స్మృతికాలపు స్త్రీలు/అష్టమాధ్యాయము
స్మృతికాలపు స్త్రీలు
అష్టమాధ్యాయము
ధనము
కుమారులతో బాటు కుమార్తెలుగూడ తండ్రియాస్తిని పంచుకొనుట కేస్మృతియు నంగీకరించుటలేదు కాని కుమాళ్లు లేనిచో తండ్రియాస్తి కుమార్తెలకే సంక్రమించునని చాల స్మృతులును చెప్పుచున్నవి.
మనువిట్లు చెప్పుచున్నాడు:
ఊర్థ్వంపితుశ్చమాతుశ్చ నమేత్యభ్రాతరస్సమం
భజేరన్పైతృకం రిక్థమనీశాస్తే హిజీవతోః
(మను 9-92)
(తలిదండ్రులు చనిపోయినపిమ్మట సోదరులందఱును గలసి పిత్ర్యధనమును పంచుకొనవలెను. తలిదండ్రులు జీవించి యుండగ సోదరులు పంచుకొనుట కర్హులుగారు.)
ఊర్థ్వంపితుః పుత్రారిక్థం భజేరన్.
- (గౌ. 29-1)
(తండ్రియనంతరము పుత్రులు దాయమును పంచుకొన వలెను.) విభజేరన్సుతాః పిత్రోరూర్థ్వం రిక్థమృణంనమం
- (యాజ్ఞ.2-114)
(తలిదండ్రుల యనంతరము పుత్రులు దాయమును ఋణమును సమముగా పంచుకొనవలెను.)
పితర్యూర్థ్వంగతే పుత్రావిభజేరన్ధ నంక్రమాత్
- (నారద. 18-2)
(తండ్రి చనిపోయిన వాడగుచుండగా పుత్రులు ధనమును క్రమముగ పంచుకొనవలెను.)
కుమారులు లేనివాని పుత్రిక తన సంతతివలన తండ్రి వంశమును నిలబెట్టునని ప్రథమాధ్యాయమున జూచియుంటిమి. కాన నామెయే పుత్రస్థానము నాక్రమించుచున్నదని చెప్పవచ్చును. అందువలననే యపుత్రకుని ధనమాతని కుమార్తెకు వెళ్లునని చెప్పబడినది.
యధైవాత్మతథాపుత్రః పుత్రేణదుహితాసమా
తస్యాత్మనితిష్ఠన్త్యాంకథ మన్యోధనంహరేత్
(మను. 9-130)
(పురుషుడు తానే పుత్రుడగుచున్నాడు. కుమార్తె పుత్రునితో సమానురాలు, కాన నామె యుండగా మఱొకడెట్లు ధనము హరించును?)
అనగా పర్యవసానములో నామె పుత్రునకే ధనము వచ్చును. దౌహిత్రఏవచహరే దపుత్రస్యాఖిలంధనం
- (మను 9-131)
(అపుత్రకుని ధనమును దౌహిత్రుడే పొందును)
ప్రథమాధ్యాయములో తెలుపబడినట్లు భ్రాతృదుహితపుత్రికగా చేయబడినపిమ్మట తండ్రికి పుత్రుడుగల్గుచో నాపుత్రుడును నామెయు తండ్రి ధనమును సమముగనే పంచుకొందురు. కాని పుత్రికకు జేష్ఠ్యాధిక్యము లేదు.
పుత్రికాయాం కృతాయాంతు యదిపుత్రోనుజాయతే
సమస్తత్రవిభాగస్స్యాత్ జ్యేష్ఠ తానాస్తిహిస్త్రియాః
(మను. 9-134)
అభ్రాతృదుహితయొక్క పుత్రికాత్వమును గూర్చి ప్రథమాధ్యాయములో పూర్తిగా వివరింపబడియే యున్నది.
సోదరులు దాయము పంచుకొనునప్పటికి వారి యక్కచెల్లెండ్రెవరైన నవివాహితలుగ నుండుచో వారికిగూడ కొంత ధనము వచ్చును.
స్వేభ్యోం శేభ్యస్తుకన్యాభ్యః ప్రదద్యుర్భాతరః పృథక్
స్వాత్స్వాదంశాచ్చతుర్భాగం పతితాస్స్యురదిత్సపః
(మను. 9-118)
(కన్యలకు సోదరులు తమతమ భాగములనుండి వేర్వేరుగా నాల్గవభాగము నీయవలెను. అట్లీయనిచో వారు పతితులగుదురు.) పెండ్లికాని భగినుల కిట్లు ధనమీయవలెనని చెప్పుటచే నీ ధనముతో వారికి పెండ్లిండ్లు చేయుట సోదరుల విధియని తేలుచున్నది. యజ్ఞవల్క్యస్మృతి యీ యంశమును స్పష్టముగ చెప్పుచున్నది.
అసంస్కృతాస్తు సంస్కార్యాభ్రాతృభిః పూర్వసంస్కృతైః
భగిన్యశ్చనిజాదం శాద్దత్వాంశంతు తురీయకం
(యాజ్ఞ. 2-122)
(సంస్కృతులైన సోదరులు వివాహితలుగాని తోబుట్టవులకు తమ భాగములోని నాల్గవయంశము నిచ్చి వివాహము చేయవలెను.)
అవివాహితగనున్న సోదరికి జ్యేష్ఠ కనిష్ఠసోదరులు దక్క మిగిలిన సోదరులతో సమానభాగము నీయవలెనని నారదుడు తెల్పుచున్నాడు.
జ్యేష్ఠాయాం శోధికోజ్ఞేయః కనిష్ఠాయావరః స్మృతః
సమాం శభాజశ్శేషాస్స్యురప్రత్తా భగినీతథా
(నారద. 13-13)
కన్యలకు మాతామహి ధనమునుండి కూడ కొంత యీయవలెనని మనువు చెప్పుచున్నాడు.
యస్తాసాంస్యుర్దుహిత రస్తాసామపి యథార్హతః
మాతా మహ్యాధనాత్కంచిత్ప్రదేయం ప్రీతిపూర్వకం
(మను. 9-193)
మాతుర్దు హితరశ్శేషమృణాత్
- (యాజ్ఞ. 2-121)
(తల్లి ధనమును కుమార్తెలు తీసికొని యామెకు ఋణమున్నచో దానిని తీర్చి వేయవలెను.)
మాతస్తుయౌతకం యత్స్యాత్కుమారీ భాగఏవసః
- (మను. 9-121)
(తల్లి ధనము కుమార్తెదే.)
నారదు డిట్లు చెప్పుచున్నాడు:
మాతర్దు హితరో౽భావేదుహితౄణాం తదన్వయః
- (నారద. 13-2)
(తల్లియొక్క ధనమును కుమార్తెలు పొందుదురు. కుమార్తెలు లేనిచో వారి వంశీయులు పొందుదురు.)
స్త్రీ దుహితృత్వములోనే కాక మాతృత్వములో గూడ నొక్కప్పుడు దాయమును పొందుట కర్హురాలు కాగలదని మనువు చెప్పుచున్నాడు. సంతతిలేని కుమారునిధనము తల్లికి చెందును.
అనపత్యస్య పుత్రస్య మాతాదాయమవాప్నుయాత్
మాతర్య పిచవృత్తాయాం పితుర్మాతాహరేద్ధనం
(మను. 9-217)
కాని మనుస్మృతి స్థలాంతరమున సంతానరహితుని ధనము తండ్రికిని సోదరులకును పోవునని చెప్పుటచే తల్లిదండ్రులు సోదరులుగల యనపత్యుని ధన మా మువ్వురకు కలసి వెళ్లుననియు వారిలో నెవరు లేకున్నను మిగిలినవారికి వెళ్లుననియు తెలియుచున్నది.
పితాహరేదపుత్రస్య రిక్థం భ్రాతర ఏవచ
- (మను. 9-185)
(అపుత్రకుని ధనమును తండ్రి, సోదరులు పొందుదురు.)
ఒకడనపత్యుడై మృతిచెందిన పిమ్మట వాని భార్య జీవించియుండుచో వాని ధనము భార్యకే చెందునని యాజ్ఞవల్క్యస్మృతి చెప్పుచున్నది. భార్యాపుత్రులు లేక కుమార్తెలే యుండుచో వారికే యాస్తి పోవును. వారును లేనిచో తల్లి దండ్రులకు సంక్రమించును.
పత్నీదుహితర శ్చైవ పితరౌభ్రాతరస్తథా
తత్సుతోగోత్రజో బంధుశ్శిష్యస్స బ్రహ్మచారిణః
ఏషామభావే పూర్వస్య ధనభాగుత్తరోత్తరః
సర్వాతస్సహ్య పుత్రస్య సర్వవర్ణేష్వయం విధిః
(యాజ్ఞ2-134)
తండ్రి చనిపోయిన పిమ్మట నాతని ధనమును కుమారులు పంచుకొనునపుడు తల్లికి కూడ కుమారులతో బాటు భాగము వచ్చునని యాజ్ఞవల్క్యుడు చెప్పుచున్నాడు.
పితురూర్థ్వం విభజతాం మాతావ్యంశం సమం హరేత్
- (యాజ్ఞ 2-127)
ఒకడు తాను జీవించియుండగనే కుమాళ్లకు భాగములు పంచుచో వారితో సమముగ తన భార్యలకు కూడ భాగముల నీయవలెను. వారిదివరలో తనవలనగాని తన తండ్రివలనగాని ధనమును పొందియున్నచో నా భాగము నిపుడు తగ్గింపవలెను.
యదికుర్యాత్సమానం శాన్పత్న్యః కార్యాస్సమాంశకాః
నదత్తం స్త్రీధనం యాసాం భర్త్రానాశ్వశురేణవా
(యాజ్ఞ 2-113)
అధ్యగ్న్యధ్యావాహనికం దత్తంచ ప్రీతికర్మణి
భ్రాతృమాతృపితృప్రాప్తం షడ్విధం స్త్రీధనం స్మృతం
(మను 9-194)
(స్త్రీధన మాఱువిధములు:- (1) వివాహకాలమున నగ్నియెదుట పిత్రాదులచే కూతున కొసగబడిన ధనము. (2) కుమార్తె యత్తింటి కేగునపు డామె కీయబడిన ధనము. (3) భర్త సంతోషముతో భార్యకిచ్చిన సొమ్ము. (4) (5) (6) సోదరుడు, తల్లి తండ్రి యితరసమయములలో నిచ్చిన సొత్తు)
యాజ్ఞవల్క్యుడు గూడ నిట్లే చెప్పుచున్నాడు.
పితృమాతృ పతిభ్రాతృ దత్తమధ్యగ్న్యుపాగతం
ఆధివేదనికాద్యంచ స్త్రీధనం పరికీర్తితం
(యాజ్ఞ 2-141)
తండ్రి, సోదరుడు, పతి మున్నగువారు స్త్రీకి తరచుగ నేదో కొంతసొమ్మును ముట్టచెప్పు చుండవలెను. అట్లు స్త్రీలు గౌరవింపబడుచోట సంపత్తియు కల్యాణము నుండును.
పితృభిర్భ్రాతృభిశ్చైతాః పతిభిర్దేవరైస్తథా
పూజ్యాభూషయితవ్యాశ్చ బహుకల్యాణమీప్సుభి:
జామయోయాని గేహానిశపంత్య ప్రతిపూజితాః
తానికృత్యాహతానీవి వినశ్యన్తి సమంతతః
తస్మాదేతాస్సదా పూజ్యాభూషణాచ్ఛాదనాశనైః
భూతికామైర్నరైర్నిత్యం సత్కారేషూత్సవేషుచ
(మను. 3-55, 58, 59)
ఈవిధముగ వచ్చు నలంకారాదులన్నియు స్త్రీ ధనమగును. స్త్రీలకు భర్త్రాదులవలన వచ్చు కాన్క లనేకవిధములు గలవు. వివాహములో వరుడు కన్యాదాతకు శుల్కము నిచ్చుటకాక కన్యకే కొంతధనము నిచ్చుట కలదు. దానిని కన్యతలిదండ్రు లనుభవింపరు. అది పూర్తిగ కన్యకే చెందును.
యాసాంనాదదతే శుల్కంజ్ఞాతయో ననవిక్రయః
అర్హణం తత్కుమారీణా మానృశంస్యంచ కేవలం
(మను. 3-54)
అలంకారం నాదదీతపిత్య్రం కన్యాస్వయంపరా
మాతృకం భ్రాతృదత్తం వాస్తేనాస్యాద్యదితం హరేత్
(మను.9-92)
భార్యయుండగ భర్త పునర్వివాహము చేసికొనుచో నాతని ద్వితీయ వివాహమునకగు వ్యయముతో సమమగు ధనమును ప్రథమ భార్య కీయవలెను. ఆమె కిదివఱకే కొంత స్త్రీధనమిచ్చియున్నచో నిపుడు దానిని తగ్గించి యీయవలెను.
అధివిన్నః స్త్రియైదద్యాదాధివేదనికం సమం
నదత్తం స్త్రీధనం యస్యైదత్వేత్వర్థం ప్రకల్పయేత్
(యాజ్ఞ. 1-146)
ఇవన్నియు స్త్రీకి ప్రత్యేకముగ చెందు ధనములే యై యున్నవి.
స్త్రీ ధనమును ప్రత్యేకశ్రద్ధతో కాపాడుట రాజు ధర్మము.
వశాపుత్రానుచైవం స్యాద్రక్షణం నిష్కులాసుచ
పతివ్రతాసుచ స్త్రీషు విధవాస్వాతురాసుచ
(మను. 8-28)
(బిడ్డలు లేక భర్తవలన భరణము కొనుచున్నట్టియు వంశహీనలైనట్టియు స్త్రీలయొక్కయు, పతివ్రతలయొక్కయు, విధవల యొక్కయు, రోగిణుల యొక్కయి ధనమును బాలుర ధనమువలె రాజు కాపాడవలెను.) స్త్రీ ధనము నపహరించుట మహాపాపముగ చెప్పబడినది. స్త్రీల వస్తువులనుకూడ నితరులు వాడుకొనరాదు.
స్త్రీ ధనానితుయే మోహాదువజీవన్తి బాంధవాః
నారీయానాని వస్త్రంవాతే పాపాయాన్త్యధోగతిం
(మను. 3-52)
(అజ్ఞానముచే స్త్రీ ధనము ననుభవించునట్టియు స్త్రీల వాహనములను వస్త్రములను నుపయోగించు నట్టియు బంధువులు పాపులు. వారథోగతికి పోదురు.)
కాని కొన్ని పరిస్థితులలో భార్యయొక్క ధనమును భర్త వాడుకొనవచ్చును.
దుర్భిక్షే ధర్మకార్యేచవ్యాధౌసం ప్రతిరోధనే
గృహీతం స్త్రీధనం భర్తానస్త్రియై దాతుమర్హతి
(యాజ్ఞ. 2-145)
(కఱువులోను, ధర్మకార్యములోను, వ్యాధిలోను, కష్టము నుండి తప్పించుకొనుటలోను భర్త భార్య ధనమును తీసికొనుచో నాత డాధనము నామెకు తిరిగి యీయనక్కరలేదు.)
భార్యాభర్త లిఱువురు నొకే సంసారము నిర్వహించు వారగుటచేతను నైహికాముష్మిక విషయములన్నిటిలోను సహత్వముగలవారగుట చేతను భర్తకు స్త్రీధనము వాడుకొను నధికారముండుటలో నాశ్చర్యము లేదు. భార్య సమస్త విషయములలోను భర్త కనువర్తనగ నుండవలెను గాన నామెకుగల పృథగ్ధనము నామ మాత్రమే. అట్లే భర్త కెంతధనముపై నధికారమున్నను భార్యకు కూడ క్రియలో దానిపై నధికారము రాకతప్పదు. కాన నీసొత్తు భార్యది యీసొత్తు భర్తది యను విభాగమే సాధ్యము కాదు. కావుననే ఆపస్తంబు డిట్లు చెప్పుచున్నాడు.
జాయా పత్యోర్న విభాగోదృశ్యతే
- (ఆ.ధ.సూ. 2-14-16)
(భార్యాభర్తలకు విభాగము లేదు.)
కాన నిఱువురకును నామమాత్రముగ వేర్వేరుగ నున్న సొత్తుపైన నిర్వురకు నధికారము గలదనియే చెప్పవలెను. ఈయంశ మీక్రింది సూత్రములలో స్పష్టము చేయబడినది.
కుటుంబి నౌధనస్యేశాతే
- (ఆ.ధ.సూ. 1-29-3)
(భార్యాభర్త లిఱువురును ధనమున కధికారులు)
వారికి ద్రవ్యవిషయములో సమానస్వామిత్వము పాణిగ్రహణము వలననే కల్గుచున్నది. పాణిగ్రహణమువలన దంపతులకు కర్మలో సహత్వము గల్గునట్లే.
ద్రవ్యపరిగ్రహేషుచైవం.
- (ఆ.ధ.సూ. 2-14-19)
ధనమును నిర్వహించుటలో గూడ సహత్వము వచ్చుచున్నదని యాపస్తంబుడు చెప్పుచున్నాడు. భర్త ధనము నార్జించుటయు భార్య యా ధనమును నిర్వహించుటయు జరు గుచో నది చక్కని సహత్వమగును. ద్రవ్యమును నిర్వహించుట యను పనిని భర్త భార్య కిచ్చునదియే కాని యామె కందుపై స్వతస్సిద్ధమగు నధికారము లేని మాట వాస్తవమే.
అర్ధస్య సంగ్ర హేచైనాం వ్యయేచైవనియోజియేత్
- (మను. 9-11)
(ధనమును రక్షించుటయందును వ్యయపఱచుటయందును స్త్రీని నియోగింపవలెను.)
ఈవిధముగ భర్తచే నధికారములో ప్రతిష్ఠింపబడిన భార్య తన యధికారమును దుర్వినియోగము చేయరాదు. భర్త్రాజ్ఞలేనిదే కుటుంబధనము నుండి యలంకారాదులను చేయించుకొనరాదు.
ననిర్హారం స్త్రీయఃకుర్యుః కుటుంబాద్బహమధ్యగాత్
న్వకాదపి చవిత్తాద్ధి స్వస్యభర్తురనాజ్ఞయా
(మను. 9-199
(సోదరులు మన్నగువా రనేకులుగల కుటుంబము నుండి ధనమును సంగ్రహించి స్త్రీ లాభరణాదులను చేయించు కొనరాదు. తమ భర్త సొత్తునుండి యైనను నాతని యాజ్ఞ లేనిదే యలంకారాదులను చేయించుకొనరాదు.)
న్యాయములగు వ్యయములను జేయుట కామె కధికారము గలదు. భర్త గ్రామాంతరములో నున్నపుడు నైమిత్తిక దానములను జేయుటకు గూడ నామె కధికారమున్నది. నహిభర్తుర్వి ప్రవాసే నైమిత్తికే దానేస్తేయ
ముపదిశంతి
(ఆ.ధ.సూ.2-14-20)
(భర్త ప్రవాసములో నుండగ నైమిత్తిక దానము చేయుట దొంగతనము కానేరదు.)
పైన తెల్పబడిన దాయరూపస్త్రీ ధనరూపమైన ధనముకాక మఱి యేవిధమగు ధనమును స్త్రీ యార్జించినను నాధనము భర్తదే యగును.
భార్యాపుత్రశ్చదానశ్చత్రయ ఏనాధనాః స్మృతాః
యత్తేసమధిగచ్ఛన్తి యస్యతేతస్య తద్ధనం
(మను. 8-416)
(భార్యా, పుత్రుడు, దాసుడు-ఈ మువ్వురకు వేరుగ ధనముండదు. వారేధనము సంపాదింతురో యాధనము వారెవనికి చెందుదురో వానిదే.)
ఇదివఱలో దాంపత్యమను ప్రకరణమున ధర్మార్థ కామములతో భార్యా భర్త లొకే వ్యక్తివలె నుండవలెనను నంశమును చూచి యుంటిమి. దాని ననుసరించియే పైన వివరింపబడిన ధనవిషయ కానుబంధము దంపతులకు గల్గు చున్నది. కాని ఋణవిషయములో నిట్టి సమాన భాధ్యత లేదు. భర్తృ మరణానన్తర మాతని ధనము నెల్ల పొందుటకు నపుత్రయగు భార్య కధికారమున్నది కాని యాతడు చేసిన ఋణమునెల్ల తీర్పవలెనను విధి యామెకు లేదు. నయోషిత్పతిపుత్రాభ్యాం నపుత్రేణ కృతంపితా
దద్యాదృతే కుటుంబార్థాన్నపతిః స్త్రీకృతంతథా
(యాజ్ఞ 2-45)
(పతి,పుత్రుడు చేసిన కుటుంబార్ధము కాని ఋణమును స్త్రీ తీర్పనక్కరలేదు. అట్లే పుత్రునిచేత చేయబడిన ఋణమును తండ్రియు భార్యచేత చేయబడిన ఋణమును భర్తయు తీర్పనక్కరలేదు.)
మూడు విధములగు ఋణములను తీర్చుటకే స్త్రీకి విధికలదు.
ప్రతిపన్నం స్త్రియాదేయం పత్యావాసహయత్కృతం
స్వయంకృతం వాపియదృణం నాన్యం స్త్రీదాతుమర్హతి
(యాజ్ఞ 2-48)
(ఈ మూడు ఋణములను స్త్రీ తీర్పవలెను; (1) భర్త చనిపోవుచునే ఋణమును తీర్పవలసినదని భార్య కాదేశింపగా భార్య యందులకు సమ్మతించునో యాఋణము (2) భర్తతో కలసి చేసిన ఋణము (3) స్వయముగచేసిన ఋణము, మఱే ఋణమును స్త్రీ తీర్పనక్కర లేదు.)
స్త్రీ చేసిన ఋణమును పతి తీర్ప నక్కర లేదు. కాని యేకులములలో స్త్రీలు కూడ ధనసంపాదనము చేసి కుటుంబ యాత్రకు తోడ్పడుదురో యాకులములలో భార్యచేసిన ఋణమును భర్త తీర్పవలెనని యాజ్ఞవల్క్యుడు తెల్పుచున్నాడు. గోపశౌండిక శైలూష రజకవ్యాధయోషితాం
ఋణంద ద్యా త్పతిస్తాసాం యస్మాద్వృత్తిస్తదాశ్రయా
(యాజ్ఞ 2-47)
(గొల్ల, కలార, చాకలి, యెఱుకల కులములలోను నటకుల కులములోను స్త్రీ చేసిన ఋణమును భర్త తీర్పవలెను. ఏలన నందు వృత్తి స్త్రీల నాశ్రయించి యుండును.)
యాజ్ఞవల్క్యుని కాలమునాటి కీకులములలోని స్త్రీలు పనిచేసి ధనము సంపాదించెడివారని దీనివలన తెలియుచున్నది. వీరుకాక వివిధవర్ణములకు చెందిన స్త్రీలు ధనికుల యిండ్లలో పరిచారకు రాండ్రుగనుండి ధనమార్జించు చుండినట్లు స్మృతుల వలన తెలియుచున్నది. వారు తఱుచుగ 'స్త్రియ:' అను పదముచేతనే తెలుప బడుచున్నారు.
వస్త్రం పత్రమలంకారం కృతాన్నముదకం స్త్రియః
యోగక్షేమం ప్రచారంచ నవిభాజ్యం ప్రచక్షతే
(మను 9-219)
(వస్త్రములు, వాహనములు, అలంకారములు, పక్వముచేసిన తినుబండ పదార్థములు, బావిలోని నీరు, స్త్రీ సేవకురాండ్రు, మంత్రి పురోహితుడు మున్నగువారు రాకపోకలదారులు - వీనిని పంచుకొనరాదు.)
ధార్మిక జీవనముగల కులములలో స్త్రీకి స్వతంత్ర జీవనము లేదు. పితారక్షతి కౌమారే భర్తారక్షతి యౌవనే
రక్షంతిస్థావిరే పుత్రాన స్త్రీస్వాతంత్ర్యమర్హతి.
(మను 9-3)
(స్త్రీని బాల్యములో తండ్రియు, యౌవనములో భర్తయు, వార్ధకములో పుత్రులును రక్షింపవలెను. స్త్రీ స్వాతంత్య్రమున కర్హురాలుకాదు.)
భర్త మరణించిన పిమ్మట స్త్రీకి పుత్రులతో బాటు భాగమువచ్చుటను పైన చూచియున్నాము. అయినను నామె పుత్రుని యధీనముననే యుండవలెను. వ్యభిచారిణియగు స్త్రీకి భర్త యాస్తిలో భాగమురాదు.
తామరిక్థ్యా ముపేయాత్
- (వసిష్ఠ 13-53)
దాయభాగము పొంద నర్హులుకాని క్లీబాదులను వారి భార్యలను కూడ తక్కినవారు పోషింపవలెను. వారి పుత్రులు పెద్దవారగుచో పుత్రులే పోషింపవలెను. కాని యీ క్లీబాదుల భార్య లపుత్రులై వ్యభిచారిణులగుచో వారిని మిగిలినవారు పోషింపనక్కరలేదు.
అపుత్రా యోషితశ్చైషాం భర్తవ్యా సాధువృత్తయః
నిర్వాస్యా వ్యభిచారిణ్యః ప్రతికూలాస్త థైవచ
(యాజ్ఞ 2-140)
(అపుత్రులైన క్లీబ, పతిత, పంగూన్మత్త, జడాంధ చికిత్స్యరోగార్తుల భార్యలు మంచివారగుచో వారిని పోషింప వలెను, వ్యభిచారిణులుకాని ధిక్కరించువారుకాని యగుచో వారి నింటినుండి వెళ్లగొట్టవలెను.)
భర్తృ సంబంధమైన ధనమేమియు లేకపోయినను గూడ వితంతువును భర్తృపక్షము వారు పోషింపవలెను.
మృతేభర్తర్య పుత్రాయాః పతిపక్షః ప్రభుఃస్త్రియాః
వినియోగాత్మరక్షా సుభరణేచ నఈశ్వర:
(నారద 18-28)
(భర్తపోయిన యపుత్రయగు స్త్రీకి నియోగమునందును, నాత్మరక్షయందును, భరణమునందును పతిపక్షము వారే గతి.)
అట్టి స్త్రీలు బ్రాహ్మణేతర కులమునకు చెందినవారగుచో వారిని రాజే పోషింపవలెనని నారదుడు చెప్పుచున్నాడు.
అన్యత్రబ్రాహ్మణే భ్యస్స్యాద్రాజా ధర్మపరాయణః
తత్త్స్రీభ్యోజీవనం దద్యాదేషదాయ విధిఃస్మృతః
(నారద. 13-52)
సమిష్టి కుటుంబములో నుండగానే యొకడపుత్రకుడై మరణించుచో వాని భార్యను వాని సోదరులే పోషింపవలెనని నారదుడు చెప్పుచున్నాడు.
భ్రాతౄణామప్రజాః ప్రేయాత్కశ్చిచ్చేత్ప్రవ్రజేత్తువా
విభజేరన్థనంతస్య శేషన్తు స్త్రీధనం వినా
భరణం చాన్యకుర్వీరన్త్స్రీణామా జీవితక్షయాత్.
రక్షన్తిశయ్యాం భర్తుశ్చే దాచ్ఛిన్ద్యురితరాసు చ
యాతస్య దుహితాతస్యాః పిత్య్రోం౽శే భరణేమతః
ఆసంస్కారం భజేరంస్తాం పరతోభి భయాత్పతిః
(నారద.13-25, 26, 27)
(సోదరులలో నొకడు కుమాళ్లులేకుండ చనిపోవుచో గాని సన్యాసియగుచో గాని వాని సోదరులాతని ధనమును పంచుకొని యాతని భార్యయొక్క స్త్రీ ధనమును మాత్రము వారు పంచుకొనరాదు-ఆతని భార్యలను చివఱివఱకు పోషింపవలెను. వారు వ్యభిచారిణులగుచో పోషింప నక్కరలేదు. వానికి కుమార్తె యుండుచో నామెకు తండ్రి యాస్తిలోనుండి యొక భాగమిచ్చి, వివాహము చేయవలెను. వివాహమైనపిమ్మట నిక వారామెను భరింపనక్కరలేదు. భర్తయే భరించును.)
పైన నీయబడిన యాజ్ఞవల్క్యాది వాక్యములను బట్టి విభక్త కుటుంబములో గూడ వితంతువునకు భర్త యాస్తి వచ్చునని తేలుచున్నది. కాని నారదుని యభిప్రాయము వేరైనట్లీ శ్లోకములవలన తెలియుచున్నది.
మొత్తముపైన ధర్మశాస్త్రములలో నార్థికవిషయమున స్త్రీలు పురుషులకంటె విస్తారముగ వెనుబడి యున్నారని చెప్పుటకు వీలులేదని పైన వివరింపబడిన యంశములవలన తెలియగలదు.