స్మృతికాలపు స్త్రీలు/షష్ఠాధ్యాయము
స్మృతికాలపు స్త్రీలు
షష్ఠాధ్యాయము
పునర్వివాహము
గృహస్థుడు వానప్రస్థాశ్రమములో ప్రవేశించుటకు తగిన కాలము రాకపూర్వ మాతని భార్య మరణించుచో నాతడు తప్పక మఱొక భార్యను చేసికొనవలసినదే యని స్మృతులు చెప్పుచున్నవి.
భార్యాయై పూర్వమారిణ్యైదత్వా౽గ్నీ నంత్యకర్మణి
పునర్దా రక్రియాం కుర్యాత్పునరాధాన మేవచ.
(మను 5-168)
(తనకంటె ముందు చనిపోవు భార్య యంత్యకర్మయందగ్నులను వినియోగించి, తాను మఱల వివాహమాడి మఱల యా ధానము చేయవలెను)
పునర్వివాహమునకు హేతువు ధర్మమే యని గుర్తింప వలెను.
అనాశ్రమోనతిష్ఠేత్తుదినమే కమపిద్విజ:.
- (దక్ష. 1-10)
(ద్విజుడే యాశ్రమమునను నుండకుండ నొకదినమైన నిలువరాదు.) (పురుషు డే యాశ్రమమునను నుండకుండ నిలువరాదు.)
కావున వానప్రస్థు డగుట కర్హతను బొందనివాడు గృహస్థుగనే యుండవలెను. అందులకై భార్యను జేసికొన వలెను ఆతని కెవ్వరును కన్య నీయనిచో నాతని గతి యేమి కావలెనను ప్రశ్న యుదయించును. అపు డాతడు తగిన సాధనసంపత్తి యున్నను లేకున్నను గూడ నరణ్యమునకు బోవలసినదే కాని యా యపత్నీకస్థితిలో నుండ రాదు.
అథచేన్న లేభేతాన్యాం యాచమానోపి కన్యకాం
తమగ్నిమాత్మసాత్కృత్వాక్షి వ్రంస్యాదుత్తరాశ్రమీ
(కాత్యాయన 15)
ఒక్కొక్కపుడు పురుషుడు భార్య యున్నను మఱొక భార్యను జేసికొనవలసి వచ్చుచుండును.
మద్యపా౽సాధు వృత్తాచ ప్రతికూలా చ యా భవేత్
వ్యాధితావా౽ధివేత్తవ్యాహిం స్రార్థఘ్నీచ సర్వదా
వంధ్యాష్టమే౽ధి వేద్యాబ్దే దశమేతు మృతప్రజా
ఏకాదశే స్త్రీజననీ సద్యస్త్వ ప్రియవాదినీ
(మను9-80,81)
(మద్యపానము చేయునట్టియు, చెడునడత గలదియు, తిరస్కరించునదియు, తెగులుగొంటిదియు, భృత్యులు మున్నగు వారిని హింసించునదియు, దుర్వ్యయము చేయునదియు నగు భార్య యున్నను మఱొక భార్యను చేసికొనవలెను. భార్య గొడ్రాలుగ నుండుచో నేడేండ్లు చూచి యెనిమిదవయేట మఱొక వివాహము చేసికొనవలెను. పిల్లలు చనిపోవుచున్న దానిని తొమ్మిదేండ్లును, స్త్రీ శిశువులను మాత్రమే కనుదానిని పదేండ్లును నిరీక్షించి మఱొక వివాహము చేసికొనవలెను. అప్రియములు పల్కు భార్య యుండుచో వెంటనే మఱొకతెను వివాహ మాడవలెను.)
భార్య తెగులుగొంటిదే యైనను సత్ప్రవర్తన గల్గి భర్తకు హితురాలుగ నుండుచో భర్త యామె యనుజ్ఞ నొందిననే కాని మఱొక వివాహము చేసికొనుటకు వీలులేదనియు నామె నెన్నడు నవమానము చేయరాదనియు మనువు చెప్పు చున్నాడు.
యారోగిణీస్యాత్తు హితా సంపన్నా చైవ శీలత:
సానుజ్ఞాప్యాధివేత్తవ్యా నావమన్యా చకర్హిచిత్
(మను 9-82)
భర్త మఱొక వివాహము చేసికొనినాడను కోపముతో నిల్లు విడచిపెట్టి పారిపోవు స్త్రీని భర్త నివారింపవలెను. లేదా యామెను పుట్టింట వదలి పెట్టవలెను.
అధివిన్నాతుయా నారీ నిర్గచ్చేద్రోషితా గృహాత్
సాసద్యస్సన్నిరోద్ధవ్యా త్యాజ్యా వా కులసన్నిధౌ
(మను 9-83)
ధర్మప్రజా సంపన్నే దారే నాన్యాం కుర్వీత.
- (ఆపస్తంబ.ధ.సూ.2-11-!2)
(ధర్మయుక్తయు ప్రజాయుక్తయు నగు భార్య యుండగా మఱొక భార్యను జేసికొనరాదు.)
ధర్మము, ప్రజయు కూడ లేని భార్య యున్నను మఱొక భార్యను వివాహ మాడవచ్చునని దీనివలన తేలుచున్నది. ఈ రెంటిలో నొకటి యుండి మఱొకటి లేకున్నను గూడ పునర్వివాహమునకు వీలున్నట్లు గూడ దీనివలన తెలియుచున్నది. కాని యగ్న్యాధానమైన పిమ్మట నట్లు పునర్వివాహము చేసికొనరాదని యాపస్తంబుడు చెప్పుచున్నాడు.
అన్యతరాభావే కార్యాప్రాగగ్న్యాధేయాత్,
- (ఆ.ధ.సూ. 2-11-12)
(బార్యకు ధర్మ, ప్రజలలోనే యొకటి లేకపోయినను నగ్న్యాధానమునకు పూర్వమైనచో మఱొకవివాహము చేసికొనవచ్చును) పైన తెల్పబడిన దోషములలో నేదోషమును లేని భార్యయుండగా మఱొకభార్యను వివాహమాడుట చాలదోషము. అట్లు వివాహమాడువాడు పూర్వాధ్యాయములో తెల్పబడినట్లు గాడిదచర్మమును కప్పుకొని భిక్షనెత్తికొనవలెను. అట్లు పునర్వివాహము చేసికొన్నను దానివలన నేధార్మికప్రయోజనమును నుండదు. పురుషునకు దానివలన రతిమాత్ర ప్రయోజనమే కల్గును.
ప్రథమాధర్మపత్నీ చద్వితీయారతివర్తినీ
దృష్టమేవఫలంతత్ర నాదృష్టమువయాయతే.
(దక్ష. 4-15)
మఱొకభార్యను జేసికొనినను గూడ మొదటిభార్య భార్యగనే యుండును. ఆమెను పోషింపవలసిన బాధ్యతకూడ భర్తపై కలదు.
అధివిన్నాతుభర్తవ్యా మహదేనోన్యధాభవేత్.
- (యాజ్ఞ. 2-75)
(అధివిన్నను భరింపవలెను. లేనిచో గొప్పపాపము వచ్చును.)
అకారణముగ రెండవభార్యను జేసికొనువాడు మొదటి భార్యకు కొంతధనమును కూడ నిచ్చుకొనవలెను.
అథివిన్నః స్త్రి యైదద్యాదాధివేదని కంసమం
నదత్తం స్త్రీధనంయస్యై దత్తేత్వర్థంప్రకల్పయేత్.
(యాజ్ఞ. 1-146)
ఆర్థికవిషయములోనే కాక ధార్మికవిషయములో గూడ కొంతభేదమున్నది. ఒకస్త్రీకి పుత్రులు లేకున్నను నామె సవతులలో నెవరికైనను పుత్రులుండుచో నామెయు పుత్రవంతురాలే యనదగును.
సర్వాసామేకపత్నీ నామేకాచేత్పుత్రిణీ భవేత్
నర్వాస్తాస్తేనపుత్రేణ ప్రాహపుత్రవతీర్మనుః
(మను 9-183)
కాని కర్మలన్నిటిలోను సహత్వము నొందుటకు ధర్మపత్ని కే యధికారముగలదు. జ్యేష్ఠభార్యయే ధర్మపత్నియగును. అసవర్ణ స్త్రీలను వివాహమాడునపుడు పాణిగ్రహణము లేదని 'వివాహవిధాన'మను ప్రకరణమున జూచియుంటిమి. మఱియు పాణిగ్రహణమూలమున భార్యకు కర్మసహత్వము సిద్ధించునని కూడ చూచియుంటిమి. కాన సవర్ణస్త్రీలలో జ్యేష్ఠ భార్యకే ధర్మములలో సహకర్తృత్వమని యాజ్ఞవల్క్యుడు చెప్పుచున్నాడు.
సవర్ణాసువిధౌధర్మే జ్యేష్ఠయానవినేతరా.
- (యాజ్ఞ.1-89) ఇంతవఱకును పురుషుని పునర్వివాహమును విచారించితిమి. ఇక సహజముగ స్త్రీపునర్వివాహమును చర్చింపవలసియుండును. కాని యే స్మృతిలోను గూడ నే సమయమునను గూడ స్త్రీకి పునర్వివాహమంగీకరింపబడలేదు. మీదు మిక్కిలి స్త్రీకి పునర్వివాహము కూడదను ప్రత్యక్షవచనము లనేకములున్నవి.
ఇంచుమించుగ నన్ని ధర్మశాస్త్రములలోనుగూడ 'పూర్వ మితరునిచే వివాహిత కానిదానిని వివాహమాడవలెన'ని కలదు.
అసవర్ణా పూర్వశాస్త్ర విహితాయాం
యధర్తుగచ్ఛతః పుత్రాన్తేషాం కర్మభిస్సంబంధః
(ఆ.ధ.సూ.2-11-1)
గృహస్థస్సదృశీం భార్యాంవిందేతానన్య పూర్వాంయవీ
యసీం
(గౌ. 4-1)
అవిప్లుతబ్రహ్మచర్యోలక్షణ్యాంస్త్రి యముద్వహేత్
అనన్యపూర్వికాంకాంతాంతామనపిండాం యవీయసీం
(యాజ్ఞ. 1-53)
( ఈ వాక్యముల యర్థములు ' వధూవరార్హతలు ' అను నధ్యాయములో తెలిసికొనవచ్చును.)
వసిష్ఠుడు అక్షతయోనిని వివాహమాడవలెనని చెప్పుచున్నాడు.
అస్పృష్టమైధునామ వరయవీయసీం (వసిష్ఠ. 8-1)
దీనినిబట్టి వసిష్ఠుని మతములో యక్షతయోనిగనున్న స్త్రీని వివాహమాడవచ్చునని మాత్రమే తెలియుచున్నది. అట్టి స్త్రీ వితంతువగుచో నామెను వివాహమాడవచ్చునని యాతని మతమైనట్లీ క్రింది శ్లోకమువలన తెలియుచున్నది.
పాణిగ్రాహే మృతేబాలా కేవలం మంత్రసంస్కృతా
సాచేదక్షతయోనిస్స్యాత్పున స్సంస్కారమర్హతి.
(వసిష్ఠ. 17 - 14)
(మంత్రసంస్కృతయు నక్షతయోనియునగు బాలికకు భర్తమరణించుచో నామె మఱల వివాహ సంస్కారమున కర్హురాలు.)
ఇట్టి పునర్వివాహములో కన్యాదానముండదు. దానమై మంత్రసంస్కారము కాకుండ భర్తను కోల్పోయిన స్త్రీకే మఱల దానము గలదని యీక్రింద శ్లోకమువలన తెలియు చున్నది.
అద్భిర్వాచా చదత్తాయాం మ్రియాతాదౌవరోయది
నచమంత్రోపనీతాస్యాత్కుమారీ పితురేవసా
(వసిష్ఠ 17-12)
(కన్య యుదకముచేతను వాక్కుచేతను నీయబడినదై మంత్రసంస్కృత కాకుండగనే భర్తను కోల్పోవుచో నామె తండ్రికే చెందును.) మంత్ర సంస్కారమైన పిమ్మట నామె తండ్రికి చెందదు. కావుననే మంత్ర సంస్కారము కాకుండిన కాలములో నామె తండ్రికి చెందునని చెప్పబడినది. నారదుడు కూడ నట్టి స్త్రీకి పునర్వివాహము నంగీకరించినాడు. కాని యామె పునర్భువని యంగీకరించినాడు.
కన్యైవాక్షతయో నిర్యాపాణిగ్రహణదూషితా
పునర్భూః ప్రథమాప్రోక్తా పునస్సంస్కారమర్హతి
(నారద. 12-16)
కావుననే నారదు డట్టి స్త్రీ యేడువిధములగు పరపూర్వలలో నొకతెనుగనంగీకరించినాడు.
పరపూర్వా స్త్రీయస్త్వన్యా: సప్తప్రోక్తా యథాక్రమం
(నారద. 12-45)
అని యేడువిధముల పరపూర్వలను పేర్కొనుటలో నారదుడు పైమాటలను చెప్పియున్నాడు.
నారద వసిష్ఠులు దక్క మఱియే స్మృతికారుడును నక్షతయోనికా పునర్వివాహము నంగీకరింపలేదు. స్త్రీ పునర్విహమును నిషేధించు వాక్యములు స్మృతులలో నెన్నియో కలవు.
యస్మైదద్యాత్పితాత్వేనాం భ్రాతావానుమతేపితుః
తంశుశ్రూషేతజీవంతం సంస్థితంచనలంఘయేత్.
(మను 3-151)
(తండ్రికాని తండ్రియనుమతితో సోదరుడుకాని కన్య నెవనికిత్తురో యాతడు జీవించియున్నపుడును చనిపోయినపిమ్మటనుగూడ నామె యాతని నతిక్రమింపరాదు.)
దీనిం బట్టి దాంపత్యము మరణానన్తరమున గూడ నుండునని తెలియుచున్నది.
పాణిగ్రాహస్యసాధ్వీ స్త్రీ జీవతోనామృతస్యవా
పతిలోకమభీప్సంతీనా చరేత్కించిదప్రియం.
(మను. 5-156)
(సాధ్వియైన స్త్రీ భర్తజీవించియున్నను మృతిచెందినను భర్త లోకమునే కోరుచు భర్తకేమియు నప్రియము చేయరాదు.)
స్త్రీ జీవించియుండుటే భర్తకొఱకనియు నాతడు చనిపోయినపిమ్మట నామె జీవించియుండుట వ్యర్థమనియు స్మృతులయభిప్రాయము. భర్తతో ప్రాణత్యాగముచేయుట మిక్కిలి ప్రశంసింపబడినది. తిస్రః కోట్యర్థకోటీచయాని లోమానిమానుషే
తావత్కాలం వసేత్స్వర్గేభర్తారం యానుగచ్ఛతి.
(సహగమనము చేయు స్త్రీ మూడున్నరకోట్లు స్వర్గలోకములో నుండును)
అట్లు సహగమనముచేయు సాధ్వి తనపుణ్య ప్రాబల్యమున పతితుడగు భర్తనుగూడ నుద్ధరించునని పూర్వాధ్యాయమున జూచియున్నాము. సహగమనము చేయనిపక్షమున సాధ్వియగు వితంతువు శరీరమును పెంచుకొనదు. కేవలము దేహధారణమున కే భుజించును గాని భోగములకొఱకు గాదు.
కామంతుక్షపయేద్దేహం పుష్పమూలఫలైశ్శుభైః
నతునామాపి గృహ్ణీయాత్పత్యౌప్రేతే పరస్యతు.
(మను. 5-157)
(పతి చనిపోయినపిమ్మట స్త్రీ పుష్పములను, దుంపలను, పండ్లను నాహారముగ తీసికొనుచు శరీరమును శుష్కింప జేయవలెను. కాని మఱొకపురుషుని నామమునైనను స్మరింపరాదు)
స్త్రీల కింతకంటెను నుత్తమధర్మములేదు
అసీతామరణాత్‌క్షాంతా నియతాబ్రహ్మచారిణీ
యోధర్మ ఏకపత్నీనాం కాంక్షంతీతమనుత్తమం
(మను. 5-158)
ఒకసారి వివాహమైన స్త్రీకి మఱొకసారి వివాహము చేయుట కెంతమాత్రమును వీలులేదు. ఏలన, కన్యాదానమగుటతోడనే భర్త కామెపై స్వామిత్వము వచ్చుచున్నది.
ప్రదానం స్వామ్యకారణం.
- (మను. 2-152)
కావున నామెను మఱొకరికిచ్చుట కెవ్వరికి నధికారము లేదు. వివాహితను మఱల దానముచేయుటకే కాక పాణిగ్రహణము చేయుటకు కూడ వీలులేదు. ఏలన: పాణిగ్రహణ మంత్రములు కన్యలందు వర్తించును గాని యకన్యలయందు వర్తింపవు.
పాణిగ్రాహణికామంత్రాః కన్యాన్వేవప్రతిష్ఠితాః
నాకన్యాసుక్వచిన్నౄణాం లుప్తధర్మక్రియాహితాః
(మను 2-226)
(దీనియర్థము పూర్వధ్యాయమున వివరింపబడినది)
మనువు మతములో వాగ్దత్తయై వివాహితకాకుండగనే వాగ్దానపతిని కోల్పోయినస్త్రీకికూడ మఱొకపురుషుని వివాహమాడుట కధికారములేదు. ఆమెకూడ వివాహితయై భర్తనుకోల్పోయిన యపుత్రవలెనే నియోగము చేసికొన వలెను. కాని యీ రెండు నియోగములకును నొకభేధము గలదు. వివాహితనియుక్తయగుటకు మంత్రసంస్కారములేదు. అవివాహితనియుక్తయగుటకు మంత్రసంస్కారమున్నది. అట్టి యవివాహిత యథావిధిగ వాగ్దానపతిసోదరుని వివాహ మాడవలెను. కాని యావైవాహికసంబంధమొక పుత్రుడు కల్గువఱకేయుండును. ఆపిమ్మటకూడ నాసంబంధముండుచో నది సామాన్యవివాహమే యయ్యెడిది. అట్లే మంత్రసంస్కారము లేనిచో సామాన్యనియోగమే యయ్యెడిది. కావున నిది వివాహమంత్రములతో కూడిన నియోగము. దీనివలన గలుగు పుత్రుడు వివాహము చేసికొనిన వానియన్నకు (మృతుడైన వానికి) చెందును. లేకుండుచో నొకపుత్రుడు కల్గువఱకే యాతడామెతో నుండవలెనను నియమముండుటకు వీలులేదు. గర్భధారణముతోనే వారిరువురకు సంబంధము పోవుచున్నది. ప్రనవానన్తరము ఋతుమతియై నపుడామె నాతడు పొందుటకు వీలులేదు. ఆమెతో ధర్మకార్యములను జేయుటకు వీలులేదు. కావున నాతడు గృహస్థాశ్రమమును నడపుటకు మఱొక భార్యను చేసికొనవలసియే యుండును. దీనిబట్టి యామె యీతనికి భార్యయేకాదనియు, నామె కన్యాత్వమును బూర్తిగబోగొట్టి యామెను తనగోత్రములోనికిదెచ్చి తనయన్నకు పుత్రుడుగ నుండదగిన (దత్తతచేసికొనుటకు గూడ సగోత్రికుడు కావలెనుగదా! అట్టిచో నియోగమునకు చెప్పునదేమి?) వానిని నుత్పాదించుటకే యామెతో వివాహసంస్కారము చేసికొనుచున్నాడు. ఈయంశములన్నియు నీక్రిందిశ్లోకముల వలన తెలియుచున్నవి.
యస్యామ్రియేత కన్యాయావాచా సత్యేకృతేవతి:
తామనేవ విధానేన నిజోవిందేత దేవర:
యథావిధ్య ధిగమ్యైనాం శుక్లవస్త్రాంశుచివ్రతాం
మిథోభజేతా ప్రసవాత్పకృత్సకృదృతావృతౌ
(మను. 9-69, 70)
(వాగ్దానపతిని కోల్పోయినస్త్రీని నామెమఱది యీక్రిందివిధముగ వివాహమాడవచ్చును. ఆమెనాతడు యధావిధిగవివాహమాడి శుక్లవస్త్రయు, మంచినియమములు గలదియునగు నామెను నొకపుత్రుడు కల్గువఱకును ప్రతిఋతు కాలములోను నొక్కొకసారి పొందుచుండవలెను.)
ఒక్క సంతానము గల్గువఱకు మాత్రమే యాతడామెను పొందుచుండవలెనని చెప్పుటచేతనే యిది వివాహము కాక నియోగమేయని స్పష్టమగుచున్నది. వివాహసంస్కారమును పొందుట మాత్రము విశేషము. వాగ్దత్తమాత్రమే కాక వివాహితకూడనై భర్తనుకోల్పోయినస్త్రీకి సామాన్య వివాహము కూడదని స్పష్టమగుచున్నది. సంతానములేక వితంతువైన సామాన్యగృహిణి వివాహసంస్కారము లేకుండనియోగింపబడవలెనని మనము పూర్వమే చూచియుంటిమి ఇక మిగిలియున్న సందేహమేమనగా: వివాహితయైక్షతయోనికాని వితంతువవివాహితవలె వివాహసంస్కారము నొంది నియోగము నొందవలెనా? లేక వివాహితవలె సంస్కారములేక నే నియోగము నొందవలెనా యనునదియే. అట్టి యక్షతయోనికూడ నవివాహితవలెనే సంస్కారమునొందవలెనని మనుస్మృతి చెప్పుచున్నది.
సాచేదక్ష తయోనిస్స్యాద్గత ప్రత్యాగ తాపివా
పౌనర్భవేన భర్త్రాసా పునస్సంస్కారమర్హతి.
(మను.9-176)
(అక్షతయోనియగు వితంతువు భర్తను విడచి మఱొకనిపొంది మరల భర్తను జేరికొనుస్త్రీయును పునర్భవునితో మఱల సంస్కారము నొంద నర్హులు)
స్త్రీ భర్తగోత్రములో ప్రవేశించుటకే వాగ్దత్తకు వివాహమని పైననూహచేయబడినది. ఇదివఱకు వివాహితయైన యక్షతయోనికి మఱల వివాహమగుట యెందులకనియు, నాసంస్కారము లేకుండనే నియోగము కారాదాయనియు ప్రశ్నలు బయలుదేరును భర్తనువిడచి యన్యునాశ్రయించి మఱల భర్త యొద్దకువచ్చుదానికా సంస్కారమెందులకో యీమెకునందులకే యనిమాత్రమీ శ్లోకమువలన స్పష్టమగుచున్నది. సడలింపబడిన వివాహానుబంధమును బాగుగ దృడపఱచుటకే యీసంస్కారమని తోచుచున్నది. వివాహిత స్త్రీకి పునర్వివాహముచేయుట నే స్మృతియు గూడ నంగీకరించుటలేదు.
పరాశరస్మృతి యిట్లు చెప్పుచున్నది:-
మృతేభర్తరియానారీ బ్రహ్మాచర్యే వ్యవస్థితా
సామృతాలభతేస్వర్గం యథాతే బ్రహ్మాచారిణః
త్రిసఃకోట్యర్ధ కోటీచయానిలో మానిమానుషే
తావత్కాలంవసేత్స్వర్గే భర్తారం యానుగచ్ఛతి
వ్యాళగ్రాహీ యధావ్యాళం బలాదుద్ధరతే బిలాత్
ఏవం స్త్రీవతిముద్ధృత్యతే నైవసహమోదతే
(పరాశర 4-31, 32, 33)
(భర్తపోయినపిమ్మట బ్రహ్మచర్యముతో నుండు స్త్రీ చనిపోయినపిమ్మట కణ్వాదిబ్రహ్మచారులవలెనే స్వర్గమునొందును. సహగమనముచేయు స్త్రీ మూడున్నరకోట్ల సంవత్సరములు స్వర్గములోనుండును పాములవాడు పామునెట్లు బిలము నుండి లాగునో యామెయునట్లే పతితుడైన భర్తనుద్ధరించి యాతనితో నానందించును)
భర్త చనిపోయినపిమ్మట దేహత్యాగమును చేయుటకును బ్రహ్మచర్యము నవలంబించుటకును హెచ్చరించుచున్న పరాశరస్మృతి పునర్వివాహమును విధించుట యసంభవము గదా? 'నష్టేమృతే వ్రవ్రజితే' యను శ్లోకములోని పతి వాగ్దానపతియేకాని వివాహితపతికాడని 'వివాహవిధాన' మను ప్రకరణములో చేయబడిన సిద్ధాన్తమునకిది మఱింత బలము నొసగుచున్నది. భర్తచనిపోయినపుడే పునర్వివాహము లేదని తేలుచుండగా నాతడు నష్టుడు వ్రవ్రజితుండు, క్లీబుడు, పతితుడునై జీవించియున్నపుడు పునర్వివాహము కూడదని వేరుగ చెప్పనక్కరలేదుగదా. ఈ'నష్టేమృతే' యను శ్లోకమే నారదస్మృతిలో నున్నపుడు (12-97) గూడ నట వివాహితపతి యుద్దేశింప బడలేదని చెప్పుటకా స్మృతినుండియే కొన్నిశ్లోకముల జూపవచ్చును.
నారదస్మృతిలో నీక్రింది శ్లోకములు గలవు
అనుత్పన్న ప్రజాయాన్తుపతి: ప్రేయాద్యదిస్త్రియః
నియుక్తాగురుభిర్గచ్ఛేద్దేవరం పుత్రకామ్యయా
నచతాం వ్రతివద్యేత తథైవాపుత్రజన్మతః
పుత్రేజాతే నివర్తేత నరకస్స్యాత్తతో న్యథా
(నారద12-80, 81)
(స్త్రీకి సంతానముకలుగకుండ భర్తచనిపోవుచో నామె పెద్దలచే నియమింపబడినదై సంతానకాక్షతో మఱదిని పొందవలెను. ఆమెకు పుత్రుడు కల్గువఱకును నాతడామెను పొందవలెను. ఆపుత్రుడు గల్గుటతోడనే వారి సంబంధ మంతరించును. ఆపిమ్మట నాసంబంధముండుచో వారికి నరకము వచ్చును.) సంతానములేని వితంతువు నియోగముచేసికొనవలెనని యిందుగలదు. కాన నీస్మృతియే స్థలాంతరమున వివాహము విధింపదు. అంతియేకాదు. సంతానముగల స్త్రీకి నియోగము కూడ పనికిరాదని దీనివలన తెలియుచున్నది. ఇకవివాహము పనికిరాదని వేఱుగ చెప్పనక్కరలేదు కదా! పునర్వివాహము నిషిద్ధము కావుననే నియోగము విధింపబడినదికాని పునర్వివాహము నిషిద్ధము కానిచో నట్టి యావజ్జీవ సుఖదాయకావకాశముండగా స్వల్పకాల భోగ్యమైన నియోగమే యేల గతియగును?
సంతానము లేక పోయిననుగూడ వితంతువు పునర్వివాహము చేసికొనరాదని నారదుని మతమైనట్లీ క్రింది శ్లోకము కూడ స్పష్టముగ తెల్పుచున్నది.
మృతేభర్తర్యపుత్రాయాః పతిపక్ష: ప్రభుః స్త్రియా:
వినియోగాత్మరక్షాసు భరణేచవ ఈశ్వర:
(నారద 13-28)
(అపుత్రకు భర్తపోయినవాడగు చుండగా నాతని పక్షమువారే యధికారులగుచున్నారు. నియోగమందును, నాత్మరక్షయందును, భరణమునందును వారే ప్రభువులు)
షండడగు భర్తను వదలి మఱొకని వివాహమాడ వచ్చునని నారదస్మృతి చెప్పుట పైననీయబడిన నారద. 12-80, 81., 13-28 లకు విరుద్ధముగనున్నది.
ఈర్షాషండాదయో యేన్యేచత్వారస్స ముదాహృతాః
త్యక్త వ్యాస్తేపతితవత్ క్షతయోన్యా అపిస్త్రియా
(నారద. 12-15)
(ఈర్ష్యాషండాదులగు నల్గురును గూడ క్షతయోనిచేత గూడ పతితులవలె విడువబడదగిన వారే.)
అక్షిప్తమోఘ బీజాభ్యాంకృతే పిపతికర్మణి
పతిరన్యఃస్మృతోనార్యా వత్సరార్థం ప్రతీక్ష్యతు
(నారద. 12-16)
(విగతబీజుడును వ్యర్థబీజుడును నగు పురుషునిచేత వివాహమాడబడిన స్త్రీ యొక సంవత్సరము నిరీక్షించి మఱొక భర్తను వివాహమాడవలెను.)
భర్త చనిపోయిన యపుత్రకు నియోగమును గత పుంస్త్వుడగు భర్తగల యపుత్రకు పునర్వివాహమును కర్తవ్యములని చెప్పుట కేవల మసంగతము. నారదస్మృతిలో నిట్టి యసంగతము లుండుటచేతనే కాబోలు పరాశర యాజ్ఞవల్క్యులు స్మృతులను పేర్కొనుటలో నాస్మృతిని వదలి వైచిరి.
గౌతముడనన్య పూర్వనే వివాహము చేసికొనవలెనని చెప్పినట్లిదివఱలో చూచియున్నాము. అన్యపూర్వను వివాహము చేసికొనినవాడు (దిధిషూపతి) న్తేన క్లీబపతిత నాస్తి కులవలె శ్రాద్ధభోజనమున కనర్హుడని యీక్రింది సూత్రము చెప్పుచున్నది.
నభోజయేత్ స్తేనక్లీబ పతితనాస్తికతద్వృత్తి
వీరహాగ్రే దిధిషుదిధిషూపతి స్త్రీగ్రామయాజకా
జపాలోత్సృష్టాగ్ని మద్యవకుచరకూట
సాక్షిప్రాతిహాధికాన్
(గౌ.ధ.సూ.11-16)
సంతానములేని వితంతువు సంతానముపొందదలచుచో మఱదివలన పొందవలెనినియు
(అపతి రపత్య లిప్సుర్దేవరాత్)
- (గౌ.18-4)
నట్లు భర్తతోకలియుట యొక సంతానము గలుగు వఱకేయనియు తర్వాత కూడదనియు
(నాతిద్వితీయం)
- (గౌ. 18-8)
చెప్పుటచే కూడ గౌతముడు సంతానము లేని వితంతువుకు నియోగమే గతిగ నంగీకరించినాడు కాని పునర్వివాహమున కంగీకార మీయలేదు.
యాజ్ఞవల్క్యుడుకూడ 'అనన్యపూర్వికనే' వివాహమాడవలెనని శాసించినట్లు చూచియున్నాము. క్షతయోనియైనను నక్షతయోనియైననుగూడ భర్తనువిడచి కామముతో మఱొకని (నవర్ణునైనను) నాశ్రయించు "పునర్భు"వు నతడు "స్వైరిణి" యని చెప్పుచున్నాడు. అక్షతా చక్షతాచైవ పునర్భూస్సంస్కృతాపునః
స్వైరిణీయాపతింహిత్వా సవర్ణం కామతః శ్రయేత్
(యాజ్ఞ 1-68)
పునర్భువునుగూర్చి యంగిరఃస్మృతి యిట్లు చెప్పుచున్నది.
అన్యదత్తాతుయానారీ పునరన్యస్య దీయతే
తస్యాశ్చాన్నం నభోక్తవ్యం పునర్భూస్సా ప్రగీయతే
(అంగిర: 1-66)
(ఒకని కీయబడి మఱల నింకొకనికీయబడు స్త్రీ పునర్భువనబడును. ఆమె చేతియన్నమును తినకూడదు)
వసిష్ఠుడుకూడ పునర్భువునిట్లు రెండు విధములుగ నిర్వచించుచున్నాడు.
యాకౌమారం భర్తారముత్సృజ్యా న్యైస్సహచరిత్వా
తస్యైవకుటుంబ మాశ్రయతి సాపునర్భూర్భవతి
యా క్లీబం పతిమున్మత్తం వాభర్తారముత్సృజ్యా
న్యంపతింవిన్దతే మృతవాసా పునర్భూర్భవతి
(వసి.27-19, 20)
(భర్తనువిడచి యితరులతో తిరిగి మఱల నాభర్త కుటుంబమునే యాశ్రయించునది పునర్భువు. పతి క్లీబుడు, పతితుడు, పిచ్చివాడు మృతుడునైనపు డన్యుని చేసికొనుచో నామెయు పునర్భువే.) భర్త నపుంసకుడు, పతితుడునైనను గూడ మఱొకని వివాహ మాడరాదనుచో సంతానములేనివానిభార్య యేమిచేయవలెనన;
ప్రేతపత్నీ షణ్మాసాన్వ్రత చారిణ్యక్షారలవ
ణంభుంజానాధః శయీత
ఊర్థ్వంషడ్స్వో మాసేభ్యః స్నాత్వాశ్రాద్ధం
చవత్యై దత్వా విద్యాకర్మగురుయోని సంబంధాన్
సన్నిపాత్య పిత్రాభ్రాత్రావా నియోగంకారయేత్
(వసి 18-55, 56)
(భర్తపోయిన స్త్రీ క్షారలవణ రహితమైన భోజనమును చేయుచు కటికనేలపై బరుండుచు నాఱునెలలుగడపి విద్య చేతను వర్తన చేతను ఘనులైనవారిని రక్తబంధువులను సమీపించి వారి సమీపమున తండ్రిచేతగాని సోదరునిచేతగాని నియోగము చేసికొనుటకు నియమింపబడవలెను.)
మఱొకని భార్యను తనయొద్ద నుంచుకొనినవాడు కృచ్ఛ్రాతికృచ్ఛ్ర ప్రాయశ్చిత్తములను చేసికొని యామెను మఱల నాతని కొప్పగింపవలెనని కూడ వసిష్ఠుడు చెప్పు చున్నాడు.
దిధిషూపతిః కృచ్ఛ్రాతి కృచ్ఛ్రౌకృష్ణ త్వాత
దత్వా పునర్నివిశేత్
(వసి. 20-10)
రెండవపెండ్లి చేసికొనిన స్త్రీ చనిపోయినచో నెవరికిని గూడ దశరాత్రాశౌచము లేదని స్మృతులు చెప్పుటచేతనే యామె యెంతభ్రష్టగ పరిగణింపబడినదో తెలియగలదు.
పరపూర్వాసుచస్త్రీ షుత్య్రహాచ్ఛుద్దిరిష్యతే.
- (లిఖిత. 15-10)
(పరపూర్వలగు స్త్రీలు చనిపోవుచో మూడునాళ్లతోనే శుద్ధి)
మను, గౌతమ, వసిష్ఠ, పరాశరాపస్తంభాంగిరో, యాజ్ఞవల్క్యాది స్మృతులన్నియు స్త్రీకి పునర్వివాహమును నిషేధించినవనియు, పతిపోయినపిమ్మట పూర్ణమయిన యింద్రియనిగ్రహముతో నుండుటయే యామె కర్తవ్యమనియు సంతానములేని వితంతువుమాత్ర మొకసంతానము కల్గుటకై మఱదిని ఋతుకాలమున పొందవచ్చుననియు చూచి యుంటిమి. నియోగము చేసికొనవచ్చునను ననుజ్ఞయేకాని చేసికొనవలెనను నియమములేదని కూడ గుర్తింపవలెను. పై నుదాహరింపబడిన కొన్ని వాక్యములలో ('అపత్యలిప్సః,' సంతానమును కోరినట్టిస్త్రీ, మున్నగుపదములలో) నీయంశము స్పష్టముగనే చెప్పబడియున్నది. భర్తనియోగము చేసికొనవల దని స్పష్టముగ చెప్పియుండినచో నియోగముచేసికొననే కూడదు.
అపత్యలోభాద్యాతుస్త్రీ భర్తారమతిర్తతే
నేహనిందామవాప్నోతి పరలోకాచ్చహీయతే
(మను.5-161)
(ఏ స్త్రీ సంతానమందలి లోభముచే భర్త నతిక్రమించునో యామె యిహలోకమున నిందను పొందును. పరమున పతిలోకమునుండి భ్రష్టయగును.)
భర్తృపక్షపు పెద్దలయనుమతితోనే నియోగము చేసికొనవలెనని పైన నుదాహరింపబడిన వాక్యములలో గలదు. వారు నియోగమువలదనినచో మానవలసినదేయని దీనివలననే తెలియుచున్నది. వారు చేసికొనవలసినదని చెప్పినను తనకిష్టములేనిచో వితంతువు నియోగము మానివేయుట కెట్టి యాటంకము గన్పట్టదు.
'స్వర్గంగచ్ఛత్యపుత్రాపి యథాతేబ్రహ్మచారిణః' అనుటచే పతివ్రతకు పిల్లలులేకున్నను స్వర్గప్రాప్తి కలదని యిదివరలో చూచియున్నాముగదా!
నియోగము భర్తజీవించియుండగా కూడ కావచ్చును. ఆతడు షండత్వాదులచే పుత్రోత్పాదనాసమర్థుడగుచో తానే భార్యచే నియోగము చేయింపవచ్చును.
జీవితశ్చక్షేత్రే,
- (గౌ.ధ.సూ. 28-11) మఱదితోనే కాని నియోగము పనికిరాదని కొందఱి మతము.
నాదేవరాదిత్యేకే.
- (గౌ. 28-7)
దేవరుడు లేనిచో నీ క్రిందివారు క్రమముగ నియోగమున కర్హులు: సపిండులు, సగోత్రులు, సమానర్హులు గలవారు, సమానవర్ణులు.
పిండగోత్ర సంబంధేభ్యోయోనిమాత్రాద్వా.
- (గౌ. 28-6)
నియోగమువలన నొకపుత్రుని కనుటకే యధికారమున్నట్లు పైనచూచియున్నాము>
మనువుకూడ నొకపుత్రునికంటె నెక్కుడుపుత్రులను కనరాదని చెప్పుచు కొందఱి మతములో రెండవపుత్రుడు కూడ గల్గువఱకు నియోగముండు ననుచున్నాడు.
ఏకముత్పాదయేత్పుత్రం ద్వితీయం నకధంచన.
(మను 9-60)
ద్వితీయమేకే వ్రజనం మన్యంతే స్త్రీషుతద్విదః
అనిర్వృతం నియోగార్థం వశ్యన్తోధర్మతస్తయోః
(మను. 9-61)
నియోగము సంతానప్రాప్తికొఱకే యేర్పడిన సంస్థయగుటచే నందు కామమునకు తావులేదు. ఒక పుత్రుడు కల్గి నపిమ్మట గూడ కలియుచుండు నియుక్త స్త్రీపురుషులకు కోడలిని గురుభార్యను పొందినదోషముతో సమానమయిన దోషము గల్గుననియు వారు పతితులగుదురురనియు చెప్పబడియున్నది.
'నియుక్తౌయౌవిధిం హిత్వావర్తే యాతాంతుకామతః
తావుభౌ పతితౌ న్యాతాం స్నుషాగ గురుతల్పగౌ'
(మను 9-63)
యోగకాలము పూర్తియగుటతోడనే గురువువలెను కోడలివలెను వర్తింపవలెను. కాని కామభావములతో నుండరాదు.
'విధవాయాం నియోగార్థే నిర్వృత్తేతు యథావిధి
గురువచ్చ స్నుషావచ్చ వర్తేయాతాం పరస్పరం'
(మను. 9-62)
ఇట్లు నియోగ విధానము నంగీకరించిన మనుస్మృతి వెనువెంటనే యీక్రింది విధముగ చెప్పుచున్నది.
"అయంద్విజైర్హి విద్వద్భిః వశుధర్మో విగర్హితః
మనుష్యాణా మపిప్రోక్తో వేనేరాజ్యం ప్రశాసతి
సమహీ మఖిలాం భుంజన్రాజర్షి ప్రవరః పురా
వర్ణానాం సంకరం చక్రే కామోపహతచేతనః
తతఃప్రభృతి యోమోహాత్ ప్రమీతపతికాం స్త్రియం
నియోజయత్యపత్యార్థం తం విగర్హన్తి సాధవః"
(మను 9-66, 67. 68)
ఎంతో ధార్మిక భావముతో నెన్నో నియమములతో నింద్రియ జయముకలవారిచేతనే జరుపుటకు వీలయిన నియోగవిధానము వేనుని పాలనకాలమున తగనివిధముగ నాచరింపబడినదై, వర్ణనంకరమునకు కారణమయినదనియు, నాటినుండియు నట్లజ్ఞానముచే చేయబడు నియోగము గర్హింపబడు చున్నదనియు వీనిలో నేదయిన నొకటి సక్రమముగ జరిగినను నదికూడ సహజముగ దుర్వినియోగము చేయబడిన నియోగములలోనే చేర్పబడు చున్నదనియు పైశ్లోకాల తాత్పర్యము.
కావుననే కాబోలు పురాణములలో కలియుగములో నియోగము చేయకూడదని చెప్పబడినది.
'అశ్వాలంభం గవాలంభం సన్యాసం పలపైతృకం
దేవారాచ్చసుతోత్పత్తిః కలౌపంచ వివర్జయేత్'
స్త్రీకి పునర్వివాహము నిషిద్ధమగుటచేత భర్త్రాజ్ఞ ననుసరించి కామభావోపేతము కానట్టి మార్గముచేత నశించి పోవుచున్న భర్తృవంశమును నిలబెట్టుటలో దోషములేదను భావముతో నితర స్మృతికారులు నియోగము నంగీకరించి యున్నారు.
- ______