సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జాతి గర్వించదగ్గ మహామేధావి

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

అది 1952 ఏప్రిల్ 5వ తేదీ. మాస్కో నగరం. రష్యా అధినేత స్టాలిన్ నుండి భారత రాయబారి కార్యాలయానికి ఒక లేఖ అందింది. భారత రాయబారి, డా.రాధాకృష్ణన్ గారిని ఆహ్వానిస్తూ స్టాలిన్ వ్రాసిన లేఖ అది. అందరికీ ఆశ్చర్యం కల్గించింది. సాధారణంగా స్టాలిన్ విదేశీ రాయబారులను చూచేవాడు కాదు. అదివరలో శ్రీమతి విజయలక్ష్మి పండిట్ 18 మాసాల పాటు రష్యాలో భారత రాయబారిణిగా పనిచేశారు. కాని ఆమెకు రష్యా అధినేత మార్షల్ స్టాలిన్ తో ఇంటర్వ్యూ లభించలేదు.

రాధాకృష్ణన్ తత్వవేత్త. చాలా సౌమ్యుడు. రాజకీయాలు, దౌత్యవ్యవహారాలతో ఆయనకు అంతగా పరిచయం లేదు. స్టాలిన్ ను చూద్దామా అతి క్రూరుడని, అతని తత్వానికి రాధాకృష్ణన్ కు ఏమాత్రం పడదని అందరూ అన్నారు. రాయబారిగా రష్యా వచ్చిన రాధాకృష్ణన్ రోజుకు పద్దెనిమిది గంటలు పుస్తకాలు చదవటం, వ్రాయటంలో గడుపుతుంటాడని విన్నాడు స్టాలిన్.

ఆహ్వానం అందుకున్న డా. రాధాకృష్ణన్ రాయబార కార్యాలయోద్యోగి రాజేశ్వర్ దయాళ్ తో పాటు స్టాలిన్ వున్న గదిలో ప్రవేశించారు. రష్యా విదేశాంగమంత్రి విటాన్‌స్కీ స్టాలిన్ ప్రక్కనే ఉన్నారు. పావ్‌లోవ్ దుబాసిగా ఉన్నాడు. ఆ సమావేశాన్ని వివరిస్తూ రాధాకృష్ణన్ ఇలా వ్రాశారు.

"మా సంభాషణలో అశోక చక్రవర్తి ప్రస్తావన వచ్చింది. ఆయన పెక్కు యుద్ధాలు చేశాడని, వేలాది ప్రజలను చంపి యుద్ధంలో విజయం సాధించాడని, చివరకు ఆ మహారాజు సన్యాసిగా మారిపోయాడు అంటూ కళింగ యుద్ధం గురించి చెప్పాను. అశోకుని పరిస్థితి మీకూ కలగవచ్చు అన్నాను. అందుకు స్టాలిన్, 'అవును అద్భుత సంఘటనలు సంభవిస్తాయి' అన్నాడు. సమావేశం చివర నేను స్టాలిన్ చెక్కిళ్ళను నిమిరి వీపుపై తట్టాను. ఆయన తలపై నా చేతిని ఆడించాను. అప్పుడు స్టాలిన్

"అయ్యా, నన్ను రాక్షసునిగాకాక, మనిషిగా గుర్తించిన వారు మీరొక్కరే. మీరు త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళుతున్నట్లు విన్నాను. అందుకు విచారిస్తున్నాను. నేను ఇక ఎంతోకాలం బ్రతకను." అన్నాడు. తర్వాత ఆరు నెలలకే చనిపోయాడు స్టాలిన్.

గాంధీజీ హత్యకు గురి అయ్యే కొద్ది రోజులముందు రాధాకృష్ణన్ గాంధీజీని కలుసుకున్నారు. తాను రచించిన 'భగవద్గీత' ఆంగ్లానువాదాన్ని గాంధీకి అంకితం చేయదలచినట్లు చెప్పారు రాధాకృష్ణన్. అందుకు గాంధీజీ సమాధానమిస్తూ "మీ రచనలు చాలా గొప్పవి. కానీ నా అభిప్రాయం వినండి. నేను, మీ అర్జునుణ్ణి. మీరు నా కృష్ణభగవాన్ " అన్నాడు గాంధీజీ. ఇలా మహాత్ముని మన్ననలందుకున్న మహాపండితుడు, రాధాకృష్ణన్.

జననం - విద్యాభ్యాసం

శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు 40 మైళ్ళ దూరంలోని తిరుత్తణి లో జన్మించారు. తండ్రి వీరాస్వామయ్య. ఒక జమీందారీలో తహసిల్దార్. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. విద్యార్ధిగా వున్నపుడు, మనస్తత్వశాస్త్రంపై చేసిన ఉపన్యాసాలు అందరినీ అలరించేవి.

21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియమించింది. ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. కలకత్తా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు రాధాకృష్ణన్. ఆయన ఇంటిముందు గుర్రపుబండి సిద్ధంగా ఉంది. తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పటానికై విద్యార్థులు ఆయన ఇంటికి వచ్చారు. బండికి కట్టిన గుర్రాలను వదిలించారు. రైల్వే స్టేషన్ దాకా బండిని తామే లాక్కొని వెళ్ళారు. అది విద్యార్ధులకు ఆయన పట్ల వున్న ప్రేమకు సంకేతం. విద్యార్ధుల భక్తిశ్రద్ధలను గమనించిన రాధాకృష్ణన్ కళ్ళు చెమ్మగిల్లాయి. అది గురుశిష్యుల హృదయానుబంధం. ఆ ప్రేమానుబంధం ఈనాడు అంతగా కానరాదు.

కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది.

"మీరు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ తీసుకుని వుంటే మీకు మరింత గొప్ప పేరు వచ్చేది" అన్నాడొక మిత్రుడు. అందుకు బదులుగా, డా. రాధాకృష్ణన్ "నేను ఆక్స్‌ఫర్డ్ వెళ్తే, అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తాను. కాని విద్యార్ధిగా మాత్రం వెళ్ళను" అన్నాడు. అలా అన్న ఆరేళ్ళ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వారి ఆహ్వానంపై, ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలిచ్చేందుకు వెళ్ళారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికాలలో పలుచోట్ల ఉపన్యాసములిచ్చి మాతృదేశం వచ్చారు.

1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్‌గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.

1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.

1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగష్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.

1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.

డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.

రచనలు

ముఖ్యమైన ఉపనిషత్తులు, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్-రెఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫి, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ వంటి చాలా గొప్ప గ్రంథాలు రచించినారు.

1962లో బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి పదవి నుండి విరమించుకున్నారు. వారి తర్వాత రాష్ట్రపతిగా ఉన్న డా. రాధాకృష్ణన్ అయిదేళ్ళ కాలంలో ఎన్నో దేశాల్లో పర్యటించారు. అసమాన వాగ్ధాటితో, ప్రాచ్య పాశ్చాత్వ తత్వశాస్త్రాలపై చేసిన ఉపన్యాసాలు అన్ని దేశాల వారిని ఆశ్చర్యపరిచాయి.

ఛలోక్తులు

ఆయన ఉపన్యాసాల్లో ఛలోక్తులు, హాస్యోక్తులు దొర్లేవి. ఒకసారి సర్. మహమద్ ఉస్మాన్ (ఒకప్పుడు మద్రాసు రాష్ట్రమంత్రి) డా.రాధాకృష్ణన్ ఒకే సభలో మాట్లాడారు. సర్ మహమద్ ఉస్మాన్‌ను గురించి మాట్లాడుతూ, "శ్రీ ఉస్మాన్ నాకు చాలా సన్నిహిత మిత్రుడు. ఆయన కాలేజీలో మొదట సీనియర్. ఆ తర్వాత నా క్లాస్‌మేట్. తర్వాత నా జూనియర్. నేను మద్రాసులో ప్రొఫెసర్‌గా వున్నప్పుడు ఆయన అదే యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్. నేను వైస్ ఛాన్స్‌లర్‌గా వుండినపుడు ఆయన ఛాన్స్‌లర్."

రాధాకృష్ణన్, మానవజీవితంలో మంచిని పెంచాలనీ, ఉత్తమ సమాజాన్ని రూపొందించాలని, మతాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బోధించారు. మానవుల్లోని మమతానురాగాలను పెంచుటకు ప్రపంచం కృషి చేయాలన్నారు. అహింసా విధానం ద్వారా ప్రపంచ దేశాలన్నీ శాంతిని పెంచాలన్నారు.

ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు వారిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం వారిని 'భారతరత్న' తో సత్కరించింది. 1975లో 'టెంపుల్ టన్' బహుమతి ద్వారా లభించిన 96 వేల డాలర్ల మొత్తాన్ని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతిపై ప్రసంగాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. రాధాకృష్ణన్ గారు, డా. కె. యం మున్షీగారితో కలిసి భారతీయ విద్యాభవన్ స్థాపించారు.

మహామేధావిగా, గొప్పవ్యక్తిగా, గొప్ప గ్రంథకర్తగా, తత్వవేత్తగా, ప్రపంచ దేశాల మన్ననలందుకున్న డా. రాధాకృష్ణన్ భారతీయ మహర్షులకోవకు చెందిన వారు.

రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత (1967) చివరిరోజు వరకు మద్రాసులోని తమ భవనంలో, తాత్విక చింతన చేస్తూ 17.4.1975న పరమపదించారు.

ఆచార్యునిగా ఆయనను గుర్తించిన భారత దేశం, రాధాకృష్ణన్ జన్మదినమును ఉపాధ్యాయదినంగా దేశమంతటా ఏటా జరుపుకోవడం ఎంతో సముచితం.