సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/మోక్షగుండం విశ్వేశ్వరయ్య

వికీసోర్స్ నుండి

అంతా తలరాత - అన్న అలస భావం పోగొట్టిన

'భారతరత్న' మోక్షగుండం విశ్వేశ్వరయ్య

"ప్రజల సంపాదనాశక్తిని, కార్యదక్షతను నైపుణ్యాన్ని వివిధములైన చేతిపనుల ద్వారా పెంపొందించాలి. చేతనైన వారందరూ కష్టించి పని చేసే వీలు కల్పించాలి. యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని దేశ పారిశ్రామిక ప్రగతికి ముందంజ వేయాలి. భారతీయులలో ప్రబలంగా ఉన్న 'అంతా తలరాత' అన్న అలస భావం రూపుమాపి నిరంతర కృషి ద్వారా సంపదను సాధించే దీక్షను, కర్తవ్య పాలనను ప్రజలలో రేకెత్తించుట ప్రభుత్వం కర్తవ్యం."

1912 మైసూరు సంస్థాన దివానుగా అధికారాన్ని చేపడుతూ శ్రీ విశ్వేశ్వరయ్య చేసిన ప్రసంగం నుండి పై వాక్యాలు ఉటంకింపబడినాయి. విశ్వవిఖ్యాత ఇంజనీర్‌గా, పాలనాదక్షుడుగా, రాజనీతిజ్ఞుడుగా, నిష్కామ దేశభక్తుడిగా అఖండ కీర్తిని ఆర్జించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

విశ్వేశ్వరయ్య పూర్వీకులు నేటి ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామం నుండి సుమారు రెండు శతాబ్దాల క్రితం, కర్ణాటక రాష్ట్రం (అప్పట్లో మైసూరు) లోని, చిక్క బళ్ళాపుర సమీపంలోని ముద్దేనహళ్ళిలో స్థిరపడినారు. అక్కడే విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. తండ్రి శ్రీనివాస శాస్త్రి. తల్లి వెంకట లక్ష్మమ్మ. వారిదో సామాన్య కుటుంబం. బాల్యంలోనే తండ్రి మరణించాడు. మేన మామ రామయ్య బాలుడైన విశ్వేశ్వరయ్యను చేరదీసి బెంగుళూరు సెంట్రల్ కాలేజీలో చదువుకునే ఏర్పాటు చేశాడు.

విశ్వేశ్వరయ్య గారి విద్యార్థి జీవితం విద్యాభ్యాసం సాగించే వారందరికీ దిక్సూచి. మేనమామ ఇంట్లోవుంటూ కాలేజీ ఫీజులకోసం ప్రైవేట్ ట్యూషన్ చెబుతూ 1881లో పట్టభద్రులయ్యారు. సెంట్రల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఛార్లెస్ వాటర్స్ విశ్వేశ్వరయ్య నెంతగానో ప్రోత్సహించాడు. గణితంలో అసామాన్య ప్రతిభకల విశ్వేశ్వరయ్య గారి నుండి అధ్యాపకులే తమ సంశయాలను పరిష్కరించుకునేవారు. శిష్యుని కుశాగ్ర బుద్ధికి ముగ్ధుడైన ప్రిన్సిపాల్ తాను ఉపయోగించుకునే వెబ్‌స్టర్ డిక్షనరీని బహుమానంగా ఇచ్చాడు. తన కోటుకున్న బంగారు బొత్తాములను భార్యద్వారా శిష్యుడు విశ్వేశ్వరయ్యకు పంపారు. అదీ ఆనాటి గురుశిష్యుల అనుబంధం - శిష్యవాత్సల్యం.

ఇటువంటి పెద్దలు ఆదరించినందువల్లనే బాలుడైన విశ్వేశ్వరయ్య, ఆ తర్వాత డా. ఎం.వి; సర్. ఎం.వి; భారతరత్న ఎం.వి. అంటూ ప్రస్తుతింపబడినారు. అప్పట్లో మైసూరు సంస్థాన దివానుగా వుండిన దివాన్ రంగాచార్లుగారు విశ్వేశ్వరయ్య విద్యావినయములను గుర్తించి ఇంజనీరింగ్ విద్యాభ్యాసం సాగించేందుకు స్కాలర్‌షిప్ మంజూరు చేసి, పూనేకు పంపారు. ఇంజనీరింగ్ పరీక్షలో బొంబాయి రాష్ట్రంలో సర్వప్రథముడుగా ఉత్తీర్ణులైన విశ్వేశ్వరయ్యగారిని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అసిస్టెంట్ ఇంజనీర్ గా నియమించింది. ఏడాది లోపునే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నియమించారు. ఆ రోజుల్లో అందులోను ఆంగ్లేయుల పాలనలో అంత త్వరలోనే పదవీ ఉన్నతి పొందడం చాల అరుదు. పూనేలో ఉన్నప్పుడే గోఖలే, తిలక్, రనడే వంటి మహనీయుల సాహచర్యం విశ్వేశ్వరయ్య గారికి లభించింది. గాంధీజీ, నెహ్రూల కంటే వయస్సులో పెద్ద విశ్వేశ్వరయ్య.

ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్యగారి కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాలలో ఒకటిగ పెద్దదైన బరాజ్ (సింధురాష్ట్రం) నిర్మాణానికి ప్రత్యేక ఇంజనీర్ గా నియమించారు. బ్రహ్మాండమైన ఈ జలాశయ నిర్మాణం నాలుగేళ్ళలో పూర్తి అయింది.

1901లో భారత ప్రభుత్వ ప్రతినిధిగ విశ్వేశ్వరయ్యగారు జపాన్ దేశం వెళ్ళి అచట కుటీర పరిశ్రమల తీరుతెన్నులను అవలోకించారు. ఆ పద్ధతిలో కుటీర పరిశ్రమల అభివృద్ధికి బృహత్ పధకాన్ని సిత్థపరచి ప్రభుత్వానికి అందించారు. జపాన్ పర్యటనానంతరం, విశ్వేశ్వరయ్యగారు పూనా నగర నీటి సరఫరా పధకాన్ని రూపొందించారు. ఆ నిర్మాణ కాలంలోనే ఆటోమేటిక్ స్లూస్‌గేట్ రూపొందించారు. ఈ స్లూస్‌గేట్ నిర్మాణం ప్రపంచ ఇంజనీర్ల మన్ననలందుకున్నది. ఈ కొత్త పరిశోధనను తన పేరు మీద పేటెంట్ చేసుకోవలసిందిగ మిత్రులు సూచించారు. తన కార్యనిర్వహణలో భాగంగా సాగినదికాన పేటెంట్ తీసుకోవటం సముచితం కాదన్నాడు. లార్డ్ కిచనర్ స్లూస్‌గేట్ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య ప్రతిభను కొనియాడాడు.

1906లో ఏడెన్ నగరం నీటి, సరఫరా ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వం విశ్వేశ్వరయ్యగారిని సూపరింటెండెంట్ ఇంజనీర్ గా నియమించింది. అప్పుడే కొల్హాపూర్, ధార్వాడ, బిజాపూర్ మొదలగు పట్టణాలలో మంచినీటి పథకాలను సిద్ధపరచారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వోద్యోగాన్ని స్వయంగా వదులుకున్నారు. రెండు సంస్థానాల నుండి ఛీఫ్ ఇంజనీర్ పదవులు చేపట్టమని ఆహ్వానాలు వచ్చాయి. అన్నిటిని తిరస్కరించి ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, మొదలగు దేశాలలోని బృహన్నిర్మాణాలను పరిశీలించి, ఆయాదేశ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి 1909లో స్వదేశం వచ్చారు.

ఇటలీ పర్యటనలో ఉన్నపుడే హైదరాబాద్ నగర రక్షణా పథకం నిర్మించుటకు స్పెషల్ చీఫ్ ఇంజనీర్ గా ఆహ్వానించాడు నిజాం. విశ్వేశ్వరయ్యగారి నేతృత్వంలో సాగినవే హుసేన్‌సాగర్, హైదరాబాదు నగర విస్తృత పథకాలు.

స్వరాష్ట్రమైన మైసూరు సంస్థానాన్ని ఆదర్శ సంస్థానంగా తీర్చి దిద్దిన వారు ఆయన. చీఫ్ ఇంజనీర్ గా, ఆ తర్వాత దివాన్ గా పనిచేసిన ఆరేళ్ళలో అరువదేళ్ళ అభివృద్ధిని సాధించారు. హెబ్బాళ్ వ్యవసాయ కళాశాల, మైసూరు విశ్వవిద్యాలయం, ఛేంబర్ ఆఫ్ కామర్స్, సోప్ ఫ్యాక్టరీ, కన్నడ సాహిత్య పరిషత్ మున్నగు వాటిని నెలకొల్పారు.

విశ్వేశ్వరయ్య గారి ప్రజ్ఞా ప్రతిఫలంగా నిర్మింపబడినదే కృష్ణరాజసాగర్, లక్షలాది ఎకరాల మెట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి. బృందావన్ ఉద్యానవనం వారి ప్రకృతి ప్రేమకు నిదర్శనం. భారతదేశ సంస్థానాలలో మొదటి ఉక్కు కర్మాగారం నెలకొల్పినది మైసూరు.

మైసూరు మహారాజా గారితో అభిప్రాయభేదం రాగా రాజీనామా చేసి బొంబాయి వెళ్ళిపోయారు. విదేశీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ప్రారంభింపబడిన భద్రావతి కర్మాగార నిర్మాణ కార్యక్రమం దెబ్బతినింది మహారాజా గత్యంతరం లేక బొంబాయిలోని విశ్వేశ్వరయ్య గారిని ఆహ్వానిస్తూ 'ఈ కర్మాగార పథకం మీదే, అది ఇప్పుడు రోగ గ్రస్తమైంది. మీరు ప్రారంభించిన ప్రజాప్రతినిధి సభ సభ్యులు దీనిని తెల్ల ఏనుగ అంటూ ఎగతాళి చేస్తున్నారు. మీరు వచ్చి దీనిని పునరుద్ధరించాలి' అని వ్రాశారు.

కర్మాగార పర్యవేక్షణ, వ్యయం మున్నగు వాటిపై అన్ని అధికారాలు విశ్వేశ్వరయ్య గారు చేపట్టారు. కార్మికులకు కొద్దిగా కూలీ పెంచారు. అవినీతిపరులైన విదేశీ ఇంజనీర్లను తొలగించారు. రేయింబగళ్ళు కార్మికులను ప్రోత్సహిస్తూ నష్టాల ఊబిలో నుండి లేవనెత్తి రెండేళ్ళలో లాభాలు చూపించారు. పెద్ద కర్మాగారాల్లో సుశిక్షితులైన భారతీయులనే నియమించాలని అందుకు శిక్షణావకాశాలు పెంచాలన్నారు. భద్రావతి కర్మాగారం పర్యవేక్షకులుగా మహారాజా గారి నుండి లభించిన లక్షా యాభైవేల రూపాయలను తిప్పి పంపుతూ, ఆ పైకంతో పారిశ్రామిక శిక్షణ సంస్థను నెలకొల్పమని రాజాగారిని కోరారు విశ్వేశ్వరయ్య. ఆ సంస్థకు తన పేరు పెట్టుటకు సమ్మతింపలేదు. ఆ విధంగా వెలిసిందే జయ చామరాజేంద్ర ఆక్యుపేషనల్ ఇన్‌స్టిస్టూట్.

విశ్వేశ్వరయ్యగారు 1921లో భారత ఉత్పత్తిదారుల సమాఖ్యను నెలకొల్పి జీవి తాంతం ఆ సమాఖ్య అధ్యక్షులుగా పనిచేశారు. 1922 లో అఖిలపక్ష రాజకీయ సమ్మేళనానికి, 1923లో ఇండియన్ సైన్స్ కాంగ్రెసుకు అధ్యక్షత వహించారు.

విశ్వేశ్వరయ్య స్వదేశీ సంస్థాన ప్రజలు బ్రిటిష్ ఇండియాలోని ప్రజలకంటే ఎక్కువ బాధలు పడుతున్నారని గ్రహించి వారి స్వేచ్ఛకోసం గొప్ప కృషి చేశారు. మైసూరు సంస్థానంలో ప్రజాప్రతినిధి సభను ప్రారంభించారు.

కర్తవ్య నిర్వహణలో, నిజాయితీలో అటువంటి వారు అరుదు. దివాన్ పదవి స్వీకరించే ముందు బంధుమిత్రులను ఆహ్వానించారు. " నేను దివాన్ పదవిలో వుండగా ఎటువంటి ఉద్యోగాలు కోరమని, సిఫార్సులు చేయమని వాగ్ధానం చేయమన్నారు." తన బంధువులను ప్రభుత్వోద్యోగాల నుండి తప్పించి, ఇతర వృత్తులను చేపట్టుటకు సొంతపైకం యిచ్చారు.

మైసూరు సంస్థానంలో మోటార్ కార్ల నిర్మాణం ప్రారంభించాలనుకున్నారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తిరస్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇండియాలో విమాన నిర్మాణం అత్యవసరమైనది. విశ్వేశ్వరయ్య గారి సలహా మేరకు బెంగుళూరులో భారత ప్రభుత్వం విమాన కార్ఖానా నెలకొల్పింది. విశాఖ పట్నంలోని నౌకా నిర్మాణ పధకాన్ని రూపొందించి వాల్ చంద్ హీరాచంద్ గారిచే ప్రారంభింపచేసిన వారాయనే.

గాంధీజీ - విశ్వేశ్వరయ్యగారులు దేశాభివృద్ధి సాధనలో భిన్న దృక్పధాలు కలవారు. గాంధీజీ గ్రామీణ పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. విశ్వేశ్వరయ్యగారు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహించాలన్నారు.

" నా అభిప్రాయాలు ఎలా ఉన్నా, మీ సహకారం లభించే అదృష్టానికి నోచుకున్నందుకు సంతోషిస్తున్నాను. నా అభిప్రాయాలను వ్యతిరేకించినా మీ దేశ భక్తి, శక్తిసామర్ధ్యాల పట్ల నాకున్న గౌరవం ఏనాటికీ తరగదు." అన్నారు గాంధీజీ.

"మీరేమైనా చెప్పండి. భారత గ్రామీణుల గురించి నాకు మీకంటే ఎక్కువగా తెలుసు" అని గాంధీజీ అన్నప్పుడు, "నేను మీకంటే పదేళ్ళు పెద్దవాడినన్న విషయం గమనించ మనవి. దేశ ఆర్ధిక ప్రగతి విషయంలో మీ కంటే ఎక్కువ అవగాహన నాకుంది " అంటూ బదులు వ్రాశారు విశ్వేశ్వరయ్యగారు, గాంధీజీకి వ్రాసిన జాబులో.

భారతదేశంలోని పెద్ద జలాశయాలు, ఆనకట్టలు నిర్మించుటలో వారి సలహాలను ప్రభుత్వం గొప్పగా భావించేది.

తొంభై ఏళ్ళ వయసులో ప్రధాని నెహ్రూ ఆహ్వానాన్ని మన్నించి పాట్నా వద్ద గంగానదిపై వంతెన నిర్మాణ పథకాన్ని, కొందరు ఇంజనీర్ల బృందంతో రూపొందించారు. తుంగభద్ర ప్రాజెక్టు పథక శిల్పి వారే.

విశ్వేశ్వరయ్య నిజాయితీకి సాకారం. ఒక మారు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. కొంత పైకం కావాల్సి వచ్చింది. మైసూరు బ్యాంక్ మేనేజర్ బి. వి. నారాయణరెడ్డి గారికి ముందుగా ఫోన్ చేసి, బ్యాంక్ కు వెళ్ళారు. మేనేజర్ వారినెంతో గౌరవంగా లోపలికి తీసుకెళ్ళారు. అన్ని దరఖాస్తులు సిద్ధమైనాయి. విశ్వేశ్వరయ్య తమ వద్దవున్న భారత ప్రభుత్వ రుణ పత్రాలను ఇచ్చి తాకట్టు పెట్టుకోమన్నారు. మేనేజర్ ఆశ్చర్యంతో "తాము తాకట్టు పెట్టడమా! ఇది మీరు నెలకొల్పిన బ్యాంక్" అంటూ తిప్పి ఇవ్వగా విశ్వేశ్వరయ్య తీసుకోలేదు. బ్యాంకు వారు తక్కువ వడ్డీ సూచించగా - అందరికీ విధించే వడ్డీ వేయమన్నారు. ఎక్కువ వడ్డీ వేయమని కోరిన వారు విశ్వేశ్వరయ్య గారొక్కరే, అన్నారు బ్యాంక్ మేనేజర్.

విశ్వేశ్వరయ్య వ్యక్తిగత జీవితం అతి క్రమశిక్షణతో వుండేది. రెండు సార్లు భార్యావియోగం కల్గింది. మూడోసారి పెళ్ళాడిన భార్య వ్యవహారం నచ్చక ఆమెకు విడాకులిచ్చారు. కాల నియమాన్ని, ఆహార విహార నియమాలను కచ్ఛితంగా పాటించిన విశ్వేశ్వరయ్య 100 సం. వయస్సులో కళ్ళద్దాలు లేకుండా చదివేవారు. "గంధపు చెక్క వలె సేవలొ అరిగిపో, కాని ఇనుములా తుప్పు పట్టవద్దు." అనునది వారి జీవన ధ్యేయం. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి. 1961లో విశ్వేశ్వరయ్య గారి శతజయంతి ఉత్సవాలకు భారత ప్రధాని నెహ్రూ విచ్చేశారు." మేము మాటలతో కాల యాపన చేశాం. మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయు" లంటూ నివాళులర్పించారు నెహ్రూ.

భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్యగారిని 'భారతరత్న' బిరుదంతో సత్కరించింది. విశ్వేశ్వరయ్య ప్లాన్‌డ్ ఎకానమి ఆఫ్ ఇండియా రికన్‌స్ట్రక్టింగ్ ఇండియా, మెమాయిర్స్ ఆఫ్ మై వర్కింక్ లైఫ్ (ఆత్మకథ) రచించారు.

జీవితాంతం దేశ ప్రగతికి, ప్రజా శ్రేయస్సుకు కృషి చేసిన విశ్వేశ్వరయ్యగారు 12-4-1962న దివంగతులయ్యారు.