స్మృతికాలపు స్త్రీలు/పంచమాధ్యాయము

వికీసోర్స్ నుండి

స్మృతికాలపు స్త్రీలు

పంచమాధ్యాయము

దాంపత్యము

భార్యాభర్తలిరువురు నొకే వ్యక్తియను వైదికాభిప్రాయము స్మృతులలో గూడ గన్పట్టు చున్నది.

యోభర్తాసాస్మృ తాంగనా.

(మను. 9-45)

(భర్తయే భార్య)

కావుననే భర్తలో భార్య యర్థ భాగమను నభిప్రాయ మేర్పడినది. ఇది కేవలము నామమాత్రమే కాక యాచరణములో గూడ నంగీకరింపబడినది. సురాపానము చేయుట పతితత్వాపాదకమగుటచే సురాపానముచేయు స్త్రీయొక్క భర్తలో నర్థభాగము పతితమగుచున్నదని మనుస్మృతి చెప్పుటచేతనే యిది స్పష్టమగుచున్నది.

పతత్యర్థం శరీరస్య యస్యభార్యా సురాంపివేత్.

(మను. 10-26)

(ఎవనిభార్య సురాపానము చేయునో యాతనిశరీరములో నర్థభాగము పతితమగుచున్నది.) ఎన్నడు నొండొరుల నెడబాయుటకు వీలులేనివారు గనుకనే దంపతులిట్టి యైక్యమునొందినట్లు చెప్పబడినారు, ఒకసారి యొకనిని వివాహమాడిన స్త్రీ మఱొకనిని వివాహమాడరాదని చెప్పుట కీయైక్యమే కారణము.

    సకృదంశోనివతతి నకృత్కన్యాప్రదీయతే
    సకృదాహదదా నీతిత్రీణ్యేతానిసతాం సకృత్.
(మను. 9-47 నారద. 12-28)

(భాగమొకసారియే పంచబడును. కన్య యొక్క సారియే యీయబడును. దేనినైనను 'ఇచ్చుచున్నాను' అని యొకసారియే చెప్పుదురు. సత్పురుషులకీ మూడును నొకేసారి జరుగును)

    పాణిగ్రాహణికా మంత్రా: కన్యాస్వేవప్రతిష్ఠితాః
    నాకన్యాసుక్వచిన్నౄణాం లుప్తధర్మక్రియాహితాః
(మను. 2-224)

(పాణిగ్రహణమంత్రములు పూర్వము వివాహితలు కాని వారియందే వర్తించును. అకన్యలయందు వర్తింపవు వారు ధర్మక్రియా రహితలుగదా!)

ఒకసారి వివాహమైన స్త్రీకి మఱల దానము, పాణిగ్రహణముగూడ లేవని చెప్పుటచే స్త్రీకి పునర్వివాహము లేదని స్పష్టమగుచున్నది. పురుషుడు భార్యయుండగా మఱొక భార్యను చేసికొనుటకు వీలున్నను నాతనికి ద్వితీయవివాహమాత్రమున ప్రథమ భార్యతోడి దాంపత్యము నశింపదు ('పునర్వివాహము' అను నధ్యాయము చూడుడు) భార్యను వదలివైచినను నమ్మివైచిననుగూడ నామెతోడి దాంపత్యము నశింపదు.

    ననిష్క్రయవినర్గాభ్యాం భర్తుర్భార్యావిముచ్యతే
    ఏవంధర్మం విజానీమ: ప్రాక్ప్రజాపతివినిర్మితం.
(మను. 9-46)

భర్తయెట్టివాడైనను భార్య యాతనితో భార్యాత్వమును గల్గియుండుటయే కాక యాతని నచంచలమైన భక్తితో సేవించుచుండవలెనని స్మృతులు చెప్పుచున్నవి. కాని భార్యలో కొన్నిలోపములుండుచో భర్తయామెను వదలివేయుటకు స్మృతులంగీకరించు చున్నవి. దీనింబట్టి దాంపత్యములో భార్యకంటె భర్త కెక్కుడు నధికారమును స్మృతులంగీకరించు చున్నవని స్పష్టమగుచున్నది. అంతియేకాదు, భార్యాభర్త లొండొరులపట్ల ప్రవర్తింపవలసిన విధానములో గూడ పురుషుని యాధిక్యము వ్యక్తమగుచున్నది. పురుషుడెంత నీచుడైననుగూడ భార్య యాతని నవమానింపరాదు. ఆతనిసేవను వీడరాదు.

     విశీలఃకామవృత్తోవాగుణైర్వా పరివర్జిత:
     ఉపచర్యః స్త్రీయాసాధ్వ్యాసతతం దేవవత్పతిః
(మను 5-154)

(భర్త శీలరహితుడైనను, కామప్రవృత్తిగలవాడైనను సుగుణములు లేనివాడైనను గూడ భార్య యాతని నెల్లపుడును దేవునివలె పూజింపవలెను.)

ఇదియొక సామాన్యమైన ధర్మముకాదు. స్త్రీ కింతకంటెను నెక్కుడు ధర్మము లేనేలేదు.

స్త్రీభిర్భర్తృవచః కార్యమేషధర్మః పరఃస్త్రియాః

(యాజ్ఞవల్క్య. 1-18)

(స్త్రీలు భర్తచెప్పినట్లు చేయవలెను. ఇది వారికి పరమధర్మము.)

    నాస్తిస్త్రీణాం పృధగ్యజ్ఞోనవ్రతం నావ్యుపోషితం
    పతింశుశ్రూషతే యేనతేనస్వర్గేమహీయతే.
(మను. 5-155)

(స్త్రీకి భర్తతో కూడని యజ్ఞముగాని, వ్రతముగాని, భర్త్రనుమతిపొందని యుపవాసముగాని లేదు. పతిశుశ్రూషచే నామె స్వర్గలోకములో గూడ నధికురాలగుచున్నది.)

అత్రిసంహిత యిట్లు చెప్పుచున్నది.

    జీవద్భర్తరియానారీ ఉషోష్యవ్రతచారిణీ
    ఆయుష్యంహరతే భర్తుః సానారీ నరకంవ్రజేత్
    తీర్థస్నానార్థినీ నారీపతిపాదోదకంపిబేత్
    శరీరస్యాపివిష్ణోర్వాప్రయాతి పరమంపదం.

(అత్రి. 136, 137)

(భర్తజీవించియుండగా నుపవాసముచేసి వ్రతముచేయు స్త్రీ భర్త యాయుస్సును హరించును. ఆమె నరకమునకు బోవును. తీర్థస్నానమును గోరుస్త్రీ భర్తృపాదోదకముగాని శరీరోదకముగాని త్రాగవలెను, ఆమె పరమపదము నొందును)

ఇట్లితరవ్రతముల నన్నిటినివదలి భర్తయే సమస్తవ్రతములునని భావించుస్త్రీకి పతివ్రతయని పేరు. ఇట్టి పతివ్రతలకు విష్ణులోకము గల్గుననగా వారిభర్తలకు కూడ గల్గుననియే యర్థము. ఆమెయు భర్తయు నెన్నడు నొండొరులను వీడరు.

    పతివ్రతానాం గృహమేధినీనాం సత్యవ్రతానాం
    చశుచివ్రతానాం తాసాం తులోకా: వతిభిస్సమానా:
(వసిష్ఠ. 21-14)

స్త్రీకి పతిలోకమును మించిన లోకములేదు. పతికి నప్రియము చేయుదాని కే లోకములభింపదు. కావున నెన్నడు నామె పతికప్రియము చేయరాదు.

    పాణిగ్రాహస్య సాధ్వీ స్త్రీజీవతో వామృతన్యవా
    పతిలోకమ భీపృంతీనా చరేత్కించి దప్రియం
(మను 5-156)

(భర్త జీవించియున్నను మృతిచెందిననుగూడ యోగ్యురాలగు స్త్రీ యాతని లోకమునుగోరుచు కొంచెమైనను నప్రియము చేయరాదు.) భర్త మృతుడైననుగూడ నామె తదేకలగ్న మనస్కయై యాతనియం దచంచలభక్తిగలదై మనో వాక్కాయములచే పవిత్రురాలుగ నుండవలెను. ఏలన దాంపత్యము కేవల మీజన్మతోనే యంతరించునది కాదు (ఈయంశము 'పునర్వివాహ'మను నధ్యాయమున వివరింపబడును.)

పతిసేవయే పరమధర్మముగ గల స్త్రీకి 'సాధ్వి' యను నామము వాడబడుటచేతనే స్త్రీకి పతిసేవకంటె నెక్కుడు సాధు (మంచి) గుణములేదని తెలియుచున్నది. అట్లే యట్టి స్త్రీకి సతి (యోగ్యురాలు) అను నామముగూడ గలదు.

    పతింయానాభి చరతిమనోవాగ్దేహ సంయతా
    సాభర్తృలోక మాప్నోతి నద్భిస్సాధ్వీ తిచోచ్యతే
(మను 5-165)

(ఏ స్త్రీ మనోవాక్కాయ నియమముకలదై భర్త నతిక్రమింపకుండునో యామె భర్తృలోకము నొందును; సత్పురుషులచే సాధ్వియని చెప్పబడును.)

ఇది స్త్రీల కవశ్యముండవలసిన ధర్మము. దీనివలన నైహికాముష్మిక లాభమెంతయో కలదు.

    అనేననారీవృత్తేన మనోవాగ్దేహ సంయతా
    ఇహాగ్య్రాం కీర్తిమాప్నోతి పతిలోకం వరత్రచ

(మను. 5-166) (మనోవాక్కాయ నియమముగలదై యిట్టి ప్రవర్తన గల స్త్రీ యీలోకములో కీర్తిని పరమున పతిలోకమును పొందును.)

ఈధర్మముండుట స్త్రీ కెంత శ్రేయస్కరమో యిది లేకుండుట యంత వినాశకరము. భర్త నుల్లంఘించుటయే స్త్రీకి మహాదోషము.

    భర్తారం లంఘయేద్యాతు స్త్రీజాతి గుణదర్పితా
    తాంశ్వభిఃఖాద యేద్రాజాసంస్థానే బహుసంస్థితే
(మను 8-371)

(ఏస్త్రీ పుట్టింటి వారి స్థితినిబట్టి గర్వించి భర్తనవమాన పఱచునో యామెను రాజు నిండుసభలో కుక్కలచే తినిపింప వలెను.)

    భర్తృశాసనముల్లంఘ్య యాచస్త్రీ విప్రవర్తతే
    తస్యాశ్చైవ సభోక్తవ్యం విజ్ఞేయా కామచారిణీ
(అంగిర: 69)

(ఏ స్త్రీ భర్తాజ్ఞ నుల్లంఘించి ప్రవర్తించునో యామె చేతియన్నము తినరాదు, ఆమె కామచారిణి)

స్త్రీకి భర్తనుమించిన సేవ్యవస్తువు లేదు.

     గురురగ్నిర్ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణోగురుః
     పతిరేకోగురుః స్త్రీణాం సర్వస్యా భ్యాగతో గురుః
(ఉశన: 1-47)

(బ్రాహ్మణుల కగ్నిగురువు. వర్ణములకు బ్రాహ్మణుడు గురువు. స్త్రీలకు భర్తగురువు. అభ్యాగతు డందఱకు గురువు)

భర్తృశుశ్రూషవలన లభింపనిఫలమే లేదని శాస్త్రములు చెప్పుచున్నవి.

    భర్తృశుశ్రూషయైవ స్త్రీ కాన్నలోకాన్ సమశ్ను తే
    దివఃపునరిహాయాతా సుఖానామం బుధిర్భవేత్
(కాత్యాయన 9-13)

(పతిశుశ్రూషచే సతి యేలోకములను పొందలేదు? ఆమె స్వర్గమునకుబోయి తిరిగివచ్చి యిట సుఖసముద్రమగును)

భార్యభర్తపట్ల కన్పఱచిన భక్తి సాపేక్షమైనది కాక కేవలము నిరపేక్షమైనదని యిదివఱలో చూచియున్నాము. కొన్ని కొన్ని పరిస్థితులలో భర్తను భార్య నిర్లక్ష్యము చేసినచో నామెకు లౌకికమగు శిక్షకూడ కలదని మనువు చెప్పుచున్నాడు.

    అతిక్రామేత్ప్రమత్తం యామత్తంరోగార్తమేవ వా
    సాత్రీన్‌మాసాన్ వరిత్యాజ్యా విభూషణపరిచ్ఛదా.
(మను 9-78)

(భర్త ద్యూతాదిదుర్వ్యసనములు గలవాడు, మద్యపానాదులచే నొడలు తెలియనివాడు, రోగముచే నార్తుడునై యున్నపుడు భార్య యాతనిమాట విననిచో నామెకు శిక్షగ భర్త యామె వస్త్రభూషణములను తీసికొని మూడుమాసములు వదలి వేయవలెను.) భర్తపైన వివరింపబడిన యవస్థలలో నున్నప్పుడు భార్య యాతనిమాట వినుటకూడ ప్రమాదహేతువే కావచ్చును గావుననే యీమె యాతనిమాట నుల్లంఘించుట కంతస్వల్పమగు శిక్షవిధింపబడినది.

కొన్నిసమయములలో భర్తపట్ల ద్వేషభావమును గల్గియుండు స్త్రీని భర్త వదలివేయరాదు.

     ఉన్మత్తంవతితం క్లీబమబీజం పాపరోగిణం
     న త్యాగో౽స్తి ద్విషంత్యాశ్చ న చ దాయాపవర్తనం.
(మను 9-79 )

(పిచ్చివాడు, పతితుడు, నపుంసకుడు, బీజములేనివాడు, కుష్ఠియగు భర్తనుద్వేషించిన స్త్రీని భర్త వదలిపెట్టరాదు. ఆమెకుదాయము నీయకుండ నుండరాదు)

అట్టిహీనస్థితిలోనున్న భర్త భార్యనువదలుచో నాతని స్థితి మఱింత హీనమగునను హేతువుచేతనో భర్తయైనను నట్టిస్థితిలో నుండునపుడు ద్వేష మణుమాత్రమైనను గన్పపఱువకుండుట సామాన్య స్త్రీలకు సాధ్యముకాదు కావున దానికి పెద్దశిక్ష వేయుట మంచిది కాదను హేతువుచేతనో యామెను త్యజింపరాదని చెప్పబడినదికాని యామె దోషవంతురాలు కాదనుభావముతో కాదు. వ్యాధితుడగు భర్త నవమానించు భార్య కుక్క పందియై పుట్టునని పరాశరుడు చెప్పుచున్నాడు.

     దంద్రంవ్యాధితం మూర్ఖం భర్తారంయం౽వమన్యతే
     సాశునీజాయతే మృత్వాసూకరీచ పున: పున:
(పరాశర 4-16)

(దరిద్రుడు, వ్యాధితుడు, మూర్ఖుడు, నగు భర్తనే స్త్రీ యవమానించునో యామె కుక్కయై జన్మించును. అనేక జన్మలలో కుక్కయు పందియు నగుచుండును.)

పైన వర్ణింపబడిన పాతివ్రత్యము స్థిరమైనదనుట ప్రధానాంశము. ఈ స్థిరత్వము వధువునకు వివాహములోనే బోధింపబడును. ఎట్తి పరిస్థితులలోను గూడ నామె భర్తను వీడక రాతివలె స్థిరముగ నుండవలెననుటకై యామెను వివాహములో నొకరాతిపై నెక్కింతురు.

అశ్మానమాస్థావ యత్యాతిష్ఠేతి

(ఆ.గృ.సూ. 2-5-2)

'ఆతిష్ఠేమమశ్మానమశ్మేనత్వగ్ స్థిరాభవ' అనుమంత్రమును చదువుచు నామెను రాతిపై నెక్కింపవలెనని దీనియర్థము. 'ఈ రాతి నధిష్ఠింపుము, దీనివలనే స్థిరురాలవుగ నుండుము' అని యీ మంత్రమున కర్థము.

పురుషుడుకూడ భార్య నట్లే యెన్నడును వదలరాదు. కాని భార్య యెట్టిదైనను నాతడు వదలరాదను నియమము లేదు. సాధ్వినెన్నడును వదలరాదను నియమము మాత్రము గలదు.

    దేవదత్తాం పతిర్భార్యాం విందతేనేచ్ఛ యాత్మనః
    తాంసాధ్వీం బిభృయాన్నిత్యం దేవానాం ప్రియమాచరన్
(మను 9-95)

(ఎవ్వడును భార్యను తనయిచ్ఛచే వివాహమాడుట లేదు. దేవతలు పురుషునకు భార్య నిచ్చుచున్నారు. అట్టిసాధ్వియైన భార్యను నెల్లపుడును భరింపవలెను అట్లుచేయుచో దేవతలకు ప్రియమగును.)

భార్యనువదలినవారికి ఘోరమగుశిక్షను బోధాయనుడు విధించుచున్నాడు.

    దారవ్యతిక్రమీ ఖరాజినం బహిర్లోమపరిధాయదారవ్యతి
    క్రమిణే భిక్షామితినప్తా గారాణిచరేత్ సావృత్తిష్షణ్మాసాన్.
(ఆ.ధ.సూ. 1-28-18)

(భార్యను వదలినవాడు గాడిద చర్మమును, వెంట్రుకలు పైకివచ్చునట్లు కప్పుకొని 'భార్యనువదలిన నాకుభిక్షవేయుడు' అని చెప్పుచు నాఱుమాసములు దినమున కేడిండ్లచొప్పున భిక్ష నెత్తుకొనవలెను.)

కొన్ని దుష్టగుణములుగల భార్యను వదలివేయవచ్చునని మన్వాదిస్మృతులు చెప్పుచున్నట్లు పునర్వివాహము అను నధ్యాయమున చూడగలము. దక్షస్మృతి(4-17) యిట్లు చెప్పుచున్నది.

    అదుష్టాంపతితాం భార్యాంయౌవనేయః పరిత్యజేత్
    సజీవనాన్తే స్త్రీత్వంచవంధ్యత్వంచ సమాప్నుయాత్

(దుష్టురాలు కానట్టియు రోగాదులచే పడియున్నట్టియు భార్యను వదలినవా డుత్తరజన్మలో వంధ్యస్త్రీ యగును.)

భర్తను భార్య సేవించినట్లే భర్తకూడ నిరంతరము భార్యకు మనస్తృప్తిని గలుగజేయుచుండవలెను.

ఉభయులును సంతుష్టులైననే కాని గృహము శోభింపదు. ఆతడామె నెన్నడు నవమానింపరాదు.

     మాన్యాచేన్మ్రియతే పూర్వంభార్యా పతివిమానితా
     త్రీణిజన్మానిసా పుంస్త్వంపురుషస్త్రీత్వమర్హతి
(కాత్యాయన. 20-13)

(పూజ్యురాలైన భార్య భర్తచే నవమానింపబడి మరణించుచో మూడుజన్మ లామె పురుషుడును నాతడు స్త్రీయునగుట కర్హులు.)

      సంతుష్టో భార్యాయాభర్తా భర్త్రా భార్యాత ధైవచ
      యస్మిన్నేవ కులేనిత్యం కల్యాణం తత్రవైధ్రువం
      యదిహిస్త్రీ నరోచతే పుమాం సం నప్రమోదయేత్
      అప్రమోదాత్పునః పుంసః ప్రజనం నప్రవర్తతే
      స్త్రియాంతురోచ మారాయాం సర్వంతద్రోచతేకులం
      తస్యాంత్వరోచ మానాయాం సర్వమేవ సరోచతే
(మను 3-60, 61, 62)

(భర్తతోభార్యయు భార్యతోభర్తయు సంతుష్టులైన కులములో మంగళము నిత్యముగనుండును. స్త్రీ తృప్తురాలుకానిచో పురుషుడు సంతుష్టుడుకాడు. పురుషుడు సంతుష్టుడు కానిచో సంతతియే కలుగదు. స్త్రీ సుఖముగనుండుచో కులమెల్లయు ప్రకాశించును. స్త్రీ సుఖముగా నుండనిచో కులము కూడ ప్రకాశింపదు.)

కావున భర్త ఋతుకాలగమనమాత్రముననే కాక యితరమార్గములచే కూడ భార్యను సంతోష పెట్టవలెను.

    అనృతావృతుకాలే చమంత్రసంస్కారకృత్పతిః
    సుఖస్యనిత్యందాతేహ పరలోకే చయోషితః
(మను 5-153)

ఈవిధముగ నన్యోన్యప్రేమతో నుండు దాంపత్యము దక్షస్మృతిలో(4- 3,4,5) నిట్లు కీర్తింపబడినది.

     అనుకూలాన వాగ్దుష్టా దక్షాసాధ్వీప్రియంవదా
     ఆత్మగుప్తాస్వామిభక్తా దేవతాసానమానుషీ
     అనుకూలకళత్రీయ స్తస్యస్వర్గ ఇహైవహి
     ప్రతికూలకళత్రన్య నరకోనాత్రసంశయః
     స్వర్గేపి దుర్లభంహ్యేత దనురాగః పరస్పరం

(అనుకూల, ప్రియభాషిణి, కుశల, సాధ్వి, గుట్టుకలది, పతిభక్తికలదియగు స్త్రీ దేవతయే కాని మానుషికాదు. అనుకూలురాలైన భార్య కలవానికి స్వర్గమిచ్చటనే కలదు. ప్రతికూలురాలైన భార్య కలవానికి నరకమిచ్చటనే కలదు. ఇట్టి యనురాగము స్వర్గములో గూడ నుండదు.)

భార్య యనుకూలురాలు కానిచో నామె నట్లు చేయవలసిన భాధ్యతకూడ భర్తపైననే కలదు. సకాలములో నామె నాతడు బాగుచేయనిచో నామె శాశ్వతముగ చెడిపోవును.

అవశ్యాసాభవేత్పశ్చాత్ యథావ్యాధిరువేక్షితః

(దక్ష 4-8)

అట్టి భార్యను జక్కచేయుటకై యామెను కొట్టుట యవసరమగుచో నట్లు చేయవచ్చునని లిఖితస్మృతి చెప్పుచున్నది.

    లాలనీయా సదాభార్యా తాడనీయా తథైవచ
    లాలితా తాడితాచైవ స్త్రీ శ్రీర్భవతినాన్యథా
(లిఖిత 4-16)

(భార్యను లాలనజేయుట యెట్లు కర్తవ్యమో యవసరమగుచో శిక్షించుటకూడ నట్లే కర్తవ్యము. అందువలన స్త్రీ శ్రీ యగుచున్నది.)

భిన్నాశయాదర్శప్రకృతులుండుచో దంపతులలోన ననుకూలత ప్రవేశించును. ఎవరో యొకరు మఱొకరి మార్గమున బడుచో నా యననుకూలత నశించును. ఇరువురును గూడ నట్లు చేయుటకు యత్నింపవలసినదే కాని పైన వివరింపబడిన పురు షుని యాధిక్యహేతువుచే భార్యయే యట్లు మారుట మంచిది. ఆదర్శాశయప్రకృతులలో భార్యను భర్తతో సమన్వయింప జేయుటకై బోధాయనగృహ్యసూత్రములో నొక ప్రక్రియ గలదు.

అథాస్యా ఉపోత్థాయదక్షిణేన హస్తేన దక్షిణమం సంప్రతిబాహుమన్వవహృత్య హృదయదేశమభిమృశతి 'మమహృద యేహృదయంతే అస్తు. మమచిత్తే చిత్తమస్తు. మమ వాచమేకమానాశ్శ్రుణు. మామేవాను వ్రతాసహచర్యామయాభవ' ఇతి అథాస్యైదక్షిణే కర్ణేజపతి. మాంతేమనః ప్రవిశతు మాంచక్షుర్మాముపేతుభగః మయిసర్వాణి భూతానిమయి ప్రజ్ఞానమస్తుతే.

(బో.గృ.సూ.1-4)

(వరుడు కుడిచేతితో వధువుయొక్క దక్షిణాంసమును గూర్చి బాహువునెత్తి హృదయదేశమును స్పృశించి యిట్లు చెప్పుచున్నాడు. 'నాహృదయమందు నీ హృదయముండుగాక! నాచిత్తమందు నీచిత్తముండుగాక! నావాక్కు నేకమనస్కవై వినుము. నన్ననుసరించియే వ్రతముగలదానవగుము. నాతో సహచర్యవగుము.' ఆమె కుడిచెవిలో నిట్లు జపించుచున్నాడు. 'నీమనస్సు నన్ను ప్రవేశించుగాక! నీ నేత్రము, భగము నన్ను ప్రవేశించుగాక! నీకు నాయందే సర్వభూతములు గన్పట్టుగాక! నాయందే నీకు ప్రజ్ఞానముండు గాక!') శారీరకముగ రెండువ్యక్తులైన స్త్రీ పురుషులు మానసికముగ నొకే వ్యక్తి యగుటయే దాంపత్య ప్రధాన లక్షణమని పైన జెప్పబడిన యంశమువలన దేలుచున్నది. భర్త శాసకుడగుటచే నాతని ననుసరించి భార్య మారుట యెక్కుడు సహజము.

    యాదృగ్గుణేన భర్త్రాస్త్రీ సంయుజ్యేతయథావిధి
    తాదృగ్గుణాసా భవతి నమ ద్రేణేవ నిమ్నగా
(మను 9-22)

(నది సముద్రముతో గలసి సముద్రోదకరుచినే పొందినట్లు స్త్రీ యెట్టిగుణములుగల భర్తతో గూడిననట్టి గుణములు గలదే యగును.)

కాన నీచజన్మగల స్త్రీ యుత్కృష్టపురుషుని వివాహమాడుచో నామెయు నుత్కృష్టత నొందును.

     అక్షమాలావసిష్ఠేన సంయుక్తాధమయోనిజా
     సారంగీమందపాలేన జగామాభ్యర్హణీయతాం
     ఏతాశ్చాన్యాశ్చలోకే స్మిన్నవకృష్ట ప్రనూతయః
     ఉత్కర్షంయోషితః ప్రాప్తాః స్వైర్భర్తృగుణైః శ్శుభైః
(మను 9-23, 24)

(అధమయోనిజ యగు నక్షమాల వసిష్ఠునితోను, సారంగిమందపాలునితోను కూడి గౌరవము నొందిరి. వీరును నితర నీచకులజలగు స్త్రీలును వారివారి భర్తల సుగుణములచే ఘనతను పొందిరి.) ఉత్కృష్టుడైన భర్త తన సుగుణప్రభావముచే భార్యయొక్క నైచ్యమును బోగొట్టి యామె నుద్ధరించునట్లే పతివ్రతయైన స్త్రీకూడ పాపియైన భర్తను పుణ్యాత్మునిగ జేయగలదు.

    వ్యాలగ్రాహీ యథావ్యాలం బలాదుద్ధర తేబిలాత్
    తథాసాపతిముద్ధృత్యతేనైవ నహమోదతే
(దక్ష 4-20)

(పాములవాడు పామును బిలమునుండి పైకి లాగునట్లు సహగమనము చేసిన స్త్రీ పతి నీచుడైనను నాతని నుద్ధరించి స్వర్గములో నాతనితో మోదము నొందును)

భర్త యుత్కృష్టతచే భార్యకుగూడ నుత్కృష్టత వచ్చుట కేవలము నాధ్యాత్మికవిషయములోనే కాదు. లౌకికవ్యవహారములలో గూడ నట్లే జరుగును. వయస్సు యొక్క యాధిక్యముచే జ్యేష్ఠుడు కనిష్ఠునకు పూజ్యుడు. జ్యేష్ఠుని భార్య కనిష్ఠునికంటెను వయస్సులో చిన్నదే యైనను నాతనికి పూజ్యురాలే యగును. ఏలన నట్టి సందర్భములలో భార్య భర్తతో సమానమైన వయస్సు గలదిగనే పరిగణింప బడును.

పతివయసః స్త్రియః

(ఆ.ధ.సూ. 1-16. 21)

(స్త్రీలు పతి వయస్సుతో సమానమైన వయస్సు గలవారు.) అట్లే కేవల దాంపత్యప్రభావముచే గురుపత్ని గురువు వలెనే పూజ్యురాలగుచున్నది.

గురువత్ప్రతిపూజ్యాః స్యుస్సవర్గా గురుయోషిత:

(మను 2-120)

ధనవిషయమునను కర్మవిషయమునను భార్య కెట్టిస్థానము గలదను నంశము 'ధనము' 'కర్మకాండ' యను రెండధ్యాయములలో వివరింపబడును. ఇచట నొకముక్క చెప్పవలెను. ఆముష్మికసుఖసాధనమైన కర్మకాండయంతయు భార్యాధీనమే యై యున్నది. భార్య లేకుండనే యజ్ఞము చేయుటకును పురుషున కధికారములేదు. అతిథిపూజమున్నగు సత్కర్మలెన్నియో భార్యాధీనములై యున్నవి. (కర్మకాండ యను నధ్యాయమును జూడుడు.) అనగా సత్కర్మలన్నిటికిని ఫలమగు స్వర్గముకూడ భార్యాధీనమే యని తేలుచున్నది.

దారాధీనస్తథాస్వర్గ:

(మను 9-28)

(పురుషునకు స్వర్గమువచ్చుట భార్య యధీనమున నున్నది.)

భార్య లేనివానికి ధర్మమేకాక యర్థకామములుగూడ నుండవు. బ్రహ్మచారిగాని వానప్రస్థుడుగాని సన్యాసిగాని ధనము నుంచుకొనరాదు. అనుభవింపనురాదు. ఇంద్రియ జయము వారి ప్రధానసంపాద్యము. గృహస్థునకన్ననో భార్యాగమనాది ధర్మావిరుద్ధకామానుభవాధికారము గలదు. ఇది యంతయు భార్య యున్నంతమాత్రముననే జరుగదు. ఆమె వశవర్తినియై యుండుట యవసరము. ధర్మకార్యములలో పాల్గొనుట కామె నిరాకరించి గృహనిర్వహణము చక్కగ చేయక, భర్తకు భోగములకు వీలుగల్గింపనిచో పురుషుడు ధర్మార్థకామములనెడు త్రివర్గమునుండి భ్రష్టుడగు చున్నాడు.

    గృహాశ్రమ నమంనాస్తి యది భార్యా వశానుగా
    తయా ధర్మార్థ కామానాం త్రివర్గఫలమన్ను తే
(దక్ష1-1,2)

(భార్య వశురాలైనచో గృహాశ్రమముతో సమానమైన యాశ్రమము లేదు. పురుషు డామె మూలమున ధర్మార్థ కామముల ఫలము నొందుచున్నాడు.)

కావుననే యాజ్ఞవల్క్యుడు గూడ

యత్రానుకూల్యం దంపత్యో స్త్రివర్గస్తత్రవర్తతే

(యాజ్ఞ 1-5)

(దంపతుల కానుకూల్య ముండుచోట ధర్మార్థకామము లుండును.)

ప్రథమాధ్యాయములో తెలుపబడినట్లు పురుషునకు నరకనివారణమును పుణ్యలోకప్రాప్తిని గల్గించు పుత్రుని గూడ భార్యయే యిచ్చుచున్న దనుటచే నామె ప్రాముఖ్యము స్పష్ట మగుచున్నది. నాపూర్వగ్రంథములో నవశ్యాపాకరణీయములుగ నిరూపింపబడిన మూడు ఋణములలో రెండు ఋణములు (దేవపితౄణములు) భార్య యున్ననే కాని యపాకరింపబడుటకు వీలులేదని యీవిధముగ తేలుచున్నది. ఈఋణములను తీర్పకుండ మోక్షమునకు యత్నించుటకు కూడ వీలులేదని స్మృతులు తెల్పుచున్నవి.

    అనధీత్యద్విజో వేదాననుత్పాద్య తథాసుతాన్
    అనిష్ట్వా చైవ యజ్ఞైశ్చ మోక్ష మిచ్ఛన్ వ్రజత్యధః
(మను 6-37)

(వేదములను జదువక, పుత్రులను కనక, యజ్ఞములను జేయక మోక్షము గోరువాడు పతితు డగును.)

మానవుడు తానే పుత్రరూపమున జన్మించుచున్నవాడగుటచేతను దుష్టమాతకు దుష్టపుత్రుడు గల్గును గావునను తనను దుష్టత్వమునుండి కాపాడుకొన దలచువాడు తప్పక భార్యను సన్మార్గవర్తిని గావింపవలెను. భార్య చెడ్డది యగుచో తన జన్మ చెడ్డదీ యగును; తన చరిత్రము చెడ్డ దగును; తాను చెడ్డవా డగుచున్నాడు. కావున భార్యను చక్కని స్థితిలో నుంచుకొనుట ప్రతిమానవునకును నవశ్యకర్తవ్యము. <poem>

    పతిర్భార్యాం సంప్రవిశ్యగర్భో భూత్వేహ జాయతే
    జాయాయాస్తద్ధిజాయాత్వం యదస్యాం జాయతే పునః
(మను 9-8) (భర్త భార్యలో ప్రవేశించి గర్భమై జనించుచున్నాడు. భర్త యామెయందు జనించుచున్నాడు కావుననే భార్యకు జాయ యని పేరు.)

     స్వాం వ్రసూతిం చరిత్రం కులమాత్మాన మేవచ
     స్వంచ ధర్మం ప్రయత్నేన జాయాం రక్షన్హిరక్షతి
(మను 9-7)

(భార్యను రక్షించుకొనువాడు తన జన్మను, చరిత్రను, కులమును, తనను, తన ధర్మమును రక్షించుకొనుచున్నాడు.)

పురుషుడు తానే భార్యనుండి పుట్టుచున్నాడని పైన తెల్పబడినది. అనగా మానవుడు తన దేహమును వీడినను పుత్రరూపమున జీవించియుండును. కాన పుత్రుడు తండ్రికి నమృతత్వము నిచ్చినవా డగుచున్నాడు. పితరుల ఋణమును గూడ దీర్పించుచున్నాడు.

    ఋణమస్మిస్సన్న యత్యమృతత్వం వచగచ్ఛతి
    పితాపుత్రస్య జాతస్య పశ్యేచ్చ జీవతోముఖం
(వసిష్ఠ 17-1)

(సజీవుడై జనించిన పుత్రుని ముఖము జూచిన తండ్రి తన పితౄఋణమును తీర్చివైచి దానిని కుమారునియందర్పించుచున్నాడు. మఱియు నమృతత్వము నొందుచున్నాడు.)

పై యంశముల నన్నిటిని జూడగా పురుషుని సమస్తసుఖములును భార్య యధీనములే యై యున్నవని తెలియగలదు. ఆమె యాతని కనేకములగు లౌకికసుఖముల నిచ్చుటయేకాక యాతనియొక్కయు నాతని పితరులయొక్కయు స్వర్గప్రాప్తికి హేతు వగుచున్నది.

    అపత్యం ధర్మకార్యాణి శుశ్రూ షారతిరుత్తమా
    దారాధీనస్తథా స్వర్గః పితౄణా మాత్మనశ్చహ
(మను 9-28)

(సంతానము, ధర్మకార్యములు, సేవ, యుత్తమసుఖము, తనకును తన పితరులకును సుఖము, ఇవి యన్నియు భార్య యధీనములే యై యున్నవి.)

కావుననే యిదివఱలో తెల్పినట్లు మానవునకు వివాహ మవశ్యకర్తవ్య మైనది. యావజ్జీవము జితేంద్రియుడుగనే యుండు పురుషుడు మాత్రము వివాహ మాడకుండినను దోషము లేదని కొందఱి మతము. అట్లుండగోరువాడు స్నాతకుడైన పిమ్మట వివాహ మాడుటకు బదులు నైష్ఠికబ్రహ్మచర్యమున ప్రవేశించును.

తస్యాశ్రమ వికల్ప మేకే బ్రువతే

(గౌ.ధ.సూ. 3-1)

(వాని కాశ్రమవికల్పమును గొందఱు చెప్పుచున్నారు.)

కావున సాధారణముగ దాంపత్యజీవిత మందఱకు నవశ్యమే యగుచున్నది. ఈ జీవితములో భార్యాభర్తలు శారీరకముగ పృథగ్వ్యక్తులే యై యున్నను సమస్త విషయములలోను నవినాభావమును నిర్విశేషమును నగు జీవయా త్రానుభవము గలవారై యుందురనియు, నీ యనుబంధమైహికము మాత్రమే కాదనియు, నీ సంబంధములో పురుషు డధికారి యనియు ప్రథానాంశములు ఇట్టి దాంపత్యము ప్రథమాధ్యాయములో తెలుపబడినట్లు పురుషునకు మనుమలును, తల నెఱపును, ముడతలును గలుగువఱకు నడుపబడవలెను. అనంతరము పురుషుడు వానప్రస్థాశ్రమములో ప్రవేశించును. వనమునకు బయలుదేరునపుడు భార్యను కుమారునియొద్ద నుంచి వెళ్ళవచ్చును, లేదా వనమునకు తీసికొనిపోవచ్చును.

పుత్రేషు దారాన్నిక్షిప్యవనం గచ్ఛేత్స హైనవా

(మను 6-3)

(భార్యను పుత్రునొద్ద నుంచి కాని కూడ తీసికొనిగాని వనమునకు బోవలెను>)

భార్యను తీసికొని పోయినను బ్రహ్మచర్యము నవలంబించియే యుండవలెను.

బ్రహ్మచారీ ధరాశయ:

(మను 6-26)

(వానప్రస్థుడు బ్రహ్మచారియై నేలపై పరుండవలెను.)

వానప్రస్థునకు భార్యతో నవశ్య మాచరింపవలసిన కర్మయేదియు లేదు. కావున వనప్రవేశముతో దాంపత్యజీవితము ముగియు చున్నది.

__________