యుతేరాభిః సాధ్వీభిర్మథనంపునః.
- (కాత్యా 8-6)
గృహస్థుప్రవాసమున కేగి నపుడగ్నులను నిర్వహించు బాధ్యత గృహిణిపై గలదు. శ్రాద్ధములోవలెనే నిటగూడ నామె యితరులతో జేయింపవలసినదే కాని తాను జేయుటకు వీలులేదు. కానఋత్విక్కు కావలెను. గృహస్థేయాఋత్విక్కును నియమించి వెళ్లును.
"నిక్షిప్యాగ్నిం స్వదారేషుపరికల్ప్యర్త్విజంతథా
ప్రవసేత్కార్యవాన్ విప్రోవృధైవనచిరం క్వచిత్
వత్న్యాచాప్యవియోగిన్యా శ్రూష్యోగ్నిర్వినీతయా
సౌభాగ్యవిత్తావైధవ్యకామ యాభర్తృభుక్తయా
యావాస్యొద్వీరసూరాసామజ్ఞా సంపాదినీచయా
దక్షాప్రియం వదాశుద్ధాతామత్ర వినియోజయేత్.
(కాత్యా. 19-1,3,4)
(పనిగల్గి ప్రవాసముపోవు విప్రుడు అగ్నులను భార్య కొప్పగించి ఋత్విక్కు నేర్పఱిచిపోవలెను. వ్యర్థముగా నెచ్చటను నిలువరాదు. వినయము గల్గినట్టియు, సౌభాగ్య ధనములను నయిదవతనమును భర్తృ సహవాసమును గోరు నట్టియు స్త్రీ యెన్నడును వీడక యాయగ్నులను సేవించు చుండవలెను. భార్యలలో నెవతె వీరులను గనునో యెవతె యాజ్ఞను నెరవేర్చునో సమర్థురాలో, ప్రియభాషిణియో, పరిశుద్ధురాలో యామెనీ పనిలో నేర్పఱుపవలెను.)
ఇట్లు భర్తచేయుధర్మములలో పాల్గొని వానికి తోడ్పడుటకే కాని వేఱుగ నేకర్మచేయుటకు స్త్రీకి నధికారము లేదు. ఆమె యట్లు తోడ్పడనిచో పురుషుడు మఱొకభార్యను చేసికొనవలెనని పూర్వాధ్యాయమున జూచియుంటిమి. పెద్ద యజ్ఞయాగాదులమాట నటుంచి సామాన్యముగ నుపవాసములు మున్నగువానినిగూడ భార్య వేఱుగజేయరాదు.
నాస్త్రిస్త్రీణాం పృథక్ యజ్ఞోనవ్రతం నావ్యుపోషితం
- (మను. 5-155)
తుదకాచమనము గూడ స్త్రీలకు శారీరకశుద్ధి కొఱకు మాత్రముపయోగించును.
త్రిరాచామేదపః పూర్వం ద్విఃప్రమృజ్యాత్తతో ముఖం
శారీరం శౌచమిచ్ఛన్‌హి స్త్రీశూద్రన్తుసకృత్సకృత్
(మను.5-39)
బ్రహ్మక్షత్రియ వైశ్యులకాచమనోదకము క్రమముగ నాభికంఠతాలు గతముకావలెను. స్త్రీ శూద్రులకు స్పృష్ట మాత్రమయిన చాలును.
స్త్రీశూద్రం స్పృష్టాభిరేవ,
- (వశిష్ఠ 8-34) ఆశ్రమధర్మములలో గూడ స్త్రీపురుషులకు జాల భేదమున్నది.
స్త్రీకి బ్రహ్మచర్యాశ్రమము లేనట్లును పతిశుశ్రూషయే గురుకుల వాసమయినట్లును జూచియున్నాము. వానప్రస్థాశ్రమముగూడ స్త్రీకి వికల్పమే యైనట్లు (వనప్రస్థుడు భార్యను గూడ తీసికొని యైనను పోవచ్చుననియు లేదా యింటియొద్ద కుమారుల సన్నిధిని విడిచిపోనైనను వచ్చుననియు) పంచమాధ్యాయములో జూచియున్నాము. సన్యాసాశ్రమము స్త్రీలకు లేదు. సన్యాసినియగు స్త్రీ పతితురా లగునని కలదు.
"జవస్తప స్తీర్థయాత్రాప్రవ్రజ్యామన్త్రసాధనం |
దేవతారాధనం చైవ స్త్రీ శూద్రపతితానిషట్"
(అత్రి 135)
(జపము, తపము, తీర్థయాత్ర, సన్యాసము, మన్త్రోపాసన, దేవతారాథనము అను నాఱును స్త్రీలకు శూద్రులకును పతితత్వమును కల్గించును.)
భర్తృసహిత కాకుండ జపతపస్తీర్థయాత్ర, దేవతారాధనలను గూడ జేయరాదను నీభావముపైన నీయబడిన "నాస్తి స్త్రీణాం వృధక్ యజ్ఞ:" అనుదానిలోనే యున్నది.
స్త్రీలు ప్రాయశ్చిత్తరూపములగు చాంద్రాయణము మున్నగు వ్రతములను ప్రత్యేకముగ జేయవలసి యుండును. ఆవ్రతములనైనను వారు గృహమునకు బయటను బంధుపరోక్షమునను జేయరాదు. "బంధుమధ్యే వ్రతం తాసాంకృచ్ఛ్ర చాంద్రాయణాదికం |
గృహేషు సతతం తిష్ఠేచ్ఛు చిర్నియమమాచరేత్"
(పరాశర 9-58)
(స్త్రీలకు కృచ్ఛ్రచాంద్రాయణాదికములగు వ్రతములు బంధుమధ్యమునే చేయతగినవి. వారు నిత్యము గృహమందే యుండి శౌచమును నియమమును పాటింపవలెను.)
భార్యచేసిన పాపములకు భర్త ప్రాయశ్చిత్తము చేసి కొనుటగూడ గలదు. ఏలన: వారిరువురును నొకేశరీరముగదా!
"పతత్యర్థం శరీరస్య యన్యభార్యాసురాం పిబేత్
పతితార్థశరీరస్య నిష్కృతిర్హి విధీయతే
గాయత్రీం జపమానస్తు కృచ్ఛ్రంసాతం వనంచరేత్
గోమూత్రం గోమయక్షీరం దధిసర్పిః కుశోదకం
(పరాశర. 10-26, 27)
(ఎవని భార్య సురాపానము చేయునో నాతనిభార్య పతితురాలగుచున్నది. కాన నర్థశరీరమగు భర్తకు ప్రాయశ్చిత్తము చెప్పబడినది. అతడు గాయత్రిని జపించుచు గోమూత్ర గోమయ గోక్షీర దధిసర్పిస్సులను భుజించుచు కృచ్ఛ్రసాంతపనము చేయవలెను.)
దీనింబట్టి భార్య పాపమును భర్త పంచుకొనునని తెలియుచున్నది. అంతియే కాదు. భార్యచేయు పాపములు భర్తకే యంటునను వచనముకూడ గలదు. "అన్నా దేభ్రూణహా మార్ష్టిపత్యౌ భార్యాపచారిణీ
గురౌశిష్యస్తు యాజిన్తేనోరా జనికిల్బిషం
(వసిష్ఠ. 19-44)
(భ్రూణహత్య చేసినవాని పాపము వానికి తిండి పెట్టిన వాని కంటును. భార్యచేసిన పాపము భర్తకంటును. గురువు చేసిన పాపము శిష్యునకంటును. దొంగచేసిన పాపము రాజున కంటును.)
భార్యపై భర్తకు పూర్ణాధికారము గలదు. కాన నామె పాపములను జేయుటను భర్త యెఱిగియుండియు నేహేతువుచేతనైనను నామెను నివారింపకుండినచో నా పాపము తానే చేసిన ట్లగునని దీనివలన తెలియుచున్నది.
భర్తృపుణ్యములో భార్య పాల్గొనునని (తథా పుణ్య ఫలేషు) మన మిదివఱలో చూచియుంటిమి.
భర్తృపాపములో భార్య పాల్గొనునని మాత్ర మెచ్చటను లేదు. కాని భార్య పుణ్యముచే భర్త పాపియైనను స్వర్గమునకు బోవునని యిదివఱలో జూచియుంటిమి. భార్య పాపములో భర్త పాల్గొనుననికూడ తెలిసి కొంటిమి. భార్యా భర్త లిరువుఱు నొకేవ్యక్తి యనుటకీ కర్మఫలైక్యమే గొప్ప సాక్ష్యము.
- _______