సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/దుర్గాబాయి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఒక వ్యక్తిగాగాక, ఒక సంస్థగా రాణించిన

దుర్గాబాయి

1920లో గాంధీజీ ఆంధ్రప్రాంతంలో పర్యటిస్తూ రాజమండ్రి వచ్చారు.

కాకినాడ నుంచి బంధువుల ఇంట్లో పెళ్ళికి తల్లిదండ్రులతోపాటు రాజమండ్రి వచ్చింది ఒక అమ్మాయి. ఆ రోజు సాయంత్రం రాజమండ్రిలో గొప్ప సభ జరిగింది. ఆ సభలో గాంధీజీ ఉపన్యసించారు. క్రిక్కిరిసిన జనం. సభలో వాలంటీర్లు హుండీలు పట్టుకుని తిరుగుతూ డబ్బులు వసూలు చేయడం చూచిందా అమ్మాయి. ఆ బాలిక వయస్సు 11 ఏళ్ళుంటాయి. వసూలుచేసే డబ్బు గాంధీగారి కాంగ్రెసునిధికి అని విన్నది. ప్రక్కనున్న ఒకాయనను గాంధీ టోపీ ఇమ్మన్నది. ఆ టోపీ చేత పట్టుకుని "గాంధీనిధికి డబ్బులివ్వండి" అంటూ జనం మధ్య తిరిగింది. టోపీ నిండింది. గుంపుల్ని తోసుకుంటూ గాంధీగారున్న వేదిక వద్దకు వెళ్ళాలని ఆ బాలిక ఉబలాటం. ఆయనకు తానే ఆ డబ్బులివ్వాలనుకుంది.

జనం తొక్కిసలాట. ఆ బాలిక "బాబూ నన్ను పోనివ్వండి. మహాత్మునికి పైకం ఇస్తా" అంటూ వుంది. ఆ బాలికను చూచి ముగ్ధుడైన ఓ పెద్దమనిషి, ఆ అమ్మాయిని భుజాలపై కూర్చుండజేసి, గాంధీజీ ముందు దించాడు.

"బాపూ - ఈ డబ్బులు తీసుకోండి" అన్నది. నవ్వుతూ అందుకుని "నీ చేతికున్న గాజులు కూడా ఇవ్వు" వెంటనే సంతోషంగా "బాపూ తీసుకోండి" అంటూ గాజులు రెండింటిని అందించింది; గాంధీజీ ఆనందంతో నవ్వాడు.

ఆ చిరునవ్వు ఆమె హృదయంపై చెఱగని ముద్ర వేసింది. ఆ నవ్వే ఆమె జీవితానికో స్ఫూర్తినిచ్చింది. ఆ పదకొండేళ్ళ బాలికే దుర్గాబాయి!

అప్పటికే ఆమె హిందీ పాఠశాల పెట్టి 40 మంది మహిళలకు హిందీ నేర్పుతూ వుండేది. ఆ హిందీ పాఠశాల విద్యార్ధినులలో ఒక విద్యార్ధి దుర్గాబాయి తల్లి కృష్ణవేణమ్మ !

దుర్గాబాయి 1909 జూలై 15 తేదీన రాజమండ్రిలో జన్మించింది. తండ్రి ఆర్.వి.యన్. రామారావుగారు. తల్లి కృష్ణవేణమ్మ. దుర్గాబాయిగారి అమ్మమ్మ గారున్నది రాజమండ్రిలో. దుర్గాబాయి తాతగారైన మనోహరం పంతులు పోలీసు సూపరింటెండెంటు. సంఘ సంస్కరణాభిలాషాకల మనోహరం పంతులు వీరేశలింగం పంతులుగారి కెంతగానో అండగా వుండేవారు.

దుర్గాబాయి ప్రతిభావతి. బాల్యంలోనే హిందీలో పాండిత్యం గడించింది. వీణావాదనలో దిట్ట అనిపించుకున్నది. రంగవల్లులు వేయటంలో ఆమెకు ఆమే సాటి. హిందీ పాఠశాలలో పాటలు, పద్యాలు, నాటికలు, కోలాటాలు, దేశభక్తి గేయాలు నేర్పించేదా బాలికా ప్రిన్సిపాల్ !

1927 లో గాంధీజీ కోటి రూపాయాల నిధి సేకరణ చేస్తూ ఆంధ్ర పర్యటనకు వచ్చారు. రాజమండ్రి సమీపంలోని సీతానగరం ఆశ్రమంలో బస చేశారు.

ఆ కాలంలో భోగం మేళాలు ఎక్కువగా వుండేవి. దేవదాసీల జీవితం దుర్భరంగా వుండేది. వారేకాక ముస్లిం మహిళలు కూడా సంప్రదాయాలకు బానిసలై బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా వుండేవారు. వారికో వెలుగుచూపాలని నిశ్చయించింది దుర్గాబాయి. స్త్రీల కోసం ప్రత్యేక సభ ఏర్పాటు చేసి, ఆ సభలో గాంధీజీగారిచే ఉపన్యాసం ఇప్పించాలనుకున్నది.

కాంగ్రెస్ నాయకులైన బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్యగార్ల వద్దకు వెళ్ళి దుర్గాబాయి తన కోర్కెను వెళ్ళడించింది.

'ఏమిటీ! స్త్రీల సభ ఏర్పాటు చేస్తావా? గాంధీజీ రావాలా? ఏమిటీ పిల్లచేష్టలు?' అన్నారు కొండా వెంకటప్పయ్యగారు.

' అయిదువేల నిధి సమర్పిస్తే, గాంధీగారిని అయిదు నిమిషాలు మాట్లాడమని చెబుతాం' అన్నారు బులుసు సాంబముర్తిగారు.

'సరే, అయిదువేలు ఇస్తాం' అన్నది. దేవదాసీల వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పిందామె.

వారం రోజుల్లో అయిదు వేలు వసూలు చేసారు. 'అయ్యా, ఇదిగో అయిదు వేలు - ప్రోగ్రాం ఏర్పాటు చేయండి' అన్నది దుర్గాబాయి.

మునిసిపల్ హైస్కూల్ హెడ్ మాస్టరు గారిని బతిమిలాడి, స్కూల్ మైదానంలో సభ జరుగుటకు అనుమతి సంపాదించిందామె. అంతా స్త్రీలే. దేవదాసీలు, పరదాలు వేసుకున్న ముస్లిం మహిళలు!

గాంధీజీ ఉపన్యాసం ప్రారంభిస్తూ "నా ఉపన్యాసాన్ని దుర్గ తెలుగులో అనువదిస్తుంది. మీరు కూర్చోండి" అన్నారు కొండా వెంకటప్పయ్యగారిని.

అయిదు నిమిషాలంటూ ప్రారంభించించిన గాంధీజీ గంటసేపు మాట్లాడారు. బీదల కోసం డబ్బులివ్వండి అన్నారు. మహిళలు తమ గాజులు, ఒంటి మీద ఆభరణాలు తీసి ఇచ్చారు. దుర్గాబాయి అయిదువేల నిధి సమర్పించింది. సభ లోని మహిళలిచ్చిన ఆ నగలు, నగదు పాతిక వేలు మించింది!

గాంధీజీ దుర్గాబాయిని తన కారులో కూర్చోమన్నారు. ఆ బాల దుర్గాబాయిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆంధ్ర పర్యటన అంతా దుర్గాబాయి, అనువాదకురాలుగా సాగింది.

మద్రాసులో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో ఆమె నాయకురాలు. రెండేళ్ళ జైలుశిక్ష తర్వాత విడుదలయిందామె.

పట్టుదలకు ప్రతీక దుర్గాబాయి. ప్రైవేటుగా, బెనారస్ యూనివర్సిటీ నుండి మెట్రిక్యులేషన్ పాసై, అక్కడే ఇంటర్మీడియేట్ పాసైయ్యారు. అక్కడే బి.ఏ. (ఆనర్స్) చదవాలనుకున్నారు. వీలుకాలేదు. వాల్తేరు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో చేరాలని, వైస్ ఛాన్సలర్ డా. సి.ఆర్.రెడ్డిగారిని కలుసుకున్నారు. మహిళలకు ప్రత్యేకంగా హాస్టల్ లేనందున, వీలుకాదన్నారు. పది మంది మహిళల అప్లికేషన్లు అందించి, మరలా అభ్యర్ధించంగా డా. రెడ్డిగారు అనుమతించారు. దుర్గాబాయి బి.ఏ. (ఆనర్స్) లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మద్రాసు లా కాలేజిలో బి.ఎల్. పట్టా పుచ్చుకున్నారు. సివిల్ మరియు క్రిమినల్ కేసులను చేబట్టి, బాగా పేరు సంపాదించారామె.

మద్రాసులో ప్రాక్టీసు చేస్తూ, ఆమె ఆంధ్ర మహిళా సభ భవన నిర్మాణానికి పూనుకున్నారు. కస్తూరిబా నిధికి వేలాది రూపాయలు వసూలు చేసి గాంధీజీకి ఇచ్చారు.

ఆమె ప్రతిభా సామర్ధ్యాలను గుర్తించిన నాయకులు ఆమెను రాజ్యాంగ సభ సభ్యురాలుగా ఎన్నుకున్నారు. డాక్టర్ అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బి.ఎన్.రావు వంటి ఉద్ధండులతో కలసి ప్రాథమిక హక్కులు, స్త్రీలకు ఆస్తిహకు మున్నగు అంశాలను రాజ్యాంగంలో చేర్పించారు.

1950 తర్వాత ఆమె సాంఘిక సేవారంగంలో ప్రవేశించారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూగారు పాతిక వేల రూపాయల చెక్కు ఇచ్చి రాయలసీమ క్షామ నివారణ పథకాల పర్యవేక్షణకు పంపారు.

1952లో దుర్గాబాయిగారిని ప్లానింగ్ కమిషన్ మెంబరుగా ప్రభుత్వం నియమించింది. 1953 సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ గా వుంటూ పదేళ్ళు పని చేశారు. ఆ సమయంలోనే మహామేధావి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి డాక్టర్ చింతామణి దేశ్‌ముఖ్ గారిని పెళ్ళాడారు. అతి నిరాడంబరంగా జరిగిన పెళ్ళికి పెద్దలు జవహర్ లాల్ నెహ్రూ, ఆచార్య కుపలాని మాత్రం వచ్చారు.

కేంద్ర సంక్షేమ సంఘం అధ్యక్షురాలుగ ఆమె అవిశ్రాంతంగ కృషి చేశారు. 1957లో డా. దేశ్‌ముఖ్ ఆర్ధిక శాఖ పంత్రి పదవికి రాజీనామా చేసి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛేర్మన్ గా నెలకు ఒక రూపాయి వేతనంతో మూడేళ్ళు పని చేశారు. అప్పట్లోనే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ప్రపంచ ఆర్ధిక సంస్థ) డైరెక్టర్ జనరల్ గా, డా. దేశ్‌ముఖ్ గారిని ఆహ్వానించారు. ప్రధాని నెహ్రూ, ఆ పదవిని స్వీకరించడం భారతదేశానికి గర్వకారణం కాగలదన్నారు. ఏడాదికి 30 వేల డాలర్ల వేతనం, ఇతర వసతులన్నీ కల్పిస్తామన్నారు. డా. దేశ్‌ముఖ్ దుర్గాబాయి గారి సలహా కోరగా, 'అంత డబ్బు మనకెందుకు? మన దేశపు ప్రజల సేవ చేద్దాం. ఆ పదవి వద్దు' అన్నారు దుర్గాబాయి. అంత పదవిని సంతోషంగా వదులుకున్నారా దంపతులు.

1967లో దేశ్‌ముఖ్ దంపతులు ఢిల్లీ వదలి హైదరాబాదులో స్థిరపడినారు. తమ ఇంటికి "రచన" అని పేరు పెట్టుకున్నారు.

ఆంధ్ర మహిళా సభ కార్యక్రమాలు మూడు పూవులారుకాయలుగా విస్తరించాయి. నర్సింగ్ హోం, ఆర్థోపెడిక్ సెంటర్, శిశు విహార్, నర్సెస్ హాస్టల్ మరెన్నో వైద్యశాల భవనాలు ఆమె సేకరించిన విరాళాలతో వెలిశాయి. దాదాపు 23 సంస్థలకు ముాలకారకురాలు.

దేశ్‌ముఖ్ దంపతులు తమ ఆస్తిపాస్తులన్నిటినీ సేవా సంస్థల స్థాపనకు విరాళంగా ఇచ్చారు. 26 ఏళ్ళ దాంపత్య జీవితం సేవా మయంగా సాగింది.

నిరంతర పరిశ్రమ, కార్యదీక్ష, పట్టుదల, నిజాయితీ అన్నీ మూర్తీభవించిన మహిళామణి దుర్గాబాయి.

1971లో ఆమె వయోజన విద్యావ్యాప్తికి చేసిన కృషికి 'నెహ్రూ లిటరసీ' అవార్డు ఇచ్చి సత్కరించింది భారత ప్రభుత్వం.

1975 జనవరి 26న ఆమెను 'పద్మవిభూషణ' తో ప్రభుత్వం సత్కరించింది.

లాయరుగా జమీందారుల కేసులన్నీ కోర్టులో వాదించి, గెలిచి వారినుంచి తీసుకున్న ఫీజుల మొత్తమును ఆంధ్ర మహిళా సభకు ఇచ్చిన త్యాగమూర్తి శ్రీమతి దుర్గాబాయి.

'స్వతంత్ర పత్రిక' లో ఖాసా సుబ్బారావు గారు ఇలా వ్రాశారు.

"దుర్గాబాయి విసుగు విరామం లేని మనిషి, తన సహచరులను కూడా తనలాగే విరామమెరుగని సేవాతత్పరులుగా ఆవేశపూరితులుగా చేయగల నాయకురాలామె. జీవితంలో ఓటమి వుంటుందేమో అన్న భయం ఆమెకు లేదు... సహారా ఎడారిలో కూడా ఆమెకు చేయటానికి ఏదో సేవాకార్యక్రమం కనిపిస్తుంది."

సామాన్య వ్యక్తిగా కాక మహోన్నత వ్యవస్థగా దేశ ప్రజలకు సేవలందించిన దుర్గాబాయి గారు 1981 మే 9వ తేదీన కన్నుమూశారు.