Jump to content

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/కోడి రామమూర్తి నాయుడు

వికీసోర్స్ నుండి

తిలక్, మాలవ్యాల ప్రశంసలు పొందిన "కలియుగ భీమ"

కోడి రామమూర్తి నాయుడు

' తిండి కలిగితె కండ కలదోయ్, కండ గలవాడేను మనిషోయ్ '

అంటూ దేశ స్వాతంత్ర్య సంపాదన తర్వాత దానిని పదిలంగా పెంచేందుకు బలవంతులైన ప్రజలు కావాలని ఎలుగెత్తి చాటిన ప్రజాకవి గురజాడ అప్పారావు.

జాతీయోద్యమ వైతాళికులైన లోకమాన్య బాలగంగాధర తిలక్, భారతీయులను స్వాతంత్ర్య సమరంలో చేరమని ఉద్బోధించేవారు. 'స్వరాజ్యం నా జన్మహక్కు' అనే మంత్రోపదేశంతో యువతను ఉత్తేజపరిచేవారు. ఆ మహనీయుని ఆదేశాలను ఆచరణలో చూపాలని, అవిశ్రాంతంగా కృషి చేసిన ఆంధ్ర వీర కంఠీరవ కోడి రామమూర్తి నాయుడు.

'కలియుగ భీమ' బిరుదుగల కోడి రామమూర్తి నాయుడు విశాఖపట్నం జిల్లా వీరఘట్టంలో 1882, ఏప్రిల్ లో జన్మించారు. తండ్రి కోడి వెంకన్న భూకామందు, ఆంగ్లేయుల పట్ల భక్తిశ్రద్ధలు కలవాడు. తన కుమారుడు ప్రభుత్వోద్యోగంలో చేరి, మంచి పదవినందుకోవాలని ఆశించాడు. కాని ఆయన అనుకున్న దొకటి, జరిగింది మరొకటి.

బాల్యంలోనే తల్లిని కోల్పోయిన కోడి రామమూర్తి అయిదేళ్ళ ప్రాయంలోనే ఇరుగు పొరుగు వారితో చిలిపి జగడాలాడేవాడు. తండ్రి గారు, కుమారుని అల్లరి పనులు సహించలేకపోయారు. వెంకన్నగారు, తన తమ్ముడు కోడి నారాయణ స్వామి ( పోలిస్ ఇన్‌స్పెక్టర్) వద్దకు కొడుకును, చదువు కోసం విజయనగరం పంపాడు.

రామమూర్తి నాయుడు, జాతీయోద్యమ నాయకుడు ద్వార బంధాల చంద్రయ్య నాయుడుగారి పట్ల ఆకర్షితుడైనాడు. చంద్రయ్య కోయ యువకుల దండును నెలకొల్పి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. చంద్రయ్యను పట్టి యిచ్చిన వారికి వేలాది రూపాయల బహుమతి ప్రకటించింది ప్రభుత్వం.

బాల రామమూర్తి నాయుడు చదువుల పట్ల శ్రద్ధ చూపకపోయాడు. తండ్రికి కోపం వచ్చి బాగా వాయించాడు. రామమూర్తి ఇల్లు వదలి అడవులు చేరాడు. వారం రోజుల తర్వాత ఒక పులి పిల్లను పట్టుకొని, విజయనగరం వీధుల్లో తిరుగుతున్న రామమూర్తి నాయుడును చూచి అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. విజయనగరంలో ఉన్నపుడు తాలిమ్‌ఖానాలో చేరి, శరీర వ్యాయామం అభ్యసించాడు. కుస్తీ పట్లన్నీ నేర్చాడు.

ఇక లాభం లేదని, పినతండ్రి కోడి నారాయణస్వామి, రామమూర్తిని సైదాపేట (మద్రాసు) లోని వ్యాయామ శిక్షణ కళాశాలకు పంపాడు. ఏడాది శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.

విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది. తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరాడు. పులులు, ఏనుగులు, గుర్రాలు, చైనా, జపాన్ కళాకారుల సహకారం ఆయనకు లభించాయి.

రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు. కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. రొమ్ముపై పెద్ద ఏనుగును ఎక్కించుకునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు. తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు.

పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి 'మల్లమార్తాండ', 'మల్లరాజ తిలక్' బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.

హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి 'జగదేకవీర' బిరుదమిచ్చారు.

అప్పటి వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు. రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని తన కారును ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు. త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక సెంటీమీటర్ కూడా కదలక పోయింది. ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.

అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది. రామమూర్తి సర్కస్ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూచి ఆనందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు.

సర్కస్ కంపెనీ బాగా పెరిగింది. రామమూర్తిగారు 1600 మంది గల తన బృందంతో లండన్ వెళ్ళి ప్రదర్శనలిచ్చారు. సుప్రసిద్ధ మల్లుడైన గామా పైల్వాన్ తమ్ముడు ఇమామ్‌ బక్షీ ఆ బృందంలో వుండేవాడు.

లండన్ లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్ హెర్కులస్' బిరుదంతో సత్కరించారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు.

స్పెయిన్ దేశంలో 'కోడె పోరాటం' (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది. ఈ పోరాటం చాల భీకరంగా ఉంటుంది. రామమూర్తిగారిని ఆ పోరులో పాల్గొనమన్నారు. అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తిగారు ' సరే ' అన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడెచిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది.

జపాన్, చైనా, బర్మాలలో రామమూర్తిగారి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి.

బర్మాలో వున్నపుడు రంగూన్ లో ప్రదర్శనలిచ్చారు. అసూయగ్రస్తులు కొందరు రామమూర్తిగారిని చంపాలనుకున్నారు. ఎలాగో ఈ విషయం గ్రహించిన రామమూర్తిగారు ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం వచ్చారు. కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు.

భారతదేశం అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది. అమెరికా వెళ్ళాలనుకున్నారు. కాని వెళ్ళలేదు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసలుండేవి.

రామమూర్తి నాయుడుగారు పండిత మదన మోహన మాలవ్యాగారి అతిథిగా ఏడాదిపాటు బెనారస్ లో వున్నారు.

ఆయన శాఖాహారి అని కొందరు అన్నారు. ఆచార్య రోణంకి అప్పలస్వామిగారు, రామమూర్తి గారి శిష్యుల నుండి సేకరించిన వివరాలను బట్టి, రామమూర్తిగారు కోడిమాంసం సేవించేవారని తెలుస్తుంది.

భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు.

కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది. సేకరించిన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా వుండిపోయారు.

చివరిరోజులు బలంఘర్, పాట్నాలో కలవాండి (ఒరిస్సా) పరగణా ప్రభువు పోషణలో వుండి 16.1.1942 తేదీన కన్ను మూశారు నాయుడుగారు.

తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, 'కలియుగ భీమ' కోడి రామమూర్తి నాయుడుగారు.

వరవిక్రయం, మధుసేవ వంటి గొప్ప సాంఘిక నాటకాలను రచించిన, విఖ్యాత నాటక కర్త కాళ్ళకూరి నారాయణరావుగారు, కోడి రామమూర్తిగారి ఆప్త మిత్రులు. నాయుడుగారిని ప్రశంసిస్తూ " సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి " అన్నారు.